Sunday, March 10, 2024

కాణ్వ వంశం, శాతవాహన వంశం బ్రాహ్మణ రాజులు (2 & 3) : వనం జ్వాలా నరసింహారావు

 కాణ్వ వంశం, శాతవాహన వంశం బ్రాహ్మణ రాజులు (2 & 3)

 వనం జ్వాలా నరసింహారావు

సూర్యదినపత్రిక మ్(11-03-2024)  

కాణ్వ వంశం

శుంగ వంశపు చివరి రాజు దేవభూతి. అతడి మంత్రి వాసుదేవుడు. అతడికి రాజ్య కాంక్ష ఎక్కువ. భోగలాలసుడైన దేవభూతిని, వాసుదేవుడు అంతఃపుర దాసీ పుత్రికతో హత్య చేయించాడు. తరువాత సింహాసనాన్ని ఆక్రమించుకొని కాణ్వ వంశాన్ని స్థాపించాడు.

వాసుదేవుడు కణ్వ మహర్షి వంశానికి చెందిన వాడు. కణ్వ మహర్షి వల్ల వాసుదేవ మంత్రి గోత్రం కాణ్వ గోత్రంగానూ, వంశం కాణ్వాయన వంశం గానూ ప్రసిద్ధికెక్కింది. కాణ్వ వంశానికి చెందిన నలుగురు రాజులు మగధ సామ్రాజ్యాన్ని పాలించారు. వారిలో వాసుదేవుడు 9 సంవత్సరాలు, భూమిపుత్రుడు 14 సంవత్సరాలు, నారాయణ 12 సంవత్సరాలు, సుశర్మ 10 సంవత్సరాలు పాలించారు.

ఈ రాజులంతా అనేక మంది మాండలిక రాజులను, అన్య రాజవంశీయులను తమ సామంతులుగా చేసుకొని ధర్మబద్ధంగా పాలన చేసినట్లు చరిత్ర తెలియచేస్తున్నది. కొంత కాలానికి ఆంధ్ర శాతవాహన వంశ ప్రభువులు వీరిని జయించి మగధ రాజ్యాన్ని ఆక్రమించి పాలించారు. ఆంధ్ర శాతవాహనుల రాజు కాణ్వాయన వంశం వారినే కాకుండా శుంగ వంశానికి చెందిన రాజులందరినీ ఓడించి రాజ్యాన్ని ఆక్రమించినట్లు చారిత్రిక ఆధారాలున్నాయి. శుంగ వంశపు రాకుమారులు బలహీనులగుటవలన కాణ్వాయన వంశీయులు వారిని నామ మాత్రపు ప్రభువులుగా లెక్కించి, రాజ్య పాలనా వ్యవహారాలను చేజిక్కించుకొని, చివరికా వంశాన్ని నిర్మూలించారు.

   శుంగ వంశపు 112 సంవత్సరాల రాజ్యపాలనలో చివరి 45 సంవత్సరాలు కాణ్వ వంశీయుల పాలన ఇమిడి వున్నది. శుంగ వంశపు రాజులలో చివరి వారు నామ మాత్రపు ప్రభువులైనందున కాణ్వ వంశపు అమాత్యులు సమస్త పాలనాధికారం కలిగి వుండేవారు. కాణ్వ వంశపు మొదటి రాజైన వాసుదేవుడి కాలంలో శుంగ వంశీయులు విదిశ రాజ్యాన్ని చిన్న-చిన్న భాగాలుగా చేసి పాలించేవారు. కాణ్వ వంశీయులు శుంగ వంశీయుల చిన్నచిన్న రాజ్యాల జోలికి పోలేదు. శుంగ వంశ పాలనానంతరం కాణ్వాయనులు క్రీస్తుపూర్వం 76 నుండి, క్రీస్తుపూర్వం 30 వరకు 45 సంవత్సరాలు మగధ రాజ్యాన్ని పాలించారు.

