Saturday, September 21, 2019

కబంధుడి చేత చిక్కిన రామలక్ష్మణులు .... శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణం...అరణ్యకాండ-79 : వనం జ్వాలా నరసింహారావు


కబంధుడి చేత చిక్కిన రామలక్ష్మణులు
శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణం...అరణ్యకాండ-79
వనం జ్వాలా నరసింహారావు
ఆంధ్రభూమి ఆదివారం సంచిక (22-09-2019)

జటాయువును సొదమీద పెట్టి, అగ్ని రగిలించి, తన తండ్రిలాగే ఆయనకూ నిప్పు పెట్టి జింక మాంసంతో పిండాలు చేశాడు. ఆ పిండాలను లేతపచ్చిక మీద వుంచి, బ్రాహ్మణులు స్వర్గప్రాప్తి కోసం మనుష్య ప్రేతాలను ఉద్దేశించి ఏ మంత్రాలను చదువుతారో అవే చదివాడు. ఆ తరువాత గోదావరీ నదిలో తమ్ముడితో సహా స్నానం చేసి, జటాయువుకు నీళ్లు వదిలారు. మరణించిన గద్ద రాజు మహర్షి సమానుడైన రామచంద్రుడి చేత సంస్కారం పొంది పుణ్యలోకాలకు పోయాడు. ఇలా రామలక్ష్మణులు కర్మలు చేసి, జటాయువు మీదనే మనసుంచి, సీతాదేవి తనకు లభిస్తుందని ఆయన చెప్పిన మాటలను విశ్వసించి, సీతాదేవిని కలవాలన్న కోరికతో అడవుల జాడ పట్టుకుని పోయారు.

         రాజకుమారులు రామలక్ష్మణులు ఇద్దరూ, నైరుతిమూలగా కొంతదూరం పోయి, ఆ అడవికి మూడు కోసుల దూరంలో వున్న క్రౌంచారణ్యంలోకి ప్రవేశించి, అక్కడ బడలిక తీర్చుకోవడానికి మధ్య-మధ్య చెట్ల నీడల్లో కూర్చుంటూ, అనేక అడవి మృగాలున్న ఆ అడవిలో సీతను వెతకసాగారు. ఆ క్రౌంచారణ్యం దాటి తూర్పుగా పోయి, మతంగవనంలో మూడుకోసుల దూరాన వున్న ఒక కొనను సమీపించారు. అది పాతాళం లాగా మిక్కిలి భయంకరంగా శాశ్వతమైన గాడాంధకారం లాగా వుంది. అక్కడ కొంచెం దూరం నుండే భయంకర రాక్షసి ఒకటి వాడి కోరలతో, తల వెంట్రుకలు విరియబోసుకుని, మృగాలను తినేదైన వేలాడే పొట్టతో రామలక్ష్మణులను అడ్డగించింది. 

         అడ్డగించిన తరువాత ముందు నడుస్తున్న లక్ష్మణుడిని నిలిపి, చేతులతో ఆయన్ను గట్టిగా కౌగలించుకుని, మొహంతో ఆ రాక్షసి ఇలా అన్నది. “ప్రియనాథా! నీకు నేను పెళ్లాన్నవుతాను. మనం బతికినంత కాలం అడవుల్లో ఏటి ఒడ్డుల్లో ఆడుకుందాం. త్వరగా రా...పోదాం. నా పేరు అయోముఖి అంటారు”. ఇలా ఆమె చెప్పగా లక్ష్మణుడు కోపంతో, కత్తి దూసి, దాని ముక్కు, చెవులు, చన్నులు నరికాడు. అది మొర్రో అంటూ మొత్తుకుం తూ వచ్చిన దోవలో వెళ్లింది. అది పోగానే, తమ దారిలో అడవిలో పోతున్న సమయంలో రామచంద్రమూర్తితో లక్ష్మణుడు ఇలా అన్నాడు. “అన్నా! గుండె చెదిరింది. ఎడమ భుజం అదురుతున్నది. ఏదో కీడు కలగబోతున్నట్లు అనిపిస్తున్నది. అన్నా! నా మాట విను. మనకేదో నష్టం రాబోతున్నది. యుద్ధ ప్రయత్నంలో వుందాం. కష్టం వచ్చినా మనకు జయం కలుగుతుందని కూడా శకునాల ద్వారా అర్థమవుతున్నది”. అని లక్ష్మణుడు చెప్పగా వాళ్లిద్దరూ అడవుల్లో వెతుక్కుంటూ పోతుండగా వారికి అడవిని చీల్చుకుంటూ పెద్ద ధ్వని వినిపించింది. అదేంటోనని అడవిలో వెతుకుతుంటే ఒకచోట ఒక భయంకరాకారం కనిపించింది.


