Friday, December 20, 2013

ఆంధ్ర వాల్మీకి (వాసుదాస స్వామి) రామాయణంలో ఛందః ప్రయోగాలు-అయోధ్యా కాండ -5: వనం జ్వాలా నరసింహారావు

ఆంధ్ర వాల్మీకి (వాసుదాస స్వామి
రామాయణంలో ఛందః ప్రయోగాలు
అయోధ్యా కాండ -5
వనం జ్వాలా నరసింహారావు

భాతృ భక్తితో లక్ష్మణుడు చెప్పిన మాటలు విన్న కౌసల్య, శ్రీరాముడిని ఉద్దేశించి తమ్ముడు చెప్పిన విషయాలను గుర్తుచేసి, అతడికేది ధర్మమని తోస్తే అదే చేయమని సలహా ఇస్తుంది. అడవులకు పోవడమే మంచిదనుకుంటే అలానే చేయమని అంటూ కౌసల్య తన మనసులోని మాటలను చెప్పడానికి ఒక పద్యాన్ని"కవిరాజవిరాజితము" లోను, రెండు పద్యాలను "మత్తకోకిలము" వృత్తంలోను రాసారు కావి ఈ విధంగా:



కవిరాజవిరాజితము:
మనమున నాసవతాలు వచించిన మాటను బట్టి గృహంబున న
న్న నయము దుఃఖములందు మునుంగు మ టంటయు నీకును ధర్మమొకో ?
ఘనమతి ! ధర్మము సల్పఁ గ నీయెదఁ గల్గినచోఁ బరిచర్యల నన్
దనుపఁ గ రాదొకొ, తల్లిని గొల్చుట ధర్మము గాదె తనూజులకున్ ? -22

ఛందస్సు:      "నగణము నారు జగణములు వగణము గలది కవిరాజ విరాజితము".

మత్తకోకిలము:     నిండుబక్తి భజించి తల్లిని నిల్చి యింటనె మున్ను  వి
                        ప్రుండు కాశ్యపుఁ డన్మునీశుఁ డు  పొందఁ డే  సురలోకమున్,
                        దండిగౌరవమందు రేనికిఁ దక్కు  వౌనొకొ తల్లి ? నీ
                        వుండు మిందుఁ , బ్రవాసి  వౌటకు నొల్ల నాజ్ఞనొసంగగన్ -23

మత్తకోకిలము:      నిన్నుఁ  బాసి  వసింపఁ గల్గిన నిశ్చయం బిది పుత్రకా !
                        యన్న  మేటికి  నీర  మేటికిఁ బ్రాణ  మేటికి  సౌఖ్య మం
                        చెన్న  నేటికి ? నీవు గల్గిన నిన్ని యున్నటు  దోఁ చుఁ గా,
                        తిన్న చో నునుఁ బచ్చికైన మదిం  బ్రియం బొనరించురా ! -24

ఛందస్సు:      మత్తకోకిలము వృత్తానికి ర----- గణాలు. పదకొండో అక్షరం యతి.


తాత్పర్యం:     నిన్ను (రాముడిని) ఆజ్ఞాపించినవాడు తండ్రిగాడు. నాకు (కౌసల్యకు) సహజవిరోధైన నా సవతి చెప్పిన మాటను మనస్సున నిలిపి, కన్న తల్లినైన నన్ను శాశ్వత దుఃఖంలో మునగమనడం నీకు ధర్మమా ?. అర్థం నాకు పరమార్థం కాదు. ధర్మమే అంటావా, రాజ్యం లేకపోయినా నాకు శుశ్రూష చేసుకుంటూ నా ఇంట్లో వుండు. కొడుకులకు మాతృసేవ ధర్మమేకదా ! పూర్వకాలంలో, కశ్యపు వంశంలో పుట్టిన ఒక బ్రాహ్మణుడు, అందరిలాగా అడవులకు పోయి, ఏ తపస్సు చేయకుండా, ఇంట్లోనే వుండి, మాతృ శుశ్రూషచేసి, తపస్సుచేసి సాధించే స్వర్గసుఖాన్ని సాదించాడు. విశేష గౌరవంలో రాజుకంటే-తండ్రికంటే తల్లి తక్కువవుతుందా ? కాబట్టి నీ తండ్రి ఆజ్ఞకంటె నా ఆజ్ఞ తకువైందేమీకాదు. నువ్వింట్లోనే వుండమని నేను ఆజ్ఞాపిస్తున్నాను. వూరు విడిచి పోయేందుకు నేను అనుజ్ఞనీయను. నిన్నొదలి నేను ఇంట్లో వుండడమే జరుగుతే, ఒకటి మాత్రం నిశ్చయం కుమారా ! నాకు అన్నమెందుకు ? నీళ్లెందుకు? చివరకు ప్రాణమెందుకు ? ఇక సుఖపడడం గురించి చెప్పాల్సిన పనేలేదు. రామచంద్రా, నువ్వు నాదగ్గరుంటే, ఇవన్నీ లేకున్నా వున్నట్లే. ప్రాణం సంతోషిస్తుంది-పచ్చిక తిన్నా నాకు సంతోషమే.

No comments:

Post a Comment