Saturday, December 4, 2021

భారతమే ఎందుకు చదవాలి? .......డా. వాణి బి వెల్దుర్తి

 భారతమే ఎందుకు చదవాలి?

డా. వాణి బి వెల్దుర్తి

నమస్తే తెలంగాణ, పుస్తక సమీక్ష, బతుకమ్మ (05-12-2021)

                రామాయణము, మహాభారతం, భాగవతం మూడు హిందువులకు ప్రామాణిక, పవిత్ర గ్రంధాలు. ఆ మూడింటిని, నాకు తెలిసి, రాసిన ఏకైక రచయిత శ్రీ వనం జ్వాలా నరసింహారావు గారు. ఆయన వాసుదాసుగారు రచించిన శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణ ఆరుకాండలను (బాల, అయోధ్య, అరణ్య, కిష్కింద, సుందర, యుద్ధ కాండలు) ఆరు పుస్తకాలుగా రాశారు. మహాకవి బమ్మెర పోతనామాత్య రచన శ్రీమద్భాగవతమును 'శ్రీమద్భాగవత కథలు' గా రాసి, ప్రచురించారు. ఇటీవల కాలంలో మహాభారతాన్ని కూడా  'కవిత్రయ విరచిత శ్రీ మదాంధ్ర మహాభారత కథలు' గా రాశారు. వీటన్నిటినీ కూడా సరళమైన, శిష్ట వ్యావహరిక భాషలో రాయడం ఆయన ప్రత్యేకత.

"వింటే భారతం వినాలి, తింటే గారెలే తినాలి" అంటారు. గారెల సంగతి పక్కన పెడితే, వింటే భారతమే ఎందుకు వినాలో తెలుసుకోవాలంటే శ్రీ వనం జ్వాలా నరసింహారావుగారు రచించిన 'కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారత కథలు' చదవాలి.

వ్యాసమహర్షి సంస్కృతంలో రాసిన మహోన్నత ఇతిహాసం శ్రీ మహాభారతం. ఈ కావ్యం పంచమ వేదంగా ప్రసిద్ధి చెందింది. దీనిని నన్నయ్య, తిక్కన్న, ఎర్రన్న తెలుగులో అనువదించారు. మొత్తం భారతం 18 పర్వాలలో ఉంది. దీనిని టీటీడీ వారు పన్నెండు వేల పేజీల నిడివిలో ప్రచురించారు. అంత పెద్ద పుస్తకాలు చదవటానికి తీరిక లేని వారు, కవిత్రయం వాడిన గ్రాంధిక భాష అర్థం కాని వారు కూడా శ్రీ మహాభారతామృతాన్ని ఆస్వాదించడానికి వీలుగా జ్వాలా నరసింహారావుగారు శ్రీ మహాభారతాన్ని ఆస్వాంతం క్లుప్తంగా, శిష్ట వ్యావహారిక (తేలిక) భాషలో సుమారు ఐదు వందల పేజీలలో రచించారు. 18 పర్వాలు 144 కథలలో మనకు అందించారు.

"ఏ పురాణం అయినా, ఇతిహాసమైన సంక్షిప్తం చేసి  రాయటం చాలా కష్టం. అయితే ఈ ప్రయత్నంలో జ్వాలా నరసింహారావు గారు సఫలీకృతం అయినారు." అన్న గరికపాటి నరసింహారావుగారి మాటలు అక్షర సత్యాలు.

 భాగవతంలో పరమ భాగవతోత్తముల కథలను శుక మహర్షి పరీక్షిత్తు మహారాజుకు వివరిస్తే, భారతంలో మార్కండేయ మహర్షి అనేక పుణ్య కథలను ధర్మరాజుకు చెప్పాడు. ఆ కథలలోని పాత్రల నడవడిక మనకు ఎన్నో ధర్మాలను బోధిస్తాయి.

మహాభారతం కేవలం కురు పాండవుల కథ, 18 రోజుల యుద్ధ విశేషాలు మాత్రమే కాదు. దీనిలో నీతి, ధర్మం, పరిపాలన విధానం, మనుషుల మధ్య ఉండవలసిన సంబంధాలు, కుటుంబ విలువలు... ఇంకా ఎన్నో ఆదర్శప్రాయమైన జీవన విధానానికి ఉపయోగపడే అంశాలు ఉన్నాయి. వేదవ్యాసుడు చెప్పినట్టు "ఇందులో ఏది ఉందో అది ఎక్కడైనా ఉంది. ఇందులో లేనిది మరెక్కడా లేదు." 

