Wednesday, September 25, 2019

పద్మావతి ప్రిన్సిపాల్ గా బీహెచ్ఇఎల్ హయ్యర్ సెకండరీ పాఠశాల .... జ్ఞాపకాల అనుభవాలు-అనుభవాల జ్ఞాపకాలు-8 : వనం జ్వాలా నరసింహారావు


పద్మావతి ప్రిన్సిపాల్ గా బీహెచ్ఇఎల్ హయ్యర్ సెకండరీ పాఠశాల
జ్ఞాపకాల అనుభవాలు-అనుభవాల జ్ఞాపకాలు-8
వనం జ్వాలా నరసింహారావు
          నాతో పాటే దాదాపు నా సమవయస్కులు పాతిక మందికి పైగా బీహెచ్ఇఎల్ హయ్యర్ సెకండరీ స్కూల్లో ఉపాధ్యాయులుగా చేరారు. వారి వివరాలన్నీ మరోమారు ప్రస్తావిస్తాను. హైదరాబాద్ రామచంద్రాపురంలో వున్న బీహెచ్ఇఎల్ ఉద్యోగుల పిల్లల సౌకర్యం కొరకు ప్రత్యేకంగా స్థాపించారు ఆ స్కూలును. సెంటర్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఇ)-కేంద్రీయ విద్యాలయ సంఘటన్ (కేవీఎస్) కు హయ్యర్ సెకండరీ స్కూల్ ను అనుబంధంగా ఏర్పాటు చేశారు. సిలబస్, పరీక్షా విధానం, తదితర నిబంధనలన్నీ సీబీఎస్ఇ, కేవీఎస్ కు అనుగుణంగానె వుండేవి. పదవ తరగతి చివర్లో, పన్నెండవ తరగతి చివర్లో బోర్డ్ పరీక్షలుండేవి. సర్వసాధారణంగా ఆ పరీక్షల్లో స్కూల్ ఉత్తీర్ణత శాతం ప్రతి సంవత్సరం కూడా నూటికి నూరు శాతమే. అందులో 95% పైగా విద్యార్థులు డిస్టింక్షన్ లోనూ, మిగతావారు కొంచెం తక్కువ మార్కులతోనూ పాసయ్యేవారు.

నేనక్కడ పనిచేసినంత కాలం ఫెయిల్ అన్న మాట వినలేదు. ప్రతి సంవత్సరం కనీసం ఇద్దరు-ముగ్గురన్నా, పన్నెండో తరగతి చదువుతున్నప్పుడే ఎన్డీయే (నేషనల్ డిఫెన్స్ అకాడెమీ) కోర్సుకు ఎంపికయ్యేవారు. ఇక ఇంజనీరింగ్, మెడిసిన్ కోర్సుల్లో పదుల సంఖ్యలో ఎంపికయ్యేవారు విద్యార్థులు. అక్కడ చదివిన విద్యార్థులు రాణించని రంగం లేదు. శాస్త్రవేత్తలుగా, డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, రాజకీయ వేత్తలుగా, అధ్యాపకులుగా, మానేజ్మెంట్ నిపుణులుగా, త్రివిధ దళాల ఉద్యోగులుగా, దేశ విదేశాలలో పేరు ప్రఖ్యాతులు గడించారు. నగరంలోని (పెంటాంగులర్) అంతర్ పాఠశాలల, అంతర రాష్ట్ర పాఠశాలల పోటీలలో అన్ని రంగాలలోనూ బీహెచ్ఇఎల్ పాఠశాల విద్యార్థులదే పైచేయిగా వుండేది. అవి ఆటలపోటీలే కావచ్చు, వ్యాసరచన, డిబేట్, క్విజ్ లేదా తదిర అకాడెమిక్ పోటీలే కావచ్చు.....అన్నింటా హయ్యర్ సెకండరీ స్కూల్ ఫస్ట్ వచ్చేది. ఇక పాఠశాల వార్షిక క్రీడోత్సవం కానీ, సైన్స్-ఆర్ట్స్ ప్రదర్శన కానీ అంగరంగ వైభోగంగాజరిగేది.  ఉదయం పూట స్కూల్ ప్రారంభం కావడానికి ముందు ప్రేయర్ మీట్ ఒక అద్భుతంగా వుండేది. ప్రతిరోజూ “థాట్ ఫర్ ద డే” అని ఒక విద్యార్థితోనో, అధ్యాపకుడితోనో మాట్లాడించే వారు. అది నిజంగా థాట్ ప్రవోకింగ్ గా వుండేది.

వీటన్నిటికీ మూల కారణం ఆ పాఠశాల ప్రిన్సిపాల్ స్వర్గీయ శ్రీమతి వై పద్మావతి. మద్రాస్ విశ్వవిద్యాలయం నుండి ఎంఎ ఇంగ్లీష్, ఎకనామిక్స్ విభాగాలలో పట్టాపొందిన పద్మావతి గారు నిరంతర అధ్యయనవేత్త. పద్మావతి గారు ప్రిన్సిపాల్ గా వుండగా నేను హయ్యర్ సెకండరీ పాఠశాలలో దాదాపు పది సంవత్సరాలకు పైగా లైబ్రేరియన్ గా పనిచేశాను. ఆవిడ పదవీ విరమణ చేసిన తరువాత మాలతీ గోపాలకృష్ణన్ ప్రిన్సిపాల్ గా వుండగా పనిచేసినప్పటికీ గతంలో లాగా ఆసక్తిగా పనిచేయలేకపోయాను. పద్మావతి గారి సారధ్యంలో ఆ పాఠశాల ఒక అత్యున్నత శిఖరాలకు పోగలిగింది. ఆమె పాలనా దక్షత, అధికార దర్పం, పాఠశాల వ్యవహారాలను తన చెప్పుచేతల్లో వుంచుకున్న విధానం ఒక అరుదైన ప్రక్రియగా చెప్పుకోవాలి. విద్యార్థులకు, అధ్యాపకులకు, ఇతర సిబ్బందికి ఆమె ఒక స్నేహితురాలిగా, తత్వవేత్తగా, దార్శనికురాలిగా, ఆత్మీయురాలిగా వుండేది. పాఠశాల వ్యవహారాలను కంట్రోల్ చేసే బీహేచీఇఎల్ అధిష్టాన యాజమాన్యం దృష్టిలో పద్మావతి ఒక ఉన్నత విద్యావేత్త, పాలనా దక్షురాలు. రోజువారీ పాలనా వ్యవహారాలలో వారేమాత్రం జోక్యం చేసుకునేవారు కాదు. ఒక విధంగా వారికి ఆమె అంటే భయ-భక్తులు వుండేవి.  
   

