‘సాంప్రదాయిక విశ్వాసానికి, మార్క్సిజం పట్ల మీ ఆరాధనకు నిండు నీరాజనాలు’
“హిందూత్వం,
మార్క్సిజం, రామాయణం: సాహిత్యం, మానవ విలువలు”
అనే
నా వ్యాసం మీద విశ్లేషణాభిమానం By చందమామ రాజశేఖర రాజు
పాత బ్లాగ్ పోస్ట్: (జనవరి 27, 2010)
Updated on October 24, 2025
చందమామ బ్లాగ్ ను ఆరంభించి, ఆబాల తెలుగు గోపాలానికి,
బాల్యాన్ని మళ్లీ-మళ్లీ గుర్తుకు తెచ్చే విధంగా ఆ బ్లాగ్ ను
తీర్చిదిద్దుతున్నప్పుడు, రాజశేఖర రాజు గారు నేను హ్యూస్టన్ తెలుగు సాహితీ లోకం
వారి నెల నెలా తెలుగు వెన్నెల కార్యక్రమంలో చేసిన ప్రసంగ పాఠాన్ని చదివి అపూర్వంగా
స్పందించారు. ‘శుద్ధ ఛాందస కుటుంబంలో పుట్టి, కమ్యూనిస్ట్
మిత్రుల మధ్య పెరిగాను. ఛాందసత్వానికీ, కమ్యూనిజానికీ
దగ్గరగా-సమాన దూరంలో పెరిగి పెద్దవాడినైనందున, ఇప్పటికీ ఆ
రెండంటే నమ్మకమే, అభిమానమే. రెంటిలోనూ వున్న మంచిని ఎలా కలిపి, లేదా విడదీసి అర్థంచేసుకోవాలన్న తపన ఎల్లప్పుడూ నన్ను వేధిస్తుంటుంది.’
అన్న నా భావాలపై వ్యాఖ్యానిస్తూ రాజు గారు:
‘మొదట సాంప్రదాయిక వాతావరణంలో పెరిగినా తర్వాత దానికి
వ్యతిరేకమైన జీవితంలోకి పోయిన వారు మీలాగే చాలామంది ఉన్నారు మనలో. కానీ
ఛాందసత్వానికీ,
కమ్యూనిజానికీ దగ్గరగా, సమాన దూరంలో పెరిగి పెద్దయిన మీరు ఇప్పటికీ
ఆ రెండింటిపైనా నమ్మకం ఉంచుకోవడం చాలా ఆశ్చర్యకంరంగానూ, తీవ్ర
వైరుధ్యపూరితం గానూ ఉంది. ఇలా ఉండటం ఎవరికయినా ఎలా సాధ్యం?’ అని
ప్రశ్నించారు.
‘హిందూత్వం అనేది మతం అయినా, కాకపోయినా, మనిషి
జీవించడానికి తగినటువంటి ఆదర్శమైన జీవనవిధానం అనే సంగతి, చిన్నతనంలోనే
నన్నెంతో ప్రభావితుడిని చేసింది. అలానే పెరిగి పెద్ద వాడినయ్యాను. ఈ నమ్మకాలేవీ,
నన్ను మార్క్సిజం, కమ్యూనిజం వైపు ఆకర్షితుడను కాకుండా
చేయలేకపోయాయి.’ అని నేనంటే, ఆయన ‘మీరు సాహిత్యపరంగా
మార్కిజంపట్ల ఆకర్షితుడయ్యారేకానీ దాని ఆచరణాత్మక జీవితానుభవం మీకు లేదనే
అనిపిస్తోంది’ అని నిష్కర్షగా తేల్చి చెప్పారు.
‘నాన్నగారు చెప్పిన పాఠాల్లో హిందూత్వ కర్మ సిద్ధాంతం
ఇమిడివుంటే,
పక్క వూళ్లో వుండే బాబాయి చెప్పిన పాఠాల్లో మార్క్సిజం, కమ్యూనిజానికి
సంబంధించిన కర్మ సిద్ధాంతం ఇమిడి వుందని తెలుసుకున్నాను.’ అన్న నా మాటలను ఆయన
నమ్మలేక పోయారు. ‘హిందూత్వ కర్మ సిద్ధాంతం, మార్క్సిజం, కమ్యూనిజం
కర్మసిద్ధాంతం’ ... ఎక్కడో తేడా కనబడుతూ ఉంది. స్పష్టంగానే..’ అని నిర్మొహమాటంగా వ్యాఖ్యానించారు.
అయితే నేనన్న ‘ఆధునిక ప్రపంచంలో మానవ విలువలకు నూటికి నూరుపాళ్లు అద్దంపట్టిన అతి
గొప్ప సిద్ధాంతం ‘మార్క్సిజం-కమ్యూనిజం’ అన్న దానికి ఆయన మిశ్రమంగా స్పందించారు.
‘దాని (కమ్యూనిజం) ఆచరణలో 90 ఏళ్లుగా జరుగుతూ
వచ్చిన అరాచకాలను పక్కనబెట్టి చూస్తే, మీరన్న పై వాక్యం అక్షర సత్యం. మనిషికి 8
గంటల పని అవసరం గురించి ఎలుగెత్తి చాటిన సిద్ధాంతం మార్క్సిజమే మరి.
