వత్సారుర, బకాసుర, అఘాసుర రాక్షసుల సంహారం
శ్రీ మహాభాగవత కథ-54
వనం జ్వాలా నరసింహారావు
సూర్యదినపత్రిక (29-09-2025)
కంII చదివెడిది భాగవతమిది,
చదివించును కృష్ణు, డమృతఝరి పోతనయున్
చదివినను
ముక్తి కలుగును,
చదివెద నిర్విఘ్నరీతి ‘జ్వాలా’ మతినై
ఒకరోజున యశోదాదేవి పెరుగు చిలికే నిమిత్తం, స్తంబం దగ్గర కదలకుండా పెట్టిన
కడవలో మీగడ పెరుగు పోసి, తాడును కవ్వానికి తగిలించి చిలకడం మొదలుపెట్టింది. సరిగ్గా అదే సమయంలో
బాలకృష్ణుడు ఆమె చుట్టూ తిరుగుతూ, ఏడుస్తూ, పాలు కావాలని మారాము చేస్తూ, కవ్వం పట్టుకున్నాడు. అప్పుడు యశోదాదేవి బాలుడిని
ఎత్తుకుని పాలివ్వసాగింది. పొయ్యి మీద పెట్టిన పాలు పొంగడం గమనించిన యశోద
చిన్నికృష్ణుడిని దింపి, లోపలి వెళ్లి వచ్చేలోపు, పెరుగు కుండను పగలకొట్టి, వెన్నతిని, పరుగెత్తిపోయాడు. అతడిని వెతుకుతూ
పోయిన యశోదకు, వేరొక ఇంటిలో ఉట్టిలో వున్న వెన్నను ఒక కోతికి తినిపిస్తున్న కొడుకు
కనిపించాడు. ప్రత్యక్షంగా కొడుకు అల్లరిని చూసిన యశోద, ఒక బెత్తం చేతిలో తీసుకుని
అతడిని బెదిరించింది. భయపడ్డట్లు నటిస్తూ కృష్ణుడు వేగంగా పరుగెత్తసాగాడు.
యశోదాదేవి అతడి వెంట పరుగెత్తింది.
మొత్తానికి వెన్న దొంగ కాస్తా పట్టుబడ్డాడు. అతడిని కట్టివేయాలని భావించింది
తల్లి. అందరూ చూస్తుండగా అక్కడే వున్న ఒక రోటికి కట్టేసింది. అలా తల్లైన యశోద
చేతిలో రోటికి చిక్కుకున్నాడు లీలామానుష విగ్రహుడు కృష్ణుడు. తన ముద్దుల కొడుకును
కట్టివేయడానికి తెచ్చిన తాడు నడుముకు చుట్టితే రెండు అంగుళాలు తక్కువైంది. ఎన్ని
తాళ్లు తెచ్చినా రెండు అంగుళాలు తక్కువే వుంది. తల్లి పడుతున్న శ్రమకు, ఆమె వళ్లంతా చెమటలు పోయడం గమనించిన కృష్ణుడు ఆమెను
కరుణించాడు. అలా యశోదాదేవి చిన్నికృష్ణుడిని కట్టేసి తిరిగి ఇంటి పనుల్లో మునిగి
పోయింది.
బాలుడు తమ పెరటిలో వున్నా మద్దిచెట్లవైపు చూశాడు. నారద శాపం వల్ల జంట మద్ది చెట్లుగా
వున్న నలకూబర, మణిగ్రీవులను చూసి, వారివైపుకు రోలును ఈడ్చుకుంటూ వెళ్లాడు. వాళ్లకు శాపవిమోచనం చేయాలనుకున్న
కృష్ణుడు మద్దిచెట్లను కూలదోయాలని నిర్ణయించుకుని, ఆలశ్యం చేయకుండా అక్కడికి రోటిని లాక్కుంటూ వెళ్లాడు. ఆ
రెండు చెట్ల మధ్యగా వెళ్లాడు. అలా వెళ్లి రోలును అడ్డంగా లాగేసరికి, శాపం తొలగిన మద్దిచెట్లు వేళ్లతో సహా పెకిలించబడి, భయంకర ధ్వనితో నేలకూలాయి. ఆ క్షణంతో వారి శాపం
తీరిపోయింది. వాటిలో నుండి ఇద్దరు సిద్ధపురుషులు బయటకొచ్చారు. బాలకృష్ణుడికి
నమస్కారం చేసి, స్తుతించారు. నారద మహర్షి అనుగ్రహం
వల్ల తన దర్శనం వారికి లభించిందని అన్నాడు కృష్ణుడు. కృష్ణుడి ఆజ్ఞ తీసుకుని
ఇద్దరు వెళ్ళిపోయారు.
