జ్వాలానరసింహారావు-విజయలక్ష్మిల వివాహం-VIII
శ్రీ పప్పు లక్ష్మీ నరసింహమూర్తి చెప్పిన
"హిందూ సాంప్రదాయ వివాహ వేడుక"
పెళ్ళి రోజు-బంధు మిత్రుల రాక
"లక్ష్మి, పార్వతి, సరస్వతి"ల ఉమ్మడి రూపం వధువు
త్రిమూర్తుల దివ్య స్వరూపం వరుడు
వనం జ్వాలానరసింహారావు
అనుకున్న రోజు ఏప్రియల్ 30, 1969 రానే వచ్చింది. వివాహం ముహూర్తం నాడు పెళ్లికి ముందు-పెళ్ళిలో-పెళ్లైన తర్వాత చేయాల్సిన కార్యక్రమాలెన్నో వున్నాయి. ముహూర్తం ఉదయమే కావడంతో పనులన్నీ తెల్లవారు ఝామునుంచే ప్రారంభమయ్యాయి. ఇక్కడ మా ఇంట్లో (విడిది), అక్కడా ఆడ పెళ్లివారింట్లో హడావిడి ఆడంబరంగా మొదలయింది. తెలుగు వారి పెళ్ళిళ్లలో ఉండే సందడి, సంతోషం ఎంత మోతాదులో వుంటుందో ఎవరూ చెప్పలేరు. సకుటుంబ పరివార సమేతంగా, బాజా భజంత్రీల నడుమ, సంతోషంగా జరిగే ఆ కళ్యాణ మహోత్సవం అందరి జీవితాలలో మాదిరిగా మాకూ ఒక మరవలేని సంఘటన. కొందరు కల్యాణ మండపాలను వాడితే మరికొందరు వాడరు. సాధారణంగా పల్లెటూర్లలో కొబ్బరి ఆకుల పందిరి వేయడం వలన మండపం ఆవశ్యకత తగ్గింది. పట్టణాలలో టిప్ టాప్ పందిరి మండపాలు తప్పని సరిగా వాడటం జరుగుతుంది. అయితే మా వివాహం మాత్రం, జరిగింది బస్తీలో అయినా, పద్దతంతా పల్లెటూరుదే. మా మామగారి ఇంట్లోనే, ఉన్న జాగాలోనే, ఇంటిముందు ఖాళీ ఆవరణలో, కల్యాణ మంటపాన్ని మరిపించే తాటాకు పందిరి కింద కొబ్బరి ఆకుల వేదిక సిద్ధం చేశారు. మామిళ్లగూడెం బజార్లో కాపురముంటున్న చాలామంది మా ఇరువురికీ బంధువులే. అందరూ దగ్గరి వారే. ఆడ పెళ్లి వారి అతి సమీప బంధువుల ఇళ్లు వీరింటికి ఇరువైపుల వున్నందున ఆ ఇళ్లన్నీ పెళ్లి వారి ఇళ్ల లానే కనిపించాయి. వధువు ఇంటినుంచి మా ఇంటి దాకా రోడ్డంతా మా వాళ్లతోనే నిండి పోయిందనాలి.
