బృహత్పలాయన, శాలంకాయన, ఆనందగోత్రిక వంశాలు
(బ్రాహ్మణ
రాజులు 6, 7 & 8)
వనం
జ్వాలా నరసింహారావు
సూర్యదినపత్రిక
(25-03-2024)
బృహత్పలాయన వంశం
ఇక్ష్వాకుల అనంతరం ఆంధ్ర దేశంలోని కొన్ని ప్రాంతాలను పాలించినవారు
బృహత్పలాయన వంశీయులు. మూడవ శతాబ్ది ఉత్తరార్థంలో కృష్ణా నదికి ఉత్తరాన వున్న భాగాలను
ఈ వంశీయులు తమ అధీనంలోకి తెచ్చుకున్నారు. జయవర్మ మహారాజు ఇక్ష్వాకుల సామంతుడు.
ఇక్ష్వాకుల అనంతరం ఆంధ్ర దేశ భూభాగాలను ఆక్రమించిన పల్లవ రాజులను యుద్ధంలో ఓడించి, ఆంధ్ర దేశం నుండి తరిమి వేసి, జయవర్మ మహారాజు బృహత్పలాయన వంశాన్ని స్థాపించి
సుమారు 15 సంవత్సరాలు ఆంధ్ర దేశాన్ని పాలించాడు. ఆయన ఆ తరువాత ఆ వంశం వారు
ఇంకెవరైనా పాలించారో లేదో ఆధారాలు లేవు. అతడితోనే బృహత్పలాయన వంశం అంతరించిందనాలి.
జయవర్మ మహారాజు పల్లవ రాజులతో యుద్ధం చేసి, రాజ్యంలో శాంతి భద్రతలను నెలకొల్పి, చక్కటి పరిపాలన చేశాడు. జయవర్మ మహారాజు
నిరంకుశుడు. కాకపొతే ప్రజాభీష్టాన్ని అనుసరించి,
మంత్రుల సలహాలను పాటించి పరిపాలన చేశాడు. ఇతడి పాలనలో వేదం విదులైన విప్రులు
గౌరవాదరాలు పొందారు. జయవర్మ మహారాజు స్వతంత్రుడు కావడానికి ముందర శాతవాహనులకు, తరువాత ఇక్ష్వాకులకు సామంతుడిగా వుంది, కృష్ణా నదీ దక్షిణ భాగాన్ని పాలించాడు. ఈ
వంశీయులు బ్రాహ్మణులు. పల్లవులతో జరిగిన ఒకానొక యుద్ధంలో జయవర్మ మరణించి ఉండవచ్చని
చరిత్ర చెప్తున్నది.
బృహత్పలాయనులు కృష్ణానదీ ముఖద్వారం దాకా
తమ రాజ్యాన్ని విస్తరింప చేసి కూదూరును రాజధానిగా చేసుకొని ఆంధ్ర దేశాన్ని
పాలించారు. కంటక శైలం, కోడూరు, అల్లోసైని మొదలైన పట్టణాలు బృహత్పలాయన రాజ్యంలో
వుండేవి. బృహత్పలాయనుల కాలంలో ఆంధ్ర దేశంలో బౌద్ధ మతం రాజాదరణ లేక విదేశాలలో
వ్యాపించింది. బృహత్పలాయన జయవర్మ పాలించిన కాలంలో ప్రజలు ప్రశాంతమైన జీవనం
గడిపారు. ఆనాడు శైవ మతం ఆదరించబడి పోషించబడింది. బౌద్ధ, జైన మతాలు క్షీణించాయి. ఇక్ష్వాకు వంశ పతనానంతరం
ఆంధ్ర దేశం పల్లవుల బారిన పడకుండా ఆంధ్ర ప్రజలను ఆదుకున్నది బృహత్పలయానుల వంశం.
శాలంకాయన వంశం
ఆంధ్రదేశాన్ని
శాతవాహనుల అనంతరం పాలించిన రాజ వంశాలలో శాలంకాయన వంశం పేర్కొనదగినది. ఈ వంశీయులు
గోత్ర నామాన్నే వంశ నామంగా ధరించారు. శాలంకాయనుడు వేదర్షి. విశ్వామిత్ర సంతతి
వాడు. ఈ వంశీయుల నామాంత్యంలో వర్మ పదం వుండడం వల్ల వీరు బృహత్పలాయన, ఆనంద గోత్రిక, కదంబ, విష్ణుకుండిన, పల్లవ
రాజన్యుల లాగా బ్రాహ్మణులు. శాలంకాయనులు ప్రాచీనాంధ్ర గణాలలోని వారు. శాలంకాయన
అంటే నంది అని అర్థం. వీరిది వృషభ లాంఛనం. శాలంకాయన రాజులు వరుసగా, విజయదేవ వర్మ, హస్తి
వర్మ, నంది వర్మ, చండ వర్మ, విజయనంది వర్మ, విజయస్కంద వర్మలు. శాలంకాయనులు క్రీస్తుశకం 300
నుండి 440 వరకు పాలించారు.
