Saturday, January 22, 2022

ధృష్టద్యుమ్నుడు పాండవులకు, భీష్ముడు కౌరవులకు సర్వసేనాధిపత్యం ...... ఆస్వాదన-56 : వనం జ్వాలా నరసింహరావు

 ధృష్టద్యుమ్నుడు పాండవులకు, భీష్ముడు కౌరవులకు సర్వసేనాధిపత్యం

ఆస్వాదన-56

వనం జ్వాలా నరసింహరావు

సూర్యదినపత్రిక ఆదివారం అనుబంధం (23-01-2022)

రాయబారం అనంతరం సంధి పొసగలేదని ధర్మరాజుకు శ్రీకృష్ణుడు చెప్పిన తరువాత యుద్ధం చేయడమే కర్తవ్యం అని నిర్ణయించారు పాండవులు. పాండవుల పక్షాన వున్న ఏడక్షౌహిణుల సైన్యాన్ని నడిపించగలిగి, భీష్ముడిని ఎదుర్కునే శక్తి-సామర్థ్యాలు కల మేటి విలుకాడెవ్వరని ఆలోచన చేశారు ధర్మరాజాదులు. అలాంటివాడికే సర్వసేనాధిపత్యం ఇచ్చి అభిషేకించాలని నిశ్చయించారు. నకుల, సహదేవులు తమ అభిప్రాయం చెప్పిన తరువాత అర్జునుడు, ద్రోణాచార్యుడిని నిర్మూలించడానికే ఉద్భవించి, బాహుబలం, ప్రతాపం కలవాడైన ధృష్టద్యుమ్నుడు సర్వసైన్యాధిపతిగా  వుండడానికి తగినవాడని అన్నాడు. అతడు తప్ప మరొకడు భీష్ముడి ధాటికి తట్టుకోలేరన్నాడు. అలాగే భీష్ముడి పాలిటి మృత్యువై పుట్టిన శిఖండిని దళవాయిగా చేయవచ్చన్నాడు.

ధర్మరాజు శ్రీకృష్ణుడి అభిప్రాయం అడిగాడు. ధృష్టద్యుమ్నుడు సేనాధ్యక్షుడిగా వుండదగినవాడని, అతడిని ఏడక్షౌహిణుల సైన్యానికి నాయకుడిగా అభిషేకించమని చెప్పాడు శ్రీకృష్ణుడు. దానికి అంగీకరించిన ధర్మరాజు, ఏడక్షౌహిణుల సైన్యానికి విడివిడిగా అధిపతులను శ్రీకృష్ణుడినే నిర్ణయించమని కోరాడు. వెంటనే శ్రీకృష్ణుడు, సాహసోపేతులైన ద్రుపదుడిని, విరాటుడిని, సాత్యకిని, సహదేవుడిని (జరాసంధుడి కుమారుడు), చేకితానుడిని, ధృష్టకేతువుని (శిశుపాలుడి కొడుకు), శిఖండిని ఏడక్షౌహిణులకు అధిపతులుగా నియమించమని సలహా ఇచ్చాడు.

ఇది జరిగిన మర్నాడు ధర్మరాజు నిండు కొలువులో ముఖ్యులంతా వున్నప్పుడు, పరిజనులంతా వినే విధంగా యుద్ధం నిర్ణయమైనట్లు లాంఛనంగా ప్రకటించాడు. శ్రీకృష్ణుడి ఆదేశానుసారం ద్రుపదుడు మొదలైనవారిని వేర్వేరుగా అక్షౌహిణులకు నాయకులను చేశాడు. ధృష్టద్యుమ్నుడికి ప్రత్యేకంగా అభిషేకం చేసి, సర్వసేనాధిపత్యానికి పట్టం కట్టాడు. తరువాత వారందరినీ ఉద్దేశించి మాట్లాడుతూ కౌరవులతో యుద్ధం చేయడానికి అంతా కలసి తరలిపోదాం అన్నాడు ధర్మరాజు. ఆ ఎనిమిదిమందిని అహర్నిశలూ కనిపెట్టుకుని వుండమని, కంటికి రెప్పలా కాపాడమని, కర్తవ్య దీక్షలో వుండమని, శ్రీకృష్ణుడే అతడికి రక్షకుడని అర్జునుడికి చెప్పాడు. వెంటనే ధర్మరాజు యుద్ధం చేయడానికి పూనిక వహించి, ప్రస్థాన భేరి మోగించమని ఆజ్ఞాపించాడు. ఆయన యుద్ధ ప్రస్థానభేరితో దిక్కులు బద్దలయ్యాయి.

ప్రయాణ భేరి మోగగానే యుద్ధయాత్రకు సమస్త సైన్యాలు సంసిద్ధమయ్యాయి. పాండవులు తమ పట్టపు రాణి అయిన ద్రౌపదీదేవికి వెళ్లి వస్తామని చెప్పి ఆమె దగ్గర వీడ్కోలు తీసుకున్నారు.

