“అటజని కాంచె భూమిసురు డంబర చుంబి శిరస్సరజ్ఝరీ….”
మనుచరిత్ర
కథ-2
వనం
జ్వాలా నరసింహారావు
సూర్యదినపత్రిక
(10-06-2024)
సిద్ధుడి సహాయంతో పాదలేపనం పొంది, దాని
మహాత్మ్యం వల్ల మంచుకొండ హిమాలయ పర్వతం
మీదికి చేరుకున్న ప్రవరాఖ్యుడు ఆకాశాన్ని తాకుతున్న హిమవత్పర్వతాన్ని చూశాడు.
సెలయేళ్ల చప్పుళ్లను, పింఛాలను విచ్చుకొని నృత్యం చేస్తున్న నెమిళ్ల సమూహాన్ని, ఏనుగులు కదిలిస్తున్న చెట్లను, ఇవన్నీ కూడి వున్న హిమవత్పర్వతాన్ని చూశాడు
ప్రవరుడు. ఆ తరువాత నరనారాయణులనే మహర్షులు తపస్సు చేసిన బదరీవనాన్ని చూసి, దాని మధ్యనుండి పోసాగాడు. అలాగే భగీరథుడు తపస్సు
చేసిన చోటును, ఆకాశగంగ
భూమ్మీద అవతరించిన ప్రదేశాన్ని, పార్వతి
శివుడికి శుశ్రూష చేసిన ప్రదేశాన్ని, మన్మథుడు
శివుడి కంటి మంటకు నీరైన ప్రదేశాన్ని, అగ్నిదేవుడు
సప్తర్షుల కాంతల మీద మోహం చెందిన ప్రదేశాన్ని, కుమారస్వామి
జన్మించిన రెల్లు దుబ్బలను చూసి సంతోషించాడు ప్రవరుడు.
ఆహ్లాదకరంగా వున్న ఇంకా-ఇంకా ఎన్నో ప్రదేశాలను తనివితీరా చూసిన
ప్రవరుడు, ఆ పర్వతం
మహాత్మ్యాన్ని గణుతింప బ్రహ్మకైన తరం కాదని, సూర్యకిరణాలు
తాకి, ఆవేడికి మంచు
కరిగిపోవడం గమనించి, మధ్యాహ్న సమయం
అయిందని అర్థం చేసుకున్నాడు. ఇక ఇంటికి పోదామని,
తిరిగి మర్నాడు వచ్చి చూడవచ్చని అనుకున్నాడు. అలా అనుకుంటూ మరలి పోవడానికి ఎగిరే
ప్రయత్నం చేశాడు. అయితే అతడి పాదాలకు పూయబడిన పాదలేపనం మంచుకు కరిగిపోయింది. ఆ
విషయాన్ని ప్రవరుడు గమనించి ఏంచేయాల్నా అని విచారించసాగాడు. దైవకృతానికి అసాధ్యం
లేదని నిశ్చయించుకున్నాడు. తాను ఆ ఘోర ప్రదేశంలో చిక్కుపడిపోవడానికి సిద్ధుడు
కేవలం నిమిత్తమాత్రుడని, దైవం ఆపద కలిగించాలనుకుంటే అలా ఒక నిమిత్తమాత్రుడిని
కలిపిస్తాడని అనుకున్నాడు. ఏం చేయాలా అని దుఃఖించాడు ప్రవరుడు.
‘అరుణాస్పుద పురం ఎక్కడ? మంచు కొండ
ఎక్కడ? పొగరుతో
ఇక్కడకు నేను రావచ్చా? ఇక్కడికి
వచ్చిన మార్గం తెలియదు కదా? ఇంక ఇక్కడి
నుండి పోవడం ఎలాగా?’ అని ఆలోచించ
సాగాడు. “బుద్ధిజాడ్య జనితోన్మాదుల్ గదా శ్రోత్రియుల్” అని
అనుకున్నాడు. సిద్ధుడు తనకు ఇచ్చిన పాదలేపనాన్ని ఉపయోగించుకోవడానికి మాయకో, ద్వారకకో, అవంతికో, కురుక్షేత్రానికో,
గయ-ప్రయాగాలకో, లేక మరేదైనా
పుణ్యక్షేత్రాలకో పోకుండా ఈ మంచు కొండకు ఎందుకు రావాల్సి వచ్చింది అనుకున్నాడు. ఆ
విధంగా ఆ నిర్మానుష్య ప్రదేశంలో వచ్చి దారి తెలియక చింతాసాగరంలో మునిగాడు
ప్రవరుడు. ఆ సమయంలో సంగీతంతో ఒప్పారుతున్న ఒక ప్రదేశాన్ని చూశాడాయన.
