ఎనిమిదవ రోజు యుద్ధంలో భీష్ముడి కూర్మవ్యూహం, ధృష్టద్యుమ్నుడి శృంగాటకవ్యూహం
పాండవులను
జయించడం ఈశ్వరుడికి కూడా సాధ్యం కాదన్న భీష్ముడు
ఆస్వాదన-69
వనం
జ్వాలా నరసింహారావు
సూర్యదినపత్రిక
ఆదివారం సంచిక (01-05-2022)
కురుక్షేత్రంలో ఎనిమిదవ
రోజున కౌరవ పాండవులు యుద్ధానికి మొహరించినప్పుడు భీష్ముడు కూర్మవ్యూహాన్ని
ఏర్పరిచాడు. పాండవుల సేనాపతి ధృష్టద్యుమ్నుడు దానికి ధీటైనిదిగా వుండేలా
శృంగాటకవ్యూహాన్ని పన్నాడు. ఇలా ఉభయ సైన్యాలు వ్యూహాలు ఏర్పాటు చేసుకుని
యుద్ధానికి సిద్ధమై ఒకరినొకరు తలపడ్డారు. అప్పుడు భీష్ముడి విజృంభణకు ఆయన్ను
ఎదిరించలేక పాండవ సేనలోని మహావీరులంతా మారుమూలలకు తొలగారు. భీముడు ఒక్కడు మాత్రం
భీష్ముడిని ఎదిరించాడు. అతడి సారథిని హతమార్చగా గుర్రాలు రథాన్ని లాక్కొని
పరుగెత్తాయి. అప్పుడు దుర్యోధనుడి తమ్ముడు సునాభుడు భీముడిని ఎదుర్కున్నాడు.
భీముడు ఒక్క నవ్వు నవ్వి సునాభుడి తల నరికాడు. ఇది చూసిన అతడి ఏడుగురు సోదరులు దొమ్మిగా
భీముడి మీదికి దూకారు. భీముడు రోషంతో ఆ ఏడుగురిని చంపాడు. దీన్ని చూసి మిగతా
కురుకుమారులు భయంతో అక్కడినుండి తొలగిపోయారు.
భీముడి చేతుల్లో
తన తమ్ములు చావడం చూసిన దుర్యోధనుడు దుఃఖంతో భీష్ముడి దగ్గరికి వెళ్లి, ఆయన వారిని కాపాడలేదని, బాగా యుద్ధం చేయలేదని ఎత్తిపొడుపు మాటలన్నాడు.
ఇలాంటి ఆపత్తు వస్తుందని తాను, ద్రోణాచార్యుడు, విదురుడు
దుర్యోధనుడికి ఏనాడో చెప్పామని, కాని తమ మాటలను అప్పుడు ఆయన ఏమాత్రం లెక్కచేయలేదని, మహాపరాక్రమవంతులైన పాండవులకు ఎదురుగా నిలిచి
జయించడానికి ఈశ్వరుడికి కూడా సాధ్యం కాదని, ఇక
కౌరవులు ఏపాటి అని భీష్ముడు పలికాడు దుర్యోధనుడితో. కౌరవ కుమారులలో ఎవరైనా
భీముడికి ఎదురైతే వాడిని కాపాడడం ఎలాంటి శూరుడికైనా సాధ్యం కాదని, ఈ దుస్థితిని
గురించి ఏడ్వాల్సిన అవసరం లేదని కూడా అన్నాడు భీష్ముడు. ఇక ముందు వీరస్వర్గాన్నే
ధనంగా కోరి యుద్ధం చేయమని, రాజ్యం మీద ఆశలు వదలమని, తానైతే చేతనైనంత తెగించి యుద్ధం చేస్తానని
స్పష్టం చేశాడు.
ఇలా చెప్పిన
భీష్ముడు భయంకరమైన ఆకారంతో భీముడున్న వైపుకు రథాన్ని పోనిచ్చాడు. అది చూసి
ధృష్టద్యుమ్నుడు, శిఖండి,
దర్మరాజు సూచన మేరకు ముందుకువచ్చి భీష్ముడితో తలపడ్డారు. అంతకు ముందే అర్జునుడు, చేకితానుడు, ద్రౌపదీ పుత్రులు ఒకవైపు కౌరవులతో పోరాడుతుంటే, మరో వైపున అభిమన్యుడు, ఘటోత్కచుడు దుర్యోధనుడి మీదికి ఉరికారు. ఆ
విధంగా మూడు గట్టి సైన్యాలు చాలా కఠోరంగా యుద్ధం సాగించాయి.
