Tuesday, October 7, 2025

వైదిక షోడశ సంస్కారాలు: సహస్ర చంద్రదర్శనమ్ ...... ‘శారీలో విప్లవం’: శ్రీమతి అయితరాజు కరుణ : వనం జ్వాలా నరసింహారావు

 వైదిక షోడశ సంస్కారాలు: సహస్ర చంద్రదర్శనమ్

శారీలో విప్లవం: శ్రీమతి అయితరాజు కరుణ

By వనం జ్వాలా నరసింహారావు, (అక్టోబర్ 6. 2025), హైదరాబాద్

{శారీలో విప్లవం’ శీర్షికతో మా అమ్మాయి (బుంటి) ప్రేమ ‘అయితరాజు కరుణ సహస్ర చంద్రదర్శనమ్’ సందర్భంగా తన అత్తయ్యను ఉద్దేశించి రాసిన గేయం, అక్టోబర్ 6, 2025 న వైదిక సంబంధమైన కార్యక్రమాల నిర్వహణ అనంతరం ఏర్పాటుచేసిన సభలో చదివినప్పుడు, దానిలోని సారాంశం పలువురిని, ముఖ్యంగా తన అత్తయ్యను ఆకట్టుకున్నది. విశిష్ట తెలుగు అధ్యాపకరాలు, ఉస్మానియా విశ్వ విద్యాలయం తెలుగు శాఖ ఆచార్యులు ఖండవల్లి లక్ష్మీరంజనం, పల్లా దుర్గయ్య, దివాకర్ల వెంకటావధాని, చల్లమచెర్ల రంగాచా ర్యులు, బిరుదురాజు రామరాజుల శిష్యురాలు, ప్రసిద్ధ ‘ఉత్తర భారత దేశ యాత్రల పేరుతో 66 పేజీల పుస్తకాన్ని గూగుల్ మ్యాప్ లాగా (మామగారి డైరీ అంశాలను) అక్షరీకరణ చేసిన వ్యక్తి, స్వర్గీయ డాక్టర్ అయితరాజు పాండురంగారావు సతీమణి, శ్రీమతి కరుణ సహస్ర చంద్రదర్శనమ్ వేడుకను ఆమె మనుమడు వేద్ వరుణ్, కుమారుడు డాక్టర్ భరత్, బంధుమిత్రుల ఆత్మీయ కోలాహలం  మధ్య నిరాడంబర ఘనంగా నిర్వహించారు} 

శారీలో విప్లవం: ఒకచేతిలో పరంపరను పట్టుకొని; మరోచేతిలో మార్పును మోసింది.

స్థిరంగా, సుందరంగా, భయంలేకుండా; స్త్రీలు మౌనంగా ఉండాలని చెప్పినప్పుడు

ఆమె జ్ఞానంతో మాట్లాడడం నేర్చుకుంది; అది కూడా గంభీరమైన, ధైర్యమైన స్వరంతో

చాయ్ సెస్ తక్కువగా ఉన్నప్పుడు, తరువాతి తరం వారు తెలివిగా  

తమ మార్గాన్ని ఎంచుకునేలా స్పేస్ క్రియైట్ చేసింది.

ఆమె విద్యే ఆమె కవచం, ఆమె దయే ఆమె నిశ్శబ్ద ఖడ్గం

ఆమె గౌరవంతో వాదించింది, శాంతితో సవాలు చేసింది

యుద్ధం లేకుండానే హృదయాలను గెలుచుకుంది

ఆమె సేవ చేసింది-అవును, కానీ ఆమె నాయకత్వం కూడా వహించింది

వేదికలపై కాదు, సభలలో కాదు-కిచెన్‌లలో, గదుల్లో, డ్రాయింగ్ రూముల్లో

సానుభూతితో కూడిన సామ్రాజ్యాలను నిర్మించింది

ఆమె భర్తను గౌరవించింది, కానీ ఆరాధించలేదు.

ఆమెకు ఆయన భాగస్వామి - అధికారి కాదు, సహచరి - ఆజ్ఞాపతి కాదు

వారు ఇద్దరూ సమానంగా నిలబడ్డారు.

