వ్యవసాయ ఆధారిత తెలంగాణ గ్రామీణ
జనజీవనం
వనం జ్వాలా నరసింహారావు
సూర్యదినపత్రిక
(13-09-2019)
పంచాయితీరాజ్
వ్యవస్థను బలపరచడానికి కఠినమైన చట్టాన్ని రూపొందించి, సర్పంచ్ స్థాయి నుండి జిల్లాపరిషత్ అధ్యక్ష
స్థాయి వరకు ఎన్నికలు జరిపించి, స్థానిక స్వపరిపాలనా
వ్యవస్థను ప్రజలకు చేరువ చేయడానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల
చంద్రశేఖర్ రావు పటిష్టమైన 30 రోజుల కార్యాచరణ పథకాన్ని రూపొందించి అమలు
చేస్తున్నారు. ప్రజల భాగస్వామ్యంతో, సమిష్టి కృషితో ఎలా గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలో ఆయన
చెప్పారు. అదేవిధంగా గ్రామీణ జీవితం వ్యవసాయంతో ముడిపడి వుందని, అనుకున్న రీతిలో వ్యవసాయం అభివృద్ధి చెందడం లేదని
ముఖ్యమంత్రి అంటున్నారు. ఈ నేపధ్యంలో ఒకనాటి వ్యవసాయాన్ని గుర్తుచేసుకుంటే బాగుంటుందేమో!
ఒకానొక రోజుల్లో
గ్రామ వాతావరణం, అందులో
అగ్రగామిగా వుండే వ్యవసాయం, ఆ
వ్యవసాయానికి అనుబంధంగా వుండే పనిముట్లు, నైపుణ్యంతో వ్యవసాయానికి అవసరమైన పనులను చక్కదిద్దే
వ్యక్తులు, విద్య
లేకపోయినా అనుభవంతో ఏ పంట ఎప్పుడు వేస్తే లాభదాయకమో తెలియచెప్పే కొందరు
గ్రామస్తులు...ఇలా అనేక విధాలుగా అలరారుతుండేది. తెలతెలవారుతుండగానే ప్రతి ఇంటి
ముంగిట ఇంటి మనుషులో, లేదా, పని మనుషులో శుభ్రం చేసి కలాపు నీళ్లు చల్లడం ఆచారం. గ్రామ
పరిశుభ్రతకు అదే ప్రత్యక్ష నిదర్శనం. ప్రతి ఇంట్లో శుభ్రమైన బావి, బావి పక్కనే నిమ్మ-అరటి చెట్లు, ఇంటి వెనుక భాగంలో ఉదయాన్నే చల్ల చిలికే ప్రక్రియ, అందులో వచ్చిన వెన్న పూసతో నెయ్యి తయారు చేయడం, ఉదయాన్నే చద్ది అన్నం-మామిడి వూరగాయ కారం తినడం...ఇలా ఒక
భూతల స్వర్గంలా అలరారుతుండేవి గ్రామాలు.
