తెలంగాణ
ఏర్పాటు రాజకీయ వైకుంఠపాళి
సరిగ్గా కాబినెట్ ముందుకు తెలంగాణ ముసాయిదా బిల్లు ఆమోదం కొరకు
రావడానికి రెండు-మూడు రోజుల ముందు నుంచీ, రాయల
తెలంగాణ ప్రతిపాదనకు సంబంధించిన వార్తలు మీడియాలో రావడం మొదలయ్యాయి. రాయల తెలంగాణాకు భారతీయ జనతా పార్టీ వ్యతిరేకం అని తెలిసి కూడా సోనియా
గాంధీ, ఆమె బృందం ఆ ప్రతిపాదనతో ముందుకు పోయి, పార్లమెంటులో బిల్లు పెడితే అది ఓడిపోవడం ఖాయమే కదా! అలా జరగడానికి వీలు లేదని తెలిసి కూడా, ఆ అబద్ధపు
ప్రచారాన్ని అభినవ సైంధవులు యధేఛ్చగా చేశారు. కేంద్ర
కాబినెట్ ఐదో తేదీన తీసుకున్న నిర్ణయంతో, తెలంగాణ రాష్ట్ర
ఏర్పాటు జరిగినట్లేగా? ఇంకా అనుమానాలు ఎవరికైనా వున్నాయా?
ఇంకా మభ్య పెట్టేవారిని ఏమనాలి? అయినా ఏదో
మినుకు-మినుకు మంటున్న ఆశ.
పార్టీ అధిష్ఠానం తాము చెప్పిన మాట జవదాటదని, తాము
గీచిన గీటు అధిష్టానం పెద్దలకు సరిహద్దని బీరాలు పలుకుతూ, మొదట్నుంచీ
తెలంగాణా ఏర్పడే సమస్యే లేదని, చెప్పుకొస్తున్న సీమాంధ్ర
కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఒకటి వెంట మరొక ఝలక్ ఇచ్చుకుంటూ పోయింది అదే అధిష్ఠానం.
అసలు అభిప్రాయమే చెప్పదన్న పార్టీ అన్ని పార్టీలను బుట్టలో వేసుకుని,
వారితోనే తెలంగాణకు అనుకూలం చెప్పించి, చివరిగా
తన మనసులో మాట బయట పెట్టింది. వర్కింగ్ కమిటీ, తర్వాత యుపిఎ ప్రభుత్వం, యాంటోనీ కమిటీ, కాబినెట్, గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్....చివరకు కేంద్ర కాబినెట్...అందరూ తెలంగాణకు...అదీ పది జిల్లాల తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇది జీర్ణించుకోలేక పోయారు సీమాంధ్ర పెద్దలు. అధిష్టానం
తమ మాటే వింటుందనుకున్న ఆ పెద్దలు, ఏ నిర్ణయం తీసుకున్నా
కట్టుబడి వుంటామని ప్రతిజ్ఞలు కూడా చేశారు. సీన్ ఎదురు
తిరిగింది. "అనుకున్నదొకటి-అయిందొకటి-బోల్తా పడ్డావులే బుల్ బుల్ పిట్టా" అన్న చందాన
నిర్ణయం జరిగిపోయింది. అయినా....ఇంకా...ఇది చేస్తాం-అది చేస్తాం, ప్రభుత్వానికి
మద్దతు ఉపసంహరించుకుంటాం, అవిశ్వాసం పెట్తాం....ఇలా రకరకాలుగా ఉత్తర కుమార ప్రజ్ఞలు చేశారు-చేస్తూనే
వున్నారు. సాధ్యం అయ్యేది ఏంటి, కానిది
ఏంటి అనే అలోచన కూడా చేయడం లేదు. ఇప్పటికైనా యదార్థాన్ని
గ్రహించడం మంచిది. తాము కలిసుంటాం...వెళ్లం...అని మలేసియా పెద్దలతో మొర పెట్టుకున్నా, ఆగస్ట్
1965 లో వెళ్లగొట్టబడిన సింగపూర్, ప్రపంచంలోనే,
ఏకైక సర్వ సత్తాక గణతంత్ర నగర-రాజ్యంగా,
ద్వీప దేశంగా ఏర్పడింది. ఇప్పుడు ప్రపంచంలో ఒక
ఆర్థిక అగ్ర రాజ్యంగా పరిణితి చెందింది. రేపు తెలంగాణా అదే
కాబోతుంది. తన నుంచి విడిపోయిన తమ్ముడు గొప్పవాడు
కాబోతున్నాడని సంతోషించాలి కాని, శాపనార్థాలు పెడితే ఎలా?
