జ్వాలానరసింహారావు-విజయలక్ష్మిల వివాహం-IX
శ్రీ పప్పు లక్ష్మీ నరసింహమూర్తి చెప్పిన
"హిందూ సాంప్రదాయ వివాహ వేడుక"
ముహూర్తం సమీపించే ముందు కార్యక్రమం
వనం జ్వాలానరసింహారావు
వధువుకు నలుగు స్నానం చేయించి, పెళ్ళికూతురుగా అలంకరించి, కళ్యాణం బొట్టు దిద్ది, పాదాలకు పారాణిని పూసి, పూల జడ వేసి, నూతన వస్త్రాలను కట్టించి (పట్టు చీరె) "గౌరీ పూజ" కు తీసుకెళ్లారు. మా మామగారింట్లోని మధ్య హాలులో ఎడమ వైపున గౌరీ పూజ కార్యక్రమాన్ని వారి పురోహితుడు జరిపించాడు. గౌరీ పూజకు వధువుని సిద్ధం చేస్తూనే, వర పూజ కొరకు విడిదికి బయలుదేరి వచ్చారు ఆడ పెళ్ళి వారు. కన్యా దాత మేళ తాళాలతో, పానకం బిందెలతో, కొత్త బట్టలతో వచ్చి మగ పెళ్ళి వారికి స్వాగతం పలికే వేడుక ఇది. పానకం వరుడికి ఇచ్చి రుచి చూపించి తరువాత బంధువులందరికీ ఇస్తారు. అయితే, మా పెళ్ళిలో (ఇటీవలి కాలంలో అందరి పెళ్లిళ్లలోనూ జరిగినట్లే) స్నాతకం-కాశీ యాత్ర విరమణ వేడుకలను మా వూళ్లోనే పూర్తి చేసుకుని, ఖమ్మం మా ఇంటికి (విడిది) చేరుకున్నాం కాబట్టి, రాగానే ఎదురు కోలు, పెళ్లినాటి ఉదయం వరపూజ జరిగాయి. వరపూజలో భాగంగా, ఇక్కడ మా ఇంట్లో, ఆడ పెళ్ళి వారు-వారి వైపు బంధువులు వచ్చి, వివాహం చేసుకోవడానికి రమ్మని మమ్మల్ని ఆహ్వానించారు. వరపూజలోనే ఇరువైపువారు, ఒకరినొకరు లాంఛనంగా ఆహ్వానించు కోవడానికి "శుభలేఖలు" మార్చుకున్నారు. వరపూజ కార్యక్రమం జరుగుతుండగానే, కన్యా దాత ఇంట్లో, వధువు గౌరీ పూజ సమాంతరంగా కొనసాగుతుంటుంది.
మా వైపు వారందరూ కన్యా దాత ఇంటికి చేరుకునే సమయానికి, వధువు గౌరీ పూజ ఇంకా కొనసాగుతూనే వుంది. ఇది ఆచారం-సాంప్రదాయం. బ్రహ్మచర్యాన్ని వదిలి గృహస్థాశ్రమాన్ని పొందేందుకు కన్యా వరణానికి వచ్చే వరుడికి ఎదురేగి "నాయనా నా కుమార్తెను భార్యగా స్వీకరించి కలకాలం వర్ధిల్ల” మని కన్యా దాత దీవించే కార్యక్రమంతో వివాహ మండపం వద్ద జరగబోయే వేడుక మొదలవుతుంది. అలా వెళ్లిన మా బంధు-మిత్రులకు మంగళ వాయిద్యాలతో ఎదురొచ్చి, వేద మంత్రాల మధ్య సత్కరించారు. హిందూ వివాహ సంప్రదాయం ప్రకారం, "నారాయణ స్వరూపుడైన వరుడికి" పాద ప్రక్షాళన లాంటివి జరిపించి, కన్యా దాత ఆతిధ్యం ఇస్తారు. దీనినే "మధు పర్కం" అని పిలుస్తారు. మధుపర్కం: మధువు అంటే తేనె. కుమార్తెకు భర్తగా వరుడి ఎంపిక తరువాత అతను వధువు తల్లి-తండ్రికి సంప్రదాయాన్ననుసరించి పుత్ర సమానుడౌతాడు. వివాహానంతరం "మధుపర్కం" అంటే తీయటి పానీయం అని అర్ధం. మధు పర్కాలుగా ఇచ్చిన నూతన వస్త్రాలను ధరించి వరుడు వివాహ వేదిక మీద జరగాల్సిన వేడుకకై వేచి వుంటాడు. నేను ఆ పనిలో వున్నప్పుడు, తర్వాత కార్యక్రమం జరిపించడానికి, కన్యా దాత మా నాన్న గారిని తీసుకొని వధువు గౌరీ పూజ చేస్తున్న హాలులోకి తీసుకెళ్లారు.
