శ్రీకృష్ణావతార ఘట్టం
శ్రీ మహాభాగవత కథ-51
వనం జ్వాలా నరసింహారావు
సూర్యదినపత్రిక (08-09-2025)
కంII చదివెడిది భాగవతమిది,
చదివించును కృష్ణు, డమృతఝరి పోతనయున్
చదివినను
ముక్తి కలుగును,
చదివెద నిర్విఘ్నరీతి ‘జ్వాలా’ మతినై
పూర్వం పాపభారాన్ని మోయలేక భూమి, గోరూపం ధరించి, బ్రహ్మ దగ్గరికి పోయి
కన్నీరు-మున్నీరుగా ఏడ్చింది. ఆమెను తీసుకుని, ఇంద్రాది దేవతలతో సహా విష్ణుమూర్తిని సందర్శించాడు బ్రహ్మదేవుడు. అప్పుడు
బ్రహ్మకు భగవద్వాణి వినిపించింది. తాను విన్నదాన్ని ఇతరులకు వినిపించాడు
బ్రహ్మదేవుడు. భగవంతుడు యదుకులంలో అవతరించనున్నాడని, దేవతలంతా వారి-వారి అంశలతో యదువంశంలో భూమ్మీద విష్ణుమూర్తి కంటే ముందరే
జన్మించమని చెప్పాడు. ఆ తరువాత విష్ణువు వసుదేవుడికి కొడుకై పుట్టి భూభారాన్ని
తగ్గిస్తాడని చెప్పాడు. దేవతా స్త్రీలంతా శ్రీహరికి సపర్యలు చేయడానికి సుందర
రూపంలో పుట్టాలనీ, ఆదిశేషుడు ఆయనకు
అగ్రజుడిగా జన్మిస్తాడని కూడా చెప్పాడు.
ఆ సమయంలో శూరసేనుడనే యాదవరాజు మధుర రాజధానిగా రాజ్యపాలన చేస్తున్నాడు. ఆయన
కొడుకు వసుదేవుడు దేవకీదేవిని పెళ్లి చేసుకుని, ఆమె అన్న,
ఉగ్రసేనుడి కుమారుడు కంసుడు స్వయంగా రథం తోలుతుంటే తన
ఇంటికి బయల్దేరాడు. ఇంతలో అశరీరవాణి, కంసుడిని హెచ్చరిస్తూ, ఆయన సోదరికి పుట్టబోయే
ఎనిమిదవ కుమారుడు ఆయన్ను సంహరిస్తాడని చెప్పింది. వెంటనే చెల్లెలిని రథం మీద నుండి
లాగి చంపడానికి సిద్ధపడ్డాడు. ఆ పని విరమించుకొమ్మని వసుదేవుడు బావ కంసుడిని
ప్రార్థించాడు. ఆమెకు పుట్టబోయే కొడుకులందరిని వరుసగా తెచ్చి కంసుడికి ఇస్తానని, వాళ్లను సంహరించమని చెప్పడంతో అంగీకరించి, చెల్లెలిని విడిచిపెట్టాడు. ఏడాదికి ఒకరిని చొప్పున దేవకీదేవి కన్న కొడుకులను
వసుదేవుడు అన్నమాట ప్రకారం కంసుడికి తెచ్చి ఇచ్చేవాడు. వారితో తనకు అవసరం లేదని, ఎనిమిదవ వాడిని తెచ్చి ఇమ్మని చెప్పాడు కంసుడు.
ఒకనాడు నారదుడు కంసుడికి దగ్గరికి వచ్చి, దేవతలే యాదవులుగా పుట్టారని, ఆయన కాలనేమి అనే
రాక్షసుడని చెప్పాడు. విష్ణుమూర్తి దేవకీదేవి పుత్రుడిగా పుట్టి కంసుడిని
సంహరిస్తాడని అన్నాడు. వెంటనే దేవకీవసుదేవులను పట్టి బంధించి, చెరసాలలో వేసి, అప్పటికి పుట్టిన ఆరుగురు
కొడుకులను సంహరించాడు. తన తండ్రి ఉగ్రసేనుడిని కూడా చెరసాలలో వేశాడు. యాదవులందరినీ
యుద్ధం చేసి ఓడించాడు.