కౌరవుల పక్షాన
ద్రోణాచార్యుడు; పాండవుల పక్షాన భీముడు, అర్జునుడు, నకుల సహదేవులు విజృంభించారు. అర్జునుడికి, నాగకన్య ఉలూచికి పుట్టిన ఇరావంతుడు విజృంభించి
కురుసేనమీద దూకడంతో, శకుని ఆరుగురు తమ్ముళ్లు అతడిని
ఎదుర్కున్నారు. అయినా ఇరావంతుడు చాలా నైపుణ్యంతో వారితో యుద్ధం చేశాడు. ఒక దశలో
ఇరావంతుడు నేలమీద నిలబడి యుద్ధం చేస్తుంటే, ఆ
ఆరుగురు కూడా కిందికి దిగారు యుద్ధం చేయడానికి. తన దగ్గరికి వచ్చిన ఆ ఆరుగురు
శకుని తమ్ముళ్లను పన్నెండు తునకలుగా నరికేశాడు ఇరావంతుడు. ఇది చూసి దుర్యోధనుడు
అలంబసుడిని ఇరావంతుడి మీదికి పురికొల్పాడు. మాయాబలంతో యుద్ధం చేయసాగాడు అలంబసుడు.
అయినా ఇరావంతుడు ధైర్యంగా అలంబసుడిని ఎదిరించాడు. ఇద్దరూ ఒక దశలో ఆకాశానికి ఎగిరి
మాయా యుద్ధం చేశారు. ఇద్దరూ ఇంద్రజాల,
మహేంద్రజాల విద్యలను ప్రదర్శించి యుద్ధం చేశారు. ఇరావంతుడు ఆదిశేషుడి రూపాన్ని
ధరిస్తే, అలంబసుడు గరుత్మంతుడి ఆకారం ధరించాడు. అప్పుడు ఇరుకున పడ్డ ఇరావంతుడి మెడ
అలంబసుడు నరికేశాడు.
తన సోదరుడు మరణం
చూసిన ఘటోత్కచుడు కోపించి కురుసైన్యంలో చొరబడ్డాడు. అతడిని దుర్యోధనుడు ఎదుర్కున్నాడు.
అదనంగా, వేగవంతుడు, విద్యుజ్జిహ్వుడు, బహ్వాశి అనే
ముగ్గురు రాక్షసులను కూడా అతడి మీదికి పంపాడు. ఘటోత్కచుడు తన బాణాలతో దుర్యోధనుడి
శరీరాన్నంతా నింపేశాడు. ఆ తరువాత శక్త్యాయుదాన్ని ప్రయోగించడానికి పూనుకోగా, దుర్యోధనుడు ఒక గొప్ప ఆయుధాన్ని అతడి మీదికి
వేశాడు. కాని దాన్ని మధ్యలోనే ముక్కలు చేశాడు ఘటోత్కచుడు. తరువాత పెద్దగా సింహనాదం
చేశాడు. అది విన్న భీష్ముడు పన్నెండు మంది ద్రోణాది వీరులను (కృపాచార్యుడు, అశ్వత్థామ, చిత్రసేనుడు, బాహ్లికుడు మొదలైనవారు) దుర్యోధనుడి రక్షణకు
పంపాడు. వారంతా దుర్యోధనుడి చుట్టూ రక్షణగా నిలిచి ఘటోత్కచుడిని ఎదిరించారు.
ఘటోత్కచుడు విజృంభించి ద్రోణాది వీరులందరితో యుద్ధం చేసి, కొందరి సారథులను చంపాడు. కొందరి ధనుస్సులను
విరిచాడు. కౌరవసైన్యాన్ని చీల్చి చెండాడాడు. అతిరథ మహారథ వీరులను చిక్కుపెట్టాడు.
అప్పుడు
ద్రోణుడాదిగాగల పన్నెండు మంది వీరులు కోపించి ఘతోత్కచుడిని ఒక్కడిని చేసి
చుట్టుముట్టారు. ఘటోత్కచుడు ఆకాశానికి ఎగిరి యుద్ధం చేయడం మొదలుపెట్టాడు. అప్పుడు
అక్కడికి, కౌరవ సేనను ఎదిరించడానికి,
ధర్మారాజు ఆదేశానుసారం భీముడు వచ్చాడు. అదే సమయంలో అక్కడికి వచ్చిన దుర్యోధనుడికి, భీముడికి మధ్య యుద్ధం జరిగింది. దుర్యోధనుడి
దెబ్బకు భీముడు ఒళ్లు మరిచి ఒరిగిపోయాడు. అతడి దుస్థితి చూసి ఉప పాండవులు విజృంభించారు.
