Friday, September 6, 2019

గవర్నర్లనూ ఎన్నుకోవాలి : వనం జ్వాలా నరసింహారావు


గవర్నర్లనూ ఎన్నుకోవాలి
వనం జ్వాలా నరసింహారావు
ఆంధ్రజ్యోతి దినపత్రిక (07-09-2019)
వర్తమాన, నడుస్తున్న చరిత్ర అవసరాలకు అనుగుణంగా, శక్తివంతంగా, సందర్భోచితంగా ప్రజాస్వామ్యం మనుగడ సాగించాలంటే, కాలానుగుణంగా రాజ్యంగ వ్యవస్థలలో ప్రస్ఫుటమైన మార్పు వచ్చి తీరాలి. ఆ మార్పు ప్రజల ఆశయాలకు, ఆకాంక్షలకు, కోరికలకు అద్దం పట్టాలి. ప్రజాస్వామ్య దేశాల రాజ్యాంగం ఒక స్థిరమైన, చలనం లేని డాక్యుమెంటులాగా కాకుండా ఎప్పటికప్పుడు మార్పులకు ఆలవాలం కావాలి. బహుశా, అందుకేనేమో భారత రాజ్యాంగానికి, అది అమల్లోకి వచ్చిన 1950 నుండి గత 70 సంవత్సరాలుగా వందకు పైగా సవరణలు వచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా వున్న ప్రజాస్వామ్య దేశాల్లో కూడా ఇలాగే జరుగుతున్నది. ఇదే సిద్దాంతం భారత రాజ్యాంగంలో అంతర్భాగమైన గవర్నర్ వ్యవస్థకు, అందులోనూ ప్రధానంగా ఇటీవల ఐదు రాష్ట్రాలకు కొత్త గవర్నర్ల నియామకం జరిగిన నేపధ్యంలో స్పష్టంగా అన్వయిస్తుంది. వారి నియామకంలో సమాఖ్య సహకార స్ఫూర్తి పూర్తిగా లోపించిందని నిపుణుల అభిప్రాయం.

భారత సహకార సమాఖ్య వ్యవస్థలో ఒక ముఖ్య భూమికగా భావించబడుతున్న గవర్నర్ స్థానం అది ఏర్పాటైన నాటినుండీ ఏదో ఒకరకమైన వివాదాస్పద వ్యవస్థగా మిగిలిపోయింది. ఇటీవలికాలంలో, కారణాలేవైనా, గవర్నర్లను ఒకరకమైన అవమానకరమైన సంబోధనతో కేంద్ర ప్రభుత్వ ఏజంట్లుగా పిలవడం కూడా జరుగుతున్నది. మరీ ఈ మధ్య కాలంలో, ముఖ్యంగా జులై మాసం నుండి ప్రారంభమై నిన్న-మొన్న జరిగిన మొత్తం తొమ్మిది మంది గవర్నర్ల నియామకాల నేపధ్యంలో ఈ వ్యవస్థ మరీ వివాదానికి గురైందనక తప్పదు. ఒకానొక సందర్భంలో, 80 వ దశకంలో గవర్నర్ వ్యవస్థ మీద జాతీయ స్థాయిలో తీవ్ర విమర్శలు, వివాదం వచ్చిన నేపధ్యంలో, అప్పటి కేంద్ర ప్రభుత్వం, తగు సూచనలు, సలహాలు ఇచ్చేందుకు సర్కారియా కమీషన్ ను ఏర్పాటు చేసింది.

గవర్నర్ గా నియమించబడే వ్యక్తి ఏదైనా ఒక ప్రముఖ రంగంలో నిష్ణాతుడై, ఒక ఉన్నతోన్నత వ్యక్తి అయ్యుండాలనీ, రాగద్వేషాలకు అతీతమైన వ్యక్తి అయ్యుండాలనీ, స్థానిక-రాష్ట్ర రాజకీయాలకు సంబంధం లేని వ్యక్తి అయ్యుండాలనీ సర్కారియా కమీషన్ అక్టోబర్ 1987 లో అప్పటి కేంద్ర ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో పేర్కొనడం జరిగింది. గవర్నర్ గా నియామకానికి తక్షణ పూర్వరంగంలో సాధారణ రాజకీయ కార్యకర్తగా కానీ, క్రియాశీలక రాజకీయ నాయకుడు లేదా నాయకురాలిగా కానీ వుండకూడదని కూడా సిఫార్సులో వుంది. అదే విధంగా కేంద్రంలో అధికారంలో వున్న పార్టీకి చెందిన వ్యక్తిని, ఎట్టి పరిస్థితుల్లో వేరే పార్టీ అధికారంలో వున్న రాష్ట్రానికి గవర్నర్ గా పంపకూడదని మరో సిఫార్స్ వుంది. గవర్నర్ నియామకానికి ముందు సంబంధిత రాష్ట్ర ముఖ్యమంత్రిని సంప్రదించాలని కూడా సర్కారియా కమీషన్ సూచించింది. వీటిలో ఏవీ ఇటీవలి గవర్నర్ల నియామకం సందర్భంగా పాటించినట్లు లేదు.

