Thursday, October 2, 2025

వ్యక్తిత్వ వికాసం, జీవన పాఠాలు, స్వీయానుభవాల పరిపక్వత (ప్రత్యేకవ్యాసం)-1 : జీవనశైలి దృక్కోణంలో నిరంతరం మారుతున్న నేను-1

 వ్యక్తిత్వ వికాసం, జీవన పాఠాలు, స్వీయానుభవాల పరిపక్వత (ప్రత్యేకవ్యాసం)-1

జీవనశైలి దృక్కోణంలో నిరంతరం మారుతున్న నేను-1

వనం జ్వాలా నరసింహారావు

          నిరంతరం మార్పు కోరుకునేదే జీవితం, జీవనయానం. వ్యక్తిగతంగానూ, కుటుంబపరంగానూ, సమాజపరంగానూ మార్పు తన ప్రభావాన్ని కనపరిచినప్పటికీ, ప్రతివ్యక్తి మూలాలను మరచిపోకుండా, అనాదిగా వెన్నంటి, తమతోనే వస్తున్న సంస్కృతీ సంప్రదాయ విలువలను, ఆచార వ్యవహారాలను, విస్మరించకుండా జీవనయానం సాగిస్తే, ఒక అర్థం, ఆదరణ, నైతికత, సార్థక్యం ఉంటుంది. తరతరాలుగా అందిపుచ్చుకున్న సదాచారాలను, సామాజిక, కుటుంబ సంస్కృతిని, నైతిక పాఠాలను, విలువలను, మనముందు తరాలనుండి మనం అర్థం చేసుకున్న విధంగానే, నేటి తరాలు కూడా, కొంతలో కొంతైనా అర్థం చేసుకుని, కాలానుగుణంగా మలుచుకుని, భావితరాలకు అందచేస్తే, జీవితం సుసంపన్నంగా, సమగ్రంగా, ఆనంద దాయకంగా, ఆహ్లాదకరంగా, అర్థవంతంగా, నలుగురికి ఉపయోగపడేలా మారుతుంది.

నాతో సహా, ఆరుతరాల వ్యక్తులను ఎరిగిన నాకు, ఇలా చెప్పడం, చెప్పాల్సి రావడం, కేవలం వ్యక్తిగత జీవనయాన అనుభవ సారాంశం మాత్రమే కాదు. ఒక తరం నుంచి మరొక తరానికి పయనించే విలువల చరిత్ర. గతాన్ని గుర్తుచేస్తూ, వర్తమానాన్ని ప్రతిబింబిస్తూ, భవిష్యత్తుకు దారిచూపే సజీవ వారసత్వపాఠం. మా కుటుంబంలో జరిగే శుభకార్యాలలో, మా ఆచారాల వారసులైన కూతుళ్లు బుంటి, కిన్ని, కూతురుతో సమానమైన కోడలు పారుల్, మా శ్రీమతి సూచనల్ని తుచ తప్పక పాటించి, అనాదిగా పాటిస్తూ వస్తున్న ఆచారాలను, దశలవారీగా, కాలానుగుణంగా కొద్ది మార్పులతో నిబద్ధతగా అంగీకరించడం, అమలుపరచడం, తృప్తినిచ్చేది. ఆక్షణం నాకు, బాల్యాన్ని, యవ్వనాన్ని, వైవాహిక జీవితాన్ని గుర్తుకు తెచ్చేవి. భవిష్యత్ దర్శనం కలిగేది. అలాగే మా శ్రీమతి వదినగారైన కరుణ సహస్ర చంద్ర దర్శనం నిరాడంబర పండుగ విషయంలో కూడా.

నా చిన్ననాటి జ్ఞాపకాలు, అలనాటి భావనలే ఎప్పటికీ నాకు ప్రేరణ. నిప్పులమీద నీళ్లు చల్లుకుని, పనివాడు తెచ్చిన మంచినీళ్లలో చల్ల చుక్క వేసి శుద్ధి చేసుకునే సనాతన ఛాందస ఆరువేల నియోగి బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి, పెరిగాను. పెరుగుతున్న దశలో చాంధస భావజాలాన్ని తుడిచి వేయకుండానే, గ్రామంలో మా ఇంటికి ఆనుకునే వున్న దళితవాడల్లో, ఆ పక్కనే వున్న ముస్లిం ఇండ్ల పరిసరాలలో స్వేచ్ఛగా తిరిగాను. చుట్టుపక్కల గ్రామాలలోని మార్కిస్ట్-కమ్యూనిస్ట్ బంధుమిత్రుల మధ్య మెలిగాను. ఛాందసత్వానికీ, సమసమాజానికీ, కమ్యూనిజానికీ సమీపంగా, సమాన దూరంలో పెరిగి పెద్దవాడినైనందున, ఇప్పటికీ ఈ సిద్ధాంతాలలో ఏవీ పూర్తిగా ఆచరించలేక పోయినా, వదలలేక పోయినా, వల్లమాలిన అభిమానం అంతే వుంది.  