ఇంతకు మించిన మానవ విలువ ఎక్కడైనా ఉందా? 8 పని గంటలకు
సంబంధించిన ఈ మహత్తర విలువే ఈనాడు పూర్తిగా తలకిందులవుతూ వస్తోంది. ఎంతగా
రాత్రింబవళ్లూ ప్రాజెక్టుల మీద పనిచేసినా సరే ఇంకా చేయలేదే అనేంత గొప్ప స్థాయికి
ఇప్పటి సమాజం ఎదిగిపోతోంది’ అని అంటూనే, ‘రామరాజ్యమైనా,
గ్రామరాజ్యమైనా, కార్మికరాజ్యమైనా, శ్రామికరాజ్యమైనా.. .. ... ... మానవతా దృక్పథం కలిగిందైతేనే, మానవ విలువలకు అర్థముంటుంది’ అని నేను అన్న విషయాన్ని అంగీకరించలేదు.
‘అగ్రవర్ణ, నిమ్నవర్ణ పునాదిని పదిలపర్చిన రామరాజ్యంలో
మానవవిలువలు ఎవరికి ప్రయోజనం కలిగించి ఉంటాయి. రామరాజ్యం వర్ణ వివక్షకు పట్టం
గట్టిన రాజ్యం. అక్కడ మానవ విలువలు అంటే సవర్ణ మానవ విలువలు అనే అర్థమే వస్తుంది’
అని ఘంటా పధంగా-నిర్మొహమాటంగా చెప్పారు. చివరగా, ‘ఆద్యంతం
విరుద్ధ, విభిన్న మార్గాలలో పయనించడం అని మీరు ఓ చోట అన్నారు. ఇది మీకు కూడా
ఎక్కువగానే వర్తిస్తుందనుకుంటున్నా. మిమ్మల్ని నొప్పించాలని కాదు. మొత్తంమీద
చూస్తే రెండు విభిన్న దృక్పధాలను కలిగి ఉంటున్నట్లుగా చెప్పిన మీ నిజాయితీకి
అభినందనలు. కానీ ఈ ద్వంద్వజీవన దృక్ఫథమే నాకు బోధపడటం లేదు. జీవిత విధానానికి
సంబంధించి మీ ఎంపికను నేను తప్పు పట్టదల్చుకోలేదు. మిమ్మల్ని నొప్పించే ఉద్దేశం
కూడా లేదు.’ అని ముగించారు.
రాజు గారు చెప్పిందాన్ని ఒక్క సారి నిశితంగా పరిశీలించాను.
నేను చెప్పిందాట్లో తప్పుందానని మళ్లీ, మళ్లీ ఆలోచించాను. ప్రస్తుతానికి (అప్పటికి)
తప్పనిపించడం లేదన్న నిర్ధారణకొచ్చాను. అయినా.. ఏమో.. ముందు, ముందు నేను మారనన్న
నమ్మకం లేదేమో అనుకున్నా. మారేంతవరకు, ఈ ‘నేనును నేనేగా’
అనుకున్నాను. జవాబిచ్చానిలా: ‘నా భావాలను మీరు విశ్లేషించిన పద్ధతి నాకు బాగా
నచ్చింది. నా అంతరాత్మ ప్రబోధం ప్రకారం, ఇప్పటికీ ... రెండు
సిద్ధాంతాలను గౌరవిస్తాను. పాటిస్తాను. నా వయసిప్పుడు 61+. మరి
కొన్ని దినాలో, నెలలో, సంవత్సరాలో వేచి
చూస్తాను. మారడమో, లేదా, ఇలానే కొనసాగడమో జరుగుతుందని అనుకుంటాను.’
రాజు గారు అసలు, సిసలైన సాహిత్యాభిమాని, విమర్శకులు, విశ్లేషకులు.
ఏదో మొక్కుబడిగా,
బ్లాగ్ లో పేరు చూసుకునేందుకు కామెంట్ లో రాసే రకమైన వ్యక్తి కాదు.
అందుకే, నా ప్రతి స్పందనను మళ్లీ విశ్లేషించారు. స్పందిస్తూ:
‘మార్క్సిజం, రామాయణంపై వచ్చిన మీ వ్యాసంపై నా వ్యాఖ్యకు స్పందించినందుకు చాలా
సంతోషంగా ఉంది. దానిపై మరి కొంత వివరణను పంపిస్తున్నాను చూడండి.’ అని రాస్తూ, ‘అయితే, ఈ నమ్మకాలేవీ, నన్ను
మార్క్సిజం-కమ్యూనిజం వైపు ఆకర్షితుడను కాకుండా చేయలేకపోయాయి. మరో అనిర్వచనీయమైన
శక్తి ఆ దిశగా లాగిందేమో నన్ను. బాల్యంలో నేను పెరిగిన మరో కోణంలోని పరిసరాలే
దీనికి కారణం అయుండవచ్చు. నాన్నగారు చెప్పిన పాఠాల్లో హిందూత్వ కర్మ సిద్ధాంతం
ఇమిడివుంటే, పక్క వూళ్లో వుండే బాబాయి చెప్పిన పాఠాల్లో
మార్క్సిజం-కమ్యూనిజానికి సంబంధించిన కర్మ సిద్ధాంతం ఇమిడి వుందని తెలుసుకున్నాను.’