ద్రాక్షతీగలతో వ్యాపించివున్న గరుడ పచ్చలు పొదగబడిన ఒక ఇల్లు
చూశాడక్కడ. అక్కడి నుండి కస్తూరి, పచ్చకప్పూరం
మొదలైన పరిమళ ద్రవ్యాలు కలిసిన సువాసన వచ్చింది. దాన్ని బట్టి అక్కడ ఒక జవరాలు
వుండవచ్చన్న భావన కలిగింది ప్రవరుడికి. ప్రవరాఖ్యుడు ఆ సువాసన గాలిని పట్టుకొని
ముందుకు సాగగా ఆ ప్రదేశంలో మెరుపుతీగలాంటి శరీరం, కమలాల
లాంటి కన్నులు, తుమ్మెదల
లాంటి కురులు, చంద్రుడి
లాంటి ముఖం కల ఒక జవరాలిని కనుగొన్నాడు. ఆమె ఆ సమయంలో వీణ వాయిస్తూ వున్నది. తన
సమీపానికి వచ్చిన నలకూబరుడిని పోలిన ప్రవరాఖ్యుడిని చూసింది వీణ వాయిస్తున్న ఆ సుందరి.
ఆ దేవతా స్త్రీ ప్రవరుడిని చూసి తన అందెలు గల్లుగల్లుమని మోగుతుంటే దగ్గరిలో వున్న
ఒక పోకచెట్టు చాటుకు పోయి అతడినే గమనించసాగింది. అతడిని చూస్తున్నంతసేపు సంతోషంతో
ఉప్పొంగిపోయింది.
ఇంత చక్కటి అందగాడు (ప్రవరుడు) తనను ప్రేమించినట్లయితే మన్మథ సుఖాలను
నిరాటంకంగా అనుభవించ వచ్చని ఆ స్త్రీ భావించింది. ప్రవరుడి అందాన్ని పదే-పదే
ఆస్వాదించసాగింది. ఇలా అనుకుంటూ, చింతిస్తూ, ఒక విధంగా
మనోవేదనకు గురవుతూ, తత్తరపాటు
చెంది, సిగ్గుపడి, ఆ దేవతాస్త్రీ పోక చెట్టున చాటునుండి బయటకు
వచ్చి, ప్రవరుడి
దారికి అడ్డంగా నిలుచున్నది. అది చూసి ప్రవరుడు విభ్రాంతుడయ్యాడు. ఆమె దగ్గరిపోయి “ఎవ్వతె
వీవు భీతహరిణేక్షణ యొంటి జరించె దోట లే కివ్వనభూమి...” అని ప్రశ్నిస్తూ
ఆమె ఎవరని అడుగుతూ, ఎందుకు అలా
ఒంటరిగా అడవిలో తిరుగుతున్నదని అంటూ, తాను
బ్రాహ్మణుడినని, పేరు ప్రవరుడు
అని, కొవ్వెక్కి ఆ
మంచు కొండకు వచ్చి దారి తప్పానని, ఎలా తాను తన
పురం చేరగలనని తెలపమన్నాడు.
