వ్యక్తిత్వ వికాసం, జీవన పాఠాలు, స్వీయానుభవాల పరిపక్వత-13
హైదరాబాద్
మహానగరంలో తొలి పరిచయాల ప్రభావం (వూటుకూరు వరప్రసాద్)
వనం
జ్వాలా నరసింహారావు
హైదరాబాద్
అశోక్ నగర్, చిక్కడపల్లిలో వుంటుడే తొలి రోజుల్లో, చాలామంది
వ్యక్తులతో పరిచయాలయ్యాయి. కొందరితో ఆరోజులనాటి పరిచయాలు ఎప్పటికీ గుర్తుంచుకునే
అనుభవాలు. వారి ప్రభావం కూడా నామీద పడిందనాలి. కొందరి పేర్లు చెప్పుకోవాలంటే: వూటుకూరు
వరప్రసాద్, అనంతరామారావు, సూర్యప్రకాశరావు, రావులపాటి
సీతారాంరావు, మహారాజశ్రీ, ప్రొఫెసర్ హరగోపాల్, వాసిరెడ్డి శివలింగ
ప్రసాద్, ప్రొఫెసర్ రాఘవేంద్ర రావు, బొమ్మకంటి శంకర్ రావు, డాక్టర్ శ్రీధర్ రెడ్డి
లాంటి ప్రముఖులున్నారు.
నేను మొదట హైదరాబాద్‌కి వచ్చి అశోక్‌నగర్-చిక్కడపల్లి
ప్రాంతంలో ఉంటున్న రోజుల్లో, నాకంటే పదేళ్లు పెద్దవాడైన వూటుకూరు
వరప్రసాద్ రావు, అప్పట్లో ‘ఉన్నత విద్యావంతుడు, విలక్షణమైన
మేధావి స్నేహితుడు' సీతారాం పార్సా (కారేపల్లి సీతారాం)తో
కలసి అశోక్‌నగర్‌లో ఆయన ఇంట్లోనే వుండేవాడు. నిత్య పాఠకుడైన సీతారాం విజ్ఞానం అవధులు
లేనిది. ఏ అంశాన్నైనా అనర్ఘలంగా విడమర్చి చెప్పగలిగిన మేథావి. ఖమ్మం సమీపంలోని
ఉసిరికాయలపల్లిలో వందల, వేల ఎకరాల భూముల యజమానైన సీతారాం పార్సా, అప్పట్లో డన్‌లాప్
టైర్స్ కంపెనీలో కీలక పదవిలో పనిచేశారు. సీతారాం బాబాయ్ పార్సా వెంకటేశ్వరరావు
హైదరాబాద్ సివిల్ సర్వీసు అధికారిగా, హైదరాబాద్
కలెక్టర్‌గా కూడా పని చేశారు. తరువాత రోజులలో పార్సా వెంకటేశ్వరరావుగారి ముగ్గురు
కుమారులతో (పాత్రికేయ వృత్తి) నాకు బాగా స్నేహం వుండేది.
ప్రస్తుతం
87 సంవత్సరాల వయస్సు దాటిన వరప్రసాద్ రావు (కొడుమూరు ప్రసాద్ లేదా జర్నలిస్టు
ప్రసాద్‌గా) ఖమ్మం జిల్లాలోని కొడుమూరు గ్రామంలో 1937 జూన్ 13న జన్మించి, ప్రాథమిక విద్యను పూర్తి చేసి, ఖమ్మం పట్టణం రికాబ్ బజార్ హైస్కూలులో ఉర్దూ
మాధ్యమంలో 5వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదివారు. ఇంటర్మీడియట్ చదవడానికి సికింద్రాబాద్‌లోని
ఉస్మానియా యూనివర్సిటీ కాలేజీలో చేరిన ప్రసాద్ విద్యలో వెనుకబడడంతో తండ్రి
గ్రామానికి పిలిపించి వ్యవసాయ పనుల్లోకి పెట్టారు. తండ్రిని ఒప్పించి తిరిగి
హైదరాబాద్‌కి వచ్చి చదువులు కొనసాగించాడు.