అన్న నా మాటలను మరింత లోతుగా ఉదాహరించారు విశ్లేషణాత్మక భావజాలంతో.
‘నేను విమర్శా పూర్వకంగా మీ వ్యాసంపై వ్యాఖ్య పంపినప్పటికీ
ఎంతో సహృదయతతో మీరు దాన్ని స్వీకరించి మీ అభిప్రాయం చెప్పడం నిజంగా
కదిలించివేస్తోంది. రెండు విభిన్న దృక్పధాలను ఒకే సారి, ఒకే
వ్యక్తి పాటించడం హేతు విరుద్ధమనే దృష్టితోటే ఆవ్యాఖ్య అలా పంపాను. కానీ నిజం
చెప్పాలంటే తెలంగాణాలో మీరు మీ నాన్నగారి ద్వారా సాంప్రదాయక జీవన విలువలను,
మీ మిత్రుల ద్వారా వామపక్ష సిద్ధాంత దృక్పధాన్ని ఎలాగైతే ఒడిసి
పట్టుకున్నారో, సరిగ్గా అలాంటి అనుభవమే నాకూ ఉంది. బాల్యంలో
నేను పెరిగిన సంప్రదాయ జీవనకోణంలోని పరిసరాలు ఒక రకం వ్యక్తిత్వాన్ని నాలో
పెంపొందిస్తే, తర్వాత విద్యార్థి జీవితపు మలిదశలో పరిచయమైన
మార్క్సిస్ట్ సిద్ధాంతం మరో రకమైన వ్యక్తిత్వాన్ని పెంపొందించింది. ఇప్పటికీ ఈ
రెండింటి కలయికతోటే నా జీవితమూ కొనసాగుతోంది. కానీ, ప్రస్తుతం
ఉద్యమ జీవితంతో సంబంధం లేకున్నప్పటికీ వ్యక్తిగా కూడా మార్క్సిస్టు దృక్పధాన్ని నా
జీవితమార్గంగా ఎంచుకున్నాను. రాజకీయ మార్క్సిజం దాని పెడధోరణుల కంటే సమాజాన్ని
అవగాహన చేసుకోవడంలో మార్క్సిజం అన్ని సిద్ధాంతాల కంటే పై మెట్టులో ఉందని నా
అభిప్రాయం’ అన్నారు. (ఎంత గొప్పగా చెప్పారు!)
‘అందుకే ఆధునిక ప్రపంచంలో మానవ విలువలకు నూటికి నూరుపాళ్లు
అద్దంపట్టిన అతి గొప్ప సిద్ధాంతం మార్క్సిజం-కమ్యూనిజం అని మీరు జనవరి నెల
సుజనరంజని వ్యాసం, “మార్క్సిజం-రామాయణం (సాహిత్యం మానవ విలువలు)” లో మీరు
ప్రకటించిన భావానికి వినమ్రంగా అంజలి ఘటిస్తున్నాను. అలాగని నా బాల్యజీవితాన్ని
వెలిగించిన సంప్రదాయ సాహిత్యాన్ని, సంగీతాన్ని ఈనాటికీ నేను
మర్చిపోవడం లేదు. నా చందమామ బ్లాగు లో నిన్ననే పోస్ట్ చేసిన ‘మా తెలుగు
మాష్టారూ-మా తెలుగు పద్యమూ’ అనే బాల్య జ్ఞాపకాన్ని దయచేసి చూడగలరు. ఈ రోజుకీ మా
యింట్లో ప్రాచీన సాహిత్యం, ఆధునిక సాహిత్యం రెండూ కలిసే
కాపురం చేస్తుంటాయి. తెలుగు పద్యం, శ్లోకాలలోని సంగీత ఝరి
నన్ను ఎంతగా ఆకట్టుకుంటుందో దాస్ కేపిటల్ పుస్తకం కూడా అంతే ఉద్వేగానుభూతిని
కలిగిస్తుంది. ఇది దాదాపు ఉద్యమాల్లో పనిచేసిన, బయట ఉండి
మద్దతు పలికిన ప్రతివారి అనుభవంలోనూ కొనసాగుతూ వస్తోంది’ అని తన మనసులోని భావాలను
ఆవిష్కరించారు రాజు గారు. ఇక మంచి ఉదాహరణను కూడా చెప్పారు. ఆయన చెప్పిన ఆ (ఈ కింద
వున్న) విషయం నాకు లోగడ తెలియదు.
‘విరసం ఒకప్పటి కార్యదర్శి, సుప్రసిద్ధ
మార్క్సిస్ట్ విమర్శకుడు కేవీఆర్ ఎంత నిబద్ధత కలిగిన వ్యక్తో దాదాపు అందరికీ
తెలుసు. కానీ ఆయన ఇష్టపూర్వకంగా వినే గీతాల్లో త్యాగరాజ కృతులు ఒకటి అంటే నమ్మండి.