రాష్ట్ర శాసన సభ
ఈ నేపధ్యంలో, విజయవాడ సభలో కిరణ్ కుమార్ రెడ్డి చాలా గమ్మత్తుగా మాట్లాడారు....తిరుగుబాటు
బావుటాను ఎగురవేశారు. రాష్ట్ర విభజన దేశ విభజన లాంటిదని
సాక్షాత్తు ముఖ్యమంత్రిగా ఆయన అనడం హాస్యాస్పదం. తెలంగాణ
రాష్ట్రం ఏర్పడితే నక్సలిజం, మత తత్వం, ఉగ్రవాదం ప్రబలుతుందని ఆయన మరో ఉవాచ ఇచ్చారు. ఈ
రాష్ట్రం ప్రజలు చేసిన పాపమల్లా కాంగ్రెస్ పార్టీని గెలిపించడమే అని కూడా ఆయన మరో
అంశం లేవనెత్తారు. అసలు సమైక్య రాష్ట్రంలో తెలంగాణకు
అన్యాయమే జరగలేదట! ఈ ప్రపంచంలో ఎవరూ శాశ్వతం కాదని, భారత దేశం, ఆంధ్ర ప్రదేశ్ మాత్రమే శాశ్వతమని
చెప్పారు. రాష్ట్రం విడిపోతే తాను ఒప్పుకోనని ముఖ్యమంత్రి
బల్ల గుద్ది మరీ చెప్పారు! ఏమీ అయన ధైర్యం! సమైక్యాంధ్ర అంత పెద్ద ఉద్యమం ఆయన జీవితంలో భారత దేశంలో ఎప్పుడూ-ఎక్కడా చూడ లేదట! అదో ప్రజా ఉద్యమమనీ, అదెందుకు కేంద్ర ప్రభుత్వానికి కనబడలేదని ప్రశ్నించారు. ఇప్పటికైనా కేంద్రం తాను తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కు తీసుకోమని మరీ-మరీ కోరారు ఆయన. శాసన సభలో విభజన బిల్లును ఓడిస్తాం
అంటున్నారీ పెద్ద మనిషి! అసలు ఓటింగుకే పెట్టకపోతే ఓడించే ప్రసక్తి ఎక్కడిది? కెసిఆర్ అడగడం వల్ల, జగన్ అడగడం వల్ల విభజన
జరిగిందని ఆయన మరో కొత్త కోణం తీసి వాపోయారు. శాసన సభలో ఓడిన
బిల్లును పార్లమెంటులో ఎలా గెలిపిస్తుందో చూస్తామని భీకర ప్రతిన పూనారు. ఆయన్నే మనాలి? కిరణ్ కుమార్ రెడ్డిగారు ఇప్పటికైనా
దూకుడు మానితే మంచిదేమో!