ధర్మరాజు రథాన్ని అధిరోహించాడు. అర్జునుడు ఆయన దగ్గరికి వచ్చి నమస్కరించాడు. తరువాత తన శంఖాన్ని పూరించాడు. శ్రీకృష్ణుడి సారథ్యంలోని రథం మీద ఎక్కాడు. ఆ రథం మీద హనుమద్ద్వజం రెపరెపలాడుతున్నది. భీముడు, నకులుడు, సహదేవుడు, అభిమన్యుడు, ఉపపాండవులు రథాలను అధిరోహించే ముందర ధర్మరాజుకు నమస్కరించారు. తక్కిన రాజులు కూడా ఆలాగే చేశారు. ధృష్టద్యుమ్నుడు ధర్మరాజుకు సాగిలపడి నమస్కరించి అశ్వాన్ని అధిరోహించాడు. అలా సేనతో కలిసి ధర్మరాజు కురుక్షేత్రాన్ని సమీపించాడు. చదునైన ఒక ప్రదేశంలో, హిరణ్వతి అనే ఒక పవిత్ర నది ఒడ్డున ఆగాడు. అది సైన్యం విడిది చేయడానికి సరైన చోటుగా నిర్ధారణ చేశాడు. అక్కడ సైన్యం దిగితున్నట్లు గుర్తుగా శ్రీకృష్ణుడు తన పాంచజన్యాన్ని పూరించాడు. ధర్మరాజాదులు కూడా అలాగే తమ వీరశంఖాలను పూరించారు.

ఇదిలా వుండగా వేగులవారి ద్వారా పాండవులు దండు విడిసినారని విన్నప్పటికీ ఏమీ తెలియనివాడిలా తనవారిని పిలచి, పాండవులు యుద్ధానికి వస్తారని, అందువల్ల, మర్నాడే దండయాత్ర అని చాటించమని ఆదేశించాడు. తాము సైన్యంతో విడిది చేయాల్సిన స్థలం కురుక్షేత్రమని అంటూ, దుశ్శాసనుడిని అన్ని పనులు చూసుకోమన్నాడు. ఆ మర్నాడు దుర్యోధనుడు కొలువు కూటానికి వచ్చాడు. ద్రోణాచార్యుడిని, రాధేయుడిని, అశ్వత్థామను, బాహ్లికుడిని, శల్యుడిని, కృపాచార్యుడిని, భూరిశ్రవుడిని, శకునిని, కృతవర్మను, కాంభోజరాజును, సైంధవుడిని కౌరవుల పదకొండక్షౌహిణులకు సేనానాయకులుగా నియమించాలని నిశ్చయించిన దుర్యోధనుడు వారందరినీ సభకు పిలిపించాడు. వారిని సేనాపతిత్వానికి అభిషిక్తులు కమ్మని కోరి, వారందరినీ వైభవంగా అక్షౌహిణీపతులుగా అభిషిక్తులను చేశాడు దుర్యోధనుడు.

 అక్షౌహిణీపతులందరిని తీసుకుని భీష్ముడి దగ్గరికి పోయాడు దుర్యోధనుడు. ఆయనకు నమస్కరించాడు. వారిని సేనానాయకులుగా పరిచయం చేశాడాయనకు. యావత్ యుద్ధానికి రణభారం వహించి సర్వసైన్యాధిపత్యం నిర్వహించడానికి అంగీకరించమని భీష్ముడిని ప్రార్థించాడు. తాను సర్వసేనాధిపత్యం వహిస్తానని, తనను ఎదుర్కోగల పురుషులెవ్వరూ భూమ్మీద లేరని, అయితే తాను ఆర్జునుడిని మాత్రం ఎదుర్కోలేనని అన్నాడు. పాండుకుమారులను సంహరించడానికి తనకు చేతులు రావని కూడా చెప్పాడు. ముందు తనను కాని, కర్ణుడిని కాని యుద్ధం చేయడానికి నియోగించమని అన్నాడు. అలా అయితేనే తాను సర్వసేనాధిపత్యం వహిస్తానని స్పష్టం చేశాడు. తానెలాగు భీష్ముడు రణరంగంలో నేలకూలేదాకా యుద్ధం చేయనన్నానుగా అన్నాడు కర్ణుడు. సరే అని భీష్ముడు కౌరవుల సర్వసేనాధిపతిగా పట్టం కట్టుకోవడానికి అంగీకరించాడు. దుర్యోధనుడు సర్వసేనాధిపత్యానికి భీష్ముడిని అభిషేకించాడు. సర్వసైన్యాధ్యక్ష పదవి ఆయనకు అప్పగించాడు.

దుర్యోధనుడు భీష్ముడిని ముందుంచుకొని కురుక్షేత్రానికి నడిచాడు. కురుక్షేత్రానికి ప్రవేశించి, అక్కడ ఒక ప్రదేశంలో సేనలను దింపాడు. ఇలా కురుక్షేత్రంలో కౌరవ-పాండవ సేనలు చేరి యుద్ధానికి సిద్ధమయ్యాయి. 

కవిత్రయ విరచిత

శ్రీమదాంధ్ర మహాభారతం, ఉద్యోగపర్వం, చతుర్థాశ్వాసం

(తిరుమల, తిరుపతి దేవస్థానాల ప్రచురణ)

No comments:

Post a Comment