Monday, March 18, 2024

ఇక్ష్వాకు వంశం, ప్రాచీన పల్లవ వంశం (బ్రాహ్మణ రాజులు 4 & 5) : వనం జ్వాలా నరసింహారావు

 ఇక్ష్వాకు వంశం, ప్రాచీన పల్లవ వంశం (బ్రాహ్మణ రాజులు 4 & 5)

 వనం జ్వాలా నరసింహారావు

సూర్యదినపత్రిక (18-03-2024)  

           ఇక్ష్వాకు వంశం

శాతవాహన సామ్రాజ్యం అస్తమించిన తరువాత దక్షిణాపథాన చిన్న-చిన్న రాజ్యాలు స్థాపించబడ్డాయి. సామంతులు స్వాతంత్ర్యం ప్రకటించుకున్నారు. అలా చేసినవారిలో ఇక్ష్వాకులు కూడా వున్నారు. ఇక్ష్వాకు వంశీయులు విజయపురి రాజధానిగా సుమారు 75 సంవత్సరాలు ఆంధ్రదేశంలోని కొన్ని ప్రాంతాలను పాలించారు. వీరి పాలన క్రీస్తుశకం 225 నుండి క్రీస్తుశకం 300 వరకు సాగింది. గుంటూరు, నల్లగొండ, మహబూబ్ నగర్, కృష్ణా, పశ్చిమ గోదావరి, జగ్గయ్యపేట, మధిర, నేలకొండపల్లి ప్రాంతాలు ఇక్ష్వాకు వంశీయుల పాలనలో వుండేవి. ఈ వంశంలో శాంతమూల మహారాజు, వీరపురుష దత్తుడు, ఎహువుల శాంతమూలుడు, రుళు పురుష దత్తుడు ఒకరి తరువాత ఒకరు పాలించారు.

         శాతవాహన రాజులు అంతఃకలహాల్లో మునిగి వున్న కాలంలో ఇక్ష్వాకు వంశీయుడైన శాంతమూల మహారాజు విజయపురిలో స్వాతంత్ర్యం ప్రకటించి, సైన్యాన్ని సమకూర్చుకొని, ధాన్యకటకం మీద దండెత్తి, శివమకసద శాతకర్ణిని ఓడించి, రాజ్యాన్ని ఆక్రమించి, క్రీస్తు శకం 225 లో ఇక్ష్వాకు రాజ్యాన్ని స్థాపించాడు. రాజకీయ చతురుడు, మహాశూరుడైన శాంతమూల మహారాజు రాజ్యాన్ని విస్తరించాడు. తనకు వ్యతిరేకంగా ఉన్నవారిని ఓడించి అశ్వమేధ, రాజసూయ యాగాలను చేశాడు. అన్యరాజ వంశీయులతో వివాహ సంబంధాలు ఏర్పరుచుకున్నాడు. శాంతమూల మహారాజు పరమ వైదికుడు. వైదిక మతోద్దారకుడు.  కుమారస్వామి భక్తుడు. పరమత సహనం వున్నవాడు. మాఢరీ గోత్రంలో జన్మించిన విప్రకన్యను వివాహం చేసుకొన్న శాంతమూల మహారాజు బ్రాహ్మణ వంశ సంజాతుడు. శాంతమూల మహారాజు సుమారు 20 సంవత్సరాలు (క్రీస్తుశకం 225-245) ఇక్ష్వాకు రాజ్యాన్ని పాలించాడు. ఈతడి పాలనా కాలంలోనే విజయపురి మహానగరంగా రూపుదిద్దుకున్నది.

         శాంతమూల మహారాజు అనంతరం అతడి కుమారుడు వీరపురుష దత్తుడు ఇక్ష్వాకు రాజయ్యాడు. తండ్రిలాగానే అన్య రాజవంశీయులతో వివాహ సంబంధాలు ఏర్పరుచుకున్న కారణాన అది ఇక్ష్వాకు రాజ్య పటిష్టతకు దోహదకారి అయింది. ఉజ్జయినీ రాజకుమార్తె ఆయన పట్టపురాణి. ఇతడు మేనత్త శాంతిశ్రీ ప్రభావాన బౌద్ధమతాభిమానాన్ని కలిగినవాడు. ఇతడి పాలనాకాలంలో నాగార్జునకొండలోని బౌద్ధ ఆరామవిహారాలు, చైత్యాలయాలు, పారావత మహావిహారం, కొత్త అందాలను సంతరించుకున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా వున్న బౌద్ధ సన్యాసులు, ప్రచారకులు, గురువులు, మతాభిమానులు, వేల సంఖ్యలో నాగార్జునకొండ బౌద్ధ క్షేత్ర సందర్శనానికి వచ్చేవారు. తనపాలనా కాలంలో చోటుచేసుకున్న విప్లవాన్ని ద్విగ్విజయంగా అణచి వేశాడు వీరపురుష దత్తుడు. ఇతడు 20 సంవత్సరాలు పాలించాడు.

