బలరామకృష్ణుల బాల క్రీడా విన్యాసాలు
శ్రీ మహాభాగవత కథ-53
వనం జ్వాలా నరసింహారావు
సూర్యదినపత్రిక (22-09-2025)
కంII చదివెడిది భాగవతమిది,
చదివించును కృష్ణు, డమృతఝరి పోతనయున్
చదివినను
ముక్తి కలుగును,
చదివెద నిర్విఘ్నరీతి ‘జ్వాలా’ మతినై
గర్గ మహాముని వల్ల నామకరణం పొందిన బలరామకృష్ణులిరువురు బాల్యక్రీడలు
ఆరంభించారు. వచ్చీరాని ముద్దుమాటలు పలకడం మొదలు పెట్టారు. వారిని చూసి గోపకులంలో
వారంతా ఆనందించసాగారు. వీరి బాల్యక్రీడలు గమనించిన ఋషులంతా, ఇక త్వరలోనే తమకు మేలు
కలగబోతున్నదని సంతోషించారు. బాల్యక్రీడలలో భాగంగా వారిద్దరూ ఏం చేసినా చూడాలనే
తన్మయ భావం కలిగేది అందరికీ. శ్రీమహావిష్ణువు బాలకృష్ణుడి అవతారంలో తన లీలలు
చూపించసాగాడు. బాలలంతా చిన్ని కృష్ణుడిని తమ నాయకుడిగా భావించి భక్తితో చూసేవారు.
అల్లరి చేయవద్దని తల్లి యశోద బెదిరిస్తే చిన్ని కృష్ణుడు వెంటనే అలకను అభినయిస్తూ
దూరంగా వెళ్లిపోయేవాడు. గోపికల ఇండ్లలో వెన్నంతా తిని, తన ఇంటికి వచ్చి, ఏమీ తెలియనివాడిలాగా తల్లిదగ్గరికి చేరి బువ్వపెట్టమనేవాడు. గోపకుమారులతో
కలిసి రకరకాల క్రీడా విన్యాసాలను ప్రదర్శించేవాడు.
బాలకృష్ణుడు బాల్యదశను నటిస్తూ లీలలు చేస్తుంటే, ఆ అల్లరిని భరించలేని గోపకాంతలు సహనం నశించిపోగా యశోద
దగ్గరికి వచ్చి ఇలా మొరపెట్టుకునేవారు.
క: బాలురకు బాలు లేవని, బాలెంతలు మొరలు వెట్ట పకపక నగి యీ
బాలుం డాలము సేయుచు నాలకు గ్రేపులను విడిచె నంభోజాక్షీ!!
క: పడతీ! నీ బిడ్డడు మా, కడవలలో నున్న మంచి కాగిన పాలా
పడుచులకు బోసి చిక్కిన, కడవల బో నడిచె నాజ్ఞ గలదో లేదో?
క: ఆడం జని వీరల పెరు, గోడక నీసుతుడు ద్రావి యొకయించుక తా
గోడలి మూతిం జరిమిన, గోడలు మ్రుచ్చనుచు నత్త గొట్టె లతాంగీ!!
ఆవుల దూడలను వదిలేస్తున్నాడనీ, కడవలలో పాలు తోటి పిల్లలకు పోస్తున్నాడనీ, పెరుగు
తాగి కొంత కోడలు మూతికి రాసి పోతున్నాడనీ, ఒక ఇంటి కడవలు మరో ఇంట్లో పెడుతున్నాడనీ, చన్ను పట్టి
గీరేసి పారిపోతున్నాడనీ, పేరేమిటి బాబూ అని అడిగితె పెదవి కొరికాడనీ, స్నానం చేస్తున్న అమ్మాయి చీర
ఎత్తుకుపోయాడనీ, ఎత్తుకు పోతా వస్తావా అని ఆడపిల్లను అడుగుతున్నాడనీ, బిడ్డ జుట్టును లేగదూడ తోకకు కట్టాడనీ, గోపికల వెనుక చేరి
చేయకూడని పనులు చేస్తున్నాడనీ పిర్యాదు చేశారు. ఇంకా ఇలా అన్నారు:
క: ఓ యమ్మ ! నీ కుమారుడు, మాయిండ్లను బాలు బెరుగు మననీ డమ్మా !
పోయెద మెక్కడి కైనను మా యన్నల సురభులాన మంజుల వాణీ !
