జ్వాలానరసింహారావు-విజయలక్ష్మిల వివాహం- III
శ్రీ పప్పు లక్ష్మీనరసింహమూర్తి చెప్పిన
"హిందూ సాంప్రదాయ వివాహ వేడుక"
వివాహ ప్రక్రియ-నాంది
వనం జ్వాలానరసింహారావు
మా పెళ్లికి ముందు కూడా ఇవన్నీ జరిగాయి. 1968వ సంవత్సరంలో, అప్పుడే డిగ్రీ పాసయ్యి, అప్పట్లో మా గ్రామం వనం వారి కృష్ణా పురంలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల దృష్ట్యా, నేను మా వూళ్లోనే వుంటూ వ్యవసాయం చేయిస్తున్నాను. వ్యవసాయంతో పాటు రాజకీయాల్లో కూడ చురుగ్గా పాల్గొంటున్నాను. మా వూళ్లో ఒక కులానికి చెందిన కొందరు పెత్తందార్లు, గ్రామంలో కాంగ్రెస్ పార్టీకి బలం లేకపోయినా, బలమెక్కువగా వున్న కమ్యూనిస్ట్ పార్టీకి చెందిన వారిని గ్రామ సర్పంచ్ కాకుండా పెత్తనం చెలాయిస్తున్న రోజులవి. మా నాన్న వనం శ్రీనివాసరావు గారు కూడా గ్రామ రాజకీయాలను దృష్టిలో పెట్టుకొని, అందరితో మంచిగా వుండాలనే ఆలోచనతో, వారికే మద్దతు పలికేవాడు.
అయితే పక్క గ్రామంలో వుంటున్న మా పెదనాన్న వనం శ్రీరాంరావు గారు అలా కాకుండా, ఆయన వూళ్లో తనకంటూ ఒక రాజకీయ ప్రత్యేకతను ఏర్పరుచుకున్నారు. ఆయన గ్రామం వల్లాపురం, మా నాన్న కరిణీకం చేస్తున్న అమ్మపేట గ్రామం ఒకే పంచాయితీగా వుండేది. ఆ పంచాయితీకి ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఆయన అభ్యర్థి గెలవాల్సిందే. ఆయనకు నేనంటే ఆయన పిల్లలకంటే ఎక్కువ ప్రేమ. ఆయన రాజకీయ వారసుడిని నేనని అందరితో అనేవాడు. ఆయనకు నన్నెలాగైనా మా వూరికి పరిమితంచేసి, నన్ను రాజకీయాల్లో పూర్తిగా దించాలన్న కోరిక వుండేది. నాకూ రాజకీయాలంటే మక్కువే కాబట్టి ఆయన మాటలపై గురి కలిగింది. అయితే పక్క వూరు కమలాపురంలో వున్న బాబాయి స్ఫూర్తితో కమ్యూనిస్ట్ పార్టీమీద ఎక్కువ అభిమానంతో వుండేవాడిని. ఈ నేపధ్యంలో, పెదనాన్నగారి కుమారుడు, నా పాఠశాల క్లాస్ మేట్ గోవిందం (వరదా రావు), పెనుగంచిపోలు గ్రామ వాస్తవ్యులైన అప్పారావు-అన్నపూర్ణల కూతురు సావిత్రిని వివాహం చేసుకున్నాడు. అది పూర్తిగా పెద్దలు కుదిరించిన పెళ్లి. పెనుగంచిపోలులో జరిగిన ఆ పెళ్ళికి నేను హాజరయ్యాను.
ఆ పెళ్లికి అయితరాజు వారమ్మాయి విజయలక్ష్మి రాలేదు. కాని, ఆ తర్వాత ఖమ్మం శ్రీరాంరావు గారింట్లో జరిగిన "మూడు నిద్రల" తంతులో భాగమైన "మేజువాణి" కి నేను కూడా వెళ్ళినప్పుడు, ఆ అమ్మాయి పాట పాడుతుంటే విన్నాను. అమ్మాయినీ చూశాను. "ఆవకాయ...మాగాయ..గోంగూర పచ్చడి..." అనే ఆ పాట అప్పటికీ-ఇప్పటికీ ఆమె పాడుతూనే వుంటుంది. బహుశా మా ఆవిడకు వచ్చిన-పాడగలిగిన పాట అదొక్కటేనేమో ! పాట పాడిన అమ్మాయి ఎవరని నేను మా పెదనాన్నగారిని అడగడం, ఎవరో ఆయన వివరించడం, పెళ్లి చేసుకుంటావా అని పరాచకంగా మాట్లాడడం జరిగాయప్పుడు. నేను మరిచిపోయినా, మా పెదనాన్న మరిచిపోకుండా, ఆ అమ్మాయంటే నేను ఇష్టపడుతున్నానని అయితరాజు రాంరావు గారికి చెప్పి సంబంధం కుదిరించడానికి నిశ్చయించుకున్నాడప్పుడు.
