Sunday, December 26, 2021

వశిష్ఠుడి ఆశ్రమానికి పోయిన విశ్వామిత్రుడు ..... శ్రీ మదాంధ్ర వాల్మీకి రామాయణం బాలకాండ మందర మకరందం-88 : వనం జ్వాలా నరసింహారావు

 వశిష్ఠుడి ఆశ్రమానికి పోయిన విశ్వామిత్రుడు

శ్రీ మదాంధ్ర వాల్మీకి రామాయణం బాలకాండ మందర మకరందం-88

వనం జ్వాలా నరసింహారావు

సూర్యదినపత్రిక (27-12-2021)

"వశిష్ఠుడి ఆశ్రమాన్ని చూసిన విశ్వామిత్రుడు, సంతోషంతో లోపలికి పోయి, వినయ విధేయతలతో వశిష్ఠుడికి నమస్కరించగా, అయన క్షేమ సమాచారాలు తెలుసుకున్న ముని ఆయన్ను ఆసనం మీద కూర్చోమంటాడు. వశిష్ఠుడిచ్చిన తియ్యటి ఫలాలను స్వీకరించిన రాజు ముని శ్రేష్ఠుడిని కుశల ప్రశ్నలడిగాడు. ఆయన శిష్యులెలా వున్నారని, తపస్సు చక్కగా జరుగుతున్నదానని, వారికి కావాల్సిన పళ్లు-ఫలాలు లభిస్తున్నవానని వశిష్ఠుడినడిగాడు. జవాబుగా మహర్షి విశ్వామిత్రుడిని: రాజా, నీకు-నీ సేవకులకు-బంధువులకు-మిత్రులకు-అందరికీ క్షేమమేనా? ధర్మం తప్పక, రాజనీతిననుసరించి ప్రజలను రక్షిస్తున్నావా? నీ సేవకులు నీ మాటకు లోబడి ప్రవర్తిస్తున్నారా? నీవూ వారిని దయతో చూస్తూ, వారి యోగక్షేమాలను విచారిస్తున్నావా? శత్రువులందరినీ జయించావా? చతుర్విధ సేనలు-బొక్కసం-స్నేహితులు నిండుగా వున్నారా? భార్యా-కొడుకులు-మనుమలు క్షేమంగా వున్నారా? అని అడగ్గా అందరూ కుశలమేనని చెప్పాడు విశ్వామిత్రుడు. ఇట్లా వీరిద్దరు సంతోషంతో ఒకరినొకరు పలుకరించుకుంటూ, పుణ్య కథలు చెప్పుకుంటూ సమయం గడిపారు కొంత సేపు".

విశ్వామిత్రుడికి విందుచేసిన వశిష్ఠుడు

"సమయమలా గడిచిపోతుంటే, జపశీలుడైన వశిష్టుడు, అతిథుల్లో గుణంవల్లా-పదవి వల్లా శ్రేష్టుడైన విశ్వామిత్రుడు పూజ్యుడనీ, అందువల్ల సేనలతో సహా అతడికి ఆతిథ్యమిచ్చి గౌరవించదల్చుకున్నాననీ, హిత బుద్ధితో అంగీకరించమనీ కోరాడు. వశిష్ఠుడి ప్రియ వాక్కులతో, అమృత సమానమైన కందమూల ఫలాలు తినడంతో ఆయన ఆతిథ్యం స్వీకరించినట్లేనని, ఆయన దర్శనంతో ధన్యుడనయ్యానని, సెలవిస్తే వెళ్తానని అంటాడు విశ్వామిత్రుడు. అయినా వశిష్ఠుడు బలవంతం చేయడంతో, ఆయన ఇష్ట ప్రకారమే ఆతిథ్యం తీసుకునేందుకు అంగీకరించాడు. వెంటనే వశిష్ఠుడు తన కామధేనువైన శబలను పిలిచి, తను రాజుకు-ఆయన సేనలకు విందు భోజనం పెట్టదల్చుకున్నానని, శీఘ్రంగా వారందరికి, తియ్యని అన్నాన్ని-పానకాన్ని-రసాయనాల్ని-లేహ్యాల్ని, ఇతర భోజ్యాల్ని ఏర్పాటుచేయమని ఆదేశించాడు". 

కామధేనువును తనకిమ్మని వశిష్ఠుడిని అడిగిన విశ్వామిత్రుడు

"వశిష్ఠుడు చెప్పిన విధంగానే, కామధేనువు, తగు రీతిలో అనేకమైన పిండివంటలు-తేనె-సారాయి-కమ్మని రుచికరమైన కూరలు-పప్పులు-అప్పాలు-పాలు-పళ్లు-వేడి, వేడి అన్నం-తియ్యటి చక్కెర పానకం, మొదలైన రకరకాల భక్ష్యభోజ్యాలను-ఎవరేదికోరితే దాన్నిసృష్టించింది. అది చూసిన వశిష్ఠుడు అందమైన పీటలు వేసి,బంగారు చెంబుల్లో నీళ్లిచ్చి, వెండిపళ్లాలలో వడ్డించే ఏర్పాట్లుచేసాడు. అంతఃపుర స్త్రీలతోను, మంత్రులతోను,బ్రాహ్మణాదులతోను,సైన్యంతోను కలిసి రాజు సంతృప్తిగా-కడుపునిండా భోజనంచేసాడు. అందరి భోజనం ముగిసిన తర్వాత, తామందరం సంతుష్టి చెందామని, ఆయన శక్తికి-పూజకు చాలా మెచ్చామని ఋశీష్వరుడితో అన్నారు”.

వశిష్ఠుడిచ్చిన చనువుతో, ఆయనకొక మాటచెప్పదల్చానని అంటూ, విశ్వామిత్రుడు, తనకు కామధేనువు శబలనివ్వమని, దానికి బదులుగా నూరువేల మంచి ఆవులను ఇస్తానని అంటాడు. శ్రేష్ఠమైన పదార్థాలన్నీ రాజుల దగ్గర వుండాలని, అలానే ఆవులలో శ్రేష్ఠమైన శబల కూడా రత్నహారుడైన తనవద్దనే వుండాలని, అలాంటి అమూల్యమైన వస్తువు ఆయనకెందుకని వశిష్ఠుడితో అంటాడు. నూరువేలేకాదు, నూరుకోట్ల ఆవులనిచ్చినా-బంగారం కుప్పలు కుప్పలుగా ఇచ్చినా శబలను ఎడబాయనంటాడు వశిష్ఠుడు. ఆత్మజ్ఞానం కలవారిని కీర్తి ఎలా ఎడబాసి వుండదో, తనను విడిచి శబల కూడా వుండలేదన్నాడు. ఆ ఆవుపాలతోనే దేవతలకు కావాల్సిన హవ్యం, పితృదేవతలకు కావాల్సిన కవ్యం-బలి-అగ్ని కార్యాలు, హోమానికి కావాల్సిన పదార్థాలు-దేహయాత్ర, సర్వం కామధేనువుతోనే నెరవేర్చుకుంటున్నాననీ, దానికి ఎన్నో విద్యలు కూడా వచ్చనీ, తనకది అవ్యానందానికి కారణమైందని, అలాంటి దాన్ని తను విడిచి ఎలా వుండటాలన్నీ విశ్వామిత్రుడిని ప్రశ్నించాడు వశిష్థుడు. కామధేనువును తానివ్వకపోవడానికి మరెన్నో కారణాలను కూడా చెప్పాడు”.