కాణ్వాయన వంశీయుల తరువాత క్రీస్తు శకం మొదటి, రెండు శతాబ్దాలు భారతదేశాన్ని శాతవాహనులే చక్రవర్తులుగా పరిగణించబడ్డారు. వారు అజేయులై అనేక రాజవంశాలను రూపుమాపి, మగధ సామ్రాజ్యాన్ని జయించి, సువిశాల  భారత భూభాగాన్ని పాలించారు. కాణ్వ వంశం అంతరించిన తరువాత గుప్త సామ్రాజ్య స్థాపన వరకు మగధ రాజ్య చరిత్ర అనిశ్చితంగా వున్నది. ఆ సమయంలోనే శాతవాహనులు విజృంభించి మగధను ఆక్రమించి భారతదేశ చక్రవర్తులయ్యారు. శాతవాహన చక్రవర్తులలో గౌతమీపుత్ర శాతకర్ణి అమితమైన బలపరాక్రమ సంపన్నుడు.   

శాతవాహన వంశం

         దక్షిణాపథానికి మజోజ్వల చరిత్రను అందించినవారు శాతవాహన వంశీయులు. భారతదేశ మహోన్నత చరిత్రకు శ్రీకారం చుట్టిన శాతవాహనులు ఆంధ్రుల కీర్తి చంద్రికలను దిగ్దిగంతాలకు వ్యాపింప చేశారు. ఈ వంశీయులు అసహాయ శూరులు, అరివీర భయంకరులు. శాతవాహనులు ఆంధ్రులు-తెలుగువారు. వీరి తొలి నివాసం కరీంనగర్ జిల్లాలోని కోటిలింగాల ప్రాంతం. ఇది తొలి శాతవాహనుల గణతంత్ర రాజ్యంగా వుండేది. క్రమంగా ఆంధ్రులు గణతంత్ర రాజ్య వ్యవస్థ నుండి ఎదిగి రాజ్యాలను స్థాపించుకొనే స్థితిని పొందారు. శాతవాహనుల రాజధానీ నగరం అమరావతి, ధాన్యకటకం, ధనకటకం, దాన్యవాటి అని నామాంతరం పొందింది. మహారాష్ట్రలో వున్న పిష్టపురం లేక పైఠాన్ నగరం శాతవాహనుల ముఖ్యమైన రాజధాని నగరంగా వుండేది. శాతవాహనులు తెలుగు వారైనందువల్ల తెలుగు దేశంతో వారికి ఘనిష్ట సంబంధం వున్నది. మహారాష్ట్రలో వీరు రాజ్యాన్ని వ్యాపింపచేసిన తరువాత అనేక రాజ్యాలను జయించి సార్వభౌమాధికారం వహించారు.

        శాతవాహన వంశీయులు అశ్వగణానికి చెందినవారు. వీరి చరిత్ర రచనలో పురాణాలు ఆధారంగా వున్నాయి. మత్స్య పురాణం, వాయు పురాణం ప్రకారం శాతవాహన వంశీయులు 30 మంది రాజులు 400-450 సంవత్సరాలు పాలించినట్లు పేర్కొనబడింది. వీరిలో ఎక్కువ కాలం పాలించిన వారిలో సిముకుడు (శ్రీముఖుడు), రెండవ శాతకర్ణి, పులోమావి, గౌరకృష్ణ-ఆరిక్తవర్మ, శివస్వాతి, గౌతమీపుత్ర శాతకర్ణి, రెండవ పులోమావి, యజ్ఞశ్రీ శాతకర్ణి వున్నారు. ఈ రాజన్యులలో హాల శాతవాహన చక్రవర్తి గొప్పకవి. సంస్కృత, ప్రాకృత భాషలను ఆదరించాడు. ఆయన ఆస్థానాన్ని అలంకరించిన వారిలో కవులైన కుమారిల, శ్రీపాలితులు ముఖ్యులు. గాథాసప్తశతి ఈయన కాలంనాటిదే. ఈ గ్రంథం శాతవాహనుల కాలంనాటి స్థితిగతులను తెలియచేస్తుంది. అలాగే శాతవాహనుల కాలంనాటి ఆర్ధిక స్థితిగతులను తెలుసుకోవడానికి నాణేలు ప్రధానపాత్ర వహిస్తున్నాయి.

