Sunday, January 30, 2022

శునస్సేపోఖ్యానం ..... శ్రీ మదాంధ్ర వాల్మీకి రామాయణం బాలకాండ మందర మకరందం-93 : వనం జ్వాలా నరసింహారావు

 శునస్సేపోఖ్యానం

శ్రీ మదాంధ్ర వాల్మీకి రామాయణం బాలకాండ మందర మకరందం-93

వనం జ్వాలా నరసింహారావు

సూర్యదినపత్రిక (31-01-2022)

"ఇలా అందరూ వెళ్లిపోగానే, తనింతవరకు తపస్సు చేస్తున్న వనంలో విఘ్నాలు కలుగుతున్నాయని, ఆ ప్రదేశాన్ని వదిలి మరింకెక్కడికైనా పోతానని అక్కడున్న వారితో అంటాడు విశ్వామిత్రుడు. ఏ దిక్కుకు పోతే బాగుంటుందని ఆలోచించి, విశాలమైన పడమటిదిక్కున మంచివనాలు, పుష్కరం వున్నందువల్ల, తీవ్రమైన తపస్సు చేయడానికి అక్కడకు పోతే తపస్సిద్ధికలుగుతుందని భావిస్తాడు. త్వరగా అక్కడకు పోవాలని, పోయి కేవలం ఫలాలను మాత్రమే ఆహారంగా తీసుకుంటూ, భయంకరమైన తపస్సు చేయాలనీ, అలా చేయడంద్వారా తపస్సిద్ధన్నాకలగాలి-లేదా-మరణమన్నా రావాలి, అని నిశ్చయించుకుంటాడు. ఉత్కృష్ట మార్గంలో, ఇతరులకు కనీసం అనుకోడానికైనా సాధ్యపడని, అతిగొప్పదైన-కఠినమైన నిష్ఠలతో తపస్సు చేయడం ఆరంభించాడు విశ్వామిత్రుడు”.

విశ్వామిత్రుడు తపస్సు చేస్తున్న రోజుల్లోనే, అయోధ్యా నగరాన్ని అంబరీషుడనే రాజు పరిపాలిస్తుండేవాడు. మనువు మునిమనుమడు, నభగుడి మనుమడు, నాభాగుడి కొడుకైన అంబరీషుడు పెద్దల మన్ననలుపొందేవిధంగా మాట్లాడుతాడని, క్రోధాన్ని జయించినవాడని, శ్రేష్ఠమైన న్యాయ మార్గంలో దోషాలను జయించినవాడని, సద్గుణాలే భూషణాలుగా కలవాడని, రాజశ్రేష్టుడనీ ప్రసిద్ధికెక్కాడు. అలాంటి అంబరీషుడు ఒక యాగాన్ని చేయాలని అనుకొని, చేస్తున్న సమయంలో, ఇంద్రుడు యజ్ఞ పశువును దొంగిలించాడు. యజ్ఞ పశువు పోతే, పోకుండా రక్షించుకోలేక పోతే, యజ్ఞాన్ని చేసేవాడికి దోషం తగులుందని చెప్పాడు ఋత్విజుడు. యజ్ఞపశువునన్నాతెమ్మని, దొరక్కపోతే యజ్ఞం కొరకు బలి కావడానికి ఒక మనిషినైనా తెమ్మని అంబరీషుడిని ఆదేశించాడు ఋత్విజుడు. యజ్ఞపశువును వెతికేందుకు అన్ని ప్రదేశాలలో వెతకసాగాడు అంబరీషుడు. కనీసం యజ్ఞం పూర్తి చేయించేందుకు ఒక మనిషైనా దొరకకపోతాడానని స్వయంగా వెతకనారంభించాడు".

"ఇలా తిరుగుతూ, ఎవరినీ బలాత్కారంగా తేవడానికి ఇష్టపడని అంబరీషుడికి ఒకనాడు, భార్యా-పిల్లలున్న ఋచీకుడనే ముని (విశ్వామిత్రుడి తోబుట్టువు భర్త) కనిపిస్తాడు. అతడికి లక్ష ఆవులిస్తానని, తన యజ్ఞాన్ని రక్షించేందుకు ఆయన కొడుకుల్లో ఒకడినిఇవ్వమని ఆయనకు నమస్కరించి, ప్రార్తించాడు. పోయిన యజ్ఞపశువుకొరకు ప్రపంచమంతా గాలించినా ఫలితం లేకపోయిందని, దానికి బదులుగా మనిషిని వుంచాల్సి వచ్చిందనీ, తన ముగ్గురి కొడుకుల్లో ఒకడిని ఇవ్వమని అంటాడు. ఆయనేమిచ్చినా తన ప్రేమకు పాత్రుడైన పెద్దకొడుకునివ్వలేనని ఋచీకుడనగానే, ఆయన భార్య, శునకుడనే తమ కనిష్ట పుత్రుడంటే తనకెంతో ఇష్టమని కాబట్టి వాడినీ అమ్మమని అంటుంది. ఆ మాటలను విన్న వారి నడిమి కొడుకు శునస్సేపుడు, తన ప్రాణమిచ్చి రాజు యజ్ఞాన్ని కాపాడుదామనుకుంటాడు. తనను తీసుకొని పొమ్మని, ఆయనిస్తానని చెప్పిన లక్ష ఆవులను తండ్రికివ్వమని శునస్సేపుడనగానే, ఆలస్యం చేయకుండా, ధర్మ ప్రీతితో తన వెంట అతడిని తీసుకునిపోయాడు అంబరీషుడు. మార్గమధ్యంలో మధ్యాహ్నమైనందున వారిరువురు ఒక పుష్కర తీరం దగ్గర కాసేపు ఆగారు".

(లోకంలో సాధారణంగా పెద్దకొడుకుపై తండ్రికి, పిన్న వాడిపై తల్లికి ప్రేముంటుంది. నడిమి కొడుకుపై తల్లితండ్రులకిద్దరికీ ప్రీతి వుండదంటారు. ఈ విషయంలో ఋషీశ్వరులు కూడా అందరివలెనే ప్రవర్తిస్తారనడానికి ఇదొక ఉదాహరణ).

విశ్వామిత్రుడి శరణుజొచ్చిన శునస్సేపుడు

         "ఎండవేడికి తాళలేక మార్గమధ్యంలో ప్రయాణం ఆపు చేసి, రాజు విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో, శునస్సేపుడు పరుగెత్తుకుంటూ, సమీపంలో ఋషీశ్వరుల మధ్యనున్న మేనమామ విశ్వామిత్రుడి దగ్గరకు పోయాడు. అలసటతోనూ, ఎండవేడివల్లనూ, పరుగెత్తుకుంటూ రావడం వల్లా, తటాలున వస్తూనే మామ విశ్వామిత్రుడి ఒళ్లో వాలాడు. తనగతి ఏమని చెప్పాలని, తనను మన్నించి అతడే కాపాడాలని, తల్లితండ్రులున్నా వారు తనను రక్షించలేరని, వారున్నా లేనట్లేనని, ఏదో విధంగా ఆలోచించి రాజు కోరిక నెరవేరేటట్లు-తను తపస్సు చేసి స్వర్గానికి పోయేటట్లు చేయమని విశ్వామిత్రుడిని ప్రార్థించాడు శునస్సేపుడు. తను అర్థాయువుతో చనిపోకుండా, దీర్ఘాయువుగా జీవించేటట్లు చేయమంటాడు. తను బతకదల్చుకుంది కామంకోసం కాని, భోగంకోసం గాని కాదని, స్వర్గానికి పోవడానికి కావల్సినంత తపస్సుచేయడానికేనని అంటూ, తను ఆపదపాలుకాకుండా, ఆయన బిడ్డలను కాపాడినట్లే తనను కూడా రక్షించమని కోరాడు”.

