Saturday, October 16, 2021

తిక్కన సహజ పద్యరచనా శిల్పం ..... ఆస్వాదన-42 : వనం జ్వాలా నరసింహారావు

 తిక్కన సహజ పద్యరచనా శిల్పం

ఆస్వాదన-42

వనం జ్వాలా నరసింహారావు

సూర్యదినపత్రిక ఆదివారం సంచిక (17-10-2021)

వలలుడి వేషంలో అజ్ఞాతంలో వున్న భీమసేనుడు కీచకుడిని నర్తనశాలలో వధించిన తరువాత ఆ విషయం ఉపకీచకులకు తెలిసి అక్కడికి చేరుకున్నారు. అక్కడే చాటుగా వుండి ఉపకీచకుల చేష్టలను చప్పుడు చేయకుండా గమనిస్తున్న సైరంధ్రిని (ద్రౌపదీదేవి) చూశారు వాళ్లు. వారి మనసులో భయంకరమైన కోపం పెల్లుబికింది. ఆమెను కసిగా పట్టుకుని, చేతులను వెనక్కు కట్టి, కీచకుడి శవంతో పాటు దహనం చేయడానికి తీసుకుపోసాగారు. పైగా వారు చేస్తున్న పనికి రాజైన విరాటుడి అనుమతి కూడా తీసుకున్నారు. శ్మశానం దిక్కుగా వెళ్తున్నప్పుడు ద్రౌపది భయం వల్ల కలతబారిన మనస్సుతో, కన్నీరు పొంగి ముఖాన్ని కప్పివేస్తూ ఉండగా బిగ్గరగా ఎలుగెత్తి రోదనం చేసింది. తన భర్తలు గంధర్వులని చెప్పినందున వారిని ఉద్దేశించి ఆక్రందించింది. అప్పుడు తిక్కన రాసిన ఒక పద్యం ఇలా సాగుతుంది:

  ఉ:     ఆనతవైరి యో జయ! మహాద్భుతవిక్రమ యో జయంత! దు

ర్మానవిఘూర్ణమానరిపుమర్దన యో విజయాభిధాన! తే

జోనిహతాహిత ప్రకటశూర గుణప్రతిభాస యో జయ

త్సేన! విరోధి బాహుబల జృంభణభంజన యో జయద్బలా!

{శత్రువులను పాదాక్రాంతులను చేసికొన్న జయుడా! (ధర్మరాజు), మహాద్భుత విక్రమశాలైన జయంతుడా! (భీమసేనుడు), దురభిమానులైన శత్రువులను మర్దించిన విజయా! (అర్జునుడు), తేజోబలంతో శత్రువులను పడగొట్టిన ఒ జయత్సేనా! (నకులుడు), భుజబలంతో పరాక్రమం ప్రదర్శిస్తూ శత్రువులను నాశనం చేసిన ఓ జయద్బలా! (సహదేవుడు)}.

దీన్ని విశ్లేషిస్తూ సింగరాజు సచ్చిదానందం గారు ఇలా రాశారు: “గంధర్వ పతులను ఐదుగురిని ఎలుగెత్తి పిలుస్తున్నట్లు చిత్రించిన ఈ పద్యం మూల శ్లోకానికి ముచ్చటైన స్మృతి. ఇందులో పేర్కొన్న అయిదు పేర్లు పాండవులు అజ్ఞాతవాసంలో తమలో తాము పిలుచుకునే రహస్య సంకేతాలు. వాటిని మొదటి సారీ, చివరిసారీ వాడింది ఈ ఘట్టంలోనే. పేర్లెంత ముఖ్యమో వారి గుణ విశేషాలు అంత ప్రధానం. జయుడు ధర్మరాజు, ఎంతటి శత్రువైనా అతడికి తలవంచి నమస్కరిస్తాడు. జయంతుడు భీముడు, మహాద్భుత పరాక్రమశాలి. విజయుడు అర్జునుడు, ఎంతటి దురహంకారులనైనా మర్దించే మహావీరుడు. జయత్సేనుడు నకులుడు, శత్రువులను చంపి శౌర్య గుణాన్ని ప్రదర్శించేవాడు. జయద్బలుడు సహదేవుడు, విరోధుల బాహుబలాలను అణచేవాడు. వాస్తవానికి ద్రౌపది భర్తలను పేరుపేరునా పిలిచినప్పటికీ, పలికేది భీముడొక్కడే. అందువల్ల అయిదుగురి విశేషణాలు భీముడికి వర్తించేవిగా వున్నాయి. చిన్న సమాసంతో మొదలై క్రమంగా పొడుగైన విశేషణాలతో సాగిన ఈ పద్యగతి కాహల సంధించిన విధంగా ద్రౌపది రోదించిన స్ఫూర్తిని కలిగించడం తిక్కన సహజ పద్యరచనా శిల్పం”.    

కవిత్రయ విరచిత

శ్రీమదాంధ్ర మహాభారతం, విరాటపర్వం, తృతీయాశ్వాసం  

(తిరుమల, తిరుపతి దేవస్థానాల ప్రచురణ)

  

No comments:

Post a Comment