మార్క్సిజాన్ని విశ్వసిస్తూ ఇదేమిటీ చాదస్తం అని ఎవరైనా అంటే అప్పట్లో ఆయన ఒకే ఒక
మాట అనేవారు. అవును నేను “పెట్టుబడి” నీ చదువుతాను. “త్యాగరాజ కృతి” నీ వింటాను.
మీకేమన్నా అభ్యంతరమా..! అనేవారాయన.’ ఎంత గొప్పగా చెప్పారు రాజు గారు.!
‘భక్తి సాహిత్యానికే తలమానికంగా నిలిచిన అన్నమయ్య
సంకీర్తనలు వింటే,
అన్నమయ్య సినిమాలో “అంతర్యామీ అలసితీ” వంటి పాటలు వింటూంటే నా
కళ్లవెంబడి నీళ్లు ధారాపాతంగా కారిపోతుంటాయి. రాజులు మత్తులై, మదోన్మత్తులై రాజ్యాలు ఏలుతున్న కాలంలో తన దేహము, తన
గేహము తన సర్వస్వాన్ని దేవుడు అనే భావానికి అంకితం చేసి మానవానుభవాన్ని
అక్షరీకరించిన మహితాత్ముడు అన్నమయ్య. రేపు నవ సమాజం ఏర్పడినా అన్నమయ్య సంకీర్తనలు
ప్రజలలో ప్రాచుర్యం పొందుతూనే ఉంటాయి. జీవితం పట్ల, సమాజం
పట్ల, నమ్మకం కోల్పోయిన చోట, తమను
ఆదుకునే వారు ఈలోకంలో ఎవరూ లేరు అనే సామూహిక చింతన గట్టిపడిన చోట మధ్యయుగాల్లో
భక్తిసాహిత్యం మానవజాతికి ఊరట కలిగించిందనటం సత్యదూరం కాదు. భక్తిసాహిత్యంలో
ప్రగతిశీల ధోరణిని ఈ కోణంలోనే అర్థం చేసుకోవాలనుకుంటాను. రేపటికి సంబంధించిన భయాలు,
వృత్తికి సంబంధించిన భయాలు, జీవితానికి
సంబంధించిన నిత్య భయాలు సమాజంలో లేకుండా పోయిన రోజు ఈ భక్తిసాహిత్యం కూడా
పండుటాకులాగే మారిపోతుందనడంలో సందేహపడవలిసింది ఏదీ లేదు.’
‘మీ అంత గట్టిగా నేను సంప్రదాయ విశ్వాసాన్ని ఇప్పుడు
పాటించకపోయినప్పటికీ విశ్వాసం, భక్తి పట్ల నాకు గుడ్డి వ్యతిరేకత లేదు.
భక్తిపేరుతో జరిగే అరాచకాలపట్ల వ్యతిరేకతే తప్ప, మనిషి
నమ్ముతున్న విశ్వాసాన్ని మనస్పూర్తిగా గౌరవిస్తాను. హృదయంలేని ప్రపంచంలో ఊరట
నిచ్చేది, ఆత్మలేని ప్రపంచంలో ఆత్మే మతం అని ఏ నాడో మార్క్స్
చెప్పాడు గదా. సమాజానికి భక్తి, విశ్వాసం అవసరమైనంతకాలం అవి
కొనసాగుతాయి. వాటి అవసరం తీరిపోయినప్పుడు అవి పండుటాకులా రాలిపోతాయి. ఇదే అవగాహనతో
నేను ప్రాచీన సాహిత్య, సంస్కృతులనూ నాదిగా చేసుకుంటున్నాను.
అదే సమయంలో యవ్వన జీవితంలో పరిచయమైన సామ్యవాదాన్నీ విశ్వసిస్తూ వస్తున్నాను. మానవ
జాతి సాధించిన సమస్త విజ్ఞానాన్ని యువజనులు తమదిగా చేసుకోవాలని లెనిన్ ఏనాడో
అన్నాడు కదా. ప్రాచీన సాహిత్య సంపద కూడా మానవ విజ్ఞానంలో భాగమే అయినప్పుడు దానికి
దూరంగా ఎలా ఉండగలం" అన్నారు రాజు గారు.
‘మీ వ్యాసాన్ని నా విశ్వాసం ప్రాతిపదికనే వ్యాఖ్యానించాను, విమర్శించాను
తప్పితే మరేవిధంగాను మిమ్మల్ని నొప్పించలేదనే భావిస్తున్నాను. అలా జరిగి ఉంటే
మనఃపూర్వక క్షమాపణలు. మనిషిలో ఉంటున్న సాంప్రదాయ, ఆధునిక
విశ్వాసాల, అలవాట్ల వైచిత్రిని మీ జీవితం సాక్షిగా
ఆవిష్కరించారు. ఆవిధంగా నావంటి ఎంతోమంది జీవితాల్లోని విశ్వాసాల వెనుక గల గతాన్ని
మరోసారి గుర్తుతెచ్చుకునేలా చేశారు. అందుకు మీకు ఆత్మీయ అభినందనలు. 61 సంవత్సరాలు దాటిన తర్వాత కూడా మీ పరస్పర విరుద్ద విశ్వాసాలను, భావజాలాన్ని మార్చుకోగలగడం లేదా మరి కొంత కాలం అట్టిపెట్టుకోవడం గురించి
ఆలోచిస్తున్నారు. మీ సాంప్రదాయిక విశ్వాసానికి, మార్క్సిజం
పట్ల మీ ఆరాధనకు నిండు నీరాజనాలు.’ అని ఆయన ముగింపు మాటలకు నా కళ్లు చెమర్చాయి.