అల్లుడి మాటలు విన్న విశ్వామిత్రుడు తన కొడుకులతో, అతడు బాలుడనీ-రక్షించమని అర్థిస్తున్నాడని-భయపడి తన శరణుజొచ్చాడని అంటూ, వాళ్లల్లో ఎవరైనా ఒకడు అతడి బదులుగా రాజువెంట పోయి, అతడికి ప్రాణబిక్ష పెట్టమని అంటాడు. తన మాట గౌరవించాలని కూడా అంటాడు. వారిలో ఎవరన్నా అతడి బదులుగా వెళ్తే రాజు యజ్ఞం నెరవేరుతుందని, దేవతలు సంతోషిస్తారని, అతడి ప్రాణం నిలుస్తుందని, తన మాటా దక్కుతుందని, కాబట్టి తను చెప్పినట్లు చేయమని కోరతాడు. విశ్వామిత్రుడి కొడుకులందరూ ముక్తకంఠంతో ఆయన కోరికను తిరస్కరించారు. తన బిడ్డలను బలిపెట్టి ఇతరుల బిడ్డను కాపాడడమంటే, స్వార్జిత మధురా హారం మాని, నిషిద్ధమైన కుక్క మాంసం తినడమేనని అహంకారంగా జవాబిచ్చారు వారు తండ్రికి".

"కొడుకులందరు ఒక్క మాటగా, తన కోరికను మన్నించక పోవడంతో, విశ్వామిత్రుడికి కోపమొచ్చింది. తను అవునన్నది వారెలా కాదంటారని, కొంచెమైనా వారికి భయం లేకుండా పోయిందనీ, తండ్రి మాట జవదాటడం ధర్మ విరుద్ధమనీ, తన మాట అతిక్రమించి వారింక బతకలేరని అంటూ, వశిష్ఠుడి కొడుకులలాగానే వాళ్లు కూడా కుక్క మాంసం తింటూ-నీచమైన మనస్సుతో, వెయ్యేళ్లు అల్లాడమని శపించాడు. అలా పట్టరాని కోపంతో కొడుకులను శపించి, విశ్వామిత్రుడు మంత్రించిన విబూదిని శునస్సేనుడికి పెట్టి అతడిని భయపడొద్దని చెప్పాడు. యజ్ఞంలో అతడిని విష్ణు సంబంధమైన యూపానికి కట్టినప్పుడు, అగ్నిని చూస్తూ-ఆలస్యం చేయకుండా, ’ఇమ మ్మే వరుణ’ అనే రెండు మంత్రాలను జపించమంటాడు. (ఒక మంత్రం ఇంద్రస్తుతి-ఇంకొకటి ఉపేంద్రస్తుతి)”.

మంత్రాలను ఉపదేశించి, తని చెప్పిన ప్రకారం అవి చదివితే, రాజు యజ్ఞం సఫలమవుతుందనీ, ఆయన జీవితాశయం నెరవేరుతుందని అంటాడు విశ్వామిత్రుడు. ఆ మంత్రాలను గ్రహించి, శెలవు తీసుకుని వెళ్లాడు శునస్సేపుడు. అంబరీషుడి దగ్గరకు పోయి, అతడిని యజ్ఞ దీక్ష వహించమని కోరాడు. పురోహితుడు చెప్పినట్లే దీక్ష వహించాడు అంబరీషుడు. బ్రాహ్మణులు శునస్సేపుడి మెడలో పూదండలు వేసి, ఎర్రటి వస్త్రాలను కట్టి, దర్భలతో అల్లిన తాళ్లతో అతడిని యూపస్తంబానికి కట్టారు. అతడేమాత్రం భయపడకుండా తనలోలోన మంత్రాలను స్మరించాడు. తనను ఆశ్రయించిన వారిని రక్షించే విష్ణువు, రాజుకు యజ్ఞ ఫలం-బాలుడికి దీర్ఘాయువు ఇమ్మని ఇంద్రుడికి చెప్పగా ఆయన ఆజ్ఞానుసారం ఇంద్రుడు మెచ్చి, శునస్సేనుడికి దీర్ఘాయువునిచ్చి, రాజుకు యజ్ఞ ఫలాన్నిచ్చాడు. అగ్నితేజుడైన విశ్వామిత్రుడు వెయ్యేళ్లు, ప్రపంచమంతా పొగిడే విధంగా, గాఢమైన తపస్సు చేశాడు".

Saturday, January 29, 2022

ఇరుపక్షాల వున్న అతిరథ, మహారథాదుల వివరాలు చెప్పిన భీష్ముడు .... ఆస్వాదన-57 : వనం జ్వాలా నరసింహారావు

 ఇరుపక్షాల వున్న అతిరథ, మహారథాదుల వివరాలు చెప్పిన భీష్ముడు

ఆస్వాదన-57

వనం జ్వాలా నరసింహారావు

సూర్యదినపత్రిక ఆదివారం సంచిక (30-01-2022)

తీర్థయాత్రలకు పోవడం వల్ల బలరాముడు, కౌరవ-పాండవులు  ఇద్దరూ వద్దన్నందువల్ల రుక్మి మినహా జగతిలోని రాజులంతా కురుక్షేత్ర సంగ్రామంలో పోరాడేందుకు రెండు పక్షాలలో ఒక దాంట్లో చేరారు. ఈ నేపధ్యంలో దుర్యోధనుడు, దుశ్శాసన, శకుని, కర్ణులతో మంతనాలాడి శకుని కొడుకు ఉలూకుడిని పాండవులకు దగ్గరికి తన పక్షాన వెళ్లి కొన్ని కఠినమైన మాటలు చెప్పమన్నాడు. ఉలూకుడు ఆయన ఆదేశానుసారం ధర్మరాజు దగ్గరికి వెళ్లాడు.

దుర్యోధనుడు చెప్పమన్న కఠినమైన పలుకులను ఆయన మాటలుగా చెప్పాడు ఉలూకుడు. తన వారినందరినీ కూర్చుకుని యుద్ధ రంగానికి రమ్మని, ఇక తప్పించుకోవడానికి వీలుకాదని, భీష్మద్రోణుల బల పరాక్రమాలు పాండవులు తెలుసుకుంటారని, వారిబారి నుండి అర్జునుడు తప్పించుకుని బతకడం సాధ్యం కాదని, శ్రీకృష్ణుడితోనే అంతా చక్కబడదని, భీముడు ప్రతిజ్ఞ చేసినట్లు చేతనైతే దుశ్శాసనుడి నెత్తురు తాగమని, యుద్ధంలో తమ చేతికి చిక్కితే అతడు తప్పించుకుని పోలేడని, జరిగిన అవమానాలు పాండవులు మరిచారా అని, విరాటుడి కొలువులో దీనులై వుండడం శూర లక్షణమా అని, భూమిలో రవ్వంత కూడా చీల్చి ఇవ్వమని, యుద్ధం చెయ్యక మానమని, ఇలా ఏవేవో చెప్పాడు. ఆ మాటలు విన్న భీమార్జున నకుల సహదేవులు ఒకరి ముఖం ఇంకొకరు చూస్తుండగా, శ్రీకృష్ణుడు వారి పక్షాన ఘాటైన సమాధానం ఇచ్చాడు. యుద్ధం రేపే అని, వీరుడవై మరణించమని, మరణించక తప్పించుకోలేడని, కధనంలో భీముడు దుశ్శాసనుడి వక్షం చీల్చి రక్తం తాగుతాడని దుర్యోధనుడికి చెప్పమన్నాడు. భీమార్జున నకుల సహదేవులు కూడా తమ బలపరాక్రమాలను వివరించి దుర్యోధనుడిని హెచ్చరించారు.

