జ్వాలా మ్యూజింగ్స్-23
వనం జ్వాలా నరసింహారావు Vanam Jwala Narasimha Rao
వనం కృష్ణ రాయలు గారి నుంచి ఆదిత్య కృష్ణ రాయ్ వనం వరకు
(From Vanam Krishna Raayalu to Aditya Krishna Roy Vanam)
ఆంధ్ర ప్రదేశ్ వనం వారి కృష్ణా పురం నుంచి అమెరికా-శాన్ ఫ్రాన్ సిస్కోకు
(From Andhra Pradesh Vanamvari Krishnapuram to Amerika- San Francisco)
మా అమెరికా ప్రయాణానికి ముఖ్య కారణం పారుల్-ఆదిత్యలకు పుట్టబోయే కూతురుని చూడడం. మేం వచ్చింది సెప్టెంబర్ 22, 2009 న అయినందున ఇంకా పాపాయి పుట్టడానికి రెండు నెలల వ్యవధి వుంది. ఈ లోపు దసరా-దీపావళి పండుగలను హైదరాబాద్ లో వుంటే ఎలా జరుపుకునే వాళ్లమో అలానే జరుపుకున్నాం. ఇక్కడా అక్కడి లాగానే తెలిసిన వాళ్లొచ్చారు. దీపాలంకరణ దగ్గర్నుంచి, కలిసి మెలిసి విందు భోజనం చేయడం వరకూ ఏ తేడా కనిపించలేదు.
ప్రసవ సమయంలో కాబోయే తల్లి, ఆమె తల్లి పక్కనుండాలని భారతదేశంలో పుట్టి-పెరిగిన వారందరూ సహజంగా అనుకుంటారు. హిందూ ఉమ్మడి కుటుంబ వ్యవస్థలో అది ఒక సర్వసాధారణ విషయం. గర్భిణీ స్త్రీకి తన తల్లి పక్కనుంటే అదో ధైర్యం. మా పారుల్ కు సంబంధించినంతవరకు, ఆ విషయంలో, కొంచెం తేడా వుందనాలి. వాళ్లమ్మ ను పిలిచినట్లే మా శ్రీమతిని (తన అత్త గారిని) కూడా "మమ్మీ" అని పెళ్ళి అయినప్పటి నుంచీ పిలవడం (నన్ను పాపా అని కూడా అంటుంది) వల్ల, తనకు పాపాయి పుట్టినప్పుడు, మా శ్రీమతి వున్నా అదే ధైర్యంతో వుండేదేమో ! కాకపోతే ఈ విషయంలో ఆదిత్య అది న్యాయం కాదనుకున్నాడు. కాబోయే బామ్మ-తాతయ్యలను ప్రసవానికి ముందు వచ్చే విధంగా, ప్రసవ సమయంలో అమ్మమ్మ-తాతయ్యలుండే విధంగా, తాతయ్య (పారుల్ తండ్రి) వ్యాపార పనుల వల్ల వెళ్లినప్పటికీ మరికొంత కాలం అమ్మమ్మ వుండేటట్లు, అమ్మమ్మ వెళ్లిన తర్వాత బామ్మ-తాతయ్యలు మనుమరాలితో ఆడుకునే ట్లు మా అందరి ప్రయాణం టికెట్లు కొన్నాడు. అలానే అందరం శాన్ ఫ్రాన్ సిస్కోకు రావడం-పోవడం జరిగింది.
మేం శాన్ ఫ్రాన్ సిస్కో- అమెరికా వచ్చిన మర్నాడు కోడలు పారుల్ పుట్టిన రోజు సరదాగా గడిపాం. సెప్టెంబర్ 24, 2009న ఆదిత్య, నేను, శ్రీమతి కలిసి హైదరాబాద్ నుంచి మాతో వచ్చిన మనుమడు అన్ష్ ను తీసుకొని సమీపంలోని "మోంటిరే బే అక్వేరియం" వెళ్లాం. రెండు రోజుల తర్వాత సెప్టెంబర్ 26 సాయంత్రం ఆదిత్య వుంటున్న శాంతా క్లారా-లిక్ మిల్ రోడ్ సమీపంలో, ఓ పాతిక మైళ్ల దూరంలో వున్న "శాంతా క్రజ్ ప్రధాన బీచ్" కు అన్ష్ ను తీసుకొని, అందరం వెళ్లాం. అక్వేరియంకు రావడం కుదరని పారుల్ కూడా బీచ్ అనగానే బయల్దేరింది. ఇక ఆ వారమంతా మేమిద్దరం విశ్రాంతి తీసుకున్నాం గాని, ఆదిత్య-పారుల్ అన్ష్ ను వూళ్లో వున్న వాడానందించే ప్రదేశాలకు తీసుకెళ్లారు.
ఆ తర్వాత గురువారం, అక్టోబర్ మొదటి తేదీన, పారుల్ కు ఆఫీస్ కు వెళ్లాల్సిన పని వున్నందువల్ల, మేం ముగ్గురం అన్ష్ ను తీసుకొని "లాస్ ఏంజెల్స్" వెళ్లాం. అక్కడున్న ప్రశాంత్ (మా శ్రీమతి అక్క కొడుకు) వాళ్లింటికి వెళ్తూనే కాళ్లు-చేతులు కడుక్కొని, చీకటి పడగానే, ప్రశాంత్-వాడి భార్య-కూతురుతో సహా అందరం సమీపంలోని "మాలిబు బీచ్" చూడ్డానికి వెళ్లాం. మర్నాడు ఉదయమే డిస్నీ లాండ్ కు వెళ్లి రాత్రి తిరిగొచ్చాం. లాస్ ఏంజల్స్ కు వచ్చిన మూడో నాడు తిరుగు ప్రయాణమై దారిలో అందమైన “ఫెర్నాండో లోయ” లో వున్న యూనివర్సల్ స్టూడియోలు చూసొచ్చాం.
డిస్నీ లాండ్, యూనివర్సల్ హాలీవుడ్ స్టూడియోలను చూసి, తిరిగొచ్చిన వెంటనే, ఆదిత్య, ఆఫీస్ పని మీద, నాలుగు రోజులు న్యూయార్క్ వెళ్లాడు. వాడు తిరిగొచ్చేంతవరకు, కోడలు పారుల్, మనుమడు అన్ష్, నేను-శ్రీమతి దాదాపు ఇంట్లోనే గడిపాం. ఆదిత్య స్నేహితుడు హైదరాబాద్ వెళుతుంటే, అక్టోబర్ 10, 2009న అతడి వెంట అన్ష్ ను పంపించాం . వెళ్లే లోపు ఆదిత్య-పారుల్ వాడిని గ్రేట్ అమెరికన్ పార్క్ లాంటి ప్రదేశాలకు తీసుకొని పోయారు.
వాడెళ్లిన తర్వాత ప్రపంచ ప్రఖ్యాత "బే వంతెన", "గోల్డెన్‌గేట్ బ్రిడ్జ్" , సాగర తీరం-క్రుకెట్ రోడ్ చూసాం. ప్రతి దినం దాదాపు సాయంత్రపు వేళల్లో-వారాంతపు శెలవుల్లో, షాపింగ్ కో- దేవాలయాలకో వెళ్లొస్తుండే వాళ్లం. "శ్రీ మదాంధ్ర వాల్మీకి రామాయణం-బాలకాండ మందర మకరందం" రాయడం నవంబర్ మొదటి తేదీతో అయిపోయింది. నవంబర్ 2, 2009 సాయంత్రం అయిదింటికల్లా చక్కటి ఫైల్ గా పుస్తకం కంటే అందంగా తయారుచేశారు ఆదిత్య-పారుల్. అదే రోజు మా శ్రీమతి విజయ లక్ష్మి 55వ పుట్టిన రోజున "బాల కాండ మందర మకరందం" మొదటి కాపీని శ్రీమతికి పుట్టిన రోజు బహుమతిగా అందచేసాను. నవంబర్ 9, 2009 న హ్యూస్టన్ లో వుంటున్న మా అమ్మాయి కిన్నెర దగ్గరకు వెళ్లాం. మేం వెళ్లిన రోజునే ఢిల్లీనుంచి పారుల్ తల్లి-తండ్రులు వర్ష-వినోద్ కపూర్ లు వచ్చారు. అందరం కలిసి-విడివిడిగా పారుల్-ఆదిత్యల పాపాయికొరకు ఎదురు చూడసాగాం.