ఆనంద భాష్పాలు రాలాయి. ఎవరితో ఈ విషయం చెప్పుకోవాలే తెలియదు. ఎవరితోనన్నా
పంచుకోవాలి వెంటనే. ముందుగా పక్కనున్న శ్రీమతికి చూపించాను. కూతురు కిన్నెరకు
చదివి వినిపించాను. అయినా తృప్తి కలుగలేదు. ఏదో స్వార్థం. ఇంకెందరికో
తెలియచేయాలన్న తపన నన్ను వెంటాడింది.
రాజశేఖర రాజు గారికి జవాబిచ్చాను. వ్యాసం పూర్వాపరాలు, ఏ
సందర్భంలో నా భావాలకు అక్షర రూపం ఇచ్చానో వివరించాను. నా మనసులో మాట మరోమారు బయట
పెట్టాను. ‘నా వ్యాసంకంటె మీరు విడతలుగా చేసిన వ్యాఖ్యానం అద్భుతంగా వుంది.
ఇంతకాలం నాలాంటి వాళ్లలో నేనొకడినే అనుకుంటుండే వాడిని. నేనెప్పుడు నావాదనను
వినిపించే ప్రయత్నం చేసినా స్పందన కరవయ్యేది. అయినా పదిమంది స్నేహితులం
కలిసినప్పుడు చెప్పదల్చుకుంది చెప్పితీరేవాడిని. నాకిప్పుడు "మీలో" నా
భావాలను అర్థంచేసుకోగల సన్నిహితుడొకరు దొరికారన్న ఆనందం కలుగుతుంది. సి
నారాయణరెడ్డి, మహాకవి శ్రీ శ్రీ లాంటి ప్రముఖులను ముఖ్య
అతిథులుగా పిల్చిన "ఇళ్లక్కియ చింతనై" అనే ప్రముఖ తమిళ సాహీతీసంస్థ
నన్నొకసారి, వారినెందుకు పిలిచారో, నన్నూ అందుకే పిలిచే
సరికి, ఏమని జవాబివ్వాలో తోచలేదు. ఏటేటా చెన్నైలో జరుపుకునే
వార్షికోత్సవాలకు ముఖ్య అతిథిగా తమిళ భాషేతర సాహిత్యరంగ ప్రముఖులను పిలవడం ఆ
సంస్థకు ఆనవాయితి.’
‘అప్పట్లో చిదంబరం సోదరుడు లక్ష్మణన్ ఆ సంస్థకు అధ్యక్షుడు.
ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన మాజీ ఐఏఎస్ అధికారి చంద్రమౌళిగారికి ఆయన సన్నిహితుడు.
చంద్రమౌళిగారి ద్వారా, నా ద్వారా లక్ష్మణన్ ఆహ్వానించిన సాహితీ ప్రముఖులు ఆఖరు
క్షణంలో హఠాత్తుగా రాలేమని చెప్పడంతో, నన్ను రమ్మనీ, "సాహిత్యం-మానవ
విలువలు’ అన్న అంశంపై మాట్లాడమనీ ఆ సంస్థ అధ్యక్షుడు లక్ష్మణన్ కోరాడు. పది
సంవత్సరాల (ఇప్పటికి పాతిక సంవత్సరాల క్రితం!) క్రితం మాట ఇది. ఒప్పుకోక తప్పలేదు.
ఒప్పుకున్నాను కనుక మాట్లాడక తప్పలేదు. ఆనాటి ఆ సభలో చేసిన ఆంగ్ల ఉపన్యాస సారాంశం
ఒకవిధంగా నాలో నిరంతరం రేపే ఆలోచనలే. సాహిత్యం, మానవ విలువలు ఒకరకంగా, ఏదో ఒక
రూపంలో, నా చిన్నతనంనుండి, నేను
ఆలోచించి, ఆచరణలో పెడుతుండే భావాలకనుగుణమైనవే. అవి బాల్యంలో ఒక విధంగా, పెరుగుతున్న కొద్దీ మరో రకంగా మలుపులు తిరుగుతూ వచ్చాయి. ఊహ
తెలిసినప్పటినుండి, ఏదో ఘర్షణ, అర్థంకాని ఏదో ఆలోచన, ఏదో తపన, ఏమిటో చెయ్యాలన్న పట్టుదలకు లోనవుతుండే
వాడిని. దాని సారంశమే తెలుగులోని ఈ వ్యాసం. నా బ్లాగ్ లో నేను ఆంగ్లంలో చేసిన
ఉపన్యాసం కూడా వుంది. వీలున్నప్పుడు చూడగలరు’ అని జవాబిచ్చాను.