         వీరపురుష దత్తుడి అనంతరం ఆయన కుమారుడు ఎహువుల శాంతమూలుడు  ఇక్ష్వాకు రాజ్యాన్ని 25 సంవత్సరాలు పాలించాడు. ఇతడి కాలంలో వైదిక, బౌద్ధ మతాలూ ఆదరించబడ్డాయి. ఇతడి తరువాత ఆయన కుమారుడు రుళుపురుష దత్తుడు సింహాసనాన్ని అధిష్టించి 10 సంవత్సరాలు పాలించాడు. పల్లవ రాజులు ఇక్ష్వాకులకు బద్ధ విరోధులు. వారు సమయానుకూలంగా ఇక్ష్వాకు రాజ్యభూభాగాల మీద దండయాత్ర చేసేవారు. రుళుపురుష దత్తుడి కాలంలో ఒక పథకం ప్రకారం విజయపురి రాజ్య విధ్వంసానికి పూనుకున్నారు.

         పల్లవ సింహవర్మ ఇక్ష్వాకు రాజైన రుళుపురుష దత్తుడిని ఓడించి విజయపురిని ఆక్రమించాడు. అలా ఆక్రమించి పల్లవ రాజ్యాన్ని స్థాపించాడు. అంతటితో ఇక్ష్వాకు రాజ్యం అంతరించింది.    

ప్రాచీన పల్లవ వంశం

           శాతవాహన వంశీయుల అనంతరం దక్షిణాపథాన్ని పాలించిన రాజ వంశాలలో పల్లవ వంశం ప్రసిద్ధమైనది. వీరి రాజధాని కంచి. వీరు ఆంధ్ర దేశంలో కొన్ని భాగాలను ఆక్రమించి సుమారు 300 సంవత్సరాలు పాలించారు. మొత్తం మీద పల్లవ వంశీయుల పాలన ఏడు శతాబ్దాల పాటు కొనసాగింది. అందులో ప్రాచీన పల్లవుల పాలన మూడు శతాబ్దాలు, మహా పల్లవుల పాలన నాలుగు శతాబ్దాలు సాగింది. ఇక్ష్వాకు, విష్ణుకుండిన వంశీయుల చరిత్రలలో పల్లవ రాజన్యుల ప్రశంస వున్నది.

         పల్లవ వంశానికి మూల పురుషుడు సింహవర్మ. ఇక్ష్వాకు వంశంలో చివరి రాజైన రుళుపురుష దత్తుడికి సామంత రాజుగా వుండిన పల్లవ సింహవర్మ కర్మ రాష్ట్రాన్ని పాలిస్తూ వుండేవాడు. అతడు మహావీరుడు. ఇతడు సైన్యాన్ని సమకూర్చుకొని రుళుపురుష దత్తుడి మీద దండయాత్ర చేశాడు. విజయుడైన తరువాత రాజ్య విస్తరణకు పూనుకున్నాడు. విజయాలతో చెలరేగిన పల్లవ సింహవర్మ స్వతంత్రుడై క్రీస్తుశకం 300 లో పల్లవ రాజ్యాన్ని స్థాపించి కాంచీ నగరాన్ని రాజధానిగా చేసుకున్నాడు. పల్లవ సింహవర్మ అమరావతి, తొండై మండలాలను పాలించే సామంతుడైన నాగరాజ కన్యను వివాహం చేసుకోవడం వల్ల నాగారాజ్యం భార్య వారసత్వంగా వచ్చింది. ఇతడు మొత్తం 10 సంవత్సరాలు పాలన చేశాడు.

         పల్లవ సింహవర్మ తరువాత అతడి కొడుకు శివస్కందవర్మ పల్లవ సింహాసనాన్ని అధిష్టించాడు. అతడు కర్నాటక ప్రాంతాల మీద దండయాత్ర చేసి విజయుడయ్యాడు. అప్పటికి పల్లవ రాజ్యం కృష్ణా, తుంగభద్ర, కావేరీ పరీవాహ ప్రాంతాలకు విస్తరించి, మహా సామ్రాజ్యంగా రూపుదిద్దుకున్నది. తండ్రి స్థాపించిన రాజ్యాన్ని చక్కగా పాలిస్తూనే అనేక రాజ్యాలను జయిస్తూ శివస్కందవర్మ పల్లవ రాజ్య ప్రతిష్టను ఇనుమడింప చేశాడు. ఇతడి పాలనాకాలం క్రీస్తుశకం 310-335.