అపురూపమైనది ఆడజన్మ . ఇంకో ప్రాణిని సృష్టించటానికి తన ప్రాణాలు పణంగా పెట్టి మరీ మాతృదేవత గా మారుతుంది స్త్రీ. అందుకే, ఆమెకు ఆ సమయంలో, ఏ కష్టం కలగకుండా ఉల్లాసంగా ఉంచుతూ, శాయశక్తులా సంతోష పెడుతుంటారు భర్త, అత్త-మామలు, తల్లి-తండ్రులు. హిందువుల ఆచారం ప్రకారం గర్భిణీ స్త్రీలకు "సీమంతం" జరిపించాలి. సాంప్రదాయం ప్రకారం, స్త్రీ గర్భం ధరించిన తొమ్మిదో నెలలో తల్లి గారింట్లో సీమంతం జరుపుతారు. (పారుల్ అమెరికాలో వున్నందున తల్లి-తండ్రులు ఇక్కడే జరిపించారు). ఈ సీమంతానికి అత్తగారు చీర, రవిక, పూలు పండ్లు, తిను బండారాలతో సారెను పెడ్తారు. ఈ సారెను “కడుపు సారె” అని కూడా అంటారు. తల్లి సౌభాగ్యాన్ని, పుట్టబోయే బిడ్డ దీర్ఘాయుష్షును కోరుతూ చేసేది సీమంతం. కడుపులోని బిడ్డ ఆరోగ్యకరంగా ఎదగడానికి తల్లి శారీరక, మానసిక ఉల్లాసం ఎంతో అవసరం. అందుకోసం ఆమె, ఆమె భర్త పాటించవలసిన నియమాలు కూడా ఈ సంస్కారంలో భాగమే. గర్భవతికి సీమంతం చేసే రోజు సాయంత్రం జడను పూలతో కుట్టి అలంకరించి కుర్చీలో కూర్చొబెట్టి ఆశీర్వదింపజేస్తారు. సీమంతం అంటే పాపిడి తీయడమని అర్థం. అంటే ఆ సమయంలో భర్త ఆమెను అంత అపురూపంగా చూసుకోవాలని అర్థం. మేం హ్యూస్టన్ వెళ్లిన రెండు మూడు రోజుల్లో జరిపించారు సీమంతాన్ని వర్ష-వినోద్ కపూర్ లు.
మేం హైదరాబాద్ లో వుండగానే సీమంతం గురించి మా వియ్యంకులతో వివరంగా మాట్లాడాం. మా శ్రీమతికి-పారుల్ అమ్మగారి మధ్య సంభాషణ జరగాలంటే, దుబాసీగా మా బుంటి వుండాలి. అమెరికాలో నైతే కిన్నెర చేస్తుందా పనిని. బుంటి ద్వారా సీమంతానికి అవసరమైన వాటి వివరాలను పారుల్ వాళ్ల అమ్మకు తెలియచేయడం వల్ల, అవన్నీ ఇండియా నుంచే తెచ్చుకోవడంతో, అంతా, శాస్త్రోక్తంగా జరిగిపోయింది. సీమంతం నాడు ఉదయమే పారుల్ కు హారతి పట్టి, మంగళ స్నానం చేయించారు. సాయంకాలం పట్టుచేరె ధరింపచేసి కుర్చీలో కూర్చోపెట్టి, పారుల్ కు తల్లి వర్ష కపూర్, తాను చెచ్చిన తెల్ల పట్టుచీరను బొట్టుపెట్టి చేతికిచ్చింది. అది కట్టు కొచ్చిన తర్వాత, ఆమె చీరె పమిటను ఒడిలా చేసి, అందులో మొదలు చలివిడిని (బియ్యపు పిండితో చేసిన తీపి పదార్ధం) మూడు వుండలుగా చేసి తల్లి పెట్టారు. తర్వాత అదే ఒడిలో, తొమ్మిదేసి చొప్పున, ఐదు రకాల తీపి పదార్ధాలను (అరిసెలు, లడ్డులు, మైసూరు పాక్, పాలకోవా, బాదూషా), మూడు రకాల పండ్లను (బత్తాయి, ఏపిల్, కమలా ఫలాలు), కొన్ని తమలపాకులు, పోకచెక్కలు (తాంబూలం) పెట్టి హారతిచ్చారు. బంగారు ఆభరణాలను (గాజులు) చేతికి తొడిగారు. హారతిచ్చిన తర్వాత ఆహ్వానిత బంధు-మిత్రులు తమకు తోచిన విధంగా పారుల్ ఒడిలో వుంచి బహుమతులిచ్చారు. సాయంకాలం పేరంటంలో పారుల్ కు, రక రకాల గాజులు తొడిగి, వచ్చిన ముత్తైదువులకు ఆమెతో గాజులిప్పించారు. మా పారుల్ తల్లిగారి వైపు వాళ్లు సీమంతాన్ని " గోద్ భరై" అని పిలుస్తారు. వేడుక మాత్రం అంతటా ఒకటే. మేం హ్యూస్టన్ నుంచే ఆశీర్వదించాల్సి వచ్చింది.
ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. కాకపోతే కొంత ఆలస్యంగా వచ్చింది. నవంబర్ 24 ఉదయం 8-36 కు (విరోధి నామ సంవత్సరం-మార్గ శిర మాసం-సప్తమి తిథి-ధనిష్ట నక్షత్రం-కుంభ రాశి) ఆదిత్య-పారుల్ కూతురు-మా మూడో మనుమరాలు కనక్ పుట్టిందన్న వార్త విని ఆనందంతో ఆ వార్తను బంధు మిత్రులతో పంచుకున్నాం. వారంరోజుల కిందనే అవుతుందనుకున్న డెలివరీ కాకపోవడంతో పారుల్ గైనకాలజిస్ట్ డాక్టర్ అతుల్ షేథ్ సలహామీద, "ఎల్కమీనో రిఆల్ ఆసుపత్రిలో" సీ-సెక్షన్ చేయాల్సి వచ్చింది.
మా ఆదిత్యకు ఇంతకు ముందు సెప్టెంబర్ 3, 2003 న ఏకాదశి-పునర్వసు సంగమంలో కొడుకు పుట్టాడు. ఢిల్లీలో గుర్గాం లోని ప్రయివేట్ ఆసుపత్రిలో పుట్టిన వాడి పేరు అన్ష్. వాడిప్పుడు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ (బేగంపేట్) లో రెండో తరగతి చదువుతున్నాడు. అయితే నన్ను మొదలు తాతను చేసింది మా రెండో అమ్మాయి కిన్నెర. అమెరికా-సిన్సినాటిలో వున్నప్పుడు ఆగస్ట్ 4, 1999న అక్కడి బెతెస్ఢా ఆసుపత్రిలో పుట్టాడు మా మొదటి మనుమడు. అశ్వినీ నక్షత్రంలో పుట్టిన వాడికి "యష్విన్" అని పేరు పెట్టాం. ఆ తర్వాత మా పెద్దమ్మాయి బుంటి (ప్రేమ మాలిని) నాకు మొదటి మనుమరాలిని ఇచ్చింది. అపురూపంగా ఫిబ్రవరి 18, 2001న హైదరాబాద్ లోని ఫెర్నాండెజ్ ఆసుపత్రిలో పుట్టిన దాని పేరు " (భువన) మిహిర". అదిప్పుడు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ (బేగంపేట్) లో నాలుగో తరగతి చదువుతున్నది. ఇక మధ్యలో మరో మనుమరాలినిచ్చింది కిన్నెర. ఏప్రియల్ 15, 2004 న అది కూడా సిన్సినాటిలోని బెతెస్ఢా ఆసుపత్రిలోనే పుట్టింది. దాని పేరు "మేథ". యష్విన్ ఇప్పుడు ఐదో గ్రేడ్, మేథ ఫస్ట్ గ్రేడ్ హ్యూస్టన్ లో చదువుతున్నారు. ఇలా ముగ్గురు మనుమరాళ్లతో, ఇద్దరు మనుమళ్లతో నాకు-మా శ్రీమతికి ఎప్పుడూ "అసలు కంటె కొసరెక్కువ" అన్న నానుడి ప్రకారం, వాళ్ల గురించిన ఆలోచనే. హైదరాబాద్ లో వుంటే అమెరికాలో పిల్లలెరా వున్నారని, అమెరికాకు వస్తే అక్కడ హైదరాబాద్ లో వాళ్లేం చేస్తున్నారని దిగులే. అయితే, అక్కడా-ఇక్కడా వుండలేం కదా !