ఇంతలో భీముడు తెప్పరిల్లుకుని ద్రోణుడిని కొట్టి మూర్ఛపోయేలా చేశాడు. అప్పుడు
అశ్వత్థామ, దుర్యోధనుడు భీముడిని ఎదుర్కున్నారు. ఘటోత్కచుడు, ఉప పాండవులు, అభిమన్యుడు అంతా యుద్ధానికి దిగారు.
ఘటోత్కచుడు మాయా
యుద్ధం చేయడం మొదలు పెట్టాడు. కౌరవ యోధులంతా చచ్చిపడి వున్నట్లు సైనికులకు కనబడేలా
మాయ చేశాడు. అదంతా రాక్షసమాయ అని భీష్ముడు చెప్పినా వారు వినిపించుకోలేదు. అప్పుడు
దుర్యోధనుడు భీష్ముడి దగ్గరికి వచ్చి ఎప్పటి మాదిరిగానే నిష్టూరాలు పలికాడు. ఆయన
లాంటి, ద్రోణుడు లాంటి గొప్ప వీరులు కౌరవ పక్షంలో
ఉన్నప్పటికీ శత్రువుల చేతుల్లో కష్టాలు పడుతున్నానని, ఇక తానే స్వయంగా పాండవులతో పోరాడి చావనైనా
చస్తానని, లేదా జయాన్నైనా పొందుతానని అన్నాడు. భీష్ముడు
దుర్యోధనుడి మాటలు విని నవ్వాడు. పాండవులను ఎదిరించడానికి పాండవులంతటి వారే
వుండాలి కాని దుర్యోధనుడి లాంటి వాడికి సాధ్యం కాదని, హీనమైన నడవడి అతడికి తగదని, అసాధ్యమైన యుద్ధంలో కౌరవుల పక్షాన యుద్ధం
చేయడానికి తన లాంటి వారున్నారని, దుర్యోధనుడు యుద్ధం చేయనక్కరలేదని
అన్నాడు.
తరువాత భీష్ముడు
ప్రోత్సహించగా భగదత్తుడు ఏనుగును ఎక్కి పాండవ సేనతో యుద్ధానికి దిగాడు. ఇది చూసి
ఘటోత్కచుడు పెద్ద ఏనుగునెక్కి, తన రాక్షస సైన్యాన్ని తీసుకుని భగదత్తుడి మీదకు
పోరాటానికి వచ్చాడు. అతడికి అండగా భీముడు,
అభిమన్యుడు, ద్రౌపది కొడుకులు వచ్చారు. అయినా భగదత్తుడు విజృంభించి
యుద్ధం చేయసాగాడు. ద్రోణాచార్య, కృపాచార్య యోధులు పాండవ సేనను వెంటబడి
తరిమారు. కౌరవ సేనలో కోలాహలం పుట్టింది. అది చూసి ధర్మరాజు, అర్జునుడు,
ద్రుపదుడు అటు వెళ్లారు యుద్ధం చేయడానికి. అలా వచ్చిన వారిలో అర్జునుడు విజృంభించి
యుద్ధం చేయసాగాడు. అప్పుడు భీముడు అర్జునుడికి ఇరావంతుడి మరణం గురించి చెప్పాడు.
అర్జునుడు విధిని నిందించాడు. శ్రీకృష్ణుడు తత్త్వబోధ జ్ఞప్తికి తెచ్చుకున్న
అర్జునుడు దుఃఖాన్ని మరచి కౌరవ సేన వైపు రథాన్ని పోనిమ్మని శ్రీకృష్ణుడిని కోరాడు.
అర్జునుడు
గొప్పవైన బాణాలను కౌరవ సేనమీద ప్రయోగించాడు. మరో వైపున భీముడు యుద్ధంలో
విచ్చలవిడిగా విహరిస్తూ కౌరవులను ఏడుగురిని చంపగా మిగిలినవారు భయపడి పారిపోయారు. అప్పుడే
సూర్యుడు అస్తమిస్తున్నాడు. అప్పుడు దుర్యోధనుడు యుద్ధం చేయడానికి పూనుకోగా, పాండవులు కూడా వెనక్కు తగ్గకుండా ఉత్సాహంగా
పోరు సాగించారు. ఇంతలో చీకటి అంతా వ్యాపించగా,
పాండవులు, కౌరవులు యుద్ధాన్ని చాలించి తమ తమ నివాసాలకు
వెళ్లిపోయారు. తన సైన్యం చాలా నష్టం కావడం వల్ల, ఆ ఎనిమిదోనాటి రాత్రి, దుర్యోధనుడి మనస్సు కలత చెందింది.
