శ్రీకృష్ణుడి వేణునాద పరవశత్వం
శ్రీ మహాభాగవత కథ-57
వనం జ్వాలా నరసింహారావు
సూర్యదినపత్రిక (20-10-2025)
కంII చదివెడిది భాగవతమిది,
చదివించును కృష్ణు, డమృతఝరి పోతనయున్
చదివినను
ముక్తి కలుగును,
చదివెద నిర్విఘ్నరీతి ‘జ్వాలా’ మతినై
కాళీయుడు రమణక ద్వీపానికి వెళ్లడానికి సమ్మతించి, ప్రయాణమై వెళ్లిపోయిన తరువాత, పరమ సంతోషాన్ని పొందిన వ్రేపల్లె వాసులు, అప్పటికే చీకటి
పడ్డందున, ఆ రాత్రికి యమునా తీరంలోనే
వుండిపోయారు. ఇంతలో ఆ అడవిలో అర్ధరాత్రి సమయంలో భయంకరమైన దావాగ్ని చెలరేగి అందరినీ
చుట్టుముట్టగా, కాపాడమని అంతా కృష్ణుడిని
వేడుకున్నారు. మహాశక్తి సంపన్నుడైన కృష్ణుడు ఆ కార్చిచ్చును అమృతంలా తాగేశాడు.
అనంతరం, అంతా కలిసి గోవులను తోలుకుని ఇండ్లకు
పోయారు.
ఇంతలో వేసవి కాలం వచ్చింది. ఎండ వేడి అధికమవుతుంటే వెచ్చటి పడమటి గాలి
విసరసాగింది. గ్రీష్మఋతువు వచ్చి అడవులలో వ్యాపించింది. అయితే వేసవి కాల లక్షణాలు
బలరామకృష్ణులున్న బృందావనంలో ఏమాత్రం లేవు. అక్కడ, ఎక్కడ చూసినా కోకిలల కూతలు, చిలుకల పలుకులు, నెమళ్ల కేకలు, తుమ్మెదల ఝంకార ధ్వనులు వీనులకు విందును చేశాయి. ఇలా వసంత ఋతు లక్షణాలు కల
బృందావనానికి బలరామకృష్ణులు గోపకులతో కూడి పశువులను తోలుకుని పోయారు. మిక్కిలి
ఉత్సాహంగా నానా రకాల ఆటలు ఆడుకున్నారు.
ఇంతలో ప్రలంబాసురుడు అనే రాక్షసుడు గొల్ల వేషంతో వచ్చి, వీరిలో చేరి, రామకృష్ణులను చంపాలనుకున్నాడు. ఇది గ్రహించిన శ్రీకృష్ణుడు ఏమీ తెలియనివాడిలా
నటించాడు. వాడిని దగ్గరకు రమ్మని పిలిచాడు. వాడితో స్నేహం చేశాడు. తోటి
గోపబాలకులను పిలిచి, అందరం రెండు పక్షాలుగా ఏర్పడి, రాళ్లను గురి చేసి బంతులతో ఆడుకుందామని, ఎవరు గెలుస్తారో చూద్దామని అన్నాడు. కృష్ణుడు, బలరాముడు చెరొక పక్షం నాయకులుగా నిలబడ్డారు. ఆట మధ్యలో
బలరాముడికి ప్రలంబాసురుడి గురించి తెలియచేశాడు కృష్ణుడు. ఆటలోని జయాపజయాలను బట్టి, ఆట నిబంధనలకు అనుగుణంగా, ప్రలంబాసురుడి మీద బలరాముడు ఎక్కాడు.
ఆట నిబంధనల ప్రకారం ఆగాల్సిన గుర్తు దగ్గర ఆగకుండా, బలరాముడిని దింపకుండా, వడివడిగా ఆ ప్రదేశాన్ని దాటి
వెళ్లిపోయాడు ప్రలంబాసురుడు. బరువుగా వున్న బలరాముడిని మోయలేకపోయాడు.
మనుష్యాకృతిని వదిలి రాక్షసాకారం ధరించాడు. బలరాముడు ఆలశ్యం చేయకుండా, తనను ఎత్తుకుని పోతున్న ప్రలంబాసురుడిని తన పిడికిలితో
వాడి తల పగిలేట్లు పొడిచాడు. వాడి తల పగిలి పర్వతంలా కూలిపోయి, చచ్చిపోయాడు.
ఆ తరువాత, గోప బాలకులు ఆడుకుంటూ వుండగా, ఆవులు మేతకోసం దూరంగా పోయాయి. అక్కడ కార్చిచ్చు
చెలరేగింది. ఆవుల అంబా అన్న అరుపులు విని, గోపాలకులు పోయి, వాటిని వెనక్కు తోలుకొచ్చారు. కార్చిచ్చు వేగంగా, వేడిగా పాకడంతో గొల్లలంతా భీతితో కృష్ణుడి చెంతకు చేరారు.
