నిరంకుశత్వం వైపు పరిగెడుతున్న ప్రజాస్వామ్యం
వనం
జ్వాలా నరసింహారావు
ఆంధ్రజ్యోతి
దినపత్రిక (29-03-2024)
ప్రజాస్వామ్య ప్రభుత్వాల ఏర్పాటు దిశగా గణనీయమైన పురోగతి
ఏనాడో భారత ఉపఖండంలోనూ, సమీప తూర్పు దేశాల్లోనూ ఆరంభమైంది. సమాజంలో ‘స్వేచ్ఛ, ఆమోదయోగ్యత, సమానత్వం, సమగ్రత’ల
ప్రాతిపదికగా, సనాతన భారతీయ ధర్మానికి అనుగుణంగా, పౌరులకు నాణ్యమైన, గౌరవప్రదమైన జీవనాన్ని లభించేలా, పరిఢవిల్లిన మహత్తర ప్రజాస్వామ్య భావన భారతదేశం స్వంతం. భారతదేశంలోని
సర్వతంత్ర స్వతంత్ర గణతంత్ర రాజ్యాల నాటినుండే తొలినాటి ప్రజాస్వామ్య సంస్థల
ఆవిర్భావం జరిగిందని చరిత్ర చెపుతున్నది. ప్రాచీన భారాతవనిలోనే ప్రజాస్వామ్య
రాష్ట్రాలు ఉద్భవించాయని గ్రీక్ చరిత్రకారుడు డియోడోరస్ సహితం ధృఢపరచాడు.
భారతదేశంతో సహా బ్రిటీష్ సామ్రాజ్య పరిధిలోని పలు దేశాలు,
ఇంగ్లాడ్ రాజకీయవేత్త జాన్ బైట్ రూపకల్పన చేసిన పదబంధం, ‘పార్లమెంటుల మాతృక’ గా
పిలువబడే ‘వెస్ట్ మినిస్టర్ నమూనా బ్రిటీష్ పార్లమెంట్’ విధానాన్ని స్వీకరించాయి. భారతదేశంలో
స్వాతంత్ర్యానంతరం, 1950 సంవత్సరంలో రాజ్యాంగం ఏర్పడినాక, సమాఖ్య విధాన పార్లమెంటరీ తరహా
ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పాటు కావడంతో, ఆధునిక
ప్రజాస్వామ్యం ప్రారంభమైంది. భారత ప్రధమ ప్రధాని, నవభారత
నిర్మాత, జవహర్లాల్ నెహ్రూ ప్రజాస్వామ్యానికి పటిష్టమైన
పునాదులు వేసినప్పటికీ, అడపాదడప అనేక అవాంతరాలను ఎదుర్కుంటూ
నిలదొక్కుకుంది. ‘ఆధునిక ప్రజాస్వామ్యానికి ఆధ్య్దుడు’ గా అమెరికా మాజీ అధ్యక్షుడు
జార్గ్ వాషింగ్టన్ ను, మరో మాజీ అధ్యక్షుడు అబ్రహం లింకన్ ను
ప్రజాస్వామ్యాన్ని ‘ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజలే ఎన్నుకొనే ప్రభుత్వం’గా నిర్వచించిన
వ్యక్తిగా పేర్కొంటారు. ఆంగ్లేయ తత్త్వవేత్త, వ్యావహారిక సత్తావాదం స్థాపకుడు జాన్
లాక్ ను కూడా ‘ప్రజాస్వామ్య పితామహుడని అంటారు.
‘ఎన్నికల నిరంకుశ భావన’ పుణ్యమా అని, ప్రజలచే పాలన అనే
స్ఫూర్తికి కాని, పౌరులకు తాము కోరుకునే, తమ గొంతు వినే వ్యవస్థగాకాని, ఆధునిక ప్రజాస్వామ్యం
కట్టుబడిలేదనాలి. ప్రపంచం ప్రజాస్వామ్యయుతంగా మార్పుచెందుతున్నదన్న విస్తృతాభిప్రాయం
పూర్తిగా ఆధారరహితమే అనాలేమో! ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్య దశ, దిశ విషయంలో ఆందోళన చెందుతున్న వ్యక్తుల్లో, పౌర
సమాజ సంస్థలలో, మేధావుల్లో, రాజ్యాంగ నిపుణుల్లో, దినదినం పలు సందేహాలు ఊపందుకుంటున్నాయి. నిశితంగా పరిశీలించి చూస్తుంటే, అప్పుడప్పుడో, ఒక క్రమపద్ధతిలోనో, న్యాయ బద్ధమో,
అన్యాయ బద్ధమో, నిర్వహిస్తున్న ఎన్నికలు మాత్రమే ప్రజాస్వామ్యానికి నిదర్శనం,
గీటురాయి అనే అపోహ కలుగుతున్నది. కఠోర వాస్తవం ఏమిటంటే, ప్రపంచం మొత్తం ప్రస్తుతం
‘నిరంకుశత్వాలు, ప్రజాస్వామ్యాలు’ గా విభజన జరిగింది.
