Friday, October 22, 2021

పాలవంశం (బ్రాహ్మణ రాజులు-24) ....... (స్వర్గీయ బిఎన్ శాస్త్రి గారి బ్రాహ్మణ రాజ్య సర్వస్వం ఆధారంగా) : వనం జ్వాలా నరసింహారావు

 పాలవంశం (బ్రాహ్మణ రాజులు-24)

(స్వర్గీయ బిఎన్ శాస్త్రి గారి బ్రాహ్మణ రాజ్య సర్వస్వం ఆధారంగా)

వనం జ్వాలా నరసింహారావు

         శశాంకుడి మరణానంతరం వంగ దేశం శతాబ్దికాలం అరాజక స్థితికి లోనైంది. దేశంలో అనిశ్చిత పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రజల ఆర్ధిక స్థితి అస్తవ్యస్తంగా తయారైంది. ప్రజలప్పుడు ప్రతిభా సంపన్నుడు, యుద్ధవీరుడు, ధైర్యవంతుడు అయిన గోపాలుని తమ ప్రభువుగా ఎన్నుకున్నారు. అతడికి సమస్త అధికారాలను అప్పచెప్పారు. గోపాలుడి పేరుమీద పాల వంశం ఏర్పడినది. పాలవంశ స్థాపకుడైన గోపాల ప్రభువు తాత దైతవిష్ణువు గొప్ప పండితుడు. రాజానుగ్రహం వున్నవాడు. దైతవిష్ణువు కుమారుడు వస్సత విద్యావంతుడు. క్షాత్ర విద్యలలో నేర్పరి. భుజబల సంపన్నుడు. ఇతడి కుమారుడు పాలవంశ స్థాపకుడైన గోపాలుడు.

         గోపాలుడు క్షాత్ర ధర్మం అవలంభించి మహావీరుడుగా ప్రశంసింపబడినాడు. గోపాలుడి తాత దైతవిష్ణువు బ్రాహ్మణుడు. వైదికమత నిరతుడు. గోపాలుడి తరువాత రాజ్యానికి వచ్చిన వారు వైదిక ధర్మంతో పాటు క్షాత్ర ధర్మం కూడా అవలంభించారు. తరువాత కాలంలో ఈ వంశీయులు క్షత్రియులుగా పరిగణింపబడ్డారు. మరికొంత కాలానికి ఈ వంశీయులు సూర్య వంశీయులుగాను, సాగర వంశీయులుగాను పరిగణింపబడ్డారు.

         గోపాలరాజు తరువాత పాల రాజ్య సింహాసనాన్ని అతడి కుమారుడు ధర్మపాలుడు క్రీస్తుశకం 770లో అధిష్టించి సుమారు 40 సంవత్సరాలు పాలించాడు. పాల రాజ్యాన్ని విస్తరించడానికి ధర్మపాలుడు యువకులను చేర్చుకొని గొప్ప సైన్యాన్ని సనకూర్చుకున్నాడు. ధర్మపాలుడు ఉత్తరాపథాన్ని జయించిన తరువాత తన సార్వభౌమత్వాన్ని ప్రకటించుకున్నాడు. ఇతడు ఉత్తర భారతంలో అనేక రాజ్యాలను జయించినప్పటికీ వాటిని పాల సామ్రాజ్యంలో చేర్చుకోలేదు. అనేక రాజ్యాలను జయించిన ధర్మపాలుడు ఆ రాజ్యాదిపతులను తన సామంతులుగా స్వీకరించి, వారిని ఆ రాజ్యాలను పాలించడానికి నియమించాడు. అతడు అంగ, వంగ దేశాలను మాత్రమే ప్రత్యక్షంగా పాలించాడు. అతడు శతాధిక యుద్ధాలను చేసిన మహాశూరుడు. అజేయ పరాక్రముడు. సామాన్యంగా వున్న పాల రాజ్యాన్ని మహా సామ్రాజ్యంగా రూపొందించి వంగ దేశానికి సమున్నత స్థానాన్ని కలిగించాడు. ఇతడు క్రీస్తుశకం 810 లో మరణించాడు.

         ధర్మపాలుడి అనంతరం అతడి కుమారుడు దేవపాలుడు రాజ్యాధిపతి అయ్యాడు. ఇతడు కూడా శూరుడు. సమర్థుడైన పాలకుడు. తండ్రి సంపాదించి ఇచ్చిన మహా సామ్రాజ్యానికి అదనంగా కొన్ని ప్రాంతాలను జయించి విశాల భూ భాగాన్ని అతి వైభవంగా పాలించాడు. దేవపాలుడు అనేక దండయాత్రలు చేసి విజయాలు సాధించాడు. ప్రతీహార వంశీయుల ఆధిపత్యాన్ని నశింపచేసి, పాలరాజ వంశ ప్రతిష్టను పెంపొందించి, ఉత్తర భారతంలో ప్రముఖ వ్యక్తిగా దేవపాలుడు కీర్తించబడ్డాడు. దేవపాలుడి పాలనా కాలం క్రీస్తుశకం 810-850.

         దేవపాలుడి అనంతరం విగ్రహపాలుడు పాల రాజ్యాధినేత అయ్యాడు. ఇతడు కేవలం నాలుగు సంవత్సరాలే పాలించాడు. విగ్రహపాలుడు సన్యాసై రాజ్యాన్ని త్యజించిన తరువాత అతడి కుమారుడు నారాయణ పాలుడు పాల రాజ్య సింహాసనాన్ని క్రీస్తుశకం 854 లో అధిష్టించి సుదీర్ఘ కాలం పాలించాడు. కాని ఇతడు రాజ్యంలోని అధిక భాగాలను కోల్పోయాడు. నారాయణ పాలుడు శాంతి కాముకుడు. తత్త్వ జిజ్ఞాసాపరుడు. ఇతడి కాలంలో సామంతులు స్వతంత్రులయ్యారు. ప్రతీహార వంశీయులు పాల రాజ్యంలో అధిక భాగాన్ని ఆక్రమించుకున్నారు. అయితే రాష్ట్రకూటులతో సంబంధ బాంధవ్యాలు ఏర్పడ్డ తరువాత నారాయణ పాలుడు వంగ, అంగ దేశాలలో పాల సామ్రాజ్యాన్ని పునరుద్ధరించాడు. 54 సంవత్సరాలు పాలించిన ఇతడు క్రీస్తుశకం 908 లో మరణించాడు.