వ్యవసాయపు పనులు
వేసవి కాలంలోనే, పొలాలకు
పెంట తోలే ప్రక్రియతో మొదలయ్యేవి. పాడి పశువుల వల్ల పోగైన పెంటను పొలాలకు
తరలించేవారు. అదే ఎరువుగా ఉపయోగించే వారు. అదనంగా ఆ గ్రామంలో, లేదా, చుట్టుపక్కల గ్రామాలలో పొలాలు లేని వారి దగ్గర నుంచి పెంట ఖరీదు చేసి కొని
పొలాలకు తోలే వారు. చెల్లింపులన్నీ ధాన్యం రూపేణగానే జరిగేది. యాదవుల (గొల్లలు అని
కూడా పిలిచేవారు) దగ్గర "జీవాలు" (గొర్రెలు) వుండేది. వందల సంఖ్యలో
వుండే జీవాలను పొలాలలో రాత్రింపగళ్లూ వుంచేవారు. అదీ ఖరీదుకే. అలా వుంచడం వల్ల
పొలాలలో జీవాల పెంట పోగయ్యేది. అది పొలాలకు ఎరువులాగా ఉపయోగపడుతుంది. అప్పట్లో రసాయనిక
ఎరువుల వాడకం అలవాటు ఇంకా సరిగ్గా కాలేదు. ఇళ్లలో పోగైన పెంటను, జీవాల పెంటను మాత్రమే ఎరువులాగా వాడే వారు. అదనంగా, చెరువు పూడిక తీసి మట్టిని పొలాలకు తోలే వారు. తెల్లవారు
జామునుంచే పెంట బండ్లను కట్టే ప్రక్రియ మొదలయ్యేది. మధ్యాహ్నం పన్నెండు (రెండు
జాములు అనే వాళ్ళు) గంటల సమయం వరకు తోలి ఇళ్లకు తిరిగి వచ్చే వాళ్ళు. పొద్దున్నే
చద్ది అన్నం తినే వాళ్ళు. మళ్లీ నాలుగు గంటల ప్రాంతంలో పెంట బండ్ల కార్యక్రమం
మొదలయ్యేది. వెన్నెల రోజుల్లో రాత్రుళ్లు కూడా బండ్లు తోలేవారు. ఇలా తొలకరి
జల్లులు కురిసే వరకు కొనసాగేది.
తొలకరి వానలు మొదలవ్వగానే
పొలం పనులలో కొంత మార్పు వచ్చేది. వరి పొలాలకు కావాల్సిన నారు చల్లడం, పునాస పంటలకు పొలాలను నాగళ్లతో దున్నడం, దంతెలతో దున్నడం జరిగేది. వర్షాలు కురిసే తీరుతెన్నుల
ఆధారంగా పొలం పనులలో మార్పులు చేర్పులు జరుగుతుండేవి. వర్షాలు ఆగుతే మిగిలిన
పెంటను తోలడం కొనసాగించే వారు. వేరు శనగ, అందులో కంది పంటలు వేసేవారు. చెరువులకు నీళ్లు రావడం
జరుగుతే వరి నాట్లు వేసే వారు. ఆ తరువాత జొన్న పంట వేసే వారు. వరి నాట్లు
వేయడానికి ముందర పొలాన్ని మొదలు నాగళ్లతో, తరువాత బురద నాగళ్లతో దున్నడం జరిగేది. సాధారణంగా వరి
నాట్లు మహిళలే వేసేవారు. పాటలు పాడుకుంటూ, హుషారుగా నాట్లు వేసేవారు. నాట్ల రోజుల్లో భోజనం పొలం
దగ్గరే తిని, అక్కడ
చెరువు నీళ్లే తాగేవారు. నాట్లు పడ్డ తరువాత దశలవారీగా పొలాలకు నీరు పెట్టడం
జరిగేది. వరి కొంత పెరిగిన తరువాత కలుపు తీయడం జరిగేది. మూడు-నాలుగు నెలల తరువాత
కోతల సీజన్ ఆరంభమయ్యేది. కోయడం, గూళ్లు వేయడం, సమయం
చూసుకుని,
వాతావరణం అనుకూలించినప్పుడు నూర్పిడి చేయడం, తూర్పార పట్టడం, చివరకు వరి ధాన్యాన్ని ఇంటికి తోలడం జరిగేది. ఈ ప్రక్రియ
జరిగినన్నాళ్లు వరి పొలంలోనే రాత్రుళ్లు నిదురపోతారు. నాటు కూలి, కోత కూలి, ఇతర కూలి అంతా ధాన్యం రూపేణగానే. ఎకరానికి ఐదారు కుండల ధాన్యం కూలీగా వుండేది.
రేట్లు పెంచమని అడపాదడపా కూలీలు ఆందోళన చేసే వాళ్లు కూడా. నాట్ల సీజన్లో, కోతల సీజన్లో ఇతర ప్రాంతాల నుంచి కూడా కూలీలు వచ్చేవారు.
ఇక వేరు శనగ పంట
వ్యవహారం మరో విధంగా వుండేది. విత్తనాలు తయారు చేయించే ప్రక్రియతో మొదలయ్యేది.