పాండవుల దగ్గరినుండి తిరిగొచ్చిన ఉలూకుడు కృష్ణార్జునులు అన్న మాటలు వున్నవి వున్నట్లుగా చెప్పాడు. అక్కడే వున్న భీష్ముడు దుర్యోధనుడికి ధైర్య వచనాలు పలికాడు. భీష్మద్రోణులు వుండగా తనకు భయం లేదన్నాడు దుర్యోధనుడు. అప్పుడు దుర్యోధనుడు, కౌరవ పక్షంలో, పాండవుల పక్షంలో యుద్ధం చేయగల వీరుల ప్రత్యేకతలను వివరంగా చెప్పమని కోరాడు. సమాధానంగా భీష్ముడు ఇరు పక్షాల వారిలోని శక్తి-సామర్థ్యాలు, హెచ్చు తక్కువలు వున్నవి వున్నట్లుగా చెప్పాడు. భీష్ముడి ఉద్దేశంలో కౌరవ వీరుల ప్రత్యేకతలు ఇలా వున్నాయి.  

సుయోధనుడు అతిరథుడు, ఆయన తమ్ములంతా సమరథులలో ఉత్తములు. వారు ద్రుపదుడి సేనలను జయించగలరు. కృతవర్మ అతిరథుడు, భూరిశ్రవుడు అతిరథోత్తముడు, సింధు దేశాధీశుడైన జయద్రథుడు మహారథుడు. కాంభోజ దేశానికి రాజైన సుదక్షిణుడు సమరథుడు. మాహిష్మతీ నాయకుడైన నీలుడు అర్థ రథుడు. అవంతి దేశపతులైన విందాను విందులు ఇద్దరూ అర్థరథులు. త్రిగర్త దేశపు రాజులైదుగురు మహారథులు. దుర్యోధనుడి కొడుకైన లక్ష్మణకుమారుడు సమరథుడు. బృహద్బలుడు సమరథుడు. దండదారుడు అర్థరథుడు. (అతిరథుడు అనేక రథికులతో ఒంటరిగా పోరాడగల ఉత్తమ రథికుడు).

కృపాచార్యుడు అతిరథులలో శ్రేష్టుడు. శకుని సమరథుడు. దివ్యాస్త్రాలు తెలిసిన అశ్వత్థామ అర్జునుడితో సమానమైనవాడు. అతడికి సమానులు భూలోకంలో ఎవరూ లేరు. ద్రోణాచార్యుడు అతిరథులలో శ్రేష్టుడు. బాహ్లికుడు అతిరథుడు. అతడి కుమారుడు సోమదత్తుడు కూడా ప్రసిద్ధమైన బలం కలవాడే. రాక్షస శ్రేష్టుడైన అలంబసుడు సమరథుడు. ప్రాగ్జ్యోతిష నగరాధిపతైన భాగాదత్తుడు సమరథుడు. గాంధార రాజులైన వృక్షుడు, అచలుడు సమరథులు. కయ్యానికి కాలుదువ్వే దుర్యోధనుడి గారాబు నెచ్చెలికాడైన కర్ణుడు అర్థరథుడు.

కర్ణుడు అర్థరథుడని భీష్ముడు చెప్పడాన్ని ద్రోణాచార్యుడు సహితం సమర్థించాడు. భీష్మద్రోణుల మాటలు విన్న కర్ణుడికి కోపం వచ్చింది. తనమీద వున్న ద్వేషంతో పరుషవచనాలు పలికి తనను అర్థరథుడు అని వారు చెప్పారని, తనలో ఏలోపం వుందో తెలియచేయమని అడిగాడు. భీష్ముడి శక్తిని, పరాక్రమాన్ని బట్టి తన దృష్టిలో అతడు అర్థరథుడే అని కర్ణుడన్నాడు. భీష్ముడు అర్జునుడి పట్ల పక్షపాతం కలవాడని, పూనికతో యుద్ధం చేయడని, అతడిని కౌరవ పక్షం నుండి తొలగిస్తే కలిగే నష్టం ఏమిటని దుర్యోధనుడితో అన్నాడు కర్ణుడు. దురహంకారైన భీష్ముడితో కలిసి అతడితో చేరి యుద్ధం చేయడానికి తాను అంగీకరించనని స్పష్టం చేశాడు. తన శక్తి ఏపాటిదో కర్ణుడు తన గురువైన పరశురాముడిని అడిగి తెలుసుకోమన్నాడు భీష్ముడు. తాను యుద్ధం చాలించిన తరువాత, అర్జునుడు మహావీరులందరినీ కూల్చిన తరువాత, కర్ణుడు కదన రంగం ప్రవేశం చేయక తప్పదని, అప్పుడు ఆయన పరాక్రమం చూపమని అన్నాడు భీష్ముడు. దుర్యోధనుడు కలిగించుకుని వాతావరణాన్ని చల్లబర్చాడు.

కౌరవుల పక్షంలోని వారిలాగే పాండవుల పక్షంలో వున్న వీరుల తారతమ్యాలు చెప్పమని దుర్యోధనుడు కోరాడు భీష్ముడిని. అప్పుడు భీష్ముడు చెప్పిన ఆ వివరాలు: ధర్మరాజు అతిరథుడు. భీముడు అతిరథులలో మేటి. నకుల సహదేవులు సమరథులు. పాండవులందరు ఏకకాలంలో తాకితే కౌరవ సైన్యం తట్టుకోలేదు. అర్జునుడి బలపరాక్రమం ‘ఇంత అని చెప్పశక్యం కాదు. అంతటి వాడు ఎప్పుడూ, ఎక్కడా కనిపించడం లేదు. పైగా ఆయనకు శ్రీకృష్ణుడి తోడ్పాటున్నది. ఉప పాండవులు ఐదుగురు మహారథులు. వారితో సమానుడు ఉత్తరుడు.

అభిమన్యుడు అతిరథులలో అగ్రేసరుడు. సాత్యకి అతిరథులలో సిగబంతి. అభిమన్యుడు, సాత్యకి ఇద్దరూ గండరగండలు. ద్రుపదుడు, విరాటుడు మహారథులు. శిఖండి మహారథుడు. ధృష్టద్యుమ్నుడు అతిరథుడు. ఆయన కుమారుడు ధృతవర్ముడు అర్థరథుడు. శిశుపాలుడి కుమారుడు ధృష్టకేతుడు మహారథుడు. భోజుడు, అజుడు మహారథులు. పాంచాల వంశాన్ని ప్రకాశింప చేస్తున్న ఏడుగురు కూడా మహారథులే. కేకయ దేశాధిపతులు అయిదుగురు మహారథులు. విరాటుడి నలుగురు దాయాదులు మహారథులు. చిత్రాయుధుడు, చేకితానుడు, చంద్రదత్తుడు, వ్యాఘ్రదత్తుడు మహారథులు. సేనాబిందుడు అతిరథుడు. పాండ్యరాజు అతిరథుడు. కాశ్యుడు సమరథుడు. కుంతిభోజుడు అతిరథుడు. రోచమానుడు మహారథుడు. ఘటోత్కచుడు అతిరథుడు.