అదిత్య కంటె ముందు మాకు ఇద్దరాడపిల్లలు కలిగారు. వీడొక్కడే కొడుకు. నేను మా అన్నదమ్ముల్లో పెద్దవాడిని. అలానే ఆదిత్య తరంలో మా అన్నదమ్ముల పిల్లల్లో వీడే పెద్ద. (దత్తు పోయిన మా తమ్ముడు నా కంటే ముందే పెళ్లి చేసుకున్నందున వాడి కొడుకు ఆదిత్య కంటె పెద్ద). అప్పట్లో (1969) ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కావాలంటూ విద్యార్థులు ఆందోళన చేస్తున్నందువల్ల, మా పెళ్లైన వెంటనే నేను, నాగ్ పూర్ లో ఎం. ఏ చదవడానికి వెళ్లాను. అయితే పేరుకే నాగ్ పూర్ చదువు గాని, ఎక్కువ సమయం ఖమ్మం- కృష్ణా పురంలో గడిపేవాడిని. ఏదో విధంగా 1969-71 విద్యాసంవత్సరంలో చదువు పూర్తిచేసి, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పట్టా పుచ్చుకొని ఇంటికొచ్చాను. వచ్చిన కొన్నాళ్లకే జులై 8, 1971 న వరంగల్ ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో మా పెద్ద అమ్మాయి ప్రేమ మాలిని (బుంటి) పుట్టింది. మా శ్రీమతి వాళ్ల రెండో అన్నయ్య డాక్టర్ వేణు మనోహరరావు అప్పట్లో వరంగల్ కాకతీయ వైద్య కళాశాలలో మెడిసిన్ ఆఖరు సంవత్సరం చదువుతున్నందువల్ల, ఆయనకు అక్కడున్న ప్రముఖ వైద్యులందరూ పరిచయం వుండడం వల్ల, మా ఆవిడ ప్రసవానికి వరంగల్ ను ఎంపికచేసుకున్నాం.
మా శ్రీమతికి అప్పటికింకా పట్టుమని పదిహేడేళ్లు కూడా నిండలేదు. మా పెళ్లప్పుడు నాకు 21సంవత్సరాల లోపైతే, మా ఆవిడకు 15 ఏళ్లు నిండలేదు. ఇప్పుడు మా పెద్దమ్మాయి "మెరుగైన సమాజం కోసం" అంటూ నిరంతరం తెలుగు వార్తలు ప్రసారం చేస్తున్న టీవీ-9 లో సీనియర్ జర్నలిస్ట్ గా పనిచేస్తున్నది. నేను బి. హెచ్. ఇ. ఎల్ హయ్యర్ సెకండరీ పాఠశాలలో లైబ్రేరియన్ గా పనిచేస్తున్న నాటి పరిచయస్తులైన మండపాక సత్యవాణి-భాస్కరరావు దంపతుల కుమారుడు విజయ గోపాల్ ను (అక్టోబర్ 19, 1994) వివాహమాడింది. ఆయన ప్రస్తుతం హైదరాబాద్ లోని "డెల్" సంస్థలో పనిచేస్తున్నారు. బుంటి వాళ్లు హైదరాబాద్ శ్రీనగర్ కాలొనీలో, మేముంటున్న "ఉషా ఎన్ క్లేవ్" అపార్ట్స్ మెంట్స్ లో, మేమున్నట్లే వాళ్లూ అదెకుంటున్నారు.
ఇక రెండో కూతురు కిన్నెర, పెద్దమ్మాయి పుట్టిన ఏడాదిన్నరకు పుట్టింది. అప్పట్లో ఖమ్మం జిల్లా భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రిలో మా ఆవిడ పెద్దన్నయ్య డాక్టర్ పాండు రంగారావు (ఎ. పి. రంగారావు) మెడికల్ ఆఫీసర్ గా పనిచేస్తున్నారు. సాధారణంగా హిందూ సంప్రదాయం ప్రకారం మొదటి రెండు పురుళ్లు పుట్టింట్లో పోసుకోవడం ఆనవాయితీ. పుట్టిల్లంటే సోదరుల ఇళ్లు కూడా కావచ్చు. మొదటి కాన్పుకు, వరంగల్ లో వున్న చిన్నన్నయ్య దగ్గరకు తీసుకెళ్లారు మా అత్తగారు-మామగారు. రెండో దానికి భద్రాచలం తీసుకెళ్లారు వాళ్ల పెద్ద కొడుకు దగ్గరకు. నవంబర్ 2, 1973 న మా రెండో కూతురు పుట్టింది. ఆ ఆవిడ పుట్టిన తేదీ కూడా అదే కావడంతో, సరిగ్గా 19 సంవత్సరాల వయస్సులో మా ఆవిడ రెండో కూతుర్ని కనింది. భద్రాచలం అనుకుని ప్రవహిస్తున్న "కిన్నెర సాని" నదిని జ్ఞప్తికి తెచ్చుకునేందుకు, మా మామగారు అయితరాజు రాంరావు-అత్తగారు రాధ గారి కోరిక మేరకు దాని పేరు "కిన్నెర" అని పెట్టాం. అది నాగ్ పూర్ సమీపంలోని రాంటేక్ ఇంజనీరింగ్ కళాశాలలో కంప్యూటర్ కోర్స్ పూర్తిచేసి, అప్పట్లో హైదరాబాద్ లోని హెచ్.ఏ. ఎల్ లో పనిచేస్తున్న కొణికి లక్ష్మీ సుందరి-శ్రీహరి రావు గార్ల కుమారుడైన వెంకట్ శ్రీ కిషన్ ను వివాహం చేసుకుంది (మే 8, 1997). ప్రస్తుతం వాళ్లిద్దరు అమెరికా పౌరులుగా టెక్సాస్ రాష్ట్రంలోని హ్యూస్టన్ నగరం షుగర్ లాండ్ లో వుంటున్నారు. అక్కడి పెట్రోలియం సంస్థల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. దాని పిల్లలే మనుమడు "యష్విన్", మనుమరాలు "మేథ". యష్విన్ ఐదో గ్రేడ్, మేథ ఒకటో గ్రేడ్ హ్యూస్టన్ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటూన్నారు.
ఇద్దరు ఆడపిల్లలు పుట్టింతర్వాత ఇక ఆగుదామనుకున్నాం. పాతకాలంలా కాకుండా, ఇద్దరి కంటే ఎక్కువ పిల్లల్ని కనడం మానేస్తున్న రోజులవి. కొంచెం ఆలోచనలో పడ్డాం. ఎటూ నిర్ణయించుకోలేని వయసు మాది. బుంటి పుట్టిన కొద్ది రోజులకే నాకు ఇల్లెందు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో లైబ్రేరియన్ గా ఉద్యోగం వచ్చింది. అంతకు కొద్దిరోజుల క్రితమే ఎం. ఏ (పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్) పాసయ్యాను. ఉద్యోగం-పిల్లలు అంటే, సంసార సాగరం ఈదడం మొదలయిందన్న మాట. మాకు ఆస్తిపాస్తులు బాగానే వున్నప్పటికీ, అప్పట్లో మూడు-నాలుగేండ్లు వర్షాభావం వల్ల వరి పంటలు సరిగ్గా పండలేదు. మనలాంటి వాళ్లకు కొంత వెసులుబాటుగా వున్నా, ఒక విధంగా కరవు-కాటకం రోజులనవచ్చు. నాకొచ్చే జీతం నెలకు 230 రూపాయలే. అందులోనే ఇల్లెందుకు రాను-పోను చార్జీలు కూడా భరించాలి. మూడు నెలల్లోనే నా అభ్యర్థనను మన్నించి అప్పటి జిల్లా విద్యా శాఖాధికారి శ్రీమతి షహజానా బేగం నన్ను ఖమ్మం శాంతినగర్ హైస్కూల్ కు మార్చింది అదే పోస్టులో. ఆమె ప్రోద్బలంతో 1973-1974 బాచ్ లో ఉస్మానియా విశ్వవిద్యాలయం "బాచిలర్ ఆఫ్ లైబ్రరీ సైన్స్" పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్స్ లో చేరాను. అప్పటి ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా మా అవిడకు పెళ్లిలో మా నాన్నగారు ఆభరణంగా ఇచ్చిన బంగారపు గొలుసును 1200 రూపాయలకు బాంక్ లో కుదువ పెట్టి, ఆ డబ్బుతో, చదువుకున్నాను. చేస్తున్న లైబ్రేరియన్ ఉద్యోగానికి శెలవు పెట్టాను. కొంత శెలవు జీతం కూడా వచ్చేది. మొత్తం మీద యూనివర్సిటీ సెకండ్ రాంక్ సాధించి లైబ్రరీ సైన్స్ లో డిగ్రీ తెచ్చుకున్నాను. మా నాన్నగారు ఆ తర్వాత బాంక్ నుంచి గొలుసును విడిపించి మాకిచ్చారు. డిగ్రీ పరీక్షలు రాయడానికి ముందే బి.హెచ్.ఇ.ఎల్ హయ్యర్ సెకండరీ పాఠశాలలో ఉద్యోగం దొరికింది.