ఒకరి చేతిని మరొకరు పట్టుకొని ఒకరి నొకరు అర్ధం చేసుకుని

ఆమెకు పురోగతి అంటే తిరుగుబాటు కాదు, అది పరిణామం

ఇతరులపై అధికారం చెలాయించకుండానే పైకి ఎదగడం. ఆమె ఇప్పటికీ - ఒక ‘శారీలో విప్లవం

వేదాలు, పురాణాలు, శాస్త్రాలు, ఇతిహాసాలూ,  అహర్నిశలూ అతిపవిత్రంగా ఘోషించే వాస్తవం, అలాగే అనాదినుండి వేదపండితులు చెబుతున్నదీ ఒక్కటే: జీవితం కేవలం పుట్టుకతో మొదలై మరణంతో ముగిసేది మాత్రమే కాదు. అది ఒక పవిత్ర యాత్ర, ఆధ్యాత్మిక సాధన, విశ్వాసాల అన్వేషణ, గమ్యస్థలానికి చేరుకోవడానికి చేసే తీర్థయాత్ర. ఈ ప్రయాణంలో, ప్రతి దశలోనూ మనిషి శరీరాన్ని, మనసును, ఆత్మను శుద్ధి చేసి, ఆధ్యాత్మిక అర్థంతో నింపే కర్మకాండలు, పద్దతులు, ఆచారాలు ఆదర్శనీయమైన మన పూర్వీకులు శాస్త్రీయంగా రూపకల్పన చేశారు. వాటినే వైదిక సంస్కారాలు అంటారు. నిశితంగా, లౌక్యంగా, వీటిని పరిశీలిస్తే, వాటి వెనుక ఉన్న ఆధ్యాత్మిక, ఆధునిక భావజాలం లోతు కొంతమేరకు అర్థమవుతుంది.

జీవనయానంలో ఏ కొద్దిమందికో లభించే వంద సంవత్సరాల పరిపూర్ణ జీవితం, తత్సంబంధిత వేడుక మినహాయిస్తే, దానికంటే ముందుగా, అదీ మరికొద్దిమందికి మాత్రమే కలిగే అదృష్టం, సహస్ర చంద్ర దర్శనమ్’ అంటే వెయ్యి పౌర్ణములు చూడడం. ఇది సాధారణ విషయం కాదు. వేడుక కూడా మామూలు ఉత్సవం కాదు. మనిషి శరీరంలో శక్తి, మనసులో సంపూర్ణత, జీవితంలో కృతజ్ఞతలు అన్నీ కలబోసి ఏర్పడే మలుపు. ఆ సందర్భాన్ని పురస్కరించుకుని, ఆ భాగ్యం కలిగిన పెద్దలను సత్కరించడం, వారిని కింది తరాల వ్యక్తుల ముందు నిలబెట్టి, ఆశీర్వాదాలు పొందడం ఒక మహత్తర దృశ్యం. వేదసంస్కృతిలో ఇది పవిత్రమైందని అనడానికి కారణం, సంస్కారాల దారిలో నడుస్తూ ఈ స్థాయికి చేరుకోవడమే ఒక మహత్తర విషయం.

మనుష్యుని జీవితంలో ఎన్నో మైలురాళ్లు ఉంటాయి. బాల్యం, యౌవనం, గృహస్థాశ్రమం, వృద్ధాప్యం; ఇవి అన్నీ కాలచక్రంలో పూర్ణచంద్రుని వలె సజీవంగా తిరుగుతుంటాయి. ఆ కాలచక్రంలోనే ఒక అత్యంత అపూర్వమైన, అపూర్వమానవునికి మాత్రమే లభించే శుభసందర్భం సహస్ర చంద్ర దర్శనమ్. సనాతన ధర్మం ప్రకారం గర్భధారణం నుండి వందేళ్ల వయస్సు వరకు ప్రతి దశ పవిత్రమని భావిస్తారు. ఒకవైపు వ్యక్తిగత పథం, మరోవైపు కుటుంబ, సమాజ సంబంధాల నిరంతరత్వం ఇక్కడ ఒక సంగమంలాగా కలుస్తాయి. మనం జీవిస్తున్న రోజులు, నెలలు, సంవత్సరాలన్నీ చంద్రసూర్య గమనాలపై ఆధారపడినవి. వాటిలో చంద్రుడు మన శరీరంలోని జీవచైతన్యానికి, మనసుకు, భావోద్వేగాలకు ప్రతీక. పున్నమి చంద్ర దర్శనమ్  వేయిమార్లు దర్శించగలిగినవారు భౌతికంగానూ, ఆధ్యాత్మికంగానూ పూర్ణతను పొందినవారుగా పరిగణించబడతారు. అందువల్ల ఈ వేడుక శతాబ్దకాలానికి సమానమైన జీవనయాత్రకు కృతజ్ఞతగా, శాంతిగా, ఆశీర్వాదరూపంగా జరుపబడుతుంది.