గౌరీ పూజ జరిగే చోట ఒక్క సారి, లాంఛనంగా, ఇరు పక్షాల వారి గోత్రం-ప్రవర చెప్పే కార్యక్రమం, పురోహితుల చాతుర్యాన్ని బట్టి అత్యంత ఆసక్తికరంగా-విన సొంపుగా వుంటుంది. "గోత్రం" అంటే వంశం, "ప్రవర" అంటే ఆ వంశం మూల పురుషుల సమాచారం. మీ అమ్మాయిని, మా అబ్బాయికి ఇచ్చి వివాహం జరిపించమని వరుడి తండ్రి, కన్యా దాతను కోరడమే ఈ వేడుక ముఖ్య ఉద్దేశం. ముందుగా, మా పురోహితుడు ఇలా ప్రారంభించాడు: "చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్య శ్శుభం భవతు-వశిష్ట, శక్తి, పరాశర త్రయార్షేయ ప్రవరాన్విత యజుర్వేదినే, తైత్తిరీయ శాఖాధ్యాయినే, ఆపస్తంబ సూత్రిణే, నరహరి రావు శర్మణో నప్త్రే, వెంకట రంగారావు శర్మణ పౌత్రాయ, శ్రీనివాసరావు శర్మణ పుత్రాయ, జ్వాలా నరసింహారావు శర్మణే వరాయ, భవదీయాం కన్యాం ప్రజాసహత్వ కర్మభ్యో వ్రణీమహే" ("మూడు ఋషులున్న పరాశరుడితో సమానమైన గోత్రం కలవాడూ, యజుర్వేదాన్ని అభ్యసించినవాడూ, ఆ వేదం ప్రకారం తన ఇంటి కార్యక్రమాలను నడిపించేవాడూ, తైత్తరీయ శాఖను-ఆపస్తంబ సూత్రాన్ని అభ్యసించి అనుసరించేవాడూ, నరహరి రావు గారి ముని మనుమడూ, వెంకట రంగారావు గారి మనుమడూ, శ్రీనివాసరావు గారి పుత్రుడూ అయిన జ్వాలా నరసింహారావు అనే వరుడికి మీ కూతురునిచ్చి వివాహం చేయమని అడగడానికి వచ్చాం") అని అడుగుతాడు. ఇదంతా నాకు సంబంధించిన పూర్తి వివరాలు. ఇలా మా వంశం వివరాలు చెప్పడం వల్ల కన్యా దాత చివరివరకూ ఆలోచించుకునే అవకాశం వుందింకా. ఇవేవీ తెలియకపోతే (అందరి సమక్షంలో), ఫలానావారి పిల్లవాడిని చేసుకున్నాం-ఇప్పుడు అనుభవిస్తున్నాం అని భవిష్యత్‌లో అనవచ్చు.
కన్యా దాత, వరుడి వివరాలు ముత్తాత తరం దగ్గర నుండి విన్న తర్వాత, ఆ సంబంధం తనకి ఇష్టమైతే, వెంటనే తన వధువు (కూతురు) వివరాలు కూడా చెప్పి అబ్బాయి తన కూతురుని చేసుకోమని అడుగుతాడు. అదే జరిగింది మా పెళ్లిలోనూ-అదే గౌరీ పూజ దగ్గర. కన్యా దాత పురోహితుడు ఇలా అడిగాడు: "చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్య శ్శుభం భవతు-అంగీరస బార్హస్వత్య భారద్వాజ త్రయార్షేయ ప్రవరాన్విత…. …. రంగారావు శర్మణో నప్త్రీ, వెంకట కిషన్ రావు శర్మణ పౌత్రీం, రాంరావు శర్మణ పుత్రీం, విజయలక్ష్మి నామ్నీ భవదీయాం కన్యాం, ప్రజాసహత్వ కర్మభ్యో వ్రణీమహే" ("మూడు ఋషులున్న భరద్వాజునితో సమానమైన గోత్రం కలది… … … రంగారావు శర్మ గారి ముని మనుమరాలూ, వెంకట కిషన్ రావు శర్మ గారి మనుమరాలూ, రాంరావు గారి కూతురూ అయిన విజయలక్ష్మి అనే వధువుకి, వరుడిని అడగడానికి వచ్చాం"). లాంఛనంగా ఇరువురు అంగీకరించారనుకోవాలి.(Part X Next Follows)
No comments:
Post a Comment