1960లో
ప్రసాద్ వయసు 23 సంవత్సరాలు ఉన్నప్పుడు, తండ్రి మరణించారు (తల్లి ప్రసాద్ 6 ఏళ్ళ
వయసులో ఉన్నప్పుడే కన్నుమూశారు). దరిమిలా ప్రసాద్ జీవిత ప్రయాణం పూర్తిగా స్వయంశక్తితోనే
సాగింది. పుస్తకాలు పట్ల అసాధారణ ఆసక్తి కలిగిన మరో మేధావి స్నేహితుడు విఎల్
నరసింహారావు విసిరిన సవాల్ స్వీకరించిన
వరప్రసాద్, మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ విశ్వవిద్యాలయం నుంచి
ఇంటర్మీడియట్ పూర్తి చేశారు. ఆ తర్వాత హైదరాబాద్‌లోని వివేకవర్ధిని కాలేజీ నుంచి
బీఏ, ఉస్మానియా యూనివర్సిటీ నుంచి తత్త్వశాస్త్రంలో ఎంఏ,
ఎల్‌ఎల్‌బీ, జర్నలిజం పూర్తిచేశారు. తత్త్వశాస్త్రంలో
ఎమ్‌ఫిల్ పూర్తిచేయగా, పీహెచ్‌డీ కూడా తుది దశలో ఆగిపోయింది.
విద్యాభ్యాసం మొత్తం ఆయన ప్రతిభాపరమైన ద్వారానే పూర్తయింది.
నా
ఖమ్మం జిల్లాకు చెందిన సీతారాం, వరప్రసాద్ ల మధ్య కేవలం స్నేహమే కాకుండా తల్లుల
పక్షాన బంధుత్వం కూడా వున్నది. వారి ఇద్దరి అమ్మమ్మలు తోబుట్టుళ్లు కావడంతో, చిన్ననాటి నుంచే వారిద్దరూ తరచూ కలుసుకునేవారు. సీతారాం వివాహం చేసుకుని
కుటుంబంతో మారేడ్ పల్లికి నివాసం మారేంత వరకూ, వరప్రసాద్ ఆయన
ఒకే ఇంటిలో నివసిస్తూ, విడదీయరాని మిత్రులయ్యారు. అదే సమయంలో వరప్రసాద్
కాలేజీ చదువులు పూర్తిచేసి, స్వయంకృషితో, స్వయంప్రతిష్టతో
చదువులోనే కాదు, సమాజంలోనూ ఒక స్థాయికి ఎదిగాడు. కొంతకాలం
డెయిలీ న్యూస్, ఇండియన్ హెరాల్డ్ పత్రికల్లో పని చేసి,
'జర్నలిస్టు ప్రసాద్'గా గుర్తింపు పొందాడు.
1970
ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి సంఘ ఎన్నికల రాజకీయాల్లో వరప్రసాద్ కేవలం 'కింగ్ మేకర్'గానే కాకుండా, స్వయంగా
విద్యార్ధి నాయకుడిగా ఎదిగారు. ఆయనే విశ్వవిద్యాలయ ఆర్ట్స్ కాలేజ్ ప్రెసిడెంట్‌గా
ఎన్నికయ్యారు. విశ్వవిద్యాలయ అధ్యక్షపదవికి కూడా ఆయనే ఎంపికే ఖాయమవుతున్న
నేపధ్యంలో ఎన్నికలు ఉత్కంఠభరితంగా సాగి, హింసాత్మక ఘటనల
కారణంగా ఫలితాలను నిలిపివేశారు. ఫలితాలను ఎప్పటికీ ప్రకటించలేదు. ఆ కాలంలో
విద్యార్థి ఉద్యమాలు గరిష్ఠ స్థాయిలో ఉండగా, అటువంటి రాజకీయ
ఉద్రిక్త వాతావరణంలో ఆయన నాయకత్వం బ్రహ్మాండంగా సాగింది.
విద్యార్థి
ఉద్యమాలలో వరప్రసాద్ క్రియాశీలకంగా పాల్గొని, సామాజిక, రాజకీయ మార్పుల పట్ల యువతలో జాగృతి తీసుకువచ్చే నేతృత్వ ధోరణికి ముందు
వరుసలో నిలిచారు. ఆయన ఆర్ట్స్ కాలేజ్ ప్రెసిడెంట్‌గా ఉన్నప్పుడు, విద్యార్థులతో ఆయనకు ఉన్న అనుబంధం, విశ్వవిద్యాలయ
రాజకీయ వేదికపై ఆయన ప్రభావం స్పష్టంగా కనిపించేది. విద్యార్థులపై అన్యాయాలు,
వ్యవస్థాపిత అసమానతలు వంటి సమస్యలపై వరప్రసాద్ స్పందించేందుకు
ముందుండేవారు. మేతోపరమైన చర్చల్లోనూ, ఉద్యమాల్లోనూ ఆయన
చురుగ్గా పాల్గొనడం ద్వారా బహుళ ఆలోచనల పోరాటానికి తనవంతు మద్దతు అందించారు.
