Monday, June 17, 2024

ప్రవరుడి రూపంలో వరూధినిని పొందిన గంధర్వ కుమారుడు : (మనుచరిత్ర కథ-3) వనం జ్వాలా నరసింహారావు

 ప్రవరుడి రూపంలో వరూధినిని పొందిన గంధర్వ కుమారుడు

మనుచరిత్ర కథ-3

వనం జ్వాలా నరసింహారావు

సూర్యదినపత్రిక (17-06-2024)

ప్రవరాఖ్యుడు తనను తిరస్కరించి, తన్ను తోసిపుచ్చి వెళ్లిపోయిన తరువాత వరూధిని అతడి ఆకారాన్నే తన చిత్తంలో నిలుపుకొని, క్షోభకు గురై, అతడి చక్కదనాన్ని మరీ-మరీ తలచుకుంటూ మన్మథబాణాల తాకిడికి తట్టుకోలేక పోయింది. దుఃఖంతో అక్కడ వుండలేక ఆ కొండ దరిదాపుల్లో అడవుల్లో పడి తిరుగుతూ, ప్రవరుడు వెళ్లిన జాడ వెదికి-వెదికి కానలేక చెలికత్తెల దగ్గర తన బాధను వెళ్లబోసుకుంది. దైవమా! ఏంచేయాలి అని వాపోయింది. ఒకటికి పది మార్లు ప్రవరుడిని తలచుకుంటూ, అతడి సౌందర్యాన్ని గుర్తుచేసుకుంటూ, అలాంటివాడితో సౌఖ్యం పొందని ఆడుదాని చక్కదనం, యౌవనం, ప్రాణం నిష్ప్రయోజనం అని అనుకున్నది వరూధిని. దేవతాస్త్రీ కావడం వల్ల చావులేని తన చక్కదనమంతా పాడుకొంపకు దీపంలాగా అయిపోయిందే అనుకున్నది. ఇలా వితర్కించుకుంటూ వరూధిని మన్మథ తాపానికి శరీరం తల్లడిల్లుతుంటే ఆ విరహానికి తాళలేక పోయింది.

వరూధిని పడుతున్న అవస్థ ఇంత అని వర్ణింప సాధ్యపడలేదు. ఇంతలో కటిక చీకట్లు కమ్ముకున్నాయి. ఆ వెంటనే చంద్రోదయం అయింది. వెన్నెల నిండారింది. ముడుచుకొని పోయిన పద్మాల నుండి తుమ్మెదలు రొద చేస్తూ బయటికి వచ్చాయి. కలువలు వికసించాయి. చంద్రకాంత శిలలు కరిగాయి. సముద్రం ఉప్పొంగిపోయింది. మన్మథుడు వరూధిని లాంటి విరహులను వేధించసాగాడు. చంద్రుడి వల్ల బాధకు తాళలేక వున్న వరూధినిని ఆమె చెలికత్తెలు ఒప్పించి ఇంటికి తీసుకోనిపోయారు. తనకు విరహతాపం కలగడానికి ప్రేరేపిస్తున్న చంద్రుడి మీద వరూధిని కోపగించుకున్నది. మన్మథుడినీ నిందించింది. మన్మథ తాపం హెచ్చుకాగా చల్లగా వీస్తున్న దక్షిణపు గాలిమీదా కోప్పడ్డది. ఇలా పలుకుతూ వరూధిని తాపం పెరిగిపోయి మూర్ఛిల్లింది. చెలికత్తెలు ఉపచారాలు చేసి ఆమె తెరుకునేట్లు చేశారు. ఇంతలో తెల్లవారింది. సూర్యోదయం అయింది.

