ఆ ‘సఖ్యత రాష్ట్రాలలో ఎందుకు లేదు?
వనం
జ్వాలా నరసింహారావు
ఆంధ్రజ్యోతి
దినపత్రిక (12-04-2022)
తెలంగాణ
రాష్ట్ర గవర్నర్ (తన) ప్రభుత్వం తనపట్ల అవమానకరంగా ప్రవర్తిస్తున్నదని ప్రధాన
మంత్రిని, కేంద్ర హోం మంత్రిని కలిసి పిర్యాదు చేసినట్లు వార్తలొచ్చాయి.
తెలంగాణాలో తనకు సంబంధించిన ప్రోటోకాల్ వివాదం విషయంలో కూడా ప్రధానికి, హోం
మంత్రికి పిర్యాదు చేశారు. ప్రధానిని, హోం మంత్రిని కలిసిన అనంతరం మీడియాతో
మాట్లాడుతూ, మహిళా గవర్నర్ ను అయిన తనను అవమానిస్తున్నారని, తనపై (తన) ప్రభుత్వం
వివక్ష చూపుతున్నదని, గవర్నర్ కు ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వడం లేదని అన్నారు. కౌశిక్
రెడ్డి పేరును ఎమ్మెల్సీగా సిఫారసు
చేయడాన్ని, తాను పెండింగులో
పెట్టడాన్ని ప్రస్తావిస్తూ, ఆయనను
నామినేట్ చేయడం విషయంలో తాను సంతృప్తి చెందలేదని తన ప్రభుత్వాన్ని తప్పుబట్టారు.
అంతటితో ఆగకుండా తాను తలచుకుంటే రాష్ట్ర ప్రభుత్వం పడిపోయేదని ఆమె అన్నట్లు కూడా
వార్తలొచ్చాయి. అన్ని విషయాలు ప్రజలే నిర్ణయిస్తారని కూడా అన్నారు.
ఇలా
కొందరు గవర్నర్లు మాట్లాడడం మనదేశంలో కొత్తేమీ కాదు. భారత సహకార సమాఖ్య వ్యవస్థలో
ఒక ముఖ్య భూమికగా భావించబడుతున్న గవర్నర్ స్థానం అది ఏర్పాటైన నాటినుండీ ఏదో
ఒకరకమైన వివాదాస్పద వ్యవస్థగా మిగిలిపోయింది. ప్రపంచంలోనే ఎన్నికైన మొట్టమొదటి కమ్యూనిస్ట్ పార్టీ
ప్రభుత్వాన్ని శాసనసభలో బలం వున్నప్పటికీ కూలగొట్టిన ఘన చరిత్ర మన గవర్నర్లది.
అప్పట్లో (1959 సంవత్సరంలో) అది చోటు చేసుకున్నది కేరళ రాష్ట్రం కాగా పదవి
కోల్పోయిన ముఖ్యమంత్రి ఇఎంఎస్ నంబూద్రిపాద్ అయితే అలనాటి గవర్నర్ బూర్గుల
రామకృష్ణారావు.
మన
దేశంలో ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అంటే,
ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నుకోబడ్డ రాష్ట్రాధినేత. సమస్త కార్యనిర్వాహక అధికారాలు ఆయన
ఆధీనంలోనే వుంటాయి. రాష్ట్ర శాసనసభ మెజారిటీ సభ్యుల నాయకుడు ఆయన. ఇక గవర్నర్
విషయానికొస్తే, రాజ్యాంగం ప్రకారం, ఆయన
లేదా ఆమె, రాష్ట్రానికి నామ మాత్రపు అధిపతి మాత్రమే. నియమించేది ప్రధాని
సిఫారసు మేరకు రాష్ట్రపతి. కేంద్రంలో రాష్ట్రపతికి ఎలాంటి అధికారాలు,
విధులు వుంటాయో రాష్ట్ర స్థాయిలో గవర్నర్ కు కూడా అలాంటి అధికారాలు,
విదులే వుంటాయి. గవర్నర్ రాజ్యాంగ పరంగా తనకు సంక్రమించిన అధికారాలను,
విధులను సహకార సమాఖ్య స్ఫూర్తితో,
భారతదేశాన్ని ఐక్యంగా వుంచడానికి మాత్రమే ఉపయోగిస్తారని రాజ్యంగా నిర్మాతలు
భావించారు కాని, అందరూ కాకపోయినా కొందరు గవర్నర్లు,
అధికారంలో వున్న కేంద్ర ప్రభుత్వం వాటిని దుర్వినియోగం చేయడం వాస్తవం. రాష్ట్రంలో
వున్నది గవర్నర్ నియమించిన తన ప్రభుత్వం. తనకు ఏమి కావాల్సి వచ్చినా
ప్రభుత్వాధినేత అయిన ముఖ్యమంత్రిని నేరుగా అడగవచ్చు.
