Sunday, January 15, 2017

విభీషణునికి అభయమిచ్చిన శ్రీరామచంద్రుడు ....ఆంధ్ర వాల్మీకి రామాయణంలో ఛందః ప్రయోగాలు 27 వ భాగం - సుందర కాండ : వనం జ్వాలా నరసింహా రావు

విభీషణునికి అభయమిచ్చిన శ్రీరామచంద్రుడు
ఆంధ్ర వాల్మీకి రామాయణంలో ఛందః ప్రయోగాలు
27 వ భాగం - సుందర కాండ
వనం జ్వాలా నరసింహా రావు
సూర్య దినపత్రిక (16-1-2017)
పద్మనాభ వృత్తం:
          రామా! నతాంహోవిరామా! మునీంద్రాత్మ రామా! దయాసత్యధామా! నిశాట
        స్తోమావళీభీమసంగ్రామసీమా? వి ధూమత్రిధామాభ తేజస్సుధామా!
        రామాంబుముగ్ధామ! నీలోత్పలశ్యామ రాకేందుకామాభ సౌందర్యధామా!
        సోమాదిముఖ్యామరారాధ్యనామా! వి శుద్ధాత్మ భక్తావనోద్దామకామా!-116

ఛందస్సు:      పద్మనాభ వృత్తానికి ఏడు "త" గణాలు, "గగము". మదమూడింట యతి. వాసుదాస కవి బాల్యమిత్రుడు క్రొత్తపల్లె పద్మనాభ శాస్త్రుల పేర ఆయన జీవితకాలంలోనే రాయబడింది.        

అంబురుహ వృత్తము:        
క్ష్మారమణీశరజాబ్జ భవానన సారసాహిత పద్యసం
        వారసుశంసి నిజార్థి మహాద్భుత బాఢధైర్య పరాక్రమా!
        భూరిపయోనిధితారణ కారణ భూత నిర్జరయానన
        చ్చారుతరాత్మ సమాఖ్యః నిజాశ్రిత సర్వసౌఖ్య విధాయకా!-117

తాత్పర్యం:     "క్ష్మారమణీ" అంటే భూమి అనీ (=1), "శరజా" అంటే కుమారస్వామి (ఆయనకు ఆరు ముఖాలు) అనీ (=6), "అబ్జ భవ" అంటే నాలుగు ముఖాలున్న బ్రహ్మ దేవుడనీ (=4), "సారసాహిత" అంటే చంద్రుడనీ (=1) కవి అభిప్రాయం. ఈ సంఖ్యను విలోమంగా చదివితే  1461 వస్తుంది. సుందరకాండలో 1461 పద్యాలున్నాయని అర్థం స్ఫురించేలా కవి దీనిని రాశారు.

ఛందస్సు:      అంబురుహ వృత్తానికి నాలుగు "భ" గణాలు, ", , లగములు", పదమూడో ఇంట యతి స్థానం వుంటాయి.
యుద్ధ కాండ

తనతో సీత వృత్తాంతమంతా వివరించిన హనుమంతుడిని శ్రీరాముడు ప్రశంసిస్తాడు. దిగులుగా వున్న శ్రీరాముడికి ఉత్సాహం కలిగించే మాటలు చెప్తాడు సుగ్రీవుడు. రావణాది రాక్షసుల బలాబలాల గురించి, లంకలోని పలు దుర్గాల గురించి శ్రీరాముడు హనుమంతుడిని మరికొన్ని వివరాలడిగి తెలుసుసుకుంటాడు. కపిసేనతో లంకపై దండయాత్రకు వెళ్తాడు శ్రీరాముడు. కపిసేన సముద్రతీరం చేరిన  విషయం తెలుసుకున్న రావణుడు, మంత్రులతో సమాలోచన చేస్తాడు. రాక్షసులంతా రావణుడి పరాక్రమాన్ని పొగుడుతారు. తమ పరాక్రమం గురించీ గొప్పలు చెప్పుకుంటారు. ఆ సందర్భంలో విభీషణుడు రావణుడికి రాజనీతిని గురించి తెలియచేస్తాడు. రావణుడికి విభీషణుడి మాటలు రుచించలేదు. రావణుడి కోపం పెరిగిపోతుంది. అయినా తాను చెప్పదల్చుకుంది చెప్పే సందర్భంలో "పంచచామరము" వృత్తంలో ఒక పద్యం రాశారు కవి.

పంచచామరము:
                   త్యజింపవయ్య కోపమున్ సు ధర్మ సౌఖ్య నాశమున్
                భజింపవయ్య సౌఖ్యకీర్తి వర్ధనంబు ధర్మమున్
                భుజింపవచ్చు భోగముల్ స పుత్రమిత్ర రాక్షస
                వ్రజంబు లెల్ల, సీత నిమ్ము రామభూమిభర్తకున్ - 118

తాత్పర్యం:     ధర్మాన్ని, సుఖాన్ని నాశనం చేసే కోపాన్ని వదిలిపెట్టు. సౌఖ్యాన్ని, కీర్తిని వృద్ధిచేసే ధర్మాన్ని సేవించు. అలా చేస్తే కొడుకులతో, మిత్రులతో రాక్షసులందరు యధాప్రకారం భోగభాగ్యాలను      అనుభవించవచ్చు. కాబట్టి రామచంద్రుడికి సీతనివ్వు.

ఛందస్సు:      పంచచామరానికి "జర, జర, జగ" గణాలు. తొమ్మిదింట యతి.

