Sunday, September 15, 2019

సీతా వృత్తాంతం రాముడికి చెప్పి మరణించిన జటాయువు ..... శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణం...అరణ్యకాండ-78 : వనం జ్వాలా నరసింహారావు


సీతా వృత్తాంతం రాముడికి చెప్పి మరణించిన జటాయువు
శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణం...అరణ్యకాండ-78
వనం జ్వాలా నరసింహారావు
ఆంధ్రభూమి ఆదివారం సంచిక (15-09-2019)
          జటాయువును సీత ఎక్కడున్నడని పదే-పదే ప్రశ్నిస్తూ నేలమీద పది, మూర్చిల్లిన శ్రీరాముడు, తేరుకుని, లేచి, లక్ష్మణుడితో ఇలా అన్నాడు. “తమ్ముడా! మహోపకారం చేసిన ఈ పక్షిశ్రేష్టుడు నాకొరకు తెగించి యుద్ధం చేసి పడిపోయి కొన ఉపిరితో  వున్నాడు. మాట్లాడడానికి శక్తి కూడా లేదు. ఏదో ఒక ఆమాట చెప్పినా స్వరం హీనంగా వుంది”. అ ఆతరువాత జతాయువుతో ఇలా అన్నాడు. “ఓ గద్దరేడా! జటాయూ! నువ్వు మాట్లాడగలిగితే సీతాదేవి గురించి నీకు తెలిసిన విషయం, నువ్వు చంపబడ్డ విధం, ఎందుకు సీతను రాక్షసుడు పట్టుకునిపోయాడు? వాడికెందుకు నామీద కోపం వచ్చింది? అప్పుడు సీతాదేవి ముఖం ఎలా వుంది....లాంటి విషయాలు చెప్పు. ఆ పాపాత్ముడు, రాక్షసుడు తనను తీసుకునిపోతున్నప్పుడు సీత ఏమన్నది? ఆ మాటలన్నీ స్పష్టంగా చెప్పు. ఆ రాక్షసుడు ఎలాంటివాడు? ఏ దేహం కలవాడు? వాడుండే నగరం ఏది? వాడెంత శూరుడు? తండ్రీ! సీతను ఏ విధంగా వాడు పట్టుకుని పోయాడో సవివరంగా చెప్పు”.

         ఇలా రామచంద్రుడు అడగ్గా, జటాయువు మెల్లగా రెప్పలు తెరిచి, రాముడిని చూసి, చాలా సన్నటి గొంతుతో జవాబిచ్చాడిలా. “రామా! వాడు మాయగాడు. తన శక్తితో పెనుగాలిని మబ్బుల గుంపును కల్పించి వాటి చాటున ఎవరినీ కానరాకుండా చేసి, రహస్యంగా సీతాదేవిని శూరుడై బలాత్కారంగా పట్టుకుని ఆకాశమార్గాన పోయాడు. భయంకర యుద్ధంలో ఎదుర్కొన్న నన్ను చూసి, నా మీదపడి, కత్తితో నా రెక్కలు నరికి అమితమైన వేగంగా దక్షిణ ముఖంగా పరుగెత్తాడు. రామా! కళ్ళు తిరుగుతున్నాయి. నామనస్సు నా స్వాధీనంలో లేదు. ప్రాణవాయువులు వాటి-వాటి స్థానాలు వదిలాయి. అదిగో...వట్టివేళ్ళ కొనలున్న బంగారు మెట్లు కనబడుతున్నాయి. రాక్షసుడు సీతాదేవిని అపహరించిన ముహూర్తం “వింద”. ఆ ముహూర్తంలో అపహరించబడిన సొమ్ము మళ్లీ స్వంతదారుడికి చేరుతుంది. తప్పదు. ఆ రాక్షసుడు తొందరలో ఇది గమనించలేదు. కాబట్టి నీ భార్యను అపహరించినవాడు కాలం మింగిన చేపలాగా అయిపోతాడు. రామా! సీతకొరకు నువ్వు ఆందోళనపడవద్దు. నువ్వు ఆ రాక్షసుడిని యుద్ధంలో చంపి మళ్లీ సీతను గ్రహించి గొప్ప కీర్తిని సంపాదించి సంతోషంగా అయోధ్యకు పోతావు”.