         శాతవాహన వంశానికి మూలపురుషుడు శ్రీముఖుడు. ఇతడి తండ్రి శాతవాహనుడు. శ్రీముఖుడు కరీంనగర్ జిల్లాలోని కోటిలింగాల ప్రాంతంలో గణతంత్ర రాజ్యపాలకుడిగా వుండి, అశోక చక్రవర్తి మరణానంతరం స్వతంత్రుడై, విశాల సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకొని పాలించాడు. ఇతడు రాజకీయ చతురుడు. పరాక్రమోపేతుడు. క్రీస్తుపూర్వం 231 లో చుట్టుపక్కల రాజ్యాలను జయించి శాతవాహన రాజ్యాన్ని విస్తరించాడు. శ్రీముఖుడు ఆంధ్రదేశ భూభాగాలను జయించిన తరువాత మహారాష్ట్రలో వున్న మహారథుల రాజ్యాలను జయించాడు. ఆంధ్రదేశ భూభాగాలను సమైక్యపరచి విశాల సామ్రాజ్యాన్ని స్థాపించి, ఆంధ్రజాతికొక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరిచాడు. క్రీస్తుపూర్వం 208 వరకు పాలించాడు.  

         సుమారు 24 సంవత్సరాలు పాలించిన శ్రీముఖుడి అనంతరం ఆయన జ్యేష్ట కుమారుడు చిన్నవాడైనందున సోదరుడు కృష్ణశాతకర్ణి రాజయ్యాడు. ఇతడు క్రీస్తుపూర్వం 208 నుండి క్రీస్తుపూర్వం 198 వరకు పాలించి అన్నగారి కొడుకు మొదటి శాతకర్ణికి రాజ్యాన్ని అప్పగించాడు. ఇతడు దేశమందున్న సమస్త రాజన్యులను జయించి రాజసూయ యాగం చేశాడు. దక్షిణాపథంలో వున్న రాజులను జయించిన తరువాత ఉత్తర భారతం మీద దండెత్తి మగధ రాజైన పుష్యమిత్రుడిని ఓడించిన ఖారవేలుడి మీద విజయం సాధించాడు. అతడికి రాజ్య పాలనలో, వైదిక మాట ఉద్ధరణలో, యజ్ఞయాగాదుల నిర్వహణలో  మహారాష్ట్ర ప్రాంతానికి చెందిన అతడి భార్య రాణీ దేవీ నాగానీక సహకరించేది. శాతకర్ణి చిన్న వయస్సులోనే మరణించాడు. ఇతడి పాలనాకాలం క్రీస్తుపూర్వం 198-179.  

         శాతకర్ణి మరణానంతరం పూర్ణోత్సంగుడు రాజయ్యాడు. శాతకర్ణి కుమారులు నలుగురు వారిలో వారు కలహించుకుంటూ ఉన్నందువల్ల ఖారవేలుడు శాతవాహన రాజ్యం మీద దండయాత్రలు చేశాడు. స్కందస్తంబి క్రీస్తుపూర్వం 161 లో శాతవాహన రాజ్య సింహాసనం అధిష్టించి 18 సంవత్సరాలు పాలించాడు.

స్కందస్తంబి తరువాత రెండవ శాతకర్ణి క్రీస్తుపూర్వం 143 లో రాజై సుదీర్ఘ కాలం, 56 సంవత్సరాలు రాజ్యం ఏలాడు. ఇతడు గొప్ప విజేత. అరివీర భయంకరుడు. ఖాలవేలుడు ఆక్రమించిన శాతవాహన రాజ్య భూభాగాలను ఇతడు తన సామ్రాజ్యంలో చేర్చాడు. మగధ, కళింగ రాజ్యాలను ఆక్రమించి చక్రవర్తి బిరుదు తెచ్చుకున్నాడు రెండవ శాతకర్ణి. ఇతడు క్రీస్తుపూర్వం 86 వరకు పాలించాడు.

రెండవ శాతకర్ణి మరణానంతరం లంబోదరుడు శాతవాహన రాజ్యాధిపతై 18 సంవత్సరాలు పాలించాడు. ఇతడు సమర్ధుడైన రాజు కానందున పలువురు స్వతంత్రులయ్యారు. లంబోదరుడు క్రీస్తుపూర్వం 68 వరకు పాలించాడు. లంబోదరుడి తరువాత వరుసగా అపీలకుడు, మేఘస్వాతి, స్వాతి శాతకర్ణి, స్కందస్వాతి, మృగేంద్ర స్వాతికర్ణ, కుంతల శాతకర్ణి, స్వాతివర్ణ, పులోమావి, గౌరకృష్ణుడు, హాలశాతవాహనుడు, మందూలకుడు, పురేంద్రసేన, సుందర శాతకర్ణి, చకోర శాతకర్ణి, శివస్వాతి మున్నగువారు క్రీస్తుపూర్వం 86 నుండి క్రీస్తు శకం 104 వరకు పాలించారు.