క్రితం సంవత్సరం పండిన వేరు శనగ కాయల నుంచి విత్తులను వేరు చేసేవారు. మోతుబరి
రైతులు కూలీ ఇచ్చి ఆ పని చేయించేవారు. కూలీలు వాళ్ల-వాళ్ల సామర్ధ్యాన్ని పట్టి
కుండెడో-రెండు కుండలో కాయ కొట్టి విత్తులను తీసే వాళ్లు. వాళ్ళకు కూలీ ధాన్యం
రూపేణగానే ముట్టేది. విత్తులు తీసేటప్పుడు కొంత భాగం పప్పు అయ్యేది. ఆ పప్పుతో శనగ
నూనె చేయించి ఇంట్లో ఉపయోగించే వారు. వర్షాలు పడగానే, భూమిని దున్ని అదను కుదిరినప్పుడు "ఎద" పెట్టే
వారు. ఒకడు ఎద గొర్రు తోలుతుంటే, పక్కన నడుచుకుంటూ మరొకరు, శనగ విత్తులను, భూమిలోకి
గొర్రు పైభాగంలోంచి భూమిలో పడేలా పోసేవారు. అతి క్లిష్టమైన ఈ ప్రక్రియ అందరికీ చేత
కాదు. పైగా శనగ విత్తులతో పాటు కంది విత్తనాలు కూడా ఒక పద్దతి ప్రకారం ఎద
పెట్టాలి.
శనగ పంట ముందు
చేతికొస్తుంది. ఆ తరువాత రెండు నెలలకు కంది పంట వస్తుంది. శనగ విత్తనాలు
మొలకెత్తిన నెల రోజుల తరువాత పై పాటు చేయాలి. ఇది కూడా కష్టమైన పనే. పై పాటు చేసే
అరకలను అందరూ తోలలేరు. ఎద్దుల కాళ్ల కింద మొక్కలు నలిగి పోకుండా, అరక కింద చెట్లు పడ కుండా తోలాలి. మూడు నెలల తరువాత కూలి
వాళ్లతో శనగ మొక్కలను భూమి నుంచి పీకించి కాయలను వేరు చేయించే వాళ్లం. మరో రెండు
నెలలకు కంది కళ్ళం వేసి ఆ పంటను కూడా ఇంటికి చేర్చే వారు. ఇక మరో పంట జొన్న. నీటి
పారుదల ప్రాజెక్టులు వచ్చిన తరువాత జొన్న పంట దాదాపు ఎవరూ వేయడం లేదు. దీనికి కూడా
ఎద పెట్టడం వుంటుంది. జొన్న పంట తయారైన తరువాత కోసి, కట్టలు కట్టించే వారు. కూలీ కింద కట్టలనే ఇచ్చే వారు. ప్రతి
ఐదు కట్టలకు ఒక కట్ట కూలీ కింద పోయేది. ఇక ఆ తరువాత జొన్న గూడు వేయించడం, కంకి కోయించి తొక్కించడం, తూర్పార బట్టడం, ధాన్యాన్ని ఇంటికి-మార్కెట్‌కు చేర్చడం జరిగేది.
ఈ పంటలకు తోడు మిరప
తోటలు కూడా వేసేవారు. మధ్యలో బంతి పూల చెట్లుండేవి. తోటలో మోట బావులుండేవి. మోట
తోలడం కూడా కష్టమైన పనే. మోట తోలడానికి కట్టిన ఎద్దులను వెనుకకు నడిపించుకుంటూ, భావి ముందరకు తీసుకెళ్లాలి. భావిలో మోట బక్కెట్ (చాలా
పెద్దగా వుంటుంది) పూర్తిగా మునిగి నీరు నిండే లాగా ఎద్దులను వెనక్కి తేవాలి.
