Sunday, January 16, 2022

త్రిశంకూపాఖ్యానం ...... శ్రీ మదాంధ్ర వాల్మీకి రామాయణం బాలకాండ మందర మకరందం-91 : వనం జ్వాలా నరసింహారావు

 త్రిశంకూపాఖ్యానం

శ్రీ మదాంధ్ర వాల్మీకి రామాయణం బాలకాండ మందర మకరందం-91

వనం జ్వాలా నరసింహారావు

సూర్యదినపత్రిక (17-01-2022)

         "వశిష్ఠుడితో తనకు కలిగిన విరోధం-పరాభవం, ఓటమికి కుమిలిపోతూ, శోకంతో ఏమీ చేయలేక లోలోపలే విశ్వామిత్రుడు బాధపడుతుండేవాడు. భార్యతో దక్షిణ దిక్కుగా పోయి, తీవ్రమైన తపస్సు చేస్తున్న సమయంలో, హవిష్యందుడు, మధుష్యందుడు, దృఢనేత్రుడు, మహారథుడనే నలుగురు కొడుకులు కలిగారు. అలానే వేయి సంవత్సరాలు తపస్సుచేసింతర్వాత, బ్రహ్మ ప్రత్యక్షమై, విశ్వామిత్రుడు తన తపస్సుతో రాజర్షులందరినీ మించిపోయాడని-ఆయన గూడా రాజర్షిగా  అయ్యాడని వరమిచ్చి తన లోకానికి వెళ్లిపోతాడు. తనింతకాలం తపస్సు చేసింది రాజర్షికావడానికానని పరితపించి, విచారపడి, సిగ్గుతో తలవంచుకుని దుఃఖంతోనూ-శోకంతోనూ కుమిలిపోయాడు. తనింతగా చేసిన తపస్సు వ్యర్థమయిందని భావించిన విశ్వామిత్రుడు, మునుపటికంటే గొప్పగా తపస్సు చేయాలని నిశ్చయించుకుని, అనుకున్న విధంగా చేయసాగాడు".

"అలా విశ్వామిత్రుడు ఘోర తపస్సు చేస్తున్న సమయంలో, అయోధ్యలో త్రిశంకుడు అనే రాజు, దేహంతో స్వర్గానికి పోవాలని-అక్కడ స్వర్గ సుఖాలనుభవించాలని అనుకొని, వశిష్ఠుడిని పిలిచి తన కోరిక తెలిపి, దానికొరకు తనతో యాగం చేయించమని అడుగుతాడు. వశిష్ఠుడు, అది సాధ్యపడదని అనగానే, త్రిశంకుడు ఆయన్ను వదిలి దక్షిణ దిక్కుగా వశిష్ఠుడి నూర్గురు కొడుకుల వద్దకు వెళ్తాడు. కీర్తితో ప్రసిద్ధికెక్కిన అసమాన తేజోవంతులైన ఆ గురుపుత్రులందరికీ చేతులు జోడించి నమస్కరించాడు త్రిశంకుడు. వారి శరణుజొచ్చానని, వారే తన రక్షకులని, దేహంతో స్వర్గానికి పోవాలన్న తన కోరికను తీర్చుకునేందుకు యజ్ఞం చేయించమని అడిగితే వారి తండ్రి ఒప్పుకోనందున అవమాన పడ్డానని అంటాడు. ’గురు పుత్రులారా, మీ పాదాలపై నా శిరస్సుంచి మొక్కుతాను. పరమ తపస్వులారా నన్ను రక్షించండి. నేను ఈ దేహంతో స్వర్గానికి పోయే యాగాన్ని నాతో చేయించండి. మీ తండ్రి నేను రాజునని మరిచి-రాజుల కార్యం నెరవేర్చడం పురోహితుల ధర్మమని ఆలోచించకుండా నన్ను ధిక్కరించాడు. ఇక మీరే నాకి దిక్కు. ఇక్ష్వాకుల రాజ వంశానికి పురోహితులైన మీరే ఈ కార్యం నాతో చేయించకపోతే, మీరు పురోహితులా వుండి ఏం ప్రయోజనం’ అని వశిష్థుడి కొడుకులతో నిష్టూరంగా మాట్లాడుతాడు త్రిశంకుడు".

