సదాచార జీవన ప్రవాహిణి
గుదిమెళ్ళ మురళీకృష్ణమాచార్యులు
ఆస్థాన
పురోహితులు, భద్రాచలం శ్రీ
సీతా రామచంద్ర స్వామి ఆలయం
ఆంధ్రప్రభ
(01-04-2024)
శ్రీ రామాయనమః
శ్రీమతే రామానుజాయ నమః
సనాతనం-సదాయతనం
అపౌరుషేయమైన
వేదమే అఖిల ధర్మాలకు మూలం. సనాతన ధర్మానికి అదే ఆలవాలం. ఆ వేదోక్త ధార్మిక కర్మ
విశేషాల జీవన విధానమే సనాతన ధర్మం. ‘సనాతనమేనమాహుః ఉతాద్యస్యాత్ పునర్ణవః’
అన్నారు. ఇది సనాతనమైనది అయినా ఇప్పటికీ నిత్యనూతనమైనదే అని అథర్వ వేదం చెపుతోంది.
సనాతనధర్మానికికల వైలక్షణ్యమిది. కాలం చెల్లిన ధర్మం కాకుండా సదాతనమై, సదాయతనమై, ఆచరించబడే
కర్మవిశేషమే సనాతన ధర్మం.
‘సర్వకాలే
సనాప్రోక్తా విద్యమానే తనో భిదా! ..... సర్వత్ర సర్వకాలేషు విద్యమాన స్సనాతనః’
సర్వకాలములందు అనుష్ఠానయోగ్యమైన శ్రుత్యుక్త
ధర్మమే సనాతన ధర్మం..అని నిఘంటుకారులనిర్వచనం.అందుకే ఇది సజీవవాహిని. సదాచార జీవన
ప్రవాహిణి.
సత్య, ధర్మాలు
రెండూ ఈ వైదిక సంస్కృతికి జీవనాడులు. సత్యం వచనీయం, ధర్మం ఆచరణీయం. సత్యం వద, ధర్మం
చర అనే తైత్తిరీయోపనిషత్ తాత్పర్యమిదే. సత్యం అనేది సదైకరూపం. మార్పులేనిది, మార్చరానిది.
ధర్మం అనేది ప్రత్యేక పరిణామశీలం. వివిధమైనది,
విలక్షణమైనది. దేశాన్నిబట్టి, కాలాన్ని
బట్టి, పాత్రతను బట్టి, శ్రుత్యనుగుణముగా, స్మృత్యనుసారముగా
విభిన్నమైనది.
‘దేశకాల పాత్రతా మనుసృత్య యో విధీయతే స
ధర్మః’ అనే ధర్మ నిర్వచనానికి తాత్పర్యమిదే. వర్ణధర్మాలు, ఆశ్రమధర్మాలు, వ్యక్తిధర్మాలు, విశేషధర్మాలు, అనే
నాలుగు విధాల నానారూపాత్మకం, ఈ ధర్మం. ఈ ధర్మాలన్నీ సదాయతనాలు. సత్ పదార్దమే
ఉనికిగా కల్గినవి. సత్ అనగా వేదోక్త దైవం. శ్రీ భగవద్ రామానుజులు కీర్తించినట్లు
వివిధ విచిత్రానన్తా శ్చర్య మయమైన ఈ జగత్తునకు కారణభూతుడైన భగవంతుడికే సత్ అని
పేరు. సదాత్మకమై, తదుపాసనాత్మకమైన పావన జీవన సంవిధానమే ఈ సనాతన
ధర్మం. అందుకే ఇది సనాతనము--సదాయతనమూ.
ఆయతనమనగా దేవస్థానం-వేదస్థానం-యజ్ఞస్థానము
అని నిఘంటువులు నిర్వచించాయి. ఈ మూడింటి వైభవాన్ని, ప్రాభవాన్ని సులభతమమైన శైలిలో
అందిస్తున్న చక్కని కోశమిది. వేదం నుంచి ప్రబంధం దాకా అనే దృక్కోణంతో సనాతనధర్మం
లోని వివిధాంశాలను కరబదరసమానం చేసిన చక్కని కోశమిది. కొండవంటి ఈ సంస్కృతియొక్క
ఔన్నత్యాన్ని అద్దంలో చూపించినంత అందంగా దిగ్దర్శనం చేయించే సంగ్రహస్వరూపమిది.
సనాతన సంస్కృతికి చెందిన ప్రతి హిందువు తప్పకుండా చదువతగిన గ్రంథము. జిజ్ఞాసువులకు
కూడా సముచితమైన విధంగా తగు సమాచారాన్ని అందిస్తుందనడంలో ఏవిధమైన అతిశయోక్తి
లేదు.
శ్రీమాన్ వనం
జ్వాలా నరసింహారావు గారు చక్కని శ్రీ సంప్రదాయ కుటుంబానికి చెందిన వారు. విద్యావేత్తలు. ప్రభుత్వాధినేతలకు కూడా
మార్గదర్శనం చేయగల మేధావులు. పరిణతి పొందిన పాత్రికేయ పితామహులు. ప్రసిద్ధిని
పొందిన రచయితలు. ముఖ్యంగా ఆధ్యాత్మిక సౌరభాలను ఆస్వాదించగల ఆత్మగుణసంపన్నులు.
అలాంటి నిండైన
వారినుండి వెలువడిన వెలకట్టలేని విలువలమూట....సజీవవాహిని-సనాతనధర్మం అనే ఈ
గ్రంధము. ఇది ప్రతిఒక్కరు తప్పక చదువవలసిన కోశముగా నేను సంభావించుచున్నాను.
భద్రాచల
దివ్యక్షేత్రముతో తరతరాల భక్తి భాంధవ్యముకల శ్రీ వనంవారికి మా భద్రాచల
సీతారామచంద్ర మహాప్రభువు ఇతో2ధికముగా శక్తియుక్తులను, భక్తి
ప్రపత్తులను ప్రసాదించుగాక! అని ప్రార్ధిస్తున్నాను.
{{‘భారతీయ, హైందవ,
వైదిక సంస్కృతి’
సజీవ
వాహిని సనాతన ధర్మం (వేదం నుండి ప్రబంధం దాకా)
వనం
జ్వాలానరసింహారావు పుస్తక (ప్రచురణలో వున్న) సమీక్ష
{మహా, మహా పండితులు శ్రీమాన్ గుదిమెళ్ళ మురళీకృష్ణమాచార్యులు గారు, ద్వివేది
(కృష్ణ యజుర్వేదం, అథర్వవేదం), ఉభయ వేదాంతవిద్వాన్ (శ్రీభాష్యమ్, భగవద్విషయం), ఆమ్నాయవిద్వన్మణి (తిరుమల తిరుపతి దేవస్థానం వారిచే), వేదాచార్య, వేదజ్యోతి, శ్రీ పాంచరాత్రాగమకోవిద, ఇత్యాదయః} ..... (98485
27268)}}
No comments:
Post a Comment