బంగారు సొమ్ములతో అలంకరించబడిన పద్నాలుగువేల ఏనుగులను, నాలుగు తెల్లని గుర్రాలను కట్టిన మేలిమి బంగారపు రథాలను, అమిత వేగంతో పోగల పదకొండువేల విదేశీ గుర్రాలను, నానా వర్ణాల కోటి ఆవులను ఇస్తానని శబలను తనకివ్వమని వశిష్ఠుడిని కోరాడు విశ్వామిత్రుడు మరోసారి. అంతేకాకుండా, వశిష్ఠుడు కోరినన్ని ఆభరణాలను, మణులను, బంగారు నాణాలను, నానా దేశాలలో లభించే మంచి మంచి వస్తువులను, గ్రామాలను, మడులను, మాణ్యాలను, స్త్రీలను, ఏది కోరితే దాన్ని ఆయన తృప్తిమేరకిస్తానని కూడా అంటాడు. విశ్వామిత్రుడేం చెప్పినా, ఏమిస్తానన్నా శబలనివ్వనంటాడు వశిష్ఠుడు. ముక్కుపట్టుకుని జపం చేసుకునే వశిష్ఠుడికి ఈ జంజాట మెందుకని, భూమిని పాలించేవాడికి సర్వ వస్తువులు కావాలని, అందుకే శబల తనదగ్గరే వుండదగిందని రాజు అనడంతో, భూమిని పాలించేవారికి బ్రాహ్మణుల-తపస్వుల సొత్తు కోరవచ్చునానని ప్రశ్నించాడు వశిష్ఠుడు. విశ్వామిత్రుడిస్తానని అంటున్నవన్నీ కామధేనువు తనకివ్వగలదని, తను దానినివ్వనని స్పష్టం చేశాడు".

 

Saturday, December 25, 2021

శ్రీకృష్ణ రాయబార పూర్వరంగంలో ద్రౌపదీ పాండవుల అంతరంగం .... ఆస్వాదన-52 : వనం జ్వాలా నరసింహారావు

శ్రీకృష్ణ రాయబార పూర్వరంగంలో ద్రౌపదీ పాండవుల అంతరంగం

ఆస్వాదన-52

వనం జ్వాలా నరసింహారావు

సూర్యదినపత్రిక (26-12-2021)

ధృతరాష్ట్రుడి రాయబారిగా వచ్చిన సంజయుడు హస్తినాపురానికి వెళ్లిన తరువాత ధర్మరాజు ఆ మర్నాడు తన తమ్ములను, కొడుకులను, సామంతరాజులను సమావేశపర్చాడు. శ్రీకృష్ణుదు తానే స్వయంగా కురుసభకు వచ్చి శాంతి వచనాలు ధృతరాష్ట్రుడితో పలుకుతానని సంజయుడికి చెప్పిన మాటలను వారికి గుర్తు చేస్తూ, అందరం కలిసి మాధవుడిని కలుద్దామని, ఆయన్ను తన మాట ప్రకారం కౌరవ సభకు వెళ్లమని వేడుకుందామని ప్రతిపాదించాడు ధర్మరాజు. అలా చేయడం వల్ల మేలు కలగొచ్చని, పోరు తప్పవచ్చని అన్నాడు ధర్మరాజు. అలా చెప్పి తనవారందరినీ వెంటబెట్టుకుని శ్రీకృష్ణుడున్న స్థలానికి వెళ్లాడు. మర్యాదల అనంతరం, శ్రీకృష్ణుడిని కౌరవుల దగ్గరికి రాయబారానికి వెళ్లమని, అలా వెళ్లినట్లయితే అయోగ్యుడైన దుర్యోధనుడితో యుద్ధం చేయాల్సిన అవసరం రాదని, తమ భాగం రాజ్యం తమకు వస్తుందని అన్నాడు. ఆ విధంగా, కురుపాండవుల వివాదాన్ని మిత్రకార్యంగా భావించమని వేడుకున్నాడు ధర్మరాజు శ్రీకృష్ణుడిని.

సంజయుడి రాయబారం వల్ల దుర్యోధన, ధృతరాష్ట్రుల మనోగతం అర్థమైందని, రాజ్యభాగం ఇవ్వకుండా మాయమాటలతో తమ కోపం చల్లార్చే స్వాంతన వచనాలు పలుకుతున్నారని, ధృతరాష్ట్రుడు వంశధర్మం పాటించడం లేదని, అతడికి కొడుకుమీద వల్లమాలిన దురభిమానమని అన్నాడు ధర్మరాజు. ఇంకా ఇలా అన్నాడు: (తిక్కన రచించిన మంచి పద్యాలలో ఇదొకటని విశ్లేషకులు ముదివర్తి కొండమాచార్యులు గారు వ్యాఖ్యానించారిక్కడ)

క:       ఇచ్చటి బంధులు నీవును, నచ్చెరువడి వినుచునుండ నయిదూళ్ళును మా

కిచ్చినను జాలు నంటిని, బొచ్చెముగా దింతవట్టు పూర్ణము సుమ్మీ!          