రామాయణంలో రాముడు 14 ఏళ్ల వనవాసం చేయాలని కైక కోరింది. భారతంలో జూదంలో ఓడిన పాండవులు పన్నెండేళ్ళు అరణ్యవాసం, తరువాత ఒక ఏడాది అజ్ఞాత వాసం, అంటే మొత్తం 13 ఏళ్లు రాజ్యానికి దూరంగా ఉండాలని  కౌరవులు పెట్టిన నియమం. రెండు ఇతిహాసాల్లో కూడా 14 వ ఏట యుద్ధం జరిగింది. వీటి సామీప్యం ఏమిటి అంటే జ్వాలా నరసింహారావు గారు ఇలా వివరించారు. "రామాయణ, భారతాలలో అరణ్యవాసం వెనుక ఉన్న సంబంధం 'లా ఆఫ్ పొజిషన్ ఆఫ్ ప్రాపర్టీ'. త్రేతాయుగంలో పద్నాలుగేళ్ళు, ద్వాపరయుగంలో 13 ఏళ్లు, ప్రస్తుత కాలంలో 12 ఏళ్లు మన ఆస్తి నుంచి మనం దూరంగా ఉంటే ఆ ఆస్తి మీద మన హక్కులను కోల్పోతాము. కైక, దుర్యోధనుని ఆలోచనల వెనుక ఉన్న రహస్యం ఇదే"

తనదైన శైలిలో, సరళమైన భాషలో మహాభారత రచన సాగించినా, నరసింహారావు గారు తిక్కన్న రాసిన చక్కటి పద్యాలను ఉదహరిస్తూ, వాటిమీద వివిధ ప్రముఖుల విశ్లేషణను కూడా అందించారు. ఆ పద్యాలకు అర్థాలను కూడా ఇచ్చారు. ఇది పాఠకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది.

ప్రతి పర్వాన్ని వివిధ అంశాలుగా విభజించారు. ప్రతి అంశానికి దాని సారాన్ని మొత్తం తెలిపే శీర్షికను ఇచ్చారు. 18 రోజుల యుద్ధాన్ని, రోజువారీగా శీర్షికలను ఇస్తూ, ఆ రోజు జరిగిన యుద్ధ విశేషాలను క్లుప్తంగా, సవివరంగా వర్ణించగలగటం తిక్కన భారతం మీద జ్వాలా నరసింహారావు గారికి ఉన్న అవగాహనకు పరాకాష్ట.

'ధర్మం ఎక్కడ ఉంటే జయం అక్కడే' అన్న ధర్మాన్ని మహాభారత యుద్ధం మరోసారి నిరూపించింది.

యుద్ధానంతరం రాజ ధర్మాలను, నీతులను భీష్ముడి దగ్గర ధర్మరాజు తెలుసుకున్నాడు. భారతంలోని ఈ భాగం వర్ణాశ్రమ ధర్మాలు, రాజ్య పరిపాలన నియమాలు, రాజధర్మాలు, యుద్ధనీతి మొదలగు ఎన్నో ధర్మాలను వివరిస్తుంది. మానవాళి నిత్య సత్ ప్రవర్తనకు సంబంధించిన అంశాలను కూడా భీష్ముడు ధర్మరాజుకు తెలియజేశాడు. ఉత్తమమైన ధర్మం నిజం చెప్పటమని, పాపాలన్నింటికి మూలం పేరాశ అని, పాపపుణ్యాలు నరుడిని వదలవని, ఇంద్రియ నిగ్రహం అత్యవసరమని, దైవ ధ్యాన పద్ధతిని, మోక్ష మార్గాన్ని కూడా భీష్ముడు వివరించాడు. విష్ణు సహస్ర నామాలను, శివ నామాలను, 'ఓం నమో నారాయణాయ' అనే మంత్ర మహిమను భీష్ముడు వివరించాడు.

మన జీవితంలో పాటించవలసిన సమస్త ధర్మాలను మహాభారతం మనకు తెలియజేస్తుంది. పెద్దవాళ్లు, చిన్న వాళ్ళు అనే తేడా లేకుండా ప్రతివారు చదివి, అర్థం చేసుకొని, ఆచరించవలసిన పుస్తకం జ్వాలా నరసింహారావు గారు రచించిన 'కవిత్రయ విరచిత  శ్రీమదాంధ్ర మహాభారత కథలు'. వారి రచన శైలి మనం మొదటి పేజీ చదవటం మొదలు పెడితే చివరి పేజీ వరకు చదివిస్తుంది.

No comments:

Post a Comment