ఈ
నేపధ్యంలో ఒక్కసారి రాష్ట్రంలో గవర్నర్ అధికారాలకు,
కేంద్రంలో రాష్ట్రపతి అధికారాలకు పోల్చి చూస్తే ఆసక్తికరమైన విషయాలు అవగతమౌతాయి. భారత
రాజ్యాంగ నిబంధనల, ప్రకరణల ప్రకారం
అపరిమితమైన అధికారాలు వున్నది రాష్ట్రపతికా? లేక
ప్రధాన మంత్రికా? అన్న ఒక అధ్యాయనపరమైన
చర్చ జరిగితే, వచ్చే సమాధానం, నిర్ద్వందంగా
రాష్ట్రపతికే విశేషాధికారాలు వున్నాయనేది. గవర్నర్లకు అలా అధికారాలు లేవు. భారత
రాష్ట్రపతిని ఎన్నికైన లోక్ సభ సభ్యులు, రాజ్యసభ
సభ్యులు, రాష్ట్రాల శాసనసభ సభ్యులు, అంతా
కలిసి ఎన్నుకుంటారు కాని ప్రధానమంత్రి కేవలం లోక్ సభ సభ్యుల్లో మెజారిటీ పార్టీకి
మాత్రమే నాయకుడు. పోనీ ఎక్కువలో ఎక్కువ, పార్లమెంటరీ
పార్టీ నాయకుడు. దీనర్థం, ప్రాతినిధ్యపరంగా
రాష్ట్రపతే ప్రధానికంటే ఎక్కువ. గవర్నర్ విషయంలో అలాకాదు. గవర్నర్ కేవలం
నామినేటెడ్ అయిన వ్యక్తే. ముఖ్యమంత్రి ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన వ్యక్తి.
భారత
రాజ్యాంగంలోని ఏ ప్రకరణలో కూడా, స్పష్టంగా
కానీ, పరిపూర్ణంగా కానీ, అస్పష్టంగా
కానీ, ఎక్కడా రాష్ట్రపతి కంటే ప్రధానమంత్రికి ఎక్కువ అధికారాలున్నాయని
చెప్పడం జరగలేదు. కాకపోతే చాలామంది రాజ్యాంగ నిపుణులు బ్రిటీష్ నమూనాను,
అక్కడి అనుభవాలను, సంప్రదాయాలను
మన రాజ్యాంగానికి అన్వయించి ఉదాహరణలు ఇస్తుంటారు. వాస్తవానికి మనది చాలావరకు
బ్రిటీష్ మోడల్ అయినప్పటికీ దాన్ని మొత్తానికి మొత్తం అనుసరించడం లేదు. కొంతమేరకు
మనది పార్లమెంటరీ వ్యవస్థ అయితే, కొంత
మేరకు ప్రెసిడెన్షియల్ వ్యవస్థ అనాలి. అయినప్పటికీ ఇంతవరకూ ఏ రాష్ట్రపతి తన
అధికారాలను ఉపయోగించుకున్న దాఖలాలు కాని, దుర్వినియోగపరచిన సందర్భాలు కానీ,
తన ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన సందర్భాలు కాని,
తనను అవమానించారని చెప్పడం కాని, తాను తలచుకుంటే కేంద్ర ప్రభుత్వం
పడిపోయేది అని అనడం కాని జరగలేదు. దీనికి ప్రధాన కారణం రాష్ట్రపతిగా ఎన్నికైన వారు
ప్రధానికి, కేంద్రంలో అధికారంలో వున్న పార్టీకి ఆమోదయోగ్యమైన వ్యక్తి కావడమే. గవర్నర్ల విషయంలో
అలా కాదు. ముఖ్యమంత్రికి ఆమోదయోగ్యమైన వ్యక్తి అయినా,
కాకపోయినా ప్రధాని సూచన మేరకు రాష్ట్రపతి నియమిస్తారు. అలా నియమించబడిన వ్యక్తి చాలా
సందర్భాలలో కేంద్రంలో అధికారంలో వున్న పార్టీకి చెందిన వ్యక్తి అయ్యుంటారు.