త్రిశంకుడనే పేరు రావడానికి కారణం దైవ పౌరుష బల విచారం

         "ఇలా మాట్లాడుతున్న రాజు చెప్పిందంతా విన్న వశిష్ఠుడి నూర్గురు కొడుకులకు విపరీతమైన కోపమొచ్చింది. ’ఓరీ వివేక హీనుడా, సత్యం పలికిన గురువుగురించి ఇలా మాట్లాడవచ్చా? ఆయన్ను కాదని ఇంకొకరిని ఆశ్రయించవచ్చా? కుల గురువును విడవడం మర్యాదేనా? సూర్య వంశపు రాజులందరికి పురోహితుడే ఆచార్యుడు.ఆయన మాట జవదాటవచ్చా? ఆయన అబధ్ధాలాడుతున్నాడనుకుంటున్నావా? ఏమనుకుని ఆయన్ను వదిలావు? నిన్నొకిడినేకాదు-లోకాలన్నిట్లో ఏ యాగమైనా, ఎవరితోనైనా చేయించగల శక్తి ఆయనకుంది. వశిష్ఠుడు కాదంటే మేమెలా చేయిస్తామనుకున్నావు? చేయిస్తే ఆయన్ను అవమానించినట్లేకదా? అలాంటి పని మేం చేయొచ్చా’ అని అంటారు. కఠినంగా మాట్లాడిన వారితో, గురువుతో అవమానించబడ్డానని-ఆయన కుమారులతో కూడా అవమానించబడ్డానని, ఇంకొకరి శరణువేడి తన కార్యం సాధించుకుంటానని వెళ్లడానికి సిద్ధమవుతాడు. నిష్కారణంగా గురు ధిక్కారానికి పాల్పడ్డ త్రిశంకుడిని, చండాలుడు కమ్మని శపించి తమ ఆశ్రమానికి పోయారు వశిష్ఠుడి కొడుకులు. రాజు తన నగరానికి పోయాడు".

         "ఉదయం నిద్రలేచి తన ముఖం-శరీరం చూసుకుంటాడు రాజు. అందంగా సుతిమెత్తగా వుండే శరీరం నల్లబడిపోయింది.బంగారుకాంతితో అతిశయిస్తుండే అందమైనదేహం వానాకాలంమబ్బులా నల్లబడింది. మెత్తగా-నిడువుగావుండే తలవెంట్రుకలు, బిరుసుగా - చింపిరిగామారాయి. మణులుచెక్కిన బంగారు సొమ్ములన్నీ ఇనుపముక్కలై పోయాయి. మెడలో వేలాడే జందెంపోగు, ఇనుప తాడయింది. సహించనలవికాని మునుల శాపంవల్ల సర్వనాశనమైంది. అలా తయారైన తమ రాజును చూసిన పురప్రజలందరు దూరంగా పోసాగారు. అందరూ తన్నొదిలిపోయినా, ధైర్యం కోల్పోని రాజు దుఃఖంతో పరితపిస్తూ, విశ్వామిత్రుడిని ఆశ్రయించాడు. తనవద్దకొచ్చిన వాడు త్రిశంకుడనే రాజని గ్రహించిన విశ్వామిత్రుడు, అతనెందుకలా శాపవశాన మాలవాడయ్యాడనీ-ఎందుకు తన దగ్గరకు వచ్చాడని దయతో అడుగుతాడు. తనను తనగురువు-గురుపుత్రులు ఉపేక్షించారని, తన కోరిక తీరకపోగా ఇలా తయారయ్యానని, అవమానపడ్డానని, దేహంతో స్వర్గానికి పోవాలని వందలాది యజ్ఞాలు చేసినా ఫలితం కలగలేదని అంటాడు".

"తనింతవరకు ఎన్నడూ అసత్యం పలకలేదని, ఇప్పుడిలాంటి దశ వచ్చినా-మున్ముందు అసత్యమాడబోనని క్షత్రియ ధర్మంపై ప్రమాణం చేసి చెప్పుతున్నానన్నాడు. తాను రాజధర్మం విడవక ప్రజాహితమైన కార్యాలను చేసానని, కష్ఠకాలంలో కూడా సత్యమే పలుకుతానని అంటాడు త్రిశంకుడు. తానెన్నో యజ్ఞాలు చేసానని, మంచి నడవడితో గురువులను సంతోషపెట్టానని, కీర్తి సంపాదించానని, ఇంతచేసినా ఇప్పుడు తనుచేయదల్చిన యజ్ఞం చేయించడానికి వారు ఒప్పుకోవడంలేదని, తన పౌరుషం వ్యర్థమనీ-దైవమే శ్రేష్ఠమనీ తలుస్తున్నానని, సర్వం దైవానికి లోబడేవుంటుందని, ఉత్తమ గతికూడా దైవానుగ్రహమేనని, దైవం కరుణించకపోతే పౌరుషం ఫలించదని అంటూ, విశ్వామిత్రుడిని తప్ప ఇతరులను ఆశ్రయించననీ-అతడే నిశ్చయంగా తనకు రక్షకుడనీ, తను తలపెట్టిన కార్యాన్ని పురుష ప్రయత్నంతో సఫలం చేయమనీ ప్రార్తించాడు త్రిశంకుడు విశ్వామిత్రుడిని".