ఈ సిద్ధాంతాలలోని మంచిని ఎలా కలిపి, చెడును ఎలా విడదీసి అర్థంచేసుకోవాలన్న తపన అనునిత్యం వెంటాడుతూ, వేధిస్తుంటుంది. ఈ విషయాలను నేను అర్థంచేసుకున్నంతవరకు, హితులకు, సన్నిహితులకు, మేథావులకు, బంధువులకు, కుటుంబ సభ్యులకు, ఆధ్యాత్మిక నిష్ణాతులకు, కమ్యూనిస్ట్ కామ్రేడ్స్ కు, తెలియచెప్పే ప్రయత్నం చేసినప్పుడల్లా, సరిగ్గా చెప్పలేక పోతున్నానేమోనన్నభావన, వారు కూడా నన్ను సరిగ్గా అర్థం చేసుకోవడంలేదేమోనన్న అనుమానం, అసంతృప్తి మిగిలిపోయింది. ప్రయత్నాలు మానలేదు.

వందశాతం గ్రామీణ వాతావరణంలో, నేపధ్యంలో, పుట్టి పెరిగిన నేను, పరిసర భౌగోళిక, ఆధ్యాత్మిక, చారిత్రక నేపథ్యాలకు అనుగుణంగానే, తొలినాళ్ల జీవనయాన పాఠాలు నేర్చుకున్నాను. అలా నేర్చుకున్న అనుభవాల జ్ఞాపకాలు, జ్ఞాపకాల అనుభవాలు, అనుక్షణం గుర్తుకొస్తూనే వుంటాయి. మరిచి పోదామన్నా మరవలేని, మధురమైన, చేదు-తీపి మధురానుభూతులవి. ప్రతి అనుభవం వెనుక, ప్రతి జ్ఞాపకం వెనుక, జీవితంలో నేర్చుకున్న ప్రతి విషయం కళ్లకు కట్టినట్లు దర్శనమిస్తుంది. వేదోక్త కర్మసిద్ధాంతం, భారత, భాగవత, రామాయణ సనాతన ధర్మ సిద్ధాంత సారాంశంలాంటివి మా నాన్నగారు మధ్యాహ్న భోజనానంతరం (విశ్రాంతి తదుపరి) పక్కన కూచోబెట్టుకుని వివరించడం, అయిష్టంగానే నాలో అవి చొరబడడం, నా ప్రమేయం లేకుండా పరోక్షంగా కదిలించడం, నా జీవనయానంలో ఒక మేలుమలుపు. 77 సంవత్సరాల వయస్సు పూర్తి చేసుకుని, ఇటీవలే 78 ఏట అడుగుగుపెట్టిన నాలో అవి సజీవవాహినిగా, నా మనోఫలకం మీద చెరగని ముద్రవేశాయి.  

ఎనభై సంవత్సరాల వయస్సులో మరణించిన నాన్న వనం శ్రీనివాసరావు గారు, బాల్యంలో నేర్పిన తొలి పాఠాలలో, చెరిపినా చెరగని నమ్మకాలున్నాయి. గుడ్డి నమ్మకాలూ వున్నాయి. ఆయన చదివింది ఏడవ తరగతి వరకే అయినా, పురాణాలనుండి, ఇతిహాసాలనుండి మాత్రమే కాకుండా, జీవితం నేర్పిన అనుభవంతో వర్తమాన చారిత్రక నేపధ్య గాధలనుండి, నైజాం నవాబుల పరిపాలనా నేపధ్యం నుండి, ఎన్నో విషయాలను చెప్పేవారు. మానవ విలువలకు మారుపేరైన బుద్ధుడు, ఆరునూరైనా అసత్యమాడని యుధిష్టరుడు, స్వధర్మ నిర్వహణే ధర్మమన్న శ్రీరామచంద్రమూర్తి, కర్తవ్య బోధన చేసిన శ్రీకృష్ణుడు, సనాతన ధర్మాలను ధర్మరాజుకు వివరించిన భీష్ముడు, అహింసే మతమన్న గాంధీ మహాత్ముడు, నాన్న చెప్పిన పాఠాల్లో తరచుగా వినిపించిన పేర్లు. బాల్యంలోనే, అలా, అలా, ‘కర్మ సిద్ధాంతం’ అంటే, ‘సనాతన ధర్మం అంటే కొంచం అర్థం చేసుకున్నాను.

