Thursday, December 5, 2013

ఆంధ్ర వాల్మీకి (వాసుదాస స్వామి) రామాయణంలో ఛందః ప్రయోగాలు-అయోధ్యా కాండ -2: వనం జ్వాలా నరసింహారావు

ఆంధ్ర వాల్మీకి (వాసుదాస స్వామి

రామాయణంలో ఛందః ప్రయోగాలు

అయోధ్యా కాండ -2

వనం జ్వాలా నరసింహారావు


శ్రీరామ పట్టాభిషేకానికి సన్నాహాలు జరుగుతుంటాయి. ఆ సంబరం చూద్దామనుకుంటున్న అయోధ్యా పురజనులు గుంపులుగా వీధుల్లో తిరుగుతుంటారు. జనులలా గుంపులుగా గూడిన విధానాన్ని వర్ణించిన తర్వాత, ఆ వివరాలన్నీ గురువర్యుడైన వశిష్ఠుడి ద్వారా తెలుసుకొని, ఆయన అనుమతితో తన ఇంటికి పోతున్న వైనాన్ని వర్ణిస్తూ "మానిని" వృత్తంలో రాసారీ పద్యాన్ని కవి ఇలా:

మానిని:        వారల  నెల్లరఁ బోవఁ గఁ  బంచి నృపాలుఁ డు సింహము  శైలగుహన్
                జేరెడిరీతి సమగ్ర్యసువేషవి  శేషవధూజనతాకులజం
                భారినిశాంతమనోహరరాజగృ హంబును  జొచ్చి  సఋక్షగణో
                దారనభంబును జందురునట్టులు దా వెలిఁ గించె  స్వదీధితులన్ - 19

ఛందస్సు:      22 అక్షరాలతో, ఏడు "భ" గణాల గురువుతో, యతిస్థానంలో 7-13-19 అక్షరాలు కలిగి వుంటుంది. ప్రాస నియమం వుంది.


తాత్పర్యం:     దశరథ మహారాజు (సభలోని) సభ్యుల నందరినీ వెళ్ళమని అనుజ్ఞ ఇచ్చి, సింహం తన గుహలోకి పోయిన విధంగా, నానా విధాలైన నూతన అలంకారాలతో వుండి, స్త్రీ సమూహాంతో నిండిన, ఇంద్రుడి మేడలాంటి అందమైన తన గృహంలోకి ప్రవేశించి, తన (దశరథుడు) కాంతులతో, నక్షత్ర సమూహం మధ్య ఆకాశంలో వున్న చంద్రుడి లాగా ప్రకాశింప చేశాడు. 

No comments:

Post a Comment