తన మాటలను-హితోక్తులను ఎప్పుడైతే రావణాసురుడు లెక్కచేయడో, అప్పుడే విభీషణుడు, రావణ సభను విడిచి ఆకాశానికి ఎగిరి, మరో మారు తాను చెప్పదల్చుకుంది చెప్పి, నలుగురు మంత్రులతో కలిసి శ్రీరాముడున్న చోటికి పోతాడు. సుగ్రీవుడు, అంగదాదులు, హనుమంతుడు అభిప్రాయాలను విన్న శ్రీరాముడు, కపులతో విభీషణుడిని తమతో చేర్చుకొనడం ఉచితమే అంటాడు. విభీషణుడికి ఆయన అభయమిస్తాడు. ఆ తరువాత శ్రీరాముడికి రాక్షస బలం ఎంతో సవివరంగా చెప్తాడు. అంతా విన్న శ్రీరాముడు, రావణాసురుడిని కొడుకులతో, మిత్రులతో, సేనలతో చంపిన తరువాతే అయోధ్యలో ప్రవేశిస్తానని ప్రమాణం చేసి చెప్పాడు. ఆ సందర్భంలో విభీషణుడి స్పందనను "తరలము" వృత్తంలో వివరించారు కవి.


తరలము:
          అనుడు భక్తి విభీషణుండును నంజలిన్ ఘటియించి యో
        యనఘశీల! మదీయ దేహము నందుఁ బ్రాణము లుండునం
        దనుకఁ జొచ్చెద శత్రుసేన ని తాంతసాహ్య మొనర్తు లం
        కను వినాశ మొనర్ప రాక్షస కాండముం బరిమార్పఁ గన్-119

తాత్పర్యం:     ఈ ప్రకారం రామచంద్రమూర్తి చెప్పగా, విభీషణుడు రెండు చేతులు జోడిమ్చి, పుణ్యచరితా! నా దేహమునందు ప్రాణములుండువరకు శత్రుసేనలో దూరి, లంకను-రాక్షసులను చంపడానికి, చాలా సహాయం చేస్తాను.

ఛందస్సు:     
తరలముకు ", , , , గజం" లు గణాలు. పన్నెండో అక్షరం యతి. తరలము లోని మొదటి రెండు లఘువులను గురువుగా మారుస్తే మత్తకోకిలము అవుతుంది. అలానే మత్తకోకిలము   లోని గురువును లఘువులుగా మారుస్తే తరలము అవుతుంది.

రామ రావణ యుద్ధం జరిగే ముందర రావణాసురుడు, శుకుడు అనే వాడిని, తనతో స్నేహం చేయమని కోరుతూ సుగ్రీవుడి వద్దకు రాయబారానికి పంపాడు. రావణుడు చెప్పమన్న మాటలను యధాతథంగా శ్రీరాముడికి శుకుడు వివరిస్తున్నప్పుడు, కోపంతో వానరులు అతడిని చంపబోయారు. వారిని వారించిన శ్రీరాముడు, ఆ పని చేయవద్దని, అతడిని విడిచిపెట్టమని అంటాడు. శుకుడి విలాపాన్ని విన్నప్పుడు, శ్రీరాముడు అతడిని రక్షించినప్పుడు, కపుల సంతోషానికి అనుగుణంగా "ఉత్సాహము" వృత్తంలో ఒక పద్యం రాశారు కవి.

ఉత్సాహము:
                   ఆ విలాప మాలకించి యంబుజాక్షుఁ డాతనిన్
                గావుఁ డతఁ డు దూతగాన ఘాత మర్హ మౌనె? నా
                నా వనాటు లతనిఁ జంప రైరి; యంత భూమిక
                న్యావిభుండు జలధి వేల యందు దర్భ శయనుఁ డై-120

తాత్పర్యం:    శుకుడి ఏడుపు విన్న రామచంద్రమూర్తి, అతడు దూత కావున చంపకూడదని, రక్షించమని చెప్పడంతో వానరులు చంపకుండా చెరసాలలో వేశారు. ఆ తరువాత శ్రీరాముడు సముద్రపు ఒడ్డులో దర్భాశయనంపై పడుకుంటాడు.

ఛందస్సు:      ఉత్సాహం వృత్తానికి ఏడు సూర్య గణాలు, ఒక గురువు, ఐదవ గణం మొదటి అక్షరం యతి.

దర్భాశయనంపై పడుకున్న శ్రీరాముడి కుడి భుజాన్ని వర్ణించుతూ కవి "తరలము", "మత్తకోకిలము" వృత్తాలలో రెండు పద్యాలను రాశారీవిధంగా.

తరలము:      కలన శాత్రవశోకదంబు యు గ్రప్రతీపము దీర్ఘమున్
                సలిలితాప్తముదాకరంబును సాగరాంత సమాశ్రయం
                బలఘసవ్యశరప్రయోగస మర్ధమున్ దృఢశింజినీ
                కలిత మౌటను జర్మ మూడుటఁ గాయ కాచిన దానినిన్-121

మత్తకోకిలము:         వేలువేలుగ నాలమందల విశ్రుతంబుగ దానముం
                బోలఁ జేసినదానిఁ బన్నగ భోగసన్నిభమై మహా
                భీల మౌ పరిఖాతనం బనఁ బేర్మిమించినదాని, నా

                వేల దక్షిణబాహుపుర బర వేరకాలుఁ డు దిండుగన్-122

No comments:

Post a Comment