హిందూత్వం అనేది మనిషి జీవించడానికి తగినటువంటి ఆదర్శమైన జీవనవిధానం అన్న విషయం చిన్నతనంలోనే ప్రభావితుడిని చేసింది. పెరిగి పెద్ద వాడినయ్యాను. పుట్టుకతో హిందువునైన నేను, ప్రతిరోజో, నెలకోమారో, ఏడాదికొకసారో తప్పనిసరిగా గుడికెళ్లాలన్న నియమనిబంధనలు ఎప్పుడూ పాటించలేదు. అలా అని గుడికి వెళ్లకుండా వుండలేదు. ప్రతి సంవత్సరం ఏమాత్రం వీలున్నా తిరుపతికి వెళ్లి వస్తుంటాను. నమ్మిన, నమ్ముతున్న ఆచార వ్యవహారాలను తప్పకుండా గౌరవిస్తాను, పాటిస్తుంటాను. భార్య, పిల్లల నమ్మకాలనూ, పద్దతులనూ అంగీకరిస్తాను. గుడిలోకి పోయినా, పోకపోయినా, వెళ్లే మార్గంలో గుడివుంటే, వీలున్నప్పుడల్లా దానిముందరనుంచే పోతాను. బయటనుంచే దేవుడికి దండం పెట్టుకుంటాను.

జీవితంలోని వాస్తవ పాఠశాల (విధ్యాభ్యాస) దశలోకి ప్రవేశించడానికి నన్ను సిద్ధంచేసిన ఉపనయనంలో మా నాన్నగారు గురువు శిష్యుడికి ఉపదేశించిన విధంగా, ‘గాయత్రీ’ మంత్రాన్ని, ఆ తరువాత కొంతకాలానికి ‘ఓం నమో నారాయణాయ అక్ష్టాక్షరీ మంత్రాన్ని, సమయం దొరికినప్పుడల్లా, ఏ పనిచేస్తున్నా, నిల్చున్నా, కూచున్నా, పడుకున్నా పఠిస్తుంటాను. దాన్ని జపం చేయడమని అంటారో, ఇంకేమైనా అని అంటారో, నేనెప్పుడు ఆలోచించలేదు. రాజీపడకుండా అవి చేస్తూ వస్తున్నాను. ఏదో ఒక అనిర్వచనీయమైన శక్తి, ఇవన్నీ మనతో చేయిస్తున్నదని ఓ (గుడ్డి) నమ్మకం కలిగింది.

అయితే, ఈ నమ్మకాలేవీ, మార్క్సిజం-కమ్యూనిజం వైపు ఆకర్షితుడను కాకుండా చేయలేకపోయాయి. ఆ సిద్ధాంతాన్ని అధ్యయనం చేయకుండా ఆపలేకపోయాయి. మరో అనిర్వచనీయమైన శక్తి ఆ దిశగా లాగిందేమో నన్ను. బాల్యంలో నేను పెరిగిన మరో కోణంలోని పరిసరాలే దీనికి కారణం కావచ్చు. నాన్నగారు చెప్పిన పాఠాల్లో హిందూత్వ కర్మ సిద్ధాంతం ఇమిడివుంటే, పక్క వూళ్లోని బాబాయి చెప్పిన పాఠాల్లో కమ్యూనిజానికి సంబంధించిన (గతితార్కిక భౌతికవాద) కర్మ సిద్ధాంతం ఇమిడి వుందని తెలుసుకున్నాను. ఆధునిక ప్రపంచంలో మానవ విలువలకు నూటికి నూరుపాళ్లు అద్దంపట్టిన అతి గొప్ప సిద్ధాంతం ‘మార్క్సిజం-కమ్యూనిజం.’ అంచలంచెలుగా నేర్చుకున్న పాఠాలు, వివిధ కోణాలలో అర్థం చేసుకునేందుకు దోహదపడ్డాయి.

