తన రాయబార సారాన్ని ధృతరాష్ట్రుడికి వివరించిన సంజయుడు
ఆస్వాదన-51
వనం జ్వాలా నరసింహారావు
సూర్యదినపత్రిక, ఆదివారం సంచిక (19-12-2021)
రాయబారిగా
సంజయుడు ఉపప్లావ్యం నుండి తిరిగి వచ్చిన తరువాత ధృతరాష్ట్ర మహారాజుకు అక్కడి
విశేషాల తాత్పర్యాన్ని సంగ్రహంగా నివేదించాడు. ఇదొక ప్రాథమిక నివేదిక లాంటిది.
ధృతరాష్ట్రుడు పంపగా వెళ్లి ధర్మరాజును చూసి వచ్చానని, పెదనాన్నగారికి ధర్మరాజు నమస్కరించి తనకు తగిన
మర్యాద చేశాడని, కౌరవుల క్షేమ సమాచారం అడిగాడని
చెప్పాడు. మరిన్ని వివరాలు చెప్పమని అంటూ ధృతరాష్ట్రుడు, రాయబారిగా సంజయుడు
ఎంతవరకు కృతకృత్యుడయ్యాడో తెలుసుకునే ప్రయత్నం చేశాడు. పుణ్యపాపాలను ధర్మరాజు
ధృతరాష్ట్రుడి మీదే పెట్టాడని,
నిర్ణయం తీసుకోవాల్సింది ధృతరాష్ట్రుడే అని స్పష్టం చేశాడని, తండ్రి నిర్ణయమే దైవ నిర్ణయంగా
భావిస్తానన్నాడని సంజయుడు చెప్పాడు. ధర్మరాజు మాటల సారాంశాన్ని చెప్పి తన మాటలుగా
ధృతరాష్ట్రుడితో ఇలా అన్నాడు సంజయుడు.
‘నువ్వు
నీకొడుకు కోరినట్లే కాని ఇంకో విధంగా ఆలోచించవు. కార్య నిర్ణయం కర్ణ, శకునుల వశం. నీ విధానం ఏమీ బాగుండదు.
నువ్వొక్కడివే కొడుకులను కన్నావా? వాళ్లు అపమార్గంలో పోతుంటే బుద్ధి చెప్పకుండా
గుడ్లప్పగించి చూస్తుంటారా?
దుశ్శాసనుడు, శకుని మాత్సర్యంతో మిమ్మల్ని
పట్టుకుని ఎలా ఆడిస్తే అలా బొమ్మల్లాగా నువ్వూ, దుర్యోధనుడు ఆడుతున్నారు. పాండవులే కనుక
విసిగిపోయి కోపానికొస్తే ఒక్క చిటికలో నీ చలాన్నీ, నీ బలాన్నీ, కులాన్నీ నేలమట్టం చేస్తారు.
పరమసాధువైన ధర్మరాజు కోపంతో విజృంభించితే నిన్ను సర్వనాశనం చేయక మానడు. మాయాద్యూతం
ఆడినప్పుడే అన్యాయం జరిగింది, కౌరవులకు కీడు మూడింది. అప్పుడు నువ్వు ఉపేక్షతో
మాట్లాడకుండా వుండడమే నువ్వు చేసిన పెద్ద తప్పు’. ఇలా చెప్పి సంజయుడు తనకు బడలికగా
వున్నదని అంటూ, మర్నాడు మరింత వివరంగా
మాట్లాడుదామన్నాడు.
ఆ తరువాత
విడురుడిని పిలిచి తన మనసులోని బాధను ఆయనకు చెప్పుకున్నాడు ధృతరాష్ట్రుడు. తండ్రీకొడుకులు
ధర్మరాజాదులను అన్యాయంగా బాధించారని, ఇకనైనా వాళ్లకు న్యాయంగా ఇవ్వాల్సిన భాగాన్ని పంచి ఇవ్వమని విదురుడు
సలహా ఇచ్చాడు. ధృతరాష్ట్రుడికి విదురుడు పలుపలు రకాల హితబోధ చేశాడు. ధర్మరాజాదులను
రప్పించి, న్యాయంగా వారి భాగం వారికిచ్చి, ధృతరాష్ట్రుడి కొడుకులతో సమానంగా వారిని చూడడం
మంచిదన్నాడు. వాళ్లు బతకడానికి కొన్ని చిన్న పల్లెలయినా దుర్యోధనుడిని ఒప్పించి
కేటాయించి సంధి చేస్తే మంచిదని అన్నాడు. కౌరవపాండవులు ఒక్కటైతే వారికేసి దేవతలు కూడా
తేరిపార చూడలేరు అని అన్నాడు విదురుడు ధృతరాష్ట్రుడిని ఉద్దేశించి. ఇలా చేయడమే
ధృతరాష్ట్రుడి కర్తవ్యమని,
అదే ధృతరాష్ట్రుడికి మనశ్శాంతి ఇస్తుందని చెప్పాడు. ఈ మాటలు ధృతరాష్ట్రుడికి
మింగుడు పడలేదు.