వాస్తవానికి మనం అనుకుంటున్న మెజారిటీ ప్రజాస్వామ్యాలు కూడా దాదాపుగా ‘అర్థ
నిరంకుశాలే’. ప్రజాస్వామ్య భవిష్యత్తు ప్రమాదంలో పడుతున్న
నేపధ్యంలో, దాని మనుగడ విషయంలో గణనీయమైన అసంతృప్తి సర్వత్రా వ్యక్తమవుతున్నది.
పరిపక్వత చెందిన ప్రజాస్వామ్యంలో నాయకులు ప్రజల
భాగస్వామ్యాన్ని, సలహా, సూచనలను స్వాగతిస్తారు. ప్రోత్సహిస్తారు.
అభిప్రాయాలను వ్యక్తీకరించడానికి పుష్కలంగా అవకాశాలు కలిగించి, విభిన్న ధృక్కోణాలకు విలువ ఇస్తారు. అలాంటి ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం
పాత్ర తక్కువ నియంత్రణలదిగా, ప్రజలు నమ్మినదాన్ని, కోరుకున్న దాన్ని, సులభతరంగా పొందడానికి
సహకరించేదిగా వుంటుంది. ప్రజలు తాము ఎంపికచేసుకున్న రాజకీయ పార్టీలోకాని, ఇతర
సమూహాలలోకాని నిరభ్యంతరంగా చేరే అవకాశం వుంటుంది. ప్రజాస్వామ్యం పరిపక్వత చెందక, నియంతృత్వ ధోరణులు వున్న చోట, పార్టీ, ప్రభుత్వం, దేశంపై సంపూర్ణ నియంత్రణ చేసే ఒకే ఒక్క నాయకుడు వుంటాడు.
‘నిరంకుశ తరహా ప్రజాస్వామ్య నాయకత్వం’, ‘ప్రజాస్వామ్య
నియంతృత్వం’ అనే రెండు విచిత్ర ప్రజాస్వామ్య విధానాలు ఇటీవలికాలంలో ఆవిర్భవించి, పుంజుకుంటున్నాయి. ఈ రెండింటిలోనూ నిర్ణయాదికారాలన్నీ ఒకే ఒక్క వ్యక్తి
(నాయకుడు) చేతుల్లో కేంద్రీకృతమై, క్యాబినెట్ సహచరులతో సహా, పౌర సంఘాల, బ్యూరోక్రాట్ల, మేధావుల,
వివిధ రంగాలకు చెందిన నిపుణుల సూచనలు కూడా ససేమిరా పట్టించుకోని పరిస్థితి
కలుగుతున్నది. భారతదేశానికి సంబంధించినంతవరకు ‘ప్రజాస్వామ్య నియంతృత్వం’ ఇందిరాగాంధీ
పాలనలో మొదలైందని చెప్పాలి. ప్రాంతీయపార్టీల ఆవిర్భావంతో, వ్యవస్థాపకుడి
తిరుగులేని ఆధిపత్యం ప్రజాస్వామ్యానికి ఇబ్బందికరంగా మారిందనవచ్చేమో!
స్వాతంత్ర్యానంతర భారతావనిలో రాజకీయ పార్టీల నిర్ణయాధికారం
ఒక అద్భుతమైన ‘టీం వర్క్’ లాగా వుండేది. కాంగ్రెస్ పార్టీ ‘పార్లమెంటరీ బోర్డ్’ కానీ, కమ్యూనిస్ట్ పార్టీ ‘పోలిట్ బ్యూరో’ కానీ, అలాంటి ఏర్పాటే వున్న జనసంఘ్ లేదా దాని
రూపాంతరమైన భారతీయ జనతా పార్టీ కాని, ‘ఏకాభిప్రాయం’ ఆధారంగా నిర్ణయాలు తీసుకునేవి. క్రమేపీ ‘ఏకాభిప్రాయం’ అర్థమే మారిపోయి, ‘ఏక వ్యక్తి అభిప్రాయం’గా, ఏకస్వామ్యంగా
మారింది. ప్రజాస్వామ్యం, పార్టీలు,
గెలుపు, ఓటముల ప్రాధమిక మౌలిక సూత్రాలను ఆచరించడం
అరుదైపోయింది. ఎన్నికల్లో రాజకీయ పార్టీలు గెలవడం కానీ,
ఓడిపోవడం కానీ శాశ్వతం కాదనే సహజ ‘అద్భుతం’ అర్థం చేసుకోలేని
దుస్థితి నెలకొన్నది. ఎవరూ శాశ్వతంగా అధికారంలో వుండరనీ,
ఘోరంగా పరాజయం పాలవడం లేదా బ్రహ్మాండంగా విజయం సాధించడం అనే అంశం ప్రజాస్వామ్య
రాజకీయ పార్టీ నాయకుల తలకెక్కడంలేదు.