వాస్తవానికి, మానాన్నగారి దగ్గర శిష్యరికం చేసిన తరువాత, ఆయన దగ్గర నేర్చుకున్న విషయాల సమాహారాలైన పురాతన ఆధ్యాత్మిక గ్రంథాలను చదవడం, శిష్టవ్యావహారిక భాషలో పదుగురితో నా పుస్తకాల ద్వారా పంచుకోవడం జీవితంలో ఆలస్యంగా ప్రారంభమైంది. ఐదుపదుల వయసు చివర్లో ఆ విధంగా కొద్ది జ్ఞానం, మెదడుకు ఆహారం లభించింది. నాన్నగారి ప్రవచనాలు ఇప్పటికీ నన్ను వెంటాడుతుంటాయి. అలాగే నేను స్వయంగా చదవడం ప్రారంభించిన తరువాత, వాటిలో నేను శాంతి, ధైర్యం, ఆత్మస్థైర్యం పొందాను. భారతీయ సంస్కృతీ నిర్మాణదృష్టిని, ఋషి సాహిత్యాన్ని విశిష్టంగా పేర్కొన్న విదేశీ పరిశీలకుల పరిశీలనలను కూడా అధ్యయనం చేశాను. వారి అభిప్రాయాలు నా అనుభవంతో సహజంగా కలిసిపోయాయని భావించాను. భారతీయ సంస్కృతి, పురాతన సంప్రదాయాలు సహనంతో కాలాన్ని అధిగమించాయి. సనాతన ధర్మం ఒక నిరంతర చక్రంలా, సృష్టి రహస్యాన్ని వివరిస్తూ, విశ్వాన్ని నిలుపుతూ, పునర్నిర్మాణం చేస్తున్నది. తరతరాలుగా విలువలు, నైతికత, సంప్రదాయ జీవన విధానం వ్యక్తులతో సహజీవనం చేస్తూ వచ్చాయి.

ఇదే సమయంలో మార్క్సిజం ఒక మరింత భిన్నమైన, భౌతికవాదపరమైన నిర్దేశాన్ని ఇచ్చింది. మార్క్స్ భావజాలం ద్వారా మానవతా దృష్టికి బలమైన వాదనను కనిపెట్టవచ్చనే నమ్మకం ఏర్పడింది. వేదాచార్య దృష్టి ఒక వైపు, మార్క్సియన్ విశ్లేషణ మరొక వైపు, ఈ ఘర్షణ, ఎట్టకేలకు సంపూర్ణమైన దృష్టిని దాదాపు ప్రసాదించింది. మన పురాతన గ్రంథాలు ఒక ‘అక్షయపాత్ర’లా, అపార జ్ఞానసంగ్రహాలుగా, సమాహారాలుగా అనిపించాయి. పెద్దల నుంచి విన్నదో, ప్రవచనాల్లో పొందినదో లేదా స్వయంగా చదివినదో, ఎదైనాకానీ, అటువంటి కొద్దిపాటి జ్ఞానం కూడా పాఠం అవుతుంది. అలాగే, ఆలోచన లేకుండా పద్ధతులుగా పాటిస్తే అవి అంధవిశ్వాసంగా మారతాయి. మనిషి జీవించడానికి హిందుత్వం ఎలా అనువైన జీవనవిధానమో, అలాగే మానవ విలువలకు నూటికి నూరుపాళ్లు అద్దంపట్టిన అతి గొప్ప సిద్ధాంతం ‘మార్క్సిజం-కమ్యూనిజం.’ మానవ విలువలకూ, ఛాందసత్వానికీకమ్యూనిజానికీ, గతితార్కిక భౌతికవాదానికీకర్మ సిద్ధాంతానికీ అనిర్వచనీయమైన అనుబంధం వుందన్న నమ్మకం కలగసాగింది.

 కర్మ సిద్ధాంతం ప్రకారంఈ సకల చరాచర ప్రపంచమంతటికీభూతకాలంలో జరిగిన దానికీ, వర్తమానంలో జరుగుతున్న దానికీ, భవిష్యత్ లో జరగబోయే దానికీకర్త, కర్మ, క్రియ ఒక్కడే. ఏ పనినిఎప్పుడు, ఎలా, ఎవరి ద్వారా జరిపించాలోజరిగినదాని పర్యవసానం ఏమిటో, నిర్ణయించే అధికారం ఒకేఒక్క జగన్నాటక సూత్రధారికి వుంటుంది. సృష్టించేది బ్రహ్మనీసంహరించేది రుద్రుడనీకాపాడుతుండేది విష్ణుమూర్తనీ అనుకుంటాం. వాస్తవానికి, అనంతకోటి బ్రహ్మాండానికి ‘పరబ్రహ్మం’ ఒక్కరే. ఆ ‘జగన్నాటక సూత్రధారి’కి సమానులు గానీఅధికులు గానీ ఎవరూలేరు. గడ్డి పోచ కదలాలన్నా ఆ ఒక్కరే కారణం. సృష్టికొక అధికారినీ (బ్రహ్మ)సంహరించడానికి ఒక అధికారినీ (రుద్రుడు) నియమించింది ఆ ఒక్కరే. వారు నిమిత్తమాత్రులే. ‘జగన్నాటక సూత్రధారి’ రచించి, నిర్మించి, దర్శకత్వం వహించిన భారీ సెట్టింగుల నిడివిలేని అద్భుతమైన నాటకంలోసకల చరాచర ప్రపంచంలోని జీవ, నిర్జీవ రాసులన్నీ తమవంతు పాత్ర పోషిస్తాయి. ఎవరికి ఏ పాత్ర ఇస్తేదాన్ని వారు ఆ సూత్రధారి నిర్ణయం మేరకే పోషించి, ఆగమన్నప్పుడు ఆగిపోవాలి.  మానవులైతే జీవితం చాలించాలి. తర్వాత ఏంజరుగుతుందనేది ఉహాజనితం.