తమ ఇళ్లలో పాలుగాని, పెరుగు గాని ఉండనీయడం లేదని, ఆవుల సాక్షిగా తామెక్కడికైనా పోతామని, ఇక్కడైతే వుండలేమని, తమకు వేరే దారి తోచడం లేదని యశోదతో చెప్పుకున్నారు
గోపకాంతలు. అలా తన చిన్ని కృష్ణుడి మీద అభియోగాలు మోపుతున్న గోపికలతో యశోదాదేవి,
“ఓ గోపికలారా! చిన్ని కృష్ణుడు ఎక్కడికీ పోకుండా నా దగ్గరే కూర్చుని పాలు
తాగుతున్నాడు. మా కన్నయ్య నన్ను విడిచి పోనేపోడు. పొరుగింటికి పోయే మార్గం కూడా
ఎరుగడు. ఇలాంటి పసిబిడ్డను పట్టుకుని అల్లరి చేయడం మీకు తగదు. నా బిడ్డకు ఏమీ
తెలియదు. నా బిడ్డమీద నిందలు మోపకండి” అని అన్నది. గోపికలను సమాధానపరచి పంపించిందే
కాని కొడుకును మందలించ లేదు. గోపికలు తన మీద పిర్యాదు చేస్తుంటే చిన్ని కృష్ణుడు
ఏమీ తెలియని అమాయకుడిలాగా, తనలో ఎలాంటి కపటం కనబడనీయకుండా తల్లి రొమ్ముకు తల
ఆనించి ముచ్చటగా ఆడుకోసాగాడు.
ఇదిలా వుండగా ఒకనాడు, బలరాముడు, తోటి గొల్లపిల్లలతో కలిసివచ్చి, కృష్ణుడు మన్ను తిన్నాడని తల్లి యశోదకు చెప్పాడు. మన్నెందుకు తిన్నావని తల్లి
కొడుకును చెయ్యి పట్టుకుని ప్రశ్నించింది. తాను మన్ను తినడానికి పసిబిడ్డను కాననీ, ఆకలితో కూడా లేననీ, తాను వెర్రివాడిని కాననీ, వాళ్ల మాటలు నమ్మవద్దనీ, తనను ఆమెతో కొట్టించాలని వారు అలా చెప్పుతున్నారనీ, తాను చెప్పేది తప్పో-ఒప్పో తన నోరు చూసి చెప్పమనీ, అప్పుడు దండించమనీ అంటూ లీలామానుష విగ్రహుడైన ఆ కృష్ణుడు
తన నోరు తెరిచి చూపించాడు తల్లి యశోదాదేవికి.
అప్పుడి యశోదకు కృష్ణుడి నోటిలో సముద్రాలు, పర్వతాలు, అరణ్యాలు, భూమండలం, అగ్ని, సూర్యుడు, చంద్రుడు, అష్టదిక్పాలకులు మొదలైన వారితో కూడి వున్న బ్రహ్మాండం
మొత్తం కనిపించింది. చూసి విభ్రాంతురాలై ఇలా అనుకున్నది:
మ: కలయో ! వైష్ణవ మాయయో ! యితర సంకల్పార్థమో ! సత్యమో!
తలపన్ నేరక యున్నదాననొ ! యశోదాదేవి గానో ! పర
స్థలమో ! బాలకుండెంత ! యీతని ముఖస్థంబై యజాండంబు ప్ర
జ్వలమై యుండుట కేమి హేతువొ ! మహాశ్చర్యంబు చింతింపగన్!
చిన్న పిల్లాడేమిటి, అతడి నోట్లో బ్రహ్మాండం కనిపించడం ఏమిటి! అనుకుంది. ఇతడు
బాలుడిలా కనిపిస్తున్న శ్రీమహావిష్ణువే! ఇది యథార్ధం అని మనసులో నిశ్చయించుకుని
అతడిని స్తుతించింది. ఆమెలో వైష్ణవ మాయను ఆవరింపచేశాడు కృష్ణుడు. కాసేపట్లో ఆ
మాయనుండి తేరుకుని, కొడుకు సర్వాత్మకుడనే విషయం మరచిపోయింది. బాలుడిని తన ఒడిలో
కూచోబెట్టుకుని వేడుకగా బుజ్జగించింది.
(బమ్మెర పోతన శ్రీమహాభాగవతం, రామకృష్ణ మఠం ప్రచురణ ఆధారంగా)


No comments:
Post a Comment