భారత
రాజ్యాంగం ప్రకారం నిజమైన కార్యాచరణ వ్యవస్థ రాష్ట్రపతిదే కాని ప్రధానిది కాదు.
రాష్ట్రపతికి సహాయపడేందుకు, సలహా
ఇచ్చేందుకు మంత్రిమండలి ఏర్పాటుకు సంబంధించి ఆర్టికల్ 74 వివరిస్తుంది. రాష్ట్రపతి
తన విధుల నిర్వహణలో ప్రధానమంత్రి నాయకత్వంలోని మంత్రిమండలి సలహాలను,
సూచనలను స్వీకరిస్తారని ఆ ఆర్టికల్ లో పేర్కొనడం జరిగింది.
రాష్ట్రాలలో కూడా గవర్నర్ పాత్ర ఇలాంటిదే. ముఖ్యమంత్రి నాయకత్వంలోని మంత్రిమండలి
సూచనలను, సలహాలను పాటించి తీరాల్సిందే.
రిపబ్లిక్
ఆఫ్ ఇండియాకు సర్వాధినేత రాష్ట్రపతి. కార్యనిర్వాహక వ్యవస్థ,
శాసన వ్యవస్థ, న్యాయ
వ్యవస్థలకు రాష్ట్రపతే అధిపతి. త్రివిధ దళాలకు ఆయనే కమాండర్ ఇన్ చీఫ్. రాష్ట్రపతి
నేరుగా కానీ, లేదా, తన అధీనంలో పనిచేస్తున్న
మరే అధికారి ద్వారా కానీ, తన
అధికారాలను అమలు చేయవచ్చునని రాజ్యాంగంలోని ఆర్టికల్ 53 చెప్తున్నది. వివాదాస్పద,
చర్చనీయాంశమైన ఆర్డినెన్సులను జారీ చేసే శాసనాధికారం కూడా
రాష్ట్రపతిదే. ఆ విధంగా రాష్ట్రపతికి అపారమైన అధికారాలున్నాయనాలి. కాకపొతే ఇంతవరకు
ఎన్నికైన రాష్ట్రపతులందరు ప్రతివిషయంలో ప్రధాన మంత్రులకు ఆమోదయోగ్యంగా నిర్ణయాలు
తీసుకున్నారు. కౌశిక్ రెడ్డి విషయంలో లాగా విభేదించిన సందర్భాలు కేంద్రంలో దాదాపు లేవనే
చెప్పాలి.
ఎన్నో ముఖ్యాతి ముఖ్యమైన నియామకాలను
రాష్ట్రపతే చేస్తాడు. వారిలో ప్రధానమంత్రి, కేంద్ర
మంత్రులు, గవర్నర్లు, సుప్రీంకోర్ట్,
హైకోర్ట్ న్యాయమూర్తులు, ఎన్నికల
అధికారులు తదితరులుంటారు. షెడ్యూల్డ్ ప్రాంతాల పాలనకు సంబంధించి కమీషన్లను కూడా
ఆయనే నియమిస్తారు. అన్నిటికన్నా ప్రాధాన్యమైంది, ఆర్టికల్
352 నుండి 360 వరకు పేర్కొన్న రాష్ట్రపతికున్న ఎమర్జెన్సీ విశేషాధికారాలు. ఆ
సమయంలో రాష్ట్రపతి, పౌరుల ప్రాధమిక హక్కులను
సైతం రద్దు చేయవచ్చు. వీటిని కూడా ఏ రాష్ట్రపతి కూడా ఎన్నడూ దుర్వినియోగం చేయలేదు.
మంత్రివర్గం సలహా మేరకు మాత్రమే నడుచుకుంటారు.
రాజ్యాంగం
ఆర్టికల్ 75 ప్రకారం ప్రధానమంత్రిని రాష్ట్రపతి నియమిస్తాడు. ప్రధానిని రాష్ట్రపతి
నియమించడానికి ఫలానా విధమైన పధ్ధతి అని రాజ్యాంగంలో ఎక్కడా ప్రత్యేకంగా నిబంధనలు
పొందుపరచలేదు. సాంప్రదాయాలుండవచ్చు. అది పూర్తిగా రాష్ట్రపతి విచక్షణాధికారం.
