శ్రీకృష్ణ రాయబార పూర్వరంగంలో ద్రౌపదీ పాండవుల
అంతరంగం
ఆస్వాదన-52
వనం జ్వాలా నరసింహారావు
సూర్యదినపత్రిక (26-12-2021)
ధృతరాష్ట్రుడి రాయబారిగా
వచ్చిన సంజయుడు హస్తినాపురానికి వెళ్లిన తరువాత ధర్మరాజు ఆ మర్నాడు తన తమ్ములను, కొడుకులను, సామంతరాజులను సమావేశపర్చాడు. శ్రీకృష్ణుదు
తానే స్వయంగా కురుసభకు వచ్చి శాంతి వచనాలు ధృతరాష్ట్రుడితో పలుకుతానని సంజయుడికి
చెప్పిన మాటలను వారికి గుర్తు చేస్తూ, అందరం కలిసి మాధవుడిని కలుద్దామని, ఆయన్ను తన మాట ప్రకారం కౌరవ సభకు వెళ్లమని
వేడుకుందామని ప్రతిపాదించాడు ధర్మరాజు. అలా చేయడం వల్ల మేలు కలగొచ్చని, పోరు తప్పవచ్చని అన్నాడు ధర్మరాజు. అలా చెప్పి
తనవారందరినీ వెంటబెట్టుకుని శ్రీకృష్ణుడున్న స్థలానికి వెళ్లాడు. మర్యాదల అనంతరం,
శ్రీకృష్ణుడిని కౌరవుల దగ్గరికి రాయబారానికి వెళ్లమని, అలా వెళ్లినట్లయితే
అయోగ్యుడైన దుర్యోధనుడితో యుద్ధం చేయాల్సిన అవసరం రాదని, తమ భాగం రాజ్యం తమకు వస్తుందని అన్నాడు. ఆ
విధంగా, కురుపాండవుల వివాదాన్ని మిత్రకార్యంగా భావించమని వేడుకున్నాడు ధర్మరాజు
శ్రీకృష్ణుడిని.
సంజయుడి రాయబారం
వల్ల దుర్యోధన, ధృతరాష్ట్రుల మనోగతం అర్థమైందని, రాజ్యభాగం ఇవ్వకుండా మాయమాటలతో తమ కోపం
చల్లార్చే స్వాంతన వచనాలు పలుకుతున్నారని, ధృతరాష్ట్రుడు వంశధర్మం పాటించడం లేదని, అతడికి కొడుకుమీద వల్లమాలిన దురభిమానమని
అన్నాడు ధర్మరాజు. ఇంకా ఇలా అన్నాడు: (తిక్కన రచించిన మంచి పద్యాలలో ఇదొకటని
విశ్లేషకులు ముదివర్తి కొండమాచార్యులు గారు వ్యాఖ్యానించారిక్కడ)
క: ఇచ్చటి బంధులు నీవును, నచ్చెరువడి
వినుచునుండ నయిదూళ్ళును మా
కిచ్చినను జాలు నంటిని, బొచ్చెముగా దింతవట్టు
పూర్ణము సుమ్మీ!
శా. ఆ దుర్యోధనుఁ డంతమాత్రయును జేయంజాలఁడో కాని, పెం
పేదం గ్రూరత కోర్వరాదు; సిరి నా కేలందునే, గ్రాసవా
సోదైన్యంబులు వచ్చు నా యరయు నీ చుట్టాలకుం; గావునన్
మోదంబందుట గల్గుఁ గౌరవులు నేముం బొంది శ్రీ
నొందినన్
“కృష్ణా!
సక్రమంగా మాకు అర్థరాజ్యం పంచి ఇవ్వడానికి మా తండ్రికి మనసొప్పకపోతే ఇంద్రప్రస్థం, కుశస్థలం, వృకస్థలం, వాసంతి, వారణావతం చాలు. దానికీ ఇష్టపడకపోతే ఎక్కడైనా
మేము తలదాచుకోవడానికి ఐదూళ్లు ఇచ్చినా చాలు అని సంజయుడితో చెప్పిన మాటలు యదార్థం.
