Monday, June 3, 2024

“వరుణాద్వీపవతీ తటాంచలమునన్, వప్రస్థలీ చుంబితాం...” ...... మనుచరిత్ర కథ-1 : వనం జ్వాలా నరసింహారావు

 “వరుణాద్వీపవతీ తటాంచలమునన్, వప్రస్థలీ చుంబితాం...”

మనుచరిత్ర కథ-1

వనం జ్వాలా నరసింహారావు

సూర్యదినపత్రిక (-3-06-2024)

ఆర్యావర్త దేశంలో, వరణానది ఒడ్డున, (వరుణాద్వీపవతీ తటాంచలమునన్, వప్రస్థలీ చుంబితాం....) అరుణాస్పదం అనే అద్భుతమైన పురం వున్నది. అక్కడ పుట్టిన చిగురు కొమ్మ కూడా చేవ (గట్టిదనం) కలదిగా వుంటుంది. అక్కడి బ్రాహ్మణులు సమస్త విద్యలు నేర్చినవారు. అక్కడి క్షత్రియులు సామర్థ్యం కలవారు. వైశ్యులు కుబేరుడికి కూడా పెట్టుబడి పెట్టగల ధనవంతులు. శూద్రులు పంటలు పండించి, భాగ్యం గడించి, సత్పాత్రదానం చేయడంలో సుప్రసిద్ధులు. వెలయాండ్రు రంభాదులైన అప్సరసలను కూడా అందంలో ఎదుర్కొనే సమర్థులు.

ఆ పురంలో మన్మథుడిలాంటి సౌందర్యం కలవాడు, బ్రాహ్మణ కులానికే అలంకారప్రాయం లాంటివాడు, వేదాధ్యయనంలో ఆసక్తి వున్నవాడు, ప్రవరాఖ్యుడు అనే పేరున్నవాడు నివసిస్తున్నాడు. ఆయన తల్లితండ్రులు పార్వతీపరమేశ్వరుల లాగా ఈడూ-జోడుగా, మిక్కిలి వృద్ధాప్యంలో వున్నారు. ప్రవరాఖ్యుడు చిన్నతనం నుండే యజ్ఞయాగాదులు చేస్తూ, మిక్కిలి ధనవంతుడిగా వుంటూ, తల్లితండ్రుల సేవ చేస్తూ, తన ప్రియభార్య సోమిదమ్మను సుఖపెట్టుతూ సౌఖ్యంగా కాపురం చేస్తుండేవాడు. ప్రవరుడి యోగ్యతను చూసి రాజులు నానారకాలైన దానాలను ఇవ్వడానికి ఆసక్తి కనపర్చినప్పటికీ ఆయన సాలగ్రామ దానం కూడా తీసుకొనేవాడు కాదు. ఆయనకున్న మాన్యపు భూములే మంచిగా పండడం వల్ల అతడి ఇంట్లో పాడి పంటలకు కొరత లేకుండా వుండేది. ప్రవరుడి భార్య సోమిదమ్మ అతిథులకు పెట్టి పోయడంలో అన్నపూర్ణాదేవికి సమానురాలు. అర్థరాత్రి అతిథులు వచ్చినప్పటికీ వారికి ఇష్టమైన పదార్థాలను వండి పెట్టేది.

ప్రవరాఖ్యుడికి వున్న కోరికలలో ఒకటి పుణ్యక్షేత్రాలను సందర్శించడం. ఎలాగైనా అసాధ్యమైన క్షేత్ర సందర్శనం చేసుకొని కృతార్థుడిని కావాలని అనుకునేవాడు. ఇలా వుండగా ఒకనాడు మధ్యాహ్న సమయంలో కమండలం చేతబట్టుకొని, జింకతోలు కప్పుకొని, విభూతి పెట్టుకొని ఒక సిద్ధ పురుషుడు ప్రవరుడి ఇంటికి వచ్చాడు. ఆ సిద్ధుడికి నమస్కారం చేసి అర్ఘ్యం, పాద్యం మొదలైనవాటితో పూజ చేసాడు ప్రవరుడు. అతడికి ఇష్టమైన మృష్టాన్నము పెట్టి సంతోషపరిచాడు. ఆ తరువాత “మీరు ఎందుండి ఎందు పోవుచు ఇందుల కేతెంచినారు” అని ప్రశ్నించాడు ప్రవరుడు ఆ సిద్దుడిని. ఆయన తన ఇంటికి రావడం వల్ల తన జీవితం సార్థకం అయిందని, ఆయన పాద ధూళి సోకినందున సంసార బంధం వీడిపోయిందని అన్నాడు. జవాబుగా సిద్ధుడు, ప్రవరుడి లాంటి గృహస్థులు సుఖంగా వున్నప్పుడే తనలాంటి వారు తీర్థయాత్రలు చేయగలరని అన్నాడు. తనలాంటి వారికే కాకుండా దిక్కుమాలినవారికి అందరికీ రక్షకుడు గృహస్థుడే అనీ, గృహస్థాశ్రమాన్ని మించిన ఆశ్రమం లేదని కూడా చెప్పాడు.