సరిగ్గా ఆ సమయంలోనే, అబ్బాయికొరకు ఆగాలా, ఆపరేషన్ చేయించుకోవాలా అని తటపటాయిస్తుండగానే, ఆదిత్య పుట్టడానికి రంగం సిద్ధమయింది. ఇక మా చేతులో లేదు. మనసులో వున్న కోరికను భగవంతుడు అలా తీర్చాడు. మొదటి రెండు పురుళ్లు పుట్టింటిలో జరిగాయి కాబట్టి, ఇది, మా నాన్న-అమ్మల ఆధ్వర్యంలో, ఆప్యాయతల-అనురాగాల మధ్య, పుట్టింట్లో ఎంత గారాబంగా, అనురాగంగా జరిగిందో, అలానే జరిగింది. ఖర్చంతా వాళ్లదే. నాన్న-అమ్మ అప్పట్లో ఖమ్మంలో వుంటున్నారు. ఖమ్మంలో అదే రోజుల్లో డాక్టర్ వైవి. రామారావు-ఆయన సతీమణి డాక్టర్ ఆంధ్ర జ్యోతి మా ఇంటికి సమీపంలో కొత్తగా ఆసుపత్రి కట్టించారు. ప్రారంభం అయిన నాడే, మా ఆవిడ ఆదిత్యను కనిందక్కడ. ఆ ఆసుపత్రిలో అయిన మొదటి కాన్పు కూడా అదే. నాకింకా గుర్తుంది ఆరోజు. మా నాన్న సాయంత్రం (డిసెంబర్ 24, 1975) నాలుగున్నర గంటల ప్రాంతంలో మామిళ్లగూడెంలోని ఇంటికొచ్చి, ఆదిత్య పుట్టిన సంగతి చెప్పాడు. వాడి తరంలో మా ఇంట్లో పెద్దవాడే కాకుండా, వాడే మా నాన్నకు పెద్ద మనుమడు. వాడి బారసాల అంగరంగ వైభోగంగా జరిపించారు మా నాన్న-అమ్మ. అంతకు ముందు కూడా బుంటి-కిన్నెర బారసాలలను అలానే జరిపించారు. ఆదిత్య హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ లో చదివి, నిజాం కళాశాలలో డిగ్రీ పూర్తిచేసి, "టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ (ముంబై)" లో హ్యూమన్ రిసోర్సెస్ లో మాస్టర్స్ డిగ్రీ చేసి, ప్రస్తుతం "గూగుల్" సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. మానవ వనరుల శాఖలోని ఒక అంతర్జాతీయ విభాగానికి, అదిపతి హోదాలో,ఉన్నత స్థాయికి చెందిన ఉద్యోగం అది. అమెరికా శాన్ ఫ్రాన్ సిస్కో లో వుంటున్నాడు. భార్య పారుల్ (వివాహం ఆగస్ట్ 20, 2008న జరిగింది) కూడా హెచ్.ఆర్ నిపుణురాలిగా కేడెన్స్ సంస్థలో ఉద్యోగం చేస్తున్నదక్కడే. ఆదిత్య కొడుకే హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ లో రెండో తరగతి చదువుతున్న "అన్ష్".
మా అబ్బాయికి ఆదిత్య కృష్ణ రాయ్ అని పేరు పెట్టడానికి ఒకటికంటే ఎక్కువే కారణాలున్నాయి. ఆ రోజుల్లో ఆ పేరున్న వాళ్లు అరుదు. అదొక రకంగా అప్పట్లో కొత్త పేరు. మా నాన్నగారికి మా పూర్వీకులైన కృష్ణ రాయలుగారి పేరు పెట్టాలని కోరికుండేది. మా ఆవిడకు "ఆదిత్య" అన్న పేరు పెట్టాలని కోరిక. నా ఆలోచన వేరే విధంగా వుండేదప్పట్లో. నేను మొదటి నుంచీ కమ్యూనిస్ట్ అభిమానిని. కమ్యూనిస్ట్ ఉద్యమం ఎక్కడ జరిగినా-ఎందుకు జరిగినా, ఆసక్తిగా పరిణామాలను గమనిస్తుండే వాడిని. అప్పట్లో ఇండొనేషియాకు "సుకర్ణో" అనే బలవంతుడు అధ్యక్షుడుగా వుండే వాడు. వాడిని ప్రపంచమంతా ఒక విధంగా అభిమానించే దా రోజుల్లో. తనను తానే "బంగ్కర్ణో" గా అభివర్ణించుకునే వాడు అతడు. అంటే "తిరుగులేని నాయకుడు" అని అర్థమట. అతడి నియంతృత్వానికి వ్యతిరేకంగా బ్రహ్మాండమైన విద్యార్థి ఉద్యమం కమ్యూనిస్ట్ యువ నాయకుడు "ఆదిత్య" (అయిదిత్) నేతృత్వంలో సాగింది కొన్నాళ్లు. అతి కర్కశంగా దాన్ని అణచివేసింది సుకర్ణో ప్రభుత్వం. అయిదిత్ ను ఏమీ చేయలేకపోయారని, అతడెప్పటికైనా వచ్చి తమను కాపాడుతారని సహచర విద్యార్థులు అప్పట్లో భావించేవారు. "ఇండొనేషియన్ అప్ హీవెల్" అనే పుస్తకంలో ఈ విషయాలన్నీ చాలా వివరంగా దొరుకుతాయి. ఇండొనేషియాకు, భారతదేశానికి అవినాభావ సంబంధముండేది. వాళ్ల పేర్లు చాలా వరకు భారతీయుల పేర్ల లాగానే వుంటాయి. ఆ అయిదిత్ స్ఫూర్తితోనే నేను నాకు కొడుకు పుటితే, అతడి పేరు పెట్టుకుందామనుకునే వాడిని. అలా మా అబ్బాయి పేరు అందరం కలిపి పెట్టాం-"ఆదిత్య కృష్ణ రాయలు" అని. ఎలా మారిందో కాని వాడిని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ లో చేర్పించేటప్పుడు, అది "ఆదిత్య కృష్ణ రాయ్" అయిపోయింది.
అసలింతకీ అన్నీ చెప్పి, బుంటి పేరు గురించి చెప్పలేదు కదా ! చెప్పకూడదనుకున్నాను-కాని చెప్తున్నాను. ఎందుకో అప్పట్లో హేమమాలిని సినిమాలంటే ఇష్టం కావడంతో, కొంచెం మార్చి, "ప్రేమ మాలిని" అని పెట్టాం. అదేమో ఇప్పుడు "ప్రేమ" అని మాత్రమే చెప్పుకుంటుంది. రెండు "నంది బహుమతులను గెల్చుకున్న" ప్రేమ-టీవీ 9 (ప్రజా పక్షం) అంటే అందరికీ తెలుస్తుంది. ఇక "బుంటి" అని పిలవడానికి కూడా కారణముంది. నాకు "ఉడ్ హౌజ్" నవలంటే ఇష్టం. "ఉడ్ హౌజ్" కు "బుంటి" అంటే ఇష్టం. అది కాకుండా అప్పట్లో "ద లాస్ట్ లెటర్" అనే సినిమా వచ్చింది. "ఆఖ్రీ ఖత్" అనుకుంటా. అందులో చిన్న పిల్ల కారెక్టర్ "బంటి". మొత్తం మీద కొంచెం మార్చి ముద్దుగా దాన్ని అందరం "బుంటి" అని పిలిచే వాళ్లం.
నవంబర్ 24, 2009 న పాపాయి పుట్టి నందువల్ల, హిందువుల ఆచారం ప్రకారం పదకొండు రోజుల వరకు అంటే డిసెంబర్ 4, 2009 వరకు "పురుడు"గా భావిస్తారు. ఆ పదకొండు రోజులు పూజా-పునస్కారాలకు దూరంగా వుండాలి. పదకొండో రోజున పురిటి స్నానం చేసిన తర్వాత, కొన్ని శాస్త్రోక్తమైన కార్యక్రమాలు-వేడుకలు చేసుకోవడం కూడా ఆచారంలో భాగమే. బహుశా ఇలా పదకొండు రోజులు, అన్ని పనులకు దూరంగా వుండడం కూడా మన పూర్వీకులు ఆలోచించే చేసుంటారు. ప్రసవించిన స్త్రీని శుచిగా-శుభ్రంగా, వుంచడానికి ఉద్దేశించిందై వుండవచ్చు. ఎవరు పడితే వాళ్లు ఆమె దగ్గరకు పోకుండా చేసిన ఒక ఏర్పాటు కూడా కావచ్చు. ఏదేమైనా పారుల్ వాళ్ల తల్లి-తండ్రులు, ఆదిత్య పదకొండో రోజున, దూరంగా హ్యూస్టన్ లో వున్న మా శ్రీమతి సలహా-సంప్రదింపులతో చేయాల్సిన పనులన్నీ చేశారు. ఉదయాన్నే పారుల్ (ఆదిత్య కూడా) పురిటి స్నానం చేసింది (తల స్నానం). అంతకంటే మొదలే, వాళ్ల అమ్మ గారు పాపాయికి స్నానం చేయించి పీట మీద తడితోనే పడుకోబెట్టారు. నీళ్ల తడి వుండగానే పాపాయి బొడ్డు మీద బంగారపు గాజునుంచి, నీళ్లు చల్లి చేతుల్లోకి తీసుకుని తుడవాలి. ఆ తర్వాత పాపాయికి సరైన దుస్తులు ధరింపచేయాలి. దుస్తులేసిన తర్వాత తిరిగి ఆ బంగారపు గాజును మరో మారు పాపాయి మీదుంచాలి.