వరప్రసాద్‌కు
ఉన్న రాజకీయ దూరదృష్టి కారణంగా, 1970ల చివర్లో గ్రాడ్యుయేట్స్
నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగిన సమయంలో పోటీలో వున్న కేశవరావుతో
దగ్గర సంబంధం ఏర్పడింది. ఆయన ఎన్నిక కావడానికి ప్రసాద్ బాగా కృషి చేశాడు. స్వర్గీయ
డాక్టర్ ఏపీ రంగారావు ప్రోత్సాహంతో ప్రసాద్ రియల్ ఎస్టేట్ వ్యాపారంలోకి
అడుగుపెట్టి, ఎంతో సంపాదించారు. తన సంపాదనను మొత్తం హైదరాబాద్‌కు
25 కిలోమీటర్ల దూరంలో జీడిమెట్లలో విజయదుర్గాదేవి, మల్లేశ్వరస్వామి,
మహాగణపతి, సుబ్రహ్మణ్యస్వామి, ఆంజనేయస్వామి ఆలయ సముదాయం నిర్మాణానికి పూర్తిగా ఖర్చు చేశారు. ప్రస్తుతం
87 సంవత్సరాల వయస్సులో, ఆయనే నిర్మించిన అదే ఆలయ సముదాయంలో ఒక
చిన్న గదిలో నివసిస్తూ, అత్యంత సాదాసీదా జీవితం
గడుపుతున్నారు. ప్రసాద్ వివాహం చేసుకోలేదు.
ఒకసారి
నేను జీడిమెట్లలో ఉన్న ఆలయ సముదాయానికి శ్రీమతితో కలిసి వెళ్లాను. వయస్సు 87
సంవత్సరాలు దాటినా, మోకాళ్లలో స్వల్ప అసౌకర్యం తప్ప, ఆరోగ్యంగా, ఎప్పటిలాగే ఉత్సాహంగా కనిపించారు.
మేమిద్దరం ఆలయం లోపలికి నడుచుకుంటూ వెళ్లి, ఓ గంట పాటు
కూర్చొని, పాతకాలపు స్మృతులు నేమరేసుకున్నాం. మా మధ్యన
పరిచయం, దరిమిలా స్నేహం 1962 సంవత్సరంలో, నేను పీయూసీ విద్యార్థిగా
మొదటిసారి హైదరాబాద్‌కి వచ్చినప్పుడు, మొదలైంది. సౌత్ జోన్, ఇంగ్లండ్
ఎంసీసీ జట్టుల మధ్య జరుగుతున్న కౌంటీ క్రికెట్ మ్యాచ్ చూడడానికి వచ్చినప్పుడు
కలవడం జరిగింది.
వరప్రసాద్
తన స్నేహితుడు సీతారాం పార్సా కలిసి నాంపల్లిలో ప్రాంతంలో ఒక గదిలో వుంటున్నప్పుడు,
నేను, వనం నర్సింగ్ రావు, వనం రంగారావు తదితర స్నేహితులం అక్కడే వుండి
క్రికెట్ మాచ్ చూడడానికి పోయేవాళ్ళం. నేను బీఎస్సీ చదవడానికి హైదరాబాద్‌కి వచ్చి
అశోక్‌నగర్, చిక్కడపల్లి పరిసర ప్రాంతాల్లో ఉండేటప్పుడు మా
స్నేహం వృద్ధి చెందింది. బీహెచ్ఇఎల్ హయ్యర్ సెకండరీ స్కూల్‌లో పనిచేస్తున్న
సమయంలోనూ, అదే ప్రాంతంలోనే నివసిస్తూ వరప్రసాద్‌తో
సాన్నిహిత్యం కొనసాగించాను. వరప్రసాద్, ఇతర స్నేహితులతో
కలిసి ప్రతీ సాయంత్రం సుధా హోటల్‌లో గానీ, నారాయణగూడలో తాజ్
మహల్ హోటల్‌లో గానీ కాఫీ తాగుతూ సమయాన్ని గడిపేవాళ్ళం. మామధ్య చర్చలు ఆసక్తికరంగా
వుండేవి.