దీనికి అనుగుణంగా పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి మాతృకైన బ్రిటన్ లో అనేక ఉదాహరణలు
వున్నాయి. విక్టోరియా మహారాణి 1894 లో తన విచక్షణాధికారాలు ఉపయోగించి,
పదవీ విరమణ చేసిన గ్లాడ్ స్టోన్ సలహాను పక్కకు పెట్టి,
దానికి విరుద్ధంగా, లార్డ్
రోస్బెరీని ప్రధానిగా నియమించింది. తిరిగి 1957 లో ఎలిజబెత్ మహారాణి తన
విచక్షణాధికారాలను సంపూర్ణంగా వాడుకుని, తన ఇష్ట
ప్రకారం, ప్రధాని కావాల్సిన బట్లర్ కు బదులుగా హెరాల్డ్ మాక్మిలన్ ను ఆ
పదవిలో నియమించింది. మెజారిటీ స్థానాలను గెల్చుకున్న కన్సర్వేటివ్ పార్టీ
నాయకుడిని ఎన్నుకునే లోపలే ఆమె ఈ నిర్ణయం తీసుకోవడం విశేషం.
సర్వేపల్లి
రాధాకృష్ణన్ భారత రాష్ట్రపతిగా వున్నరోజుల్లో ఆ పదవికున్న అసలు-సిసలైన అధికారం
మొట్టమొదటిసారిగా లభించింది. జవహర్లాల్ నెహ్రూ మరణానంతరం, అధికార
కాంగ్రెస్ పార్టీ దాని అభిప్రాయాన్ని వెల్లడించక ముందే, రాష్ట్రపతి
జీఎల్ నందాను ప్రధాన మంత్రిగా నియమించారు. లాల్ బహదూర్ శాస్త్రి మరణానంతరం కూడా
అదే విధానాన్ని పాటించారు సర్వేపల్లి రాధాకృష్ణన్. మరో మారు కూడా గుల్జారీలాల్
నందాను ప్రధానిగా నియమించారాయన. ఆయన్ను నియమించేటప్పటికి కాంగ్రెస్ పార్టీ
నాయకుడిని ఎన్నుకోలేదు. కాకపోతే రెండు సార్లు కూడా గుల్జారీలాల్ నందా కేవలం
ఆపద్ధర్మ-తాత్కాలిక ప్రదానిగానే పదవిలో కొనసాగారు.
ఇందిరాగాంధీ
హత్యానంతరం అప్పటి రాష్ట్రపతి జైల్ సింగ్, కాంగ్రెస్
పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా రాజీవ్ గాంధీని ఎన్నుకోక ముందే ఆయన్ను ప్రధానిగా
పదవీ ప్రమాణ స్వీకారం చేయించారు. 1989 సాధారణ ఎన్నికల అనంతరం,
కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి విముఖత
వ్యక్తపరచడంతో వీపీ సింగ్ ను ప్రధానిగా నియమించడానికి, ఆ
తరువాత ఆయన రాజీనామా దరిమిలా, మొదలు
రాజీవ్ గాంధీని, తరువాత చంద్రశేఖర్ ను ఆహ్వానించడానికి, అప్పటి
రాష్ట్రపతి వెంకట్రామన్ తన విచాక్షనాధికారాలను పూర్తిగా వినియోగించుకున్నారు.
ఇంతవరకూ
చెప్పిన ఉదాహరణలు రాష్ట్రపతి విచక్షణాధికారాలకు సంబంధించినవి కాగా,
1979 లో నీలం సంజీవరెడ్డి రాష్ట్రపతిగా వ్యవహరించిన తీరు ఆ పదవికున్న ప్రాధాన్యతను తెలియచేస్తుంది.
మొరార్జీ దేశాయి ప్రభుత్వం విశ్వాస నిరూపణలో ఓటమి తరువాత మొదలు వైబీ చవాన్ ను
ఆహ్వానించడంలో, తరువాత, మొరార్జీకి
మరో చాన్స్ ఇవ్వకుండా వుండడంలో, చరణ్
సింగ్ ను చివరకు ప్రధానిగా నియమించడంలో రాష్ట్రపతి పాత్ర ప్రాముఖ్యత
సంతరించుకున్నదే కాకుండా ఆ వ్యవస్థకున్న విశేష అధికారాలను కూడా ప్రస్ఫుట
పరుస్తున్నది. ఆ తరువాత చరణ్ సింగ్ ను విశ్వాస పరీక్షకు ఆదేశించారు రాష్ట్రపతి.