ఈ నేపధ్యంలో, రాష్ట్రాల ముఖ్యమంత్రి, గవర్నర్ వ్యవస్థలను, అధికారాలను పోల్చి పరిశీలిస్తే ఆసక్తికరమైన విషయాలు అవగాహనకొస్తాయి. మన దేశంలో ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అంటే, ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నుకోబడ్డ రాష్ట్రాధినేత. సమస్త కార్యనిర్వాహక అధికారాలు ఆయన గుప్పిట్లోనే వుంటాయి. రాష్ట్ర శాసనసభ మెజారిటీ సభ్యుల నాయకుడు ఆయన. ఇక గవర్నర్ విషయానికొస్తే, రాజ్యాంగం ప్రకారం, ఆయన లేదా ఆమె, రాష్ట్రానికి నామ మాత్రపు అధిపతి మాత్రమే. వారి పాత్ర కేవలం ఉత్సవ విగ్రహం లాగానే. ముఖ్యమంత్రి వద్దనే నిజమైన సర్వాధికారాలు వుంటాయి.

కేంద్రంలో రాష్ట్రపతికి ఎలాంటి అధికారాలు, విధులు వుంటాయో రాష్ట్ర స్థాయిలో గవర్నర్ కు కూడా అలాంటి అధికారాలు, విదులే వుంటాయి. ఒక్క విషయంలో మాత్రం మినహాయింపు వుంది. కేంద్రంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాష్ట్రపతి పాలనకు రాజ్యాంగంలో అవకాశం కలిగించలేదు. రాష్ట్రాలలో గవర్నర్ అనుకుంటే రాష్ట్రపతి పాలన విధించవచ్చు. రాజ్యంగ ప్రకరణాల ప్రకారం రాష్ట్రంలో పాలన కొనసాగడం కష్టం అని సాకు చూపి పలుమార్లు, పలురాష్ట్రాలలో రాష్ట్రపతి (గవర్నర్) పాలన విధించడం తెలిసిన విషయమే. ఈ రకమైన అధికార దుర్వినియోగం చాలా సార్లు జరిగింది.

ఐదేళ్ల కాలానికి నియమించబడే గవర్నర్ కు పలు రకాలైన కార్యనిర్వాహక, శాసన వ్యవహారాల, విచక్షణాధికారాలు రాజ్యాంగపరంగా ఉన్నప్పటికీ, అసలు సిసలైన రాజ్యంగ స్ఫూర్తి ప్రకారం ఇవన్నీ నామమాత్రంగా వుండాలనే. గవర్నర్ ముఖ్యమంత్రిని నియమించాలని రాజ్యాంగం చెప్తుంది కాని అలా చేయడానికి హద్దులున్నాయి. ఎవరికైతే శాసనసభలో మెజారిటీ వుంటుందో వారిని మాత్రమే ముఖ్యమంత్రిగా నియమించాలి కాని ఎవరిని పడితే వారిని కాదు. బ్రిటీష్ మోనార్క్ లాగా భారత దేశంలోని గవర్నర్ ఈ విషయంలో నిర్ణయం తీసుకునేటప్పుడు ఎలాంటి పొరపాటు చేయదానికి ఆస్కారం లేదు. కాబినెట్ మంత్రులను నియమించేదీ, వారికి పోర్ట్ ఫోలియోలను కేటాయించేదీ గవర్నరే అని రాజ్యాంగం చెప్పినా, అది ముఖ్యమంత్రి సలహా మేరకే చేయాలి.


