శాన్ ఫ్రాన్ సిస్కో-ఓక్ లాండ్ లను కలిపే "బే వంతెన"
వనం జ్వాలా నరసింహారావు
డిస్నీ లాండ్, యూనివర్సల్ హాలీవుడ్ స్టూడియోలను చూసి, లాస్ ఏంజల్స్ నుంచి శాంతా క్లారా తిరిగొచ్చిన వెంటనే, మొదటి సోమవారం నాడు, గూగుల్ సంస్థలో పనిచేస్తున్న మా అబ్బాయి ఆదిత్య, ఆఫీస్ పని మీద, నాలుగు రోజులు న్యూయార్క్ వెళ్లాడు. వాడు తిరిగొచ్చేంతవరకు, కోడలు పారుల్, మనుమడు అన్ష్, నేను-శ్రీమతి దాదాపు ఇంట్లోనే గడిపాం. మధ్య-మధ్య సమీపంలోని మాల్స్ కు అత్యవసర సరకుల కొరకు వెళ్లి రావడం తప్ప ఎక్కువ ఇంట్లోనే వుండే వాళ్లం. వాడొచ్చిన వెంటనే, రెండు-మూడు రోజుల వ్యవధిలో అన్ష్ కు శెలవులు అయిపోతున్నందున, ఆదిత్య స్నేహితుడు హైదరాబాద్ వెళుతుంటే, అక్టోబర్ 10, 2009న అతడి వెంట పంపించాం . వెళ్లే లోపు ఆదిత్య-పారుల్ వాడిని గ్రేట్ అమెరికన్ పార్క్ లాంటి ప్రదేశాలకు తీసుకొని పోయారు. వాడికి కావాల్సిన వస్తువులను కొన్నారు. వాడెళ్లిన తర్వాత ముందుగా చూసిన వాటిలో ప్రపంచ ప్రఖ్యాత "బే వంతెన" గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. విశేషం ఏంటంటే, సుమారు 80 సంవత్సరాల క్రితం నిర్మించబడ్డ ఈ వంతెనపై, ఇంతవరకు, ఏ విఘ్నం లేకుండా కొనసాగుతున్న వాహనాల రాకపోకలకు, ప్రప్రధమంగా, మేం వెళ్లొచ్చిన మర్నాటినుంచి, అంతరాయం ఏర్పడింది. యాదృచ్చికమే కావచ్చు గాని, తాత్కాలికంగా చేపట్టిన రిపేర్ల సందర్భంగా, ఏర్పడిన అంతరాయం వల్ల వారం రోజుల వరకు దీన్ని మూసి వుంచారు.
శాన్ ఫ్రాన్ సిస్కో, ఓక్ లాండ్ లు పక్క-పక్కనే వున్న రెండు ప్రదేశాలు. దాదాపు జంట నగరాలని పిలవచ్చు. రెండూ వేర్వేరు గుర్తింపున్న నగరాలే. ఒక విధంగా రెండూ కలిసే వుంటాయి కాబట్టి, రెంటి మధ్య దూరం లేదనే చెప్పొచ్చు. సుమారు పది మైళ్ల నుంచి పదిహేను మైళ్ల దూరం ఒక అర గంటసేపు కారు నడుపుకుంటూ పోయే దూరమని అంటే మంచిదే మో. ఈ రెంటి మధ్య - రెంటినీ వేరు చేస్తూ, సముద్రముంటుంది. 1870 నుంచే రెంటిని కలుపుతూ, సముద్రం మీద వంతెన నిర్మించాలని భావించినప్పటికీ, 1930 లో-అప్పటి అమెరికా అధ్యక్షుడు, హెర్బర్ట్ హూవర్, ఆ ప్రతిపాదనకు అంగీకరించి, పూర్తి మద్దతు ప్రకటించిన తర్వాతే, ఆ కల నెరవేరింది. అమెరికా-కాలిఫోర్నియా సాగర ప్రాంతంలో నిర్మించిన, అనేక వంతెనల్లో, "బే వంతెన" ఒకటి. కాకపోతే దీని ప్రత్యేకత వేరు. ప్రపంచంలోని అతిపెద్ద నిడివిగల వంతెనల్లో ఒకటైన బే బ్రిడ్జ్ పై, ప్రతి రోజు, దాదాపు మూడు లక్షల వాహనాలు అటు-ఇటు వచ్చి పోతుంటాయి.