ఈ తతంగం అంతా ముగిసాక (తల్లికి) నలుగు స్నానం చేయించి, బట్టలు మార్చుకున్న తర్వాత, పాపాయి దగ్గరకు తీసుకొస్తారు తల్లి-తండ్రులు. ఊయలలో నిద్ర పుచ్చే ముందర, పాపాయికి కొత్త దుస్తులేసి, తల్లితో బొట్టు పెట్టించి, అమ్మమ్మ మొలతాడు కడుతుంది. తల్లి మంచం మీద కాసేపుంచాలి పాపాయిని. మంచం నాలుగు కోళ్ల వైపున, కాళ్ల వైపున పొంగలి పెట్టాలి. వంశాభి వృద్ధి జరగాలని దీవించి, పాపాయిని ఎత్తుకెళ్లి ఊయలలో పడుకోబెట్టాలి. ఇవన్నీ శాస్త్రోక్తంగా చేశారు మా పారుల్-ఆమె తల్లి తండ్రులు. పురుడు అయిపోయింది కాబట్టి పసుపు నీళ్ళతో ఇల్లంతా చల్లి, శుద్ధి చేయాలి.
మేం హ్యూస్టన్ కు పోయే ముందర ఒప్పందం ప్రకారం, పాపాయి పుట్టిన నెల రోజుల లోపు శాన్ ఫ్రాన్ సిస్కోకు వచ్చి, కనీసం పది రోజుల పాటుండి, బారసాల చేయించి వెళ్ళాలని. బారసాల నెల రోజుల లోపు జరిపించలేక పోతే, మళ్ళీ మూడో నెల వచ్చిందాక ఆగాలి. పదకొండో రోజు కార్యక్రమం ముగిసిన వెంటనే, పారుల్ నాన్నగారు ఢిల్లీ వెళ్లి పోయారు. నేను-మా శ్రీమతి డిసెంబర్ 18, 2009 న శాన్ ఫ్రాన్ సిస్కో చేరుకున్నాం. బారసాల ప్రయత్నాలు ప్రారంభించాం.
దీనిని అసలు "బాల సారె" అంటారు. అది వాడుకలోకి వచ్చే సరికి "బారసాల" అయింది. అసలు బారసాల అంటే పేరు పెట్టడం లేదా నామకరణం చేయటం అని అర్థం. ఈ వేడుకను పుట్టిన పాపాయికి (బాబు అయితే బాబుకు) పేరు పెట్టటానికి చేస్తారు. వాడుకలో వున్న పద్ధతి ప్రకారం, పుట్టిన 21వ రోజు నుండి 27 వ రోజు లోపల చేస్తారు. ఈ రోజులలో 21, 23, 25, 27 రోజులలో చాలా మంది చేస్తారు. అలానే బేసి సంఖ్యలు వచ్చే ఏ రోజైనా మంచిరోజు చూసుకొని చేసుకోవచ్చు. నెలలోపల చేసుకునే వీలు లేకపోతే, మూడో నెల వచ్చిన తర్వాత చేసుకుంటారు. మేం హ్యూస్టన్ లో వుండడం వల్ల 21వ నాడు (డిసెంబర్ 14, 2009 న) చేయడం వీలుపడలేదు. ఆ తర్వాత నాలుగైదు రోజుల వరకు, ఆదిత్య లండన్ వెళ్లినందున, వీలు కాలేదు. చివరకు మంచిరోజు 27 వ రోజున (డిసెంబర్ 20, 2009 న) కుదిరింది. మేం హ్యూస్టన్ నుంచి శాన్ ఫ్రాన్ సిస్కోకు వచ్చిన నాడే ఆదిత్య లండన్ నుంచి శాన్ ఫ్రాన్ సిస్కోకు చేరుకున్నాడు.
మేం హ్యూస్టన్ లో వున్నప్పుడు, శాన్ ఫ్రాన్ సిస్కోలో వున్న, మా ఆవిడ కజిన్ (స్వర్గీయ అయితరాజు శేషగిరి రావు గారి కుమారుడు) సురేష్ ను సంప్రదించాం. ఆదిత్యకు అమెరికా ఇంకా కొంచెం కొత్తైనందున, పూజ చేయించేందుకు తగిన బ్రాహ్మణుడిని వెతికే బాధ్యతను సురేష్ కు అప్పగించాం. నిజంగా అతడికి ధన్యవాదాలు చెప్పుకోవాలి. అన్ని విషయాలు అతడే మాట్లాడాడు. ఖమ్మం జిల్లా-కొత్తగూడెం నుంచి వచ్చిన బ్రహ్మ శ్రీ మార్తి వెంకటేశ్వర శాస్త్రి గారు స్థానిక సత్యనారాయణ స్వామి గుడిని నిర్వహిస్తున్నారు. గొప్ప పండితుడన్న పేరుంది. ఆయనిక్కడ కొచ్చి స్థిర పడిన తర్వాత, ఆంధ్ర ప్రదేశ్ నుంచి, అనేకమంది బ్రాహ్మణులను రెలిజియస్ కోటా కింద అమెరికాలోని పలు ప్రదేశాల్లో వున్న దేవాలయాలకు రప్పించి, ఎంతో మందికి సహాయం చేశాడన్న పేరుంది. ఉదాహరణకు సియాటిల్ దేవాలయంలో పనిచేస్తున్న సంస్కృత పండితుడు-పూజారి దీక్షితులు గారు. ఆయనే పండితుడని ఇండియాలో వున్నప్పుడే నాకు తెలుసు. ఆయన్నడిగితే, మార్తి శాస్త్రిగారు తన "గురువు" అని చెప్పాడు.
మార్తి వెంకటేశ్వర శాస్త్రి గారిని మా మనుమరాలి బారసాల-నామకరణం, ఆదిత్య-పారుల్ దంపతుల సత్యనారాయణ వ్రతం జరిపించడానికి కుదిరించాడు సురేష్. మేం శాన్ ఫ్రాన్ సిస్కోకు చేరుకునే సరికల్లా పూజకు కావాల్సిన సామాగ్రితో సహా అన్ని వివరాలను మాకు మెయిల్ లో పంపారు శాస్త్రి గారు.
శాస్త్రి గారు పంపిన మెయిల్ ప్రకారం బారసాల-నామకరణం-సత్యనారాయణ వ్రతానికి కావలసిన వస్తువులు:
పసుపు, కుంకుమ, తమలపాకులు, పోకచెక్కలు, ఖర్జూరపు పండ్లు, అగరు వత్తులు, హారతి కర్పూరం, అరటి పండ్లు, పూలు, కొబ్బరికాయలు-ఇవి పగులగొట్టే సౌకర్యం, ఎండు కొబ్బరి చిప్పలు, కొత్త తుండు గుడ్డ, కొత్త రవికె గుడ్డ, తేనె, పెరుగు, పాలు, నెయ్యి, పంచదారల మిశ్రమమైన పంచామృతం, సత్యనారాయణ స్వామి ఫొటో, తగు మోతాదులో కేసరి ప్రసాదం, బియ్యపు రవ్వ-అందులో కలిపేందుకు పంచదార, వేలకులు, జీడి పప్పు, కిస్మిస్ పండ్లు, దీపారాధనకు కావాల్సిన (దూది, నూనె, అగ్గిపెట్టె) సామాగ్రి, కొబ్బరి కాయనుంచే వీలున్న వెండి-రాగి-సిల్వర్ పాత్ర (చెంబు), పావలా బిళ్లలు (సెంట్లు), రెండు-మూడు కిలోల బియ్యం.
వాస్తవానికి మా శ్రీమతికి ఇలాంటి వాటిల్లో అనుభవం-మా నాన్న వారసత్వంగా అబ్బింది. అదృష్ట వశాత్తు కోడలు పారుల్ కూడా పూజా-పునస్కారాల మీద శ్రద్ధ కనబరచడం వల్ల, మా ఆవిడ క్రమంగా "తనకు సంక్రమించిన వారసత్వాన్ని" ఆమెకు అప్పచెప్తోంది. ఆ నాడు శాస్త్రిగారు చెప్పిన సామాగ్రంతా మా ఆవిడకు తెల్సిందే. అందులో తొంబై శాతం వస్తువులను హైదరాబాద్ నుంచే పట్టుకొచ్చింది.
