Saturday, April 9, 2022

ఐదవనాటి యుద్ధంలో కౌరవుల మకరవ్యూహం, పాండవుల డేగవ్యూహం .... ఆస్వాదన-66 : వనం జ్వాలా నరసింహారావు

 ఐదవనాటి యుద్ధంలో కౌరవుల మకరవ్యూహం, పాండవుల డేగవ్యూహం

ఆస్వాదన-66

వనం జ్వాలా నరసింహారావు

సూర్యదినపత్రిక (10-04-2022)

మహాభారత యుద్ధంలో ఐదవ రోజున పొద్దు పొడవగానే భీష్ముడి నాయకత్వంలో కౌరవ సేనలు యుద్ధానికి సన్నద్ధమై వెళ్లాయి. కౌరవ సేన ఆనాడు మొసలి (మకర) వ్యూహంగా ఏర్పడింది. పాండవ సేన డేగ ఆకారంగా ఏర్పడింది. పాండవ వ్యూహంలో భీముడు ముఖ స్థానంలో; ధృష్టద్యుమ్నుడు, శిఖండి రెండు కన్నులుగా; సాత్యకి తలగా; అర్జునుడు కంఠస్థానంలో; విరాట, ద్రుపదులు ఎడమ రెక్కగా; కేకయులు కుడి రెక్కగా; అభిమన్యుడు, ద్రౌపదీ పుత్రులు వీపున; నకుల సహదేవులు, ధర్మరాజు తోక భాగాన నిలిచారు. ఉభయ సేనలు ఢీకొన్నాయి. భీముడు భయంకర స్వరూపంతో మకరవ్యూహంలోకి ప్రవేశించి, భీష్ముడిని అమ్ముల గుంపుతో కప్పివేశాడు. భీష్ముడు అగ్గిలాగా ప్రజ్వలించి, పాండవ సేనను చీకాకు పరచాడు. అప్పుడు అర్జునుడు వచ్చి భీష్ముడిని ఎదుర్కున్నాడు. సరిగ్గా అదే సమయంలో దుర్యోధనుడు ద్రోణుడి దగ్గరికిపోయి, భీష్మద్రోణులు పాండవులను ఉపేక్షిస్తున్నారని ఆరోపించాడు. తమ శక్తి ఆపాటిదే అని ముక్తసరిగా జవాబిచ్చాడు ద్రోణుడు.

దుర్యోధనుడికి మాటలకు నొచ్చుకున్న ద్రోణుడు కౌరవసేనను దాటి ముందుకు రాగా, సాత్యకి విజృంభించి ద్రోణుడిని ఎదుర్కున్నాడు. భీముడు సాత్యకికి; భీష్ముడు, శల్యుడు ద్రోణుడికి సాయం చేయడానికి వచ్చారు. భీముడికి బాసటగా ద్రౌపదీ సుతులొచ్చారు. అప్పుడు శిఖండి తన మీదికి రావడం చూసిన భీష్ముడు, ‘ఒక ఆడదానితో యుద్ధం చేస్తానా?’ అని భావించి, అక్కడినుండి తొలగిపోయాడు. ఇది గమనించి ద్రోణుడు శిఖండిని మరలించాడు. భీముడు, భీష్ముడు తమ-తమ సేనలకు నాయకత్వం వహించారు. సమయం చూసి దుర్యోధనుడు భీముడిని ఎదుర్కున్నాడు. ఆయనకు మద్దతుగా ఆయన తమ్ములు చేరారు. అప్పుడు అర్జునుడు విజృంభించాడు. దాంతో కౌరవ సైన్యం వెనుకకు మరలింది. దుర్యోధనుడు వారికి ధైర్యం చెప్పగా, దుశ్శాసనుడు ఆర్జునుడిని, భీముడిని ఎదుర్కున్నాడు.

ఇరు పక్షాల వీరాధివీరులైన ధర్మరాజు, ధృష్టద్యుమ్నుడు, విందానువిందులు, సైంధవుడు, భీముడు, వికర్ణుడు, సహదేవుడు, శిఖండి, దుర్యోధనుడు, విరాటుడు, ద్రోణుడు మొదలైన వారు ఒకరినొకరు ఢీకొన్నారు. పోరు భీకరంగా సాగింది. భీముడి పోరాటం మిక్కిలి భయంకరంగా మారడంతో భీష్ముడు విజృంభించాడు. ఒకరినొకరు బాణాలతో నొప్పించుకున్నారు. ఇంతలో సాత్యకి రంగ ప్రవేశం చేశాడు. భీష్ముడు సాత్యకి సారథి తలను తుంచడంతో సాత్యకి ఆపదలో పడ్డాడని, ఆదుకోమని పాండవ సేనలో అరుపులు వినపడ్డాయి.