గవర్నర్ ఆమోదం ఉన్నంత కాలమే మంత్రి మండలి అధికారంలో వుంటుంది అని రాజ్యాంగం చెప్పినా, వాస్తవానికి, మంత్రిమండలి శాసనసభకు మాత్రమే జవాబుదారీ. రాజ్యాంగపరమైన ఎన్నో నియామకాలు గవర్నర్ చేయడానికి అధికారం ఉన్నప్పటికీ అవన్నీ కేవలం లాంచనమే. గవర్నర్ ఈ అధికారాలను ముఖ్యమంత్రి నాయకత్వంలోని మంత్రిమండలి సలహా మేరకు మాత్రమే ఉపయోగించుకోవాలి. శాసనసభ సమావేశాలు జరగనప్పుడు గవర్నర్ ఆర్డినెన్సులను జారీచేయవచ్చు కాని, అది కూడా ముఖ్యమంత్రి, మంత్రిమండలి సలహా మేరకు మాత్రమే. ఎంతవరకైతే ఈ రకమైన వ్యవస్థీకృత పద్ధతులు ఎలాంటి అడ్డంకులు లేకుండా కొనసాగుతాయో, అంతవరకూ రాజ్యాంగ స్ఫూర్తి కూడా కొనసాగుతుంది. అలా కాకుండా దానికి విరుద్ధంగా జరుగుతే, దానికి కారణభూతులు గవర్నర్లే అయితే రాజ్యాంగానికి దక్కేది రాజ్యంగా పరిహాసమే. గతంలో కొన్ని రాష్ట్రాలలో కొందరు గవర్నర్ల పుణ్యమా అని అలా జరిగిందనేది వాస్తవం.

కాలం గడుస్తున్నా కొద్దీ, దురదృష్టవశాత్తూ, గవర్నర్ పాత్ర పుణ్యమా అని, ఒకరకమైన పెళుసైన, సున్నితమైన ప్రజాస్వామ్య రాచరికంలో మనం జీవిస్తున్నామా అనే భావన ప్రజల్లో నాటుకుపోతున్నది. అలాంటి సున్నితమైన ప్రాజాస్వామ్య వ్యవస్థను ఎటువంటి ప్రయత్నం లేకుండా గవర్నర్ కిందు-మీదు చేయగలడని కూడా వారి భావన. గత దేశవ్యాప్త అనుభవాలను నెమరేసుకుంటే, కొందరు గవర్నర్లు నియంతల పాత్ర పోషించి అన్ని రకాల ప్రజాస్వామ్య విలువలను కాలరాశారనేది విదితమవుతుంది. అందరూ అలానా అంటే కాకపోవచ్చు. తమ-తమ రాజకీయ అవసరాలకు కేంద్రంలో అధికారంలో వున్న వివిధ రాజకీయ పార్టీలు గవర్నర్ పదవిని దుర్వినియోగ పరచిన సందర్భాలు కోకొల్లలు. దీనర్థం, భారత సామాజిక వ్యవస్థ రాజకీయ పరిణితిని, రాజకీయ ఆధునీకరణను, రాజకీయ సంస్కృతిని ఇంకా సాధించలేదనేదే.

గవర్నర్ వ్యవస్థను ఎన్నో రకాలుగా దుర్వినియోగ పరచిన సందర్భాలు మన దేశంలో అనేకం వున్న దృష్ట్యా, భవిష్యత్ లో కూడా అలాంటిదే పునరావృతం కాదన్న హామీ ఏదీలేదు. భారత సహకార సమాఖ్య వ్యవస్థలో గవర్నర్ పాత్రను పునర్నిర్వచించే విధంగా రాజ్యాంగంలో మౌలికమైన మార్పులకు సంబంధించి గతంలో అనేక సందర్భాలలో, అనేక వేదికలపైన చర్చోపచర్చలు జరిగాయి. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కేంద్రంలో అధికారంలో వున్న పార్టీకి చెందనివ్యక్తైతే, ఎప్పుడో-అప్పుడు తప్ప, సాధారణంగా, అక్కడ నియమించబడ్డ గవర్నర్ ను కేంద్ర ప్రభుత్వ ఏజంటుగా భావించడం పరిపాటైపోయింది. ఫలితంగా, ఆ రకమైన గవర్నర్లు నిర్ణయాత్మకమైన మొండి వైఖరిని అవలంభించి ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలకు అవరోధాలు కలిగించే సందర్భాలు కలగడంతో ఆ మొత్తం వ్యవస్థపైన అనుమానాలు కలగడం మొదలైంది. అయితే కొందరు గవర్నర్లకు ఈ విషయంలో మినహాయింపు వుంది.