జీడిమెట్ల
దేవాలయ సముదాయానికి వెళ్లినప్పుడు, మెల్లగా మా సంభాషణ వరప్రసాద్ జీవితానుభవాలను
గ్రంధస్థం చేసే అంశంవైపు మళ్లాయి. ప్రసాద్ జీవితంలో ఎదుర్కొన్న క్లిష్టమైన
సందర్భాలను, ధైర్యంగా ముందుకెళ్ళిన విధానాన్ని, భావి తరాలవారికి ఉపయోగపడతాయనే అంతర్లీనంగా ఆయనకున్నట్లు నాకు
అనిపించింది. ముఖ్యంగా అప్పట్లో దేశ, ప్రపంచ స్థాయిలో ఉన్న
రాజకీయ, సామాజిక పరిణామాలను ప్రస్తుతకాలపు పరిస్థితులకు
అన్వయిస్తూ, ఓ సందేశాత్మకతతో చెప్పాలనుంది ఆయనకు. అయితే అది
వాస్తవంగా రూపుదిద్దుకుంటుందో లేదో తెలియదని ఆయనే అనుమానం వ్యక్తపరిచాడు. పైగా,
తన తరఫున ఆ అనుభవాలను రాస్తామని చెప్పిన ఇద్దరు స్నేహితుల ఆరంభ
ఉత్సాహం మాటల్లోనే ముగిసిపోయిందని వ్యంగ్యంగా చెప్పారు.
ఇంతలో మా చర్చ తత్త్వశాస్త్ర అంశం మీద వరప్రసాద్
చేసిన ఎమ్‌ఫిల్ థీసిస్ వైపు మళ్లింది. ఉస్మానియా యూనివర్సిటీ అప్పటి తత్త్వశాస్త్ర
విభాగాధిపతి ప్రొఫెసర్ వి మధుసూదనరెడ్డి ప్రసాద్ ఎంచుకున్న అంశం మీద ఎంఫిల్ కష్టమైన
విషయం అంటూ అన్నప్పటికీ, నిరుత్సాహం చెందకుండా, వరప్రసాద్
థీసిస్ రాయడం ప్రారంభించి ముందుకు సాగారు.
ఆయన ఎంచుకుని సమర్పించిన సుమారు 400 పేజీలతో కూడిన థీసిస్, ‘THE
EMERGING TRENDS OF PHILOSOPHY OF NATURE IN
TECHNOLOGICAL SOCIETY’ అనే అంశం మీద. విషయంపై, తత్త్వశాస్త్ర విభాగానికి చెందిన డాక్టర్ కె విల్సన్ మార్గదర్శకత్వంలో థీసిస్
తయారు చేస్గారు ప్రసాద్.
ప్రసాద్
అమెరికన్ స్టడీస్ రీసెర్చ్ సెంటర్ లైబ్రరీ, ఉస్మానియా
యూనివర్సిటీ లైబ్రరీతో పాటు మరెన్నో గ్రంథాలయాలకు నిత్యం వెళ్ళినట్లు తన థీసిస్
ముందుమాటలో వివరించారు. ఆ రోజులను గుర్తుచేసుకుంటున్నప్పుడు,
ఆయన ముఖంలో మెరిసే ఆనందం స్పష్టంగా కనిపించింది. ఆ పరిశోధనాపత్రాన్ని మార్గాదర్శికాలకు
అనుగుణంగా మరో రెండు విశ్వవిద్యాలయాలకు పంపారు. హైదరాబాద్‌లో నిర్వహించిన
ఇంటర్వ్యూల్లో కూడా ఆయనకు అనేక ప్రశంసలు లభించాయి. ఆయన విభాగాధిపతి ఆ థీసిస్ ను ‘పీహెచ్‌డీ
కంటే గొప్పది, దీన్ని తప్పకుండా ప్రచురించాలి’ అని ప్రత్యేకంగా ప్రశంశించారు. తాను
ఈ అంశాన్ని ఎందుకు ఎన్నుకున్నానో క్లుప్తంగా వివరించారు నాకు. థీసిస్ లో పేర్కొన్న
పలు విషయాలు, కేవలం చర్చనీయాంశాలే కాదు, తెలిసికోవాల్సిన అనివార్యమైనవని ఆయన స్పష్టం చేశారు.
వేదాలు, ఉపనిషత్తులు, ఆరణ్యకాలు, భగవద్గీత,
వేదాంత సిద్ధాంతాలు (అద్వైతం, విశిష్టాద్వైతం,
ద్వైతం), శ్రీ అరవిందో, డాక్టర్
రాధాకృష్ణన్ ఆలోచనలు, అరిస్టాటిల్‌కు ముందు, తర్వాత గ్రీకు తత్త్వశాస్త్రం, కార్ల్ మార్క్సు,
రెనైసాన్స్ ప్రభావం, మానవుడు-ప్రకృతిపై అపోహలు,
పదార్థ నిరాకరణ భావన, సాపేక్షత సిద్ధాంతం,
క్వాంటం మెకానిక్స్, అణు జీవశాస్త్రం, విశ్వసృష్టి, సాంకేతికతకు అందని విశ్వగమ్యం వంటి
అనేక అంశాలన్నీ పరిశోధనలోని ఉపవిషయాలుగా మనముందు వస్తాయి.