         శివస్కందవర్మ మరణించిన తరువాత అతడి సోదరుడు విష్ణుగోపవర్మ పల్లవ రాజుగా సుమారు 15 సంవత్సరాలు (క్రీస్తుశకం 335-350) పాలించాడు. ఇతడి పాలనా కాలంలో మగధ సామ్రాజ్యాదీశుడు, విజేత, గొప్ప శూరుడైన సముద్రగుప్తుడి దక్షిణాపథ దండయాత్రలు ఆరంభమయ్యాయి. ఆ దండయాత్రల వల్ల దక్షిణాపథంలోని రాజ్యాలు అల్లకల్లోలమైనాయి. పల్లవ రాజ్యంలోని సామంతులు తిరుగుబాటు చేసి స్వతంత్ర రాజ్యాలను స్థాపించారు. చోళ వంశీయులు, కందర రాజులు స్వతంత్రులయ్యారు. విష్ణుగోపవర్మ తన సోదరుడి కుమారుడు కుమార విష్ణువుకు రాజ్యాన్ని అప్పగించి దివంగతుడయ్యాడు.

              సమర్ధ పాలకుడైన కుమార విష్ణువు పల్లవ రాజ్యాన్ని అధిష్టించిన తరువాత సామంత రాజుల తిరుగుబాటును అణచివేశాడు. ఇతడి పాలనా కాలం 20 (క్రీస్తుశకం 350-370) సంవత్సరాలు. ఆ తరువాత కుమార విష్ణువు కుమారుడు (రెండవ) స్కందవర్మ 15 సంవత్సరాలు క్రీస్తుశకం 385 వరకు పాలించాడు. స్కందవర్మ కుమారుడు వీరవర్మ క్రీస్తుశకం 400 వరకు సుమారు 15 సంవత్సరాలు పాలించాడు.

         వీరవర్మ తరువాత అతడి కుమారుడు విజయస్కందవర్మ రాజ్యపాలనాదికారం వహించాడు. ఇతడు అసహాయ శూరుడు. విజేత. సుమారు 36 (క్రీస్తుశకం 400-436) సంవత్సరాలు పాలించాడు. కందర రాజులను ఓడించి కర్మ రాష్ట్రంలో పల్లవుల ఆధిపత్యాన్ని నెలకొల్పాడు.

         విజయస్కందవర్మ కుమారుడు సింహవర్మ పల్లవ రాజులలో ప్రముఖుడు. ఇతడు సుదీర్ఘ కాలం (క్రీస్తు శకం 436-480) సుమారు 44 సంవత్సరాలు రాజ్యాన్ని పాలించాడు. విజేత అయిన సింహవర్మ ఉత్తర, దక్షిణ, పశ్చిమ దిగ్విజయ యాత్రలు చేశాడు. కర్మ రాష్ట్రాన్ని జయించాడు. బాణ రాజులను ఓడించాడు. కర్నాటక ప్రాంతాన్ని పల్లవ రాజ్యంలో చేర్చాడు. దక్షిణ భారత దేశంలో అజేయుడుగా పేరొందాడు. సింహవర్మ అనంతరం అతడి కుమారుడు నాల్గవ స్కందవర్మ సింహాసనాన్ని అధిష్టించి 10 సంవత్సరాలు (క్రీస్తుశకం 480-490) మాత్రమే పాలించాడు.

         నాల్గవ స్కందవర్మ కుమారుడు నందివర్మ 10 సంవత్సరాలు (క్రీస్తుశకం 490-500) పాలించాడు. ఇతడి కాలంలో కదంబ వంశీయులు బలపడి పల్లవ రాజ్య భూభాగాలను ఆక్రమించుకున్నారు. కాంచీపురం కూడా కదంబ వంశీయుల వశమైంది. పల్లవ రాజ్యం క్షీణించ సాగింది. నందివర్మ సోదరుడు రెండవ కుమార విష్ణువు క్రీస్తుశకం 500 లో పల్లవ రాజ్య పీఠాన్ని అలంకరించి 20 సంవత్సరాలు పాలించాడు. సమర్థుడని పేరు తెచ్చుకున్నాడు. కదంబుల మీద దండయాత్రలు చేసి కాంచీపురాన్నుండి వారిని తరిమిగొట్టి ఆక్రమించి పూర్వ ప్రతిష్టను నెలకొల్పాడు.