1848–1855 నాటి "గోల్డ్ రష్" స్మృతులను ఇప్పటికీ అమెరికాలో జ్ఞప్తికి తెచ్చుకుంటారు. కాలిఫోర్నియా-కొలామా ప్రాంతంలో జనవరి 24, 1848 న, జేమ్స్ విల్సన్ మార్షల్ అనే వ్యక్తి, "బంగారం" నిల్వలు కనుగొనడంతో, బంగారం అన్వేషణ కొరకు అనేక మందిలో ఆత్రుత ఆరంభమైంది. దానికే చరిత్రకారులు "గోల్డ్ రష్" అని పేరు పెట్టారు. బంగారం కనుగొనబడిందన్న వార్త (వినాయకుడు పాలు తాగాడన్న వార్త కంటె వేగంగా) ఆ నోటా-ఆ నోటా పడి, అమెరికా లోని ఇతర ప్రాంతాలకు-విదేశాలకు పాదరసంలా పాకింది. లక్షన్నర మంది ఇతర ప్రాంత అమెరికన్లు-లక్షన్నర మంది విదేశీయులు, మొత్తం మూడు లక్షలకు పైగా స్త్రీ-పురుష భేదం లేకుండా-పిల్లా జెల్లాతో సహా, భూ మార్గం-సాగర మార్గం-ఇతర మార్గాల ద్వారా కాలిఫోర్నియాకు చేరుకున్నారు. సరిగ్గా అప్పుడే ఒక టోల్ బ్రిడ్జ్ సముద్రం మీద నిర్మించాలన్న ఆలోచన జరిగింది. అదే కార్యరూపం దాల్చి, 1933 కల్లా నిర్మాణం మొదలయింది. నవంబర్ 12, 1936 న, "గోల్డెన్ గేట్" ప్రారంభానికి ఆర్నెల్ల ముందర, వాహనాల రాకపోకలు దానిమీద మొదలయ్యాయి.
అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న శాన్ ఫ్రాన్ సిస్కో-ఓక్ లాండ్ నగర వాసులు, ఇరు ప్రాంతాలను కలుపుతూ, త్వరగా రాకపోకలు సాగించేందుకు, అనువైన మార్గం వుండాలని ఎనభై ఏళ్ల కిందనే భావించారు. ఇప్పుడు వారందరి అభిమాన మార్గం బే వంతెనే. అత్యంత వేగంగా ఉప్పొంగే అలలొస్తుండే సముద్ర మీదా, అందునా అతి వేగంగా గాలులు వీచే ఆ ప్రదేశంలో, సముద్రం మధ్యలో వంతెన నిర్మించడం జరగని పని అని, నిరాశావాదులు ప్రచారం చేసేవారు. వంతెన మార్గమధ్యంలో, భూ కంపాల తీవ్రత కంటె భయంకరమైన రెండు దారుణమైన అవరోధాలకు నిరంతరం ఆస్కారమున్న, అక్కడ బ్రిడ్జ్ కట్టడానికి ఇంజనీర్లు పలు మార్లు సందేహించారు. సముద్రపు అడుగున అంచనాల కందని నేల పరిస్థితి, ఊహ కందని నీటి లోతు, భూ పొరల్లో కానరాని రాతి ప్రదేశం, అపురూపమైన డిజైన్ తయారు చేయడం లాంటి ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నారు ఇంజనీర్లు. ఇన్ని అవాంతరాల నేపధ్యంలో, ఎనిమిది మైళ్ల పొడవు పైగా వుండవలసిన వంతెన నిర్మాణం దాదాపు నమ్మశక్యం కాదనే భావించారు పలువురు. సాంకేతిక అవరోధాలను అధిగమించడం ఒక ఎత్తైతే, రాజకీయ పరమైన అవాంతరాలు మరో ఎత్తు. అయితే, అసాధ్యాన్ని సాధ్యం చేయడమే మానవ మేధస్సు సాధించిన అపూర్వ విజయాలలో ఒకటి. చివరకదే జరిగింది. వంతెన నిర్మాణం మొదలయింది-పూర్తయింది. "సస్పెన్షన్ బ్రిడ్జ్" అయితేనే లోతైన సముద్రం మీద, నిడివైన వంతెన కట్టడం సాధ్యమైన పని అని భావించిన ఇంజనీర్లు, సాంకేతిక నిపుణులు, డిజైన్ నిపుణులు ఆ దిశగా ముందుకు పోయి, నిర్మాణాన్ని చేపట్టి పూర్తి చేసారు.