           శా.      ఆ దుర్యోధనుఁ డంతమాత్రయును జేయంజాలఁడో కాని, పెం

పేదం గ్రూరత కోర్వరాదు; సిరి నా కేలందునే, గ్రాసవా

సోదైన్యంబులు వచ్చు నా యరయు నీ చుట్టాలకుం; గావునన్‌

మోదంబందుట గల్గుఁ గౌరవులు నేముం బొంది శ్రీ నొందినన్‌

“కృష్ణా! సక్రమంగా మాకు అర్థరాజ్యం పంచి ఇవ్వడానికి మా తండ్రికి మనసొప్పకపోతే ఇంద్రప్రస్థం, కుశస్థలం, వృకస్థలం, వాసంతి, వారణావతం చాలు. దానికీ ఇష్టపడకపోతే ఎక్కడైనా మేము తలదాచుకోవడానికి ఐదూళ్లు ఇచ్చినా చాలు అని సంజయుడితో చెప్పిన మాటలు యదార్థం. దుర్యోధనుడు మేమడిగిన ఐదూళ్లు అయినా ఇస్తాడో, ఇవ్వడో తెలియదు. కాని గౌరవం చెడేవిధంగా క్రూర కార్యాచరణానికి నా మనస్సు ఒప్పుకోదు. పోనీ, రాజ్యసంపద నాకెందుకని వారిని అడగడం మానితే, నన్నాశ్రయించుకుని వున్న నా బంధుజనులకు కూటికీ, గుడ్డకూ దైన్యం ఏర్పడుతుంది. కాబట్టి కౌరవులు, మేము ఒద్దికగా వుండి రాజ్యసంపద పంచుకుంటే ఉభయులకూ సంతోషం సమకూరుతుంది”.

రాజ్యానికి కులనిర్మూలనం చేయడం తనకు సమ్మతం కాదన్నాడు ధర్మరాజు. యుద్ధం వల్ల లాభనష్టాలను చెప్పాడు. యుద్ధంలో జయాపజయాలు నిశ్చయంగా చెప్పడానికి వీలులేదని, వైరంవల్ల ప్రయోజనం శూన్యమని, కలత లేకుండా నిమ్మళంగా వుండడమే తగినపనని, తనకు సంపద కావాలని, యుద్ధం జరగకుండా వుండాలని కోరుకుంటున్నానని అన్నాడు. ఇక్కడ (విశ్లేషకులు ముదివర్తి కొండమాచార్యులు గారు వ్యాఖ్యానించినట్లుగా) పాండవోద్యోగ సారసర్వస్వ మనదగిన పద్యం, ఉద్యోగ పర్వానికి గుండెకాయలాంటి పద్యం ఒకటి రాశారు తిక్కన ఇలా:

ఉ:       కావున శాంతిఁ బొందుటయ కర్జము; దా నది యట్టులుండె; శ్రీ

గావలె నంచుఁ, బోరితము గామియుఁ గోరెద; మెల్లసొమ్ములుం

బోవుటయుం గులక్షయము పుట్టుటయున్‌ వెలిగాఁగ నొండుమై

నే విధినైనఁ జక్కఁబడు టెంతయు నొప్పుఁ జుమీ జనార్దనా!

         తమ విషయంలో పక్షపాతం చూపవద్దని, ధర్మం, నీతిని అనుసరించి ఇరుపక్షాలకు మేలుచేయమని, అభివృద్ధి సమకూరే రీతిలో, విదురుడు మొదలైన సత్పురుషుల మనసులకు సమ్మతమయ్యేలాగా మెత్తగా, కఠినమైన మందలింపులతో అంతా అనుగ్రహించే రీతిలో మాట్లాడు కృష్ణా అని అన్నాడు ధర్మరాజు. పెద్దలమాట దుర్యోధనుడు వినలేదనే నింద వాడిమీద వేయాలన్నాడు. కృష్ణుడు తమను ఏమార్గాన నడిపించాలని అనుకున్నాడో ఆమార్గానే నడవడం తనకు సమ్మతమని స్పష్టం చేశాడు. అన్నివిధాలా సంధి కుడుర్చుకోవడమే మంచిదని చెప్పాడు. ఇలా చెప్పి హస్తినకు వెళ్లిరమ్మన్నాడు.

         ధర్మరాజు చెప్పిందంతా విన్న శ్రీకృష్ణుడు, కౌరవులు పగ మానరని, దుర్యోధనాదులు నిందకూ, అధర్మానికీ జంకరని, ధర్మరాజు దైన్యాన్ని వదిలిపెట్టి యుద్ధం సలపాలని, శత్రుసమూహాలను జయించడం వల్ల ఇహపరసుఖాలు సమకూరుతాయని అన్నాడు. శ్రీకృష్ణుడి మాటలు పాండవుల మిత్రుడిగా, హితవరిగా, సచివుడుగా, వారు నమ్మిన భగవంతుడుగా వున్నాయి. దుర్యోధనాదుల విషయంలో కారుణ్యం, బందుభావం విడిచిపెట్టమని సలహా ఇచ్చాడు. తాను కురుసభకు వెళ్లి ధర్మరాజు  గురించి అందరికీ అర్థమయ్యేట్లు వర్ణిస్తానన్నాడు. సంధి కుదిరితే మంచిదేనని, ఒకవేళ కుదరకపోతే, కౌరవుల ప్రయత్నాలు ఎట్లా వున్నాయో, వారి సామర్థ్యం ఏపాటిదో గ్రహించి, ధర్మరాజుకు విజయం చేకూరే విధంగా మరలివస్తానని చెప్పాడు శ్రీకృష్ణుడు. ఆలస్యం చేయకుండా సమర సన్నాహాలు సాగించమని అన్నాడు.  

         దుష్టచిత్తుడైన దుర్యోధనుడు అణగి మణగి వుండే పనిని సద్భావంతో సాధించు కృష్ణా అన్నాడు భీమసేనుడు. నేర్పుతో, శక్తిమేరకు ఆ జగజెట్టిని దారిలో పెట్టడానికి ప్రయత్నించమన్నాడు కృష్ణుడిని. దుర్యోధనుడి మనోవైఖరికి అనుగుణంగా నీచత్వానికి దిగజారైనా సంధి చేసుకుంటే అదెంతో మేలని అన్నాడు భీముడు. అన్నదమ్ములమైన కౌరవపాండవులు కలహించుకోవడం చూసి లోకులు పరిహసిస్తారని, అందుకే హస్తినాపుర సామ్రాజ్యాన్ని పెద్దల మాట ప్రకారం పంచుకొని హాయిగా అనుభవించడం మేలని భీముడు తన మాటలుగా దుర్యోధనుడికి చెప్పమన్నాడు. ఎలాగైనా సంధి పొసగేటట్లు ప్రయత్నించమన్నాడు.

         భీముడు అలా మెత్తబడి మాట్లాడడం కృష్ణుడికి ఆశ్చర్యం కలిగించింది. తనదైన శైలిలో భీమసేనుడిని యుద్ధానికి పురికొల్పాడు శ్రీకృష్ణుడు. ఇలా పొంతనలేని మాటలు మాట్లాడడం భీముడికి తగునా అన్నాడు. భయం అంటే ఏమిటో తెలియని భీముడికి పిరికి మాటలు ఎవరు నేర్పారో అన్నాడు. తనకు పిరికితనం ఏమాత్రం లేదని, తాను చేసిన ప్రతిజ్ఞలు రణరంగంలో చూపిస్తానని భీముడు పౌరషంగా మాట్లాడాడు. తానేదో పరిహాసానికి అన్నానని శ్రీకృష్ణుడు సర్ది చెప్పాడు. భీముడి శక్తి-సామర్థ్యాలు తనకు తెలుసని చెప్పాడు. కౌరవులతో సంధి కుదరని పక్షాన యుద్ధంలో అన్నిటికీ ఆధారం భీముడే అన్నాడు.

