Saturday, December 4, 2021

దుర్యోధనుడి పక్షాన చేరిన శల్యుడు ధర్మరాజుకు చెప్పిన నహుషుడి వృత్తాంతం ..... ఆస్వాదన-49 : వనం జ్వాలా నరసింహారావు

 దుర్యోధనుడి పక్షాన చేరిన శల్యుడు ధర్మరాజుకు చెప్పిన నహుషుడి వృత్తాంతం

ఆస్వాదన-49

వనం జ్వాలా నరసింహారావు

సూర్యదినపత్రిక (05-12-2021) 

పాండవులకు సహాయం చేయడానికి శల్యుడు వస్తున్నాడనే వార్త విన్న దుర్యోధనుడు అతడి విడిది దగ్గరికి విశ్వాసపాత్రులైన తన మనుషులను పంపాడు. అనేక రకాలైన బహుమానాలను కూడా వారివెంట పంపాడు. వారికి తోడుగా రహస్యంగా దుర్యోధనుడు కూడా వెళ్లాడు. అవన్నీ ధర్మరాజు పంపాడని అనుకున్న శల్యుడికి దుర్యోధనుడు కనిపించి, తనను పరిచయం చేసుకుని, నమ్రతతో అవన్నీ తాను పంపినవని తెలియచేశాడు. అప్పుడు సంతోషించిన శల్యుడు ఆయనకేం కావాల్నో కోరుకొమ్మని దుర్యోధనుడిని అడిగాడు. కౌరవులకు మంత్రివై తన సైన్యాన్ని నడిపించమని ప్రార్థించాడు దుర్యోధనుడు శల్యుడిని. తనకు పాండవులు, కౌరవులు ఒక్కటే అని అంటూ, దుర్యోధనుడి కోరికను సమ్మతించాడు శల్యుడు.

ఆ తరువాత శల్యుడు ఉపప్లావ్యానికి వెళ్లి ధర్మరాజు నివాసానికి పోయాడు. క్షేమ సమాచారాల విచారణ అనంతరం, దుర్యోధనుడు తనను ఆదరించిన విషయం, తన పక్షాన చేరమని అడిగిన విషయం, దానికి తాను సమ్మతించిన విషయం చెప్పాడు. శల్యుడు మంచి పనే చేశాడని అన్న ధర్మరాజు ఒక్క కోరిక కోరాడు. అర్జునుడితో ఎప్పుడూ పోటీపడే కర్ణుడికి సారథ్యం చేసేటప్పుడు, యుద్ధ సమయంలో శల్యుడు కర్ణుడిని అనాదరించి పలకాలని, కర్ణుడి మనస్సును కలత పుట్టించాలని, అలా చేసి ఆర్జునుడిని రక్షించాలని, ఇది అకార్యం అని సందేహించకుండా నెరవేర్చాలని ప్రార్థించాడు ధర్మరాజు. దానికి స్పందించిన శల్యుడు, దుర్యోధనుడి కోరిక మేరకు తాను కర్ణుడికి సారథినైనా, నిజానికి ఆర్జునుడిని రక్షిస్తానని, అవినీతిపరుడైన కర్ణుడిని కర్ణకఠోరాలైన పలుకులు పలికి యుద్ధంలో కలవర పరుస్తానని హామీ ఇచ్చాడు. మాటల మధ్యలో శల్యుడు ధర్మరాజుకు ఆయన కోరిక మీద ఇంద్రుడు శచీదేవితో అనుభవించిన దుస్థితిని, తత్సంబంధమైన చరిత్రను వివరించాడు.

పూర్వం దేవతలకు ఆదరణీయుడైన త్వష్ట అనేవాడు ఇంద్రుడికి హాని చేయాలని భావించి, మూడు తలలవాడిని ఒకడిని పుట్టించి వాడికి విశ్వరూపుడు అని పేరుపెట్టాడు. వాడు ఇంద్రపదవిని కోరి తపస్సు చేస్తుంటే, ఆ తపస్సు భంగం చేయలేక ఇంద్రుడు వాడిని వధించాడు. తనకు అంటిన బ్రహ్మహత్యా పాతకాన్ని వదిలించుకుని తిరిగి మునులచేత పూజలను అందుకుంటూ వుండడం చూసి త్వష్టకు కోపంవచ్చింది. ఆ కోపంతో హోమం చేసి, తన తపశ్శక్తితో గొప్ప తేజస్సుకల వృత్రాసురుడనే వాడిని పుట్టించాడు. వాడిని ఇంద్రుడి మీదికి యుద్ధానికి పంపాడు. భయంకరమైన దేవవృత్రాసుర యుద్ధంలో వృత్రుడు ఇంద్రుడిని మింగాడు. దేవతల మహిమవల్ల వృత్రాసురుడు ఆవులించగా ఇంద్రుడు తన శరీరాన్ని చిన్నదిగా చేసుకుని నోట్లో నుండి బయటకు దూకాడు.