         నారాయణ పాలుడి తరువాత అతడి కుమారుడు రాజ్యపాలుడు సింహాసనం అధిష్టించాడు. ఇతడి కాలం నుండి పాల సామ్రాజ్యం పతనావస్థను చెందింది. ఇతడి తరువాత కొంతకాలం రెండవ గోపాలుడు, రెండవ విగ్రహ పాలుడు పాల రాజ్యాన్ని పాలించారు. రెండవ విగ్రహ పాలుడు క్రీస్తుశకం 987 లో మరణించిన తరువాత అతడి కుమారుడు మొదటి మహీపాలుడు పాల రాజ్యాదిపత్యాన్ని వహించాడు. ఇతడు పాలనలోకి వచ్చేనాటికి పాల మహాసామ్రాజ్యం అతి సాధారణ రాజ్యంగా వుండేది. క్రీస్తుశకం 1000 కల్లా పాల వంశీయులు పునః తమ సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నారు. మహీపాలుడు పాల సామ్రాజ్య పునరుద్ధరణ చేసి మరో 50 సంవత్సరాలు పాల వంశీయులు వంగ, అంగ దేశాలను పాలించేట్లు చేశాడు. మొదటి మహీపాలుడు అసాధారణ ప్రజ్ఞావంతుడు. రాజ్యకాంక్ష కలవాడు. అనేక విజయాలను సాధించాడు. ఇతడు క్రీస్తుశకం 1038 వరకు సుమారు 51 సంవత్సరాలు పాలించాడు.

         మొదటి మహీపాలుడు మరణించిన తరువాత నాయపాలుడు రాజ్యానికి వచ్చాడు. ఇతడు క్రీస్తుశకం 1055 వరకు 17 సంవత్సరాలు పాలించాడు. ఆ తరువాత నయపాలుడి కుమారుడు మూడవ విగ్రహ పాలుడు రాజ్యాదిపత్యం వహించి 15 సంవత్సరాలు పాలించాడు. ఇతడి అనంతరం అతడి జ్యేష్ట కుమారుడు రెండవ మహీపాలుడు రాజయ్యాడు. శత్రురాజుల దండయాత్రల వల్ల బలహీనపడి సామ్రాజ్య భాగాలను కోల్పోయిన సమయంలో ఇతడు అధికారంలోకి వచ్చాడు. ఇతడి పాలనాకాలం క్రీస్తుశకం 1070-1075. ఇతడి తరువాత శూరపాలుడు రాజై రెండు సంవత్సరాలు పాలించాడు. ఆ తరువాత రామపాలుడు, రాజ్యపాలుడు, కుమారపాలుడు, మూడవ గోపాలుడు రాజులయ్యారు. మూడవ గోపాలుడు క్రీస్తుశకం 1144 వరకు 14 సంవత్సరాలు పాలించాడు. ఆ తరువాత మదనపాలుడు రాజ్యానికి వచ్చాడు. ఇతడే పాల వంశీయులలో చివరివాడు. ఇతడు క్రీస్తుశకం 1161 వరకు 15 సంవత్సరాలు పాలించాడు. అనేక విజయాలను సాధించిన పాల వంశీయుల పాలన సుమారు 400 సంవత్సరాలు సాగింది.          

Thursday, October 21, 2021

ప్రతీహారవంశం (బ్రాహ్మణ రాజులు-23) ....... (స్వర్గీయ బిఎన్ శాస్త్రి గారి బ్రాహ్మణ రాజ్య సర్వస్వం ఆధారంగా) : వనం జ్వాలా నరసింహారావు

 ప్రతీహారవంశం (బ్రాహ్మణ రాజులు-23)

(స్వర్గీయ బిఎన్ శాస్త్రి గారి బ్రాహ్మణ రాజ్య సర్వస్వం ఆధారంగా)

వనం జ్వాలా నరసింహారావు

           భారత దేశంలోని రాజపుత్ర స్థానాన్ని పాలించిన రాజవంశాలలో ప్రతీహార వంశం ప్రముఖమైనది. హరిశ్చంద్రుడు అనే బ్రాహ్మణుడు ఈ రాజ్యస్థాపకుడు. ఈ వంశంలో చివరివాడు శీలుకుడు. ఇది తరువాత కాలంలో గొప్ప శక్తి సమన్వితమైన రాజ్యంగా రూపుదిద్దుకున్నది. ప్రతీహార వంశానికి చెందిన రాజులు వివిధ ప్రాంతాలలో ముఖ్యంగా ప్రాగ్దక్షిణ ప్రదేశాలలో చిన్న చిన్న రాజ్యాలను స్థాపించుకుని పాలించారు. కొందరేమో లాట దేశంలోని నందిపురి రాజధానిగా దక్షిణ భాగాన్ని ఏలారు. ఘూర్జర రాజ్యాన్ని ప్రతీహార వంశానికి చెందిన ప్రధానమైన శాఖ వారు పాలించినట్లు కూడా ఆధారాలున్నాయి. ప్రధాన శాఖకు చెందిన ప్రతీహార ప్రభువులు జోధ్పూర్ రాజధానిగా పాలన చేశారు. ప్రతీహార వంశీయుడైన నాల్గవ వత్సరాజు జాలార్, అవంతీ రాజ్యాలను పాలించినట్లు ఆధారాలున్నాయి. నాల్గవ వత్సరాజు, అతడి పూర్వీకులు ఉజ్జయినీ నగరాన్ని రాజధానిగా చేసుకొని పాలించారు.