లైబ్రేరియన్ గా నా బాధ్యత పాఠశాల లైబ్రరీ నిర్వహణ. పుస్తకాలను పిల్లలకు ఇవ్వడం, వారు వాటిని చదివేలా చూడడం, చదివిన తరువాత తిరిగి తీసుకోవడం, పుస్తకాల క్లాసిఫికేషన్, కేటలాగ్ చేయడం తదితర వ్యవహారాలను నిర్వర్తించేవాడిని. వాస్తవానికి లైబ్రరీ సైన్స్ డిగ్రీలో చదివిన దానికంటే ప్రాక్టికల్ గా చాలా విషయాలను పద్మావతి గారిదగ్గర నేర్చుకున్నాను. ఆమె స్వయంగా పుస్తక ప్రియురాలు. మాగజైన్లు, జర్నల్స్ నిరంతరం చదువుతుండేది. ప్రతిరోజూ మధ్యాహ్న భోజన సమయంలో తప్పక ఒక మాగజైన్ తెమ్మని అడిగేది. పద్మావతి గారి అనుమతితో లైబ్రరీకి అన్ని రకాల మాగజైన్లు, జర్నల్స్, మార్కెట్లోకి వచ్చే కొత్త పుస్తకాలు తెప్పిమ్చేవాడిని. వాటిలో చాలా భాగం చదవడం వల్ల భవిష్యత్ లొ నేనొక పాత్రికేయుడిగా, ప్రజాసంబంధాల వృత్తినిపుణుడిగా ఎదగడానికి దోహదపడింది. నేను ఆంగ్లభాషలో అంతో-ఇంతో ప్రావీణ్యం పొందడానికి పద్మావతిగారే ప్రధాన కారణం. ఎప్పటికప్పుడు మనం మాట్లాడే భాషను మనల్ని నొప్పించకుండా సరిదిద్దేవారామె. ఒక సందర్భం నాకింకా గుర్తుంది. నేను “Madam…can I come”….అని అడిగినప్పుడు ఆమె జవాబుగా “Yes…you can…but you may not!”.  ఇంగ్లీష్ లో can ఎప్పుడు వాడాలి, may ఎప్పుడు వాడాలి ఆమె దగ్గర నేర్చుకున్నాను.

పద్మావతిగారితో చాలా సందర్భాలలో విభేదించాను. కాని ఆమెది విశాల హృదయం. ఆమె నన్ను తన కొడుకులాగా చూసుకునేది. తప్పులు పట్టించుకోకుండా ఒప్పులు నేర్పేది. ఆమె అభీష్టానికి విరుద్ధంగా బీహెచ్ఇఎల్ హయ్యర్ సెకండరీ పాఠశాల సిబ్బంది అసోసియేషన్ ప్రారంభానికి జగన్మోహన్ రావు, డేవిడ్, నాగేశ్వర్ రావులతో కలిసి నేను కూడా ఒక ముఖ్య కారకుడిని. అసోసియేషన్ ఏర్పాటుకు సంబంధించి యావత్ ప్రక్రియ జరుగుతున్నప్పుడు ఆమె ఆ విషయాన్ని కనిపెట్టకుండా, కనిపెట్టి దానికి అడ్డుతగలకుండా నేను జాగ్రత్త పడ్డాను. ఆరోజు ఆమెతో కలిసి ఆమె కారులో వెళ్లి ఆమె ఇంటివద్ద దిగిందాకా ఆమెకు విషయం తెలియకుండా చూశాను. మర్నాడు విషయం తెలుసుకున్న పద్మావతి గారు అగ్గిమీద గుగ్గిలంలాగా అయిపోయి, తమాయించుకుని, నన్ను మందలించారు. మేం చేసిందంతా పిల్ల వ్యవహారంలాగా కొట్టి పారేసింది.        

బీహెచ్ఇఎల్ హయ్యర్ సెకండరీ పాఠశాలలో ఉద్యోగం మానేసిన తరువాత కూడా ఆమె చనిపోయేంతవరకు పద్మావతిగారితో టచ్ లొ వుండేవాడిని. ఆమె సహస్ర చంద్ర దర్శనానికి కూడా సతీసమేతంగా వెళ్లాను. ఆమె చనిపోయినప్పుడు నయాగారా (అమెరికా) లో వున్నందున కడసారి చూడలేకపోయాను.

బీహెచ్ఇఎల్ హయ్యర్ సెకండరీ పాఠశాల గురించి, అక్కడ నాతో పనిచేసిన సహాయాధ్యుల గురించి మరిన్ని వివరాలు ముందు...ముందు.         

No comments:

Post a Comment