అప్పుడు మునిగి-నిండిన బకెట్ పైకి రావడానికి ఎద్దులను ముందుకు తోలాలి. బకెట్
కట్టిన తొండం లోంచి నీరు భావిదగ్గరున్న కాలువలో పడి ప్రవహించుకుంటూ మిరప చెట్లను
తడుపుకుంటూ పోతుంది. అలానే పొగాకు పంట, మొక్క జొన్న కూడా వేసే వారు. కొందరు దినుసు గడ్డలు, వుల్లి గడ్డలు కూడా సాగు చేసేవారు. క్యాబేజీ, కాలీ ఫ్లవర్ లాంటి కూరగాయలతో సహా ఎన్నో రకాల కూరగాయలను కూడా
పండించేవారు కొందరు. ఇక మామిడి తోట సరేసరి. జొన్న చేలల్లో పప్పు దోసకాయలుండేవి.
అవి అక్కడనే కొడవలితో కోసుకుని, మంచెపైకెక్కి కూచుని తినే వారు చాలా మంది. జొన్న వూస బియ్యం కూడా
కొట్టించుకుని, పలుకు
రాళ్ల నిప్పులో వేడి చేసుకుని తినే వారు. చేనులో దొరికే పెసలు తినే వారు.
కల్లాలు పూర్తై, ఎడ్ల బండ్లలో, "బోరాల" లో నింపుకుని పుట్లకు-పుట్ల ధాన్యం ఇంటికి
వస్తుంటే బలే ఆనందంగా వుండేది. ధాన్యం కొలవడానికి ఉపయోగించే "కుండ" లు,
"మానికలు",
"తవ్వలు" "సోలలు",
"గిద్దెలు" వూరి రైతుల్లో అతి
కొద్ది మంది దగ్గర మాత్రమే వుండేవి. కుండకు పదిన్నర మానికలు...మానికకు రెండు
తవ్వలు,
నాలుగు సోలలు, పదహారు గిద్దెలు...తవ్వకు రెండు సోలలు, ఎనిమిది గిద్దెలు...సోలకు నాలుగు గిద్దెలు...ఇదీ కొలత.
అలానే,
ఐదు కుండలైతే ఒక "బస్తా" ధాన్యం అవుతుంది. అలాంటి
ఎనిమిది బస్తాలు కలిస్తే ఒక "పుట్టి" అవుతుంది. కొలత కొలిచేటప్పుడు
కుండకు కాని, మానికకు
కాని,
తవ్వకు కాని, సోలకు కాని, గిద్దెకు కాని, ధాన్యం పూర్తిగా నిండి పై వరకు వచ్చే విధంగా పోయాలి. ఎడ్ల
బండిపైన "బోరెం" వేసి, ఎనిమిది నుంచి పది బస్తాల ధాన్యాన్ని నింపి ఇంటికి తోలేవారు. ధాన్యం ఇంటికి
చేర్చిన తరువాత, "పాతర"
లో కాని,
"గుమ్ములు" లో కాని,
"ధాన్యం కొట్టుల" లో కాని
భద్రపరిచేవారు. మార్కెట్ అనుకూలంగా వున్నప్పుడు అమ్మేవారు. ఆ ధాన్యంలోనే కొన్ని
బస్తాలు మరుసటి సంవత్సరానికి విత్తనాలుగా ఉపయోగించేందుకు వేరే భద్రపరిచేవారు.
ఆశ్చర్యకరమైన విషయం....పంట కోసినప్పటి నుంచి, ధాన్యం ఇంటికొచ్చే వరకు, లక్షలాది రూపాయల విలువ చేసే ఆ పంట మొత్తం బహిరంగంగా పొలాలలో
పడి వుండేది. రాజకీయ కొట్లాటలున్న గ్రామాలలో తప్ప, మిగతా చోట్ల ఏ రైతుకు కూడా అభధ్రతా భావం వుండకపోయేది.
కచ్చడం బండికి, పెద్ద బండికి సైజులో కొంత తేడా వుంది. ఇది చిన్నగా
వుంటుంది. కచ్చడం బండ్లు అందరికీ వుండవు. కొంచెం మోతుబరి రైతులకు మాత్రమే వుంటాయి.