         ప్రతీహార వంశం క్రీస్తుశకం 8 వ శతాబ్ది ప్రథమార్థంలో ప్రాముఖ్యంలోకి వచ్చింది. నాగభట్టు అనే ప్రతీహార ప్రభువు మ్లేచ్చరాజును ఎదిరించి ఓడించాడు. ఇతడే మొదటి నాగభట్టు. ఇతడు భారతావని మీద దండెత్తి వచ్చిన అరబ్బు రాజులను కూడా ఓడించాడు. మొదటి నాగభట్టు ప్రాక్ ప్రతీహార శాఖకు చెందినవాడు. మొదటి నాగభట్టు క్రీస్తుశకం 730 నుండి క్రీస్తుశకం 756 వరకు సుమారు 27 సంవత్సరాలు పాలించినట్లు ఆధారాలున్నాయి. మొదటి నాగభట్టు సైన్యాన్ని సమీకరించుకొని, మాళవము, రాజపుత్ర స్థానం, ఘూర్జరము లోని కొన్ని ప్రాంతాలను జయించి శక్తి సమన్వితమైన ప్రతీహార రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. నాగభట్టు భారత జాతి గర్వించదగ్గ మహారాజు. విదేశీయుల దాడులను అరికట్టి గొప్ప జాతీయ నాయకుడిగా ప్రసిద్ధికెక్కాడు.

         మొదటి నాగభట్టు అనంతరం అతడి సోదరుడి కుమారులు కక్కుకియా, దేవరాజు అనేవారు ఒకరి తరువాత ఒకరు రాజ్యపాలన చేశారు. దేవరాజు కుమారుడు వత్సరాజు చారిత్రిక పురుషుడు. గొప్ప బలవంతుడు. శక్తిమంతుడైన రాజు. ఇతడు రణహస్తి వత్సరాజుగా ప్రఖ్యాతుడు. వత్సరాజు తన రాజ్యానికి ఉత్తర దిశలో వున్న భూభాగాన్ని, మధ్య రాజపుత్ర స్థానాన్ని పాలించాడు. భండి తెగవారి నుండి వారి రాజ్యాన్ని వత్సరాజు బలవంతంగా గ్రహించాడు. వత్సరాజు గౌడ ప్రభువును కూడా జయించాడు. వత్సరాజు ఉత్తరాపథంలోని అనేక రాజ్యాలను జయించి మహా సామ్రాజ్యాన్ని నెలకొల్పాడు.

         వత్సరాజు మరణానంతరం అతడి కుమారుడు రెండవ నాగభట్టు ప్రతీహార రాజ్యాదిపత్యాన్ని వహించాడు. ఇతడు అనేక రాజ్యాలను జయించి తన రాజ్యాన్ని వృద్ధి చేసుకున్నాడు. అనేక గిరి దుర్గాలను కూడా స్వాధీన పర్చుకున్నాడు. రెండవ నాగభట్టు అనేక విజయాలను సాధించినప్పటికీ, చివరకు రాష్ట్రకూటాన్వయుల చేతిలో పరాజితుడయ్యాడు. విశాల సామ్రాజ్య నిర్మాణానికి ప్రయత్నించిన ప్రతీహార రెండవ నాగభట్టు కోరిక కలగా మిగిలిపోయింది. రాష్ట్రకూటులతో రెండవ నాగభట్టు యుద్ధంలో ఓడిపోయినప్పటికీ, అతడు అజ్ఞాతవాసిగా జీవిస్తూ, తిరిగి రాజ్యాన్ని సంపాదించి, ప్రతీహార సామ్రాజ్యంలోని కొన్ని భాగాలను పాలించాడు. ఇతడు క్రీస్తుశకం 833 వరకు పాలించాడు.

         రెండవ నాగభట్టు అనంతరం, అతడి కుమారుడు రామభద్రుడు సింహాసాన్ని అధిష్టించి కేవలం మూడు సంవత్సరాలు మాత్రమే పాలించాడు. ఇతడు పిరికివాడు. యుద్ధంలో వెనుకంజ వేసేవాడు. పరిపాలనా పటిమ లేనివాడు. విశాల ప్రతీహార రాజ్యంలోని అధిక భూభాగాన్ని ఇతడు యుద్ధాలలో కోల్పోవాల్సి వచ్చింది. ఇతడు ఆదరణ కోల్పోయి కేవలం నామ మాత్రపు ప్రభువుగా కొనసాగాడు. రామభద్రుడి పాలనాకాలం క్రీస్తుశకం 833-835.  

         రామభద్రుడి కుమారుడు భోజుడు బాల్యం నుండే సమస్త విద్యలలో ఆరితేరి తండ్రి మరణానంతరం ప్రతీహార సింహాసనం అధిష్టించాడు. శత్రువుల హస్తగతమై వున్న కన్యాకుబ్జాన్ని భోజరాజు జయించి తన రాజధానిగా చేసుకొన్నాడు. శత్రురాజుల వశమై పోయిన రామభద్రుడి కాలంలో దానం ఇచ్చిన అగ్రహారాలను భోజరాజు పునరుద్ధరించాడు. భోజుడు రాజ్యాధికారం వహించిన తరువాత అనేక రాజ్యాలను జయించి పూర్వ ప్రతీహార రాజ్యాన్ని పునరుద్ధరించాడు. అయితే పాల వంశీయుడైన దేవపాలుడు ప్రతీహార రాజ్యం మీద దండెత్తి భోజుడిని ఓడించాడు. భోజుడు పట్టుదల కలవాడు. ప్రతిభావంతుడు. అపజయాలను లెక్కచేయకుండా సైన్యాన్ని సమకూర్చుకుని, క్రీస్తుశకం 9 వ శతాబ్దాంతంలో దండయాత్రలు నిర్వహించి విజయాలు సాధించాడు. ప్రతీహార భోజుడు కడు సమర్థుడు. యుద్ధ విద్యా విశారదుడు. విశాల సామ్రాజ్యాన్ని తన వారసులకు అప్పచెప్పాడు. క్రీస్తుశకం 855 లో ఇతడు మరణించాడు.  

         భోజుడి తరువాత రాజ్యానికి వచ్చిన ప్రతీహార పాలకులు బలహీనులు, భోగాలాలసులు. వారి పాలనా కాలంలో మాళవము రాష్ట్రకూటుల స్వాధీనమైపోయింది. కానిభోజుడి అనంతరం రాజ్యానికి వచ్చిన మొదటి మహేంద్రపాలుడు మాత్రం పూర్వం ప్రతీహార సామ్రాజ్యంలో వున్న మాళవమును తిరిగి జయించగలిగాడు. యుద్ధాలలో కోల్పోయిన రాజ్య భాగాలు పోగా మిగిలిన విశాల ప్రతీహార సామ్రాజ్యాన్ని మొదటి మహేంద్రపాలుడు అవిచ్చిన్నంగా పాలించాడు. తండ్రి ఆర్జించి ఇచ్చిన రాజ్యానికి అదనంగా మహేంద్రపాలుడు అనేక ప్రాంతాలను జయించి సామ్రాజ్యాన్ని విస్తృతపరచాడు. యితడు క్రీస్తుశకం 885 నుండి క్రీస్తుశకం 908 వరకు పాలించాడు.