ఒక
పల్లెటూరి యువకుడిగా జీవితం ప్రారంభించి, విద్యార్థి
నాయకుడిగా, జర్నలిస్టుగా, వ్యాపారవేత్తగా,
చివరికి తన సంపదంతా దేవాలయాలకు అంకితమిస్తూ భగవంతుని సేవలో జీవించే
వరప్రసాద్ జీవిత ప్రయాణం, కాలప్రవాహంలో విలువల అన్వయాన్ని, జీవన
పరిమాణ మార్పులలో విశ్వాసాన్ని ప్రతిబింబిస్తుంది. ఇది భవిష్యత్ తరాలకో పాఠం. వ్యక్తిగత
స్వార్థం దాటి, సమాజ శ్రేయస్సు కోసం ఆలోచించాలనే సందేశం. మన
వయస్సు పెరిగేకొద్దీ, మన జ్ఞానం, అనుభవాలంతే
కాదు, వరప్రసాద్, సీతారాం పార్సా, విఎల్
నరసింహారావు లాంటివారు, వారి సహచరుల అనుభవాలూ, భవిష్యత్ తరాలకు ఎంతో విలువైనవిగా
మారతాయి. వారు జరిపిన చర్చలు, పాల్గొన్న సమాజ పోరాటాలు,
నిలిపిన భావజాలాలు, తరతరాల తరబడి కొనసాగే వారసత్వంగా నిలుస్తాయి. ఇలాంటివారి
ప్రభావం నామీదా పడింది.
ఇంతటి
ఆసక్తికరమైన, ఆశాజనకమైన జీవన ప్రయాణాన్ని మనం పరిశీలించినప్పుడు, వూటుకూరు
వరప్రసాద్ జీవితం మనకు స్పష్టంగా తెలియజేస్తుంది: విజయం అనేది కేవలం ప్రతిభ వల్లే
కాదు, పట్టుదల, పరితపన, పరమార్థసాధన వల్ల సాధ్యమవుతుంది. చదువు ఆగిపోయినప్పటి నుంచి తిరిగి
ప్రారంభించి, తాను కోరుకున్న స్థాయికి చేరుకోవడమే కాదు, ఆ
ప్రయాణాన్ని ఒక ఆత్మీయ ఉద్యమంగా మార్చి, సంపాదించిన
ప్రతిదాన్నీ సమాజానికి సమర్పించి, సనాతన ఆధ్యాత్మిక మార్గంలో
నిష్ఠగా నిలబడటం, ఆయన వ్యక్తిత్వానికి నిలువెత్తు ఉదాహరణ.
వరప్రసాద్
లాంటి జీవితం మనకు నిజమైన జీవిత మౌల్యాలేమిటో గుర్తు చేస్తుంది. ఆయనకు జీవితంలో
పేరు, గౌరవం, సంపద అన్నీ వచ్చినప్పటికీ, చివరికి ఆయన ఎంపిక చేసుకున్న మార్గం, స్వార్ధ రహిత
సేవ, ఆధ్యాత్మిక నిబద్ధత, తరాల తరబడి
నిలిచే పునాదుల నిర్మాణం. తన జీవితం ద్వారా ఆయన చెబుతున్న గొప్ప సందేశం ఇదే: పరిస్థితులు
ఎలా ఉన్నా, మన ఆత్మవిశ్వాసం నిలబడితే, మార్గం
మనమే తీర్చిదిద్దుకోవచ్చు. జీవితం ఒక అవకాశమైతే, దానిని ఒక
సందేశంగా మార్చడం మన బాధ్యత. అలాంటి జీవిత గాథలు, తరం తరం
చైతన్యాన్ని రగిలించే దీపశిఖలుగా నిలుస్తాయి. ఇది కేవలం వరప్రసాద్ కథ కాదు. ప్రతి
మనిషికి ఒక ఆత్మపరీక్షా పాఠం. ఒక సందేశం: బలమైన ఆశయాలూ, అగాధమైన
ఆలోచనలూ కలిగిన జీవితం ఎప్పటికీ వెలవడదు.


No comments:
Post a Comment