బంధువుల రాక ఉదయాన్నుంచే మొదలయింది. మా మామ గారు మంచి పేరున్న జిల్లా స్థాయి-రాష్ట్ర స్థాయి కాంగ్రెస్ నాయకుడైనందున హేమా-హేమా కాంగ్రెస్ నాయకులందరూ ఉదయాన్నే రాసాగారు. ఖమ్మం జిల్లా, ముదిగొండ మండలంలోని మా గ్రామాలన్నీ రాజకీయంగా మా వెంట వుండేవి. ప్రతి గ్రామంలోనూ, ఎవరో ఒకరు, మా బంధువులకు చెందిన వారో- లేక వాళ్ల అనుంగు అనుచరుడో సర్పంచ్‍గా ఎన్నికవాల్సిందే. ఆ నేపధ్యంలో, మా మామగారి గ్రామం వల్లభిలో ఆయనకు-ఆయన వ్యతిరేక వర్గం వారికీ ఘర్షణలొచ్చి, ఆయన అనుచరులైన హరిజనులను గ్రామంలోకి రానివ్వకుండా ఇబ్బందులకు గురిచేశారు కొందరు. అహింసా మార్గాన్ని అవలంబించే మా మామగారు అయితరాజు రాంరావు గారు, ఘర్షణలకు దిగకుండా, గాంధేయ మార్గంలో సమస్యకు పరిష్కారం కనుక్కున్నారు. ఆచార్య వినోబా బావే శిష్యుడు ఆచార్య భన్సాలీని వల్లభి గ్రామానికి ఆహ్వానించి, గ్రామ పరిస్థితులను వివరించారు. ఆయన చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షకు కదిలొచ్చిన అలనాటి బ్రహ్మానందరెడ్డి ప్రభుత్వం, ఆచార్య భన్సాలికిచ్చిన హామీకి అనుగుణంగా హరిజనులందరూ గ్రామ ప్రవేశం చేశారు. సమస్య పరిష్కారమయ్యి, అందరూ కలిమిడిగా వుండడానికి ఇష్టపడ్డారు. ఇవన్నీ జరిగి అప్పటికింకా ఎక్కువ రోజులు కానందున, సత్సంబంధాలు కొనసాగించే దిశగా, వల్లభి గ్రామం మొత్తం కదిలొచ్చింది. ఇక మావైపు వారి విషయానికొస్తే, మేమూ చాలామందిమే అయ్యాం.
నేనప్పుడప్పుడే కమ్యూనిస్ట్ పార్టీ వారితో తిరుగుతుండడం వల్లా, గ్రామ రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటున్నందు వల్లా, మా వూరినుంచీ అనేకమంది రావడమే కాకుండా, జిల్లాకు చెందిన కమ్యూనిస్ట్ నాయకత్వమంతా పెళ్ళికొచ్చారు. ఇలా పెళ్ళి వారిల్లు కళ-కళలాడింది. పెళ్ళికి వచ్చినవారిలో మాకు గుర్తున్నంతవరకు హాజరయిన పెద్దల్లో, శ్రీయుతులు (అప్పటి ఎమ్మెల్యే) కత్తుల శాంతయ్య, (జిల్లా పరిషత్ అధ్యక్షుడు) భువన సుందర రెడ్డి, (ప్రముఖ కవి-ఎమ్మెల్సీ) హీరా లాల్ మోరియా, రావులపాటి జానకి రాంరావు, (ఒకసారి ఎమ్మెల్యే) బొమ్మకంటి సత్యనారాయణ రావు, (ఒకసారి ఎమ్మెల్యే) చేకూరి కాశయ్య, (ఒకప్పటి సమితి అధ్యక్షుడు) రావులపాటి సత్యనారాయణ రావు వున్నారు. కమ్యూనిస్ట్ పార్టీకి చెందిన శ్రీయుతులు (ఎమ్మెల్యే) రజబ్ అలి, (మునిసిపల్ చైర్మన్) చిర్రావూరి లక్ష్మీనరసయ్య, (ఒకసారి ఎమ్మెల్యే) మంచి కంటి రామ కిషన్ రావు, (ఒకసారి ఎమ్మెల్యే) బాజి హనుమంతు, వనం నరసింగరావు, రావెళ్ల సత్యనారాయణ, గండ్లూరి కిషన్ రావు కూడా వచ్చారు. ఇంతలో పెళ్లి తంతు మొదలయింది. ఒక వైపు వధువు గౌరీ పూజ, మరో వైపు వరుడున్న విడిదిలో వర పూజకు సన్నాహాలు మొదలయ్యాయి.
హిందూ సంప్రదాయం ప్రకారం వధువుని "లక్ష్మి,పార్వతి,సరస్వతి"ల ఉమ్మడి రూపంగా భావిస్తారు. పచ్చదనంతో లోకాన్ని చైతన్యపరిచే ప్రకృతి ప్రతిరూపంగా వధువుని అలంకరిస్తారు. ఇక వరుడిని త్రిమూర్తుల దివ్యస్వరూపంగా, విధాత చూపిన విజయోన్ముఖ పథంలో విజ్ఞతతో నడిచేందుకు సిద్ధమైన సిద్ధ పురుషుడుగా భావిస్తారు. ఆ నాడు-ఆ కాసేపు మేమిద్దరం ఆ పాత్రలను పోషించాం.(Part IX Next Follows)
No comments:
Post a Comment