Saturday, April 16, 2022

ఆరవ నాటి యుద్ధంలో పాండవుల మకరవ్యూహం, కౌరవుల క్రౌంచవ్యూహం ..... ఆస్వాదన-67 : వనం జ్వాలా నరసింహారావు

 ఆరవ నాటి యుద్ధంలో పాండవుల మకరవ్యూహం, కౌరవుల క్రౌంచవ్యూహం

ఆస్వాదన-67

వనం జ్వాలా నరసింహారావు

సూర్యదినపత్రిక ఆదివారం సంచిక (17-04-2022)

కురుక్షేత్ర సంగ్రామంలో ఐదవనాటి రాత్రి జరిగిపోయింది. తెల్లవారేసరికల్లా అర్జునుడి ఆలోచనకు అనుగుణంగా పాండవ సేనానాయకుడు ధృష్టద్యుమ్నుడు మకరవ్యూహం తీర్చిదిద్దాడు. ద్రుపదరాజు తలగా; నకులసహదేవులు కన్నులుగా; భీముడు నోరు చివరగా; అభిమన్యుడు, ద్రౌపది కొడుకులు, ఘటోత్కచుడు కపోలాలుగా; సాత్యకితోపాటు ధర్మరాజు కంఠం దగ్గర నిలుచున్నారు. ధృష్టద్యుమ్నుడితో పాటు విరాటరాజు వెన్నుదగ్గర; కేకయరాజులు ఎడమపక్కగా; ధృష్టకేతుడు, కరూశరాజు కుడిపక్కగా; కుంతిభోజుడు, శతానీకుడు మొల దగ్గర; శిఖండి, ఇరావంతుడు తోకదగ్గర నిలుచున్నారు.

ఇక భీష్ముడు పన్నిన క్రౌంచవ్యూహంలో అతడు, ద్రోణుడు ముక్కు దగ్గర; కృపుడు, అశ్వత్థామ కన్నులుగా; శిరస్సు దగ్గర కృతవర్మ, కాంభోజుడు, బాహ్లికుడు; శూరసేన రాజుతో పాటు దుర్యోధనుడు కుత్తుక దగ్గర; వక్షం దగ్గర సౌవీర రాజుతో సహా భగదత్తుడు; వీపున విందుడు, అనువిందుడు; ఎడమ పక్కన సుశర్మ; కుడి పక్క యవనరాజు నిలిచారు. వెనుకగా శ్రుతాయువుతో కలిసి భూరిశ్రవుడు నిలిచాడు.

ఈ విధంగా కౌరవ సేన, పాండవ సేన యుద్ధానికి సమాయుత్తమై వెళ్లారు. యుద్ధం మొదలవగానే భీముడు తన రథాన్ని ద్రోణుడు వున్న దిక్కుగా నడిపించాడు. అతడి ధాటికి ఎదురు నిలువలేక కౌరవ వీరులు వెనక్కు పారిపోసాగారు. భీముడు ద్రోణాచార్యుడి సారథిని చంపాడు. సారథి లేనందున స్వయానా తన రథాన్ని నడుపుతూ యుద్ధం చేస్తున్న ద్రోణుడికి భీష్ముడు సాయంగా వచ్చాడు. భీముడు విజృంభించినందువల్ల కౌరవసేనకు విపరీతంగా నష్టం జరిగింది. ఆ సమయంలో తనకు చిక్కిన దుర్యోధనుడి పన్నెండు మంది తమ్ములను (దుశ్శాసనుడితో సహా) ఏక కాలంలో ఎదుర్కున్నాడు భీముడు. వారంతా చతురంగ బలాలతో భీముడిని చుట్టుముట్టారు. భీముడు ఆనందంతో, తనకేదో మంచి అవకాశం దొరికినట్లుగా భావించి, రథం మీద నుండి కిందకు దూకాడు. భీముడు రణరంగంలో కౌరవ కుమారులమీద వీరవిహారం చేశాడు. భీముడి ధాటికి ఎదురులేకపోయింది.

అటువైపుగా వచ్చిన ధృష్టద్యుమ్నుడు, భీముడు రథం మీద లేకపోవడం చూసి, సారథిని అడిగి అతడెక్కడున్నాడో కనుక్కొని, భీముడికి తోడుగా వచ్చాడు. అప్పుడు కౌరవ రాకుమారులంతా కలిసి ధృష్టద్యుమ్నుడిని చుట్టుముట్టారు. ధృష్టద్యుమ్నుడు తనకు ద్రోణుడు ఉపదేశించిన ‘ప్రమోహనబాణం ప్రయోగించి రాజకుమారులను మూర్ఛపోయేట్లు చేశాడు. అదే సమయంలో ద్రోణుడు ద్రుపదుడిమీద విజృంభించాడు. ద్రుపదుడు అక్కడి నుండి తప్పుకున్నాడు. ద్రోణుడప్పుడు ప్రజ్ఞాబాణం ప్రయోగించి మోహనబాణం శక్తిని పోగొట్టాడు. కౌరవ రాజుకుమారులు మళ్లీ యుద్ధాన్ని ప్రారంభించారు. దొమ్మియుద్ధంలో భీముడు కింద వుండరాదని అంటూ ధృష్టద్యుమ్నుడు అతడిని కేకయరాజు రథం మీద ఎక్కించాడు.