కచ్చడం బండి పైన ఒక గుడిసె లాంటిది అమర్చి వుంటుంది. లోపల కూర్చోవడానికి చిన్న
నులక మంచం (దాన్ని "చక్కి" అని పిలిచే వారు) వేయాలి. ముందర బండి తోలేవాడు
కూచోవడానికి "తొట్టి" వుంటుంది. సామానులు చక్కి కింద అమర్చే వారు.
ఎక్కువలో-ఎక్కువ ముగ్గురు-నలుగురు కంటే అందులో కూర్చోవడం కష్టం. ఇక వాటికి కట్టే
ఎద్దులు కూడా చిన్నవిగానే వుంటాయి. ప్రయాణానికి పోయే ముందర వాటిని అందంగా
అలంకరించే వారు. ముఖాలకు “పొన్న కుచ్చులు”, “ముట్టె తాళ్లు”, మెడకు “మువ్వలు-గంటలు”, బండి చిర్రలకు (ఎద్దుల మెడపై బండి "కాణీ"
వేసినప్పుడు అది జారి పోకుండా రెండు చిర్రలు అమర్చే వారు) గజ్జెలు, ఎద్దుల మెడలో వెంట్రుక తాళ్లు, నడుముకి “టంగు వారు” అలంకరించేవారు. ఎద్దులను అదిలించడానికి
తోలేవాడి చేతిలో "చండ్రకోల" వుండేది. అది తోలుతో చేసేవాళ్లు. ఈ
హంగులన్నీ వున్న కచ్చడం బండిలో ప్రయాణం చేస్తుంటే బలే హుషారుగా వుండేది. ఎద్దులు
బండిని లాక్కుంటూ పరుగెత్తుతుంటే, ఆ గజ్జెల చప్పిడి, మువ్వల
సందడి,
టంగు వారు కదలడం....చూడడానికి బలే సరదాగా వుండేది. ఎక్కువమంది
వుండి కచ్చడం బండి సరిపోకపోతే, ఒక పెద్ద బండికి కూడా తాత్కాలికంగా ఒక గుడిసె కట్టించి, అందులో "బండి జల్ల" వేయించి, దాంట్లో "బోరెం" పరిచి, దాని కింద మెత్తగా వుండేందుకు వరి గడ్డి వేసి, అందులో కూచుని ప్రయాణం చేసే వారు. పెద్ద బండిలో ఎద్దులను
పరుగెత్తించడం కొంచెం కష్టం.
కచ్చడం బండిని కాని
పెద్ద బండిని కాని వూళ్లో వున్న వడ్రంగి తయారు చేసేవాడు. వడ్రంగి
"కొలిమి" లో ఇనుప కడ్డీలను పెట్టి కాల్చడం, వాటిని సమ్మెట పోటుతో కొట్టడం, కొలిమిలో నిప్పు ఆరిపోకుండా ఉపయోగించే
"తిత్తులను" వూదడానికి ఎల్లప్పుడూ ఒక మనిషి వుండడం చూసుకుంటూ కాలక్షేపం
చేసే గ్రామస్తులు కొందరుంటారు. వ్యవసాయ పనిముట్లయిన "అరకలు",
"నాగళ్లు",
"బురద నాగళ్లు",
"దంతెలు",
"బండి రోజాలు"....లాంటివి వడ్రంగి
తయారు చేస్తుంటే, ఆ
పనితనానికి ఆశ్చర్య పోవాల్సిందే! బండి చక్రాలకు రోజాలను అమర్చడం చాలా కష్టతరమైన
పని. ఇనుముతో తయారు చేసిన రోజాను కొలిమిలో కాల్చి, అది ఎర్రగా వున్నప్పుడు, చక్రానికి తొడిగేవారు. అలానే బండి "ఇరుసు" తయారు
చేసే విధానం కూడా చాలా కష్టమైంది. తొలకరి వర్షాలు పడుతుండగానే వ్యవసాయ పనులు
మొదలయ్యేవి. ఆ పనుల్లో మొదటి కార్యక్రమం వ్యవసాయ పనిముట్లను బాగు చేయించుకుని
దున్నడానికి సిద్ధంగా వుండడమే.