చెలికత్తెలు వరూధినిని ఊరడిస్తూ ఆమెను తిరిగి మామూలు మనిషిని చేసే ప్రయత్నం చేశారు. వీణ మీటమన్నారు. పంజరంలో వున్న చిలుకలకు, గోరువంకలకు మాటల నేర్పమన్నారు. ప్రవరుడి ప్రసక్తి తెస్తూ చెలికత్తెలు, “ఆ ప్రవరుడేమన్నా ఇంద్రుడా? చంద్రుడా? అతడి పొందుకు ఇంతగా చింతపడడం ఎందుకు? ఇవ్వాళ కూడా ఆ ఉద్యానవనానికి పోదాం. మనం పోయేసరికల్లా ఆ ప్రవరాఖ్యుడు అక్కడికి రాకుండా వుండలేదు. నీ అందచందాలు చూస్తే ఎవరికైనా వెర్రి పుట్టదా? అతడిని వశపర్చుకోవడం ఎంతపని? వాడు మళ్లీ నిన్ను చూస్తే ఆగుతాడా?” అని అన్నారు. చెలికత్తెల మాటలకు ఓదార్పు చెందిన వరూధిని దగ్గరలో వున్న గంగానదిలో ముఖం మాత్రం కడుక్కొని, ఎలాంటి అలంకారం చేసుకోకుండా కృశించిన శరీరంతో మెల్లగా చెలికత్తెలతో శృంగారపు తోటకు పోయింది.

ఇదిలా వుండగా, మునుపొక గంధర్వుడు వరూధిని సౌందర్యాన్ని, ఆమె శృంగారచేష్టలను చూసి, మోహించి, ఆమె దానికి సమ్మతించకపోవడంతో ఆమెను ప్రేమించే ఉపాయం కొరకు అన్వేషిస్తున్నాడు. వరూధిని ప్రవరాఖ్యుడిని వలచిన విషయం, ఆమెను అతడు తిరస్కరించడం వల్ల వరూధిని మన్మథ వ్యధ పడుతున్న వృత్తాంతం విని ఒక ఆలోచన చేశాడు. ఎలాగైనా ప్రయత్నించి వరూధిని సమాగాన్ని పొందాలని నిర్ణయించుకొని ఆమెకన్నా ముందుగా ఆమె విహరించడానికి వచ్చే ఉద్యానవనానికి చేరి ఒక చెట్టు నీడన ప్రవరాఖ్యుడి రూపంలో, బ్రాహ్మణ తేజస్సుతో నిలుచున్నాడు.

ఇంతలో వరూధిని చెలికత్తెలతో ఉద్యానవనానికి వచ్చి ఒక తామరకొలనులో దిగి జలక్రీడ చేయసాగింది. ఆ కొలను సమీపంలో వున్న ఒక చెట్టుకింద ప్రవరాఖ్యుడి రూపం దాల్చి వున్న గంధర్వ కుమారుడిని చూసి, ప్రవరుడే అని మనస్సులో నిశ్చయించుకొని, ఆతడిని చేరింది. ప్రవరుడి వేషంలో వున్న అతడిని చూడగానే వరూధిని గుండె జల్లుమన్నది. అతడి దగ్గరికి పోతుంటే అడుగులు తడబడ్డాయి. ముఖంలో దైన్యం కనిపించింది. కన్నుల్లో నీరు కారింది. తనను మోసపుచ్చావుకదా అని అంటూ డగ్గుత్తిక పడ్డది. తనను ఏలుకొమ్మని ప్రార్థించింది. గడచిన తాను పడ్డ బాధ చెప్పింది. ప్రవరుడు తన సదాచారాన్ని కాపాడుకుంటూ వుండమని, చిరకాలం లాగే బతకమని, తనను మాత్రం ప్రేమించమని కోరింది.

