Sunday, April 24, 2022

ఏడవ నాటి యుద్ధంలో కౌరవుల మండలవ్యూహం, పాండవుల వజ్రవ్యూహం..... ఆస్వాదన-68: వనం జ్వాలా నరసింహారావు

 ఏడవ నాటి యుద్ధంలో కౌరవుల మండలవ్యూహం, పాండవుల వజ్రవ్యూహం

ఆస్వాదన-68

వనం జ్వాలా నరసింహారావు

సూర్యదినపత్రిక (24-04-2022)

మహాభారత యుద్ధంలో ఏడవరోజు ఉదయాన యుద్ధ భూమికి వెళ్ళిన భీష్ముడు యుద్ధరంగాన్నంతా వ్యాపించే విధంగా ‘మండలవ్యూహాన్ని’ ఏర్పాటు చేశాడు. దాని మధ్యభాగాన దుర్యోధనుడున్నాడు. అతడి తమ్ములు, అతడికి సాయపడే రాజులు ఇరుపక్కలా నిలిచారు. అప్పుడే యుద్ధరంగానికి వచ్చిన పాండవులు ఆ వ్యూహాన్ని తేరిపార చూశారు. ధర్మరాజు ఆదేశానుసారం సేనాపతైన ధృష్టద్యుమ్నుడు ‘వజ్రవ్యూహాన్ని’ ఏర్పాటు చేశాడు.

ద్రోణుడు విరాటుడిని, అశ్వత్థామ శిఖండిని, ధుర్యోధనుడు ధృష్టద్యుమ్నుడిని, శల్యుడు నకుల సహదేవులను, విందానువిందులు యుధామన్యుడిని, పలువురు రాజులు అర్జునుడిని ఎదుర్కున్నారు. అలాగే భీమసేనుడు కృతవర్మను, అభిమన్యుడు చిత్రసేనుడిని, దుశ్శాసనుడిని, వికర్ణుడిని, ఘటోత్కచుడు భగదత్తుడిని, సాత్యకి అలంబసుడిని, ధృష్టకేతుడు భూరిశ్రవుడిని, చేకితానుడు కృపాచార్యుడిని, ధర్మరాజు శ్రుతాయువుని, చాలా మంది రాజులు భీష్ముడిని ఎదిరించారు.

కౌరవ రాజులు ఒక్కసారిగా విజృంభించి కృష్ణార్జునులను బాణ వర్షంలో ముంచివేయగా, అర్జునుడు కోపంతో ఐంద్రాస్త్రాన్ని ప్రయోగించాడు. దాని ధాటికి కౌరవ సేనలు భయపడి భీష్ముడి చాటుకు పారిపోయారు. దుర్యోధనుడి ప్రోద్బలంతో అప్పుడు రాజులంతా అర్జునుడి మీద యుద్ధం చేస్తున్న భీష్ముడికి అండగా నిలిచారు. ద్రోణుడికి, విరాటుడికి మధ్య జరుగుతున్న యుద్ధంలో ఇరువురు భీకరంగా పోరాడారు. ద్రోణుడి బాణాల దెబ్బకు విరాటుడు భయంతో పరుగెత్తాడు. ఇంకో పక్క శిఖండికి, అశ్వత్థామకు మధ్య పోరు జరిగింది. మరోవైపున ధృష్టద్యుమ్నుడు దుర్యోధనుడి మీద బాణాలు గుప్పించాడు. దుర్యోధనుడు కూడా అతడి మీద బాణాలు వేశాడు. విల్లు విరిగిన దుర్యోధనుడిని శకుని తన రథంలో ఎక్కించుకుని పోయాడు. సాత్యకి, అలంబసుల మధ్య జరిగిన యుద్ధంలో సాత్యకిది పైచేయి కాగా అలంబసుడు భయపడి పారిపోయాడు. సాత్యకి కురుసైన్యం మీద ఉరికాడు.

భీముడికి, కృతవర్మకు జరిగిన యుద్ధంలో బాణాలతో గాయపడ్డ కృతవర్మ వృషకుడి రథం మీద వెళ్లాడు. యుధామన్యుడు విజృంభించి విందానువిందుల మీద బాణాలు గుప్పించి, అనువిందుడి రథాన్ని నుగ్గు చేశాడు. అదే సమయంలో భగదత్తుడి ఏనుగు విజృంభించి పరుగెత్తడంతో పాండవుల సేన చిందరవందర కాగా ఘటోత్కచుడు ఆ ఏనుగును ఆపాడు. భగదత్తుడికి, ఘటోత్కచుడికి జరిగిన యుద్ధంలో భగదత్తుడిది పైచేయి అయింది. ఘటోత్కచుడి సైన్యం మీదకు మళ్లీ తన ఏనుగును పురికొల్పాడు భగదత్తుడు. ఇదిలా వుండగా శల్యుడికి, నకుల సహదేవులకు మధ్య జరిగిన యుద్ధంలో సహదేవుడి బాణం దెబ్బకు శల్యుడు రథం మీద మూర్ఛపోయాడు. దాంతో అతడి సారథి రథాన్ని యుద్ధభూమి నుండి అవతలకు తోలుకుని పోయాడు. అదే సమయంలో ధర్మరాజు శ్రుతాయువు మీద బాణాలు వేశాడు. ధర్మరాజు విజృంభించగా కౌరవ సైన్యం చిందరవందరైంది.

