శ్రీకృష్ణుడి కాళీయ మర్దనం
శ్రీ మహాభాగవత కథ-56
వనం జ్వాలా నరసింహారావు
సూర్యదినపత్రిక (14-10-2025)
కంII చదివెడిది భాగవతమిది,
చదివించును కృష్ణు, డమృతఝరి పోతనయున్
చదివినను
ముక్తి కలుగును,
చదివెద నిర్విఘ్నరీతి ‘జ్వాలా’ మతినై
ఒకరోజున బలరాముడు లేకుండా, మిగతా గోపకుమారులంతా తన వెంటరాగా కృష్ణుడు ఆవులను
తోలుకుని అడవిలోకి వెళ్లాడు. ఎండకు దప్పికవుతుంటే ఆవులకు పెట్టి గోపకులు కూడా
యమునానది మడుగులో నీరు తాగారు. ఆ నీటిలో విషం వున్నందున తాగిన వారంతా ప్రాణాలు
కోల్పోయారు. కృష్ణుడు వారందరినీ బతికించాడు. నీరు విషం కావడానికి కారణం కాళీయుడనే
సర్పం.
యమునానదిలో ఒక గొప్ప మడుగు వున్నది. అందులో కాళీయుడనే పాము చేరి తన విషాగ్ని
జ్వాలల ద్వారా నీటిని విషపూరితం చేశాడు. ఆ మడుగును నిర్మలమైన జలాలు గలదానిగా
మారుద్దామని కృష్ణుడు సంకల్పించుకున్నాడు. ఆ మడుగు ఒడ్డున వున్న కడిమి చెట్టు
మీదికి ఎక్కాడు కృష్ణుడు. చెట్టుమీది నుండి మడుగులోకి కృష్ణుడు దూకగానే మడుగు
నుండి పెద్ద ధ్వని వచ్చింది. నీరు పైకి పొంగింది. కుత-కుతమంటూ నీటి బుడగలు
బయల్దేరాయి. కాళీయ సర్పానికి రోషం కలిగేట్లు తన చేతులతో నీటిని అల్లకల్లోలం
చేయసాగాడు. ఇలా చేయడం వల్ల కాళీయుడి హృదయంలో జ్వాలలు పుట్టాయి. తన విషంతో బాలుడైన
కృష్ణుడిని భస్మం చేద్దామనుకున్నాడు. తక్షణమే చెలరేగిపోయాడు. గోపాలకృష్ణుడిని
కాటువేశాడు. అతడి దేహాన్ని చుట్టేశాడు.
పాము దేహంతో చుట్టుకోబడిన వాడైన కృష్ణుడు కలవరపడ్డవాడిగా కనిపించడంతో
గోపబాలకులు కంగారు పడ్డారు. ఆవులు, దూడలు కూతా మేతమేయడం ఆపాయి. ఇది తెలిసన వ్రేపల్లె వాసులంతా చిన్నా-పెద్దా
తేడా లేకుండా అక్కడికి కదలి వచ్చారు. ఇదంతా చూసి, కృష్ణుడిని గురించి తెలిసిన
బలరాముడు, తనలో నవ్వుకున్నా, వచ్చేవారిని ఆపలేదు. యశోద, నందుడు కూడా అక్కడికి వచ్చారు. అంతా యమునానది గట్టుకు చేరారు. కృష్ణుడిని ఆ
పరిస్థితిలో చూసి వారికి అధికమైన దుఃఖం కలిగింది. కృష్ణుడితో మనం కూడా మడుగులో పడి
చనిపోదాం అనుకున్నారు. పడబోతున్న సమయంలో శ్రీకృష్ణుడి అంశ అయిన బలరాముడు వారిని
నివారించి కాసేపు ఓపికపట్టి కృష్ణుడి చర్యలను చూడమని చెప్పాడు. తనను ఉద్దేశించి
ఏడుస్తున్న వారిని చూసిన శ్రీకృష్ణుడు సామాన్య మానవుడిలాగా ఒక్క ముహూర్త కాలం
వినోదంగా గడిపాడు.
ఆ తరువాత కృష్ణుడు తన దేహాన్ని పెంచాడు. దాంతో కాళీయుడి పటుత్వం తగ్గింది.