ఈ శాంతి విధి మన ధర్మశాస్త్రాలు సూచించిన జీవనధర్మ సూచకం. వేదోక్తముగా ఇది అయుష్యశాంతి, గృహశాంతి, పితృకృతజ్ఞతా యజ్ఞం అనే త్రిసూత్రాల మేళవింపు. వేదమంత్రాల ద్వారా సహస్ర చంద్ర దర్శనమ్ చేసుకున్న వ్యక్తి శరీర, మనస్సు, ప్రాణ, ఇంద్రియశక్తుల సమన్వయం జరగాలని ప్రార్థించబడుతుంది. గృహంలో దీన్ని చేయడం వల్ల కుటుంబం అంతా కృతజ్ఞతా భావంలో మునిగిపోతుంది; వృద్ధులు సానుకూల ఆశీర్వాదాన్ని ఇస్తారు; యువత జీవితానికి మార్గదర్శకత్వం పొందుతుంది. ఈ కార్యక్రమాలన్నీ వేదపండితుడు రాకశేఖర్ శర్మ తన బృందంతో శాస్త్రోక్తంగా కరుణ విషయంలో నిర్వహించారు.

సహస్ర చంద్రదర్శన వేడుక పూర్వరంగంలో సూర్య నమస్కారాలు నిర్వహించడం ఆచారం. కరుణ గృహంలో కూడా ఇది శాస్త్రోక్తంగా జరపడం విశేషం. ఈ కార్యక్రమాన్ని కరుణ పక్షాన రాజశేఖర్ బృందంలోని కార్తీక్ శర్మ గొప్పగా చేశాడు. సూర్యుడు జీవశక్తికి, ఆయురారోగ్యానికి, ప్రాణశక్తి ప్రవాహానికి మూలాధారుడు కనుక ఆయనకు నమస్కరించడం ద్వారా సహస్ర చంద్ర దర్శనమ్ చేసుకున్న (కరుణ) వ్యక్తితో సహా ఆమె బంధువులందరి (గోత్ర నామాలతో సహా) దేహమానసిక శక్తులు నిలకడగా ఉండాలని కార్తీక్ శర్మ ప్రార్థించాడు. ఈ సూర్య నమస్కారాలు జీవితయాత్రలో సూర్యుడికి కృతజ్ఞతా అర్పణగా భావించబడతాయి. ఇది శరీరశుద్ధి, మనస్సు ప్రశాంతి, దైవానుగ్రహం పొందే ఆరంభసూచనగా, శాంతి కార్యక్రమానికి ఆధ్యాత్మిక మాధుర్యాన్ని అందిస్తుంది. సంకల్పం సమయంలో కరుణ, ఆమె కుమారుడు భరత్ కూచున్నారు.

తరువాత ప్రధాన వైదిక శాస్త్రోక్త వేడుకలో భాగంగా రాజశేఖర్, పుణ్యాహవాచనం, గణపతి పూజ, నవగ్రహ హోమం, మృత్యుంజయ హోమం, ఆయుష్య హోమం వంటి వేదకర్మలు జరిపించాడు. లాంచనంగా కరుణను హోమం సమీపంలో కూర్చోమని పుణ్యాహవాచనం అనంతరం ఆవాహన, అభిషేకం, పుష్పాంజలి మొదలైన కార్యక్రమాలు నిర్వహించారు. పండితులు వేదమంత్రాలతో ఆయుష్మాన్ భావ, దీర్ఘాయుష్మాన్ భావ అని ఆశీర్వదించారు. తరువాత జరిగిన సహస్ర చంద్రదర్శన పవిత్ర శాంతి హోమాగ్నిలో సమర్పణలు చేస్తూ ‘నమో బ్రహ్మణే, నమో విశ్ణవే, నమః శివాయ, నమో సూర్యాయ అనే మంత్రార్చనలు జరిగాయి. పూర్ణాహుతి, పండితులచే ఆశీర్వచనాలు, కృతజ్ఞతాపూర్వక నమస్కారాలు నిర్వహించారు. కుటుంబసంస్కృతి, గురుపరంపరలను సమన్వయపరచే ఆచారంగా, బంధువులు, స్నేహితులు, పిల్లలు, కరుణకు పాదప్రక్షాళన చేసి ఆశీస్సులు పొందారు. శ్రీరామ శర్మ, కౌస్తుభ శర్మ, సతీష్ కుమార్ శర్మలు రాజశేఖర్ కు తోడ్పడ్డారు.