దుర్యోధనుడు మేమడిగిన ఐదూళ్లు అయినా ఇస్తాడో, ఇవ్వడో తెలియదు. కాని గౌరవం చెడేవిధంగా క్రూర
కార్యాచరణానికి నా మనస్సు ఒప్పుకోదు. పోనీ, రాజ్యసంపద నాకెందుకని వారిని అడగడం మానితే, నన్నాశ్రయించుకుని వున్న నా బంధుజనులకు కూటికీ, గుడ్డకూ దైన్యం ఏర్పడుతుంది. కాబట్టి కౌరవులు, మేము ఒద్దికగా వుండి రాజ్యసంపద పంచుకుంటే
ఉభయులకూ సంతోషం సమకూరుతుంది”.
రాజ్యానికి
కులనిర్మూలనం చేయడం తనకు సమ్మతం కాదన్నాడు ధర్మరాజు. యుద్ధం వల్ల లాభనష్టాలను
చెప్పాడు. యుద్ధంలో జయాపజయాలు నిశ్చయంగా చెప్పడానికి వీలులేదని, వైరంవల్ల ప్రయోజనం శూన్యమని, కలత లేకుండా నిమ్మళంగా వుండడమే తగినపనని, తనకు సంపద కావాలని, యుద్ధం జరగకుండా వుండాలని కోరుకుంటున్నానని
అన్నాడు. ఇక్కడ (విశ్లేషకులు ముదివర్తి కొండమాచార్యులు గారు వ్యాఖ్యానించినట్లుగా)
పాండవోద్యోగ సారసర్వస్వ మనదగిన పద్యం, ఉద్యోగ పర్వానికి గుండెకాయలాంటి పద్యం ఒకటి రాశారు తిక్కన ఇలా:
ఉ: కావున శాంతిఁ బొందుటయ కర్జము; దా నది యట్టులుండె; శ్రీ
గావలె నంచుఁ, బోరితము గామియుఁ గోరెద; మెల్లసొమ్ములుం
బోవుటయుం గులక్షయము పుట్టుటయున్ వెలిగాఁగ
నొండుమై
నే విధినైనఁ జక్కఁబడు టెంతయు నొప్పుఁ జుమీ
జనార్దనా!
తమ
విషయంలో పక్షపాతం చూపవద్దని,
ధర్మం, నీతిని అనుసరించి ఇరుపక్షాలకు మేలుచేయమని, అభివృద్ధి సమకూరే రీతిలో, విదురుడు మొదలైన
సత్పురుషుల మనసులకు సమ్మతమయ్యేలాగా మెత్తగా, కఠినమైన మందలింపులతో అంతా అనుగ్రహించే రీతిలో
మాట్లాడు కృష్ణా అని అన్నాడు ధర్మరాజు. పెద్దలమాట దుర్యోధనుడు వినలేదనే నింద
వాడిమీద వేయాలన్నాడు. కృష్ణుడు తమను ఏమార్గాన నడిపించాలని అనుకున్నాడో ఆమార్గానే
నడవడం తనకు సమ్మతమని స్పష్టం చేశాడు. అన్నివిధాలా సంధి కుడుర్చుకోవడమే మంచిదని
చెప్పాడు. ఇలా చెప్పి హస్తినకు వెళ్లిరమ్మన్నాడు.
ధర్మరాజు
చెప్పిందంతా విన్న శ్రీకృష్ణుడు,
కౌరవులు పగ మానరని, దుర్యోధనాదులు నిందకూ, అధర్మానికీ జంకరని, ధర్మరాజు దైన్యాన్ని వదిలిపెట్టి యుద్ధం
సలపాలని, శత్రుసమూహాలను జయించడం వల్ల
ఇహపరసుఖాలు సమకూరుతాయని అన్నాడు. శ్రీకృష్ణుడి మాటలు పాండవుల మిత్రుడిగా, హితవరిగా, సచివుడుగా, వారు నమ్మిన భగవంతుడుగా వున్నాయి. దుర్యోధనాదుల
విషయంలో కారుణ్యం, బందుభావం విడిచిపెట్టమని సలహా
ఇచ్చాడు. తాను కురుసభకు వెళ్లి ధర్మరాజు గురించి
అందరికీ అర్థమయ్యేట్లు వర్ణిస్తానన్నాడు. సంధి కుదిరితే మంచిదేనని, ఒకవేళ కుదరకపోతే, కౌరవుల ప్రయత్నాలు ఎట్లా వున్నాయో, వారి సామర్థ్యం ఏపాటిదో గ్రహించి, ధర్మరాజుకు విజయం చేకూరే విధంగా మరలివస్తానని
చెప్పాడు శ్రీకృష్ణుడు. ఆలస్యం చేయకుండా సమర సన్నాహాలు సాగించమని అన్నాడు.