నా కెందుకో రాజుగారి భావాలను ఆప్త మిత్రుడు భండారు
శ్రీనివాసరావుకు తెలియచేయాలనిపించింది. పంపించాను. ఆయన దగ్గరనుంచి వచ్చిన స్పందన
మరో అద్భుతమైన వ్యాఖ్యానం. ‘ఒక రచనకు కానీ ఒక రచయితకు కానీ సార్ధకత లభించడం ఆ
రచనని ఎవరయినా చదివినప్పుడు కాదు. చదివిన దానిపై ఏ చదువరి కూడా అనవసరంగా
స్పందించడన్నది నా అభిప్రాయం. అయితే ఆ మహానుభావుడు, తెలుగు తెలిసిన ప్రతి
వ్యక్తీ చేతులెత్తి నమస్కరించ తగిన ఆ రాజు గారికీ నీకూ నడుమ సాగిన స్పందన, ప్రతిస్పందన గమనించిన తర్వాత నీ రచన సంపూర్తిగా సార్ధకం అయినట్టుగా నేను
భావిస్తున్నాను’ అని అభినందిస్తూ ఆప్యాయంగా రాసాడు భండారు శ్రీనివాసరావు. దీన్నీ
రాజుగారికి పంపాను.
దీనిపైనా రాజుగారి స్పందన చదివిన తర్వాత ఆ వ్యక్తిలోని
గొప్పతనం కొట్టొచ్చినట్లు కనిపించింది. దాన్నీ యధాతథంగా కింద వుంచుతున్నాను. ‘అనుకోకుండా
మీతో ఏర్పడిన ఓ పరిచయం నాజీవితానికో వెలుగులా మారుతోంది. ఓ గొప్ప వ్యక్తిని అనడం
అతిశయోక్తి అవుతుంది కాబోలు. ఎంత మంచి వ్యక్తిని పరిచయం చేశారు మీరు! మూడు రోజుల
క్రితమే మీరు భండారు శ్రీనివాసరావు గారి గురించి చెబుతూ మెయిల్ పెట్టారు. చదివిన
దానిపై ఏ చదువరి కూడా అనవసరంగా స్పందించడన్నది నా అభిప్రాయం, అని రాసారు ఆయన.
అయితే ఆ మహానుభావుడు, “తెలుగు తెలిసిన ప్రతి వ్యక్తీ చేతులెత్తి నమస్కరించ తగిన ఆ
రాజు గారికీ నీకూ నడుమ సాగిన స్పందన, ప్రతిస్పందన గమనించిన తర్వాత
నీ రచన సంపూర్తిగా సార్ధకం అయినట్టుగా నేను భావిస్తున్నాను” అంటూ మీకు ఆయన ఇచ్చిన
మెయల్‌ను నాకు పంపారు. చదివిన ఆ క్షణం నా తలను కృతజ్ఞతతో కిందికి వాల్చేశాను.
"రామాయణం, మార్క్సిజం సాహిత్యంలో మానవ విలువలు"
పేరిట మీరు రాసిన వ్యాసం సుజనరంజనిలో చదివిన క్షణాల్లో నా హృదయంలో అప్పటికప్పుడు
చెలరేగిన భావాలను వ్యాఖ్యగా మలిచి పంపాను. దానికి మీరు ఎంతగా కదిలిపోయి
స్పందించారో అంతకు మించి మీ స్నేహితుడు శ్రీనివాసరావు గారు చలించిన హృదయంతో నాపై
ప్రశంసల జల్లు కురిపించినట్లుంది. ఓ మంచి వ్యక్తి హృదయాన్ని కదిలించిన ఫలితమే ఆయన
నాపై కురిపించిన ఈ ప్రశంసల జల్లుగా భావిస్తున్నాను. ఈ క్షణంలో నేనేమీ కోరుకోవడం
లేదు. నా చిన్ని జీవితానికి ఇది చాలు. ఈ ప్రశంసకు నేను అర్హుడిని కానని నా
కనిపిస్తున్నప్పటికి మీ మిత్రుడి హృదయావిష్కరణను వినమ్రంగా స్వీకరిస్తున్నాను.’
‘మీరు ఈ మెయిల్ పంపిన తర్వాత గత మూడు రోజులుగా
స్పందించలేకపోయాను,
నిన్న కూడా సెలవే అయినప్పటికీ సిస్టమ్ ముందు కూర్చోలేదు. ఇవ్వాళే మీ
మిత్రుడి బ్లాగు చూసాను. నా కళ్లముందు ఓ కొత్త ప్రపంచం ఆవిష్కరించబడినట్లయింది.