         మహేంద్రపాలుడు మరణించిన తరువాత అతడి కుమారుడు రెండవ భోజుడు ప్రతీహార సామ్రాజ్యాధినేత అయ్యాడు. ఇతడు రాజ్యానికి వచ్చిన తరువాత సవతి సోదరుడు మహీపాలుడితో యుద్ధాలు చేయాల్సి వచ్చింది. చివరకు మహీపాలుడు సింహాసనాన్ని ఆక్రమించాడు. అంతఃకలహాల్లో కూరుకుని బలహీనపడివున్న ప్రతీహార రాజ్యభాగాలను రాష్ట్రకూటులు ఆక్రమించుకున్నారు. మహీపాలుడు చాళుక్య నరసింహుడి ధాటికి తట్టుకోలేక పారిపోయి, అలహాబాద్ ప్రాంతంలో తలదాచుకున్నాడు. ఆ తరువాత కాలంలో చెల్లాచెదరైన తన సైన్యాన్ని సమీకరించుకొని, సామంతులను కూడగట్టుకొని, మహీపాలుడు, ప్రతీహార సామ్రాజ్యాన్ని పునరుద్ధరించుకున్నాడు. క్రీస్తుశకం 942 వరకు మహీపాలుడు పాలించాడు.

         మహీపాలుడి కుమారుడు ఆ తరువాత ఒక ఏడాది మాత్రమే పాలించాడు. ఆ తరువాత నలుగురు రాజులు సుమారు 15 సంవత్సరాలు పాలించారు. ప్రతీహార సామ్రాజ్యం రాష్ట్రకూట, పాల వంశీయుల దండయాత్రల వల్ల క్షీణించ సాగింది. సుమారు ఒక శతాబ్దికాలం మహావైభవంగా అనుభవించిన ప్రతీహార వంశం, ఉత్తర భారత దేశంలో మహా సామ్రాజ్య స్థాపన చేసిన వంశంగా ప్రసిద్ధికెక్కింది.                    

Monday, October 18, 2021

మహా పల్లవ వంశం (బ్రాహ్మణ రాజులు-22) ...... (స్వర్గీయ బిఎన్ శాస్త్రి గారి బ్రాహ్మణ రాజ్య సర్వస్వం ఆధారంగా) : వనం జ్వాలా నరసింహారావు

 మహా పల్లవ వంశం (బ్రాహ్మణ రాజులు-22)

(స్వర్గీయ బిఎన్ శాస్త్రి గారి బ్రాహ్మణ రాజ్య సర్వస్వం ఆధారంగా)

వనం జ్వాలా నరసింహారావు

         కలభ్రులు పూర్వ పల్లవ రాజ్యాన్ని అంతం చేసి, క్రీస్తుశకం ఆరవ శతాబ్ది చివరి పాదంలో తమిళ రాజ్యాన్ని ఆక్రమించారు. పల్లవ వంశ సంజాతుడైన సింహ విష్ణువు క్రీస్తుశకం 575 నాటికి కలభ్రులను ఓడించి, తమిళ భూభాగాల నుండి తరిమివేసి, పల్లవ రాజ్యాన్ని ఉద్ధరించాడు. సింహ విష్ణువు, అతడి సంతతి వారు కాంచీ నగరం రాజధానిగా సుమారు 325 సంవత్సరాలు దక్షిణాపథ, దక్షిణ భారత దేశాలలోశక్తి సమన్వితులై వైభవోపేతంగా పరిపాలన చేశారు. సింహ విష్ణువు వంశీయులను చారిత్రకులు మహా పల్లవ ప్రభువులుగా గుర్తించారు.

         మహాపల్లవ వంశానికి ఆద్యుడు సింహ విష్ణువు. ఇతడు అపరిమిత బలపరాక్రమ సంపన్నుడు. గొప్ప విజేత. పతనమైవున్న పల్లవ రాజ్యాన్ని సముద్ధరించిన మహావీరుడు. కదనజీవి. రాజ్యాధికారం వహించిన తరువాత సింహ విష్ణువు అపార సైన్యాన్ని సమకూర్చుకుని, కలభ్ర, చోళ, మాళవ, సింహళ, కేరళ రాజ్యాధీశుల మీద దండెత్తి విజయం సాధించాడు. ఇతడికి ‘కావన సింహుడు’ అని బిరుదం వున్నది. సింహ విష్ణువుకు దండయాత్రలో రేనాటి చోళ వంశానికి చెందిన ధనంజయ వర్మ తోడ్పడ్డాడు. అతడు సింహ విష్ణువు సామంతుడు. సింహ విష్ణువు సంస్కృత భాషా పోషకుడు. సింహ విష్ణువు పల్లవ రాజ్యాన్ని అతి వైభవంగా క్రీస్తుశకం 575 నుండి క్రీస్తుశకం 600 వరకు సుమారు 25 సంవత్సరాలు పాలించాడు.

         సింహ విష్ణువు మరణానంతరం అతడి కుమారుడు మొదటి మహేంద్ర వర్మ పల్లవ రాజ్యాదిపత్యం వహించాడు. పల్లవ రాజవంశంలో ప్రసిద్ధికెక్కిన రాజులలో ఇతడు మొదట పేర్కొనదగినవాడు. మహేంద్ర వర్మ సమరశూరుడు. లలితకళలను పోషించినవాడు. సంగీత శాస్త్ర ప్రవీణుడు. గ్రంథకర్త. తాను అభ్యసించిన సంగీత శాస్త్రాన్ని భావి తరాల వారికి ఉపయోగపడే విధంగా ఒక గ్రంథాన్ని రచించాడు. శిల్ప విద్యలో అసమాన పాండిత్యం వున్నవాడు. మహేంద్ర వర్మ పల్లవ రాజ్యాన్ని విస్తృతపరచి ప్రజానురంజకంగా పాలించాడు. మహేంద్ర వర్మ చోళ రాజులను జయించి వారి రాజ్య భాగాలను ఆక్రమించాడు. కాంచీనగర సమీపంలోని పుల్లలూరును ఇతడు జయించాడు. ఇతడు ప్రజానురంజకంగా పల్లవ రాజ్యాన్ని క్రీస్తుశకం 600 నుండి క్రీస్తుశకం 630 వరకు సుమారు 30 సంవత్సరాలు పాలించాడు.

