Sunday, December 15, 2013

ఆంధ్ర వాల్మీకి (వాసుదాస స్వామి) రామాయణంలో ఛందః ప్రయోగాలు - అయోధ్యా కాండ -3: వనం జ్వాలా నరసింహారావు

ఆంధ్ర వాల్మీకి (వాసుదాస స్వామి
రామాయణంలో ఛందః ప్రయోగాలు
అయోధ్యా కాండ -3
వనం జ్వాలా నరసింహారావు

శ్రీరాముడికి దశరథుడు జరిపించదల్చుకున్న పట్టాభిషేకం గురించి తెలుసుకున్న కైకేయి ఆ ప్రయత్నాన్ని అడ్డుకుంటుంది. ఆమె కోరిన వరాలకు పరితపించిన దశరథుడు కైకను దూషించాడు-శ్రీరాముడి గుణాలను వర్ణించాడు-కైకను వేడుకున్నాడు. చివరకు న్యాయ నిష్ఠూరాలాడాడు. రాముడిని అడవులకు పంపి జీవించ లేనన్నాడు. ఇలా కాదనుకొని మరొక్కసారి మెత్తని మాటలతో వేడుకోవడాన్ని"తరలము" వృత్తంలో చక్కగా రాసారీవిధంగా:

తరలము:వనజలోచన ! కాననంబుల  పాలుగాఁ గ సుతుండు  నే
                మనుటె  కల్ల నిజంబు, సౌఖ్యము  మాట  యేటికె  చెప్పగా ?
                మనితిఁ బో పని యేమి నీవు ? సు మాళి  నౌదునె ? విప్రియం
                బును  ఘటింపకు  నీదు  కాళ్లకు  మ్రొక్కెదన్ మరి మ్రొక్కెదన్ - 20

ఛందస్సు: ------గణాలు. పన్నెండో స్థానంలో యతి.


తాత్పర్యం:     (ముఖ ప్రీతిమాటగా "కమలముల వంటి కన్నుల దానా-వనజలోచన" అని దశరథుడితో అనిపించాడు కవి). కోపం పట్టలేక తిట్టిన దశరథుడు, తిట్టడంవలన కార్యసాధన కాదని భావించి, మెత్తటి మాటలతో చెప్తున్నాడు. కమలాక్షీ ! నా కొడుకు అడవులకు పోతే, నేను జీవించడం అసత్యం. అలాంటప్పుడు నీతో ఎలా సుఖపడతాను ? ఒకవేళ బతికినా, శోకంలో మునిగి వుండేవాడినేగాని, సంతోషంతో వుండలేనుకదా ! అప్పుడు నీతో నాకేంపని ? కాబట్టి నాకు అప్రియమైన పని చేయకు. నీ కాళ్లకు మొక్కుతాను-మరీ, మరీ మొక్కుతాను.

No comments:

Post a Comment