ఈ విధంగా కృష్ణుడు అనేక విధాలుగా తన లీలలను ప్రదర్శిస్తూ, తోటి పిల్లలతో కాలం గడుపుతున్నాడు. వ్రేపల్లెకు చేరువన
వున్న బృహద్వనం కలిసిరాలేదని, ఇంకొక క్షేమకర ప్రదేశానికి పోదామని గొల్లపెద్దలు నిర్ణయించారు. బృందావనానికి
వెళ్లితే బాగుంటుందనుకున్నారు. పెద్దలు, పురోహితులతో కలిసి అంతా పావనమైన బృందావనానికి బయల్దేరి, అక్కడికి చేరారు. బృందావనం చేరిన బలరామకృష్ణులు ఉత్సాహంగా
తమ ఈడు పిల్లలతో కలిసి దూడలను కాయసాగారు. బాల్యక్రీడలు యథావిధిగా కొనసాగించారు.
ఇలా కొంతకాలం గడిచాక ఒకరోజున యమునా నదీతీరంలో బలరామకృష్ణులు దూడలను మేపుతుండగా,
వాళ్లను సంహరించడం కోసం ఒక రాక్షసుడు దూడ రూపంలో అక్కడికి వచ్చి చేరాడు. మంచిదూడ
అన్నట్లుగా సంచరించాడు.
కృష్ణుడు ఆ రాక్షసుడిని గుర్తుపట్టి బలరాముడికి చెప్పాడు. దాని కాళ్లను, తోకను
గట్టిగా పట్టుకుని పైకెత్తి, అక్కడే వున్న వెలగచెట్టుకేసి ఒక్కసారి కొట్టగా ఆ దెబ్బకు ఆ రాక్షసుడు
చచ్చిపోయాడు. ఆ విధంగా ఆడుతూ-పాడుతూ వత్సాసుర వధ చేశాడు. మరో రోజున గోపకుమారులంతా
ఒక కొలనులో నీరు తాగి వస్తుంటే, ఒక కొంగ కనిపించింది. కొంగ వేషంలో వున్న బకాసురుడనే ఆ రాక్షసుడి ఉద్దేశం
కృష్ణుడిని సంహరించడమే! బాలకృష్ణుడు దగ్గరికి రాగానే అమాంతంగా ఒడిసి పట్టి
మింగేశాడు ఆ రాక్షసుడు. అలా మింగబడ్డ కృష్ణుడు పూర్తిగా కడుపులోకి పోకుండా గొంతు
దగ్గరే వుండిపోయాడు. తాపాన్ని భరించలేని రాక్షసుడు కృష్ణుడిని బయటకు నెట్టి, తన ముక్కుతో చంపడానికి ప్రయత్నం చేశాడు. దాని
ముక్కుపుటాలను పట్టుకుని గడ్డిపోచను చీల్చినట్లు రెండుగా చీల్చాడు కృష్ణుడు. అలా
బకాసురుడి వధ జరగగానే గోపబాలకులు అతడికి కౌగలించుకున్నారు.
ఒకనాడు గోపబాలకులతో చెట్టాపట్టాలేసుకుని బాలకృష్ణుడు ఆడుతున్నాడు. ఆ సమయంలో
కంసుడు పంపగా, కృష్ణుడు చంపిన బకాసురుడి తమ్ముడు అఘాసురుడు, అన్నను చంపినవాడిని
చంపాలని బయల్దేరాడు. అతడు భయంకరమైన కొండ చిలువ రూపాన్ని ధరించాడు.
చిన్నికృష్ణుడిని మింగాలని కాచుకుని దారిలో వేచిచూడసాగింది. గోపబాలురు దాన్ని
చూశారు. కృష్ణుడి చేతిలో అది కూడా చావడం ఖాయమని వారంతా అనుకున్నారు. అంతా ఆ
కొండచిలువ నోటిలో చేరుకున్నారు. అందరినీ లోపలి లాగి మింగడానికి ప్రయత్నిస్తున్న ఆ
కొండచిలువ గొంతు దగ్గర తన శరీరాన్ని విపరీతంగా పెంచాడు. దానితో దానికి ఉపిరి
అందలేదు. భయంకర శబ్దం చేస్తూ కొండచిలువ చనిపోయింది. గోపబాలకులంతా దాని నోట్లో
నుండి బయటకు వచ్చారు.
అఘాసురుడిని చంపిన తరువాత అంతా కలిసి చాలా దూరం వెళ్లారు. అక్కడ ఒక కొలను చూసి
దాంట్లో నీళ్లు తాగుదామనుకున్నారు. దూడలకు కూడా ఉత్సాహంగా నీళ్లు తాగించారు. ఒకచోట
కూర్చుని, వారు తెచ్చుకున్న చల్ది చిక్కాలను
తినడానికి విప్పారు. కృష్ణుడు వారందరితో కలిసిమెలిసి నవ్వుతూ, నవ్విస్తూ, వినోదంగా భుజించాడు. అప్పుడు దూడలన్నీ పరుగెత్తిపోయి ఎక్కడో మేస్తున్నాయి.
వాటిని వెతికి తీసుకువస్తానని చెప్పి శ్రీకృష్ణుడు బయల్దేరాడు.
(బమ్మెర పోతన శ్రీమహాభాగవతం, రామకృష్ణ మఠం ప్రచురణ ఆధారంగా)


No comments:
Post a Comment