విరాటుడు, భీష్ముడితో యుద్ధానికి దిగాడు. ఆర్జునుడిని అశ్వత్థామ ఢీకొన్నాడు కాసేపు. అప్పుడు అశ్వత్థామ కవచాన్ని ఛేదించి అర్జునుడు వేరే దిక్కు యుద్ధానికి పోయాడు. భీమ దుర్యోధనులు భీకరమైన పోరాటం చేశారు. చిత్రసేనుడు, భీష్ముడు దుర్యోధనుడికి తోడు రాగా వారితో అభిమన్యుడు తలపడ్డాడు. అభిమన్యుడు విజృంభించి కౌరవసేనను బాదిస్తుంటే, లక్ష్మణకుమారుడు అతడిని ఎదుర్కున్నాడు. కాసేపటికే అభిమన్యుడి బాణాల ధాటికి తట్టుకోలేని లక్ష్మణకుమారుడి దేహం తూట్లుపడగా, కృపుడు అతడిని తన రథం మీద ఎక్కించుకుని అక్కడినుండి తప్పించాడు. యుద్ధం అన్ని దిక్కులా కొనసాగుతున్నప్పుడు సాత్యకి విజృంభణను చూసిన భూరిశ్రవుడు అతడిని వెనక్కు మరలించాడు. ఆ తరువాత భూరిశ్రవుడు మీద యుద్ధానికి దిగిన సాత్యకి పది మంది కొడుకులను అతడు సంహరించాడు. కోపంతో మళ్లీ యుద్ధానికి వచ్చిన సాత్యకి, భూరిశ్రవుల మధ్య ఘోరమైన పోరు జరిగింది. ఇద్దరూ విరథుయ్యారు. నేలమీద దిగి కత్తులతో యుద్ధం చేశారు. అప్పుడు సాత్యకిని భీముడు, భూరిశ్రవుడిని దుర్యోధనుడు తమ రథాల మీద ఎక్కించుకుని తీసుకుపోయారు.

ఇంతలో పొద్దు కుంకే సమయం దగ్గర పడింది. శత్రువులు యుద్ధం విడిచి శిబిరాలకు వెళ్లిపోతారని భావించిన అర్జునుడు కౌరవ రథికుల మీద మంత్ర బాణాలు ప్రయోగించాడు. అర్జునుడు కౌరవ సైనికులను సంహరించడం చూసిన భీష్ముడు సహించలేక పాతికవేల రథాలను పోరాటానికి ప్రోత్సహించాడు. వారంతా ఆర్జునుడిని ఎదుర్కున్నారు. కాని అవన్నీ అర్జునుడి బాణాలకు ఆహుతయ్యాయి. కౌరవసేన అతిశయం అణగారిపోయింది. సూర్యరశ్మి తగ్గి, సూర్యుడు పడమటి కొండమీద మెరుస్తూ దర్శనమిచ్చాడు. అంటే, అది సాయంకాల సమయ సూచన. వాహనాలన్నీ బడలిపోయాయని, సాయంకాలం అవుతున్నదని, ఇక యుద్ధం చేయడం ఎందుకని, విరమించడం మంచిదని భీష్ముడు అనుకున్నాడు. అదే విషయాన్ని ద్రోణుడికి చెప్పాడు.

ఉభయ సైన్యాల సేనలు కాగడాల కాంతులలో తమ తమ విడిదులకు చేరారు. రాత్రుల్లో కురు పాండవ పక్షాలకు సంబంధించిన భటులు హృదయానికి ఆనందం కలిగించే సంగీత సభలలో, సాహిత్య గోష్టులలో కాలక్షేపం చేస్తుండేవారు. 

కవిత్రయ విరచిత

శ్రీమదాంధ్ర మహాభారతం, భీష్మపర్వం, ద్వితీయాశ్వాసం

(తిరుమల, తిరుపతి దేవస్థానాల ప్రచురణ)

 

                       

No comments:

Post a Comment