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైతే, నక్సలిజం, ఉగ్రవాదం, మత తత్వం పెల్లుబుకుతుందని ముఖ్యమంత్రి
అంటున్నాడు. పాపం తాను చాలా విషయాలు చెప్పాననుకుని వుంటాడు
ముఖ్యమంత్రి. 1956 నుండి ఈ రాష్ట్రంలో జరిగిన దాడులు ఎవరికి
తెలియదు? ఒక ముఖ్యమంత్రి మీద అలిపిరి వద్ద జరిగిన దాడితో సహా,
ఇద్దరు-ముగ్గురు మంత్రుల మీద నక్సల్స్ దాడి
చేసి వాళ్లను చంపింది, యం.యల్.ఏల మీద, మండలాధ్యక్షుల మీద, నక్సల్స్
దాడులు జరిగింది, మందుపాతరలు పెట్టింది సమైక్యం రాష్ట్రంలోనే
కదా! గుర్తేడులో ఒకేసారి 7 గురు ఐ.ఏ.యస్ అధికారులను నక్సల్స్ కిడ్నాప్ చేసింది సమైక్య
రాష్ట్రంలోనే అన్న విషయం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి జ్ఞాపకం లేదా? సమైక్య రాష్ట్రంలోనే కదా గోకుల్ చాట్, లుంబినీ
పార్క్ , మక్కా మసీదు, దిలుషుక్ నగర్
లలో తీవ్రవాదుల దాడులు జరిగింది? హైదరాబాద్‌లో, సమైక్యం రాష్ట్రంలోనే కదా మతతత్వం పెచ్చు మీరిపోయి, అనేకమంది
అమాయకుల ప్రాణాలను బలి తీసుకొంది? స్వయంగా చెన్నారెడ్డిని
పదవి నుండి దించటానికి విజయవాడ నుండి రౌడీలను తీసుకొని వచ్చి హైదరాబాద్‌లో మారణ
కాండ సృష్టించింది సమైక్య రాష్ట్రంలోనే కదా? తిరుమల
వెళుతున్న చంద్రబాబు నాయుడు మీదనే కాదు, తిరుపతి వెళుతున్న
నేదురుమల్లి జనార్ధనరెడ్డిపై కూడా తీవ్రవాద దాడులు జరిగింది రాయలసీమలోనే-సమైక్య రాష్ట్రం లోనే! వారికి ఇదీ గుర్తులేదేమో!
ఇవన్నీ సామాన్యులమైన మనలాంటి వారికే గుర్తుంటే ముఖ్యమంత్రికి గుర్తు
లేక అలా మాట్లాడడం ఏంటి?
విభజిస్తే నీటి యుద్ధాలు వస్తాయంటున్నాడు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్
రెడ్డి. ఇప్పుడు, ఇరుగు-పొరుగు
రాష్ట్రాల మధ్య జల వివాదాలు లేవా? వాటి పరిష్కారానికి
మార్గాలు లేవా? మార్గాలున్నా వివాదాలు పూర్తిగా సమసిపోయాయా?
ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా సీఎం మాట్లాడడం విడ్డూరంగా వుంది.
ఒక ముఖ్యమంత్రి స్థానంలో వున్న వ్యక్తి ప్రజలను మభ్యపెడుతూ, ఇలా, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం సమంజసమేనా?
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆపడం ఆయన చేతిలో కాని, ఆయనను సమర్థిస్తున్న కొందరు సీమాంధ్ర నాయకుల చేతుల్లో కాని లేదనే విషయం
అందరికీ తెలుసు. ముఖ్యమంత్రికీ తెలుసు. జల వివాదాల విషయంలో కిరణ్ కుమార్ రెడ్డి చెప్పేది ఒక విధంగా నిజం
అనిపిస్తోంది! రాష్ట్ర విభజన జరిగిన తర్వాత తెలంగాణా
రాష్ట్రం తన హక్కుల కోసం విధిగా పోరాడి తీరుతుంది. అప్పుడు
ఆంధ్రకు నష్టం జరిగే అవకాశం లేకపోలేదు. మరో విధంగా
చెప్పాలంటే ఇప్పటిదాకా ఆంధ్ర ప్రాంతం తెలంగాణాకు చేస్తున్న అన్యాయాలు కొనసాగడం
రాష్ట్ర విభజన తర్వాత సాధ్యం కాదు. అంతర్ రాష్ట్ర జల
వివాదాలు పరిష్కరించడానికి రాజ్యాంగంలో ఏర్పాట్లు వున్నాయి కాని ఒక రాష్ట్రం లోనే
ఒక ప్రాంతం మరో ప్రాంతానికి అన్యాయం చేస్తే ఎలా పరిష్కరించాలి అన్న దానికి
రాజ్యాంగంలో కాని మరే ఇతర చట్టంలో కాని ఎలాంటి మార్గం లేదు. రాష్ట్ర
విభజన కారణంగా తలెత్తేవి జల యుద్ధాలు కాదు - నదీ జలాల
పంపిణీలో న్యాయం. ఈ న్యాయం జరగకుండా వుండాలంటే రాష్ట్రం
విడిపోకూడదు. అదే కిరణ్ కుమార్ రెడ్డి కోరుకుంటున్నాడు.
తన మదిలో మాట మరో విధంగా బయట పెడుతున్నాడు.