ఒకానొక కాలంలో ఏ రాజకీయ పార్టీలోనైనా అంచెలంచెలుగా నిచ్చెన
మెట్లు ఎక్కాలంటే పార్టీ ప్రాధమిక సభ్యత్వం తప్పనిసరి. అదిప్పుడు పూర్తిగా గత
చరిత్ర. అలాగే సర్పంచ్ స్థాయి నుండి కేంద్రమంత్రి స్థాయికి ఎదిగేవారు. ఇక ఇప్పుడు
అన్నీ సత్వరమార్గాలే! చిలక్కొయ్యకు తగిలించిన చొక్కాలు మార్చినంత సులభం. మరీ
చెప్పాలంటే, రసాయన శాస్త్రంలోని ‘సబ్లిమేషన్’ ప్రక్రియలో ఒక పదార్ధం నేరుగా ఘనస్థితి
నుండి మధ్యస్థ ద్రవస్థితి దాటవేసి, వాయుస్థితికి మారడంలాగా.
చాలామందిలో రాజకీయ భావజాలం కాని, నిబద్ధత కాని, అసలేలేదు. ఒక హార్డ్‌కోర్ కమ్యూనిస్ట్ పార్టీ వ్యక్తి, లేదా నిబద్ధతగల ఒక సెక్యులర్ పార్టీ సభ్యుడు, రాత్రికి
రాత్రే సభ్యత్వంతో సంబంధం లేకుండా, మతతత్త్వ పార్టీ పక్షాన
ఎన్నికల బరిలో దిగుతున్నారు. అలాగే ఇటునుండి అటు మారుతున్నారు. అలా మారినవారికి
వెంటనే పార్టీ టికెట్ ఇవ్వకూడదన్న నిబంధన పెట్టే ధైర్యం ఎన్నికల కమీషన్ కు ఏమాత్రం
లేదు. పలుకుబడి కలవారికి, సంపన్నులకు, పార్టీ సభ్యత్వం తీసుకుని, కొంతకాలం వేచి వుండి, ఆ తరువాతే ఎన్నికలలో పోటీ
చేయాల్సిన అవసరం లేనే లేదు. దీన్నే ఆంగ్లంలో ‘లీప్ ఫ్రాగింగ్’ అంటారు. రాజకీయ పార్టీగా నమోదు చేసుకుంటున్నప్పుడు ఉన్నతమైన ఆదర్శాలను
వల్లించని రాజకీయపార్టీ వుండదు. ఆచరణలో మాత్రం శూన్యం.
ఈ నేపధ్యంలో ప్రపంచవ్యాప్తంగానూ,
భారతదేశంలోనూ, కొన్ని రాష్ట్రాలలోనూ చోటుచేసుకుంటున్న కొన్ని
సంఘటనల అంతరార్థాలను నిశితంగా అవగతం చేసుకున్నవారిని ఆందోళనకు గురిచేస్తున్నదని
విశ్లేషకుల భావన. హిందు సమాజాన్ని అణచి వేయడం కొరకు, కాంగ్రెస్ పార్టీ ప్రాధమికంగా
వక్రీకరించిన రాజ్యాంగాన్ని మార్చడానికి తమపార్టీకి 400 లోక్
సభ స్థానాలు అవసరమౌతాయని కర్నాటక బీజేపీ ఎంపి అనంత్ కుమార్ హెగ్డే చేసిన వ్యాఖ్యలు
జుగుప్సాకరంగా వున్నాయనాలి. బీజేపీ అధినాయకత్వం ఆ వ్యాఖ్యలను ఖండించినప్పటికీ, కాంగ్రెస్ పార్టీ నాయకుడు చిదంబరం ఆ మాటలు ‘పార్లమెంటరీ
ప్రజాస్వామ్యానికి ముగింపు’ గా ముద్రవేశారు. భారత
పార్లమెంటరీ ప్రజాస్వామ్య నిర్మాణానికి కానీ, లౌకిక వ్యవస్థ
మనుగడకు కానీ,
ఎలాంటి ముప్పు కలిగినా సహించరాదు.