         ఇంతదాకా స్మృతి తప్పకుండా తెలివిగా చెప్పి, రాముడు అడిగిన మిగతా ప్రశ్నలకు జవాబియ్యదలచి, మాట్లాడడానికి ఎంత ప్రయత్నించినా వీలుకాక, ఆయన నోట్లో నుండి మాంసం, నెత్తురు, కక్కుతూ ఎదో చెప్పబోయాడు. ఆయన చెప్పాలనుకున్నది, పూర్తిగా చెప్పలేకపోయింది, “విశ్రవసుడు అనే ముని కన్నకొడుకు, కుబేరుడి సోదరుడు...(రావణుడు)....” అని చెప్తుండగానే ఉపిరి పోయింది. “చెప్పు, చెప్పు” అని రాముడు చేతులు జోడించి అడుగుతుండగానే పక్షిరాజైన జటాయువు ఆయన చూస్తుండగానే దేహం విడిచి స్వర్గానికి పోయాడు. కళ్ళు ఎర్రగా కాగా, నోరు తెరిచి, తల నేలమీద వాల్చి, భూమ్మీద పాదాలు వెడల్పుగా కాగా, దేహం వణుకుతుంటే, ఉపిరి విడిచాడు.


         అలా నేలమీద పడ్డ జటాయువును చూసి రామచంద్రమూర్తి బాగా దుఃఖపడి, తమ్ముడు లక్ష్మణుడితో ఇలా అన్నాడు. “తమ్ముడా! యితడు అనేక సంవత్సరాలు పాపాత్ములైన రాక్షస స్థావరమైన దండకలో వుండి, తన పరాక్రమంతో భయం లేకుండా గడిపి, చివరకు ఇక్కడే మరణించాడు చూశావా? చిన్నతనం నుండీ ఇక్కడే వేలాది సంవత్సరాలు తన ఇష్టప్రకారం సంచరించి చివరకు ఇక్కడే చనిపోవడం అంటే కాలం దాటడం ఎవరికీ శక్యం కాదనే కదా? లక్ష్మణా! చూశావా! సీతను రాక్షసుడు తాకకుండా వుండడానికి ఆమె ముందు తాను నిలిచి రాక్షసుడిని ఎదిరించి, యుద్ధం చేసి, తన అఖండ పక్షిరాజ్యాన్ని, ఆయుషును, నాకోసం వదిలి నేలమీద పడ్డాడు. భూమ్మీద ఇలాంటి పరోపకారుడిని, ఉదారచిత్తుడిని, పుణ్యాత్ముడిని చూశామా?”

         “లక్ష్మణా! తండ్రి కొరకు నేను రాజ్యాన్ని వదిలితినని గొప్పగా చెప్తారు. తండ్రి కొరకు కొడుకు చేయకపోతే తప్పుకాని, చేయడం గోప్పేమీకాదు. ఇతడేమో మనుష్య జాతిలో చేరినవాడు కాదు. మనకు బంధువు కూడా కాదు. మన దగ్గరివారిలో చేరినవాడూ కాదు. జీతం తీసుకున్న సేవకుడు కూడా కాదు. మనం ఆయనకు చేసిన ఉపకారం ఏదీ లేదు. మన ఉపకారం ఆయన ఆశించినవాడూ కాదు. ఇలాంటి వాడు ఒక ఆడదాన్ని రక్షించాలని దీర్ఘకాలంగా ఏలుతున్న రాజ్యాన్ని, అంతకంటే గొప్పదైన తన ప్రాణాన్ని, వదిలిపెట్టాడు. ఇలాంటి పనినే కదా ఉపకారం అని, ఔదార్యం అనీ, పుణ్యమనీ, భక్తీ అనీ అంటారు. లక్ష్మణా! పరోపకారులు మనుష్యుల్లోనే వుంటారని, యాత్ర జాతుల్లో, ఇతర ప్రదేశాల్లో లేరని అనుకోవద్దు. ఇతర జాతులైన పశుపక్ష్యాదులలో కూడా శూరులు, రక్షించే యోగ్యతా కలవారు, పరులకు మేలు చేయగోరే వారు, సాధువులు, ధర్మ మార్గంలో ప్రవర్తించే వాళ్లు వుంటారు”.