         ప్రత్యేకంగా తాను చెప్పాల్సినది ఏమీలేదని, చెప్పాల్సినదంతా ధర్మరాజే చెప్పాడని, అయినా తనకు తోచిన కొన్ని మాటలు చెప్తానని అన్నాడు అర్జునుడు. కౌరవులు చేసిన దుష్కార్యాలన్నీ ఏకరువు పెట్టాడు. తరువాత, కౌరవుల దుండగాలన్నీ మన్నించి, నేర్పుగా కౌరవపాండవులు ఒకటిగా వుండేటట్లు చేయమన్నాడు. ఆ మూర్ఖులను ఎలాగైనా సంధికి ఒప్పించి పాండవులకు, కౌరవులకు రాజ్యంలో చెరిసగం వచ్చేటట్లుగా చేసి, ఉభయులు కలిసి మెలసి ఒద్దికగా జీవించే ఏర్పాటు కావించడం చాలా మంచిదని చెప్పాడు. ఆ ఏర్పాటువల్ల తమకు గౌరవం, సౌఖ్యం లభిస్తాయన్నాడు. సంధి చేసుకోవడం కృష్ణుడికి సరిపడకపోతే ఆయన ఆజ్ఞానుసారం నడుచుకుంటామని, కాబట్టి ఏది హితమో, ఏది న్యాయమో నిర్దేశించమని స్పష్టం చేశాడు అర్జునుడు. తాను తన శక్తికొలదీ సంధి సమకూర్చడానికే ప్రయత్నిస్తానని, దైవం ఏమి చేయదల్చాడో చెప్పలేమని అన్నాడు శ్రీకృష్ణుడు.

         ధర్మరాజు, భీమార్జునులు చెప్పినవి వట్టి మాటలు కావని, ఒకప్పటిలాగా తమ మనస్సులు ఇప్పుడు ప్రతీకారేచ్చతో లేవని, కృష్ణుడు వెళ్లిన కార్యం సఫలమవుతుందని నకులుడు అన్నాడు. అందరిలో చిన్నవాడైన సహదేవుడు అభిమానధనుడు. సందిమాటలు అతడికి సరిపడలేదు. ధర్మరాజాదుల అభిప్రాయాన్ని కాదన్నాడు. పౌరుషోక్తులు పలికాడు. ధర్మజాదులు దైన్యానికి దిగజారడం ఊహించని విషయం అన్నాడు. ధర్మరాజు రాజ్యభాగం యాచించడం, దానిని శ్రీకృష్ణుడు అడగబోవడం, కౌరవులు భాగం ఇవ్వకుండా పోరాడుతామని అనబోవడాన్ని ఆక్షేపించాడు. తనకు వంకర మాటలు రావని, రాజ్యభాగం ఇవ్వకపోతే యుద్ధమే పాండవులకు తగినదని తన మాటలుగా చెప్పమన్నాడు సహదేవుడు.

         భీమార్జున నకులులు ధర్మరాజు అభిప్రాయాన్ని కాదనలేక, ఔను అనలేక, ఎటూ కాకుండా మాట్లాడారు. సహదేవుడు తాను చెప్పాలనుకున్నది సూటిగా చెప్పాడు. సహదేవుడి మాటలను సాత్యకి సమర్థిస్తూ యుద్ధమే మంచిదన్నాడు. అక్కడున్న వారంతా కూడా సహదేవుడి మాటలను, సాత్యకి సమర్థనను మెచ్చుకున్నారు. అప్పుడు అక్కడే వున్న ద్రౌపదీదేవి కోపించి మెల్లగా శ్రీకృష్ణుడిని చూసి మాట్లాడసాగింది. ధర్మారాజు మాటలు ఆమెకు మనస్తాపాన్ని కలిగించాయి.

         ‘కౌరవులు అంతటి అకృత్యాలు చేసి, అడవులకు తరిమేసి, ఇప్పుడు సంజయుడితో రాయబారం చేస్తారా? ధర్మనందనుడు ఆయన మాటలకు మనసులో ఉబ్బిపోతాడా? సుయోధనుడు తనకు తానుగా ఐదుమంది అన్నదమ్ములకు ఐదూళ్లు ఇస్తాడా?’ అంటుంది ద్రౌపది. పాండవులు రాజ్యంలో భాగం తీసుకోకుండా కౌరవులతో పొత్తుకు అంగీకరిస్తే వారిని లోకులు అసమర్థుల కింద, అవివేకుల కింద జమకట్టరా? అని అడుగుతుంది. బాగా ఆలోచిస్తే సంధి కౌరవులకే లాభం అంటుంది. ఇంత చెప్పిన తరువాత, ధర్మరాజు, అతడి తమ్ములు ఏది యుక్తమని భావిస్తారో దాన్నే కృష్ణుడు నేర్పుగా తెలియచేసి కౌరవులతో పొత్తు కుదుర్చుకొమ్మన్నది.

ఈ సందర్భంలో ద్రౌపదీదేవి అన్న మాటలు తిక్కన రెండు చక్కటి పద్యాలలో రాశారు ఇలా:

         చ:       వరమున బుట్టితిన్, భరతవంశము జొచ్చితి, నందు బాండు భూ

వరునకు గోడలైతి జనవంద్యుల బొందితి , నీతి విక్రమ

స్థిరులగు పుత్రులం బడసితిన్ , సహజన్ముల ప్రాపు గాంచితిన్

సరసిజనాభ! యిన్ని ట ప్రశస్తికి నెక్కిన దాన నెంతయున్

           ఉ:       నీవు సుభద్ర కంటె గడు నెయ్యము గారవముందలిర్ప సం

భావన సేయు దిట్టినను బంకజనాభ ! యొకండు రాజసూ

యావబృధంబు నందు శుచియై పెనుపొందిన వేణివట్టి యీ

యేవురు జూడగా సభకు నీడ్చె-గులాంగన నిట్లొనర్తురే   

తాను దేవతావర ప్రసాదం వల్ల జన్మించిన విషయం, భరత వంశంలోకి మెట్టిన విషయం దగ్గరనుండి, ఎలా శ్రీకృష్ణుడు తన సొంత చెల్లెలు సుభద్ర కంటే తనను ఎక్కువగా ఆదరించే విషయం చెప్పి, కౌరవ సభలో తనకు జరిగిన పరాభవం గురించి, ఒంటి చీరెతో బలాత్కారంగా దుశ్శాసనుడు లాగి తెచ్చిన సంగతి, తన కురులు సగం తెగిపోయిన విషయం చెప్పి, ఇవన్నీ సంధి కుదిరించే సమయంలో గుర్తుంచుకొమ్మన్నది కృష్ణుడిని. దుశ్శాసనుడి తెగిపోయిన హస్తం, దుర్యోధనుడి శవం కళ్ళారా చూడడానికి నోచుకోకపోతే భీమార్జునుల శౌర్యం తగులబెట్టనా? అన్నది.