దుష్టచిత్తుడైన
దుర్యోధనుడు అణగి మణగి వుండే పనిని సద్భావంతో సాధించు కృష్ణా అన్నాడు భీమసేనుడు.
నేర్పుతో, శక్తిమేరకు ఆ జగజెట్టిని దారిలో
పెట్టడానికి ప్రయత్నించమన్నాడు కృష్ణుడిని. దుర్యోధనుడి మనోవైఖరికి అనుగుణంగా
నీచత్వానికి దిగజారైనా సంధి చేసుకుంటే అదెంతో మేలని అన్నాడు భీముడు. అన్నదమ్ములమైన
కౌరవపాండవులు కలహించుకోవడం చూసి లోకులు పరిహసిస్తారని, అందుకే
హస్తినాపుర సామ్రాజ్యాన్ని పెద్దల మాట ప్రకారం పంచుకొని హాయిగా అనుభవించడం మేలని
భీముడు తన మాటలుగా దుర్యోధనుడికి చెప్పమన్నాడు. ఎలాగైనా సంధి పొసగేటట్లు
ప్రయత్నించమన్నాడు.
భీముడు
అలా మెత్తబడి మాట్లాడడం కృష్ణుడికి ఆశ్చర్యం కలిగించింది. తనదైన శైలిలో
భీమసేనుడిని యుద్ధానికి పురికొల్పాడు శ్రీకృష్ణుడు. ఇలా పొంతనలేని మాటలు మాట్లాడడం
భీముడికి తగునా అన్నాడు. భయం అంటే ఏమిటో తెలియని భీముడికి పిరికి మాటలు ఎవరు
నేర్పారో అన్నాడు. తనకు పిరికితనం ఏమాత్రం లేదని, తాను చేసిన ప్రతిజ్ఞలు రణరంగంలో చూపిస్తానని
భీముడు పౌరషంగా మాట్లాడాడు. తానేదో పరిహాసానికి అన్నానని శ్రీకృష్ణుడు సర్ది
చెప్పాడు. భీముడి శక్తి-సామర్థ్యాలు తనకు తెలుసని చెప్పాడు. కౌరవులతో సంధి కుదరని
పక్షాన యుద్ధంలో అన్నిటికీ ఆధారం భీముడే అన్నాడు.
ప్రత్యేకంగా
తాను చెప్పాల్సినది ఏమీలేదని, చెప్పాల్సినదంతా ధర్మరాజే చెప్పాడని, అయినా తనకు
తోచిన కొన్ని మాటలు చెప్తానని అన్నాడు అర్జునుడు. కౌరవులు చేసిన దుష్కార్యాలన్నీ
ఏకరువు పెట్టాడు. తరువాత,
కౌరవుల దుండగాలన్నీ మన్నించి,
నేర్పుగా కౌరవపాండవులు ఒకటిగా వుండేటట్లు చేయమన్నాడు. ఆ మూర్ఖులను ఎలాగైనా సంధికి
ఒప్పించి పాండవులకు, కౌరవులకు రాజ్యంలో చెరిసగం
వచ్చేటట్లుగా చేసి, ఉభయులు కలిసి మెలసి ఒద్దికగా జీవించే
ఏర్పాటు కావించడం చాలా మంచిదని చెప్పాడు. ఆ ఏర్పాటువల్ల తమకు గౌరవం, సౌఖ్యం లభిస్తాయన్నాడు. సంధి చేసుకోవడం
కృష్ణుడికి సరిపడకపోతే ఆయన ఆజ్ఞానుసారం నడుచుకుంటామని, కాబట్టి
ఏది హితమో, ఏది న్యాయమో నిర్దేశించమని స్పష్టం చేశాడు
అర్జునుడు. తాను తన శక్తికొలదీ సంధి సమకూర్చడానికే ప్రయత్నిస్తానని, దైవం ఏమి చేయదల్చాడో చెప్పలేమని అన్నాడు
శ్రీకృష్ణుడు.