వరూధిని మాటలకు ప్రవరుడి రూపంలో వున్న గంధర్వుడు నిజంగా ప్రవరుడే అనిపించుకోవడానికి ముఖంలో కనిపిస్తున్న చిరునవ్వును కప్పిపుచ్చాడు. శరీరంలో కనపడే శృంగారచేష్టల ఉద్రేకాన్ని అభినయంతో దాచాడు. సన్నటి గొంతుతో ఇలా అన్నాడు. ‘నా ముసలి తల్లితండ్రులను వదిలి, భార్య వియోగ దుఃఖం అనుభవిస్తుంటే ఇక్కడ ఎలా వుంటాను? ప్రేమతో నీ కౌగిట చేరే సుఖం ఇంద్రుడికి కూడా కలగదు. నువ్విలా నన్ను ప్రేరేపిస్తుంటే కూడదని అనడానికి నేనేమన్నా సన్న్యాసినా? ఇల్లు, తల్లిదండ్రులు ఏమయ్యారన్న చింత వున్నా నిన్ను వెతుక్కుంటూ వచ్చాను. నువ్వింతగా దైన్యంతో అడుగుతున్నావు కాబట్టి నా నియమాన్ని వదుల్తున్నాను. అయితే ఒక నియమం. మా ఆచారం ప్రకారం మన సంభోగ సమయంలో పరస్పరం మనం ముఖాలు చూసుకోరాడు. కన్నులు మూసుకోవాలి. ఈ నియమానికి నువ్వు అంగీకరిస్తే నాకు ఇష్టమే.

వ్రతం చెడ్డా సుఖం దక్కాలని, వరూధిని ఆమె వాంఛితం తీరగానే తనను వదలరాదని, తనంతట తాను పోదల్చుకున్నంతవరకు తనను విడువరాదని నిబంధన పెట్టాడు గంధర్వుడు. అలా బాస చేస్తే తనకు ఆమెతో వుండడానికి అంగీకారమే అని చెప్పాడు. ఆయన మాటలు విన్న వరూధిని, తన నోములు పండాయని అంటూ ఆయన చెప్పినట్లే చేద్దామని అన్నది.

ఆ తరువాత వరూధిని, మాయా ప్రవరుడుడైన గంధర్వ కుమారుడు ఇతర వ్యాపకాలు అన్నీ మాని చాలాకాలం ఆనందంగా గడిపారు. ఇంతలో వరూధిని గర్భవతి అయింది. ఆ దేవతాస్త్రీ తన మోసాన్ని కనిపెట్టుతుందేమోనని భయపడ సాగాడు గంధర్వ కుమారుడు. శపిస్తుందేమోనని కూడా భయపడ్డాడు. ఆమెను విడిచి ఇక వెళ్లిపోదామని నిర్ణయించుకున్నాడు. ఒకనాడు ఆమెతో ఇలా అన్నాడు. ‘నాకు పసరు రాసిపోయిన సిద్ధుడు ఈ కొండకు వచ్చాడు. నాకు కనిపించాడు. ఇంతకాలం నేనిక్కడ వుండడం వల్ల అక్కడ మా ఇంట్లో మా సంసార గతులన్నీ తారుమారయ్యాయి. నా తల్లిదండ్రులు దుఃఖించి శుష్కించిపోయారు. నీకు ధర్మం, అధర్మం తెలుసు. నేను ఇంటికి పోవాలి. నా వియోగానికి పరితపించవద్దు’.

గంధర్వ కుమారుడి మాటలకు వరూధిని దుఃఖపడ్డది. ఆమెను ఊరడించాడు. యోగవియోగాలు శాశ్వతం కాదన్నాడు. ఆమెను శాశ్వతంగా తాను వదలనని, సిద్దుడిని ప్రార్థించి అతడిచ్చే పాదలేపముతో తరచూ వస్తూ-పోతూ వుంటానని అన్నాడు గంధర్వ కుమారుడు. ఆ విధంగా వరూధిని నమ్మేవిధంగా ఎన్నోరకాల ఇచ్చకపు మాటలు చెప్పి గంధర్వ కుమారుడు తన ఇష్టం వచ్చినట్లుగా వెళ్లిపోయాడు.                  

(వావిళ్ల రామస్వామి శాస్త్రులు అండ్ సన్స్ ప్రచురించిన మనుచరిత్రము-తృతీయాశ్వాసం ఆధారంగా)

No comments:

Post a Comment