         మొదటి మహేంద్ర వర్మ పెద్ద కుమారుడు మొదటి నరసింహ వర్మ తండ్రి అనంతరం పల్లవ రాజ్య సింహాసనాన్ని అధిష్టించాడు. రాజైన వెంటనే నరసింహ వర్మ శత్రువుల దండయాత్రలను ఎదుర్కోవాల్సి వచ్చింది. తొలి యుద్ధాలలో అతడు ఓడిపోవడంతో పల్లవ రాజ్యంలోని కొన్ని భూభాగాలు అన్యాక్రాంతం అయ్యాయి. కాని ఆతరువాత తన రాజ్యం మీద దండెత్తి వచ్చిన రెండవ పులకేశిని ఎదుర్కొని యుద్ధభూమి నుండి వెనుతిరిగేట్లుగా చేశారు. రెండవ పులకేశి యుద్ధరంగంలో మరణించాడు. పల్లవ నరసింహ వర్మ జీవితమంతా యుద్దాలలోనే గడిచిపోయింది. అయినప్పటికీ ప్రజా సంక్షేమ కార్యక్రమాలను నిర్వహించడం విస్మరించలేదు. ఇతడు క్రీస్తుశకం 630 నుండి క్రీస్తుశకం 668 వరకు సుమారు 38 సంవత్సరాలు పాలించాడు.

         మొదటి నరసింహ వర్మ కుమారుడు రెండవ మహేంద్ర వర్మ తండ్రి అనంతరం రాజ్యానికి వచ్చాడు. ఇతడు సమర్థుడైన వాడు కాదు. శత్రువులు ఆక్రమించిన రాజ్య భాగాలు పోగా మిగతా చోళ రాజ్యాన్ని రెండవ మహేంద్ర వర్మ క్రీస్తుశకం 668 నుండి క్రీస్తుశక 669 వరకు ఏడాది పాటు మాత్రమే పాలించాడు. ఇతడి కుమారుడు మొదటి పరమేశ్వర వర్మ అతడి అనంతరం రాజ్యానికి వచ్చాడు. రాజ్యానికి వచ్చిన వెంటనే అతడు అనేక చిక్కులను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇతడు కూడా కేవలం ఒక్క సంవత్సరం మాత్రమే క్రీస్తుశకం 700 వరకు పాలించాడు.

         మొదటి పరమేశ్వర వర్మ కుమారుడు రెండవ నరసింహ వర్మ క్రీస్తుశకం 700 లో పల్లవ సింహాసనం అధిష్టించి, సుమారు 30 సంవత్సరాలు పాలించాడు. ఇతడు గొప్ప పరాక్రమశాలి. రాజసింహ బిరుదాంకితుడు. నరసింహ వర్మ చాళుక్య రాజులతో పోరాడవలసి వచ్చింది. చాళుక్యుల దండయాత్రలను ఎదుర్కొని పల్లవ రాజ్య భాగాలను రక్షించుకున్నాడు. నరసింహ వర్మ పాలన పల్లవ రాజ్యమంతటా నిరాఘాటంగా సాగింది. రెండవ నరసింహ వర్మ కళాప్రియుడు. ఇతడు ప్రత్యేకత సంతరించుకున్న అనేక దేవాలయాలను నిర్మించాడు. ఇతడి కాలంలో సంస్కృత భాషకు ఆదరం లభించినది.

         రెండవ నరసింహ వర్మ కుమారుడైన రెండవ పరమేశ్వర వర్మ తండ్రి అనంతరం క్రీస్తుశకం 730 లో పల్లవ రాజ్యాధిపత్యాన్ని వహించి, 3 సంవత్సరాలు మాత్రమే పాలించాడు. ఇతడు సమర్ధుడైన పాలకుడు కాదు. చాళుక్యులతో జరిగిన పోరాటంలో అపజయం పొందాడు. చాళుక్యులతో పాటు పశ్చిమ గాంగ పురుష ముత్తమ రాజు పల్లవ రాజ్య భాగాల మీద దండెత్తటం సహించని పరమేశ్వర వర్మ అతడి రాజ్యం మీద దండెత్తాడు. ఇరు సైన్యాలు భీకరంగా పోరాడాయి. ఈ యుద్ధంలో పరమేశ్వర వర్మ మరణించాడు.

         రెండవ పరమేశ్వర వర్మ మరణానంతరం పల్లవ రాజ్యంలో అలజడులు రేగాయి. దాయాదులు సింహాసనాన్ని అధిష్టించడానికి సుముఖులుగా లేకుండిరి.  సింహ విష్ణువు సోదరుడు, భీమవర్మ సంతతి వాడైన పరమేశ్వర వర్మను క్రీస్తుశకం 733 లో మంత్రులు, (రెండవ) నందివర్మ పేరుతో పల్లవ రాజ్యాధీశుడిని చేశారు. అప్పటికి అతడు వయసు 12 సంవత్సరాలే. ఇతడు ప్రసిద్ధుడైన రాజు. పల్లవమల్ల బిరుదాంకితుడు. ఇతడు సుమారు 65 సంవత్సరాలు పల్లవ రాజ్యాన్ని పాలించాడు. రెండవ నందివర్మ రాజ్యానికి వచ్చిన తరువాత తన రాజ్యాన్ని రక్షించుకోవడానికి అనేక యుద్ధాలు చేయాల్సి వచ్చింది. విజయం సాధించిన నందివర్మ వేంగీ రాజ్య దక్షిణ భాగాలను, పల్లవ రాజ్యానికి ఉత్తరంలో వున్న ప్రాంతాలను పల్లవ రాజ్యంలో చేర్చుకున్నాడు. దీంతో పల్లవ రాజ్య ప్రతిష్ట ఇనిమడించినది. కాని బాదామీ చాళుక్యులతో వైరం ముదిరినది. ఇతడు వృద్ధాప్యంలో దివంగతుడయ్యాడు.

