పాలవంశం (బ్రాహ్మణ రాజులు-24)
(స్వర్గీయ
బిఎన్ శాస్త్రి గారి బ్రాహ్మణ రాజ్య సర్వస్వం ఆధారంగా)
వనం
జ్వాలా నరసింహారావు
శశాంకుడి మరణానంతరం వంగ దేశం శతాబ్దికాలం
అరాజక స్థితికి లోనైంది. దేశంలో అనిశ్చిత పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రజల ఆర్ధిక
స్థితి అస్తవ్యస్తంగా తయారైంది. ప్రజలప్పుడు ప్రతిభా సంపన్నుడు, యుద్ధవీరుడు, ధైర్యవంతుడు
అయిన గోపాలుని తమ ప్రభువుగా ఎన్నుకున్నారు. అతడికి సమస్త అధికారాలను అప్పచెప్పారు.
గోపాలుడి పేరుమీద పాల వంశం ఏర్పడినది. పాలవంశ స్థాపకుడైన గోపాల ప్రభువు తాత
దైతవిష్ణువు గొప్ప పండితుడు. రాజానుగ్రహం వున్నవాడు. దైతవిష్ణువు కుమారుడు వస్సత
విద్యావంతుడు. క్షాత్ర విద్యలలో నేర్పరి. భుజబల సంపన్నుడు. ఇతడి కుమారుడు పాలవంశ
స్థాపకుడైన గోపాలుడు.
గోపాలుడు క్షాత్ర ధర్మం అవలంభించి
మహావీరుడుగా ప్రశంసింపబడినాడు. గోపాలుడి తాత దైతవిష్ణువు బ్రాహ్మణుడు. వైదికమత
నిరతుడు. గోపాలుడి తరువాత రాజ్యానికి వచ్చిన వారు వైదిక ధర్మంతో పాటు క్షాత్ర
ధర్మం కూడా అవలంభించారు. తరువాత కాలంలో ఈ వంశీయులు క్షత్రియులుగా పరిగణింపబడ్డారు.
మరికొంత కాలానికి ఈ వంశీయులు సూర్య వంశీయులుగాను, సాగర
వంశీయులుగాను పరిగణింపబడ్డారు.
గోపాలరాజు తరువాత పాల రాజ్య సింహాసనాన్ని
అతడి కుమారుడు ధర్మపాలుడు క్రీస్తుశకం 770లో అధిష్టించి సుమారు 40 సంవత్సరాలు
పాలించాడు. పాల రాజ్యాన్ని విస్తరించడానికి ధర్మపాలుడు యువకులను చేర్చుకొని గొప్ప
సైన్యాన్ని సనకూర్చుకున్నాడు. ధర్మపాలుడు ఉత్తరాపథాన్ని జయించిన తరువాత తన సార్వభౌమత్వాన్ని
ప్రకటించుకున్నాడు. ఇతడు ఉత్తర భారతంలో అనేక రాజ్యాలను జయించినప్పటికీ వాటిని పాల
సామ్రాజ్యంలో చేర్చుకోలేదు. అనేక రాజ్యాలను జయించిన ధర్మపాలుడు ఆ రాజ్యాదిపతులను
తన సామంతులుగా స్వీకరించి, వారిని ఆ
రాజ్యాలను పాలించడానికి నియమించాడు. అతడు అంగ, వంగ దేశాలను
మాత్రమే ప్రత్యక్షంగా పాలించాడు. అతడు శతాధిక యుద్ధాలను చేసిన మహాశూరుడు. అజేయ
పరాక్రముడు. సామాన్యంగా వున్న పాల రాజ్యాన్ని మహా సామ్రాజ్యంగా రూపొందించి వంగ
దేశానికి సమున్నత స్థానాన్ని కలిగించాడు. ఇతడు క్రీస్తుశకం 810 లో మరణించాడు.
ధర్మపాలుడి అనంతరం అతడి కుమారుడు
దేవపాలుడు రాజ్యాధిపతి అయ్యాడు. ఇతడు కూడా శూరుడు. సమర్థుడైన పాలకుడు. తండ్రి
సంపాదించి ఇచ్చిన మహా సామ్రాజ్యానికి అదనంగా కొన్ని ప్రాంతాలను జయించి విశాల భూ
భాగాన్ని అతి వైభవంగా పాలించాడు. దేవపాలుడు అనేక దండయాత్రలు చేసి విజయాలు
సాధించాడు. ప్రతీహార వంశీయుల ఆధిపత్యాన్ని నశింపచేసి, పాలరాజ వంశ ప్రతిష్టను
పెంపొందించి, ఉత్తర భారతంలో ప్రముఖ వ్యక్తిగా దేవపాలుడు కీర్తించబడ్డాడు.
దేవపాలుడి పాలనా కాలం క్రీస్తుశకం 810-850.