నిజం చెప్పాలంటే "మార్పు చూసిన కళ్ళు" పేరిట ఆనాటి మాస్కో అనుభవాలు
గురించి ఆయన రాస్తున్న బాగాలను చదువుతుంటే ఒకనాటి మహత్తర దేశంతో ఆయన పొందిన
మమేకత్వాన్ని ఆత్మావిష్కరణ చేసుకుంటున్నట్లుగా నాకనిపించింది. ఈ క్షణంలోనే ఆయన
బ్లాగును నా కిష్టమైన బ్లాగుగా ఎపీ మీడియా కబుర్లు అనే కేటగిరీలో జోడిస్తున్నాను.
మీది కూడా ఇక్కడే ఉంటుంది. "ఆ రష్యన్ మహిళ, జగదేకవీరుడు సినిమాలో సరోజాదేవి
మాదిరిగా తెలుగులో ముద్దుముద్దుగా మాట్లాడుతుంటే"... ఇది చదువుతుంటేనే నేను
ఫ్లాట్‌గా పడిపోయానంటే నమ్మండి. ఆయన రాసిన మూడు భాగాలను అపరూపంగా నా సిస్టమ్‌లో
దాచుకున్నాను.’
‘రష్యాలో ఆయన పొందిన అనుభవాలను ఇలాగే ధారావాహికగా
రాస్తూపోవాలని కోరుతూ ఇప్పుడే ఆయన బ్లాగులో కామెంట్ పెడుతున్నాను. ఆయన తన మొబైల్, లోకల్
ఫోన్ నంబర్ కూడా ఇచ్చారు కాని ఈ ఆదివారం తనను ఎక్కడ ఇబ్బంది పెడతానో అని సంకోచంతో
కాల్ చేయలేకపోతున్నాను. ఆయన రోజులో ఏ సమయంలో తీరికగా ఉంటారో చెప్పండి. ఖచ్చితంగా
ఆయనతో మాట్లాడాలనుంది. అలాగే మీతో కూడా. ఎంత చక్కటి శైలితో ఆయన ఒక మహా దేశపు
చరిత్రతో తన అనుబంధాన్ని రాస్తున్నారు? నిజంగా
పిచ్చెత్తిపోతోంది నాకు. అలాగే ఆయన రాజకీయ విశ్లేషణాత్మక వ్యాసాలు కూడా. మీవి కూడా
చదివాను. ఇకపై ఎంత బిజీగా ఉన్నప్పటికీ మీ ఇద్దరి బ్లాగులను రెగ్యులర్‌గా ఫాలో
అవుతాను. నాలుగైదు దశాబ్దాల నాటి మన దేశ రాజకీయ చరిత్ర విశేషాలను చదవాలంటే మీ
ఇద్దరి బ్లాగులూ చదివితే చాలనిపిస్తోంది నాకు’ అని ముగించారు.
రాజు గారు ప్రస్తుతం (అప్పట్లో 15 సంవత్సరాల క్రితం) చందమామ
ప్రింట్, ఆన్‌లైన్ విభాగాల్లో అసోసియేట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. మా ఇద్దరితో ఈ
‘అపరూప పరిచయం’ చిరకాలం కొనసాగుతుందని మనసారా కోరుకుంటున్నాను అన్నారు. ‘మీరు
సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని,
ఇలాగే రచనలు చేయాలని ఆశిస్తున్నాను’ అని రాసారు. భండారు శ్రీనివాస
రావు ఒక అజ్ఞాత రచయితనీ, మేమిద్దరం బాల్యం నుంచీ
స్నేహితులమనీ, కలిసి పదో తరగతి వరకు (కలిసింది మధ్యలోనే
అయినా) చదువుకున్నామనీ, దారులు వేరైన (ఆయన మాటల్లో
చెప్పాలంటే "బారులు ఒకటైనా")కొన్నాళ్లకు ఆయన మేనకోడలును నేను పెళ్లి
చేసుకోవడంతో మళ్లీ కలిసామనీ జవాబిచ్చాను. ‘ఆయన గొప్ప ఆయనకే తెలియని అతి
కొద్దిమందిలో భండారు శ్రీనివాస రావు ఒకరు’ అని అంటూ రాజు గారి స్పందనను
శ్రీనివాసరావుకు పంపినట్లు తెలియచేసాను.
(బ్లాగ్ మొదలు పెట్టి నా రచనలన్నీ అందులో పెట్టమని మా
అబ్బాయి ఆదిత్య ఇచ్చిన సలహా చివరకిలా గొప్ప వ్యక్తులతో పరిచయానికి దారి తీసింది.