తనకు జ్ఞాపకం ఉన్నంత మేరకు ఉభయ పక్షాలలో వున్న వారి వీర పరాక్రామలు చెప్పానని, ఇంకా ఎంతోమంది మేటి వీరులు ఉండవచ్చని అన్నాడు భీష్ముడు. తానైతే పాండవ పక్షంలో వున్న శిఖండిని మాత్రం చంపలేనని చెప్పాడు.    

కవిత్రయ విరచిత

శ్రీమదాంధ్ర మహాభారతం, ఉద్యోగపర్వం, చతుర్థాశ్వాసం

(తిరుమల, తిరుపతి దేవస్థానాల ప్రచురణ)

Sunday, January 23, 2022

వశిష్ఠుడి కుమారులను శపించిన విశ్వామిత్రుడు ..... శ్రీ మదాంధ్ర వాల్మీకి రామాయణం బాలకాండ మందర మకరందం-92 : వనం జ్వాలా నరసింహారావు

 వశిష్ఠుడి కుమారులను శపించిన విశ్వామిత్రుడు

 శ్రీ మదాంధ్ర వాల్మీకి రామాయణం బాలకాండ మందర మకరందం-92

వనం జ్వాలా నరసింహారావు

సూర్యదినపత్రిక (24-01-2022)

"దీనాలాపనలతో మాట్లాడుతున్న త్రిశంకుడిని చూసి విశ్వామిత్రుడు, అతడికి మేలు జరుగుతుందని ధైర్యం చెప్పాడు. అతడిని భయపడ వద్దనీ, అతడు మంచి నడవడిగలవాడని తనకు తెలుసనీ, అతడి మనస్సులో వున్న కోరికను తాను నెరవేరుస్తానని అంటాడు విశ్వామిత్రుడు. యజ్ఞం చేసేందుకు శీఘ్రంగా మునీశ్వరులందరినీ పిలుస్తానని చెప్పి, వశిష్ఠుడి పుత్రుల శాపాన్ని తప్పించడం సాధ్యపడనందున, చండాల రూపంలోనే త్రిశంకుడిని స్వర్గానికి పంపించి కీర్తిమంతుడిని చేస్తానని అభయమిస్తాడు. తనను శరణుజొచ్చిన కారణాన స్వర్గం అతడికి అరచేతిలో ఉసిరికాయ సమానంగా చేస్తానని హామీ ఇస్తాడు. తన కొడుకులను పిల్చి యజ్ఞానికి కావాల్సిన సామాగ్రిని సమకూర్చమని చెప్పాడు. తన ఆజ్ఞగా-తనపై గౌరవంతో, మునీశ్వరులందరు శిష్యులతో-ముఖ్య హితులతో-బహుశ్రు తులతో-ఋత్విజులతో రమ్మని పిలవాల్సిందిగా శిష్యులకు చెప్పాడు. ఎవరన్నా తన మాటను వినకపోతే, వారి సంగతి తనకు తెలియచేయాలన్న గురువు ఆజ్ఞానుసారం, శిష్యులు దేశ దేశాల్లో తిరిగి, బ్రహ్మ వాదులందరినీ పిలిచారు. విశ్వామిత్రుడికి భయపడి, ఇష్టమున్నా-లేకపోయినా అందరూ యజ్ఞాన్ని చూడడానికి వచ్చారు".

"ఇదిలా వుండగా వశిష్ఠుడి కుమారులకీ విషయం తెలిసి కోపంతో యజ్ఞాన్ని తప్పుబట్టారు. యజ్ఞం చేసేవాడు చండాలుడనీ, చేయించేవాడు రాజర్షైన క్షత్రియుడనీ, సద్బ్రాహ్మణులందరు చండాలుడి అన్నం ఎలా తింటారనీ, దేవతలెలా సంతోషంతో వస్తారనీ, చండాలుడు స్వర్గానికెలా పోతాడనీ, వాడుపోయే స్వర్గం ఎలాంటిదనీ మహోదయుడు-మిగిలిన వశిష్ఠుడి కుమారులన్నారని శిష్యులు గురువుతో చెప్పడంతో విశ్వామిత్రుడి కోపం తారాస్థాయికి చేరింది. విశేష ధ్యానంతో ధర్మాసక్తుడైన తనను పాపపు పలుకులతో దూషించిన వారందరూ మసైపోవాల్సిన వారని, వారందరూ చచ్చి నరకానికి పోయి-యమభటుల కఠిన పాశాలకు వశ పడి, ఏడొందల జన్మలవరకు పీనుగులుతినేవారిగా పుట్టాలని శపించాడు. కుక్క మాంసం తింటూ, దిక్కులేకుండా-దయాహీనులైన దుర్జాతివారిగా, నీచులుగా, వికార వేషాలతో భూమ్మీద అపూజ్యులై తిరగాలని కూడా శపించాడు విశ్వామిత్రుడు వశిష్ఠుడి కొడుకులను. తిట్టగూడని తిట్లు తిట్టిన మహోదయుడిని, బోయవాడిగా పుట్టి-భూమ్మీద తిరిగి, ఆత్మహత్య చేసుకుని, చివరకు తన కోపకారణాన దుర్గతులలో కూలిపోవాలని శపించాడు".

త్రిశంకుడిని స్వర్గానికి పంపిన విశ్వామిత్రుడు

         "ఈ విధంగా వశిష్ఠుడి కొడుకులను శపించిన విశ్వామిత్రుడు, తన పిలుపు మేరకు యజ్ఞం చూసేందుకొచ్చిన మునుల సమూహంతో, ఇక్ష్వాక వంశం రాజైన త్రిశంకుడనే ధర్మాత్ముడిని-మహాభాగ్య సంపన్నుడిని-దేహంతో స్వర్గానికి పోదల్చి తన సహాయం కోరినవాడిని వారికి పరిచయం చేస్తున్నానంటాడు. తమందరం కలిసి, ఆలోచించి, ఏ యజ్ఞం చేస్తే అతడి కోరిక నెరవేరుతుందో ఆ యజ్ఞాన్నే చేద్దామంటాడు. పరమ కోపిష్టైన విశ్వామిత్రుడికి భయపడిన వారందరూ, ఆయన మాట ఎందుకు కాదనాలని-ఆ మూర్ఖుడికెందుకు అడ్డు చెప్పాలని-ఆయన రాజు కోరిక నెరవేరుస్తుంటే తమ కొచ్చే నష్టమేంలేదని అనుకుని, ఆయన చెప్పినట్లే కార్య నిర్వహణకు పూనుకున్నారు. విశ్వామిత్రుడు యాజకుడై యాగం నిర్వహిస్తుండగా, మునులందరు తమకప్పచెప్పిన పనులను కడు హెచ్చరికతో చేసారు. యజ్ఞం సాగుతున్నప్పుడు, హవిర్భావాలను తీసుకెళ్లాల్సిందిగా విశ్వామిత్రుడు దేవతలను కోరినప్పటికీ, పిలిచిన వారెవరూ రాలేదక్కడికి. దాంతో ఆయన కోపంతో కళ్లెర్రచేశాడు. వెంటనే యజ్ఞం దగ్గరున్న కొయ్యగరిటను చేత్తో తీసుకుని, ప్రస్తుతానికి ప్రయోజనంలేని యజ్ఞంతో నిమిత్తం లేకుండా, తన తపశ్శక్తితో, దేహంతో స్వర్గానికి పంపిస్తానని త్రిశంకుడితో అంటాడు విశ్వామిత్రుడు".