దేవకీదేవి ఆరుగురు కొడుకులను కంసుడు చంపినా తరువాత ఏడవ గర్భంగా ఆదిశేషుడు
అనబడే విష్ణువు అంశ ఆనే గర్భంలో ప్రవేశించింది. విష్ణువు యోగామాయాదేవితో, దేవకీదేవి గర్భంలో వున్న ఆయన తేజస్సును నేర్పుగా తీసి వ్రేపల్లెలోని
రోహిణీదేవి గర్భంలో ప్రవేశపెట్టమని, ఆమెను నందుడి భార్య
యశోదకు కూతురుగా జన్మించమని ఆదేశించాడు. ఆయన ఆజ్ఞానుసారం యోగమాయ భూలోకానికి
వచ్చింది. విష్ణువు చెప్పినట్లే చేసింది. దేవకికి గర్భస్రావం అయిందని భావించారు
అంతా. కొన్నాళ్లకు రోహిణీదేవి బిడ్డను కన్నది. అతడిని బలభద్రుడని, రాముడని,
సంకర్షణుడని పిలవసాగారు.
ఆ తరువాత శ్రీమన్నారాయణుడి తేజస్సు దేవకీదేవి గర్భంలో ప్రవేశించింది.
పద్నాలుగు లోకాలను తన కడుపులో సంరక్షిస్తున్న శ్రీహరిని, గర్భంలో మోస్తున్న దేవకీదేవి ముఖ తేజస్సును చూసిన కంసుడు, విష్ణువు ఆమె గర్భంలో ప్రవేశించి వుండాలన్న నిర్ణయానికి వచ్చాడు. కంసుడు
ఎడతెగని విరోధం వల్ల నిరంతరం విష్ణు నామ స్మరణ చేస్తూ, బిడ్డ పుట్టగానే చంపడానికి ఎదురు చూడసాగాడు. తన శరీరాన్ని గడ్డిపోచ తాకినా అది
విష్ణు మూర్తేమో అని భయపడసాగాడు. సరిగ్గా అదే సమయంలో ఇంద్రాది దేవతలు, నారదాది మునులు, బ్రహ్మ, శివుడు,
దేవకీదేవి వున్నా చెరసాల వద్దకు వచ్చి, ఆమె గర్భంలో వున్న శ్రీమహావిష్ణువును స్తుతించారు. ఆయన జన్మించడం వల్ల భూదేవి
భారం తగ్గిపోతుందని, ఆయన పాదస్పర్శతో
భూలోకాన్ని ఆనందంగా చూడగలమని అన్నారు. భూభారాన్ని తొలగించమని ప్రార్థించారు.
స్తోత్రం చేసిన తరువాత బ్రహ్మాది దేవతలు, మునులు దేవకీదేవిని ఆశీర్వదించి వెళ్లిపోయారు.
ఈ నేపధ్యంలో, గ్రహనక్షత్రాలు అత్యంత
శుభ స్థానాలలో వుండగా దేవకీదేవి అర్ధరాత్రి సమయంలో కుమారుడిని కన్నది. దేవదేవుడు
ఉద్భవించాడు. ఆ బాలుడిని చూసిన వసుదేవుడు ఆ తేజస్సుకు ఆశ్చర్యపడి, మహోత్సాహాన్ని పొందాడు. అతడు తన బిడ్డ అని భావించకుండా, సాక్షాత్తు పరమాత్మగా భావించి స్తుతించాడు. కంసాది దానవులను సంహరించడానికి
అవతరించిన భగవానుడని స్తుతించాడు. అప్పుడే దేవకీదేవి కూడా ఆబాలుడిని తేరిపార
చూసింది. బాలుడిని భగవంతుడిగా గ్రహించి స్తోత్రం చేసింది.
దేవకీదేవి తనను స్తుతిస్తుంటే, శ్రీహరి తన నిజరూపంలో
ఆమెకు ఆమె పూర్వ జన్మ వృత్తాంతం చెప్పాడు. స్వాయంభవ మన్వంతరంలో ఆమె ‘పృశ్ని’ అనే
పరమ పతివ్రత అని, వసుదేవుడు ‘సుతపుడు’ అన్న
పేరుగల ప్రజాపతి అని అన్నాడు. వారి తపస్సుకు మెచ్చి తాను ప్రత్యక్షమై వరాలు
కోరుకొమ్మన్నప్పుడు తన లాంటి కొడుకు కావాలని కోరారని, అలాగే వరమిచ్చి, మొదట్లో ‘పృశ్నిగర్భుడు’
అనే పేరుతొ ఆమెకు జన్మించానని చెప్పాడు. వారు రెండవ జన్మలో అదితి, కశ్యపుడుగా పుట్టారని అప్పుడు వారికి అప్పుడు వామనుడిగా తాను జన్మించానన్నాడు.