యుద్ధం ఆగిఅన
తరువాత ఆ సాయంత్రం, దుర్యోధనుడు దుశ్శాసనుడు, కర్ణుడు,
శకునిలతో సమావేశమయ్యాడు. భీష్ముడు,
ద్రోణుడు, కృపుడు,
అశ్వత్థామ మధ్యస్థంగా వుంటూ పాండవ సైన్యాలను చంపడం లేదని, ఏం చేస్తే మంచిదని వారిని అడిగాడు
దుర్యోధనుడు. మున్ముందు భీష్ముడిని యుద్ధానికి తీసుకుపోవద్దని, తాను పాండవులను ఎదుర్కుని వారిసైన్యాన్ని
హతమారుస్తానని కర్ణుడు అన్నాడు. భీష్ముడి యుద్ధాన్ని నిలిపివేద్దాం అని
దుశ్శాసనుడితో అన్నాడు దుర్యోధనుడు. ఇలా అంటూ కర్ణుడిని, శకునిని వారి ఇళ్లకు పంపించి వేశాడు. స్నానాది కార్యక్రమాలు ముగించుకుని
దుశ్శాసనుడిని తీసుకుని భీష్ముడి దగ్గరికి పోయాడు.
భీష్ముడు యుద్ధం
చేస్తున్న తీరు గమనిస్తే ఆయన పాండవుల పట్ల మెతకదనం చూపిస్తున్నాడని, వారికి నొప్పి
కలిగించకుండా వుంటున్నాడని, వారు చేత చిక్కినా ఏమీ చేయడం లేదని
అన్నాడు దుర్యోధనుడు భీష్ముడితో. భీష్ముడిని యుద్ధంలో దేవదానవులైనా ఎదిరించలేరని, అయినా యుద్ధం మొదలయ్యి ఎనిమిది రోజులు జరిగినా
ఇంకా ఆర్జునుడిని భీష్ముడు చంపలేదని, కాబట్టి ఇక ఆయన యుద్ధం విరమిస్తే కర్ణుడిని
యుద్ధానికి పంపిస్తానని అన్నాడు దుర్యోధనుడు. భీష్ముడు ఆ మాటలకు బాధపడ్డాడు. అతడలా
కఠినంగా మాట్లాడడం న్యాయం కాదన్నాడు. అర్జునుడి పరాక్రమాన్ని (ఖాండవ వన దహనం, శివుడిని మెప్పించడం, పాశుపతం ఇతర దివ్యాస్త్రాలు సంపాదించడం, గంధ్రవుల బారి నుండి దుర్యోధనుడిని విడిపించడం, ఉత్తరగోగ్రహణంలో అర్జునుడు విజయం మొదలైనవి) గుర్తు
చేశాడు. జయింపరాని పాండవులతో విరోధం తెచ్చుకున్నాడని, కల్లబొల్లి మాటలతో ప్రయోజనం లేదని, దుర్యోధనుడు యుద్ధంలో తన ప్రతాపాన్ని చూపాలని
అన్నాడు భీష్ముడు. తాను ఆర్జునుడిని జయించలేనని, శిఖండిని చంపలేనని, తక్కినవారు ఎంతమందైనా చీల్చి
చెండాడుతానని స్పష్టం చేశాడు.
తాను, తన సైన్యం కలిసి ద్రుపద, విరాట,
యాదవ సైన్యాన్ని ఎదుర్కొని యుద్ధం చేస్తామని,
తక్కిన కౌరవ వీరులంతా దుర్యోధనాదులతో కలిసి పాండవులను గెలవడానికి ప్రయత్నించమని
అన్నాడు భీష్ముడు. అర్థరాత్రి వచ్చి తనను సూటిపోటి మాటలు అనడం వల్ల లాభం లేదని, దీనివల్ల గెలుపు రాదని, మర్నాడు యుద్ధానికి సన్నద్ధుడిగా వెళ్లమని, తన బాహుబలాన్ని మర్నాడు చూడవచ్చని చెప్పాడు
భీష్ముడు దుర్యోధనుడికి. భీష్ముడు చెప్పిన ఆ మాటలకు దుర్యోధనుడు సంతోషించాడు.
మర్నాటి యుద్ధానికి సిద్ధం కాసాగాడు.
కవిత్రయ
విరచిత
శ్రీమదాంధ్ర
మహాభారతం, భీష్మపర్వం, తృతీయాశ్వాసం
(తిరుమల, తిరుపతి దేవస్థానాల ప్రచురణ)