వ్యవసాయానికి ఎక్కువగా రైతులు
కూలీలనే వుపయోగించుకునేవారు. గ్రామాలలో వేరు శనగ ముఖ్యమైన పంట. వేరు శనగ
కాపుకొచ్చాక కూలీలతో పీకించి
కొట్టిస్తారు. తయారైన కాయను "డబ్బాల" తో కొలిచి కూలీ నిర్ణయించేవారు.
"డబ్బా" కు 16 "మానికలు". మానికంటే రెండు శేర్లు. డబ్బా కాయ
కొట్టినవారికి మూడు "సోల" ల నుండి ఒక "మానిక" వరకు జొన్నలు
కొలిచి కూలీగా ఇచ్చేవారు. సోల అంటే అర్థ శేరు. అయితే వేరు శనగ కొలిచే డబ్బాలు, జొన్నలు కొలిచి కూలి ఇచ్చే మానికలు అన్నీ తప్పుడివే. 16
"మానికలు" వుండాల్సిన డబ్బాలు వాస్తవానికి
20,
22 మానికలు పట్టేవరకుండేవి. మానికకు
నాలుగు సోలలుండాలి కాని మూడున్నర వుండేవి. అలా రెండు వైపులా తప్పుడు కొలతలతో
కూలీలకు ముట్టచెప్పేవారు భూస్వాములు. ఒకవైపు కూలీ తక్కువ...మరో వైపు తప్పుడు
కొలతలు...ఇలా రెండు విధాలుగా మోసం జరిగేది. ఆ పిచ్చి కొలతలకు, తక్కువ కూలీకి వ్యతిరేకంగా వుద్యమం జరిగేది. కొన్ని చోట్ల
ఫలితముండేది...కొన్ని చోట్ల వుండకపోయేది.
భూస్వాములు మరొక రకమైన వింత దోపిడీ
చేసేవారు. కూలీలు పోగు చేసుకునే "పెంట కుప్పలను" వారు కారు చౌకగా
కాజేయడం చేసేవారు. అదంతా ఒక ప్రణాళికా బద్ధంగా చేసేవారు దోపిడీ దారులు. కరవు
కాలంలో కూలీలకు ఐదు-పది మానికలు ధాన్యం అప్పుగా ఇచ్చేవారు. అప్పిచ్చేటప్పుడు ఒక
షరతు విధించేవారు. అప్పు పుచ్చుకున్న కూలీలు తమ పెంట కుప్పలను అప్పిచ్చినవారికే
అమ్మాలని షరతు. పెంట కుప్పలను వారికిష్టమైన రేటుకే కొనేవాడు భూస్వామి. అప్పిచ్చిన
ధాన్యానికి "నాగులు", "పెచ్చులు" (వడ్డీ లాంటిది) కట్టేవాడు. నిలువు దోపిడీకి
కూలీని గురిచేసేవాడు. ఇక పెంట కుప్పలను తోలే "బండి జల్ల" కు ఒక నికరమైన
కొలతలుండక పోయేది. బలిష్టమైన ఎద్దుల బండిని కట్టి, పెద్ద జల్ల నిండా పెంట పోయించి, పాలేర్లతో కరువు తీరా తొక్కించి, పెంటను కుక్కించేవారు. పది బండ్లు అవుతుందనుకున్న పెంట
నాలుగు బండ్లే అయ్యేది. అప్పు అలానే మిగిలేది. పెంట ఖాళీ అయ్యేది. దానికి
వ్యతిరేకంగా కూలీలు పోరాడేవారు.భూస్వాముల మరో రకమైన దోపిడీ భూమి విస్తీర్ణాన్ని
తక్కువ చేసి చెప్పడం...తద్వారా తక్కువ కూలీ చెల్లించడం. వ్యవసాయ కూలీలు వరి నాట్లు, కోతలు, కలుపు తీయడం వంటి రోజువారీ పనులకు, కూలి రేట్లను పెంచాలని, పాలేర్ల జీతాలు పెంచాలని పోరాటాలు చేసేవారు...అప్పటికీ, ఇప్పటికీ ఎంత వ్యత్యాసం?
No comments:
Post a Comment