ఆంధ్రదేశ ప్రాక్తీర ప్రాంతాన్ని
ఆక్రమించి వేంగీ నగరం రాజధానిగా శాలంకాయన వంశీయులు పాలించారు. వీరు శాతవాహనుల
సామంతులు. వీరు కృష్ణా నదీ పరీవాహక ప్రాంత పాలకులుగా నియమించబడి, శాతవాహనుల తరువాత ఇక్ష్వాకుల సామంతులై, స్వతంత్రులై, బృహత్పలాయన
జయవర్మ మరణానంతరం రాజ్యాన్ని విస్తృతపరచుకున్నారు.
శాలంకాయన రాజ్య స్థాపకుడు విజయదేవ వర్మ.
ఇతడు క్రీస్తుశకం 300 నుండి క్రీస్తుశకం 335 వరకు శాలంకాయన రాజ్యాన్ని పాలించాడు.
ఇతడు ఇక్ష్వాకుల రాజ్య పతనానంతరం పల్లవులను ఎదిరించి, బృహత్పలాయన జయవర్మ మరణానంతరం వేంగిని ఆక్రమించి, స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించాడు. ఆంధ్రదేశం
పల్లవాక్రాంతం కాకుండా తెలుగువారి స్వాతంత్ర్య పరిరక్షణ కొరకు ఇతడు శాలంకాయన
వంశాన్ని స్థాపించాడు. ఇతడు అసహాయశూరుడు. అపరిమిత బలపరాక్రమ సంపన్నుడు.
విజయదేవ వర్మ తరువాత హస్తి వర్మ
సింహాసనాన్ని అధిష్టించి సుమారు 15 సంవత్సరాలు (క్రీస్తుశకం 335-350) శాలంకాయన
రాజ్యాన్ని పాలించాడు. ఇతడు వేంగి చుట్టుపక్కల వున్న అనేక సామంత రాజ్యాలను గెలిచి
శాలంకాయన రాజ్యాన్ని విస్తరించాడు. హస్తి వర్మ అనంతరం ఆయన కుమారుడు నందివర్మ రాజై
సుమారు 30 సంవత్సరాలు (క్రీస్తుశకం 350-380) పాలించాడు. ఇతడు పరాక్రమవంతుడు.
సముద్రగుప్తుడి దండయాత్ర నేపధ్యంలో సామంతుల తిరుగుబాటును అణచి, కృష్ణా నదికి దక్షిణాన వున్న భూభాగాలను
ఆక్రమించి, రాజ్య విస్తరణ
చేశాడు. ఇతడు ధర్మ చింతన కలవాడు.
నందివర్మ సోదరుడు దేవవర్మ ఆ తరువాత రాజ్య
పీఠాన్ని అలంకరించాడు. సుమారు 15 సంవత్సరాలు (క్రీస్తుశకం 380-395) పాలించాడు.
ఇతడు అనేక యుద్ధాలలో విజయం సాధించి అశ్వమేధ యాగం చేశాడు. ఇతడి పాలనాకాలంలో
అన్నగారి కుమారుడు, యువరాజుగా వున్న అచండ
వర్మతో యుద్ధాలు చేయాల్సి వచ్చింది. ఈ జ్ఞాతుల పోరాటాన్ని చూసి సామంతులు
స్వతంత్రులయ్యే ప్రయత్నం చేశారు. ఈ పరిస్థితులలో పినతండ్రి మీద యుద్ధం చేసి
అచండవర్మ విజయం సాధించి రాజ్య పీఠాన్ని ఆక్రమించాడు. అచండవర్మ పాలన కొద్ది కాలం
(క్రీస్తుశకం 395-398) మాత్రమే కొనసాగింది. అచండవర్మ సోదరుడు రెండవ హస్తివర్మ జాజ్
పుర ప్రాంతంలో రాజ ప్రతినిధిగా వుండి స్వాతంత్ర్యాన్ని ప్రకటించి శాలంకాయన
భూభాగాలను ఆక్రమించి పాలించసాగాడు. హస్తివర్మ పాలనా కాలం క్రీస్తుశకం 395-405.
హస్తివర్మ కాలంలోనే అచండవర్మ రెండవ
కుమారుడు విజయనంది వర్మ పినతండ్రితో కలహిస్తూ, రాజ్యాన్ని
ఆక్రమించుకునే ప్రయత్నాలు చేశాడు. ఫలితంగా శాలంకాయన రాజ్యం రెండుగా చీలింది.
విజయనంది వర్మ వేంగి ప్రాంతాన్ని ఏలుతుండగా విజయస్కంద వర్మ తూర్పు తీర ప్రాంతాన్ని
ఆక్రమించి జాజ పురం రాజధానిగా పాలించ సాగాడు. నందివర్మ విజయస్కంద వర్మతో చేసిన
యుద్ధాలలో తాత్కాలిక విజయాలను సాధించినప్పటికీ, అన్య రాజ
వంశీయులను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆ రాజన్యులు శాలంకాయన రాజ్య భాగాలను
ఆక్రమించారు. విజయనంది వర్మ పరమ భాగవతోత్తముడు. ఇతడి పాలనా కాలం క్రీస్తుశకం
405-415.