తెలుగు వారి ప్రత్యేకత-ఆ మాటకొస్తే భారతీయులందరి ప్రత్యేకత, వారి పేరులోనే వుంటుందనాలి. అదేం టోగాని, చాలామంది విషయంలో, తెలుగు వారి-భారతీయుల పేర్లు, వారి పేరును పట్టి, కొత్తగా పరిచయమైన వారు, సర్వసాధారణంగా ఒక అవగాహనకు వచ్చే విధంగా వుంటాయి . అనాదిగా వస్తున్న ఆచారం ప్రకారం ఆ పేరును వారు పుట్టిన 21 వ రోజున, తల్లి పక్కనుండగా, బంధు-మిత్రుల సమక్షంలో, శాస్త్రోక్తంగా జరుపుకునే ఒక వేడుకలో, తండ్రి పెడ్తాడు. అయితే, అమెరికాలో నివసిస్తున్న తెలుగు వారు-ఇతర భారతీయులు, ఆ దేశ చట్ట నిబంధనల ప్రకారం, పాపైనా-బాబైనా పుట్టిన మూడు రోజుల లోపు, ఆసుపత్రి రిజిస్టర్ లో నమోదయ్యే విధంగా పేరు రాయడం విధిగా చెయ్యాలి. దానికి అనుగుణంగానే, పారుల్-ఆదిత్యలు మా మనుమరాలి పేరును "కనక్ వనం" అని పెట్టారు. నిబంధనలకు అనుగుణంగా, పుట్టిన తమ పిల్లలకు వెంటనే పేరు పెట్టినా, ఆ పేరును ఆనవాయితీగా ఆచరిస్తున్న పద్ధతుల ప్రకారం, బారసాల జరుపుకొని, "నామకరణం" ప్రక్రియ పూర్తిచేయని తెలుగు వారు గానీ, భారతీయులు గానీ వుండరు. అదో ఆచారం-వేడుక-సరదా-సామాజిక కలయిక. పేరు వ్యక్తులను గుర్తించేందుకు ఉపయోగించే ఒక నామ వాచకము. వ్యక్తులను ప్రత్యేకంగా గుర్తించడానికి లేదా వారి పూర్వీకుల గురించి తెలుసుకోవటానికి పేరుతో పాటు ఇంటి పేరు కూడా ఉంటుంది. ఆచారం ప్రకారం ఆదిత్య-పారుల్ దంపతులు కూడా అలానే జరుపుకున్నారు.
బారసాల నాడు పెట్టిన పేరే ఆ మనిషి పేరులా చెలామణి అవుతుంది. తమ పేర్లు రాసుకునేటప్పుడైనా, చెప్పేటప్పుడైనా భారతీయులందరూ ఒకేవిధంగా వ్యవహరించరు. ఒక్కొక్కరు ఒక్కొక్కరి సంప్రదాయాన్ని పాటిస్తారు. బారసాల నాడు పెట్టిన పేరు మొదట, ఇంటి పేరు తరువాత వచ్చేలా కొన్ని ప్రాంతాల వారు, ఇంటి పేరు మొదట, తరువాత బారసాల నాడు పెట్టిన పేరు వచ్చేలా మరికొన్ని ప్రాంతాల వారు పాటిస్తారు. సాధారణంగా ఏ ప్రాంతం వారికైనా ఇంటి పేరు తరతరాలుగా మారకుండా వుండి, వారి యొక్క వంశ నామంగా వుంటుంది. తెలుగు వారు సంప్రదాయం ప్రకారం బారసాల నాడు పెట్టిన పేరు ముందర ఇంటి పేరు తగిలించకుండా తమ పేరు చెప్పుకోరు. ఈ మధ్య కాలంలో తెలుగు వారి ఇంటి పేరు సంప్రదాయం, క్రమ క్రమంగా మార్పుకు యువతరం నాంది పలుకుతుంది అనుకోవచ్చు. ముఖ్యంగా అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్న తెలుగు వారు, "ఏ దేశమేగినా ఎందు కాలిడినా పొగడరా..." అన్న నా నుడిని పేరు చెప్పుకునే విషయంలో కొంచెం సడలించి, "బి ఎ రోమన్ వైల్ ఇన్ రోమ్" సంప్రదాయాన్ని పాటించడం నేర్చుకున్నారు. అమెరికా దరఖాస్తు పత్రాలలో ఫస్ట్ నేమ్ అని, మిడిల్ నేమ్ అని, లాస్ట్ నేమ్ అని, పుంఖాను పుంఖంగా ప్రశ్నలు ఉంటాయి. ఒక్కోసారి సర్ నేమ్ ఏమిటని మరో ప్రశ్న వేస్తారు. ఈ బాధలు తప్పించుకోవడానికి అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్న తెలుగు వారందరు కూడా వారి పద్ధతినే అనుకరిస్తున్నారు. తప్పదు కదా మరి !. దేశ-కాల మాన పరిస్థితులను బట్టి మారడం మంచిదే కదా !
మంత్రోచ్ఛారణల మధ్య, పురోహితుడుగా-పూజారిగా బారసాల-నామకరణం జరిపించాడానికొచ్చిన బ్రహ్మ శ్రీ మార్తి వెంకటేశ్వర శాస్త్రి గారు-ఆయన వెంట వచ్చిన మరో ముగ్గురు ఔత్సాహిక శిష్య బృందం, మొదట విఘ్నేశ్వరుడి పూజ చేయించారు. విఘ్నేశ్వరుడి పూజకంటే ముందు, పురుడు అయిపోయిన వెంటనే, శాస్త్రం ప్రకారం జీర్ణ యజ్ఞోపవీతాన్ని తీసివేసి-దాని స్థానంలో నూతన యజ్ఞోపవీతాన్ని ఆదిత్యతో ధరింప చేసే కార్యక్రమాన్ని జరిపించారు. తరువాత పుణ్యాహవాచనం (శుద్ధి) కార్యక్రమం జరిపించారు. తరువాత నామకరణం చేయించారు. పేరు అనేది ఎవరైనా జన్మ నక్షత్రం ఆధారంగా పెట్తారు. అయితే, అదనంగా, వ్యవహారిక నామంగా, తమకు ఇష్టమైన పేరు పెడతారు. కాని నక్షత్రం ప్రకారం పెడితేనే మంచిది. ఏ నక్షత్రానికి ఏ అక్షరాలు అనేవి శాస్త్రంలో చెప్పబడే వున్నాయి. మా మనుమరాలిది ధనిష్ట నక్షత్రం కాబట్టి గా-గీ-గూ-గే అక్షరాలు వచ్చే విధంగా నామకరణం చేయించారు శాస్త్రి గారు.
పాపైనా-బాబైనా, పిల్లలకు పెట్టవలసిన పేర్లకు సంబంధించిన నియమాలను గృహ్య సూత్రాలు పేర్కొన్నాయి. పరాశర గృహ్య సూత్రాల ప్రకారం పేరు రెండు లేక నాలుగు అక్షరాల పొడవుండి హ్రస్వ అచ్చుతో కూడిన హల్లుతో మొదలై చివర్లో దీర్ఘం కానీ విసర్గం కానీ ఉండాలి. వేర్వేరు గృహ్య సూత్రాల్లో ఈ నియమాలు వేర్వేరుగా ఉన్నాయి. పేరు పెట్టడానికి నాలుగు పద్ధతులున్నాయి. మొదటిది: జన్మ నక్షత్రాన్ని బట్టి; రెండోది: పుట్టిన నెల/రాశ్యధిపతిని బట్టి; మూడోది: ఇలవేల్పుని బట్టి; నాలుగోది అందరూ పిలిచే పేరును బట్టి. చివరి పద్ధతి కుటుంబ సంప్రదాయాన్ని బట్టి, విద్యా స్థాయిని బట్టి ఉంటుంది. ఇవన్నీ సాధ్యమైనంత వరకు, పరిగణలోకి తీసుకుని, మా మనుమరాలి పేరును, దాని తల్లి-తండ్రులు, పారుల్-ఆదిత్య దంపతులు "వెంకట నాగ సత్యసాయి సంతోషి రాధ కామాక్షి గున్జన్ గోదా దేవి కనక్ వనం" అని నిర్ణయించి, అలానే వెండి పళ్ళెంలో పోసిన బియ్యంపై ఆదిత్యతో రాయించారు శాస్త్రి గారు. ఆ విధంగా, యాదృచ్చికంగానే, పంతొమ్మిదవ శతాబ్దపు "వనం కనకమ్మ" గారి పేరును (మా బామ్మ గారి పేరు-మా నాన్నకిష్టమైన పేరు), ఇరవై ఒకటో శతాబ్దంలో అమెరికాలో పుట్టిన మా మనుమరాలికి "కనక్ వనం" గా పెట్టాడు అలనాటి మా పూర్వీకుడు "వనం కృష్ణ రాయలు" పేరు పెట్టుకున్న మా "ఆదిత్య కృష్ణ రాయ్ వనం".