         పర్వతంలాంటి పెద్ద దేహం, పెద్ద రొమ్ము, తల-మెడ లేకుండా, బిరుసు వెంట్రుకలు, నల్లటి మబ్బు లాంటి, ఉరుము లాంటి ధ్వని, నిప్పుల్లాంటి ఒంటి పెద్ద కన్ను, పెద్ద కోరలు, జింక-ఏనుగు మొదలైన అడవి మృగాలతో ఆడుకునే ఆసక్తి, యోజనం పొడుగు చేతులు కలవాదిని, నోరు తెరిచి వున్న వాడిని, తమ దారికి అడ్డంగా వున్నా వాడిని, కబంధుడిని సమీపించారు రామలక్ష్మణులు. ఆ రాక్షసుడు వీళ్ళిద్దరినీ తన రెండు చేతులతో పట్టుకున్నాడు. సూర్య తేజస్సు లాంటి తేజస్సు ఉన్నప్పటికీ, పెద్ద-పెద్ద విల్లు బాణాలు ఉన్నప్పటికీ, చేత కత్తులున్నా, మహా బలవంతులైనా, ఆ సమయంలో వారిద్దరూ శత్రువు చేత చిక్కి ఆపదపాలయ్యారు. ధైర్యం, పరాక్రమం కల రామచంద్రమూర్తి వాటిని వదలలేదు. చిన్నవాడైనా లక్ష్మణుడు ధైర్యం చెడలేదు. అయినా, వ్యసనపడుతూ అన్నతో ఇలా అన్నాడు.

         “అన్నా! నాగతి చూశావా? రాక్షసుడి చేతుల్లో చిక్కుకున్నాను. వీడి నోట్లో పడేట్లు నన్ను వదిలి నువ్వైనా దూరంగా పరుగెత్తు. ఇద్దరిలో ఒకరు బతికినా మంచిదే కదా? ఏవిధంగానైనా నువ్వు నీ భార్యను కలుసుకుంటావని తోస్తున్నది. కాబట్టి నిన్ను ఒకటి ప్రార్థిస్తున్నాను. నువ్వు రాజువై రాజ్యసంపద పూర్తిగా అనుభవిస్తున్నప్పుడు నన్ను మర్చిపోవద్దు”. అని లక్ష్మణుడు చెప్పగా, విని రామచంద్రుడు “లక్ష్మణా! నువ్వు కూడా పిరికివాదిలాగా, పామరుడిలాగా బాధపడ్తున్నావా? ఇప్పుడెం మించిపోయింది?”. ఇలా వాళ్లిద్దరూ మాట్లాడుకుంటుంటే ఆ భయంకర రాక్షసుడు ఇలా అన్నాడు.

         “మీరెవరు? విల్లు, బాణాలు, కత్తులు ధరించి వాదికోమ్ముల కోడెల్లాగా తిరుగుతున్నారు. ఆకలిగా వున్న నానోట్లో పడడానికి ఇంతదూరం ఎందుకు వచ్చారు? నాబారిన పడ్డ మీరు ఏ ఉపాయం చేసినా బతకలేరు. మీకు వందేళ్ళు నేటితో ముగిశాయి”. అని ఇలా గర్వంతో అంటున్న రాక్షసుడి మాట విని తమ్ముడు లక్ష్మణుడితో ఇలా అన్నాడు రాముడు. “కష్టం మీద కష్టం కలుగుతున్న మనకు చివరకు ప్రాణానికే ముప్పు వచ్చింది. ప్రియురాలు లభించకపోతే పోయే. భార్యను పోగొట్టుకుని మళ్లీ రాబట్టుకోలేక పోయాదన్న అపకీర్తికి తోడూ రాముడు అడవిలో చచ్చాడన్న అపకీర్తి కూడా వస్తున్నది. ప్రియురాలిని కష్టం నుండి తప్పించలేకపోయాను. ఆ పని అయినట్లియితే మరణ భయం లేదు. ఔరౌరా! ఏం ఆశ్చర్యం? భూమ్మీద పుట్టిన ప్రాణులపైన కాలానికి ఎంత శౌర్యం వుందో చూశావా? నిన్ను, నన్ను కూడా దుఃఖంతో కృశించేట్లు చేసింది. మనగతే ఇలా వుంటే, కాలాని వశపడకుండా తప్పించుకోవడం ఎవరికీ సాధ్యం? ఎంత గొప్ప ధైర్యంకలవారు, సత్య పరాక్రములు, లక్ష్యసిద్ధి కలవారు, యుద్ధంలో శత్రువులకు సహించలేని పరాక్రమం వున్నా కాలం అనుకూలించకపోతే, ప్రతికూలిస్తే, నిర్వీర్యులై పడిపోతారు. దైవం ప్రాణులను చంపాలనుకుంటే అసాధ్యం ఏదీ లేదు. విధికి అసాధ్యం వుందా?

No comments:

Post a Comment