         "తను సంపాదించిన తపఃఫలంలో, వశిష్ఠాదుల శాపంవల్ల ఖర్చయింది పోగా ,ఇంకా మిగలనున్నదాని బలంతో, బొందితో ఎవరికీ వెళ్లడానికి సాధ్యపడని స్వర్గానికి పొమ్మని త్రిశంకుడినంటాడు. విశ్వామిత్రుడలా అంటుండగానే, ఋషులందరు చూస్తుండగా, త్రిశంకుడు ఆకాశ మార్గంలో స్వర్గం చేరువలోకి పోయాడు. అప్పుడు దేవతా సమూహంతో వున్న ఇంద్రుడు, త్రిశంకుడిని చూసి, అతడు స్వర్గంలో వుండతగినవాడు కాదని, తిరిగి భూమిమీదకే పొమ్మని అంటాడు. గురువు శాపంతో చండాలుడైనవాడనీ, మూఢుడనీ, ఏ లోపంలేని మానవుడికే స్వర్గప్రాప్తిలేనప్పుడు వాడెలా స్వర్గంలోకి రాగలుగుతాడనీ కోపంతో, త్రిశంకుడిని తలకిందులుగా భూమిమీద దొర్లమని అంటాడు ఇంద్రుడు”.

తనను రక్షించమని వేడుకుంటాడు కిందకు పడుతున్న త్రిశంకుడు. అతడి దీనాలాపాలను విన్న విశ్వామిత్రుడు తీవ్రకోపంతో విజృంభించి, పడిపోతున్న త్రిశంకుడిని, ఆకాశం మధ్యలోనే నిలవమని-కింద పడొద్దని అంటూ, తన తపశ్శక్తితో ఆపు చేస్తాడు. అంతటితో ఆగకుండా, ఆకాశంలో దక్షిణదిక్కున సప్తర్షులను (నక్షత్రాలు) సృష్టించి, అక్కడో స్వర్గలోకాన్ని, మరో ఇంద్రుడిని-దేవతలను సృష్టించేందుకు సిద్ధమవుతాడు. తననుకునే విధంగా సృష్టించడం కుదరకపోతే, లోకంలో ఇంద్రుడే లేకుండా చేసేందుకు పూనుకుంటున్న సమయంలో దేవతలు, మునులు విశ్వామిత్రుడిదగ్గరకొచ్చి ప్రార్థించారు. తన తపశ్శక్తిని లోకోపకారానికి ఉపయోగించాలేగాని అలా చేయడం తగదనీ, గురు శాపంతో నిహతుడయినవాడిని స్వర్గానికి పంపడం తగదనీ, స్వర్గం పాడైపోకూడదనీ, అలా జరిగితే శాస్త్రాలన్నీ ధ్వంసమైపోవాల్సిందేననీ, అలా కావడానికి అతడు కారణం కారాదనీ అంటూ, విశ్వామిత్రుడిని శాంతించమని వేడుకుంటారు. రాజర్షైన వాడే ఇంత పనికి పూనుకుంటే, బ్రహ్మర్షులు కూడా శాస్త్ర  మర్యాద మీరితే ఏం కావాలని అడుగుతూ, శాస్త్ర మర్యాదను ఉల్లంఘించవద్దని అంటారు దేవతలు. అలా చెప్పిన వారితో, త్రిశంకుడిని స్వర్గానికి పంపిస్తానని తను మాటిచ్చానని, ఇచ్చిన మాటెలా తప్పాలని ప్రశ్నించి, తనొక ఉపాయం చెప్తానంటాడు. తాను సృష్టించిన నక్షత్రాలను ధ్వంసం చేయొద్దనీ-శాశ్వతంగా వుండనియ్యాలనీ, త్రిశంకుడు తలకిందుగా-అతడిని అనుసరించి ఆ నక్షత్రాలను అక్కడే వుండనివ్వాలని వారికి చెప్పాడు. వారొప్పుకోగానే, విశ్వామిత్రుడు శాంతించాడు. త్రిశంకుడు స్వర్గంలో లాగానే అక్కడే సుఖపడే వీలు కలిగించారు దేవతలు".

Saturday, January 22, 2022

ధృష్టద్యుమ్నుడు పాండవులకు, భీష్ముడు కౌరవులకు సర్వసేనాధిపత్యం ...... ఆస్వాదన-56 : వనం జ్వాలా నరసింహరావు

 ధృష్టద్యుమ్నుడు పాండవులకు, భీష్ముడు కౌరవులకు సర్వసేనాధిపత్యం

ఆస్వాదన-56

వనం జ్వాలా నరసింహరావు

సూర్యదినపత్రిక ఆదివారం అనుబంధం (23-01-2022)

రాయబారం అనంతరం సంధి పొసగలేదని ధర్మరాజుకు శ్రీకృష్ణుడు చెప్పిన తరువాత యుద్ధం చేయడమే కర్తవ్యం అని నిర్ణయించారు పాండవులు. పాండవుల పక్షాన వున్న ఏడక్షౌహిణుల సైన్యాన్ని నడిపించగలిగి, భీష్ముడిని ఎదుర్కునే శక్తి-సామర్థ్యాలు కల మేటి విలుకాడెవ్వరని ఆలోచన చేశారు ధర్మరాజాదులు. అలాంటివాడికే సర్వసేనాధిపత్యం ఇచ్చి అభిషేకించాలని నిశ్చయించారు. నకుల, సహదేవులు తమ అభిప్రాయం చెప్పిన తరువాత అర్జునుడు, ద్రోణాచార్యుడిని నిర్మూలించడానికే ఉద్భవించి, బాహుబలం, ప్రతాపం కలవాడైన ధృష్టద్యుమ్నుడు సర్వసైన్యాధిపతిగా  వుండడానికి తగినవాడని అన్నాడు. అతడు తప్ప మరొకడు భీష్ముడి ధాటికి తట్టుకోలేరన్నాడు. అలాగే భీష్ముడి పాలిటి మృత్యువై పుట్టిన శిఖండిని దళవాయిగా చేయవచ్చన్నాడు.