మూడవ జన్మలో మల్లీ ఇప్పుడు పుట్టానన్నాడు. ఇక ముందు వారికి జన్మ లేదని కూడా
చెప్పాడు.
శ్రీహరి వసుదేవుడి కర్తవ్యాన్ని కూడా చెప్పాడు. అదే సమయంలో యశోదాదేవికి యోగమాయ
కూతురుగా జన్మించింది. వాసుదేవుడు నిమ్మడిగా బాలుడిని రొమ్మున అదుముకుని పురిటి
ఇంట్లో నుండి బయటకు వచ్చాడు. హరి మాయవల్ల తలుపుల తాళాలు విడివడ్డాయి. ఆదిశేషుడు
బాలుడికి గొడుగులాగా కప్పివున్నాడు. ముందుకు వెళ్తుండగా యమునానది అడ్డం వచ్చింది.
అది దారి ఇచ్చింది వసుదేవుడికి. యమునానదిని దాటి నందుడి వ్రేపల్లెలో ప్రవేశించాడు.
యశోదాదేవి పక్కన బాలకృష్ణుడిని పడుకోబెట్టి, యోగామాయను ఎత్తుకుని తిరిగి వచ్చి దేవకీదేవి పక్కన వుంచాడు. యశోదాదేవికి ఇదేమీ
తెలియదు.
చంటి బిడ్డ ఏడుపు విని ఆ విషయాన్ని కంసుడికి తెలియచేశారు కావలివారు. కంసుడు
వచ్చి ఆబిడ్డను చంపబోయాడు. ఆడపిల్ల కాబట్టి చంపవద్దని వేడుకుంది దేవకీ. వినకుండా ఆ
బాలికను ఎత్తి పట్టుకుని చంపబోయాడు కంసుడు. ఆ బాల కిందపడిపోకుండా, ఆకాశానికి ఎగిరింది. ఆమె దివ్యాయుదాలతో దర్శనం ఇచ్చింది. ‘నిన్ను చంపే వీరుడు
నాతోపాటుగా జన్మించి, ఒకచోట భద్రంగా
పెరుగుతున్నాడు’ అని పలికి అదృశ్యమైపోయింది. చింతాక్రాంతుడైన కంసుడు
దేవకీవసుదేవులను తనను క్షమించమని వేడుకున్నాడు. వారి పాదాలు పట్టుకున్నాడు.
దేవకీవసుదేవుల అనుమతి తీసుకుని కంసుడు ఇంటికి పోయాడు. కంసుడు యోగమాయ ద్వారా విన్న
వృత్తాంతాన్ని కొందరు మంత్రులకు చెప్పాడు ఏకాంతంగా.
ఇదిలా వుండగా అక్కడ వ్రేపల్లెలో నందుడు తనకు మగ పిల్లవాడు పుట్టినందుకు
సంబురాలు చేసుకున్నాడు. గోపకులంతా నందుడి కుమారుడిని చూడడానికి వెళ్లారు.
వసంతోత్సవం జరుపుకున్నారు. గోపయువతులు ఆ శుభవార్తను ఒకరితో మరొకరు పంచుకున్నారు.
వారంతా ఎంతో ఉత్సాహంతో ఆ పసివాడిని చూశారు. కానుకలిచ్చారు. పాటలు పాడారు. బాలుడు
కేరింతలు కొడుతూ ఆడుకోసాగాడు.
నందుడు పన్ను కట్టడం కోసం మథురకు పోయి, వాసుదేవుడి ఇంటికి వెళ్లి తగిన మర్యాదతో ఆయన్ను దర్శించాడు. ఆయన దగ్గర వున్నది
తన పుత్రుడేనని మెల్లగా చెప్పాడు. తన కొడుకు వాసుదేవుడి కొడుకే అనుకో అని
ఓదారుస్తూ అన్నాడు నందుడు. ఆ తరువాత బయల్దేరి వెళ్లిపోయాడు నందుడు.
(బమ్మెర పోతన శ్రీమహాభాగవతం, రామకృష్ణ మఠం ప్రచురణ ఆధారంగా)


No comments:
Post a Comment