ఇంద్రుడికి, వృత్రాసురుడికి మధ్య ఘోర యుద్ధం జరిగింది. ఇంద్రుడికి ఓటమి సూచనలు కనిపించగా, విష్ణుమూర్తిని ఆశ్రయించాడు. వృత్రాసురుడితో తాత్కాలికంగా సంధి చేసుకోమని ఇంద్రుడికి సలహా ఇచ్చాడు విష్ణుమూర్తి. మునులు ఇద్దరికీ సంధి చేసి, స్నేహం కుదిరించారు. అయితే వృత్రుడు ఒక నిబంధన పెట్టాడు. తాను తడిసినదానితో కాని, ఎండినదానితో కాని, కర్రతో కాని, రాయితో కాని, శస్త్రాలతో కాని, అస్త్రాలతో కాని, పగలు కాని, రాత్రి కాని చావకూడదని ఇంద్రుడితో అంగీకరింప చేయమన్నాడు. ఇంద్రుడు అలాగే వరం ఇచ్చాడు. తాత్కాలికంగా సంధి కుదిరినప్పటికీ శత్రువును చంపడానికి సమయం కోసం ఎదురు చూడసాగాడు ఇంద్రుడు.

ఒకనాడు సముద్రతీరంలో తన విరోధైన వృత్రాసురుడిని సంధ్యా సమయంలో చూసి, అప్పుడు రాత్రి, పగలు కానందున తన వజ్రాయుధంతో చంపాలనుకున్నాడు. ఇలా అనుకుంటూ అక్కడ సముద్రపు నురుగును చూసి, అది తడిదీ కాదు, పొడిదీ కాదని అంటూ దాన్ని వజ్రాయుధంలో కూర్చి వృత్రాసురుడిని చంపబోతుంటే, విష్ణువు ఆ సముద్రపు నురుగులో ప్రవేశించి అ అరాక్షసుడిని సంహరించాడు. ఆతరువాత తన నగరానికి వెళ్లిన ఇంద్రుడిని, పంచభూతాల సమూహం, అలా బ్రహ్మహత్య చేయవచ్చా? అని నిందించింది. అతడి రాజ్యశ్రీ నశించింది. ఇంద్రుడు వెంటనే నీచస్థితికి వచ్చి నిషధపర్వతానికి వెళ్లి దాక్కున్నాడు. అప్పుడు దేవతలంతా ఆలోచించి సురరాజ్యశ్రీని కాపాడడానికి నహుషుడిని ఇంద్రపదవిని స్వీకరించమని ప్రార్థించారు.

నహుషుడి అంగీకారంతో అతడిని దేవరాజ్యాభిషిక్తుడిని చేశారు. దేవేంద్ర పదవిని స్వీకరించిన నహుషుడు ఇష్టభోగాలను అనుభవిస్తూ మదం అతిశయించి మన్మథవశుడయ్యాడు. ఒకనాడు అతడి కంట శచీదేవి పడింది. తనను కూడడానికి రమ్మని అంటూ, ఆమెను తనదగ్గరికి పిలిపించాడు. ఆమె భయపడి బృహస్పతి దగ్గరికి పోయింది. ఆమె బృహస్పతి ఇంటికి పోవడం నహుషుడికి కోపం తెప్పించింది. నహుషుడిని తప్పుబట్టిన మునులకు అతడు ఇంద్రుడు అహల్య విషయంలో చేసింది తప్పుకాదా? అని ప్రశ్నించాడు. నహుషుడి దగ్గరికి వెళ్లి, అతడితోటి కలయికకు వ్యవధి కావాలని అడిగి రమ్మన్నాడు శచీదేవిని బృహస్పతి. ఆమె అలాగే తనకు కొంత సమయం కావాలని నహుషుడిని అడిగింది. దానికి అతడు అంగీకరించాడు. ఆ తరువాత విష్ణుమూర్తి ఆదేశానుసారం ఇంద్రుడితో అశ్వమేధయాగం చేయించి అతడిని పాపరహితుడిని చేశారు దేవతలు. తద్వారా అతడి బ్రహ్మహత్యా పాతకం కూడా పోయింది. అయితే, నహుషుడిని చూసి భయపడి మళ్లీ అజ్ఞాతంలోకి వెళ్ళాడు.