నామకరణం తంతు ముగిసిన తర్వాత, కటి సూత్ర ధారణ అంటే మొలతాడు కట్టే కార్యక్రమం కూడా జరిపించారు. పసుపు రంగు పులిమిన దారంతో తయారుచేసిన మొలతాడును పాపాయి మొలకు, బామ్మ గారితో కట్టించారు. బంగారపు వుంగరాన్ని తేనెలో ముంచి, మొదలు తండ్రితో, తర్వాత తల్లితో, ఆ తర్వాత అమ్మమ్మ-బామ్మ-తాతయ్యలతో-ఇతర పెద్దలతో, పాపాయి నోట్లో వుంచే కార్యక్రమాన్ని కూడా జరిపించారు శాస్త్రి గారు.
సాధారణంగా ఫలానా వారికి ఫలానా ఇంటి పేరుండడానికి ఏదో ఒక నేపధ్యం వుంటుందంటారు. వుండాలని లేదు కూడా. ఇంటి పేరు గ్రామనామమో, ఏదో ఒక శరీర అవయవమో, జంతువుల పేరో, పక్షుల పేరో, పూల పేరో, తిను పదార్థాల పేరో, వస్తువుల పేరో, వేదాల పేరో, వృత్తుల పేరో, ప్రకృతి సంబంధమైన పేరో, వృక్షాల పేరో, నదుల పేరో, ఇలాంటి మరింకేదో వుంటుంది. మా ఇంటి పేరు "వనం" అంటే అడవి లేదా తోట లేదా అలాంటిదే మరో ప్రకృతి సంబంధమైందేదైనా కావచ్చు. లోగడ కొందరు మాత్రమే ఇంటి పేరుగా వాడుకునే కులాలను, ఇటీవల కాలంలో పలువురు ఉపయోగించుకుంటున్నారు. ఎవరెన్ని చెప్పినా, కుల-గోత్ర-నామాలు, ఎందరు ఒప్పుకున్నా-ఒప్పుకోక పోయినా మన సంస్కృతీ సంప్రదాయంలో చెరిపినా చెరగని అంతర్భాగాలు. తర-తరాల కుటుంబ నేపధ్యం, భావి తరాల వారికి తెలియచేయడానికి, మన గురించి మనం అర్థం చేసుకోవడానికి, ఈ కుల-గోత్ర-నామాలు వాడుకుంటే తప్పులేదు కాని, ఆ పేరుతో కులతత్వం-మతతత్వం-ప్రాంతీయ తత్వం, లేదా, మన సంస్కృతి గొప్ప-ఇతరుల సంస్కృతి తక్కువ అనే భావాలను రెచ్చగొడితే అంతకంటే ఘోరమైన పాపం మరింకోటి లేదు.
ఇంటి పేరుకు ఒకరకమైన నేపధ్యముంటే, వ్యవహారిక నామానికి కూడా మరో రకమైన నేపధ్యముంటుంది. ఒక తరంలో ఒక వ్యక్తికున్న పేరు, వారి మనుమల-మనుమరాళ్ల తరం వచ్చేసరికి ఎవరికో ఒకరికి పెట్టుకోవడం ఆనవాయితీ. తాతగారి పేరు మనుమడికి, అమ్మమ్మ-బామ్మ గార్ల పేర్లు మనుమరాళ్లకు కొన్నేళ్ళ క్రితం వరకు యథాతధంగా పెట్టుకునేవారు. ఇప్పటికీ ఆ ఆచారం కొనసాగుతున్నా, కొంచెం ఆధునీకరించి పెట్టుకుంటున్నారు. ఉదాహరణకు, మా తమ్ముడికి మా నాన్నగారి తాతగారి పేరే పెట్టారు. మా అక్క గారికి మా నాన్న సవతి తల్లి పేరు పెట్టారు. మా ఇంకో తమ్ముడికి (దత్తత పోయినతనికి) మా నాన్న బాబాయి గారి పేరు పెట్టారు. ఇలా పేర్లు పెట్టుకోవడం ఒక "పరంపర" గా కొనసాగుతుంటుంది. అసలు దీని మూలాలు మన గోత్రాల్లో-ఋషుల్లో వున్నాయంటారు.
గోత్రం అంటే, వంశ పరంపరను తెలియచేసే రహస్యం లాంటిదనవచ్చు. బ్రాహ్మణుల్లో, పితృ-పితామహ-ప్రపితామహ...అంతకంటే తెలిసి నన్ని తరాల పూర్వీకులతో పాటు, వంశం ఎక్కడనుంచి ఆరంభమయిందో వారి గోత్రాన్ని బట్టి కొంతవరకు తెలుసుకోవచ్చు. ప్రతి గోత్రం ఒక మహర్షి పేరుతో వుంటుంది. వంశ పరంపర గురించి వివరించేటప్పుడు, మొదటగా ఏ మహర్షి పేరుమీద గోత్రం వుందో, ఆయన పేరు చెపుతారు. తర్వాత ప్రవర చెప్పాలి. ప్రవరంటే, గోత్రానికి ఆద్యుడైన ఋషి పేరు, ఆ ఋషి కుమారుడి పేరు, ఆయన కుమారుడి పేరు (కొంత మందికి ముగ్గురి తో ఆపగా, మరికొంతమంది ఏడుగురి వరకూ చెప్పాలి) చెప్పి, ఫలానా వాడి పౌత్రుడని, పుత్రుడని చెప్పుతారు. బ్రాహ్మణులు వివిధ వర్గాలుగా గుర్తింపు పొందడానికి బహుశా ఇదొక ఏర్పాటు కూడా కావచ్చు. మొట్ట మొదటిసారి గోత్రం అన్న పదాన్ని ఎప్పుడు వాడిందో ఇదమిద్ధంగా తెలవక పోయినా, క్రీస్తు పూర్వం నాలుగో శతాబ్దానికల్లా, అలనాటి మారుతున్న సామాజిక నియమ నిబంధనలు-చట్టాలు, గోత్రం చెప్పుకునే పద్ధతిని స్థిరపర్చాయని అంటారు. దరిమిలా ఆ వ్యవస్థ వేళ్లూనుకోసాగింది.
గోత్రాల పుట్టుక సప్తర్షుల ఆవిర్భావంతో ముడిపడిందంటారు. అయితే ఆ సప్తర్షులు ఒక్కో మన్వంతరంలో, ఒక్కో పేర్లతో వ్యవహరిస్తుండవచ్చు. వైవస్వత మన్వంతరంలో బ్రహ్మ మానస పుత్రులైన మరీచి, అత్రి, అంగీరస, పులస్థియ, పులహ, క్రతు, వశిష్ట మహర్షులను సప్తర్షులనేవారట. అలానే, మరో నమ్మకం ప్రకారం, విశ్వామిత్ర, జమదగ్ని, భరద్వాజ, గౌతమ, అత్రి, వశిష్ట, కశ్యప, అగస్త్య అనే ఎనిమిదిమంది మహర్షుల సంతతిని-వంశ పరంపరను తెలిపే గోత్రాల పేర్లుగా పెట్టారంటారు.
మా గోత్రం "పరాశర". ఋషులు "వశిష్ట-శక్తి-పరాశర". వశిష్ట మహర్షి హిందూ పురాణాలలో ఒక గొప్ప యోగి. బ్రహ్మ సంకల్ప బలంతో జన్మించాడు. అందరు మహర్షుల వలె ఈయన ఒంటరి వాడు కాదు. ఈయనకు పరమ పతివ్రత-పతిభక్తి పరాయణురాలైన అరుంధతితో వివాహమైంది. వీరికి కలిగిన చాలా మంది కుమారులలో "శక్తి" జేష్టుడు. పరాశరుడు వశిష్టుడి మనుమడు. శక్తి పుత్రుడు. ఇతని తల్లి అదృశ్యంతి. హిందూ సంప్రదాయం ప్రకారం వివాహం చేసుకున్న వారికి, వివాహ సమయంలో ఆచరించే సంప్రదాయాలలో మహా పతివ్రత అరుంధతి నక్షత్రాన్ని చూపించడం ఒకటి. పరాశరుడు తాతగారైన వశిష్టుడి దగ్గర పెరిగాడు. పరాశరుడు ఒకనాడు తీర్థ యాత్రకు పోతూ, యమునా నదిలో పడవ నడుపుతున్న మత్స్య గంధి-సత్యవతిని చూసి-మోహించి, ఆమెతో సంగమించాడు. అలా వారి సంగమం కారణంగా యమునా నదిలో ఒక ద్వీపంలో ఆమె సద్యోగర్భాన (కన్యాత్వం చెడకుండా) జన్మించిన కొడుకే కృష్ణ ద్వైపాయనుడు లేదా వ్యాసుడు. ఆ పరాశరుడి వంశ క్రమంలో వాళ్లే వనం వారు.