ఈ శాంతి ద్వారా సహస్ర చంద్ర దర్శనమ్ చేసుకున్న వ్యక్తికీ ఒక గంభీరమైన మానసిక శాంతి లభిస్తుంది. వారు ఇక మిగిలిన జీవితాన్ని కృతజ్ఞతా భావంతో గడపాలని, దైవానుగ్రహంతో మానసిక సమత కలిగి ఉండాలని ఆచారసూత్రం సూచిస్తుంది. పిల్లలకు ఇది ఒక బోధనా సమయం-జీవితమంటే దైవం ప్రసాదించిన యాత్ర, దానికి గౌరవం ఇవ్వాలి, కృతజ్ఞతతో ఉండాలి అనే సూత్రం వారికి సహజంగా స్ఫూర్తి కలిగిస్తుంది. ఈ శాంతి కేవలం వేదకర్మ మాత్రమే కాదు, అది జీవితోత్సవం. జీవితంలో కష్టం, ఆనందం, త్యాగం, ధర్మం, అనుభవం అన్నింటినీ సాక్షిగా చూసిన (కరుణ) వ్యక్తి పట్ల కుటుంబం కృతజ్ఞతాపూర్వకంగా నిర్వహించిన పుణ్యకార్యం ఇది. మన హిందూ సంస్కృతిలో అంతర్భాగం

సహస్ర చంద్ర దర్శనం మన శరీరంలోని జీవచక్రాలను చంద్ర గమనంతో పోల్చి వాటి సంతులనం (నిలకడగా, స్థిరంగా ఉంచగల సామర్థ్యం) గుర్తు చేస్తుంది. వృద్ధాప్యాన్ని శాపంగా కాకుండా పరిపక్వతగా, ఆధ్యాత్మిక చైతన్యంగా చూడమని ఇది బోధిస్తుంది. సమాజపరంగా ఈ క్రతువు కుటుంబ ఐక్యతను బలపరుస్తుంది. వృద్ధుల పట్ల గౌరవం, వారి అనుభవం పట్ల కృతజ్ఞత, వారసత్వ పట్ల గౌరవం, ఇవన్నీ ఈ శాంతి ద్వారా మనలో మేలుకొలుపబడతాయి. ఆధ్యాత్మికంగా ఇది మనలోని అహంకారాన్ని త్యజించి, సమర్పణ భావాన్ని పెంచుతుంది. జీవితం అనిత్యత, దైవచక్రం యొక్క నిరంతరతను గ్రహిస్తారు.

ప్రతి సంస్కారం వ్యక్తిని ప్రకృతితో, సమాజంతో, విశ్వంతో అనుసంధానించే అజరామరమైన వంతెన. కాలం మారింది. ఆధునికత అనునిత్యం సాక్షాత్కారిస్తున్నది. సంస్కారాల ప్రాముఖ్యత, ప్రభావం మాత్రం పూర్తిగా తగ్గలేదు. షోడశ సంస్కారాల్లో మొదటిది గర్భధారణానికి ముందే జరిపే గర్భాధాన సంస్కారం. సద్గుణాలు కలిగిన సంతానం కలగాలని ప్రార్ధించాలని మనుస్మృతిలో స్పష్టంగా వున్నది. పుణ్యసంకల్పంతో పుట్టిన పిల్లలు కుటుంబ ధర్మాన్నీ, వంశాన్నీ కొనసాగిస్తారని చెప్పడం జరిగింది. అంతేకాదు, అమ్మాయి మొదటి రుతుస్రావం తర్వాత జరిగే శాంతిపూజలు, పండుగలు కూడా కేవలం ఆచారాలు మాత్రమే కాకుండా శాస్త్రీయతతో కూడుకున్నవి కూడా. రజస్వల కేవలం శారీరక మార్పు కాదు, ఆమె స్త్రీత్వాన్ని గౌరవించడం, తల్లులు, అమ్మమ్మల జ్ఞానాన్ని తరతరాలకు అందించడం అనే భావన ఇమిడి వున్నది. ఈ సందర్భం అమ్మాయికి వ్యక్తిగత ఆనందం మాత్రమే కాకుండా కుటుంబ సమాజ సమిష్టి గౌరవం కూడా.