ధర్మరాజు, భీమార్జునులు చెప్పినవి వట్టి మాటలు కావని, ఒకప్పటిలాగా తమ మనస్సులు ఇప్పుడు
ప్రతీకారేచ్చతో లేవని, కృష్ణుడు వెళ్లిన కార్యం సఫలమవుతుందని
నకులుడు అన్నాడు. అందరిలో చిన్నవాడైన సహదేవుడు అభిమానధనుడు. సందిమాటలు అతడికి
సరిపడలేదు. ధర్మరాజాదుల అభిప్రాయాన్ని కాదన్నాడు. పౌరుషోక్తులు పలికాడు.
ధర్మజాదులు దైన్యానికి దిగజారడం ఊహించని విషయం అన్నాడు. ధర్మరాజు రాజ్యభాగం
యాచించడం, దానిని శ్రీకృష్ణుడు అడగబోవడం, కౌరవులు భాగం ఇవ్వకుండా పోరాడుతామని
అనబోవడాన్ని ఆక్షేపించాడు. తనకు వంకర మాటలు రావని, రాజ్యభాగం ఇవ్వకపోతే యుద్ధమే పాండవులకు
తగినదని తన మాటలుగా చెప్పమన్నాడు సహదేవుడు.
భీమార్జున
నకులులు ధర్మరాజు అభిప్రాయాన్ని కాదనలేక, ఔను అనలేక,
ఎటూ కాకుండా మాట్లాడారు. సహదేవుడు తాను చెప్పాలనుకున్నది సూటిగా చెప్పాడు.
సహదేవుడి మాటలను సాత్యకి సమర్థిస్తూ యుద్ధమే మంచిదన్నాడు. అక్కడున్న వారంతా కూడా
సహదేవుడి మాటలను, సాత్యకి సమర్థనను మెచ్చుకున్నారు.
అప్పుడు అక్కడే వున్న ద్రౌపదీదేవి కోపించి మెల్లగా శ్రీకృష్ణుడిని చూసి మాట్లాడసాగింది.
ధర్మారాజు మాటలు ఆమెకు మనస్తాపాన్ని కలిగించాయి.
‘కౌరవులు
అంతటి అకృత్యాలు చేసి, అడవులకు తరిమేసి, ఇప్పుడు సంజయుడితో రాయబారం చేస్తారా? ధర్మనందనుడు ఆయన మాటలకు మనసులో ఉబ్బిపోతాడా? సుయోధనుడు తనకు తానుగా ఐదుమంది అన్నదమ్ములకు
ఐదూళ్లు ఇస్తాడా?’ అంటుంది ద్రౌపది. పాండవులు రాజ్యంలో
భాగం తీసుకోకుండా కౌరవులతో పొత్తుకు అంగీకరిస్తే వారిని లోకులు అసమర్థుల కింద, అవివేకుల కింద జమకట్టరా? అని అడుగుతుంది. బాగా
ఆలోచిస్తే సంధి కౌరవులకే లాభం అంటుంది. ఇంత చెప్పిన తరువాత, ధర్మరాజు, అతడి తమ్ములు ఏది యుక్తమని భావిస్తారో దాన్నే
కృష్ణుడు నేర్పుగా తెలియచేసి కౌరవులతో పొత్తు కుదుర్చుకొమ్మన్నది.