శ్రీకృష్ణుడు ద్రౌపదిని ఓదార్చి, తానుండగా శోకించవద్దని అంటూ, తనకు భీమార్జునులు సాయపడగా, ధర్మరాజు ఆజ్ఞాపించగా, ఆమె సంతోషించే విధంగా శత్రువులను నిర్మూలిస్తానని, మరో మార్గం లేదని చెప్పాడు. ఆమె ఎంతగా విలపించిందో అదే మోతాదులో దుర్యోధనాదుల భార్యలు కూడా విలపిస్తారని, వారి ఏడ్పులు విని ద్రౌపది పకపక నవ్వే సమయం సమీపించిందని అన్నాడు. కౌరవులకు సంధికి సంబంధించిన సౌమ్య వాక్యాలు సమ్మతాలు కావన్నాడు. పాండవుల మిక్కుటమైన వైభవాన్ని ద్రౌపది దర్శించగలదని చెప్పాడు. ఇలా శ్రీకృష్ణుడు ద్రౌపదీదేవిని సాంత్వన వచనాలతో ఓదార్చాడు.

ఆ తరువాత ధర్మరాజు కృష్ణుడిని కౌరవ సభకు పంపడానికి తీర్మానించాడు. మర్నాడే శ్రీకృష్ణుడి జన్మ నక్షత్రం ప్రకారం మంచిరోజన్నాడు. ధర్మరాజు ఆదేశానుసారం మర్నాడు సాత్యకిని వెంటబెట్టుకుని, ఆయుధాలను తీసుకుని కృష్ణుడు హస్తినకు బయల్దేరాడు. ఆయన వెళ్తుంటే మార్గమధ్యంలో నారదుడు, జమదగ్ని, కణ్వుడు మొదలైన మహర్షులు కనిపించారాయనకు. వారంతా,  కౌరవ సభలో శ్రీకృష్ణుడి మాటలు వినడానికి హస్తినాపురానికి వస్తామన్నారు. సరేనన్నాడు శ్రీకృష్ణుడు.   

కవిత్రయ విరచిత

శ్రీమదాంధ్ర మహాభారతం, ఉద్యోగపర్వం, తృతీయాశ్వాసం

(తిరుమల, తిరుపతి దేవస్థానాల ప్రచురణ)

    

  

Sunday, December 19, 2021

మిథిలకు పోతున్న శ్రీరామ లక్ష్మణ విశ్వామిత్రులు ..... శ్రీ మదాంధ్ర వాల్మీకి రామాయణం బాలకాండ మందర మకరందం-86 : వనం జ్వాలా నరసింహారావు

 మిథిలకు పోతున్న శ్రీరామ లక్ష్మణ విశ్వామిత్రులు

శ్రీ మదాంధ్ర వాల్మీకి రామాయణం బాలకాండ మందర మకరందం-86

వనం జ్వాలా నరసింహారావు

సూర్యదినపత్రిక (20-12-2021)

విశ్వామిత్రుడు ముందు నడుస్తుంటే, తమ్ముడితో కలిసి శ్రీరాముడు ఈశాన్య దిక్కుగా పోతూ, జనకుడు యజ్ఞం చేస్తున్న నందమనే ప్రదేశాన్ని చూశాడు. యజ్ఞానికి కావల్సిన సంభారాలు మిక్కిలి శ్లాఘ్యంగా వున్నాయని, నానా దేశాలనుండి బ్రాహ్మణ శ్రేష్టులు-వేదాధ్యయనంలో ప్రీతిగలవారు వేలాదిమంది వచ్చారని, గొప్ప ఋషీశ్వరులుండే ప్రదేశాలన్నీ వందలాది బండ్లతో నిండి వున్నాయని, ఇలాంటి ప్రదేశంలో తమెక్కడుండాలో చెప్పమని విశ్వామిత్రుడిని అడిగాడు రామచంద్రమూర్తి. జలసమృద్ధిగలిగి-సందడిలేని ఒక ప్రదేశాన్ని చూపించి, అందరం అక్కడుండేందుకు ఏర్పాట్లు చేయిస్తానంటాడు విశ్వామిత్రుడు. ముని శ్రేష్ఠుడైన విశ్వామిత్రుడొచ్చాడని తెలుసుకున్న జనక మహారాజు తన పురోహితుడైన శతానందుడుతో కలిసి వారున్న ప్రదేశానికి వచ్చాడు. వచ్చిన వెంటనే జనకుడు విశ్వామిత్రుడిని సేవించడంలో నిమగ్నమై వుండగా, ఋత్విజులొచ్చి, మునీశ్వరుడికి అర్ఘ్యం-పాద్యం ఇచ్చారు. వాటిని గ్రహించిన ముని, రాజు క్షేమ సమాచారాన్ని, యజ్ఞం చక్కగా జరుగుతున్న విషయాన్ని గురించి ప్రశ్నించి, అక్కడున్న ఋషీశ్వరులను గౌరవంగా పలకరించాడు. ఇలా సంభాషిస్తున్న విశ్వామిత్రుడిని, ఇతర మునీశ్వరుల సరసన ఆయనకు కేటాయించిన ఆసనం మీద ఆయన ఇష్టప్రకారం కూర్చోమని ప్రార్థించాడు జనకుడు. రాజును కూడా ఆయన ఆసనం పై కూర్చోమని కోరాడు విశ్వామిత్రుడు. జనకుడు ఋత్విక్కులతో, మంత్రులతో, పురోహితులతో ఆసనాలపై కూర్చొని విశ్వామిత్రుడితో సంభాషించాడు. 

