Saturday, December 7, 2013

ధర్మవరపు సుబ్రహ్మణ్యం చనిపోయారు:వనం జ్వాలా నరసింహారావు

ధర్మవరపు సుబ్రహ్మణ్యం చనిపోయారు

వనం జ్వాలా నరసింహారావు


ధర్మవరపు సుబ్రహ్మణ్యం హఠాన్మరణాన్ని సింగపూర్‌లో వున్న నేను ఈ ఉదయం పత్రికల్లో చదివి దిగ్భ్రాంతికి గురయ్యాను. బహుశా నేను సింగపూర్ బయల్దేరడానికి రెండు-మూడు రోజుల ముందనుకుంటా...ఏదో పని మీద ఫోన్‌లో చాలా సేపు మాట్లాడాడు. నేను సింగపూర్ నుంచి తిరిగి వచ్చిన తరువాత మా ఇంట్లో ఆయన, నేను, మరి కొందరం స్నేహితులం కలిసే ఏర్పాటు కూడా చేసుకున్నాం. విధి బలీయం. ఆయనిక లేరు. రాష్ట్ర హస్తకళల అభివృద్ధి సంస్థలో నేను పనిచేస్తున్నప్పుడు, 1992 ప్రాంతంలో అనుకుంటా, సంస్థ ఛైర్మన్ మిరియాల వెంకట్రావు గారి ద్వారా ఆయన నాకు పరిచయమయ్యారు. పరిచయ సంధాన కర్త ప్రముఖ వైఎస్సార్సీపి (ప్రస్తుత) పార్టీ నాయకుడు అంబటి రాంబాబు. అతి త్వరలోనే మా పరిచయం స్నేహంలాగా మారింది. నేను పనిచేస్తున్న హస్తకళల అభివృద్ధి సంస్థకు, హస్త కళాఖండాలకు ప్రాచుర్యం లభించేందుకు ఆయన అంబటి రాంబాబుతో కలిసి రెండు-మూడు ప్రచార లఘు చిత్రాలను తయారు కూడా చేశారు. నేను పంజాగుట్ట దుర్గ గుడి పక్క సందులో నివాసం వుంటున్నప్పుడు, ధర్మవరపు, అంబటి, భండారు శ్రీనివాస రావు, డాక్టర్ ఎపి రంగారావు, మరి కొందరు అడపదడప కలుస్తుండే వాళ్లం. అప్పట్లో ధర్మవరపు మద్యం సేవించేవాడు మాతోపాటు. మా మధ్య సంభాషణ చాలా భాగం హాస్యం మీద, సినీ పాటల మీద, నాటకరంగం పద్యాల మీద, వర్తమాన రాజకీయాల మీద సాగేది. 


ధర్మవరపు మాట్లాడుతుంటే సినిమాలో మాట్లాడినట్లే వుండేది. సహజమైన తన వాక్చాతుర్యాన్ని సినిమాలలో కూడా చూపేవారాయన. పాటలు మధురంగా పాడేవారు. పద్యాలను బ్రహ్మాండంగా చదివేవారు. పాండవ-ఉద్యోగ విజయాల నుంచి రాయభారం పద్యాలు విన సొంపుగా చదివి విడమర్చి అర్థం చెప్పేవారు. మా ఉమ్మడి "సిట్టింగులు" తరచుగా మా ఇంట్లోనే ఐనప్పటికీ, మధ్య-మధ్య భండారు ఇంట్లో, ఒకటి-రెండు పర్యాయాలు డాక్టర్ రంగారావు ఇంట్లో, వీలున్నప్పుడల్లా ధర్మవరపు సుబ్రహ్మణ్యం ఇంట్లో చోటుచేసుకునేది. ఒకసారి ఆయన, నేను, జంధ్యాల, సోమయాజులు, ఎంవిజి సుబ్రహ్మణ్యం, డాక్టర్ రంగారావు, భండారు శ్రీనివాస రావు, కాసేపు ఎంవిజి ఇంట్లో, తరువాత గ్రీన్ పార్క్ హోటల్లో కూచుని మద్యం సేవిస్తూ దాదాపు తెల్లవార్లూ గడిపాం. అలనే జంధ్యాల చనిపోవడానికంటే కొద్ది రోజుల ముందర ప్రెస్ క్లబ్‌లో కలిశాం. యాక్సిడెంట్ అయిన తరువాత ఆయన మద్యం పూర్తిగా మానేశారు. ఐనా కంపెనీ ఇవ్వడంలో ఎన్నడూ వెనకాడ లేదు. నేను మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో పనిచేస్తున్నప్పుడు, పౌర సంబంధాల ప్రక్రియ మీద ఒక డివిడి ఫిల్మ్ చేసి పెట్తారు సంస్థకు. అలానే నేను ఇ.ఎం.ఆర్.ఐ (108) సంస్థలో పని చేస్తున్నప్పుడు అత్యవసర సహాయ సేవలు అందించే అంశంపై నాలుగు లఘు చిత్రాలను నిర్మించారు. ఎప్పుడు ఏది అడిగినా కాదనే సహృదయం ధర్మవరపు సుభ్రహ్మణ్యంది. మా ఇద్దరమ్మాయిల పెళ్లిళ్లకు ఆర్థిక సహాయం చేసాడు నాకు అడక్కుండానే. ధర్మవరపు ఇంట్లో, ఆయన కుటుంబ సభ్యులతో కూడా నేను సన్నిహితంగా వుండేవాడిని. ఆయన మరణానికి నా హృదయపూర్వక సంతాపం...ఆయన కుటుంబ సభ్యులకు నా సంతాపం.

No comments:

Post a Comment