ధర్మరాజు శ్రీకృష్ణుడి అభిప్రాయం అడిగాడు. ధృష్టద్యుమ్నుడు సేనాధ్యక్షుడిగా వుండదగినవాడని, అతడిని ఏడక్షౌహిణుల సైన్యానికి నాయకుడిగా అభిషేకించమని చెప్పాడు శ్రీకృష్ణుడు. దానికి అంగీకరించిన ధర్మరాజు, ఏడక్షౌహిణుల సైన్యానికి విడివిడిగా అధిపతులను శ్రీకృష్ణుడినే నిర్ణయించమని కోరాడు. వెంటనే శ్రీకృష్ణుడు, సాహసోపేతులైన ద్రుపదుడిని, విరాటుడిని, సాత్యకిని, సహదేవుడిని (జరాసంధుడి కుమారుడు), చేకితానుడిని, ధృష్టకేతువుని (శిశుపాలుడి కొడుకు), శిఖండిని ఏడక్షౌహిణులకు అధిపతులుగా నియమించమని సలహా ఇచ్చాడు.

ఇది జరిగిన మర్నాడు ధర్మరాజు నిండు కొలువులో ముఖ్యులంతా వున్నప్పుడు, పరిజనులంతా వినే విధంగా యుద్ధం నిర్ణయమైనట్లు లాంఛనంగా ప్రకటించాడు. శ్రీకృష్ణుడి ఆదేశానుసారం ద్రుపదుడు మొదలైనవారిని వేర్వేరుగా అక్షౌహిణులకు నాయకులను చేశాడు. ధృష్టద్యుమ్నుడికి ప్రత్యేకంగా అభిషేకం చేసి, సర్వసేనాధిపత్యానికి పట్టం కట్టాడు. తరువాత వారందరినీ ఉద్దేశించి మాట్లాడుతూ కౌరవులతో యుద్ధం చేయడానికి అంతా కలసి తరలిపోదాం అన్నాడు ధర్మరాజు. ఆ ఎనిమిదిమందిని అహర్నిశలూ కనిపెట్టుకుని వుండమని, కంటికి రెప్పలా కాపాడమని, కర్తవ్య దీక్షలో వుండమని, శ్రీకృష్ణుడే అతడికి రక్షకుడని అర్జునుడికి చెప్పాడు. వెంటనే ధర్మరాజు యుద్ధం చేయడానికి పూనిక వహించి, ప్రస్థాన భేరి మోగించమని ఆజ్ఞాపించాడు. ఆయన యుద్ధ ప్రస్థానభేరితో దిక్కులు బద్దలయ్యాయి.

ప్రయాణ భేరి మోగగానే యుద్ధయాత్రకు సమస్త సైన్యాలు సంసిద్ధమయ్యాయి. పాండవులు తమ పట్టపు రాణి అయిన ద్రౌపదీదేవికి వెళ్లి వస్తామని చెప్పి ఆమె దగ్గర వీడ్కోలు తీసుకున్నారు.

ధర్మరాజు రథాన్ని అధిరోహించాడు. అర్జునుడు ఆయన దగ్గరికి వచ్చి నమస్కరించాడు. తరువాత తన శంఖాన్ని పూరించాడు. శ్రీకృష్ణుడి సారథ్యంలోని రథం మీద ఎక్కాడు. ఆ రథం మీద హనుమద్ద్వజం రెపరెపలాడుతున్నది. భీముడు, నకులుడు, సహదేవుడు, అభిమన్యుడు, ఉపపాండవులు రథాలను అధిరోహించే ముందర ధర్మరాజుకు నమస్కరించారు. తక్కిన రాజులు కూడా ఆలాగే చేశారు. ధృష్టద్యుమ్నుడు ధర్మరాజుకు సాగిలపడి నమస్కరించి అశ్వాన్ని అధిరోహించాడు. అలా సేనతో కలిసి ధర్మరాజు కురుక్షేత్రాన్ని సమీపించాడు. చదునైన ఒక ప్రదేశంలో, హిరణ్వతి అనే ఒక పవిత్ర నది ఒడ్డున ఆగాడు. అది సైన్యం విడిది చేయడానికి సరైన చోటుగా నిర్ధారణ చేశాడు. అక్కడ సైన్యం దిగితున్నట్లు గుర్తుగా శ్రీకృష్ణుడు తన పాంచజన్యాన్ని పూరించాడు. ధర్మరాజాదులు కూడా అలాగే తమ వీరశంఖాలను పూరించారు.

ఇదిలా వుండగా వేగులవారి ద్వారా పాండవులు దండు విడిసినారని విన్నప్పటికీ ఏమీ తెలియనివాడిలా తనవారిని పిలచి, పాండవులు యుద్ధానికి వస్తారని, అందువల్ల, మర్నాడే దండయాత్ర అని చాటించమని ఆదేశించాడు. తాము సైన్యంతో విడిది చేయాల్సిన స్థలం కురుక్షేత్రమని అంటూ, దుశ్శాసనుడిని అన్ని పనులు చూసుకోమన్నాడు. ఆ మర్నాడు దుర్యోధనుడు కొలువు కూటానికి వచ్చాడు. ద్రోణాచార్యుడిని, రాధేయుడిని, అశ్వత్థామను, బాహ్లికుడిని, శల్యుడిని, కృపాచార్యుడిని, భూరిశ్రవుడిని, శకునిని, కృతవర్మను, కాంభోజరాజును, సైంధవుడిని కౌరవుల పదకొండక్షౌహిణులకు సేనానాయకులుగా నియమించాలని నిశ్చయించిన దుర్యోధనుడు వారందరినీ సభకు పిలిపించాడు. వారిని సేనాపతిత్వానికి అభిషిక్తులు కమ్మని కోరి, వారందరినీ వైభవంగా అక్షౌహిణీపతులుగా అభిషిక్తులను చేశాడు దుర్యోధనుడు.

 అక్షౌహిణీపతులందరిని తీసుకుని భీష్ముడి దగ్గరికి పోయాడు దుర్యోధనుడు. ఆయనకు నమస్కరించాడు. వారిని సేనానాయకులుగా పరిచయం చేశాడాయనకు. యావత్ యుద్ధానికి రణభారం వహించి సర్వసైన్యాధిపత్యం నిర్వహించడానికి అంగీకరించమని భీష్ముడిని ప్రార్థించాడు. తాను సర్వసేనాధిపత్యం వహిస్తానని, తనను ఎదుర్కోగల పురుషులెవ్వరూ భూమ్మీద లేరని, అయితే తాను ఆర్జునుడిని మాత్రం ఎదుర్కోలేనని అన్నాడు. పాండుకుమారులను సంహరించడానికి తనకు చేతులు రావని కూడా చెప్పాడు. ముందు తనను కాని, కర్ణుడిని కాని యుద్ధం చేయడానికి నియోగించమని అన్నాడు. అలా అయితేనే తాను సర్వసేనాధిపత్యం వహిస్తానని స్పష్టం చేశాడు. తానెలాగు భీష్ముడు రణరంగంలో నేలకూలేదాకా యుద్ధం చేయనన్నానుగా అన్నాడు కర్ణుడు. సరే అని భీష్ముడు కౌరవుల సర్వసేనాధిపతిగా పట్టం కట్టుకోవడానికి అంగీకరించాడు. దుర్యోధనుడు సర్వసేనాధిపత్యానికి భీష్ముడిని అభిషేకించాడు. సర్వసైన్యాధ్యక్ష పదవి ఆయనకు అప్పగించాడు.

దుర్యోధనుడు భీష్ముడిని ముందుంచుకొని కురుక్షేత్రానికి నడిచాడు. కురుక్షేత్రానికి ప్రవేశించి, అక్కడ ఒక ప్రదేశంలో సేనలను దింపాడు. ఇలా కురుక్షేత్రంలో కౌరవ-పాండవ సేనలు చేరి యుద్ధానికి సిద్ధమయ్యాయి. 