సిద్ధుడు తిరిగిన పుణ్యక్షేత్రాల వివరాలను అడిగాడు ప్రవరుడు. ఆయన వున్న దేశాలను, ఆడిన తీర్థాలను, చూసిన కొండలను, చొచ్చిన దీవులను, విహరించిన పుణ్యారణ్యములను, సముద్రాలను, వాటిలోని వింతలను విశదంగా చెప్పమని కోరాడు ప్రవరుడు సిద్దుడిని. తాను నాలుగు దిక్కులనూ చుట్టి వచ్చానని, ప్రపంచంలోని వింతలన్నీ దర్శించానని జవాబిచ్చాడు సిద్ధుడు. “కేదారేశు భజించితిన్, శిరమునన్ గీలించితిన్...” అని వివరించాడు. ఆయన మాటలకు ఆశ్చర్యపోయిన ప్రవరుడు అన్ని ప్రదేశాలు రెక్కలు కట్టుకొని పోయినా తిరగడం కష్టం కదా! ఎన్నో సంవత్సరాలు పట్తాయి కదా! ఆయన ఎలా పోగలిగాడని అడిగాడు. సిద్ధుడి మహాత్మ్యాన్ని పొగిడాడు. తాము సిద్దులం కాబట్టి ముసలితనం తమకు రాదని, దైవానుగ్రహం వల్ల తనకు ‘పాదలేపం అనే ఒక దివ్యఔషధం లభ్యమయిందని, దాని సామర్థ్యం వల్ల వాయువేగంతో, మనోవేగాన్ని మించిన వేగంతో తాను తిరుగుతున్నానని చెప్పాడు. ఆకాశాన సూర్యాశ్వాలు ఎంత వేగంగా, సునాయాసంగా తిరుగుతాయో, తామూ అంతే వేగంగా భూమ్మీద చకచకా నడకతో తిరగగలమని అన్నాడు.

సిద్ధుడి మహాత్మ్యాన్ని గురించి వివరంగా విన్న ప్రవరుడు ఆయన శిష్యుడినైన తనను కరుణించి, తీర్థయాత్రలు చేయించమని ప్రార్థించాడు. అలా చేసి తనను కృతార్థుడిని చేయమని కోరాడు. వెంటనే సిద్ధుడు తన దగ్గరున్న బుట్టలో నుండి ఒక పచ్చటి ద్రవాన్ని (పసరు) తీసుకొని ప్రవరుడి పాదాలకు పూసాడు. ప్రవరుడు పరమ రహస్యమైన ఆ పసరు పేరు అడగలేదు, సిద్ధుడు చెప్పలేదు. ఆ పాదలేపనం పూసుకున్న ప్రవరుడు హిమాలయా పర్వతం మీదికి పోవాలని కోరుకున్నాడు. అనుకున్నదే తడవుగా ఆ మంచుకొండకు చేరుకున్నాడు.

మంచుకొండకు పోయిన తరువాత ఏం జరిగిందో ముందు ముందు తెలుసుకుందాం.            

(వావిళ్ల రామస్వామి శాస్త్రులు అండ్ సన్స్ ప్రచురించిన మనుచరిత్రము-ప్రథమాశ్వాసం ఆధారంగా)

1 comment:

  1. జ్వాలా గారు, మనుచరిత్రం గొప్పప్రబంధం. చక్కగా చెబుతున్నారు. చాలా సంతోషం.

    ReplyDelete