ఈ సందర్భంలో
ద్రౌపదీదేవి అన్న మాటలు తిక్కన రెండు చక్కటి పద్యాలలో రాశారు ఇలా:
చ:
వరమున బుట్టితిన్, భరతవంశము జొచ్చితి, నందు బాండు భూ
వరునకు గోడలైతి జనవంద్యుల బొందితి , నీతి విక్రమ
స్థిరులగు పుత్రులం బడసితిన్ , సహజన్ముల ప్రాపు గాంచితిన్
సరసిజనాభ! యిన్ని ట ప్రశస్తికి నెక్కిన దాన
నెంతయున్
ఉ:
నీవు సుభద్ర కంటె గడు నెయ్యము
గారవముందలిర్ప సం
భావన సేయు దిట్టినను బంకజనాభ ! యొకండు రాజసూ
యావబృధంబు నందు శుచియై పెనుపొందిన వేణివట్టి యీ
యేవురు జూడగా సభకు నీడ్చె-గులాంగన
నిట్లొనర్తురే
తాను దేవతావర
ప్రసాదం వల్ల జన్మించిన విషయం, భరత వంశంలోకి మెట్టిన విషయం దగ్గరనుండి, ఎలా
శ్రీకృష్ణుడు తన సొంత చెల్లెలు సుభద్ర కంటే తనను ఎక్కువగా ఆదరించే విషయం చెప్పి,
కౌరవ సభలో తనకు జరిగిన పరాభవం గురించి, ఒంటి చీరెతో బలాత్కారంగా దుశ్శాసనుడు లాగి
తెచ్చిన సంగతి, తన కురులు సగం తెగిపోయిన విషయం చెప్పి,
ఇవన్నీ సంధి కుదిరించే సమయంలో గుర్తుంచుకొమ్మన్నది కృష్ణుడిని. దుశ్శాసనుడి
తెగిపోయిన హస్తం, దుర్యోధనుడి శవం కళ్ళారా చూడడానికి
నోచుకోకపోతే భీమార్జునుల శౌర్యం తగులబెట్టనా? అన్నది.
శ్రీకృష్ణుడు
ద్రౌపదిని ఓదార్చి, తానుండగా శోకించవద్దని అంటూ, తనకు భీమార్జునులు సాయపడగా, ధర్మరాజు ఆజ్ఞాపించగా, ఆమె సంతోషించే విధంగా శత్రువులను
నిర్మూలిస్తానని, మరో మార్గం లేదని చెప్పాడు. ఆమె ఎంతగా
విలపించిందో అదే మోతాదులో దుర్యోధనాదుల భార్యలు కూడా విలపిస్తారని, వారి ఏడ్పులు విని ద్రౌపది పకపక నవ్వే సమయం
సమీపించిందని అన్నాడు. కౌరవులకు సంధికి సంబంధించిన సౌమ్య వాక్యాలు సమ్మతాలు
కావన్నాడు. పాండవుల మిక్కుటమైన వైభవాన్ని ద్రౌపది దర్శించగలదని చెప్పాడు. ఇలా
శ్రీకృష్ణుడు ద్రౌపదీదేవిని సాంత్వన వచనాలతో ఓదార్చాడు.
ఆ తరువాత
ధర్మరాజు కృష్ణుడిని కౌరవ సభకు పంపడానికి తీర్మానించాడు. మర్నాడే శ్రీకృష్ణుడి
జన్మ నక్షత్రం ప్రకారం మంచిరోజన్నాడు. ధర్మరాజు ఆదేశానుసారం మర్నాడు సాత్యకిని
వెంటబెట్టుకుని, ఆయుధాలను తీసుకుని కృష్ణుడు హస్తినకు
బయల్దేరాడు. ఆయన వెళ్తుంటే మార్గమధ్యంలో నారదుడు, జమదగ్ని, కణ్వుడు మొదలైన మహర్షులు కనిపించారాయనకు.
వారంతా, కౌరవ సభలో శ్రీకృష్ణుడి మాటలు
వినడానికి హస్తినాపురానికి వస్తామన్నారు. సరేనన్నాడు శ్రీకృష్ణుడు.
కవిత్రయ
విరచిత
శ్రీమదాంధ్ర
మహాభారతం, ఉద్యోగపర్వం, తృతీయాశ్వాసం
(తిరుమల, తిరుపతి
దేవస్థానాల ప్రచురణ)