"మునీంద్రా, నిన్ను దర్శించడం వల్ల నేను చేస్తున్న యజ్ఞ పుణ్యపలం నాకు ఈ రోజే లభించినట్లయింది. నిజానికి నీరాకతోనే, యజ్ఞానికై సమకూర్చుకున్న పదార్థాలన్నిటినీ దేవతలు పవిత్రం చేసారు నేడు. నీ అనుగ్రహంవల్ల నా జన్మ సార్థకమయింది. యజ్ఞం పూర్తి కావడానికి ఇంకా పన్నెండు రోజులుందని ఋత్విజులంటున్నారు. దాంతర్వాత హవిర్భాగం తీసుకునేందుకు దేవతలొస్తారు. వారిని దర్శించుకునేంతవరకు మీరిక్కడే వుండండి" అని పలికి జనకుడు, ఆయనవెంట వున్న రామ లక్ష్మణులెవరని ప్రశ్నించాడు. వారు, దోషరహితమైన పరాక్రమంగలవారని, దశరథ మహారాజు కొడుకులని జవాబిచ్చాడు. రామ లక్ష్మణులేవిధంగా తన యజ్ఞాన్ని రక్షించేందుకు క్రూరులైన రాక్షసులను చంపారోనన్న విషయాన్ని, విశాల నగరాన్ని చూసిన విషయాన్ని, అహల్యకు శాప విమోచనం కలిగించిన విషయాన్ని, గౌతమ మహర్షిని కలిసిన సంగతిని కూడా చెప్పిన తర్వాత, విశ్వామిత్రుడు, వారిద్దరూ ఆయన దగ్గరున్న శివ ధనుస్సును చూసేందుకొచ్చారని అంటాడు.

Saturday, December 18, 2021

తన రాయబార సారాన్ని ధృతరాష్ట్రుడికి వివరించిన సంజయుడు ...... ఆస్వాదన-51 : వనం జ్వాలా నరసింహారావు

 తన రాయబార సారాన్ని ధృతరాష్ట్రుడికి వివరించిన సంజయుడు

ఆస్వాదన-51

వనం జ్వాలా నరసింహారావు

సూర్యదినపత్రిక, ఆదివారం సంచిక (19-12-2021)

రాయబారిగా సంజయుడు ఉపప్లావ్యం నుండి తిరిగి వచ్చిన తరువాత ధృతరాష్ట్ర మహారాజుకు అక్కడి విశేషాల తాత్పర్యాన్ని సంగ్రహంగా నివేదించాడు. ఇదొక ప్రాథమిక నివేదిక లాంటిది. ధృతరాష్ట్రుడు పంపగా వెళ్లి ధర్మరాజును చూసి వచ్చానని, పెదనాన్నగారికి ధర్మరాజు నమస్కరించి తనకు తగిన మర్యాద చేశాడని, కౌరవుల క్షేమ సమాచారం అడిగాడని చెప్పాడు. మరిన్ని వివరాలు చెప్పమని అంటూ ధృతరాష్ట్రుడు, రాయబారిగా సంజయుడు ఎంతవరకు కృతకృత్యుడయ్యాడో తెలుసుకునే ప్రయత్నం చేశాడు. పుణ్యపాపాలను ధర్మరాజు ధృతరాష్ట్రుడి మీదే పెట్టాడని, నిర్ణయం తీసుకోవాల్సింది ధృతరాష్ట్రుడే అని స్పష్టం చేశాడని, తండ్రి నిర్ణయమే దైవ నిర్ణయంగా భావిస్తానన్నాడని సంజయుడు చెప్పాడు. ధర్మరాజు మాటల సారాంశాన్ని చెప్పి తన మాటలుగా ధృతరాష్ట్రుడితో ఇలా అన్నాడు సంజయుడు.

‘నువ్వు నీకొడుకు కోరినట్లే కాని ఇంకో విధంగా ఆలోచించవు. కార్య నిర్ణయం కర్ణ, శకునుల వశం. నీ విధానం ఏమీ బాగుండదు. నువ్వొక్కడివే కొడుకులను కన్నావా? వాళ్లు అపమార్గంలో పోతుంటే బుద్ధి చెప్పకుండా గుడ్లప్పగించి చూస్తుంటారా? దుశ్శాసనుడు, శకుని మాత్సర్యంతో మిమ్మల్ని పట్టుకుని ఎలా ఆడిస్తే అలా బొమ్మల్లాగా నువ్వూ, దుర్యోధనుడు ఆడుతున్నారు. పాండవులే కనుక విసిగిపోయి కోపానికొస్తే ఒక్క చిటికలో నీ చలాన్నీ, నీ బలాన్నీ, కులాన్నీ నేలమట్టం చేస్తారు. పరమసాధువైన ధర్మరాజు కోపంతో విజృంభించితే నిన్ను సర్వనాశనం చేయక మానడు. మాయాద్యూతం ఆడినప్పుడే అన్యాయం జరిగింది, కౌరవులకు కీడు మూడింది. అప్పుడు నువ్వు ఉపేక్షతో మాట్లాడకుండా వుండడమే నువ్వు చేసిన పెద్ద తప్పు’. ఇలా చెప్పి సంజయుడు తనకు బడలికగా వున్నదని అంటూ, మర్నాడు మరింత వివరంగా మాట్లాడుదామన్నాడు.

ఆ తరువాత విడురుడిని పిలిచి తన మనసులోని బాధను ఆయనకు చెప్పుకున్నాడు ధృతరాష్ట్రుడు. తండ్రీకొడుకులు ధర్మరాజాదులను అన్యాయంగా బాధించారని, ఇకనైనా వాళ్లకు న్యాయంగా ఇవ్వాల్సిన భాగాన్ని పంచి ఇవ్వమని విదురుడు సలహా ఇచ్చాడు. ధృతరాష్ట్రుడికి విదురుడు పలుపలు రకాల హితబోధ చేశాడు. ధర్మరాజాదులను రప్పించి, న్యాయంగా వారి భాగం వారికిచ్చి, ధృతరాష్ట్రుడి కొడుకులతో సమానంగా వారిని చూడడం మంచిదన్నాడు. వాళ్లు బతకడానికి కొన్ని చిన్న పల్లెలయినా దుర్యోధనుడిని ఒప్పించి కేటాయించి సంధి చేస్తే మంచిదని అన్నాడు. కౌరవపాండవులు ఒక్కటైతే వారికేసి దేవతలు కూడా తేరిపార చూడలేరు అని అన్నాడు విదురుడు ధృతరాష్ట్రుడిని ఉద్దేశించి. ఇలా చేయడమే ధృతరాష్ట్రుడి కర్తవ్యమని, అదే ధృతరాష్ట్రుడికి మనశ్శాంతి ఇస్తుందని చెప్పాడు. ఈ మాటలు ధృతరాష్ట్రుడికి మింగుడు పడలేదు.