గర్భధారణ తరువాత గర్భస్థ శిశువు ఆరోగ్యకరంగా పెరగాలని ప్రత్యేక సంస్కారాలు ఉంటాయి. ఉదాహరణకు, మూడో నెలలో పుంసవన సంస్కారం, ఏడవ లేదా తొమ్మిదవ నెలలో (ఆధునిక కాలంలో బేబీ షవర్) సీమంతోన్నయనం. సీమంతోన్నయనం లేదా సీమంతం, అంటే జుట్టును పైకి దువ్వడంఅని అర్థం. ఈ వేడుకలో వేదమంత్రాలు పారాయణం చేస్తారు, తల్లి శ్రేయస్సు కోసం, బిడ్డ ఆరోగ్యం కోసం ప్రార్థనలు చేస్తారు. బంధువులు, మిత్రులు చేరి ఆనందోత్సాహంగా జరుపుకుంటారు. అసలు సారాంశం ఏమిటంటే, పుట్టుక అనేది ఒక వ్యక్తిగత సంఘటన కాదు, కుటుంబం, సమాజం మొత్తం పంచుకునే ఆశీర్వాదం.

పుట్టిన మొదటి రోజే జాతకర్మ జరుగుతుంది. బిడ్డకు శక్తి, దీర్ఘాయుష్షు లభించాలని ప్రార్థిస్తారు. తేనె లేదా నెయ్యి కొద్దిగా పెదవులకు తాకించి, జీవితం మాధుర్యం, ఆరోగ్యం పొందాలని సంకల్పిస్తారు. పదకొండవ రోజు తల్లి, బిడ్డను పవిత్రస్నానం చేయించడం శరీర శుద్ధి మాత్రమే కాదు, మానసిక శుద్ధికి కూడా సంకేతం. ఇరవై ఒకటవ రోజు నామకరణం వుంటుంది. పేరు కేవలం గుర్తింపు కాదు. అది జీవితాంతం వ్యక్తిత్వాన్ని మలిచే ముద్ర. అదే రోజున నిష్క్రమణం, అంటే, బిడ్డను మొదటిసారి బయటకు తీసుకెళ్ళి సూర్యుని చూపించడం, అంటే విశ్వంలో ప్రవేశం, సమాజంలో తొలి అడుగు వుంటుంది.

ఆరవ నెలలో అన్నప్రాశనం. ఇది తల్లి పాలనుంచి ప్రకృతి ఆహారానికి మార్పు సూచిస్తుంది. ఈ సందర్భంలో బిడ్డ ముందు వివిధ వస్తువులు పెట్టి, ఏది ఎంచుకుంటాడో చూస్తారు. భవిష్యత్తు స్వభావం ఊహించే సంప్రదాయం ఇది. తరువాత మూడు సంవత్సరాల వయసులో పుట్టు వెంట్రుకలు తీయడం జరుగుతుంది. జననం నుండి పెరిగిన వెంట్రుకలను తీసివేయడం అంటే పూర్వజన్మల మలినాలను విడిచిపెట్టడం. ఆపై అక్షరాభ్యాసం. చిన్నచిన్న అక్షరాలను రాయడం ప్రారంభిస్తాడు. దేవీ సరస్వతిని ప్రార్థించి, జ్ఞానం పవిత్రమని నేర్పుతారు. ఇది కేవలం విద్యారంభం కాదు, జీవితమంతా నేర్చుకోవడం ఒక నిరంతర యాత్ర అని పాఠం.

ఉపనయనం అనేది ద్వితీయ జన్మ. శారీరక పుట్టుక తర్వాత మానసిక, ఆధ్యాత్మిక జననం. పవిత్ర యజ్ఞోపవీతధారణతో బాలుడు బ్రహ్మచారి అవుతాడు. గాయత్రి మంత్రం జపం, వేదాధ్యయనం, శీలం, సేవ, వినయం ఇవన్నీ జీవితంలో అంతర్భాగమవుతాయి. బ్రహ్మచర్యం కేవలం విద్యాదశ మాత్రమేకాదు, అది మనసు, శరీర నియంత్రణ, బాధ్యతలకు మార్గదర్శి. సంస్కారాలలో వివాహం అత్యంత గొప్పది.