డిజైన్-నిర్మాణంలో భాగమైన "ట్రస్ కాంటీ లివర్", వందలాది అడుగుల లోటు దాకా సముద్రంలోకి దిగి వుండి, వంతెనను నిరంతరం కాపాడే "యాంకర్" లాంటిది. దీని ఉపయోగం అంతా-ఇంతా అని చెప్పలేం. వంతెన లైఫ్ అంతా దానిమీద ఆధార పడి వుంది. 76 అడుగుల వెడల్పు-సుమారు నాలుగంతస్థుల ఎత్తైన భవనం తో సమానమైన పొడవున్న, ప్రపంచంలోనే అత్యంత భారీ డయామీటర్ గల "బోర్ టన్నెల్" తూర్పు-పడమరలలో వున్న వంతెన భాగాలను కలుపుతుంటుంది. ఇది మరో "యాంకర్". వంతెన నిర్మాణం అయిదు దశల్లో పూర్తయింది. మొదలు తూర్పు భాగం, తర్వాత యెర్బా బ్యూనా ఐలాండ్ ద్వారా పోయే సొరంగ మార్గం, దాంతర్వాత పశ్చిమ భాగం, అక్కడినుంచి పశ్చిమ దిశగా పోవాల్సిన రహదారి మార్గం-అవసరమైన రాంపులు, చివరగా శాన్ ఫ్రాన్ సిస్కో వైపున "ట్రాన్స్ బే టర్మినల్" నిర్మాణం జరిగింది. మూడు సంవత్సరాల ఇంజినీరింగ్ నైపుణ్యం-సాంకేతిక శక్తి-రాజకీయ మద్దతు, సుమారు ఎనిమిది కోట్ల డాలర్ల వ్యయం, వంతెన పూర్తవడానికి తోడ్పడ్డాయి.
అక్టోబర్ 17, 1989 న సంభవించిన భారీ భూ కంపంలో, వంతెన తూర్పు భాగానికి నష్టం జరిగింది. అవసరమైన రిపేర్లు చేపట్టి సరిదిద్దడ జరిగింది. ఈ సంవత్సరం సెప్టెంబర్ నెలలో, కొద్ది రోజులపాటు మూసి వేసి, డబ్బై గంటల పాటు అత్యవసరమైన మరికొన్ని రిపేర్లు చేసారు. అయితే, అక్టోబర్ 28, 2009 న, కాంటీ లివర్ విభాగానికి కొంత నష్టం జరిగి నందువల్ల, మరి కొన్ని రోజులు మూసి వుంచి, వారంరోజుల తర్వాత రాక పోకలకు తెరిచారు.
ఆదిత్య మమ్మల్ని అక్కడకు తీసుకెళ్లి చూపించినప్పుడు, ఒక్క సారి మా మదిలో రిషీకేశ్ లోని "రామ్ కా ఝూలా" "లక్ష్మన్ కా ఝూలా" లు గుర్తుకొచ్చాయి అయితే వాటికీ దీనికి పోలికున్నదని కాదు. వాటిని చూసి ఆశ్చర్య పోయిన మాకు దీన్ని చూస్తే మతి పోయిందనాలి. "బే వంతెన" చూసిన తర్వాత ఇంటికి వెళ్ళే ముందర ఒక సారి "గోల్డెన్ గేట్" చూసి పోయాం. ఆ విశేషాలు తర్వాత తెలుసుకుందాం.
No comments:
Post a Comment