అలా ఆదేశించడం అదే అప్పటికి మొదటిసారి. 25 రోజుల్లోపలే చరణ్ సింగ్ ప్రధానిగా
రాజీనామా చేసి పార్లమెంట్ కు పోని మొదటి-చివరి ప్రధానిగా చరిత్ర పుటల్లో
మిగిలిపోయారు. లోక్ సభను రద్దు చేయమన్న ఆయన సిఫార్సుకు నీలం సంజీవరెడ్డి
అంగీకరించారు. చరణ్ సింగ్ ను ఆపద్ధర్మ ప్రధానిగా కొనసాగమన్నారు రాష్ట్రపతి.
దరిమిలా చోటు చేసుకున్న పరిణామాలు రాష్ట్రపతిని విమర్శించాయే కాని ఆయన అధికారాలను
కుదించలేకపోయాయి. ఎందుకంటే రాష్ట్రపతి అధికారం అంత గొప్పది కాబట్టి.
ఈ
ఉదాహరణలన్నీ ఒకటే విషయాన్ని స్పష్టంగా తెలియచేస్తున్నాయి. ప్రధాన మంత్రి,
ఆయన మంత్రిమండలి వందకు వంద శాతం రాష్ట్రపతి అభిమతానికి అనుగుణంగానే
పదవిలో కొనసాగుతారు. కొనసాగి తీరాలి. ఇంతవరకూ జరగక పోయినా, ఇక
ముందు జరిగే అవకాశాలు ఏ మాత్రం లేకపోయినా, రాజ్యాంగంలోని
అంతర్లీన అర్థం ప్రకారం, సంపూర్ణ
మెజారిటీ ఉన్నప్పటికీ, తాను నియమించిన ప్రధానిని,
ఆయన ప్రభుత్వాన్ని రద్దు చేసే అధికారం రాష్ట్రపతికి వుంటుంది. కాని
అలా జరగడం కాని, రద్దు చేస్తాననడం కానీ జరగలేదు. రాష్ట్రాలలో కొందరు గవర్నర్ల లాగా
కేంద్రంలో రాష్ట్రపతి కూడా ప్రవర్తిస్తే స్వతంత్ర భారత దేశంలో ప్రజాస్వామ్యం
పరిస్థితి ఏమయ్యుండేదో?
ఇన్ని
అధికారాలున్న ఏ భారత రాష్ట్రపతి ఈ 75 సంవత్సరాల స్వతంత్ర భారత చరిత్రలో ఎన్నడూ
వివాదాస్పదం కానప్పుడు, ఒక
పార్టీ అధికారంలో వున్నప్పుడు ఎన్నుకోబడిన రాష్ట్రపతి, ఒక నీలం సంజీవరెడ్డి లాగానో,
ఒక ప్రణబ్ ముఖర్జీ లాగానో తాము ఎన్నుకోబడిన తరువాత వేరే పార్టీ అధికారంలోకి
వచ్చినా వివాదరహితంగా ప్రధానితో కలిమిడిగా, సఖ్యతగా పనిచేసినప్పుడు,
కేంద్రంలో రాష్ట్రపతి మోతాదులో రాష్ట్రాలలో అధికారాలు లేని కొందరు గవర్నర్ల విషయంలో
అలా ఎందుకు జరగడం లేదనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.
దీనికి
సరైన సమాధానం చెప్పాల్సింది రాజ్యాంగ కోవిదులు,
రాజ్యంగ నిపుణులు మాత్రమే. బ్రిటీష్ సామ్రాజ్యవాద,
వలసవాద పాలన నుండి గత శతాబ్దంలో స్వాతంత్ర్యం పొందిన అనేక దేశాలలో ప్రజాస్వామ్య
ప్రక్రియ కొనసాగుతున్న ఏకైక దేశం భారతదేశం. ఈ వరవడి పదికాల పాటు కొనసాగాలని
కోరుకుందాం.
No comments:
Post a Comment