హ్యూస్టన్ రావడమేంటి,
తెలుగు సాహితీ లోకం నన్ను పిలవడమేంటి, నేను
ఇక్కడ మాట్లాడింది సిలికానాంధ్ర వాళ్లు వేయడమేంటి, దాని మీద
ఇలాంటి స్పందనలొచ్చి నా బ్లాగ్ లో చేరి, నాకు గౌరవాన్ని, గర్వాన్ని
కలుగచేయడమేంటి ! ఇదంతా అందరితో పంచికోవాలనే ఆలోచనతో మా ఇరువురి చర్చను నా బ్లాగ్
లో ఒక ప్రత్యేక ఆర్టికల్ లాగా పోస్ట్ చేశాను)
అకస్మాత్తుగా, ఏదో అంశం మీద నా బ్లాగ్ పాత
పోస్టులు వెతుకుతుంటే, ఇది కనపడగానే నాకు అపరిమితమైన ఆనందం
కలిగింది. ఒక అంశాన్ని (ఇటీవలికాలంలో ఫేస్ బుక్ లైకుల్లాగా కాకుండా) క్షుణ్ణంగా
చదివి, దానిలోని మంచి, చెడులను
విశ్లేషిస్తూ, అందులో భాగంగా అపరిమితమైన విజ్ఞానాన్ని ఆ
విశ్లేషణలో చేరుస్తూ, సందర్భోచితంగా జీవితానుభవాలను చక్కగా జోడిస్తూ రాసిన
రాజుగారిని మరోమారు అభినందించాలని భావించాను. తక్షణమే అప్పటి చర్చ బ్లాగ్ లింకును
(పైన పేర్కొన్న విధంగా) వారికి పంపాను. మా ఇరువురికీ అభిమానైన భండారు
శ్రీనివాసరావుకు కూడా పంపాను. రాజు గారి స్పందనను యధాతథంగా కింద ఇస్తున్నాను.
శ్రీనివాసరావు ఫోన్లో ధన్యవాదాలు తెలియచేశారు.
రాజుగారి స్పందన:
‘సర్ నమస్తే. అద్భుతం. అపూర్వం అనిర్వచనీయంగా ఉంది మీరు పంపిన ఈ పాత
జ్ఞాపకం చూస్తుంటే. పదిహేనేళ్ల క్రితం మనమధ్య ఇంత చర్చ, సంభాషణ
జరిగిందా అంటే ఆశ్చర్యంగా ఉంది. సాంప్రదాయ సాహిత్యాన్ని, సంప్రదాయాలను
గుడ్డిగా వ్యతిరేకించవద్దు, అలాగే ఆధునిక భౌతిక శాస్త్రాలను,
ముఖ్యంగా మార్క్జిజాన్ని అధ్యయనం చేయడాన్ని విస్మరించవద్దు
అనే కోణం చుట్టూనే మన చర్చ కొనసాగింది కదా. ఈ ఒక్క చర్చ ద్వారా మీరూ, మిత్రులు భండారు శ్రీనివాస రావు గారూ, నేనూ పరిచయం
కావడం. తర్వాత ఆయన “మార్పు చూసిన కళ్లు” పేరిట సోవియట్ యూనియన్లో మాస్కో రేడియోలో పనిచేసిన కాలంలో దాని చివరి
రోజుల్లో అనుభవాలను అద్భుతంగా రాసి పుస్తకం ప్రచురించారు. కానీ ఈ పుస్తకం ప్రింట్
రూపంలోనూ నాకు చేరలేదు. కనీసం పీడీఎఫ్ కాపీని కూడా ఆయన భద్రపర్చలేదు. ఇప్పటికీ 'మార్పు చూసిన కళ్లు' బ్లాగ్ సీరీస్‌ని
తల్చుకున్నప్పుడల్లా చదువుతూనే ఉంటాను.’
‘మరీ ముఖ్యంగా శ్రీనివాసరావు గారి జీవన సహచరితో ఆ రష్యన్ అమ్మాయి మాట్లాడిన
మాటలను చదివితే నవ్వాగదు నాకు. “దశాబ్దాలుగా మీరిద్దరూ
కలిసే జీవిస్తున్నారా. అయితే మాస్కో నడిబొడ్డున మీకు విగ్రహం కట్టాల్సిందే”
అని చెప్పిందా అమ్మాయి. ఎందుకంటే పాతికేళ్ల వయసులోనే ఇద్దరు
పురుషులతో సంబంధాన్ని తెంచేసుకుని మూడో సంబంధం కోసం వెతుకులాటలో ఉంది తను మరి.
మాస్కోలో గుడి కట్టడం.... చదివినప్పుడల్లా నవ్వు ఆగదు నాకు. రెండు విభిన్న సమాజాల
మధ్య కుటుంబ విలువల్లోని మార్పును ఆ అమ్మాయి ఎంత గొప్పగా చిత్రించిందో కదా.
ప్రపంచంలోనే మహిళలకు విడాకుల స్వేచ్ఛ కల్పించిన తొలి దేశం సోవియట్ యూనియనే
కదా. నేను పనిలో ఉన్నాను కాబట్టి ఇంతకు మించి రాయలేకపోతున్నానండి. ఈ అపురూప
జ్ఞాపకాల గురించి కలిసినప్పుడు తప్పకుండా మాట్లాడుకుందాం. అలాగే భండారు శ్రీనివాస
రావు గారిని ఈ సందర్భంగా నేను పరామర్శించానని చెప్పండి. జీవన సహచరిని కోల్పోయాక
ఆయన మరీ ఒంటరైపోయినట్లుంది. మీ మిత్రులు ఇద్దరి ఆరోగ్యం బాగుందని, బాగుండాలని కోరుకుంటున్నానండి.’
‘కృతజ్ఞతలు మీకు’
రాజు

No comments:
Post a Comment