విదురుడు
చెప్పిన మాటలు కల్మషం లేనివని,
నేర్పరులు సమ్మతించేవని,
రాజనీతి మార్గాన్ని బోధించేవని,
అయినా కొడుకును విడవలేనని,
‘ధర్మం జయిస్తుందని’ చూస్తూ వుంటానని అన్నాడు
ధృతరాష్ట్రుడు. జవాబుగా విదురుడు,
ధృతరాష్ట్రుడిని బాగా ఆలోచించుకొమ్మని, ధర్మరాజును విడనాడవద్దని, మనసు గట్టిపరచుకుని కొడుకులకు, మంత్రులకు సంధి అయ్యే విధం చెప్పి అభ్యుదయం
కలిగే విధంగా చూడమని అన్నాడు. విదురుడి మాటలవల్ల తన మనస్సు నిర్మలమై తేరుకున్నానని, ఆయన చెప్పినట్లే చేస్తానని, అదే చేయతగినదని
అన్నాడు ధృతరాష్ట్రుడు. ధృతరాష్ట్రుడి మనసు మారినందుకు సంతోషించాడు విదురుడు.
మర్నాడు సూర్యోదయం
కాగానే కాలకృత్యాల అనంతరం తగిన విధంగా అలంకరించుకుని ధృతరాష్ట్రుడు సభాస్థలానికి
వెళ్లి నిండు సభ తీర్చాడు. భీష్మ, ద్రోణ, కృప, కృతవర్మ లాంటి పెద్దలు, దుర్యోధన దుశ్శాసనులు, ఇతర పరిజనులు
ఆసీనులయ్యారు. సంజయుడు సభలో ప్రవేశించాడు. ఉపప్లావ్యపురంలో జరిగిన విశేషాలను
వివరించాడు. ధర్మరాజాదులను,
శ్రీకృష్ణుడిని కలిసి వారితో మాట్లాడిన సంగతి, వారి స్పందన తెలియచేశాడు.
కృష్ణుడి
మాటలుగా ఇలా చెప్పాడు: ‘సంజయా! అజాతశత్రుడికి కోపం రావడం అంటే నీళ్లలో నిప్పు
పుట్టడం లాంటిదే. దానిని ఆర్పడానికి మీకు ఉపాయం లేదు. మీరు చేయదలచుకున్న పనులన్నీ
పూర్తి చేసి ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని యుద్ధానికి
బయల్దేరండి. నేను రథం తోలుతుంటే గాండీవాన్ని ధరించిన అర్జునుడు యుద్ధానికి వస్తాడు
అప్పుడు మీరెక్కడికి పోతారు?’.
అర్జునుడి
మాటలుగా ఇలా చెప్పాడు సంజయుడు: ‘ధర్మరాజు భాగం ఇమ్మని అడిగితే ఇవ్వకపోతే, మేము ఇంకొక మాట అనడం ఎందుకు? ఇంతకు ముందు దుర్యోధనుడు మహాగర్వంతో చేసిన
పనులన్నిటికీ నేను, భీముడు సమాధానం చెప్తాం. దుర్యోధనుడు
మాతో యుద్ధం చేయడానికి అంగీకరిస్తే ఇక మాకు కావాల్సింది ఏమున్నది? ధర్మరాజు అనుకున్నది నెరవేరినట్లే కదా? మా పక్షాన వున్న నకులుడు, సహదేవుడు, సాత్యకి, అభిమన్యుడు, ఉపపాండవులు, ద్రుపదుడు, ధృష్టద్యుమ్నుడు
పరాక్రమంతో యుద్ధం చేస్తుంటే కౌరవులు సంధి చేయక మానరు. మేము భీష్ముడికి, ద్రోణుడికి, కృపుడికి నమస్కరించి మా రాజ్యభాగానికై యుద్ధం
చేస్తాం. మేము శ్రీకృష్ణుడిని ముందు పెట్టుకుని యుద్ధం చేస్తాం కాబట్టి ఈ యుద్ధంలో
గెలుపు మాదే. కౌరవులను వధించి మా భూమి పుచ్చుకొంటాం’.