ఇదిలా వుండగా, ఇంద్రుడు వెళ్లిన చోటు కొరకు శచీదేవి ఉపశ్రుతిని పూజించింది. ఆమె శచీదేవిని వెంటబెట్టుకుని హిమవంతానికి ఉత్తరంగా మంజుమంతం అనే పర్వతం దగ్గరికి ఆమెను తీసుకుపోయింది. అక్కడున్న నూరామడల కొలనులో ప్రవేశించి, అక్కడ వికసించిన ఒక పద్మం కాడ మధ్యలో సూక్ష్మ రూపంలో వున్న ఇంద్రుడిని చూపించి అదృశ్యమై పోయింది. శచీదేవికి ఇంద్రుడు ఒక ఉపాయం చెప్పాడు. నహుషుడి దగ్గరికి వెళ్లి, తనను పొందాలని వుంటే, మునుల సమూహాన్ని వాహనంగా చేసుకుని తన దగ్గరికి రమ్మని చెప్పమన్నాడు. దానితో వాడి పనైపోతుందని కూడా చెప్పాడు. శచీదేవి నహుషుడి దగ్గరికి వెళ్లి, అనునయంగా అతడితో, మహర్షులు వాహనంగా కలవాడివి కావాలని కోరింది. అలాగే సప్తర్షులు తన పల్లకీ మోస్తుండగా వస్తానని చెప్పాడు నహుషుడు.

వెంటనే నహుషుడు మునులను పిలిచి వారిని తనకు వాహకులుగా చేసుకుని అన్ని చోట్లా తిరిగాడు. ఇంతలో బృహస్పతి అగ్నిదేవుడిని పిలిచి ఇంద్రుడి వృత్తాంతం చెప్పి, అతడిని వెతకడానికి పంపాడు. అగ్ని స్త్రీ వేషంలో అంతా వెతికి కానరాక వెనక్కు వచ్చాడు. నీళ్లలో కూడా వెతకమని సూచించాడు బృహస్పతి. వెతుకుతూ, ఇంద్రుడున్న సరస్సు చూశాడు. తామరపూవు కాడలో వున్న ఇంద్రుడిని చూసి, బృహస్పతికి అతడి జాడ చెప్పాడు. అంతా కలిసి ఇంద్రుడి దగ్గరికి వచ్చారు. ఆయన చేసింది (వృత్రాసురుడిని చంపడం) పాపకార్యం కాదన్నారు.

సరిగ్గా అదే సమయంలో పాపాత్ముడైన నహుషుడు నష్టపోయాడని, ఇంద్రుడు తన రాజ్యాన్ని స్వీకరించవచ్చని అంటూ అగస్త్య మహాముని అక్కడికి వచ్చాడు. అదెలా జరిగిందని అడిగిన ఇంద్రుడికి ఆ వివరాలు చెప్పాడు అగస్త్యుడు. నహుషుడు తనమీద కోపంతో తన తలను తన్నాడని, అప్పుడు తాను, పూజ్యులైన మహర్షులను ఆయన వాహనాన్ని మోయడానికి దుర్మార్గంగా నియోగించాడని, వారి మంత్రాలను నిందించాడని, తనను కూడా అవమానించాడని, కాబట్టి ఇంద్రపదవీ భ్రష్టుడివై పెక్కు సంవత్సరాలు భూలోకంలో సర్పరూపంలో వుండమని శపించానని అన్నాడు. ఆ క్షణంలోనే నహుషుడు స్వర్గలోకం నుండి భ్రష్టుడై దుర్గతి చెందాడని చెప్పాడు అగస్త్యడు. ధర్మరాజు పుణ్యమా అని అతడికి నిజరూపం వచ్చిందని అన్నాడు. ఆ తరువాత ఇంద్రుడు అగస్త్యుడిని పూజించాడు. దేవతలు తనను కొలుస్తుండగా, బృహస్పతి తోడురాగా ఇంద్రుడు అమరావతీ నగరానికి వెళ్లాడు.

ఈ కథ చెప్పిన శల్యుడు, దుర్యోధనుడు కూడా నహుషుడి లాగానే నశిస్తాడని అన్నాడు. ధర్మరాజు ఇంద్ర వైభవంతో విజయం సాధించి, సర్వభోగాలను అనుభవిస్తాడని చెప్పాడు. ఆ తరువాత శల్యుడికి గౌరవంగా వీడ్కోలు పలికాడు ధర్మరాజు. సాత్యకి, ధృష్టకేతుడు, సహదేవుడు, కేకయపతులు, ద్రుపదుడు, విరాటుడు, పాండ్య దేశాధిపతి ఒక్కొక్కరు ఒక్కటేసి అక్షౌహిణి సేనను తీసుకుని పాండవ శ్బిరంలో చేరారు. కౌరవ సేన పదకొండు అక్షౌహిణులైంది. ఇరువురూ పెక్కు స్థలాలో సేనలను విడిది చేశారు.  

కవిత్రయ విరచిత

శ్రీమదాంధ్ర మహాభారతం, ఉద్యోగపర్వం, ప్రథమాశ్వాసం

(తిరుమల, తిరుపతి దేవస్థానాల ప్రచురణ)

No comments:

Post a Comment