కవిత్రయ విరచిత

శ్రీమదాంధ్ర మహాభారతం, ఉద్యోగపర్వం, చతుర్థాశ్వాసం

(తిరుమల, తిరుపతి దేవస్థానాల ప్రచురణ)

Sunday, January 16, 2022

త్రిశంకూపాఖ్యానం ...... శ్రీ మదాంధ్ర వాల్మీకి రామాయణం బాలకాండ మందర మకరందం-91 : వనం జ్వాలా నరసింహారావు

 త్రిశంకూపాఖ్యానం

శ్రీ మదాంధ్ర వాల్మీకి రామాయణం బాలకాండ మందర మకరందం-91

వనం జ్వాలా నరసింహారావు

సూర్యదినపత్రిక (17-01-2022)

         "వశిష్ఠుడితో తనకు కలిగిన విరోధం-పరాభవం, ఓటమికి కుమిలిపోతూ, శోకంతో ఏమీ చేయలేక లోలోపలే విశ్వామిత్రుడు బాధపడుతుండేవాడు. భార్యతో దక్షిణ దిక్కుగా పోయి, తీవ్రమైన తపస్సు చేస్తున్న సమయంలో, హవిష్యందుడు, మధుష్యందుడు, దృఢనేత్రుడు, మహారథుడనే నలుగురు కొడుకులు కలిగారు. అలానే వేయి సంవత్సరాలు తపస్సుచేసింతర్వాత, బ్రహ్మ ప్రత్యక్షమై, విశ్వామిత్రుడు తన తపస్సుతో రాజర్షులందరినీ మించిపోయాడని-ఆయన గూడా రాజర్షిగా  అయ్యాడని వరమిచ్చి తన లోకానికి వెళ్లిపోతాడు. తనింతకాలం తపస్సు చేసింది రాజర్షికావడానికానని పరితపించి, విచారపడి, సిగ్గుతో తలవంచుకుని దుఃఖంతోనూ-శోకంతోనూ కుమిలిపోయాడు. తనింతగా చేసిన తపస్సు వ్యర్థమయిందని భావించిన విశ్వామిత్రుడు, మునుపటికంటే గొప్పగా తపస్సు చేయాలని నిశ్చయించుకుని, అనుకున్న విధంగా చేయసాగాడు".

"అలా విశ్వామిత్రుడు ఘోర తపస్సు చేస్తున్న సమయంలో, అయోధ్యలో త్రిశంకుడు అనే రాజు, దేహంతో స్వర్గానికి పోవాలని-అక్కడ స్వర్గ సుఖాలనుభవించాలని అనుకొని, వశిష్ఠుడిని పిలిచి తన కోరిక తెలిపి, దానికొరకు తనతో యాగం చేయించమని అడుగుతాడు. వశిష్ఠుడు, అది సాధ్యపడదని అనగానే, త్రిశంకుడు ఆయన్ను వదిలి దక్షిణ దిక్కుగా వశిష్ఠుడి నూర్గురు కొడుకుల వద్దకు వెళ్తాడు. కీర్తితో ప్రసిద్ధికెక్కిన అసమాన తేజోవంతులైన ఆ గురుపుత్రులందరికీ చేతులు జోడించి నమస్కరించాడు త్రిశంకుడు. వారి శరణుజొచ్చానని, వారే తన రక్షకులని, దేహంతో స్వర్గానికి పోవాలన్న తన కోరికను తీర్చుకునేందుకు యజ్ఞం చేయించమని అడిగితే వారి తండ్రి ఒప్పుకోనందున అవమాన పడ్డానని అంటాడు. ’గురు పుత్రులారా, మీ పాదాలపై నా శిరస్సుంచి మొక్కుతాను. పరమ తపస్వులారా నన్ను రక్షించండి. నేను ఈ దేహంతో స్వర్గానికి పోయే యాగాన్ని నాతో చేయించండి. మీ తండ్రి నేను రాజునని మరిచి-రాజుల కార్యం నెరవేర్చడం పురోహితుల ధర్మమని ఆలోచించకుండా నన్ను ధిక్కరించాడు. ఇక మీరే నాకి దిక్కు. ఇక్ష్వాకుల రాజ వంశానికి పురోహితులైన మీరే ఈ కార్యం నాతో చేయించకపోతే, మీరు పురోహితులా వుండి ఏం ప్రయోజనం’ అని వశిష్థుడి కొడుకులతో నిష్టూరంగా మాట్లాడుతాడు త్రిశంకుడు".

త్రిశంకుడనే పేరు రావడానికి కారణం దైవ పౌరుష బల విచారం

         "ఇలా మాట్లాడుతున్న రాజు చెప్పిందంతా విన్న వశిష్ఠుడి నూర్గురు కొడుకులకు విపరీతమైన కోపమొచ్చింది. ’ఓరీ వివేక హీనుడా, సత్యం పలికిన గురువుగురించి ఇలా మాట్లాడవచ్చా? ఆయన్ను కాదని ఇంకొకరిని ఆశ్రయించవచ్చా? కుల గురువును విడవడం మర్యాదేనా? సూర్య వంశపు రాజులందరికి పురోహితుడే ఆచార్యుడు.ఆయన మాట జవదాటవచ్చా? ఆయన అబధ్ధాలాడుతున్నాడనుకుంటున్నావా? ఏమనుకుని ఆయన్ను వదిలావు? నిన్నొకిడినేకాదు-లోకాలన్నిట్లో ఏ యాగమైనా, ఎవరితోనైనా చేయించగల శక్తి ఆయనకుంది. వశిష్ఠుడు కాదంటే మేమెలా చేయిస్తామనుకున్నావు? చేయిస్తే ఆయన్ను అవమానించినట్లేకదా? అలాంటి పని మేం చేయొచ్చా’ అని అంటారు. కఠినంగా మాట్లాడిన వారితో, గురువుతో అవమానించబడ్డానని-ఆయన కుమారులతో కూడా అవమానించబడ్డానని, ఇంకొకరి శరణువేడి తన కార్యం సాధించుకుంటానని వెళ్లడానికి సిద్ధమవుతాడు. నిష్కారణంగా గురు ధిక్కారానికి పాల్పడ్డ త్రిశంకుడిని, చండాలుడు కమ్మని శపించి తమ ఆశ్రమానికి పోయారు వశిష్ఠుడి కొడుకులు. రాజు తన నగరానికి పోయాడు".