         (ఆంధ్ర వాల్మీకిరామాయణం బాల కాండ మందరంలో, అవసరమైన ప్రతిచోటా, మనుష్యులు ఆచరించాల్సిన ధర్మాలను సందర్భోచితంగా వివరించబడింది. త్రిశంకుడి కోరిక వక్రబుద్ధిగల శిష్య లక్షణంగా అర్థంచేసుకోవచ్చు. సరైన శిష్యుడు, తనకేది హితమో-పథ్యమో, అది చెప్పమని గురువులను కోరాలి గాని, నిర్భంధించి-తన ఇష్టప్రకారం, అసాధ్యమైన పనులు చేయించమని అడిగి-ఆయన చేయించనన్నాడని గురువును త్యజించడం దోషం. గురు శుశ్రూష చేసి, అతడి మనస్సును సంతోషపర్చి, తన కార్యాన్ని సాధించుకోవాలి శిష్యుడు. అలాచేయనందువల్లే త్రిశంకుడి ఆ గతి పట్టింది. వశష్ఠుడి కొడుకులు త్రిశంకుడి కోరిక తిరస్కరించడమంటే, పుత్రులు తండ్రి మార్గాన్ని అనుసరించి ప్రవర్తించాలని, ఆయనకు అవమానకరమైన పనులు చేయకూడదని అర్థం. గురువును నిందించినవాడు చండాలుడవుతాడన్న అర్థం కూడా స్ఫురిస్తుంది.

         త్రిశంకుడి అసలు పేరు సత్యవ్రతుడు. ఆయన భార్య సత్యవ్రత-కేకయ రాజు కూతురు. సత్యవ్రతుడు సూర్యారుణుడి కొడుకు. అతడు సత్యవ్రతను పెళ్లి చేసుకున్న తర్వాత, అయోధ్యా నగరంలో నివసిస్తున్న ఒక బాలికను-వివాహితను, రాజకుమారిడినన్న అదికా గర్వంతో, చెరిచాడు. రాజుకీవిషయం తెలిసి, కోపించి, తనదగ్గర వుండొద్దని సత్యవ్రతుడిని ఆజ్ఞాపించాడు. కుక్క మాంసం తిని బతకమని కూడా తండ్రి ఆదేశించాడు. తన పక్షాన పురోహితుడైన వశిశ్ఠుడు తండ్రితో మాట్లాడలేదని సత్యవ్రతుడికి ఆయనపై కోపమొస్తుంది. ఆ తర్వాత కొంతకాలానికి, సత్యవ్రతుడి తండ్రి అడవికి పోయి తపస్సు చేయసాగాడు. రాజ్యం, నగరం, అంతఃపురం ఇబ్బందులకు గురి కావద్దని, వశిష్ఠుడు స్వయంగా కాపాడసాగాడాసమయంలో. ఆ సమయంలోనే, విశ్వామిత్రుడు, భార్యా పిల్లలను వదిలి పశ్చిమ సముద్ర తీరంలో తపస్సు చేస్తుండేవాడు. ముగ్గురు పిల్లల్ని, తన్ను పోషించుకోలేక విశ్వామిత్రుడి భార్య, నడిమికొడుకు మెడకు పలుపు తగిలించి, వంద ఆవులిస్తే అమ్మడానికి బేరం పెట్టింది. ఆ విషయం తెలుసుకున్న సత్యవ్రతుడు, ఆమెను వారించి, వారందరినీ తన రక్షణలో వుంచుకున్నాడు. ప్రతిదినం జంతువులను వేటాడి వారందరికీ మాంసాహారం పెట్టి పోషించేవాడు. ఒక రోజున వేటాడేందుకు ఒక్క జంతువుకూడా దొరకలేదు. సమీపంలోనే వున్న వశిష్ఠుడి ఆవును చంపి దాని మాంసం తిన్నారారోజున. తండ్రికి అప్రియమైన పనులు చేయడం,  పాలిచ్చే గురువు గోవును చంపడం, అప్రోక్షిత మాంసాన్ని తినడం అనే మూడు చెడు కార్యాలను చేసినందున త్రిశంకుడు అనే పేరుతో వ్యవహరించమని-లోక నిందితుడైన అతడిని తనింకేమీ చేయనని అంటాడు కోపించిన వశిశ్ఠుడు. అప్పటినుండి సత్యవ్రతుడు త్రిశంకుడయ్యాడు. తపస్సు పూర్తయిన తర్వాత వచ్చిన విశ్వామిత్రుడు, తన భార్యా పిల్లలను కాపాడిన త్రిశంకుడితో, ఆయన కోరుకున్నప్పుడు కావాల్సిన సహాయం చేస్తానని హామీ ఇచ్చినందువల్లనే ఇప్పుడు యజ్ఞం చేయించేందుకు పూనుకుంటున్నాడు).

No comments:

Post a Comment