ఇంతలో, "రాష్ట్ర విభజన బిల్లుపై న్యాయ సలహా కోరిన
రాష్ట్రపతి" అని వార్తలొచ్చాయి. ఇంకేం...సీమాంధ్ర నాయకులు ఆశించినట్లే జరుగుతున్నది కదా! అనుకున్నారందరు.
న్యాయ సలహా అనుకూలంగా వచ్చినా-ప్రతికూలంగా
వచ్చినా కట్టుబడి వుంటాం అని అంటే బాగుండేదేమో! ఏం జరగ
బోతోందో అనుకుండే లోపలే, తెలంగాణ బిల్లును పరిశీలించిన
రాష్ట్రపతి రాష్ట్ర శాసన సభ పరిశీలనకు దానిని పంపుతున్నారని, టీవీలు ప్రసారం చేశాయి. అంటే, విభజన
దిశగా, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు దిశగా, మరో అడుగు ముందుకన్న మాట!
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన అరడజన్‌కు పైగా కాంగ్రెస్ ఎంపీలు, తెలుగు
దేశం ఎంపీలు, వైఎస్సార్ సీపీ ఎంపీలు, కలిసిగట్టుగానో-విడి విడిగానో కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చారు. యుపిఎ ప్రభుత్వం
పదేళ్ల క్రితం ఏర్పడిన దరిమిలా, హేమా-హేమాలైన
ప్రతిపక్షాలు, కాంగ్రెస్ సారధ్యంలోని సంకీర్ణ ప్రభుత్వాన్ని
అవిశ్వాసం పేరుతోనో, మరే పేరుతోనో ఇరకాటంలో పెట్టే
ప్రయత్నాలు చాలా సార్లు చేశాయి. అది వామ పక్షాల సారధ్యంలో
జరిగాయి...బిజెపి సారధ్యంలో జరిగాయి...ఎస్పీ
లాంటి ప్రాంతీయ పార్టీల సారధ్యంలోనూ జరిగాయి. మమత బెదిరింపులు ఎన్ని మార్లో!
కరుణానిధి సరేసరి! ఇంతవరకు, ఒక్క సారంటే-ఒక్క సారైనా ప్రభుత్వం వెనుకంజ వేసిన
దాఖలాలున్నాయా? ఏ బిల్లయినా ఓడి పోయిందా? వెనక్కు తీసుకుందా? ఇక, ఇప్పుడు,
తెలంగాణా నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అవిశ్వాస తీర్మానం
ప్రతిపాదిస్తే అది కనీసం పరిశీలన దశకన్నా చేరుతుందా? ఏదేమైతేనేం!
సమైక్య వాదాన్ని బలంగానే వినిపించారన్న క్రెడిట్ దక్కించుకోవడం
మాత్రం వారికి దక్కిందనే అనాలి. "లెట్ అజ్ విష్ దెమ్
ఆల్ ద బెస్ట్". సీమాంధ్ర కాంగ్రెస్ ఎం. పిలు స్వపక్షం మీదనే అవిశ్వాసం నోటీసు
ఇచ్చారు.. దివాకర్ రెడ్డి మరొక అడుగు ముందుకు వేసి సోనియా
దిగిపోవాలని ప్రకటించాడు ..ఇవన్నీ వేటికి నిదర్శనాలు.
సొంత పార్టీ ఎంపీలే ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం నోటీసు ఇవ్వడం, సొంత
పార్టీ సీఎం తిరుగుబాటు బావుటాను ఎగురవేయడం, సొంత స్పీకర్
మీదే నమ్ముకున్న బీజేపీ అవిశ్వాసం ప్రకటించడం...ఏమిటో అంతా
గందరగోళంగా వుంది. ఇదేదో పులి జూదం ఆటలాగా, పరమపద సోపాన పటం ఆటలాగా, ఎక్కువలో ఎక్కువ చదరంగం
ఆటలాగా వుంది కాని, రాజకీయ చతురత ఎక్కడా కనిపించడం లేదు.
మధ్యలో శరద్ పవార్...."బేగానా షాదీ మే" లాగా బుడతకీచు చందాన ఏదో
అంటుంటాడు. దిగ్విజయ్ సింగ్ మాట్లాడే దానికి అసలు అర్థమే
వుండదు. చివరకు కాంగ్రెస్ అధిష్టానం (మైనస్
సోనియా, రాహుల్) అంతా కలిసి సోనియానే
మన్నా ఇరకాటంలో పెట్టే ప్రయత్నంలో వున్నారా? అదే జరిగితే ఆట
రసకందాయంలో పడ్డట్టే!