         "ఉదయం నిద్రలేచి తన ముఖం-శరీరం చూసుకుంటాడు రాజు. అందంగా సుతిమెత్తగా వుండే శరీరం నల్లబడిపోయింది.బంగారుకాంతితో అతిశయిస్తుండే అందమైనదేహం వానాకాలంమబ్బులా నల్లబడింది. మెత్తగా-నిడువుగావుండే తలవెంట్రుకలు, బిరుసుగా - చింపిరిగామారాయి. మణులుచెక్కిన బంగారు సొమ్ములన్నీ ఇనుపముక్కలై పోయాయి. మెడలో వేలాడే జందెంపోగు, ఇనుప తాడయింది. సహించనలవికాని మునుల శాపంవల్ల సర్వనాశనమైంది. అలా తయారైన తమ రాజును చూసిన పురప్రజలందరు దూరంగా పోసాగారు. అందరూ తన్నొదిలిపోయినా, ధైర్యం కోల్పోని రాజు దుఃఖంతో పరితపిస్తూ, విశ్వామిత్రుడిని ఆశ్రయించాడు. తనవద్దకొచ్చిన వాడు త్రిశంకుడనే రాజని గ్రహించిన విశ్వామిత్రుడు, అతనెందుకలా శాపవశాన మాలవాడయ్యాడనీ-ఎందుకు తన దగ్గరకు వచ్చాడని దయతో అడుగుతాడు. తనను తనగురువు-గురుపుత్రులు ఉపేక్షించారని, తన కోరిక తీరకపోగా ఇలా తయారయ్యానని, అవమానపడ్డానని, దేహంతో స్వర్గానికి పోవాలని వందలాది యజ్ఞాలు చేసినా ఫలితం కలగలేదని అంటాడు".

"తనింతవరకు ఎన్నడూ అసత్యం పలకలేదని, ఇప్పుడిలాంటి దశ వచ్చినా-మున్ముందు అసత్యమాడబోనని క్షత్రియ ధర్మంపై ప్రమాణం చేసి చెప్పుతున్నానన్నాడు. తాను రాజధర్మం విడవక ప్రజాహితమైన కార్యాలను చేసానని, కష్ఠకాలంలో కూడా సత్యమే పలుకుతానని అంటాడు త్రిశంకుడు. తానెన్నో యజ్ఞాలు చేసానని, మంచి నడవడితో గురువులను సంతోషపెట్టానని, కీర్తి సంపాదించానని, ఇంతచేసినా ఇప్పుడు తనుచేయదల్చిన యజ్ఞం చేయించడానికి వారు ఒప్పుకోవడంలేదని, తన పౌరుషం వ్యర్థమనీ-దైవమే శ్రేష్ఠమనీ తలుస్తున్నానని, సర్వం దైవానికి లోబడేవుంటుందని, ఉత్తమ గతికూడా దైవానుగ్రహమేనని, దైవం కరుణించకపోతే పౌరుషం ఫలించదని అంటూ, విశ్వామిత్రుడిని తప్ప ఇతరులను ఆశ్రయించననీ-అతడే నిశ్చయంగా తనకు రక్షకుడనీ, తను తలపెట్టిన కార్యాన్ని పురుష ప్రయత్నంతో సఫలం చేయమనీ ప్రార్తించాడు త్రిశంకుడు విశ్వామిత్రుడిని".

         (ఆంధ్ర వాల్మీకిరామాయణం బాల కాండ మందరంలో, అవసరమైన ప్రతిచోటా, మనుష్యులు ఆచరించాల్సిన ధర్మాలను సందర్భోచితంగా వివరించబడింది. త్రిశంకుడి కోరిక వక్రబుద్ధిగల శిష్య లక్షణంగా అర్థంచేసుకోవచ్చు. సరైన శిష్యుడు, తనకేది హితమో-పథ్యమో, అది చెప్పమని గురువులను కోరాలి గాని, నిర్భంధించి-తన ఇష్టప్రకారం, అసాధ్యమైన పనులు చేయించమని అడిగి-ఆయన చేయించనన్నాడని గురువును త్యజించడం దోషం. గురు శుశ్రూష చేసి, అతడి మనస్సును సంతోషపర్చి, తన కార్యాన్ని సాధించుకోవాలి శిష్యుడు. అలాచేయనందువల్లే త్రిశంకుడి ఆ గతి పట్టింది. వశష్ఠుడి కొడుకులు త్రిశంకుడి కోరిక తిరస్కరించడమంటే, పుత్రులు తండ్రి మార్గాన్ని అనుసరించి ప్రవర్తించాలని, ఆయనకు అవమానకరమైన పనులు చేయకూడదని అర్థం. గురువును నిందించినవాడు చండాలుడవుతాడన్న అర్థం కూడా స్ఫురిస్తుంది.

         త్రిశంకుడి అసలు పేరు సత్యవ్రతుడు. ఆయన భార్య సత్యవ్రత-కేకయ రాజు కూతురు. సత్యవ్రతుడు సూర్యారుణుడి కొడుకు. అతడు సత్యవ్రతను పెళ్లి చేసుకున్న తర్వాత, అయోధ్యా నగరంలో నివసిస్తున్న ఒక బాలికను-వివాహితను, రాజకుమారిడినన్న అదికా గర్వంతో, చెరిచాడు. రాజుకీవిషయం తెలిసి, కోపించి, తనదగ్గర వుండొద్దని సత్యవ్రతుడిని ఆజ్ఞాపించాడు. కుక్క మాంసం తిని బతకమని కూడా తండ్రి ఆదేశించాడు. తన పక్షాన పురోహితుడైన వశిశ్ఠుడు తండ్రితో మాట్లాడలేదని సత్యవ్రతుడికి ఆయనపై కోపమొస్తుంది. ఆ తర్వాత కొంతకాలానికి, సత్యవ్రతుడి తండ్రి అడవికి పోయి తపస్సు చేయసాగాడు. రాజ్యం, నగరం, అంతఃపురం ఇబ్బందులకు గురి కావద్దని, వశిష్ఠుడు స్వయంగా కాపాడసాగాడాసమయంలో. ఆ సమయంలోనే, విశ్వామిత్రుడు, భార్యా పిల్లలను వదిలి పశ్చిమ సముద్ర తీరంలో తపస్సు చేస్తుండేవాడు. ముగ్గురు పిల్లల్ని, తన్ను పోషించుకోలేక విశ్వామిత్రుడి భార్య, నడిమికొడుకు మెడకు పలుపు తగిలించి, వంద ఆవులిస్తే అమ్మడానికి బేరం పెట్టింది. ఆ విషయం తెలుసుకున్న సత్యవ్రతుడు, ఆమెను వారించి, వారందరినీ తన రక్షణలో వుంచుకున్నాడు. ప్రతిదినం జంతువులను వేటాడి వారందరికీ మాంసాహారం పెట్టి పోషించేవాడు. ఒక రోజున వేటాడేందుకు ఒక్క జంతువుకూడా దొరకలేదు. సమీపంలోనే వున్న వశిష్ఠుడి ఆవును చంపి దాని మాంసం తిన్నారారోజున. తండ్రికి అప్రియమైన పనులు చేయడం,  పాలిచ్చే గురువు గోవును చంపడం, అప్రోక్షిత మాంసాన్ని తినడం అనే మూడు చెడు కార్యాలను చేసినందున త్రిశంకుడు అనే పేరుతో వ్యవహరించమని-లోక నిందితుడైన అతడిని తనింకేమీ చేయనని అంటాడు కోపించిన వశిశ్ఠుడు. అప్పటినుండి సత్యవ్రతుడు త్రిశంకుడయ్యాడు. తపస్సు పూర్తయిన తర్వాత వచ్చిన విశ్వామిత్రుడు, తన భార్యా పిల్లలను కాపాడిన త్రిశంకుడితో, ఆయన కోరుకున్నప్పుడు కావాల్సిన సహాయం చేస్తానని హామీ ఇచ్చినందువల్లనే ఇప్పుడు యజ్ఞం చేయించేందుకు పూనుకుంటున్నాడు).