         రెండవ నందివర్మ మరణానంతరం అతడి కుమారుడు దంతి వర్మ పల్లవ రాజ్య సింహాసనాన్ని క్రీస్తుశకం 798 లో అధిష్టించాడు. దంతి వర్మ రాష్ట్ర కూట ప్రభువులతో పోరాడవలసి వచ్చింది. దంతి వర్మ 50 సంవత్సరాల పాటు సుదీర్ఘంగా పల్లవ రాజ్యాన్ని పాలించాడు. దంతి వర్మ తరువాత అతడి కుమారుడు, మనుమడు నృపతుంగ వర్మ పల్లవ రాజ్యాన్ని క్రీస్తుశకం 890 వరకు పాలించారు. నృపతుంగుడి సవతి సోదరుడు అపరాజితుడు క్రీస్తుశకం 890 ప్రాంతంలో పల్లవ రాజయ్యాడు. క్రీస్తుశకం 899 లో చోళ వంశజుడైన ఆదిత్యతో జరిగిన ఒక యుద్ధంలో మరణించాడు. ఆ తరువాత తంజావూరు పట్టణంలో చోళ రాజ్యం స్థాపించ బడింది. పల్లవ వంశానికి చెందిన మూడవ నందివర్మ కుమారుడు కంప వర్మ పల్లవ రాజ్యంలోని కొన్ని భాగాలను పాలించాడు. క్రీస్తుశకం 10 వ శతాబ్దం ఆరంభంలో పల్లవుల అధికారం పూర్తిగా అంతరించింది.        

                          

Sunday, October 17, 2021

అశ్వమేధం చేస్తున్న సగరుడి యజ్ఞాశ్వాన్ని అపహరించిన ఇంద్రుడు ...... శ్రీ మదాంధ్ర వాల్మీకి రామాయణం బాలకాండ మందర మకరందం-77 : వనం జ్వాలా నరసింహారావు

 అశ్వమేధం చేస్తున్న సగరుడి యజ్ఞాశ్వాన్ని అపహరించిన ఇంద్రుడు

శ్రీ మదాంధ్ర వాల్మీకి రామాయణం బాలకాండ మందర మకరందం-77

వనం జ్వాలా నరసింహారావు

సూర్యదినపత్రిక (18-10-2021)

విశ్వామిత్రుడు సగర చక్రవర్తి వృత్తాంతాన్ని చెప్పడం కొనసాగిస్తాడు." హిమవత్పర్వతం-వింధ్య పర్వతం రెండూ ఎత్తైన కొండలైనందున, వాటిమధ్య మరేవీ అడ్డంలేనందున, ఒకదాన్నొకటి ఎల్లప్పుడూ చూసుకుంటుండేవి. ఆ రెండు కొండల మధ్యనున్న ప్రదేశంలో యజ్ఞం చేస్తే ప్రశస్తమని తలచిన సగరుడు, యజ్ఞానికి కావాల్సిన సామాగ్రినంతా సమకూర్చుకున్నాడు. హిమవంతానికి, వింధ్య పర్వతానికి మధ్యనున్న ప్రదేశాన్ని ఆర్యావర్తమంటారు.అదొక పుణ్యప్రదేశం. అశ్వమేధ యాగం చేస్తున్న సగరుడు అశ్వం వెంట అంశుమంతుడిని పంపాడు. విలువిద్యలలో ప్రవీణుడై-జగత్ ప్రసిద్ధుడైన అంశుమంతుడిపై నమ్మకంతో అశ్వం వెంట పంపించడానికి సరైన కారణం లేకపోలేదు.

యజ్ఞం మధ్యలో ఇంద్రుడు రాక్షస వేషంలో వచ్చి,యజ్ఞాశ్వాన్ని దొంగిలించాడు. యజ్ఞ కర్తైన సగరుడిని లక్ష్యంచేయకుండా, ఆయన చేస్తున్న యాగాన్ని విఘ్నం చేసేందుకు, దుష్టులెవరో గుర్రాన్ని అపహరించారని-దీనివలన అందరికీ కీడుకలగొచ్చని-ఇది పాప కార్యమని చెప్పిన ఋత్విజులు సగరుడితో ఆ గుర్రాన్ని మరల తెప్పించి యజ్ఞాన్ని నిర్విఘ్నంగా పూర్తిచేయమని సలహా ఇస్తారు. వెంటనే సగరుడు, మూడులోకాలనైనా జయించగల తన అరవైవేలమంది కొడుకులతో, ఋత్విజులు తనతో మంత్రపూతంగా యజ్ఞం చేయిస్తుంటే, దొంగతనంగా రాక్షసులొచ్చి గుర్రాన్ని హరించుకుని పోయారని, తక్షణం వారంతా వెళ్లి సముద్రం వరకూ గల భూమండలాన్నంతా వెతికి ఆ గుర్రాన్ని తెమ్మనీ అంటాడు. ఆలస్యం చేయకుండా ఒక్కొక్కరు ఆమడ మేర దూరం భూమిలో వెతకాలని, దొంగ-గుర్రం దొరికే వరకు వారెవరూ మరలిరావద్దని, తిరిగొచ్చేవరకు తాను, ఋత్విజులు, మనుమడైన అంశుమంతుడు వారికొరకు వేచిచూస్తుంటామని రాజాజ్ఞగా ఆదేశిస్తాడు. సంతోషంతో వారంతా గుర్రాన్ని వెతకడానికి పోయారు".

"వారంతా అలా పోయి, ఒక్కొక్కరు ఆమడ మేర భూమిని, వజ్రాయుధంలాంటి శిఖరాలవలె నున్న గోళ్లతోను, భయంకరమైన శూలాలతోను, నాగళ్లతోను పగలగొట్టడంతో, భరించరాని ధ్వని పుట్టింది. చచ్చిపోతున్న పాముల, మరణించు క్రూర జంతువుల ఏడుపు ధ్వనులూ-పరుగెత్తలేక నిలిచిపోయి దెబ్బలు తింటున్న రాక్షసుల మూలుగులూ నాలుగు దిక్కులు వ్యాపించాయి. అరవైవేలమంది, అరవైవేల ఆమడల మేర భూమిని పాతాళం వరకూ తవ్వడంతో, భూమంతా చిందరవందరగా తయారైంది".