         “మన తండ్రి నాకెలా పూజ్యుడో, ఇతడు కూడా అలా పూజ్యుడే. ఎందుకంటావా? తండ్రైన దశరథమహారాజు నాకొరకై ఎలా ప్రాణం వదిలాడో తండ్రికి స్నేహితుడైన ఇతడు కూడా అలాగే నాకోసం ప్రాణం విడిచాడు. కాబట్టి తండ్రిలాగా నా చేత సంస్కారం చేయించుకోవడానికి అర్హుడు. మంచి కీర్తికలవాడు. గౌరవించడానికి యోగ్యుడు. ప్రియుడు. ఇతడి పాట్లు చూస్తుంటే సీతకొరకు, ఆమెను కోల్పోయిన దుఃఖం నా మనస్సులో లేదు. ఎందుకంటావా? సీతాదేవి, నా సేవవల్ల కలిగే ఆనందానికై, అది అనుభవించాడానికి నాతొ వచ్చింది. అది సకామసేవే కదా? ఇతడేమో నా వల్ల ఏ లాభం కోరకుండా  నాకోసం ప్రాణాలనే ఇచ్చాడు. కాబట్టి ఇది విశేష దుఃఖాన్ని కలిగిస్తున్నది”.

          జటాయువుకు అగ్నిసంస్కారాలు చేద్దామని నిశ్చయించుకున్న రాముడు తమ్ముడితో, “లక్ష్మణా! నా పనికోసమై ప్రాణాలు విడిచిన ఈ పక్షిరాజును శాస్త్రప్రకారం నా తండ్రిలాగే దహన సంస్కారం చేస్తాను. కాబట్టి చితి పేర్చు” అని జటాయువున్న దిక్కుగా చూశాడు. చూసి, ఆయన్ను వైకుంఠ౦ పొందమంటాడు. పక్షి కాబట్టి కర్మాదికారం లేనందున, అగ్నిసంస్కారానికి యోగ్యత లేనందువల్ల, ఉత్తమలోకాలు లేకపోయినా తన ఆజ్ఞ వల్ల ముక్తిని పొందమని అంటాడు జటాయువును. రామచంద్రమూర్తి బ్రహ్మవిధి ప్రకారం సంస్కరించి, యోగులు పొందే సనాతమైన తన లోకాన్ని ఇచ్చాడు. రామానుగ్రహం వల్ల ఆ గద్ద పరమపదానికి పోయి విష్ణుసారూప్యాన్ని పొందింది.

         (జటాయువు ఋషులలాగా మోక్షం కొరకు పరమాత్మోపాసన చేయలేదు. అలాంటివాడికి రాముడెలా మోక్షం ఇచ్చాడు? అలాగైతే అందరికీ ఇవ్వ వచ్చుకదా? అని ఆక్షేపించవచ్చు. దీనికి సమాధానం...మోక్షానికి ఆత్మోపాసన ఒక్కటే మార్గం కాదు. చాలా మార్గాలున్నాయి. భగవద్గీతలో కర్మ, జ్ఞాన, రాజయోగాలు, భక్తీ, ప్రపత్తి, క్షేత్రక్షేత్రజ్ఞజ్ఞానం, అవతార జ్ఞానం లాంటివి చెప్పడం జరిగింది. బ్రహ్మసూత్రాలలో 32 విద్యలు చెప్పడం జరిగింది. ఇవేవీ లేకున్నా ప్రేమ ఒక్కటే మోక్షసాధనమని శాస్త్రాలు చెప్తున్నాయి. అనన్యమనస్కుడై, భగవంతుడి కోసం రాజ్యాన్ని, ప్రాణాన్ని విడిచి ఆయన సమక్షంలో ఆయనమీదే దృష్టి నిలిపి ప్రాణం వదిలి, ఆయన చేతులమీదుగా సంస్కారం పొందిన జతాయువుకే మోక్షం లేకపోతే ఇంకెవరికి వుంటుంది? ఇలాంటివారికెవరికైనా మోక్షం ఇస్తాడు రాముడు కాని, ప్రకృతిబద్ధులై, కామదాసులై, భక్తీ శూన్యులైన వారందరికీ మోక్షం ఎలా ఇస్తాడు? జటాయువు కంటే ఎక్కువ త్యాగం చేసినవారెవరు? కాబట్టి జటాయువుకు మోక్షమివ్వడం న్యాయమే).

No comments:

Post a Comment