డాక్టర్ ఎన్ భాస్కర రావు అనే ఒక సామాజిక పరిశోథనా
మార్గదర్శి,
‘రెజ్యువెనేటింగ్ ద రిపబ్లిక్’ అనే తన ఆంగ్ల పుస్తకంలో
ప్రజాస్వామ్యంపై వ్యాఖ్యానిస్తూ-చాలామంది భారతీయులకు, అందునా
యువతకి, స్వాతంత్ర్య సౌధం ఎంతమంది త్యాగాల పునాది మీద
నిర్మించబడిందో అవగాహన లేదని అంటారు. వారికి స్వాతంత్ర్యం, గణతంత్రం,
రాజ్యాంగం లాంటివాటి ద్వారా ప్రయోజనాలు పొందడం మాత్రమే కావాలని, నిజానికి ఇన్ని దశాబ్దాల కాలంలో దేశ గణతంత్ర పరిస్థితి ఒకేలా స్థిరంగా
లేదని, మొదటి 25 సంవత్సరాలు ఒకే ఒక పార్టీ పెత్తనం నడిచిందని, తరువాతి 25 యేళ్లలో సంకీర్ణ ప్రభుత్వాలు నడిచాయని, ప్రస్తుతం
ఒకే నాయకుడు, ఒకే పార్టీ అన్న లక్షణాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయని, ఇదే పంథా మరొక 25 యేళ్లు
సాగుతుందా? అన్నది ప్రజల ఊహాగానాలకే వదిలేద్దామని అంటారు. ఇలాంటి
పరిస్థితి బహుశా ప్రజాస్వామ్య దేశాలన్నిటిలో ఉన్నదేమో!
ఇదిలా వుండగా, ఏటా ప్రపంచ దేశాలలో ప్రజాస్వామ్య పరిస్థితుల
మీద నివేదిక విడుదల చేసే ‘వెరైటీస్ ఆఫ్ డెమోక్రసీస్’ అనే
సంస్థ తన నివేదికలో, నియంతృత్వం పరంగా ప్రపంచ దేశాలలో భారత్
‘విశ్వగురు’ స్థానంలో వుందని పేర్కొంది, ఎన్నికలు జరిగే
నియంతృత్వ దేశం స్థాయికి పడిపోయిందని, భారత్ అసలు
ప్రజాస్వామ్య దేశంగానే లేదని తీర్మానించింది. అలాగే, మూడింట
రెండువంతులకు పైగా భారతీయులు దేశంలో ‘నిరంకుశ’ లేదా ‘సైనిక’ పాలనకు మద్దతు ఇస్తున్నట్లు ‘ ప్యూ రీసర్చ్ సెంటర్’
నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. ఇలాంటి కథనాలు భారతదేశంలో ప్రజాస్వామ్య
పరిస్థితిపై ఆందోళన కలిగిస్తున్నాయి. END
{Additional Information......హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం, కులు
లోయకు దగ్గరగా వున్న ‘మలానా’ అనే ప్రాచీన కాలంనాటి భారతీయ గ్రామాన్ని, ప్రపంచంలోని 'అతి పురాతన ప్రజాస్వామ్యాలలో ఒకటి'గా చెప్పుకుంటారు. జమ్లు అనే ఋషి, ఏనాడో రూపొందించిన నియమ, నిబంధనలకు
కొన్ని మార్పులు, చేర్పులు చేసి, ‘కనిష్ఠాంగ్’ అనే దిగువ సభ,
‘జయేష్‌తాంగ్’ అనే ఎగువ సభల వ్యవస్థీకృత పార్లమెంటరీ ప్రజాస్వామ్య పాలన
జరుగుతున్నది ఇప్పటికీ గ్రామంలో. స్వతంత్ర న్యాయవ్యవస్థ కూడా వుందిక్కడ. ఉత్తర
భారతదేశంలో పెరిగిన, సర్ జాన్ బెట్జెమాన్ భార్య, ఆంగ్ల యాత్రా రచయిత, పెనెలోప్
వాలెంటైన్ హెస్టర్ చెట్వోడ్ లేడీ బెట్జెమాన్, ఈ గ్రామం గురించి తన రచనల్లో
వివరించారు. హిమాచల్ ప్రదేశ్‌లో ఈ గ్రామం ఉన్నప్పటికీ, దీనిని
భారతదేశంలో భాగంగా గ్రామ ప్రజలు పరిగణించడంలేదు. ప్రజాస్వామ్య వ్యవస్థ ఆవిర్భావం, పరిణామక్రమం, ఆరోహణ, అవరోహణ, విలువల క్షీణత, ప్రజాస్వామ్య నియంతృత్వం మొలకలు,
ప్రజాస్వామ్యం పేరుతో నిరంకుశ ధోరణులు అనేవి ఆసక్తికరమైన అంశాలు. మలానా గ్రామం
విషయం అటుంచితే, ప్రపంచంలోని పురాతన నగరాలలో ఒకటైన ఏథెన్స్
ను ప్రజాస్వామ్యానికి జన్మస్థలంగా పరిగణిస్తుంది చరిత్ర.
