వరూధిని కుమారుడు స్వరోచి శరణు కోరిన గంధర్వ కన్య మనోరమ
మనుచరిత్ర
కథ-4
వనం
జ్వాలా నరసింహారావు
సూర్యదినపత్రిక
(24-06-2024)
గర్భం దాల్చిన వరూధినికి తొమ్మిదినెలలు నిండాయి. ఒక శుభ గ్రహంతో కూడిన
లగ్నంలో దేదీప్యమానుడైన, దేవేంద్రుడితో కొనియాడతగినవాడైన, మహత్తరకాంతి సంపన్నుడైన
ఒక కుమారుడిని కన్నది వరూధిని. సూర్యచంద్రాదుల కాంతితో సమానమైన కాంతి, చక్కటి శరీర
ఛాయ కలవాడైన ఆ బాలుడికి ఋషులు స్వరోచి అని పేరు పెట్టారు. ఆ బాలుడు
దినదినాభివృద్ధి చెంది, మునీంద్రుల
ఆశీర్వాద బలం కలిగి, ఉపనయనం
చేసుకొని, ధనుర్వేదం
అభ్యసించి, వేదార్థాలను
నేర్చుకొని, యుద్ధం
చేయడంలో గొప్పవాడై, సకల న్యాయ
విచారణ చేయడంలో సమర్థుడై,
కళావంతుడయ్యాడు. స్వరోచి సామ్రాజ్యాన్ని అనుభవిస్తుండగా ఒకనాడు ఆయనున్న కొండ మీద
వడగళ్లు రాలాయి. వర్షం కురిసింది. సెలయేళ్లు ఎత్తైన ప్రదేశం నుండి ప్రవహించడంవల్ల
పెద్ద ధ్వని కలిగింది. ఆ ధ్వనికి నెమిళ్లు కేకలు వేస్తూ నాట్యం చేశాయి. అలాంటి
సుందర దృశ్యాన్ని చూద్దామని అనుకున్నాడు స్వరోచి ఆ మర్నాడు.
స్వరోచి అనుకున్నట్లుగానే కొండమీది నుండి చూస్తూ వినోదిస్తున్నప్పుడు
అక్కడికి ఒక శబరుడు తమ రాజైన స్వరోచిని చూడడానికి వచ్చాడు. తాను తెచ్చిన
దనుర్భాణాలను రాజుకు ఇచ్చి నమస్కరించాడు. సమీపంలోని కైలాసపర్వతం దగ్గరున్న అడవిలో
ఘాతుక మృగాలు అమితంగా వున్నాయని, వాటిలో అడవి
పందులు, సూకరాల
గున్నలున్నాయని, బాగా బలసిన
రుష్యాలున్నాయని, దుప్పులు కూడా
వున్నాయని, ఇంకా వృషతాలు, యిర్రిపోతులున్నాయని, ఎన్నో రకాల పక్షులున్నాయని చెప్పి స్వరోచిని
వేటకు ప్రేరేపించాడు. స్వరోచికి కూడా వేటాడడానికి మనసు కలిగి తన నగరానికి పోయి
దానికి కావాల్సిన సన్నాహాలు చేసుకున్నాడు. ఒక ఉన్నతాశ్వాన్ని ఎక్కి స్వరోచి
పరివారంతో కలిసి వేటకు బయల్దేరాడు. వారి వెంట వేటకుక్కలు కూడా వున్నాయి.
వేటకాండ్రు కూడా బయల్దేరారు. అంతా కలిసి విచ్చలవిడిగా వేటాడారు. జింకలు, సివంగులు, ఎలుగులు, పెద్ద పందులు, పెద్ద
పులులు ఇలా ఎన్నో జంతువులు వేటకాండ్రను చూసి పరుగెత్తాయి.
ఇలా వేట సాగుతుండగా దాదాపు పూర్తికావస్తున్న సమయంలో స్వరోచికి ఒక
ఆడుదాని దుఃఖం వినిపించింది. వనితనని, అనాథనని, ఆర్తురాలినని, తనను
రక్షించి పుణ్యం కట్టుకొమ్మని ఆక్రందనం వినగానే స్వరోచి ఆవైపునకు చూశాడు. ఒక
స్త్రీ మట్టెలు మోగుతుంటే, స్తనద్వయం
కదుల్తుంటే, కన్నీరు ధారలుగా కారుతుంటే, దైన్యం పొందిన
ఆకారంతో స్వరోచి ఎదుట నిలిచింది. ఆమె వెక్కి-వెక్కి ఏడుస్తున్నది. ఆమెదొక వింత
సౌందర్యంలాగా వున్నది. భయపడి దిక్కులు చూస్తూ స్వరోచికి ఒక మాట చెప్తానన్నది.
భయపడవద్దని, ఆమె ఎవరని
అడగ్గా ఆమె ఇలా చెప్పింది.
ఒక రాక్షసుడు తనను చంపడానికి మూడు రోజుల నుండి వెంటాడుతున్నాదని, దిక్కులేని తనను కాపాడమని ప్రార్థించింది. తన
తల్లి మరుదశ్వుని కూతురని, తండ్రి
ఇందీవరాక్షుడు అనే గంధర్వుడని, తన పేరు మనోరమ
అని, తన చెలికత్తెలు కళావతి, విభావసి అని అన్నది. తెలియక చేసిన తప్పు వల్ల ముని
శాపానికి ముగ్గురం గురయ్యామని చెప్పింది. రాక్షసుడి వల్ల శ్రమపడమని తనను ముని
శపించాడని అన్నది. తన చెలికత్తెలను క్షయ రోగంతో బాధపడమని శపించినట్లు కూడా
చెప్పింది. శాప కారణాన తనను రాక్షసుడు మూడు రోజుల నుండి వెంబడిస్తున్నాడని, తనను
మింగుతానని అంటున్నాడని అన్నది.
తనకు అస్త్రహృదయం అనే విద్య వచ్చని, అది
తనకు పరమ శివుడు నుండి క్రమాగతంగా వచ్చిందని, అది సకల శత్రు
నాశనం చేస్తుందని, యశస్కరమైనదని, దానిని నేర్చుకొని ఆ రాక్షసుడిని చంపమని మనోరమ
స్వరోచికి చెప్పింది. ఆ విద్యను నేర్చుకోవడానికి స్వరోచి అంగీకరించడంతో, మనోరమ అస్త్రహృదయాన్ని మిక్కిలి రహస్యంగా ఆయనకు
నేర్పింది. ఇంతలో ఆ దానవుడు భయంకరంగా అరుస్తూ స్వరోచిని ఎదుర్కొన్నాడు. స్వరోచి
మీద వాడిగల బాణాలను ప్రయోగించాడు. స్వరోచి వాటిని తునాతునకలు చేశాడు. కాసేపు
వారిద్దరి మధ్య యుద్ధం జరిగిన తరువాత స్వరోచి ఆగ్నేయబాణాన్ని ప్రయోగించడంతో దాని
మంటలు రాక్షసుడి శరీరాన్ని చుట్టుకొన్నాయి. అప్పుడు వాడి రాక్షసాకారం పోయి
గంధర్వుడి ఆకారాన్ని దాల్చాడు. విమానాన్ని ఎక్కి ఆకాశమార్గాన కనపడ్డాడు.
(మరిన్ని విశేషాలు మున్ముందు)
(వావిళ్ల
రామస్వామి శాస్త్రులు అండ్ సన్స్ ప్రచురించిన మనుచరిత్రము-చతుర్థాశ్వాసం
ఆధారంగా)
No comments:
Post a Comment