జవాబుగా ఆమెకూడా తిరిగి ప్రశ్నించింది ఇలా: “ఇంతలు కన్నులుండ
దెరు వెవ్వరివేడెదు భూసురేంద్ర...” అని అంటూ, ‘ఓ బ్రాహ్మణుడా! చేరెడేసి కన్నులు పెట్టుకొని
ఇతరులను దారి అడుగుతున్నావేమిటి?’ అని
ప్రశ్నించింది. ఒంటరిగా వున్న వయసుగత్తెలను పలకరించే విధం కాకపోతే, వచ్చిన తోవ ఆయనకు తెలియదా? అలా భయం లేకుండా దారి అడగడానికి తాను ఆయనకు
చులకనగా కనబడుతున్నానా? అని అన్నది. ఆ
తరువాత తానెవరో వివరించింది. లక్ష్మి తన తోబుట్టువని, వీణాగానం చేస్తానని, సంగీతం తనకు వచ్చిన విద్య అని, కామశాస్త్ర సిద్ధాంతాలను చిన్నతనం నుండే
చదువుతున్నానని, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల
సభలు తమకు నాట్యశాలలని, తానున్న ప్రదేశం తన ఉద్యానవనమని అన్నది. తన పేరు వరూధిని
అని చెప్పింది. ప్రవరుడు తమ అతిథి అని తన ఇంటికి వచ్చి విశ్రమించి అతిథి
సత్కారాలను పొందమని కోరింది.
‘ఓ చిన్నదానా! నువ్వు చేయదలచుకున్న మర్యాదలన్నీ చేసినట్లే అనుకో. నేను
ఇక్కడ వుండడానికి వీలులేదు. శీఘ్రంగా మా ఇంటికి పోవాలి. దయచేసి దారి చూపి నన్ను
పంపు’ అని అన్నాడు
ప్రవరుడు. తానింక నిజం దాచుకోదలచుకోలేదని, తన మనసు
ప్రవరుడి మీద వున్నదని, తనను మన్మథ
బాధలకు గురిచేయవద్దని, తనతో కొంతకాలం గడపమని వరూధిని అన్నది. అగ్నికార్యం, దేవతార్చన మిగిలి వున్నదని, భోజనకాలం అతిక్రమించిందని, తన తల్లిదండ్రులు
ముసలివారని, తనకొరకై ఎదురు
చూస్తుంటారని, తాను
ఆహితాగ్నినని, ఇల్లు
చేరకపోతే స్వర్వధర్మాలు చెడిపోతాయని వేడుకున్నాడు ప్రవరుడు.
వరూధిని ముఖం చిన్న బుచ్చుకోన్నది. భోగాలను అనుభవిస్తూ తనతో కూడి
అక్కడ ప్రతిదినం సంభోగిస్తూ వుండమని ప్రాదేయపడ్డది. ప్రవరుడికి స్వర్గసుఖాలు
చూపిస్తానని చెప్పింది. ఆమె అంటున్న విషయాలు తనకేమీ పట్టవని, అలాంటి మాటలు తనతో అనవద్దని, ఇంటికి దారి చూపమని మళ్లీ అడిగాడు. ప్రవరుడు తన
మీద అయిష్టాన్ని మళ్లీ-మళ్లీ వెళ్ళబుచ్చుతుంటే, ఎవరికైనా స్త్రీ తనంతట తానే వలచి
వస్తే చులకనై పోవాల్సిందే కదా అని అంటుంది. ప్రవరాఖ్యుడి తిరస్కారానికి గురైన
వరూధిని అవమానంతో సిగ్గుపడి, కోపంగా అతడిని
చూసింది. ప్రవరుడిని సమీపించిన వరూధిని అతడు తోసినప్పుడు ఆయన గోరు తనకు తాకిందని
మారాం చేసింది. ‘ఓ భూసురోత్తమా! యజ్ఞాలు, తపస్సు
చేసానన్నావు. దయా స్వభావం లేనప్పుడు ఎన్ని పుణ్యాలు చేసినా ఏమి ఫలితం? నీ చదువు వ్యర్థం’
అన్నది వరూధిని ప్రవరుడితో.
ఆ తరువాత ప్రవరుడు అగ్నిని స్తుతించగా అగ్నిదేవుడు ప్రవరుడి దేహంలో
ఆవేశించి అమితమైన తేజోబలాన్ని కలిగించాడు. అప్పుడు ప్రవరుడు వరూధినిని
వదిలించుకొని వాయువేగంతో ఇంటికి చేరుకున్నాడు. చేరుకొని యధాప్రకారం నిత్య కర్మలను
సక్రమంగా నిర్వర్తించుకున్నాడు.
మరిన్ని విశేషాలు మరోరోజు.
(వావిళ్ల
రామస్వామి శాస్త్రులు అండ్ సన్స్ ప్రచురించిన మనుచరిత్రము-ద్వితీయాశ్వాసం
ఆధారంగా)
No comments:
Post a Comment