అర్జునుడు
చెప్పిన సంజయుడి మాటలు విన్న భీష్ముడు దుర్యోధనుడిని చూసి, కృష్ణార్జునులు ఇద్దరూ ఏకమై యుద్ధానికి
దిగుతే, నిలబడి ఎదిరించడానికి ఆ హరుడికి కూడా సాధ్యం కాదని అన్నాడు. కౌరవులకు
పోగాలం దాపురించిందేమోనని,
దుర్యోధనుడి హితం కోరి చెప్పే మాటలు ఇప్పుడు వినకపోతే, కురుక్షేత్ర యుద్ధ సమయంలో ‘వారు చచ్చారు, వీరు చచ్చారు’ అనే మాటలు వినాల్సి వస్తుందని అన్నాడు.
దుర్మార్గులు, పాపులు, నీచస్వభావులైన కర్ణ, శకుని, దుశ్శాసనులు చేసే బోధలే కాని ఇంకొకటి
వినడానికి దుర్యోధనుడు ఇష్టపడడని చెప్పాడు. ఆ మాటలకు కర్ణుడికి కోపం వచ్చింది.
ఉత్తరగోగ్రహణ సమయంలో కర్ణుడి ఓటమిని గుర్తుకు తెచ్చాడు భీష్ముడప్పుడు. ద్రోణుడు కూడా
భీష్ముడికి మద్దతుగా మాట్లాడాడు.
భీష్మద్రోణుల
మాటలు మన్నించకుండా, వారికి తగిన సమాధానాలు చెప్పకుండా ధృతరాష్ట్రుడు మళ్లీ మళ్లీ
సంజయుడిని పాండవుల గూర్చిన విషయాలనే ప్రశ్నించాడు. ధర్మరాజు సంధి చేసుకోవడానికే
మనస్సులో కోరుతున్నాడని,
ధృతరాష్ట్రుడు పాండవుల సగభాగం భూమిని ఇవ్వకపోతే తప్ప, తనంతట తానుగా ఏకీడు తలపెట్టడని, అయితే కౌరవుల
బలాన్ని కొంచెం కూడా లక్ష్య పెట్టడని చెప్పాడు సంజయుడు. ధర్మారాజు సేనలో
ఎవరెవరున్నది పేర్లతో సహా వివరించాడు. వారి పరాక్రమాలను ఎరుకపర్చాడు. వారంతా
ప్రతీకారేచ్చతో యుద్ధానికి సిద్ధంగా వున్నారని అన్నాడు. అందరికన్నా మిన్నైన
శ్రీకృష్ణుడు వారి పక్షాన ఉన్నాడని అన్నాడు. ధృతరాష్ట్రుడు అప్పుడు అంతా విని
భీమసేనాదుల పరాక్రమం తలచుకుని దుఃఖపడ్డాడు. అర్జునుడి సాటిలేని పరాక్రమం కూడా
తలచుకున్నాడు.
తాను విధి వశాన
బిడ్డలకు నొక్కి చెప్పడం కాని,
ఇలా నడవండి-ఇలా నడవకండి అని ఆజ్ఞాపించడం కాని చేయలేకపోతున్నాను అని వాపోయాడు
ధృతరాష్ట్రుడు. పాండవులతో జరిగే యుద్ధంలో వంశ నాశనం తప్పదని, శాంతి వహించడమే మేలని, తనవారికి అది ఇష్టమైతే దానికొరకు తగిన
ప్రయత్నం చేస్తానని అన్నాడు. ఇప్పుడైనా మించిపోయింది లేదన్నాడు సంజయుడు. ఈ మాటలు వింటున్న
దుర్యోధనుడు తండ్రితో భీష్మ,
ద్రోణ, కృప, కర్ణుడు మొదలైన స్వపక్ష వీరుల సామర్థ్యం గురించి చెప్పాడు. తమ
బలపరాక్రమాన్ని తక్కువ అంచనా వేయవద్దని అన్నాడు. అన్ని విధాలా యుద్ధం చేస్తామని, ఇదే తన అభిప్రాయమని, తాననుకున్నవిధంగానైనా కావాలి, కృష్ణుడు అనుకున్నట్లయినా జరగాలని, ఎలా అయినా మేలే అని, ఇదే తన నిశ్చయం అని స్పష్టం చేశాడు. భీముడిని
గోప్పచేసి చెప్పడానికి అభ్యంతరం తెలుపుతూ, అతడు తనను పోలడని, గదా యుద్ధంలో తనతో సమానుడు
ముల్లోకాలలోనూ కనిపించడని దుర్యోధనుడు అన్నాడు.
ఈ నేపధ్యంలో
సంజయుడు ధర్మరాజు నిశ్చయాన్ని దుర్యోధనుడికి చెప్పాడు. ధర్మరాజు యుద్ధం అనగానే
మూరెడు లేస్తాడని, అతడి తమ్ములు యుద్ధం అంటే పెళ్లికి
పోతున్నట్లు వున్నారని అన్నాడు.