అప్పట్లో నాకింకా ఇరవై ఏళ్ల వయస్సే. అప్పట్లో నాకున్న ఒకే ఒక్క పట్టుదల మా వూళ్లో "పెత్తందార్ల" అభ్యర్థి కాకుండా, మేమనుకుంటున్న(కొంతమంది యువకుల బృందం) వ్యక్తి, పెత్తందార్లను ఎదిరించగలిగిన వ్యక్తి సర్పంచ్ కావాలని. ఆ దిశగా, కమ్యూనిస్ట్ పార్టీ సానుభూతిపరులందరూ, అప్పటివరకూ బయటపడడానికి భయపాడిన వారితో సహా, నా మాట మీద నమ్మకంతో మా పక్షాన చేరారు. సరిగ్గా అదే రోజుల్లో, జనవరి నెల 1969 వ సంవత్సరంలో, ఒక నాడు, పెదనాన్న శ్రీరాంరావు గారు, మా సమీపంలోని వల్లభి గ్రామానికి చెందిన అయితరాజు రాంరావు గారిని, ఆయనతో పాటు ఆ గ్రామానికే చెందిన కొడాలి వెంకయ్యను తీసుకొని కృష్ణా పురంలోని మా ఇంటికొచ్చారు. నేనప్పుడు ఇంటిపక్కనే వున్న పొలంలో జొన్న కళ్ళం వేయిస్తున్నాను. అప్పట్లో మాకు ఏటా 150-200 బస్తాల పచ్చ జొన్నలు, 300-400 బస్తాల వడ్లు పండేవి. కందులు, పెసలు, వేరుశనగ కూడా పెద్ద మోతాదులో పండేవి. పది అరకల వ్యవసాయం-పది మందికి పైగా పనివాళ్లు (జీత గాళ్లు అనేవారప్పుడు)-పది జతల ఎడ్లు-నాలుగు పెద్ద బండ్లు-కచ్చడం-మేనా-పల్లకి వుండేవి మాకు.
ఇంతకూ ఆ ముగ్గురొచ్చినకారణం-అయితరాజు రాంరావు గారి మూడో కూతురు విజయలక్ష్మికి, నాకు పెళ్లి జరిపించే ప్రతిపాదన చేయడానికి. పెళ్లి సంబంధాల ప్రతిపాదనలు చాలా గమ్మత్తుగా వుంటాయి. ఇంతకు ముందే చెప్పినట్లు, ఇరు పక్షాలకు చెందిన-ఇరువురికీ కావాల్సిన "పెళ్లి పెద్దలు" సంధాన కర్తలుగా వ్యవహరించి, కాబోయే వియ్యంకుల మధ్య రాయభారాలు చేసి, ఒప్పించి, కార్యక్రమానికి నాంది పలుకుతారు. మా విషయంలో ఇరు పక్షాలకు కావాల్సిన వ్యక్తి శ్రీరాంరావు గారు. అయితరాజు రాంరావు గారి తోడల్లుడు కూతురునే తనకొడుక్కు చేసుకున్నందువల్ల వాళ్ళకు, మా నాన్నకు అన్నగారైనందున మాకు-ఇలా ఇద్దరికీ కావాల్సిన పెద్ద ఆయన. అలానే అయితరాజు రాంరావు గారి గ్రామానికి చెందిన కొడాలి వెంకయ్య (కులం వేరైనా, బంధువు కాకపోయినా, మా నాన్నకు తెలిసినాయన) కూడా. వాస్తవానికి రాంరావు గారు మా ఇంటికి రావడానికి మరొకరి తోడు అవసరంలేదు. ఆయన, మా నాన్న చిన్నప్పుడు కలిసి చదువుకున్నారు. ఒకరినొకరు "ఒరేయ్" అని పిల్చుకునే చనువుంది. అయినా, వివాహ సంబంధం కుదిరించడానికి, ఇలాంటి ప్రక్రియ అందరూ చేయడం ఆచారంగా వస్తున్నది. దీనికి కారణం, ఇది కేవలం రెండు కుటుంబాలను మాత్రమే కలపడం కాకుండా, ఇరువైపుల సంబంధీకులను కూడా కలపేటందుకే.
మా అమ్మా-నాన్న వెంటనే వారి ప్రతిపాదనకు అంగీకరించి, పెళ్లి చూపులకు వస్తామని చెప్పారు. ఆ సమయంలో రాంరావు గారి కూతురు విజయలక్ష్మి, విజయవాడలో తల్లి గారి తరపున బాబాయైన తుర్లపాటి హనుమంతరావు (రాంరావు గారి తోడల్లుడు) గారి ఇంట్లో వుంటూ, హోమియో వైద్య చికిత్స చేయించుకుంటున్నందున, ఆమెను ఖమ్మం పిలిపించిన తర్వాత పెళ్లి చూపులు ఏర్పాటుచేశారు. పెళ్లి చూపులకు మేమొస్తున్నామని చెప్పడానికి రాంరావు గారు విజయవాడకు వెళ్లారు. ఆ సమయంలో హనుమంతరావు గారింట్లో వారి బావమరిదులు భండారు శ్రీనివాసరావు, భండారు పర్వతాల రావు గారు కూడా వున్నారు. శ్రీనివాసరావు, నేను ఖమ్మం రికాబజార్ హైస్కూల్లో పదవ తరగతి వరకు కలిసి చదువుకున్నాం. రాంరావు గారి రెండో కూతురు భర్త జూపూడి ప్రసాద్ కూడా మాతో కలిసి చదువుకున్నాడు. విషయం తెలుసుకున్న శ్రీనివాసరావు మా ఇద్దరి పరిచయం గురించి, నాకు క్రికెట్ ఆటంటే అభిమానం అన్న సంగతీ చెప్పాడని మా ఆవిడ తర్వాత నాకు చెప్పింది. శ్రీనివాసరావుకు కాబోయే సతీమణి నిర్మలా దేవి (దుర్గ) విషయం తెలుసుకుని, కాబోయే పెళ్లి కూతురుకు బోలెడు బహుమానాలు కొని ఇచ్చిందట. ఆమెగారికి, అప్పటికీ-ఇప్పటికీ ఇలా అందరికీ బహుమానాలు ఇవ్వడం అలవాటే. అదొక అరుదైన సద్గుణం ఆమెలో. పెళ్లి చూపులతో మా వివాహ ప్రక్రియ మొదలవడానికి నాంది జరిగిందలా.(Part IV Next Follows)
No comments:
Post a Comment