ఇది వ్యక్తిగత బంధం మాత్రమే కాదు. కుటుంబ సంప్రదాయాలను, ధర్మాన్ని కొనసాగించే పవిత్ర కర్మ. వివాహం అనేది రెండు కుటుంబాలను, రెండు వంశాలను ఒకటిగా కట్టిపడేసే పందిరి. మొదట నిశ్చితార్థం జరిపి, ముహూర్తం నిర్ణయిస్తారు. తరువాత పసుపు కొట్టడం, శనగలరాయి వేయడం పెవంటి వేడుకల లాంటి సంస్కారాలతో వధువుకు పవిత్రత, శుభప్రసన్నత లభిస్తుంది. భవిష్యత్తులో గృహిణిగా చేపట్టబోయే బాధ్యతలకు ఇవి పునాది.

ఎదురుకోలులో వరుడిని సత్కరించి ఆహ్వానిస్తారు. స్నాతకంలో వరుడు కాశీ యాత్ర చేసినట్టు ప్రతీకాత్మకంగా లోకత్యాగం చేసి, గృహస్థ ధర్మానికి సిద్ధమవుతాడు. వధువు అంకురార్పణం చేయడంలో భాగంగా మట్టి మూకుళ్లలో తొమ్మిది రకాల విత్తనాలు (నవ ధాన్యాలు) వేసి నీరుపోసి పెంచుతుంది. ఇది సంతానోత్పత్తి, పెంపకం, సృజనాత్మక శక్తికి సంకేతం. వరపూజ, గౌరీపూజలు తధువరి భవిష్యత్తు జీవితానికి దేవతల అనుగ్రహం పొందే మార్గాలు.

ప్రధాన వివాహ వేడుకలు అత్యంత హృద్యమైనవి. కన్యాదానం ఇందులో ప్రాముఖ్యతగలది. ఇది, వధువును వరుడికి దైవకానుకగా అందించడం. పాణిగ్రహణం, అంటే, చేతిని పట్టుకొని బాధ్యతను స్వీకరించడం. జీలకర్ర-బెల్లం రాయడం అనుబంధ మాధుర్య సూచన. మాంగల్యధారణంతో విడదీయలేని బంధం ఏర్పడుతుంది. సప్తపదిలో అగ్నిచుట్టూ ఏడు అడుగులు వేసి, సమానత్వం, ఏకత్వం, పరస్పర బాధ్యతల ప్రతిజ్ఞ చేస్తారు. చివరగా అప్పగింతలుతో వధువును వరుడి కుటుంబానికి అప్పగించడం ద్వారా రెండు కుటుంబాలు ఒకటవుతాయి.

అరవై ఏళ్ల వయసులో షష్టిపూర్తి వేడుక జరుపుతారు. ఇది వివాహ బంధ పునరుద్ధరణ. భార్యాభర్తలు మరోసారి కలసి సంస్కారాలు చేసి, తమ అనుబంధాన్ని పునర్ ధృవీకరిస్తారు. డెబ్బై ఐదు ఏళ్లకూ ఇలాంటిదే మరొక వేడుక జరపొచ్చు. వందేళ్లకు చేరితే అది కేవలం కుటుంబానికి కాదు, సమాజానికే ఒక పండుగ. దీర్ఘాయుష్షు అనేది దేవుని అరుదైన వరమని అందరికీ గుర్తు చేస్తుంది.

ఈ నేపధ్యంలో సహస్ర చంద్ర దర్శనం—81 ఏళ్లు 4 నెలల వయసులో జరిగే అద్భుత సంస్కారం. దీన్ని జీవితపూర్ణతకు ప్రతీకగా భావిస్తారు. ఈ వేళ కుటుంబం, సమాజం పెద్దలను గౌరవిస్తుంది. పెద్దలు తిరిగి చిన్నతరాలకు ఆశీర్వాదాలు ఇస్తారు. పౌర్ణమి చంద్రుడు సంపూర్ణత, శుద్ధత, కాలచక్రాన్ని సూచిస్తూ, జీవితం పుష్టిగా పండిందని తెలియజేస్తుంది. ఇది వ్యక్తిగతంగా ఆనందదాయకం, సామూహికంగా ప్రేరణాత్మకం. జీవితం ఒక నిరంతరచక్రం అని అందరికి గుర్తు చేస్తుంది.