ముక్కుల నుండి రక్తం కారడం మొదలైంది. శ్రీకృష్ణుడిని వదిలి నిస్సహాయంగా దూరంగా
వెళ్లి నిలబడ్డాడు. అప్పుడు కృష్ణుడు కాళీయుడి పడగలమీద చరచి, దౌడలను పట్టి, ఆ విషసర్పాన్ని గిరగిరా తిప్పి విసిరివేశాడు. దాని గర్వం
పూర్తిగా నశించి పోయింది. అంతటితో ఆగకుండా ఆ సర్పం పడగ మీద, ఒక నాట్యమండపంలో
చేసినట్లు, శ్రీకృష్ణుడు ఒక ప్రఖ్యాత
నర్తకుడిలాగా నాట్యం చేయసాగాడు. ఆడుతూ, పాడుతూ లయ తప్పకుండా నాట్యం చేశాడు. అలా నాట్యం చేస్తున్న బాలకృష్ణుడి మీద
సిద్ధులు, చారణులు, గంధర్వులు, దేవతలు, మునులు, వారి భార్యలు పూలవానలు కురిపించారు. కాలీయుడు దేహం
తేలిపోతుంటే, రక్తమాంసాలను కక్కడం మొదలు పెట్టాడు. కన్నుల నుండి విషం వస్తుంటే, నీరసంతో దిక్కులు చూస్తూ, ప్రాణాలు గొంతులోకి వచ్చాయి కాలీయుడికి. ఆ బాలుడు
శ్రీమన్నారాయణుడు కాని, పసివాడు కాదని నిశ్చయించుకుని, ‘స్వామీ! నన్ను రక్షించు’ అని వేడుకున్నాడు.
అప్పుడతడి భార్యలు భర్తకు కలిగిన బాధను చూసి సహించ లేక తల్లడిల్లి పోయారు.
భక్తితో సకల కళ్యాణగుణ పరిపూర్ణుడైన గోపాలకృష్ణమూర్తిని దర్శించి, ఆయనకు సాష్టాంగ నమస్కారం చేసి, భర్తను కాపాడమని వేడుకున్నారు. దుష్టుడైన తమ భర్తను
శిక్షించాడని, అలా దండించడం అనుగ్రహమే కాని నిగ్రహించడం కాదని, ఈ దండనం వల్ల తమకు విషాన్ని కలవారనే చెడ్డపేరు
తొలగిపోయిందని అన్నారు. సర్పరాజు పడగల మీద నాట్యం చేయడం తమ అదృష్టమని కూడా
అన్నారు. అలా చేయడం అంటే అతడు పూర్వ జన్మలో ఎంతో తపస్సు చేసి ఉండవచ్చని అన్నారు.
ఇలా ఎన్నో విధాలుగా శ్రీకృష్ణుడిని స్తోత్రం చేశారు ఆయన భార్యలు.
తమ భర్త కాళీయుడు మూర్ఖుడు, క్రూరుడు, చెడ్డ నడవడి కలవాడు కాబట్టి అతడు
అమాయకుడని, మంచివాడని తాము చెప్పమని, కాకపోతే ఆయన చేతుల్లో భర్త మరణిస్తే తమ ఐదవ తనం పోతుందని, వైధవ్యం వస్తుందని, అందుకే తమకు పతి బిక్ష పెట్టమని, కాపాడమని వేడుకున్నారు
కాళీయుడి భార్యలు. అలా చేస్తే తమకు మళ్లీ కల్యాణం జరిగినట్లవుతుందని అన్నారు.
ఇలా ప్రార్ధిస్తున్న కాళీయుడి భార్యలైన నాగకాంతలను కరునిమ్చాడు శ్రీకృష్ణుడు.
పడగల మీద నాట్యం చేయడం మాని బయటకు వచ్చాడు. అప్పుడు కాళీయుడు తన పడగలను
స్వాధీనంలోకి తెచ్చుకున్నాడు. శ్రీకృష్ణుడికి చేతులు జోడించి మొక్కాడు. తన విషయంలో
కృష్ణుడు చేసింది మంచి పనే అని అన్నాడు. అన్నీ తెలిసిన సర్వజ్ఞుడైన ఆయన తనను
క్షమించినా, శిక్షించినా దానికి తాను బద్ధుడనై
వుంటానన్నాడు. జవాబుగా శ్రీకృష్ణుడు, ఆ మడుగులో నీటిని గోవులు, మనుష్యులు తాగుతారు కాబట్టి, కాళీయుడు అక్కడ వుండవద్దనీ, తక్షణమే భార్యాబిడ్డలతో సహా, పరిజనాలను వెంటబెట్టుకుని సముద్రానికి పోయి అక్కడ నివసించమని ఆజ్ఞాపించాడు.
కాళీయుడు గరుత్మంతుడి వల్ల కలిగిన భయంతో రమణక ద్వీపాన్ని వదిలి యమునానది మడుగులో
వుంటున్నాడని, ఇక అతడికి భయం లేదని, తన పాదాల గుర్తులు ఆయన పడగల మీద చూస్తే గరుత్మంతుడు
ఆయన్నేమీ అనడని చెప్పాడు. అలా చెప్పేసరికి, కాళీయుడు రమణక ద్వీపానికి వెళ్లడానికి సమ్మతించి, ప్రయాణమై
వెళ్లిపోయాడు. యశోద, నందులు, బలరాముడు కృష్ణుడిని చూసి ఆలింగనం చేసుకున్నారు. ఆవులు, లేగదూడలు
గంతులు వేశాయి. గోపబాలకులు సంతోషించారు.
(బమ్మెర పోతన శ్రీమహాభాగవతం, రామకృష్ణ మఠం ప్రచురణ ఆధారంగా)


No comments:
Post a Comment