సత్యనారాయణ స్వామి వ్రతాన్ని, తెలుగునాట ఇంటింటా, వీలున్నప్పుడల్లా చేసుకునేవారు ఎందరో వున్నారు. ఫలానా మాసంలో, ఫలానా తిథి నాడు, ఫలానా సమయంలో ఈ వ్రతం చేసుకుంటే మంచిదని పురాణాల్లో చెప్పినప్పటికీ, ఎప్పుడైనా-ఎన్నడైనా-ఎక్కడైనా, వీలుంటే మంచిరోజొక్కటి మాత్రం చూసుకొని వ్రతం చేసుకోవచ్చని పండితులు చెపుతుంటారు. శుభకార్యాలలో చేయటం నేడు ఆచారంగా వస్తున్నది. తెలుగువారింట్లో, ఏ శుభ కార్యం (వివాహం, గృహ ప్రవేశం, బారసాల, పుట్టిన రోజు, పెళ్లి రోజు, షష్టిపూర్తి, ప్రమోషన్, కొత్త ఉద్యోగం రావడం లాంటివి) జరిగినా-శుభ వార్త విన్నా, సత్యనారాయణ వ్రతం జరుపుకోవడం ఆచారం. అయితే, ఈ వ్రతాన్ని సాధారణంగా, వైశాఖ మాసంలో గానీ, మాఘ మాసంలో గానీ, కార్తీక మాసంలో గానీ ఏకాదశి-పౌర్ణమి, మకర సంక్రాంతి లాంటి శుభదినాల్లో కానీ చేసుకుంటారు చాలామంది. ఈ వ్రతాన్ని నెలకు ఒక సారి కానీ , సంవత్సరానికి ఒక సారి కానీ చేసుకునేవారు కూడా వున్నారు. మా వరకు మేం వీలున్నప్పుడల్లా చేసుకుంటూనే వున్నా. మా పిల్లలు కూడా మా పద్ధతినే అనుసరిస్తున్నారు ఇప్పటివరకు. ఇటీవలే, హ్యూస్టన్ షుగర్ లాండ్ లో వుంటున్న మా రెండో కూతురు-అల్లుడు కిన్నెర-కిషన్ టెల్ ఫెయిర్ లో ఇల్లుకొనుక్కుని, గృహ ప్రవేశం అయింతర్వాత సత్యనారాయణ వ్రతం చేసుకున్నారు. అదే విధంగా మా మనుమరాలి బారసాల సందర్భంగా ఆదిత్య-పారుల్ దంపతులు కూడా సత్యనారాయణ వ్రతం చేసుకున్నారు.
ఆదిత్య వాళ్లుంటున్న లిక్మిల్ రోడ్ లోని అపార్ట్ మెంట్స్ లో, ముందున్న లివింగ్ రూమ్ లో, తూర్పు దిక్కుగా అనువుగా వున్న ప్రదేశంలో ఒక ఆసనం (వ్రతం పీట) లాంటిది వేసి, దానిపై కొత్త వస్త్రం (తెల్ల టవల్) పరిచి, దానిమీద బియ్యం పోసి, దాని మధ్యలో కలశం (వెండిది) ఉంచి, దాని మీద ఇంకో కొత్త వస్త్రం (జాకెట్ గుడ్డ) ఉంచ బడింది. ఆ వస్త్రం మీద సత్యనారాయణ స్వామి ప్రతిమనుంచి, వెనుక ఫొటోను పెట్టాం. కలశం మీద వుంచేముందర ప్రతిమను పంచామృతములతో అభిషేకింప చేశారు పూజారి. ఆ మండపంలో బ్రహ్మాది పంచలోక పాలకులను, నవ గ్రహాలను, అష్ట దిక్పాలకులను ఆవాహన చేసి పూజించడం జరిపించారు ఆ తర్వాత. తరువాత కలశంలో స్వామివారిని ఆవాహన చేసి పూజించే కార్యక్రమం జరిపించి, పూజానంతరం సత్యనారాయణ స్వామి కథ వినిపించి, ప్రసాదాన్ని పంచారు శాస్త్రిగారు. కథని అయిదు అధ్యాయాలలో చెప్పడం జరిగింది .ఒకో అధ్యాయం ముగియగానే అరటిపండు నైవేద్యం పెట్టి , కర్పూర హారతి ఇచ్చి రెండవ అధ్యాయం మొదలు పెట్టారు. చివరికి రవ్వతో చేసిన ప్రసాదం నివేదన చేయించారు. చివరలో మంగళ హారతి కార్యక్రమం, అమ్మాయి తల్లిదండ్రులు అల్లుడికి, కూతురికి, పాపాయికి బట్టలు- ఆభరణాలు పెట్టే తంతు జరిగింది. సాంప్రదాయం ప్రకారం ఆహ్వానితులకు పండు-తాంబూలం, భోజనం పెట్టడం యధావిధిగా జరిపించారు ఆదిత్య-పారుల్, వాళ్లతో పాటు మా శ్రీమతి, పారుల్ అమ్మ గారు.
ఇదే రోజున పాపాయిని ఉయ్యాలలో వేయడం, బావిలో చేద వేయడం అనే కార్యక్రమాలను కూడా చేస్తారు. ఉయ్యాలయితే వుంది గాని, బావి సౌకర్యం అమెరికాలో వుండదు కదా ! అయినా వేడుక వేడుకే. అదే మన వాళ్లకు ఆనందం. వున్న దాంట్లో సర్దుకుపోవడంలో మరీ ఆనందం మనవాళ్లకి. ఉయ్యాలలో వేయడం అంటే పాపాయిని ఉయ్యాలలో వెయ్యాలి కాబట్టి సాంప్రదాయంగా పదకొండో రోజున మొదలు పెడతారు కొంత మంది. మరికొందరు, ఆ రోజున అసలే చేయకుండా 21 వ రోజున కానీ బారసాల జరుపుకున్న రోజున కానీ చేస్తారు. కొందరు అప్పుడు-ఇప్పుడూ చేస్తారు. ఇవ్వాళ-రేపు పిల్లలు పుట్టగానే, ఆసుపత్రుల్లో ఎలాగూ ఉయ్యాల్లో వేస్తున్నారు కాబట్టి, ఈ కార్యక్రమం కేవలం వేడుకే అనాలి.
ఇక ఆ రోజున మిగిలిన మరో కార్యక్రమం బావిలో చేద వేయటం. బావిలో చేద వేయటం అంటే అంత వరకు ఆ అమ్మాయి (బాలింత-పాపాయి తల్లి) పనులేమి చేయదు కనుక ఆ రోజున బావిలో చేద వేయించి ఆమె అన్నీ పనులు చేయ వచ్చు అని చెప్పటం కోసం అన్న మాట. ఇదంతా సైన్స్ ప్రకారమే జరుగుతుందనాలి ఒక విధంగా. ఆ కార్యక్రమాన్నీ జరిపించారు అమ్మమ్మ-బామ్మలు పాపాయి వాళ్ల అమ్మతో.
కార్యక్రమం అంతా ముగిసిన తర్వాత, శాస్త్రోక్తంగా, అంతా జరిపించిన బ్రాహ్మణుడిని శక్తి మేరకు సత్కరించడం మన ఆచారాల్లో అతి ముఖ్యమైంది. బారసాల-నామకరణం-సత్యనారాయణ వ్రతం జరిపించడానికి ఏమివ్వమంటారని సురేష్ ద్వారా అడిగించి నప్పుడు, తన వరకు తనకు వారే దక్షిన ఇవ్వదల్చుకుంటె అదివ్వొచ్చని, దేవాలయానికి మాత్రం $ 250 విరాళంగా ఇవ్వమని కోరారు మార్తి వెంకటేశ్వర శాస్త్రి గారు. అమెరికాలో వుంటూ ఇలా నిరాడంబరంగా వుండడం మమ్మల్నాశ్చర్య పరిచింది. ఆయనే స్వయంగా తన శిష్య బృందంతో తన కారులో వచ్చి పూజ జరిపించి, మా శక్తికొలది ఇచ్చింది స్వీకరించి, ఆదిత్య-పారుల్ దంపతులను ఆశీర్వదించి వెళ్లారు.
No comments:
Post a Comment