ధర్మశాస్త్రాలు చెప్పిన నాలుగు ఆశ్రమాలను గుర్తు పెట్టుకోవాలి. అవి, బ్రహ్మచర్యం (విద్య, నియమం), గృహస్థం (కుటుంబధర్మం, బాధ్యతలు), వానప్రస్థం (విరక్తి, శాంతి), సన్యాసం (లోకత్యాగం, మోక్షయాత్ర). ఇవి కఠిన ఆజ్ఞలు కాదు. జీవన సత్యాలను సమతుల్యంగా నేర్పే దశలు. ప్రతి దశలోనూ మనిషి కర్తవ్యాన్ని, కోరికను, విముక్తిని సమన్వయంగా పొందాలని బోధిస్తాయి. ఈ దశలన్నీ పురుషార్థాలు అనే నాలుగు లక్ష్యాలపై ఆధారపడి ఉంటాయి. ధర్మం జీవన నైతిక పునాది, అర్థం జీవనోపాధి, కామం జీవన సుఖం, మోక్షం ఆత్మ విముక్తి. ఇవన్నీ కలిసిన సంస్కారాలు కలిపి జీవితం సమతుల్యంగా నడవాలని నిర్ధారిస్తాయి. జీవితం కేవలం బతుకుటకే కాదు, సమాజం, కుటుంబం పట్ల బాధ్యతతో కూడిన పవిత్ర పథం అని అవి నిరంతరం గుర్తు చేస్తాయి.

ఈ నేపధ్యంలో, నిన్న (అక్టోబర్ 6, 2025) సాయంత్రం శ్రీమతి అయితరాజు కరుణకు గౌరవార్థం సహస్ర చంద్ర దర్శన శాంతి, అనుబంధ సూర్యనమస్కార కార్యక్రమాలు శాస్త్రోక్తంగా, ఆచారసముచితంగా నిర్వహించబడ్డాయి. వేదపండితుల మంత్రోచ్చారణల నడుమ అన్ని వైదిక వేడుకలు, నిరాడంబరంగా, సమగ్రతతో పూర్తయిన అనంతరం, వేదపండితుడు రాజశేఖర్ ఆశీర్వచన మంత్రాలు చదువుతుంటే, కార్యక్రమానికి హాజరైన బంధు–మిత్రులకు వెండి పువ్వును జ్ఞాపికగా కరుణ బహుకరించి ఆశీర్వదించింది. కార్యక్రమంలో పాల్గొన్న వారిలో ఎక్కువమంది ఆమెకంటే వయసులో చిన్నవారే కావడంతో, శ్రీమతి కరుణ స్నేహపూర్వకంగా వారికి అక్షింతలు వేసి దీవించగా, కొద్దిమంది పెద్దలు ఆమెను ప్రేమతో ఆశీర్వదించారు.

తదనంతరం ఉల్లాసభరితంగా సాగిన చిన్న సభాకార్యక్రమంలో, పలువురు కరుణ గారి వ్యక్తిత్వాన్ని, ఆమె భర్త స్వర్గీయ రంగారావు గారితో కలిసి గడిపిన ఆత్మీయ అనుబంధాలను మధురస్మృతులుగా పంచుకున్నారు. కరుణ గారి కృతజ్ఞతాభావం, ఆత్మీయత, సాన్నిహిత్యం ప్రతీ ఒక్కరి మనసును తాకింది. కార్యక్రమం చివరగా స్నేహసౌహార్ద వాతావరణంలో విందు భోజనం సాగి, ఆ సాయంత్రం ఆధ్యాత్మికత, ఆనందం, ఆత్మీయతల సమ్మేళనంగా గుర్తుండిపోయేలా ముగిసింది.

కార్యక్రమానికి హాజరైనవారిలో: భండారు రామచంద్ర రావు దంపతులు, రావులపాటి సీతారాంరావు దంపతులు, అయితరాజు జగన్మోహన్ రావు దంపతులు, అయితరాజు మనోహర్ రావు దంపతులు, భండారు శ్రీనివాసరావు, డాక్టర్ నాగభూషణం దంపతులు, తుర్లపాటి విజయ్ శంకర్ కుటుంబ సభ్యులు, జూపూడి శమంత్ కుటుంబ సభ్యులు, తుర్లపాటి సత్యనారాయణ-రుక్మిణి, ఎస్సెచ్ ప్రసాద్, చినపాప, బాలాజీ, దంపతీయుక్తంగా అయితరాజు సోదరులంతా, కరుణ చిన్ననాటి స్నేహితురాలు (బేబీ) దీనా,  శ్రీమతి విజయలక్ష్మి కమలా ప్రసాద్, మావుదూరి సీత, వెంకట్ చంగవల్లి దంపతులు, కరుణ పుట్టింటి సమీప బంధువులు విష్ణు, కృష్ణ, రోహిణి, ఫణి, వెంకటేష్, మధు, బ్లూబర్డ్స్ సహనివాసులు, నూకల దంపతులు, తదితరులు వున్నారు.