విదురుడు చెప్పిన మాటలు కల్మషం లేనివని, నేర్పరులు సమ్మతించేవని, రాజనీతి మార్గాన్ని బోధించేవని, అయినా కొడుకును విడవలేనని, ‘ధర్మం జయిస్తుందని చూస్తూ వుంటానని అన్నాడు ధృతరాష్ట్రుడు. జవాబుగా విదురుడు, ధృతరాష్ట్రుడిని బాగా ఆలోచించుకొమ్మని, ధర్మరాజును విడనాడవద్దని, మనసు గట్టిపరచుకుని కొడుకులకు, మంత్రులకు సంధి అయ్యే విధం చెప్పి అభ్యుదయం కలిగే విధంగా చూడమని అన్నాడు. విదురుడి మాటలవల్ల తన మనస్సు నిర్మలమై తేరుకున్నానని, ఆయన చెప్పినట్లే చేస్తానని, అదే చేయతగినదని అన్నాడు ధృతరాష్ట్రుడు. ధృతరాష్ట్రుడి మనసు మారినందుకు సంతోషించాడు విదురుడు.

మర్నాడు సూర్యోదయం కాగానే కాలకృత్యాల అనంతరం తగిన విధంగా అలంకరించుకుని ధృతరాష్ట్రుడు సభాస్థలానికి వెళ్లి నిండు సభ తీర్చాడు. భీష్మ, ద్రోణ, కృప, కృతవర్మ లాంటి పెద్దలు, దుర్యోధన దుశ్శాసనులు, ఇతర పరిజనులు ఆసీనులయ్యారు. సంజయుడు సభలో ప్రవేశించాడు. ఉపప్లావ్యపురంలో జరిగిన విశేషాలను వివరించాడు. ధర్మరాజాదులను, శ్రీకృష్ణుడిని కలిసి వారితో మాట్లాడిన సంగతి, వారి స్పందన తెలియచేశాడు.

కృష్ణుడి మాటలుగా ఇలా చెప్పాడు: ‘సంజయా! అజాతశత్రుడికి కోపం రావడం అంటే నీళ్లలో నిప్పు పుట్టడం లాంటిదే. దానిని ఆర్పడానికి మీకు ఉపాయం లేదు. మీరు చేయదలచుకున్న పనులన్నీ పూర్తి చేసి ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని యుద్ధానికి బయల్దేరండి. నేను రథం తోలుతుంటే గాండీవాన్ని ధరించిన అర్జునుడు యుద్ధానికి వస్తాడు అప్పుడు మీరెక్కడికి పోతారు?’.

అర్జునుడి మాటలుగా ఇలా చెప్పాడు సంజయుడు: ‘ధర్మరాజు భాగం ఇమ్మని అడిగితే ఇవ్వకపోతే, మేము ఇంకొక మాట అనడం ఎందుకు? ఇంతకు ముందు దుర్యోధనుడు మహాగర్వంతో చేసిన పనులన్నిటికీ నేను, భీముడు సమాధానం చెప్తాం. దుర్యోధనుడు మాతో యుద్ధం చేయడానికి అంగీకరిస్తే ఇక మాకు కావాల్సింది ఏమున్నది? ధర్మరాజు అనుకున్నది నెరవేరినట్లే కదా? మా పక్షాన వున్న నకులుడు, సహదేవుడు, సాత్యకి, అభిమన్యుడు, ఉపపాండవులు, ద్రుపదుడు, ధృష్టద్యుమ్నుడు పరాక్రమంతో యుద్ధం చేస్తుంటే కౌరవులు సంధి చేయక మానరు. మేము భీష్ముడికి, ద్రోణుడికి, కృపుడికి నమస్కరించి మా రాజ్యభాగానికై యుద్ధం చేస్తాం. మేము శ్రీకృష్ణుడిని ముందు పెట్టుకుని యుద్ధం చేస్తాం కాబట్టి ఈ యుద్ధంలో గెలుపు మాదే. కౌరవులను వధించి మా భూమి పుచ్చుకొంటాం’.

అర్జునుడు చెప్పిన సంజయుడి మాటలు విన్న భీష్ముడు దుర్యోధనుడిని చూసి, కృష్ణార్జునులు ఇద్దరూ ఏకమై యుద్ధానికి దిగుతే, నిలబడి ఎదిరించడానికి ఆ హరుడికి కూడా సాధ్యం కాదని అన్నాడు. కౌరవులకు పోగాలం దాపురించిందేమోనని, దుర్యోధనుడి హితం కోరి చెప్పే మాటలు ఇప్పుడు వినకపోతే, కురుక్షేత్ర యుద్ధ సమయంలో ‘వారు చచ్చారు, వీరు చచ్చారు అనే మాటలు వినాల్సి వస్తుందని అన్నాడు. దుర్మార్గులు, పాపులు, నీచస్వభావులైన కర్ణ, శకుని, దుశ్శాసనులు చేసే బోధలే కాని ఇంకొకటి వినడానికి దుర్యోధనుడు ఇష్టపడడని చెప్పాడు. ఆ మాటలకు కర్ణుడికి కోపం వచ్చింది. ఉత్తరగోగ్రహణ సమయంలో కర్ణుడి ఓటమిని గుర్తుకు తెచ్చాడు భీష్ముడప్పుడు. ద్రోణుడు కూడా భీష్ముడికి మద్దతుగా మాట్లాడాడు.

భీష్మద్రోణుల మాటలు మన్నించకుండా, వారికి తగిన సమాధానాలు చెప్పకుండా ధృతరాష్ట్రుడు మళ్లీ మళ్లీ సంజయుడిని పాండవుల గూర్చిన విషయాలనే ప్రశ్నించాడు. ధర్మరాజు సంధి చేసుకోవడానికే మనస్సులో కోరుతున్నాడని, ధృతరాష్ట్రుడు పాండవుల సగభాగం భూమిని ఇవ్వకపోతే తప్ప, తనంతట తానుగా ఏకీడు తలపెట్టడని, అయితే కౌరవుల బలాన్ని కొంచెం కూడా లక్ష్య పెట్టడని చెప్పాడు సంజయుడు. ధర్మారాజు సేనలో ఎవరెవరున్నది పేర్లతో సహా వివరించాడు. వారి పరాక్రమాలను ఎరుకపర్చాడు. వారంతా ప్రతీకారేచ్చతో యుద్ధానికి సిద్ధంగా వున్నారని అన్నాడు. అందరికన్నా మిన్నైన శ్రీకృష్ణుడు వారి పక్షాన ఉన్నాడని అన్నాడు. ధృతరాష్ట్రుడు అప్పుడు అంతా విని భీమసేనాదుల పరాక్రమం తలచుకుని దుఃఖపడ్డాడు. అర్జునుడి సాటిలేని పరాక్రమం కూడా తలచుకున్నాడు.