ఆ తరువాత క్రీస్తుశకం 104 లో గౌతమీపుత్ర శాతకర్ణి సింహాసనం అధిష్టించి సుమారు 21 సంవత్సరాలు పాలించాడు. శాతవాహన కీర్తి ప్రతిష్టలను ఇనుమడింప చేసిన రాజులలో గౌతమీపుత్ర శాతకర్ణి అగ్రగణ్యుడు. ఆయన సింహాసనం అధిష్టించేనాటికి శాతవాహన రాజ్యం చిన్నదిగా వుండేది. గౌతమీపుత్ర శాతకర్ణి తల్లి గౌతేమీ బాలశ్రీ. ఆమె వీరమాత. అతడు వేయించిన శాసనాల ద్వారా ఆయన బలపరాక్రమాలు, విజయాలు, పాలించిన రాజ్యాల పేర్లు తెల్సుకోవచ్చు. గౌతమీపుత్ర శాతకర్ణి ఏక బ్రాహ్మణ బిరుదాంకితుడు. క్షత్రియ దర్పం అతడిలో వున్నది. అసిక, ఆశ్మక, ములక, విదర్భాది రాజ్యాలను జయించినవాడు.

గౌతమీపుత్ర శాతకర్ణి మహాసామ్రాజ్య నిర్మాత. పతనావస్థలో వున్న శాతవాహన వంశ ప్రతిష్టను ఇతడు ఉద్ధరించాడు. ఈయన పూర్వీకులు కోల్పోయిన అనేక ప్రాంతాలనే కాకుండా, అనేక రాజ్యాలను జయించాడు. రాజ్యంలో చక్కటి పాలనా వ్యవస్థను నెలకొల్పాడు. ప్రజానురంజకంగా పాలన చేశాడు. ఇతడు దృకాయుడు. స్పురద్రూపి. బ్రాహ్మణులను ఆదరించి వేదవిద్యలను ప్రోత్సహించాడు. గౌరవించాడు. ఇతడి పాలనాకాలంలో శాతవాహన సామ్రాజ్యం సమున్నత స్థితిలో వుండేది. తెలుగువారి కీర్తి దిగంతాలకు వ్యాపించింది. గౌతమీపుత్ర శాతకర్ణి క్రీస్తుశకం 125 వరకు పాలించాడు.

గౌతమీపుత్ర శాతకర్ణి అనంతరం వరుసగా రెండవ పులోమావి, మూడవ పులోమావి, శివస్కంద, యజ్ఞశ్రీ శాతకర్ణి, విజయ శాతకర్ణి, చంద్రశ్రీ, నాల్గవ పులోమావి క్రీస్తుశకం 219 వరకు రాజ్యపాలన చేశారు. చంద్రశ్రీతో శాతవాహన వంశపు ప్రధానశాఖ అంతరించి పోయింది. శాతవాహన వంశపు చివరి ప్రభువులు అంతఃకలహాలతో విడిపోయి వివిధ ప్రాంతాలలో చిన్న-చిన్న రాజ్యాలను స్థాపించుకొని పాలించారు.

శివమకసద శాతకర్ణి నాల్గవ పులోమావిని ఓడించి, తరిమికొట్టి, ధాన్యకటక రాజ్యాన్ని ఆక్రమించి, పాలించాడు. అయితే ఇతడు ఎక్కువకాలం పాలించలేక పోయాడు. మహాశక్తిమంతుడు, బలపరాక్రమోపేతుడు, ఇక్ష్వాకు వంశేయుడు అయిన శాంతమూల మహారాజు విజయపురిలో శాతవాహనుల సామంతరాజుగా వుంటూ, ధాన్యకటకం మీద దండెత్తి, శివమకసద శాతకర్ణిని ఓడించి, రాజ్యాన్ని ఆక్రమించి, విజయపురి రాజధానిగా క్రీస్తుశకం 225 లో ఇక్ష్వాకు రాజ్యాన్ని స్థాపించాడు. ఇంతటితో శాతవాహన రాజ్యం అంతరించి పోయింది.   

(స్వర్గీయ బిఎన్ శాస్త్రి గారి బ్రాహ్మణ రాజ్య సర్వస్వం ఆధారంగా)

 

                 

        

No comments:

Post a Comment