అప్పుడు
ధృతరాష్ట్రుడు దుర్యోధనుడితో, అతడికి అతడి
పరివారానికి ఈ భూమిలో సగం చాలని,
తక్కిన సగ భాగం సముచితంగా ధర్మరాజుకు ఇచ్చి హాయిగా బతకమని అన్నాడు. యుద్ధం తనకే
కాకుండా పెద్దలెవ్వరికీ సమ్మతం కాదని, కుంటువడని తేజస్సుకల ధర్మరాజుతో కలిసి బతకడం కౌరవజాతికి ఎంతో సంతోషం
కలిగిస్తుందని చెప్పాడు. యుద్ధానికి వద్దని, పంతానికి పోవద్దని, యుద్ధంలో ఓటమిని
చవిచూస్తుంటే తన మాటలు స్మరిస్తావని కొడుకుతో మళ్లీ అన్నాడు ధృతరాష్ట్రుడు. ఒకటికి
పదిసార్లు భీమార్జునుల బల పరాక్రమాలను గురించి మాట్లాడాడు. భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు మొదలైనవారు పాండవులను
జయించలేరని స్పష్టంగా చెప్పాడు.
మధ్యలో భీష్ముడు
కలిగించుకుని కర్ణుడు ఉత్తర గోగ్రహణంలో చవిచూసిన పరాజయాన్ని గురించి మరోమారు మాట్లాడాడు. దానికి కోపం తెచ్చుకున్న కర్ణుడు, భీష్ముడికి తన బలం తోడు లేకుండా వుండాలని, ఆయన చచ్చేదాకా తాను యుద్ధభూమిలో అడుగుపెట్టనని, అస్త్రాలను విడిచానని, భీష్ముడు చనిపోయిన తరువాత విజృంభించి తన
బలపరాక్రమాలను చూపిస్తానని అంటూ శస్త్రసన్న్యాసం చేసి సభలో వుండడానికి ఇష్టపడక
లేచి వెళ్లిపోయాడు.
కర్ణుడు
వెళ్లిపోయిన అనంతరం ధృతరాష్ట్రుడు,
కౌరవ-పాండవ సైన్యాలలో గల తరతమ భావాలను, యుద్ధం వస్తే ఎవరు గెలుస్తారో అనే విషయాన్ని గురించి సంజయుడిని
అడిగాడు. ఆయన తండ్రి వ్యాసుడే ఆ విషయాన్ని చెప్పడానికి సమర్థుడని సంజయుడు
చెప్పగానే ధృతరాష్ట్రుడు గాంధారీ సమేతంగా తన తండ్రిని స్మరించుకున్నాడు. వెంటనే
వేదవ్యాసుడు ప్రత్యక్షమయ్యాడు.
ధృతరాష్ట్రుడు సంజయుడిని అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చాడు వ్యాసుడు.
పాండవుల సేనకు, కౌరవుల సేనకు ధృతరాష్ట్రుడు తారతమ్యం అడిగాడని, పాండవుల సేనలో వున్న కృష్ణుడికి కౌరవ సేనలో
సమానుడైన వాడెవరైనా వున్నారా అని ధృతరాష్ట్రుడిని ప్రశ్నించాడు వ్యాసుడు. కృష్ణుడి
మహాపరాక్రమం సుప్రసిద్ధమే కదా అని అన్నాడు. పాండవులకు కృష్ణుడే పరాక్రమమూ, ప్రాణమూ అన్నాడు. లోకాలన్నీ ఒక పక్షాన, కృష్ణుడు ఒక్కడూ ఒక పక్షాన నిలిస్తే గెలుపు
కృష్ణుడి పక్షానిదే కదా అన్నాడు. కృష్ణుడున్న చోటనే జయం కలుగుతుందని, అధర్మపరులైన దుర్యోధనాదులను ఆ మహాత్ముడు శిక్షించాలనుకున్నాడని, ఇది తథ్యం అని చెప్పాడు వ్యాసుడు. ఇంత జరిగినా
దుర్యోధనుడు ఎవరిమాటా వినలేదు.
సంజయుడి మాట
చొప్పున కృష్ణుడిని ఆశ్రయించమని,
మనో నిగ్రహమే ఆ వాసుదేవుడిని పొందడానికి ఉపాయమని వ్యాసుడన్నాడు. తాను వాసుదేవుడిని
శరణుజొచ్చి బతుకుతానని ధృతరాష్ట్రుడు వ్యాసుడికి నమస్కరిస్తూ అనగానే, ఆయన్ను
దీవించి అదృశ్యమయ్యాడు వ్యాసుడు.
కవిత్రయ
విరచిత
శ్రీమదాంధ్ర
మహాభారతం, ఉద్యోగపర్వం, ద్వితీయాశ్వాసం
(తిరుమల, తిరుపతి
దేవస్థానాల ప్రచురణ)
No comments:
Post a Comment