నిశితంగా పరిశీలిస్తేకార్ల్ మార్క్స్ నిర్థారితవాద సిద్ధాంతంలో ఇలాంటి అంశాలే ఇంచుమించు కనిపిస్తాయి. కర్మసిద్ధాంతంలో మాదిరిగానేజరిగినదానిని (భూతకాలం) విశ్లేషించిజరుగుతున్నదానిని (వర్తమానకాలం) వ్యతిరేకించిజరగాల్సినదాన్ని (భవిష్యత్ కాలం) ముందుగానే నిర్ణయించాడు. ‘గతితార్కిక భౌతిక వాదం అనే ఆ సిద్దాంతాన్ని, ‘యాంటీ థీసిస్‌థీసిస్‌సింథసిస్’ అని పిలిచాడు. ఈ సిద్ధాంత సృష్టికర్త కార్ల్ మార్క్స్వేళ్లూనుకున్న వ్యవస్థకు వ్యతిరేకంగా జరుగుతుందని భావించిన వర్గపోరాటంలోఎవరి పాత్ర ఏమిటో ఆయనే నిర్దారించాడు. పాత్రను పోషించే విధానం కూడా ఆయనే వివరించాడు. కార్మిక, కర్షక రాజ్య స్థాపన తదనంతర పరిణామాలెలా వుండాలో, వుండబోతాయో కూడా ఆయనే నిర్ణయించాడు. మార్క్స్ ప్రవచనాలకుతదనుగుణంగా సంభవించిన సోవియట్ రష్యా - చైనా విప్లవానికిశ్రామిక రాజ్య స్థాపన జరగడానికి వేలాది సంవత్సరాల పూర్వమేవాల్మీకి మహర్షి సంస్కృతంలో రామాయణం రచించాడు.. రామాయణంలోని పాత్రలను, చేయబోయే పనులను ముందుగానే యోగదృష్టితో కనిపెట్టాడు వాల్మీకి. మార్క్స్ కోరుకున్న ‘శ్రామిక, కార్మిక, కర్షక’ రాజ్యమే రావణ వధానంతరం ఏర్పడిన ‘రామ రాజ్యం.’ కాకపోతే మార్క్స్ చెప్పడానికి వేలాది సంవత్సరాల క్రితమే వాల్మీకి చెప్పాడు.  

ఈ ప్రతికూల, అనుకూల, ప్రతికూలానుకూల ఆలోచనల, అనుభవాల, పాఠాల నేపథ్యంలో, ఏప్రిల్ 30, 1969 న వివాహ బంధంలోకి ప్రవేశించాము. 56 ఏళ్ల మా దాంపత్య జీవితం కష్టాలలో, నష్టాలలో, అపజయాలలో, విజయాలలో, అవరోహణలో, ఆరోహణలో, ఉద్యోగం లేనిరోజులలో, ఉన్నతోన్నత ఉద్యోగం ఉన్నరోజులలో పటిష్టంగా నిలిచి, అచంచలమైన బంధానికి, మౌనానురాగానికి ప్రతీకగా, ప్రత్యక్షసాక్ష్యంగా వున్నదని చెప్పడం అతిశయోక్తి కాదు. మేము తరచుగా ‘విభేదించడానికి అంగీకరిద్దాం (Agree to Disagree) అనే సూత్రాన్ని తుచ తప్పక పాటించాం. విభేదించినప్పుడు, అభిప్రాయభేదం కలిగినప్పుడు, పరస్పరం గౌరవించుకోవడం, మధ్యమార్గం ద్వారా పరిష్కారం చేసుకున్నాం. (వివాహానంతర వివరాలు తరువాయి)

 

1 comment:

  1. Its ok Jwala ji. The message reached you. కమ్యూనిజం నుంచి నిజానికి ప్రయాణం సాగించండి.

    ReplyDelete