         రెండవ కుమార విష్ణువు కుమారుడు బుద్ధవర్మ మహా బలపరాక్రమశాలి. ఇతడు క్రీస్తుశకం 530 వరకు 10 సంవత్సరాలు పాలించాడు. బుద్ధవర్మ తరువాత అతడి కుమారుడు మూడవ కుమార విష్ణువు రాజ్యానికి వచ్చి క్రీస్తుశకం 550 వరకు సుమారు 20 సంవత్సరాలు పాలించాడు. ఇతడు సమర్ధుడు కాదు. కదంబులు, రేనాటి చోళులు పల్లవ భూభాగాలను ఇతడి కాలంలో ఆక్రమించుకున్నారు. కుమార విష్ణువుతో కాంచీపుర పల్లవ రాజ్యం అమరించి పోయింది. రెండవ సింహవర్మ ఆంధ్రదేశ భూభాగాలను జయించాడు. ఇతడి సంతతివారు కాంచీపుర పల్లవ సార్వభౌములకు విధేయులుగా ఆంధ్ర ప్రాంతాన్ని స్వతంత్ర ప్రతిపత్తిగల రాజ్యంగా పాలించేవారు. సింహవర్మ తరువాత అతడి కుమారుడు విష్ణుగోపుడు ప్రభువయ్యాడు. ఇతడి పాలన నెల్లూరు, చిత్తూరు మండలాలకే పరిమితమై పోయింది.

ఇతడి తరువాత నాల్గవ సింహవర్మ క్రీస్తుశకం 550 లో రాజయ్యాడు. ఇతడు గొప్ప వీరుడు. పరాక్రమవంతుడు. కాంచీపురాన్ని ఆక్రమించి దానిని రాజధానిగా చేసుకుని పూర్వ పల్లవ రాజ్యవైభవాన్ని పునరుద్ధరించాడు. కాంచీపురాన్ని ఆక్రమించిన తరువాత ఆంధ్ర భూభాగాలను జయించాలనుకుని, కర్మరాష్ట్రం మీద దండెత్తిన నాల్గవ సింహవర్మకు పరాజయం ఎదురైంది. ఆ విధంగా ఆంధ్ర దేశంలో పల్లవ పాలనకు స్వస్తి వాక్యం పలకడం జరిగింది. సింహవర్మ క్రీస్తుశకం 570 వరకు 20 సంవత్సరాలు పాలించాడు.

నాల్గవ సింహవర్మ అనంతరం అతడి కుమారుడు సింహ విష్ణువు రాజ్యానికి వచ్చాడు. కాంచీపురం రాజధానిగా 30 సంవత్సరాలు క్రీస్తుశకం 600 వరకు పాలించాడు. సింహవిష్ణువు తదనంతరం అతడి కుమారుడు మహేంద్రవర్మ రాజయ్యాడు. ఇతడి పాలనా కాలంలో ఆంధ్ర దేశంలో మిగిలి వున్న పల్లవ రాజ్య భూభాగాలన్నీ బాదామీ చాళుక్యుల వశమయ్యాయి. బాదామీ చాళుక్య రాజైన రెండవ పులకేశి విజృంభించి క్రీస్తుశకం 617 లో కర్మ రాష్ట్రాన్ని జయించాడు. పల్లవ అధికారం ఆంధ్ర దేశంలో అంతరించింది.

రెండవ పులకేశి కాంచీ నగరం వరకు చొచ్చుకుపోయి మహేంద్రవర్మను ఎదుర్కొని యుద్ధం చేసి విజయుడయ్యాడు. మహేంద్రవర్మ పరాజితుడై దక్షిణ ప్రాంతాలను క్రీస్తుశకం 630 వరకు పాలించాడు, మహేంద్రవర్మ తరువాత పల్లవ రాజ్యాన్ని ఏలిన రాజులకు ఆంధ్ర దేశంతో సంబంధం తెగిపోయింది. పల్లవుల రాజ్యం మొత్తం 7 శతాబ్దాలు కొనసాగింది. చాళుక్యులు ఆంధ్ర దేశాన్ని ఆక్రమించుకునే వరకు పల్లవులు ఆంధ్రదేశాన కృష్ణా నది దక్షిణ ప్రాంతాలను ఆక్రమించి పాలించగలిగారు.     

(స్వర్గీయ బిఎన్ శాస్త్రి గారి బ్రాహ్మణ రాజ్య సర్వస్వం ఆధారంగా)

   

 

        

 

No comments:

Post a Comment