తాను విధి వశాన బిడ్డలకు నొక్కి చెప్పడం కాని, ఇలా నడవండి-ఇలా నడవకండి అని ఆజ్ఞాపించడం కాని చేయలేకపోతున్నాను అని వాపోయాడు ధృతరాష్ట్రుడు. పాండవులతో జరిగే యుద్ధంలో వంశ నాశనం తప్పదని, శాంతి వహించడమే మేలని, తనవారికి అది ఇష్టమైతే దానికొరకు తగిన ప్రయత్నం చేస్తానని అన్నాడు. ఇప్పుడైనా మించిపోయింది లేదన్నాడు సంజయుడు. ఈ మాటలు వింటున్న దుర్యోధనుడు తండ్రితో భీష్మ, ద్రోణ, కృప, కర్ణుడు మొదలైన స్వపక్ష వీరుల సామర్థ్యం గురించి చెప్పాడు. తమ బలపరాక్రమాన్ని తక్కువ అంచనా వేయవద్దని అన్నాడు. అన్ని విధాలా యుద్ధం చేస్తామని, ఇదే తన అభిప్రాయమని, తాననుకున్నవిధంగానైనా కావాలి, కృష్ణుడు అనుకున్నట్లయినా జరగాలని, ఎలా అయినా మేలే అని, ఇదే తన నిశ్చయం అని స్పష్టం చేశాడు. భీముడిని గోప్పచేసి చెప్పడానికి అభ్యంతరం తెలుపుతూ, అతడు తనను పోలడని, గదా యుద్ధంలో తనతో సమానుడు ముల్లోకాలలోనూ కనిపించడని దుర్యోధనుడు అన్నాడు.

ఈ నేపధ్యంలో సంజయుడు ధర్మరాజు నిశ్చయాన్ని దుర్యోధనుడికి చెప్పాడు. ధర్మరాజు యుద్ధం అనగానే మూరెడు లేస్తాడని, అతడి తమ్ములు యుద్ధం అంటే పెళ్లికి పోతున్నట్లు వున్నారని అన్నాడు.  

అప్పుడు ధృతరాష్ట్రుడు దుర్యోధనుడితో,  అతడికి అతడి పరివారానికి ఈ భూమిలో సగం చాలని, తక్కిన సగ భాగం సముచితంగా ధర్మరాజుకు ఇచ్చి హాయిగా బతకమని అన్నాడు. యుద్ధం తనకే కాకుండా పెద్దలెవ్వరికీ సమ్మతం కాదని, కుంటువడని తేజస్సుకల ధర్మరాజుతో కలిసి బతకడం కౌరవజాతికి ఎంతో సంతోషం కలిగిస్తుందని చెప్పాడు. యుద్ధానికి వద్దని, పంతానికి పోవద్దని, యుద్ధంలో ఓటమిని చవిచూస్తుంటే తన మాటలు స్మరిస్తావని కొడుకుతో మళ్లీ అన్నాడు ధృతరాష్ట్రుడు. ఒకటికి పదిసార్లు భీమార్జునుల బల పరాక్రమాలను గురించి మాట్లాడాడు. భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు మొదలైనవారు పాండవులను జయించలేరని స్పష్టంగా చెప్పాడు.

మధ్యలో భీష్ముడు కలిగించుకుని కర్ణుడు ఉత్తర గోగ్రహణంలో చవిచూసిన పరాజయాన్ని గురించి మరోమారు మాట్లాడాడు.  దానికి కోపం తెచ్చుకున్న కర్ణుడు, భీష్ముడికి తన బలం తోడు లేకుండా వుండాలని, ఆయన చచ్చేదాకా తాను యుద్ధభూమిలో అడుగుపెట్టనని, అస్త్రాలను విడిచానని, భీష్ముడు చనిపోయిన తరువాత విజృంభించి తన బలపరాక్రమాలను చూపిస్తానని అంటూ శస్త్రసన్న్యాసం చేసి సభలో వుండడానికి ఇష్టపడక లేచి వెళ్లిపోయాడు.

కర్ణుడు వెళ్లిపోయిన అనంతరం ధృతరాష్ట్రుడు, కౌరవ-పాండవ సైన్యాలలో గల తరతమ భావాలను, యుద్ధం వస్తే ఎవరు గెలుస్తారో అనే విషయాన్ని గురించి సంజయుడిని అడిగాడు. ఆయన తండ్రి వ్యాసుడే ఆ విషయాన్ని చెప్పడానికి సమర్థుడని సంజయుడు చెప్పగానే ధృతరాష్ట్రుడు గాంధారీ సమేతంగా తన తండ్రిని స్మరించుకున్నాడు. వెంటనే వేదవ్యాసుడు ప్రత్యక్షమయ్యాడు.  ధృతరాష్ట్రుడు సంజయుడిని అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చాడు వ్యాసుడు.

పాండవుల సేనకు, కౌరవుల సేనకు ధృతరాష్ట్రుడు తారతమ్యం అడిగాడని, పాండవుల సేనలో వున్న కృష్ణుడికి కౌరవ సేనలో సమానుడైన వాడెవరైనా వున్నారా అని ధృతరాష్ట్రుడిని ప్రశ్నించాడు వ్యాసుడు. కృష్ణుడి మహాపరాక్రమం సుప్రసిద్ధమే కదా అని అన్నాడు. పాండవులకు కృష్ణుడే పరాక్రమమూ, ప్రాణమూ అన్నాడు. లోకాలన్నీ ఒక పక్షాన, కృష్ణుడు ఒక్కడూ ఒక పక్షాన నిలిస్తే గెలుపు కృష్ణుడి పక్షానిదే కదా అన్నాడు. కృష్ణుడున్న చోటనే జయం కలుగుతుందని, అధర్మపరులైన దుర్యోధనాదులను ఆ మహాత్ముడు శిక్షించాలనుకున్నాడని, ఇది తథ్యం అని చెప్పాడు వ్యాసుడు. ఇంత జరిగినా దుర్యోధనుడు ఎవరిమాటా వినలేదు.

సంజయుడి మాట చొప్పున కృష్ణుడిని ఆశ్రయించమని, మనో నిగ్రహమే ఆ వాసుదేవుడిని పొందడానికి ఉపాయమని వ్యాసుడన్నాడు. తాను వాసుదేవుడిని శరణుజొచ్చి బతుకుతానని ధృతరాష్ట్రుడు వ్యాసుడికి నమస్కరిస్తూ అనగానే, ఆయన్ను దీవించి అదృశ్యమయ్యాడు వ్యాసుడు. 

కవిత్రయ విరచిత

శ్రీమదాంధ్ర మహాభారతం, ఉద్యోగపర్వం, ద్వితీయాశ్వాసం

(తిరుమల, తిరుపతి దేవస్థానాల ప్రచురణ)