దేవపాలుడి అనంతరం విగ్రహపాలుడు పాల
రాజ్యాధినేత అయ్యాడు. ఇతడు కేవలం నాలుగు సంవత్సరాలే పాలించాడు. విగ్రహపాలుడు
సన్యాసై రాజ్యాన్ని త్యజించిన తరువాత అతడి కుమారుడు నారాయణ పాలుడు పాల రాజ్య
సింహాసనాన్ని క్రీస్తుశకం 854 లో అధిష్టించి సుదీర్ఘ కాలం పాలించాడు. కాని ఇతడు
రాజ్యంలోని అధిక భాగాలను కోల్పోయాడు. నారాయణ పాలుడు శాంతి కాముకుడు. తత్త్వ జిజ్ఞాసాపరుడు.
ఇతడి కాలంలో సామంతులు స్వతంత్రులయ్యారు. ప్రతీహార వంశీయులు పాల రాజ్యంలో అధిక
భాగాన్ని ఆక్రమించుకున్నారు. అయితే రాష్ట్రకూటులతో సంబంధ బాంధవ్యాలు ఏర్పడ్డ
తరువాత నారాయణ పాలుడు వంగ, అంగ దేశాలలో
పాల సామ్రాజ్యాన్ని పునరుద్ధరించాడు. 54 సంవత్సరాలు పాలించిన ఇతడు క్రీస్తుశకం 908
లో మరణించాడు.
నారాయణ పాలుడి తరువాత అతడి కుమారుడు
రాజ్యపాలుడు సింహాసనం అధిష్టించాడు. ఇతడి కాలం నుండి పాల సామ్రాజ్యం పతనావస్థను
చెందింది. ఇతడి తరువాత కొంతకాలం రెండవ గోపాలుడు, రెండవ
విగ్రహ పాలుడు పాల రాజ్యాన్ని పాలించారు. రెండవ విగ్రహ పాలుడు క్రీస్తుశకం 987 లో
మరణించిన తరువాత అతడి కుమారుడు మొదటి మహీపాలుడు పాల రాజ్యాదిపత్యాన్ని వహించాడు.
ఇతడు పాలనలోకి వచ్చేనాటికి పాల మహాసామ్రాజ్యం అతి సాధారణ రాజ్యంగా వుండేది.
క్రీస్తుశకం 1000 కల్లా పాల వంశీయులు పునః తమ సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నారు.
మహీపాలుడు పాల సామ్రాజ్య పునరుద్ధరణ చేసి మరో 50 సంవత్సరాలు పాల వంశీయులు వంగ, అంగ
దేశాలను పాలించేట్లు చేశాడు. మొదటి మహీపాలుడు అసాధారణ ప్రజ్ఞావంతుడు. రాజ్యకాంక్ష
కలవాడు. అనేక విజయాలను సాధించాడు. ఇతడు క్రీస్తుశకం 1038 వరకు సుమారు 51
సంవత్సరాలు పాలించాడు.
మొదటి మహీపాలుడు మరణించిన తరువాత నాయపాలుడు
రాజ్యానికి వచ్చాడు. ఇతడు క్రీస్తుశకం 1055 వరకు 17 సంవత్సరాలు పాలించాడు. ఆ
తరువాత నయపాలుడి కుమారుడు మూడవ విగ్రహ పాలుడు రాజ్యాదిపత్యం వహించి 15 సంవత్సరాలు
పాలించాడు. ఇతడి అనంతరం అతడి జ్యేష్ట కుమారుడు రెండవ మహీపాలుడు రాజయ్యాడు.
శత్రురాజుల దండయాత్రల వల్ల బలహీనపడి సామ్రాజ్య భాగాలను కోల్పోయిన సమయంలో ఇతడు
అధికారంలోకి వచ్చాడు. ఇతడి పాలనాకాలం క్రీస్తుశకం 1070-1075. ఇతడి తరువాత
శూరపాలుడు రాజై రెండు సంవత్సరాలు పాలించాడు. ఆ తరువాత రామపాలుడు, రాజ్యపాలుడు, కుమారపాలుడు, మూడవ గోపాలుడు రాజులయ్యారు. మూడవ గోపాలుడు
క్రీస్తుశకం 1144 వరకు 14 సంవత్సరాలు పాలించాడు. ఆ తరువాత మదనపాలుడు రాజ్యానికి
వచ్చాడు. ఇతడే పాల వంశీయులలో చివరివాడు. ఇతడు క్రీస్తుశకం 1161 వరకు 15 సంవత్సరాలు
పాలించాడు. అనేక విజయాలను సాధించిన పాల వంశీయుల పాలన సుమారు 400 సంవత్సరాలు
సాగింది.
నమస్కారం నరసింహ రావు గారు,
ReplyDeleteదయచేసి ఈ ధారావాహిక కొనసాగించండి.
భవదీయుడు
- శశికుమార్