సగర కుమారులను నివారించమని బ్రహ్మకు విన్నవించుకున్న దేవతలు

"కొండలతో నిండి వున్న జంబూ ద్వీపమంతా సగర కుమారులు గుర్రం కోసం వెతుకుతున్నారని-సగర కుమారులవల్ల భూమంతా నాశనమవుతున్నదని-గుర్రం కొరకు కర్రలతో కొట్తూ, పౌరుషంతో పాతాళమంతా కలియపెట్తూ, దొరికినవాడినల్లా పట్టుకుని వాడే గుర్రం దొంగ అని సమస్త భూతాలను హింసిస్తున్నారని, వారి నుండి తమను కాపాడాలని గంధర్వులు బ్రహ్మను వేడుకుంటారు".

బ్రహ్మ కల్ప వివరణ-కపిలుడి కోపాగ్నికి భస్మమైన సగర కుమారులు

"అలా విపరీతమైన భయంతో వణికిపోతున్న దేవతా సమూహాలను చూసిన బ్రహ్మ, వారితో, నవ ద్వీపాలతో కూడిన భూమండలమంతా వాసుదేవుడిదని, ఆ మహాత్ముడే కపిలుడు గా ఎల్లప్పుడు భూమిని భరిస్తుంటాడని, సగర కుమారులను ఆయనే సమయం చూసి తన కోపాగ్నిలో భస్మం చేస్తాడని, వాళ్లను చింతించ వద్దని అంటాడు. ప్రతి కల్పంలో భూమి ఈ విధంగానే తవ్వబడుతుందని, దీనికొరకు దేవతలు చింతించాల్సిన పనిలేదని, అల్పాయుష్కులైన సగర కుమారులు త్వరలోనే నాశనమవుతారని బ్రహ్మ అనడంతో, దేవతలంతా సంతోషంతో వారి స్థానాలకు వెళ్లిపోయారు”.

ఇదిలా వుండగా, సగర కుమారులు తమ ప్రయత్నంలో భాగంగా, భూమినంతా తవ్వి, గుర్రం జాడ కనుక్కోలేక, తండ్రి దగ్గరకు పోయి-రాక్షసులు, కిన్నరులు భంగపడే విధంగా, మిట్ట పల్లాలు-సందులు, గొందులు అన్న తేడా లేకుండా, భూమంతా తవ్వినా గుర్రం జాడ కనుక్కోలేక పోయామని తెలియచేస్తారు. వారి మాటలకు కోపగించిన సగరుడు, గుర్రం జాడ కనుక్కోకుండా వ్యర్థంగా తిరిగొచ్చిన వారందరినీ వెళ్లి, భూమినింకా తవ్వి అశ్వాన్ని వెతికి తెమ్మంటాడు. కార్యార్థం వెళ్లినవారు, కార్యం సాధించకుండా రాకూడదని, మరల పోయి కార్యం సాధిస్తే రమ్మని-లేకపోతే రావద్దని, వుత్త చేతులతో వస్తే యజ్ఞం ఎట్లా ముగుస్తుందని అడుగుతాడు. మళ్లా వెళ్లిన వారందరు రసాతలమంతా తవ్వి, ఒకచోట కొండ లాగున్న విరూపాక్షమనే ఏనుగును చూస్తారు. ఆ ఏనుగు, భూమిని మోసేటప్పుడు-పర్వదినాలలో బరువు మోయడం వల్ల కలిగిన బాధను తొలగించుకునేందుకు, తన శిరస్సును ఆడిస్తుంటుంది. అప్పుడు భూమి కూడా వణుకుతుంది. దానికి సగర కుమారులు ప్రదక్షిణ నమస్కారాలు చేసి, తూర్పు దిక్కును భేదించి, దక్షిణాన్ని కూడా తవ్వి, అక్కడ మహాపద్మం అనే మరో ఏనుగును చూసారు. దానికీ నమస్కరించి, పడమరగా పోయి, అక్కడ కొండలా వున్న మరో దిగ్గజం-సౌమనసం, అనే దాన్ని చూసి, మొక్కి అక్కడనుండి ఉత్తరంగా పోతారు. అక్కడున్న మంచులాంటి తెల్లటి కాంతితో మనోహరంగా మెరుస్తున్న భద్రం అనే తెల్ల ఏనుగును చూసి, కుశల ప్రశ్నలను అడిగి, ఈశాన్య దిక్కుగా పోయి కోపంతో మండిపడుతూ భూమిని తవ్వారు. అలా వాళ్లు తవ్వుతున్నప్పుడు, ఒక ప్రదేశంలో, పూర్ణ తపస్వరూపుడిని-దేవతలకందరికీ దేవుడిని-యోగమే స్వభావంగా కలవాడిని-నిత్యుడైన వాసుదేవుడిని, ఆయన సమీపంలో వున్న గుర్రాన్ని చూసి, తమ కష్టం గట్టెక్కిందని తలిచారు. వాసుదేవుడెవరో తెలుసుకోకుండా,దొంగ అని సంబోధిస్తూ,యజ్ఞాన్ని విఘ్నంచేసినవాడని-యజ్ఞాశ్వాన్ని దొంగిలించినవాడని -ముని వేషంలో వున్న మాయావని దూషిస్తూ, అతన్నిప్పుడెవరూ రక్షించ లేరని నిందిస్తారు. అలా భయంలేకుండా మాట్లాడుతున్న ఆ అవివేక శూన్యులైన మూఢులపై కోపించి, మండుతూ, హుమ్మనగానే, ఆయన క్రోధాగ్నిలో కాలిపోయిన వారందరూ ఒక్కసారిగా బూడిదయ్యారు".