క్రీస్తు పూర్వం ఐదవ శతాబ్దినాటికే ఏథెన్స్ లో ప్రజాస్వామ్య
వ్యవస్థకు పునాదులువేసి, స్థాపించి, తీర్చిదిద్ది, ‘ఎథీనియన్ ప్రజాస్వామ్య పితామహుడిగా’ పేరు గడించిన క్లీస్టెనెస్ ఏథెన్స్
లోని గ్రామాలను పది తెగలుగా ఏర్పాటుచేసి, ఆ వ్యవస్థకు
శ్రీకారం చుట్టారు. ఎథీనియన్ కౌన్సిల్‌ను సంస్కరించి, పలు
ప్రజాస్వామ్య సంస్కరణలను క్లీస్టెనెస్ ప్రోత్సహించాడు. ప్రసిద్ధ రాజనీతిజ్ఞుడు
పెరికల్స్ సహితం ఎథీనియన్ సమాజంలో ప్రజాస్వామ్య భావజాల వ్యాప్తికి దోహదం చేశాడు.
అయినప్పటికీ, ప్రజాస్వామ్యానికి చక్కటి ఉదాహరణ అని
చెప్పుకునే ఏథెన్స్, ఏనాడూ పరిపూర్ణంగా ప్రజాస్వామికమైనదని అనలేము. సోక్రటీసు
శిష్యులలో అగ్రగణ్యుడు, తత్త్వవేత్త, పాశ్చాత్య సంస్కృతికి పునాదులు నిర్మించిన
ప్లేటో మాత్రం పురాతన గ్రీసులో ప్రజాస్వామిక పాలనను వ్యతిరేకించాడు.
1933 సంవత్సరంలో అప్పటి జర్మనీ అధ్యక్షుడు హిండెన్బర్గ్, నియంత హిట్లర్ ను ఆ
దేశ చాన్సలర్ గా నియమించడాన్ని, ‘ప్రజాస్వామ్య విధ్వంసానికి బీజాలు పడ్డ అంశం’ గా పరిగణించారు. ఇటీవల 2024 మార్చ్ నెల
మొదటివారంలో, అమెరికా కాంగ్రెస్ సంయుక్త సమావేశం 'స్టేట్ ఆఫ్
ది యూనియన్' లో మాట్లాడిన దేశాధ్యక్షుడు జొ బైడెన్,
‘అమెరికాతో సహా యావత్ ప్రపంచానికి ట్రంప్ నేతృత్వంలో ప్రజాస్వ్యానికి ముప్పు
పొంచి వున్నది’ అని తీవ్రంగా విమర్శించాడు. ‘మీరు ఏమి
చేయాలనుకుంటే అదే చేయండి’ అని రష్యన్ నాయకుడు పుతిన్ తో
ట్రంప్ చెప్పడానికి అభ్యంతరం తెలియచేశాడాయన. దాన్ని ఆయన ‘దారుణమైన, ప్రమాదకరమైన, ఆమోదయోగ్యం కాని’ వ్యవహారంగా
వర్ణించారు. ఇలాంటి వ్యాఖ్య కేవలం ఒక ఉదాహరణ మాత్రమే. ప్రజల భావాలను అర్థం
చేసుకోకుండా ట్రంప్ లాంటి నాయకులు నిరంకుశంగా ప్రవర్తిస్తుంటే, బైడెన్ లాంటి
నాయకులు దాన్ని నిష్కర్షగా విమర్శించడం, ఖచ్చితంగా దాన్ని వెలుగులోకి తేవడంలాంటివి
ప్రపంచవ్యాప్తంగా సర్వసాధారణమైపోయాయి}
Yes, it is an alarming trend and people are not getting it, blinded by religious fervor or fanaticism. What they don't get is, they have been following their religious practices, not from 1947 but from ages.
ReplyDelete