ఈ లోపున ద్రోణుడు విజృంభించాడు. ధృష్టద్యుమ్నుడి ధనుస్సు ఖండించాడు. సారథిని చంపాడు. మరో సారథి తెచ్చిన రథాన్ని ఎక్కాడు ధృష్టద్యుమ్నుడు. ద్రోణ, ధృష్టద్యుమ్నుల మధ్య భీకరమైన యుద్ధం జరిగింది. మరో పక్క భీముడికి, దుర్యోధనుడికి మధ్య యుద్ధం జరిగింది. దుర్యోధనుడికి తోడుగా ఆయన తమ్ములు వచ్చారు. అప్పుడు అభిమన్యుడు, ద్రౌపది కుమారులు, ధృష్టకేతుడు, కేకయులు, భీముడికి అండగా వచ్చారు. అంతా కలిసి కౌరవ రాజకుమారులమీద విజృంభించారు. వారి ధాటికి కౌరవ రాజకుమారులు తట్టుకోలేకపోయారు. పారిపోయారు. దుర్యోధనుడికి కోపం వచ్చి భీముడితో భయంకరమైన యుద్ధానికి దిగాడు. భీముడికి సాయంగా వచ్చిన ద్రౌపది కొడుకులు దుర్యోధనుడి మీద బాణాలు ప్రయోగించి, నొప్పించి, తరిమివేశారు.

ఇంతలో భీష్ముడు శత్రుసేనలో ప్రవేశించి పాండవ సేనను చెదరగొట్టగా అర్జునుడు అతడి ఎదుర్కున్నాడు. ఇదిలా వుండగా భీముడు, ఎలాగైనా అదేరోజున దుర్యోధనుడిని చంపాలన్న కోరికతో, దుర్యోధనుడిని ఎదుర్కుని, అతడి రథాశ్వాలను, సారథిని చంపి, దుర్యోధనుడి విల్లు విరిచాడు. మరిన్ని బాణాలను వేయడంతో దుర్యోధనుడు మార్చపోయి, స్పృహతప్పి పడిపోయాడు. మూర్ఛిల్లిన దుర్యోధనుడిని కృపాచార్యుడు తన రథం మీద ఎక్కించుకుని వెళ్లాడు. ఆ సమయంలో భీముడి మీదికి వచ్చిన జయద్రథుడిని అభిమాన్యాదులు ఎదుర్కున్నారు భీకరంగా. కౌరవ కుమారులు తిరిగొచ్చి ద్రౌపదీ తనయులతో పోరాడారు.

ఆ సమయంలో నకులుడి కొడుకైన శతానీకుడు పరాక్రమం ప్రదర్శించి విజృంభించాడు. కేకయ దేశాదిపతులు, ద్రుపదుడు అతడికి తోడుగా నిలబడ్డారు. సూర్యాస్తమయం కాబోతున్న తరుణంలో భీష్ముడు ప్రళయకాల యముడిలాగా విజృంభించి పాండవుల వ్యూహాన్ని చీల్చి, తన సేనలను ఉపసంహరించి విడిదులకు పొమ్మని ఆదేశించాడు. అతడు తన శిబిరానికి పోయాడు. ఆ రోజుకు యుద్ధ విరమణ జరిగింది. పాండవులు అలసి పోయి చెమటకారే దేహాలతో తమ విడిదులకు వెళ్లిపోయారు.

ఆనాటి రాత్రి భీష్ముడితో దుర్యోధనుడు, కౌరవులు ఎంత పూనికగా వ్యూహం పన్నుతూ ముందుకు సాగుతున్నా పాండవ సేన దానిని నాశనం చేస్తున్నదని, భీష్ముడు చూస్తుండగానే భీముడి చేతుల్లో తాను భంగపడ్డానని, భీష్ముడి అండతో పాండవులను గెలుస్తానన్న ఆశ తనకు వుండేదని, దాన్ని ఆయన తప్పగొట్టుతున్నాడని, భీష్ముడు దేవతలను కూడా జయించగల పరాక్రమవంతుడని, అయినా యుద్ధరంగంలో పాండవులు అంత పరాక్రమవంతులు కావడానికి కారణం ఏమిటని అన్నాడు. దుర్యోధనుడి మాటలు విన్న భీష్ముడు నవ్వి, తనను అలా అనడం భావ్యం కాదని, తాను యుద్ధంలో తన శరీరం దాచుకోలేదని, పాండవులు ఎప్పటికీ జయింపరానివారే అని పలుమార్లు చెప్పానని, అయినప్పటికీ తాను దుర్యోధనుడే జయించాలన్న ఉద్దేశంతో ఒళ్లు దాచుకోకుండా యుద్ధం చేస్తానని, దుఃఖపడవద్దని చెప్పాడు.              

కవిత్రయ విరచిత

శ్రీమదాంధ్ర మహాభారతం, భీష్మపర్వం, ద్వితీయాశ్వాసం

(తిరుమల, తిరుపతి దేవస్థానాల ప్రచురణ)

                          

No comments:

Post a Comment