రెండవ హస్తివర్మ కొడుకైన విజయస్కంద వర్మ
తండ్రి అనంతరం రాజ్యాన్ని సాధించడానికి రెండవ విజయనంది వర్మను ఎదుర్కోవాల్సి
వచ్చింది. విజయస్కంద వర్మ విష్ణుకుండినుల సామంతుడిగా కొంతకాలం పాలించాడు.
విష్ణుకుండినులు సర్వాంధ్ర భూభాగాలనే కాకుండా యావత్ దక్షిణా పథాన్ని, దక్షిణ
భారతాన్ని తమ ఏలుబడిలోకి తెచ్చుకోవాలనుకుని శాలంకాయన వంశాన్ని అంతరింప చేశారు.
విజయస్కంద వర్మ పాలనాకాలం క్రీస్తుశకం 415-440. ఇంతటితో శాలంకాయన వంశం
అంతరించింది.
ఆనందగోత్రిక వంశం
బృహత్పలాయన
జయవర్మ అనంతరం పల్లవులు ఆంధ్రదేశంలోని కొన్ని ప్రాంతాలను ఆక్రమించారు. కృష్ణానదికి
దక్షిణాన వున్న చేజెర్లను లేదా కపోత కందరపురం రాజధానిగా చేసుకొని తీరాంధ్రాన్ని, కృష్ణా, గుంటూరు
మండలాలను ఆనందగోత్రికులు ఆక్రమించి పాలించారు. వీరు గోత్ర నామాన్ని వంశ నామంగా
ధరించారు. ఆనంద మహర్షి వంశానికి చంద్రుని లాంటి వాడు కందర రాజు. స్వశక్తితో
రాజ్యాన్ని స్థాపించి పల్లవ రాజులకు సామంతుడిగా ఆంధ్ర భూభాగాలను పాలించాడు.
ధాన్యకటక యుద్ధంలో ఇతడు శత్రువులను, ముఖ్యంగా శాలంకాయన నందివర్మను ఓడించి దాన్ని
ఆక్రమించుకున్నాడు. ఇతడి రాజ్యం త్రికూట పర్వతం నుండి కృష్ణానది వరకు
వ్యాపించినది. ఇతడి రాజధాని దాన్యవాటి అని అంటారు. తరువాత ఇతడు తన పేరుమీద కందరపుర
నిర్మాణం చేశాడు. ఆ తరువాత ఇతడి వారసులకు అదే రాజధాని అయింది. పల్లవ శివస్కంద వర్మ
ఇతడిని ఓడించి సామంతుడిగా చేసుకున్నాడు. ఇతడు 35 సంవత్సరాలు (క్రీస్తుశకం 290-325)
పాలించాడు.
కందర
రాజు తరువాత అత్తివర్మ రాజయ్యాడు. ఇతడు యమ నియమవంతుడు. ఆపస్తంబ సూత్రుడు.
ఋగ్యజుస్సామ వేదవిదుడు. ఈ మహారాజు శైవుడు, వైదిక మతోద్దారకుడు. ఇతడి కాలంలో బౌద్ధం
క్షీణించినది. అత్తివర్మ శక్తియుతుడు. అనేక రాజుల స్వాతంత్ర్యాన్ని హరించినవాడు.
విజేత. పల్లవ, శాలంకాయన
రాజన్యులు ఆక్రమించిన రాజ్య భాగాలను అత్తివర్మ తిరిగి సాధించాడు. అత్తివర్మ
పాలనాకాలం 45 సంవత్సరాలు (క్రీస్తుశకం 335-380).
అత్తివర్మ తరువాత అతడి తనయుడు దామోదర వర్మ పాలనా పగ్గాలను చేపట్టాడు.
ఇతడు ఆంధ్రదేశ భూభాగాలను పాలించినప్పటికీ, పల్లవ, శాలంకాయన, విష్ణుకుండిన
వంశీయులతో యుద్ధాలు చేయాల్సి వచ్చింది. విష్ణుకుండినులతో జరిగిన యుద్ధంలో ఓటమి
పాలై,
ఆనందగోత్రికులు త్రికూట మలయాన్ని కోల్పోవాల్సి వచ్చింది.
దామోదర వర్మ అనంతరం రాజ్యానికి వచ్చిన ఆనందగోత్రికులు అతి బలహీనులు
కావడం వల్ల విష్ణుకుండినులు విజృంభించి
వారి రాజ్యాన్ని జయించి తమ సామంతులుగా చేసుకున్నారు. దామోదర వర్మ పాలనా కాలం 45
సంవత్సరాలు (క్రీస్తుశకం 380-425).
ఆనంద గోత్రికుల
పాలనాకాలంలో ఆంధ్రదేశంలో కరువుకాటకాలు లేవు. దేశం సుభిక్షంగా వున్నది. ఆనంద
గోత్రికులు శిల్ప కళను పోషించి అభివృద్ధి చేశారు.
(స్వర్గీయ
బిఎన్ శాస్త్రి గారి బ్రాహ్మణ రాజ్య సర్వస్వం ఆధారంగా)
No comments:
Post a Comment