చివరగా ఒక్కమాట. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని, డాక్టర్ మనోహర్ రావు ఒక అద్భుతమైన ‘ఫినిషింగ్ టచ్ ఇస్తూ కార్యక్రమాన్ని అద్భుత నిరాడంబరంగా, అసలు-సిసలు శాస్త్రోక్తంగా నిర్వహించడంలో ప్రతి చిన్న విషయంలో శ్రద్ధ తీసుకున్న డాక్టర్ భరత్ కు రాసిన లేఖ, అంతా చదవాల్సిన లేఖ.

ప్రియమైన బాబు,

చాలా అద్భుతంగా నిర్వహించావు బాబు! ఈ కార్యక్రమం జరుగడానికి కారణమైన నీకు, వరుణ్‌కి మా హృదయపూర్వక అభినందనలు!

ఈ వేడుక భక్తి, శ్రద్ధలతో నిండిన వేదకర్మల సమన్వయంతో, ఒక సార్థక సమ్మేళనంగా, భగవంతుడు ప్రసాదించిన అనుగ్రహాలకు కృతజ్ఞతగా జరిగిన ఒక అద్భుతమైన సందర్భం. కుటుంబ సభ్యులు, బంధువులు, మిత్రులు, శ్రేయోభిలాషులు, అంతా కలిసి, ఆ శుభదినాన, ఆ శుభసందర్భాన్ని ఉత్సాహంగా, ఆప్యాయతతో, స్నేహపూర్వక, ఆత్మీయ, సాదాసీదాగా రంగు-రంగులమయంగా కలసి గడిపిన ఈ సమావేశం. మనందరం అమ్మగారి మహోన్నత గుణాలను తిరిగి జ్ఞప్తికి తెచ్చుకుని, ఆమెకు మన గౌరవం, కృతజ్ఞతలను అర్పించే ఒక విలువైన అవకాశాన్ని ప్రసాదించింది.

మేమందరం చిరంజీవి వరుణ్‌కి విజయవంతమైన వృత్తిజీవితం, భవిష్యత్తు, అభివృద్ధి, ఆరోగ్యం, ఆనందం కలగాలని ప్రార్థిస్తున్నాము. ఈ కార్యక్రమం ప్రారంభం నుంచి సూచన, మార్గదర్శనం ఇచ్చిన శ్రీ జ్వాల గారికి, వారి కుటుంబ సభ్యులకు మేమందరం మనస్పూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాము.

స్నేహపూర్వకంగా, ప్రేమతో —

డాక్టర్ మనోహర్ రావు

చిట్ట చివరగా:

విజ్ఞాన శాస్త్రం, వైద్యం, సాంకేతికత మనిషి జీవితాన్ని నవీన మార్గాలలో నడిపిస్తున్నా, సంస్కారాల ప్రాముఖ్యత తగ్గలేదు. అవన్నీ సమయానుగుణంగా మార్పుచెందే సజీవ సంప్రదాయ వాహినులు. పిల్లలకు నేడు కంప్యూటర్ టాబ్లెట్‌పై అక్షరాలు నేర్పవచ్చుకానీ అక్షరాభ్యాస సారాంశం మాత్రం మార్ఛలేదు. వైద్య ప్రగతితో ఆయుష్షు పెరిగినా, సహస్ర చంద్ర దర్శనమ్  ఇస్తున్న నిత్య సందేశాన్ని దాటలేదు. ‘గర్భధారణం నుండి వెయ్యి పౌర్ణముల దర్శనం వరకు జీవితం పవిత్రం. కుటుంబం, సమాజమే దాని ఆధారం’ అని సంస్కారాలు మనకు ఎప్పటికీ గుర్తు చేస్తూనే ఉంటాయి. సంస్కారాలు మనిషి జీవితాన్ని ఆచారాల ద్వారా మాత్రమే కాకుండా, విలువల ద్వారా తీర్చిదిద్దే ఆధ్యాత్మిక శక్తులు. మన పూర్వీకుల వారసత్వం. మన తరాలకు, భావితరాలకు మార్గదర్శకం. జీవితం పవిత్రం. జీవితం బాధ్యతతో కూడినది. జీవితం సమాజంతో అనుసంధానమైనది. సహస్ర చంద్ర దర్శనమ్  చేసుకున్న అయితరాజు కరుణ ధన్యురాలు.

 

No comments:

Post a Comment