గవర్నర్ వ్యవస్థను గురించి రాజ్యాంగపరంగా చర్చించినప్పుడు, గవర్నర్లను రాష్ట్రపతి తరహాలో ఎన్నుకుంటే మంచిదని కొందరు సూచించారు. కాకపొతే రాజ్యంగ నిర్మాతల ముసాయిదా కమిటీ గవర్నర్లను రాష్ట్రపతి నియమిస్తేనే బాగుంటుందన్న అభిప్రాయానికి వచ్చారు. అలా మొదలైంది నియామక గవర్నర్ల వ్యవస్థ. తమను నియమించిన కేంద్రాన్ని సంతోషపరచడానికి, తద్వారా భవిష్యత్ లో మరిన్ని ఉన్నతపదవులను అదిరోహించడానికి, కేంద్రం అదుపాజ్ఞలలో వుండడం చాలామంది గవర్నర్లకు అలవాటుగా మారిందన్న ఆరోపణలున్నాయి. స్వాతంత్ర్యానంతరం కేంద్రంలో అధికారంలో వున్న అన్ని పార్టీలు, అలనాటి కేరళ ప్రభుత్వం రద్దు నుంచీ, తమ ఇష్టానుసారంగా గవర్నర్ వ్యవస్థను వాడుకోవడం తెలిసిన విషయమే. గవర్నర్ రాజ్యాంగ పరంగా తనకు సంక్రమించిన అధికారాలను, విధులను సహకార సమాఖ్య స్ఫూర్తితో, భారతదేశాన్ని ఐక్యంగా వుంచడానికి మాత్రమే ఉపయోగిస్తారని రాజ్యంగా నిర్మాతలు భావించారు కాని, అందరూ కాకపోయినా కొందరు గవర్నర్లు, అధికారంలో వున్న కేంద్ర ప్రభుత్వం వాటిని దుర్వినియోగం చేయడం వాస్తవం.

భారత రాష్ట్రపతిని ప్రజాప్రతినిధులైన ఎంపీలు, ఎమ్మెల్యేలు ఎన్నుకుంటారు కాని, గవర్నర్ ను మాత్రం ప్రధానమంత్రి సలహా మేరకు రాష్ట్రపతి నియమిస్తారు. ఇద్దరూ ఒకేరకమైన రాజ్యాంగపరమైన విధులు నిర్వర్తిస్తారు. అలాంటప్పుడు ఈ తేడా ఎందుకు? రాష్ట్రపతి లాగానే గవర్నర్ ను కూడా ప్రజాప్రతినిధులైన సంబంధిత రాష్ట్ర ఎమ్మెల్యేలు, జిల్లా స్థాయి స్థానిక ప్రజాప్రతినిధులు ఎన్నుకుంటే మంచిదేమో! ఒకవేళ ఇది కుదరకపోతే, నియామకం ద్వారా మాత్రమే జరగాలంటే అదీ ఒక నియమిత పధ్ధతి ద్వారా చేయవచ్చేమో! సుప్రీం కోర్టు జడ్జీల ఎంపిక మాదిరిగానే గవర్నర్ ఎంపికకు కూడా ఒక కొలీజియం ఏర్పాటు చేయవచ్చుకదా! అదే పద్ధతిలో రాష్ట్రపతి గవర్నర్ ను నియమించవచ్చు. ఆ కొలీజియం సభ్యులుగా, వీటో అధికారంతో, ప్రధానమంత్రి, సంబంధిత రాష్ట్ర ముఖ్యమంత్రి, సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి, కనీసం ఇద్దరు నిష్ణాతులైన రాజ్యంగ నిపుణులు వుంటే బాగుంటుంది.

గవర్నర్ నియామకం విషయంలో వస్తున్న ప్రధానమైన విమర్శ అది రాజకీయ పునరావాసమని. దీనికి ప్రధాన కారణం కేంద్రంలో సాధారణంగా ఏక పార్టీ ఆధిపత్యం వుండడం. దీనివల్ల యావత్ రాజకీయ వ్యవస్థ మీద విశ్వాసం ఒక సంక్షోభ స్థాయికి చేరుకున్నది. గవర్నర్ ఉద్యోగం ఒక స్వతంత్ర రాజ్యాంగపరమైన అధికారిక పీఠంగా వుండాలని, ఎట్టిపరిస్థితుల్లోనూ కేంద్రప్రభుత్వ అదుపాజ్ఞలలో వుండరాదనీ,  సుప్రీం కోర్టు స్పష్టంగా పేర్కొన్నప్పటికీ, దాన్ని పాటించిన దాఖలాలు అంతగాలేవనే అనాలి.
ఇటీవల జరిగిన గవర్నర్ నియామకాల లాగా కాకుండా, కేంద్రంలో అధికారంలో వున్న రాజకీయ పార్టీ సభ్యుల పునరావాసంలాగా కాకుండా, భవిష్యత్ లో వీటికి అతీతంగా జరిగితే మంచిది. తదనుగుణంగా రాజ్యాంగంలో మార్పులు తెస్తే మంచిది. అదెంత త్వరగా జరుగుతే అంత మంచిది.

No comments:

Post a Comment