ఆట రసకందాయంలో పడనే పడిందండీ. సీమాంధ్రలో అసలు మనుషులే లేరన్న ధోరణిలో ఈ విభజనప్రక్రియను కాంగ్రెసుపార్టీవారు నడిపిస్తున్నారు. సీమాంధ్రలో మనుషులు ఒకవేళ ఉన్నా, సీమాంధ్రలో పుట్టటం అనే మహాపాపకృత్యం కారణంగా వారంతా తెలంగాణాద్రోహులే నని శ్రీమాన్ కెసీయార్‌గారు ఎప్పుడో సిధ్ధాంతీకరించేసారు. మేథావులు (తెలంగాణామేధావుల అనటంలో పునరుక్తిదోషం వస్తుంది. సీమాంధ్రలో మనుషులే లేనప్పుడు అక్కడ మేథావులు మాత్రం ఎలా ఉంటారు చెప్పండి?) ఎవరూ కూడా సదరు సిధ్ధాంతీకరణకు అక్షేపణగా ఒక్కముక్కా మాట్లాడటం జరిగినట్లు లేదు. ఒకానొక మేథావి 'సీమాంధ్ర ఏ గంగలో ములిగితే మాకేం' అని కూడా సెలవిచ్చారు. ఈ సద్వాక్యాన్నీ ఎవరూ విమర్శించలేదు కదా. ఇలాంటప్పుడు తెలంగాణా మహదావిర్భావానికీ, సీమాంధ్రను ఎడారిచేయటానికీ ఎదురేముంది. కానివ్వండి. రేపు సీమాంధ్రనుండి వచ్చి తెలంగాణాలో స్థిరపడ్డ సీమాంధ్రులకు జీవించే హక్కు లేదు అని మన కేసీయార్‌గారు సెలవిచ్చినా అది సకలజనామోదం పొందుతుందని తప్పకుండా విశ్వసించవచ్చు. అనుమాననివృత్తికోసం మేథావులు ఎలాగూ వ్యాసాలు వ్రాస్తారు అవసరమైతే. జరిగేది జరుగుతుంది. కాలమే నిర్ణయిస్తుంది ఏది ఎలా పరిణమించేదీ. కనీసం కాలం అనేది కాంగ్రేసువారి బంట్రోతు కాదని నమ్మవచ్చును. అంతే. శుభం భూయాత్.
ReplyDeleteబాగుంది శ్యామలీయం గారూ!
Deleteతెలంగాణా ప్రజల ఆశయాన్ని గుర్తించి వారికి చెందిన భూభాగాన్ని ప్రత్యేక రాష్ట్రం చేయాలని నిర్ణయం తీసుకుంది కేంద్రం.
కాని తెలంగాణా ప్రజలను ప్రజలుగానే గుర్తించని మీరు(శ్యామలీయం), మీలాంటి కోట్లాది సీమాంధ్ర ప్రజలు, నాయకులు అక్కడి ప్రజల ఆకాంక్షని కూడా గుర్తించడానికి దశాబ్దాలుగా నిరాకరించారు. తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉద్యమాలు నడిపారు. ఇప్పుడు కూడా అడ్డుపుల్లలు వేయడానికే ప్రయత్నిస్తున్నారు. మీ భూమి కావాలంటిమా, మీ నీళ్ళు కావాలంటిమా, మీ నిధులు కావాలంటిమా? మాది మేం తీసుకోవడానికి కూడా మీ కుట్ర బుద్ధి, దోపిడీ మనస్తత్వం ఒప్పుకోలేదు.
అవునులే, మీ దృష్టిలో తెలంగాణా ప్రజలు ప్రజలే కానప్పుడు వారి ఆకాంక్షలకు మాత్రం విలువేముంటుంది? వారికి ఏం కావాలో ఏం వద్దో మీరేకదా నిర్ణయించేది! కేంద్రం తెలంగాణా ప్రజలని మీ బానిసలుగా గుర్తిస్తే, అది మిమ్ములని మనుషులుగా గుర్తినట్టు భావిస్తారేమో మీరు!