(జంబువు, ప్లక్షం, శాల్మలి, కుశం, క్రౌంచం, శాకం, పుష్కరం అనే సప్త ద్వీపాలే వున్నాయని కొందరు, కాదు తునకలై అవి నవద్వీపాలయ్యాయని మరికొందరు, మరిన్ని తునకలై పద్దెనిమిదయ్యాయని ఇంకొందరంటారు. బ్రహ్మ దినానికి-ఒక్క రోజుకు కల్పం అని పేరు. ఆ దినం అయిపోయింతర్వాత ప్రళయం వస్తుంది. బ్రహ్మ ప్రతి కల్పంలో మళ్లీ-మళ్లీ సూర్యచంద్రాదులను సృష్టిస్తుంటాడు. ఒక కల్పంలో జరినట్లే ఇంచుమించు కొంచెం తేడాతో ప్రతి కల్పంలో జరుగుతుంది. ప్రకృతి స్థితి గతులన్నీ ఒకే విధంగా వున్నా, జీవులు మాత్రం మారుతుంటారు. గతించిన కల్పంలోని సూర్యచంద్రాదుల వలెనే ఆకారాలు కలిగి, అవే పనులను చేస్తుంటారు. ఆ కల్పంలోని సూర్యుడి జీవాత్మ తర్వాత కల్పంలోని సూర్యుడి జీవాత్మ ఒకటి కాదు. ఆ జీవాత్మకు ఉన్నతమైన స్థానం దొరికి, ఆ స్థానంలోకి అర్హులైన మరొకరు వస్తారు. ఉద్యోగికి ప్రమోషన్ వచ్చినట్లే ఇది కూడా).

Saturday, October 16, 2021

తిక్కన సహజ పద్యరచనా శిల్పం ..... ఆస్వాదన-42 : వనం జ్వాలా నరసింహారావు

 తిక్కన సహజ పద్యరచనా శిల్పం

ఆస్వాదన-42

వనం జ్వాలా నరసింహారావు

సూర్యదినపత్రిక ఆదివారం సంచిక (17-10-2021)

వలలుడి వేషంలో అజ్ఞాతంలో వున్న భీమసేనుడు కీచకుడిని నర్తనశాలలో వధించిన తరువాత ఆ విషయం ఉపకీచకులకు తెలిసి అక్కడికి చేరుకున్నారు. అక్కడే చాటుగా వుండి ఉపకీచకుల చేష్టలను చప్పుడు చేయకుండా గమనిస్తున్న సైరంధ్రిని (ద్రౌపదీదేవి) చూశారు వాళ్లు. వారి మనసులో భయంకరమైన కోపం పెల్లుబికింది. ఆమెను కసిగా పట్టుకుని, చేతులను వెనక్కు కట్టి, కీచకుడి శవంతో పాటు దహనం చేయడానికి తీసుకుపోసాగారు. పైగా వారు చేస్తున్న పనికి రాజైన విరాటుడి అనుమతి కూడా తీసుకున్నారు. శ్మశానం దిక్కుగా వెళ్తున్నప్పుడు ద్రౌపది భయం వల్ల కలతబారిన మనస్సుతో, కన్నీరు పొంగి ముఖాన్ని కప్పివేస్తూ ఉండగా బిగ్గరగా ఎలుగెత్తి రోదనం చేసింది. తన భర్తలు గంధర్వులని చెప్పినందున వారిని ఉద్దేశించి ఆక్రందించింది. అప్పుడు తిక్కన రాసిన ఒక పద్యం ఇలా సాగుతుంది:

  ఉ:     ఆనతవైరి యో జయ! మహాద్భుతవిక్రమ యో జయంత! దు

ర్మానవిఘూర్ణమానరిపుమర్దన యో విజయాభిధాన! తే

జోనిహతాహిత ప్రకటశూర గుణప్రతిభాస యో జయ

త్సేన! విరోధి బాహుబల జృంభణభంజన యో జయద్బలా!

{శత్రువులను పాదాక్రాంతులను చేసికొన్న జయుడా! (ధర్మరాజు), మహాద్భుత విక్రమశాలైన జయంతుడా! (భీమసేనుడు), దురభిమానులైన శత్రువులను మర్దించిన విజయా! (అర్జునుడు), తేజోబలంతో శత్రువులను పడగొట్టిన ఒ జయత్సేనా! (నకులుడు), భుజబలంతో పరాక్రమం ప్రదర్శిస్తూ శత్రువులను నాశనం చేసిన ఓ జయద్బలా! (సహదేవుడు)}.

దీన్ని విశ్లేషిస్తూ సింగరాజు సచ్చిదానందం గారు ఇలా రాశారు: “గంధర్వ పతులను ఐదుగురిని ఎలుగెత్తి పిలుస్తున్నట్లు చిత్రించిన ఈ పద్యం మూల శ్లోకానికి ముచ్చటైన స్మృతి. ఇందులో పేర్కొన్న అయిదు పేర్లు పాండవులు అజ్ఞాతవాసంలో తమలో తాము పిలుచుకునే రహస్య సంకేతాలు. వాటిని మొదటి సారీ, చివరిసారీ వాడింది ఈ ఘట్టంలోనే. పేర్లెంత ముఖ్యమో వారి గుణ విశేషాలు అంత ప్రధానం. జయుడు ధర్మరాజు, ఎంతటి శత్రువైనా అతడికి తలవంచి నమస్కరిస్తాడు. జయంతుడు భీముడు, మహాద్భుత పరాక్రమశాలి. విజయుడు అర్జునుడు, ఎంతటి దురహంకారులనైనా మర్దించే మహావీరుడు. జయత్సేనుడు నకులుడు, శత్రువులను చంపి శౌర్య గుణాన్ని ప్రదర్శించేవాడు. జయద్బలుడు సహదేవుడు, విరోధుల బాహుబలాలను అణచేవాడు. వాస్తవానికి ద్రౌపది భర్తలను పేరుపేరునా పిలిచినప్పటికీ, పలికేది భీముడొక్కడే. అందువల్ల అయిదుగురి విశేషణాలు భీముడికి వర్తించేవిగా వున్నాయి. చిన్న సమాసంతో మొదలై క్రమంగా పొడుగైన విశేషణాలతో సాగిన ఈ పద్యగతి కాహల సంధించిన విధంగా ద్రౌపది రోదించిన స్ఫూర్తిని కలిగించడం తిక్కన సహజ పద్యరచనా శిల్పం”.    

కవిత్రయ విరచిత

శ్రీమదాంధ్ర మహాభారతం, విరాటపర్వం, తృతీయాశ్వాసం  

(తిరుమల, తిరుపతి దేవస్థానాల ప్రచురణ)