రక్షించమని వేడుకున్నారు. వాళ్లందరిని కళ్లు మూసుకోమని చెప్పి కృష్ణుడు ఆ
దావాగ్నిని నోటితో మింగేశాడు. ఆ తరువాత కాసేపు అక్కడున్న మర్రిచెట్టు కింద
కూర్చుని, శ్రీకృష్ణుడు బలరాముడితో కలిసి
గోశాలలో ప్రవేశించాడు.
ఇలా కొంతకాలం గడిచే సరికి వర్షాకాలం వచ్చింది. పడమటి దిక్కున ఇంద్ర ధనుస్సు
కనబడింది. మెండైన వానలతో అలరారింది. పైరులన్నీ నవనవలాడుతూ చూడడానికి అందంగా
కనిపించాయి. ధాన్య సంపాదన పెరిగింది. ఆ వానాకాలంలో శ్రీకృష్ణుడు బలరాముడితో కూడి, అడవిలో ఆవులను మేపుతూ, తోటి బాలకులతో కలిసి సంతోషంగా చల్ది అన్నాన్ని భుజించాడు.
కృష్ణుడు వర్షాకాల లక్ష్మిని ఆరాధించాడు. అలా శ్రీకృష్ణుడు తన విహారాలతో
వర్షాకాలాన్ని గడిపాడు.
అంతలోనే శరదృతువు వచ్చింది. అడవులన్నీ ఆకులు, పూలు, కాయలతో గుబురుగా వున్నాయి. నదుల ప్రవాహ ఉదృతి తగ్గిపోయింది.
ఆకాశంలోనక్షత్రాలు ప్రకాశించాయి. వరి మొదలైన ధాన్యాలు బాగా పండి నేలకు అతికేలా
బరువైన కంకులను కలిగున్నాయి. ప్రకాశిస్తున్న శరత్కాలంలో శ్రీకృష్ణుడు గొల్లవారితో
కూడి బృందావనంలో పశువులను మేపసాగాడు. పిల్లనగ్రోవిని ధరించి పరవశత్వం కలిగే విధంగా
ఆలపించేవాడు. మన్మథ వికారాన్ని పుట్టించే ఆయన వేణుగానానికి గొల్ల పడుచులంతా
అనురాగం అతిశయించగా ఓర్పు కోల్పోయారు. గుంపులు, గుంపులుగా చేరి శ్రీకృష్ణుడి
గురించి ముచ్చట్లు ఆడుకున్నారు. తన్మయత్వంలో మునిగిపోయారు.
అలా మాట్లాడుకుంటూ, కృష్ణుడికి ఎదురుగా బృందావనానికి పోయారు. శ్రీకృష్ణుడిని పరవశంతో మనస్సులోనే
ఆలింగనం చేసుకోసాగారు. పూర్వజన్మలో యమునా నదీతీరంలో వెదురు చెట్టుగా
పుట్టినట్లయితే ఈ జన్మలో కృష్ణుడి అధరామృత పానం లభించేది కదా! అని అనుకున్నారు
మనస్సులో. అమృతంలాగా వున్న ఇంపైన వేణునాదం విన్న ఆవు దూడలు తల్లుల నుండి పాలు
తాగడం మానేసి నిశ్చేష్టులై చూస్తున్నాయి కదా! అనుకున్నారు గొల్ల పడుచులు. అలాగే
ఆవులన్నీ మోరలు పైకెత్తి నెమరు వెయ్యడం మానేశాయి కదా! అనీ, పక్షులు కూడా వేణునాదాన్ని ఆస్వాదిస్తున్నాయి కదా! అనీ, అనుకున్నారు.
వాస్తవానికి శ్రీకృష్ణుడి వేణుగానాన్ని నదులన్నీ వింటున్నాయనీ, అందువల్ల అవి
పరవళ్లు తొక్కుతూ ప్రవహిస్తున్నాయనీ; మేఘాలు చలించి పోతున్నాయనీ; బోయపడుచులు
పరమానందంగా క్రీడిస్తున్నారానీ; కొండలన్నీ కరిగి జలాలయ్యాయనీ; చెట్లన్నీ
చిగిర్చాయనీ; భూమ్మీద చరించే మనుష్యులు, ఆకాశంలో సంచరించే దేవతలు, పక్షులు మొదలైన ప్రాణులు దేహస్మృతిని కోల్పోతున్నారనీ గోపికలు ఒకరితో ఒకరు
చెప్పుకున్నారు. (అలా ఆ వేణునాదానికి చెట్లు చిగురిస్తున్నాయనీ, ప్రాణులు చలిస్తున్నాయనీ, అన్నింటిలోను స్పందన వున్నదని అర్థం)
(బమ్మెర పోతన శ్రీమహాభాగవతం, రామకృష్ణ మఠం ప్రచురణ ఆధారంగా)


No comments:
Post a Comment