చేకితానుడు కృపాచార్యుడి మీద బాణాలను వర్షంలాగా కురిపించాడు. కృపాచార్యుడు వెనక్కు తగ్గలేదు. ఇద్దరూ ఒకరినొకరు ఎదురెదురుగా ఢీకొన్నారు. ఒకరినొకరు నొప్పించుకున్నారు. ఇద్దరు మూర్ఛపోయి నేలమీదికి ఒరిగారు. వారిద్దరినీ సహాయకులు వచ్చి తీసుకుపోయారు. ధృష్టకేతుడికి, భూరిశ్రవుడికి మధ్య భీకరమైన పోరు జరిగింది. దుశ్శాసనుడు, చిత్రసేనుడు, వికర్ణుడు కలిసి అభిమన్యుడితో యుద్ధం చేశారు. ఆ యుద్ధంలో అభిమన్యుడు ఆ ముగ్గురి రథాలను ధ్వంసం చేశాడు. భీముడి శపథం గుర్తుకు వచ్చి, అభిమన్యుడు, వారిని బాధపెట్టాడే కాని చంపలేదు. వారి దుస్థితి చూసిన భీష్ముడు అభిమన్యుడిని ఎదుర్కున్నాడు. ఇది గమనించిన అర్జునుడు అభిమన్యుడికి సాయంగా పోతుంటే, త్రిగర్తపతైన సుశర్మ ఆర్జునుడిని ఎదుర్కున్నాడు కాని దెబ్బతిన్నాడు. అర్జునుడు స్వైరవిహారం చేశాడు.

అర్జునుడు భీష్ముడి మీదికి యుద్ధానికి వెళ్ళాడు. ధర్మరాజు భీమనకుల సహదేవులతో కలిసి అర్జునుడికి అండగా వెళ్లారు. ఇంతలో దుర్యోధనుడు, సైంధవుడు పాండవులను ఎదుర్కున్నారు. ఆ సమయాన శిఖండి భీష్ముడిని ఎదుర్కున్నాడు. అప్పుడు శల్యుడు ఆగ్నేయాస్త్రాన్ని శిఖండి మీద ప్రయోగించాడు. శిఖండి వారుణాస్త్రాన్ని వేశాడు. భీష్ముడు ధర్మారాజును ఇబ్బందికి గురిచేశాడు. భీముడు దుర్యోధనుడి మీదికి ఉరికాడు. దుర్యోధనుడు కూడా భీముడిమీద దాడి చేశాడు. మధ్యలో తన మీదికి వచ్చిన చిత్రసేనుడి మీద భీముడు గదను విసిరాడు. అది చిత్రసేనుడి రథాన్ని, గుర్రాలను, సారథిని పిండిపిండి చేసింది. రథం లేని చిత్రసేనుడిని వికర్ణుడు తీసుకునిపోయాడు.

ధర్మరాజు, నకుల సహదేవులు భీష్ముడి చేతిలో దెబ్బ తిన్నారు. అప్పుడు వారు మరికొందరు రాజులతో కలిసి భీష్ముడిని ఎదిరించారు. ఇంతలో శిఖండి భీష్ముడి సమీపానికి వచ్చాడు. వాడిని లెక్కచేయకుండా భీష్ముడు పాండవ సేనను బాధించాడు. ఇది గమనించి సాత్యకి, ధృష్టద్యుమ్నుడు బాగా విజృంభించి కౌరవ సైన్యాన్ని కలత పెట్టారు. అప్పుడు దుర్యోధనుడు స్వయంగా యుద్ధానికి దిగాడు. భీష్ముడితో కలిసి ధర్మరాజు సేనలను కమ్మివేశారు. అదే సమయంలో అక్కడ అర్జునుడు ప్రత్యక్షమయ్యాడు. అంతలో ద్రోణాచార్యుడు విజృంభించి, అర్జునుడిని ఎదిరించి, పాండవుల మీద పడ్డాడు. ఇంతలో సూర్యుడు అస్తమించాడు. కౌరవ, పాండవ సేనలు తమతమ విడిదులకు చేరుకున్నారు.

కవిత్రయ విరచిత

శ్రీమదాంధ్ర మహాభారతం, భీష్మపర్వం, తృతీయాశ్వాసం

(తిరుమల, తిరుపతి దేవస్థానాల ప్రచురణ)

No comments:

Post a Comment